సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, డిసెంబర్ 2010, ఆదివారం

నాస్తిక భర్త ... మరికొన్ని కథలు!‘‘ఈ నాస్తికులు మంచివాళ్ళు. వాళ్ళు మనల్ని మారమనరు. వాళ్ళే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా ఉంటారు.’’

సునంద అనే పాత్ర తన తన ‘నాస్తిక భర్త’ గురించి స్నేహితురాలికి చెప్పే మాటలివి.  ఈ కథలో సునంద నోము నోచుకుంటూ  పూజ మంత్రాలను తప్పుతప్పుగా చదువుతుంటే   భర్త మోహన్ వాటిని వినలేక,  ఆమె అభ్యర్థనకు కరిగిపోయి మంత్రాలన్నీ  తనే చదివి, పూజ చక్కగా జరిగేలా  సహకరిస్తాడు.

నాస్తిక భర్తలకు సంస్కృతం కూడా కాస్త తెలిసుంటే,  లేకపోతే తెలుగు లిపిలో ఉన్నశ్లోకాలను కచ్చితంగా  చదవటం తెలిసుంటే...  ఇలాగే జరుగుతుంది! 

నా విషయమే చూడండి...  ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మా ఇంట్లో  ‘వ్రతకల్పం’ శ్లోక పఠనంలో అక్కడక్కడా దోషాలు చెవులబడినప్పుడు అవి కర్ణ కఠోరంగా తోస్తుంటాయి.  పక్క గదిలో పుస్తకమో, పేపరో చదువుకుంటూ,  శ్లోకాలకు వచ్చిన పాట్లను గమనించి నవ్వుకొని,  వదిలేస్తుంటాను. కానీ ‘కాస్త ఈ శ్లోకాలు మా కోసం చదువ్’  అనే అభ్యర్థన వచ్చివుంటే నేనేం చేసుండేవాణ్ణి?  బహుశా మోహన్ లాగే చదివిపెట్టేవాణ్ణే అనిపిస్తోంది. :)  

నాస్తిక  భర్తలందరూ ఒకేలా మూసపోసినట్టుండరు.  నిజమే! కానీ  మెజారిటీకి వర్తించేదైనా, మైనారిటీకి వర్తించేదైనా -  ఒక వాస్తవికత  కథలో ప్రతిఫలిస్తే మంచి కథ  అనిపిస్తుంది. ఈ ‘నాస్తిక భర్త’ కథ అలాంటిదే !  (మన తెలుగు భక్తి సినిమాల్లో అయితే నాస్తిక భర్తలు  చెడ్డవాళ్ళే.  ‘చివరికి’  భక్తులుగా  మారి మంచివాళ్ళైపోతారు. :))   

ఈ కథా రచయిత  జె.యు.బి.వి. ప్రసాద్.  ఈ కథతో కలిపి ఆయన రాసిన  20 కథలు ఈ మధ్యనే ‘ఆ కుటుంబంతో ఒక రోజు’  పుస్తకంగా వచ్చాయి.  వీటిలో కొన్ని కథలనైనా కౌముది, ఈ మాట లాంటి  వెబ్ పత్రికల్లో  ఆన్ లైన్  పాఠకులు చదివేవుంటారు.

ఈ సంకలనం గురించిన క్లుప్త సమీక్షను  ఇవాళ్టి  ‘ఈనాడు’ సండే మ్యాగజీన్లో  చూడండి.


‘ఆ కుటుంబంతో ఒక రోజు’  ఈ- బుక్ గా  కినిగెలో లభిస్తోంది. లింకు ఇక్కడ- 
http://kinige.com/kbook.php?id=126&name=aa+kutumbamto+oka+roju

రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళొస్తే..?
ఈ పుస్తకంలో కొన్ని కథలు చదువుతుంటే  వాటిని ‘రంగనాయకమ్మ గారు రాశారా?’ అనే సందేహం వచ్చేస్తుంది.  భావాల్లో సారూప్యతతో పాటు  అదే పదజాలం... అవే వ్యక్తీకరణలు...!  రంగనాయకమ్మ గారు అమెరికా వెళ్ళి అక్కడి కుటుంబ వ్యవస్థను స్వయంగా గమనించి ఓ కథ రాస్తే? అది ‘ఆ కుటుంబంతో ఒక రోజు’ కథలాగా ఉంటుందేమో!

ఈ సంకలనంలో కొన్ని కథలు నాకు బాగా నచ్చాయి.  సాదాసీదాగా అనిపించినవీ  లేకపోలేదు.  మూఢ నమ్మకాలనూ,  కృత్రిమ విలువలనూ, అర్థం లేని ఆడంబరాలనూ, ఆచారాలనూ,  హిపోక్రసీనీ  విమర్శించే ధోరణి  కథల్లో కనిపిస్తుంది. ఇంటిపనులూ, వంట పనులూ ఆడవాళ్ళ డ్యూటీ అనుకోకుండా  ఆ పనులు ఇష్టపడి  చేసే  మగవాళ్ళు  కొన్ని కథల్లో తారసపడి, అబ్బురంగా అనిపిస్తుంది.  చిన్నచిన్న మాటలతోనే కథనం సాగే ఈ కథల్లో పదాడంబరం ఎక్కడా కనపడదు.

 ‘‘నీతో చెప్పాలంటే అందరికీ భయమే. ప్రతిదానికీ భయమే. .... అస్తమానూ అమ్మ, ‘ఇంటి యజమానీ’, ‘ఇంటి మగాడూ’ అంటుందేమిటీ నిన్నూ? నువ్వు యజమానివా! మా నాన్నవే కదా? ....  నాన్నంటే భయం ఎందుకుండాలి నాన్నా?...’’ ‘భయం! భయం!’ అనే కథ ముగింపులో కొడుకు తండ్రిని నిలదీసే ఈ  rhetorical questions  ఆలోచింపజేస్తాయి;  కదిలిస్తాయి!

‘ప్రశ్న’ అనే కథలో మధు అనే పిల్లాడు తల్లిపై తండ్రి చేసే దౌర్జన్యం అడ్డుకోవటం కోసం బలం తెచ్చేసుకోవాలని తపనపడతాడు. తల్లి వాడి ప్రేమకు పొంగిపోతుంది.  ‘పెద్దయ్యాక నువ్వూ మగాడివైపోయి పెత్తనం చేస్తావు’ అంటుంది. వెంటనే  ఆ పిల్లాడు   - ‘‘పెద్దయ్యాక మగాడిలా అవకుండా ఉండాలంటే, ఏం చెయ్యాలమ్మా?’’ అనడిగి వాళ్ళమ్మనీ,  ఈ కథ చదివేవారినీ నివ్వెరపోయేలా చేస్తాడు.   

చక్కగా హార్డ్ బైండుతో 1/8 డెమ్మీ సైజులో  చాలా తక్కువ ధరకే  దొరుకుతోంది ఈ కథల పుస్తకం!