సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, అక్టోబర్ 2012, బుధవారం

రచయితలూ Vs పాఠకాభిమానులూ!


మర్షియల్ రచనలకూ, నాన్ కమర్షియల్ రచనలకూ తేడా- పాఠకుల అభిమానం నిలిచే  తీరులో తెలిసిపోతుంది. తొలి దశలో కమర్షియల్ రచనలను అభిమానించే పాఠకులు తమ ‘స్థాయి’ పెరగగానే వాటిని  పట్టించుకోవటం  మానేస్తుంటారు.   .

కానీ  నాన్ కమర్షియల్ రచనలపై పాఠకులకు ఉండే అభిమానం ఎప్పటికీ తగ్గిపోదు!

రంగనాయకమ్మ గారి రచనలను ఇష్టంగా చదివే పాఠకులకు   ‘శ్రామిక కోణం’  పుస్తకం ఓ రకంగా   ప్రత్యేకమైనది.  (ఈ మధ్యనే ఇది మార్కెట్లోకి వచ్చింది.  ఈ పుస్తకం లింకు-    http://kinige.com/kbook.php?id=1306&name=Sramika+Konam ).
 
 కారణం ‘నవ్య’ వారపత్రికలో ‘నేనూ- నా పాఠకులూ’ అనే పేరుతో వచ్చిన సీరియల్ ని  చేర్చింది  ఈ  పుస్తకంలోనే!

అయితే  శీర్షికను  ‘కొందరు పాఠకులతో,  నా పరిచయాలు’ గా మార్చారు. (‘అభిమానులు ’ అనే మాటను రంగనాయకమ్మ గారు ఉపయోగించరు.  ‘పాఠకులు’ అంటారంతే!)

పాఠకులకూ,  రచయితలకూ  మధ్య  తరచూ  ఉత్తర ప్రత్యుత్తరాలు  జరుగుతూనే ఉంటాయి.  రచయితల మీద అభిమానం చూపే పాఠకుల్లో రకరకాల స్థాయులవాళ్ళుంటారు.  అభిమానాన్ని సాధారణ స్థాయిలో ఉంచుకునేవారు కొందరైతే ... దాన్ని ప్రగాఢంగా పెంచుకునేవారు  కొందరు!

 ఏదైనా సందర్భంలో అభిమాని ప్రవర్తన గడుసుగానో, అపసవ్యంగానే ఉందనే అభిప్రాయం రచయితకు ఏర్పడవచ్చు.  ‘నేనింత అభిమానిస్తున్నాను కదా.. నా పట్ల కూడా  ఇంత నిర్మొహమాటంగా ఉండాలా?’అని అభిమాని అనుకోవచ్చు.  ఇలా  వారి సంబంధాల్లో ఎక్కడైనా అపశ్రుతి మొదలై,  అంతరం ఏర్పడి, అది పెద్దదయే అవకాశముంది.  

అభిమానించే  పాఠకులతో తన  సంబంధ బాంధవ్యాల  తీరును సవిమర్శకంగా ఒక తెలుగు రచయిత  అక్షరరూపంలో పెట్టటం ఇదే మొదటిసారి అనుకుంటాను. దీనిలో రకరకాల పాఠకులతో తనకెదురైన వింత,  ఆహ్లాదకర  అనుభవాలను రంగనాయకమ్మ గారు వివరిస్తారు. 

తనను ఇష్టపడే  పాఠకులైనా సరే, తనతో  సవ్యంగా ప్రవర్తించలేదని భావిస్తే...  వారిని  దూరం పెట్టటానికి సంశయించననీ, వారికి ఎలాంటి మినహాయింపులూ ఉండవనీ  ఆచరణ పూర్వకంగా  రుజువు చేస్తారు  రంగనాయకమ్మగారు. 

ముఖ్యంగా   ఓ పాఠకురాలి ఉదంతం  చెప్పుకోవాలి. 
ఆమెతో  రచయిత్రికి   కొన్ని సంఘటనల ఫలితంగా గ్యాప్ ఏర్పడుతుంది.  తనను క్షమించి,  పూర్వంలాగే ఫోన్లూ, లేఖలూ కొనసాగించాలంటూ  తన అభిమాన రచయిత్రితో ఆమె హొరాహోరీగా ఈ-మెయిల్స్ తో సంఘర్షించిన ఘట్టం అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.  చివరకు మారుపేరుతో  రంగనాయకమ్మ గారితో  లేఖా  సంబంధం పునరుద్ధరించుకోవడానికి కూడా ఆ పాఠకురాలు  ప్రయత్నిస్తారు.

