సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

21, డిసెంబర్ 2009, సోమవారం

విద్వేషాల గోలలో విజ్ఞతా స్వరం!


యప్రకాశ్ నారాయణ అంటే మీకు నచ్చకపోవచ్చు. ‘లోక్ సత్తా’ పార్టీ అంటే- మాస్ మసాలా సినిమాల వెల్లువలో ఎవరికీ పెద్దగా పట్టని ‘ఆర్ట్ ఫిల్మ్’  అనిపించొచ్చు. ఆ పార్టీ రాజ్యాంగ బద్ధంగా ప్రతిపాదించిన ‘జిల్లా ప్రభుత్వాల’ ఏర్పాటు మీకైనా, నాకైనా అసలు రుచించకే పోవచ్చు!


కానీ ప్రస్తుత సంక్షుభిత రాజకీయ, సామాజిక వాతావరణంలో, ఈ  నిరాశా తిమిరంలో  జయప్రకాశ్ నారాయణ (జేపీ) వైఖరి నాకు గోరంత దీపంలా తోస్తోంది.


ద్వేష భాషకు ప్రాంతం తేడా లేదు. విద్వేష భావనకు విచక్షణతో పనిలేదు.

అందుకే కదా,  ఇతర ప్రాంతాల వారిని వ్యతిరేకించటమే ‘సొంత’ ప్రాంతాభిమానంగా చెలామణీ అవుతోంది! అసహనం, క్రోధం... ఎవరికైనా ప్రమాదకరమని హితవు చెప్పేవారు అరుదైపోతున్నారుగా?

విధ్వంసమే సాహసంగా,
ఉన్మాదం వీరాభిమానంగా,
ద్వేష తీవ్రత... తీవ్ర భావోద్వేగంగా - చలామణీ అయిపోతోందిగా?


ఉత్సాహానికి ‘డౌన్ డౌన్’ నినాదాలు ప్రతీకలవుతున్నాయి. తగలబడుతున్న భవనాలు,

తగలబెడుతున్న దిష్టిబొమ్మలు, ధ్వంసమవుతున్న కార్యాలయాల దృశ్యాలు టీవీల తెరలంతా ఆక్రమించేస్తున్నాయి.

బంద్ లూ, రాస్తారోకోలూ , రైల్ లోకోల మూలంగా సామాన్య ప్రజలు నలిగిపోవటం అందరికీ అనుభవమే కదా? విద్యార్థుల చదువులు అటకెక్కటం చూస్తూనే ఉన్నాం.

ఆవేశాగ్నులు రగిల్చే ‘నాయకులకు’ కొదువ లేకుండా పోతోంది.


లాంటి గందరగోళంలో విజ్ఞతాయుతమైన గొంతు... సామరస్య స్వరం వినిపిస్తే అదెంత ఊరటగా ఉంటుంది?

జేపీ చేసింది అదే!

ఉద్రేకపూరిత వాతావరణం చల్లారాలని ఆకాంక్షిస్తూ ‘సామరస్య పరిష్కారం’ కోసం ప్రయత్నం చేసిన నాయకులు జేపీ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ( ఆయన ప్రయత్నం ఫలితమిస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. )


ఢిల్లీలో మూడు రోజులపాటు కేంద్రంలోని ముఖ్య నాయకులతో, రాజకీయ పార్టీల పెద్దలతో సంభాషణలు జరపటంలో ‘గొప్ప’ ఏమీ లేకపోవచ్చు. 

కానీ ‘ఒక పౌరుడిగా బాధ్యత తీసుకుని’ ఈ ప్రయత్నం చేసినందుకు జేపీని అభినందించవద్దా?

ఎంతసేపూ- ఈ వివాదంలో ప్రజల భావోద్వేగాల నుంచి రాజకీయ ప్రయోజనాలు సాధిద్దామనే సంకుచిత దృష్టి పెరగటమే తప్ప ... ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నాశనమవుతోందని ఆలోచించేవారే  అరుదైపోతున్నారు! 

..... ఇలాంటి  పరిస్థితుల్లో  జేపీ చర్య  ఆశా కిరణంలా  భాసిస్తోంది!


.........

ప్రస్తుత వివాదానికి సంబంధించి  జయప్రకాశ్ నారాయణ భావాలను ఇక్కడ ఇస్తున్నాను.  (ఆలోచించండి.. ఇవి  నచ్చినా, నచ్చకపోయినా సరే!).


*  తాజా సంక్షోభం రాజకీయ దివాళాకోరు తనానికి ప్రబల నిదర్శనం. ఇది తెలుగు ప్రజల భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం.


ప్రధాన పార్టీలు ముందొక మాట చెప్పటం... తర్వాత అవసరం తీరగానే ఆ మాట తప్పడం, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం... వీటి పర్యవసానమే రాష్ట్రంలోని నేటి సంక్షోభం!


పార్టీల హద్దులు చెరిగిపోయాయి. ప్రతి పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని నాయకులే చెబుతున్నారు. సిద్ధాంతాల ఊసే లేదు.

*  (మన నేతలు) తాత్కాలిక ప్రయోజనాల కోసం విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరగవు. రాష్ట్రం విడిపోతే కొంపలు మునిగిపోవు. తెలంగాణా ఇచ్చినా ఒక్కటే; సమైక్యాంధ్రగా ఉన్నా ఒక్కటే. రేపు తెలంగాణా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. అంతకంటే ఎక్కువగా దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ లోగా మూడు దశల్లో మధ్యంతర ఏర్పాట్లు చేపట్టాలి.