(ఇదంతా తన ధారావాహికలో  రచయిత్రి  వివరంగా రాశారు)

అభిమానం అనేది డిమాండ్ చేయకుండా దానికదే  సహజసిద్ధంగా  ఏర్పడాలి  కానీ;   పోట్లాడీ,  బెదిరించీ ఎవరమూ దాన్ని తిరిగి  సాధించలేం  కదా?   ఈ సంగతి  ఆ  పాఠకురాలికి  అర్థం కాకపోవటం విచిత్రంగా  అనిపిస్తుంది. ఆ మొండి పట్టుదలకు విసుగూ, నివ్వెరపాటు కలుగుతూనే ఆమె పరిస్థితికి  జాలి కూడా వేస్తుంది.  ఇదంతా జరిగాక,  చివరిలో  ఆమె ( నిష్ఠూరాలతోనే )  ఆ విషయం  గ్రహించారనిపిస్తుంది.

‘అభిమానాలూ, గౌరవాలూ, స్నేహాలూ,  ప్రేమలూ,  ఆరాధనలూ- అంతంత మంచి మాటలుగా వినపడేవీ, కనపడేవీ , ప్రతీచోటా నటనలూ  కపటాలూ కాకపోయినా, చాలాచోట్ల అవి అంతంత నిజాలు కావు. వాటి నిండా ఆ మాటలు చెప్పే వాళ్ళకే అర్థం కాని మర్మాలూ, అజ్ఞానాలూ ఉంటాయి. కేవలం అజ్ఞానమే అయినది, నేరం కాదు. కానీ ఆ అజ్ఞానం , అనేక కపటత్వాలతో ఏకమైపోయి, దాన్ని వదిలించుకోవడం వాళ్ళకి కూడా సాధ్యం కానంత కలుషితమైపోయివుంటుంది’ 
అంటారు రంగనాయకమ్మ  ఈ వ్యాస పరంపరకు ముందు.

ఇవన్నీ ఆమె స్వానుభవాలు మరి!

భావాల్లో ఐక్యం, వ్యక్తిగత సంబంధాల్లో అంతరం/ఘర్షణ ఉన్న ఈ  పరిస్థితిని  చూస్తే-  స్థూలంగా ఇవన్నీ మిత్ర వైరుధ్యాలుగానే నాకు కనిపిస్తున్నాయి.
 
ఆమెను  చూడటానికి వచ్చి  ఆమె  తర్కానికి   కన్విన్స్ అయి...  ఆ క్షణంలోనే   తన  చేతికున్నదేవుడి  ఉంగరాన్ని తీసి బయటికి  గిరాటేసిన రైతు పాఠకుడు...

ఆమె  చెప్పారన్న  ఒక్క కారణంతో  క్షయరోగి  అయిన మరో పాఠకురాలిని  ఇంట్లో పెట్టుకుని ప్రేమగా  ఆదరించిన  శాంతకుమారి అనే పాఠకురాలు ....

వీళ్ళంతా మనకు ఈ రచనలో తారసపడతారు.

* *  *

పుస్తకం మొదట్లోనే  రెండు పెద్ద కథలున్నాయి.   ‘శోష! శోష!’ ,   ‘ఇంటర్నెట్ పెళ్ళిచూపులు’.

మొదటిది నవ్య  దీపావళి సంచికలోనూ,  రెండోది రచన మాసపత్రికలోనూ  వచ్చాయి.  కవి పుంగవుని  కీర్తి కాంక్ష ;   అత్యాధునిక పెళ్ళిచూపుల బండారం  వీటికి ఇతివృత్తాలు.   సహజంగానే  వీటిలో వ్యంగ్య హాస్యాల మేళవింపు  కనపడుతుంది.

* *  *

 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘జాహ్నవి’  మేధోమధన వ్యాసాలపై రంగనాయకమ్మ గారు విమర్శా వ్యాసాలు రాశారు.  వాటిని  పత్రికలో వచ్చినప్పటికంటే  ఎక్కువ వివరాలతో ఈ పుస్తకంలో  చదవొచ్చు. మార్క్సిజం మీద విమర్శలు కురిపించిన జాహ్నవి ప్రశ్నలకు సవివరంగా వీటిలో సమాధానాలిస్తూ ప్రతి విమర్శలు చేశారు.

తన వ్యాసాలపై సుదీర్ఘంగా వచ్చిన ఆ  విమర్శలకు స్పందించకుండా జాహ్నవి  ‘వ్యూహాత్మక మౌనం’ పాటించారు! .

వ్యాస పరంపరలో ఒక చోట-  కార్మిక జనాభా ఒక పూట సమ్మె చేస్తే సమస్త శ్రమలూ ఆగిపోయి  ఏమవుతుందో ఆమె చక్కగా వర్ణిస్తారు ఇలా-

‘యంత్రాలన్నీ   ఆగిపోతాయి. ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. రోడ్ల మీద, రైలు లైన్ల మీద, సముద్రాల మీద, మేఘాల మీద, నేల మీద, నింగి మీద, బస్సులూ- లారీలూ- రైళ్ళూ- ఓడలూ- విమానాలూః- రాకెట్లూ- సమస్త రవాణా సాధనాలూ, స్తంభించిపోతాయి.
 

అవి మళ్ళీ కదలాలంటే,
 

అది పారిశ్రామిక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  అది వర్తక పెట్టుబడిదారుల వల్ల జరగదు.  బ్యాంకు పెట్టుబడిదారుల వల్ల జరగదు. భూస్వాముల వల్ల జరగదు. 

గవర్నర్ల వల్లా, ప్రెసిడెంట్ల వల్లా జరగదు.  ఒబామాల వల్లా, మన్ మోహన్ల వల్లా జరగదు. రాముళ్ళ వల్లా, కృష్ణుళ్ళ వల్లా, జరగదు. యజ్ఞాల వల్లా, యాగాల వల్లా జరగదు.

మళ్ళీ శ్రామిక ప్రజలు కదలాలి. డ్రైవర్లూ, క్లీనర్లూ, టెక్నీషియన్లూ, ఇంజనీర్లూ, ఆ కార్మిక జనాభా అంతా మళ్ళీ పనుల్లోకి దిగాలి.
 

అప్పుడే మళ్లీ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి. యంత్రాలు నడుస్తాయి. బస్సులూ, రైళ్ళూ కదులుతాయి. ఉత్పత్తులు తయారవుతాయి. రవాణాలు సాగుతాయి.

మనుషులు బతకడానికి పనులు చేసేవాళ్ళ అవసరం ఏమిటో, యజమానుల అనవసరం ఏమిటో, ఉత్పత్తులకు కారణం ఏమిటో, అప్పుడు తెలుస్తుంది.’



పుస్తకంలో దళిత సమస్య, తెలంగాణా, విప్లవ కార్యాచరణల మీద కూడా  చర్చా వ్యాసాలున్నాయి. పత్రికలకు వివిధ సామాజిక అంశాల మీద రాసిన ఉత్తరాలున్నాయి.

చలం సమాధి ని రక్షించాలనే చర్చ జరిగినపుడు  రాసిన వ్యాసంలోని భాగం -  

 ‘సమాధులు వ్యక్తిపూజకు పరాకాష్ఠలు. అది మార్క్స్ సమాధి అయినా,  మార్క్సుని గుర్తించవలసింది, మార్క్స్ రచనల ద్వారానే గానీ, సమాధి ద్వారా కాదు.
 ....
 

జనాలు ఎగబడి చూసే తాజ్ మహల్ వంటి సమాధిని తీసిపారేసిన చలాన్ని, సమాధి కట్టి గౌరవిస్తారా?
....
 

రచయితను గౌరవించడం అంటే , ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆయనకి మూర్ఖత్వంగా కనపడే పనితో ఆయన్ని గౌరవించాలని చూస్తే, అది ఆయనకు అవమానమా, సన్మానమా? ఆ మనిషి లేచి రావడమే సాధ్యమైతే , ఆ సమాధిని కూలగొట్టడూ?’   

ఆ చివరి వాక్యం ఎంత పదునుగా,  శక్తిమంతంగా ఉందో గమనించారా?