*  ప్రజలు ఉద్వేగాలకు లోనుకాకుండా తమ భావాలను శాంతియుతంగా, ప్రజాస్వామికంగా వ్యక్తం చేయాలి. అప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వీలవుతుంది!
                       
   
                                                          *                 *                * 


‘మోహన’ గారి ‘విశాల ప్రపంచం’ బ్లాగులో  జయప్రకాశ్ నారాయణ గారితో టీవీ 9 ఇంటర్ వ్యూ
భాగాలున్నాయి; ఇక్కడ   చూడండి!

15, డిసెంబర్ 2009, మంగళవారం

తెలంగాణాపై రంగనాయకమ్మ గారి భావాలు!


సున్నితమైన ప్రాంతీయ భావోద్వేగాలు తెలుగు నేలను ఊపేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో విచక్షణ, సంయమనం, చర్చ ఎంతో అవసరం.


రచయిత్రి రంగనాయకమ్మ గారు  ‘తెలంగాణది ప్రత్యేక పరిస్థితి!’ అంటూ ఓ వ్యాసం రాశారు. ఇవాళ (మంగళవారం) ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిందిది.

ఈ పత్రిక చూడని, చదివే అవకాశం లేని పాఠకుల కోసం దీన్ని ఈ బ్లాగులో ఇస్తున్నాను.


‘నిరాహార దీక్ష ఒక తెలంగాణా వీరుడు చేస్తే, ఒక ఆంధ్రా వీరుడు మాత్రం చేయలేడా?’ , ‘కుర్రాళ్ళలో ఆత్మహత్యల పిచ్చి చూసి అదంతా ఉద్యమ చైతన్యం అని ముచ్చట పడకండి!’ అంటూ సాగే ఆమె వాదన చూడండి.





‘తెలంగాణాకు హైదరాబాద్ ఇవ్వటం’ లాంటి కొన్ని విషయాలను ఆంధ్రా కోణంలో కూడా  చర్చించాల్సిందని ఈ వ్యాసం చదివిన కొందరు  చెప్పారని ... రంగనాయకమ్మ గారు అన్నారు.


 ‘నిజమే.  కానీ ఒకే వ్యాసంలో అన్ని విషయాలూ చర్చించటం సాధ్యం కాదు కదా!’ అన్నారామె.




దీంతోపాటు ఇటీవలే ఆంధ్రప్రభలో  రంగనాయకమ్మ గారు రాసిన చిన్న వ్యాసం కూడా ఇస్తున్నాను.




ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చదివి చూడండి ఓసారి !

30, నవంబర్ 2009, సోమవారం

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.

1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, భీష్ముడి అవక్ర పరాక్రమం, పాండవుల మహాప్రస్థానం; రాముడి అరణ్యవాసం, వాలి సుగ్రీవుల గాధ, వాలి వధ, హనుమంతుడి లంకా నగర సాహసాలు, వారధి నిర్మాణం, రామ రావణ యుద్ధం .. ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.

ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


‘చందమామ’ ఆరంభమైన 8 సంవత్సరాల తర్వాత, 1955 సెప్టెంబరు సంచికలోకి నడిచొచ్చాడు విక్రమార్కుడు! శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే విక్రమార్కుడి బొమ్మను మొదట ‘చిత్రా’ వేశారు. దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్. ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.

బేతాళ కథ చివరిపేజీలో శవంలోంచి మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)   చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  ఈ ఇద్దరు చిత్రకారులదీ   సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’ ;  శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’! (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)
 చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!


శంకర్ లాంటి గొప్ప చిత్రకారుడు గీసిన బొమ్మల్లోంచి ‘కొన్నిటిని’ ఎంచుకుని, టపాలో చూపించటం చాలా కష్టమైన పని. ఆయన ‘వైవిధ్య ప్రతిభను చూపించే బొమ్మల’ వరకే పరిమితమైనా సరే, ... అదీ ఐదారు   బొమ్మల్లో సాధ్యం కాదు.

మరేం చేయటం?

‘కొండను అద్దంలో చూపించటం’ కష్టమే. అలా చేసినా ఒక పక్కే కనపడుతుంది. మరి కనిపించని పార్శ్వం సంగతో?


అందుకే... శంకర్ గీసిన కొన్ని బొమ్మలను ‘మచ్చుకు’ ఇస్తూ సంతృప్తి పడాల్సివస్తోంది. (చందమామ పత్రిక సౌజన్యంతో).



హాభారతం లోని చిన్ననాటి శకుంతల బొమ్మ చూడండి. వృక్షాలూ, లతలూ, పూలూ స్వాగతించే అద్భుతమైన ఆ అరణ్యంలోకి వెళ్ళాలనిపించటం లేదూ? కణ్వముని తో పాటు మనకూ ఆ బాల శకుంతలపై ప్రేమ పుట్టుకొచ్చేలా శంకర్ వేశారు.




శ్వేతుడి గదాఘాతానికి భీష్ముడి రథం నుగ్గునుగ్గయ్యే సన్నివేశం ఎంత గగుర్పాటు కలిగిస్తుందో గమనించండి.


క్షి ఆకారంలోని ‘క్రౌంచ వ్యూహం’ చూడముచ్చటగా అనిపిస్తుంది. దీనిలో రథ, గజ, తురగ, పదాతి సైన్యం చూడండి!  ‘విహంగ వీక్షణం’ చేయించారు కదూ, శంకర్!


 పర్వతమ్మీది నుంచి హనుమంతుడు లంకా నగరాన్ని చూడటం...దూరంగా సముద్రం... అద్భుతంగా లేదూ?



క్కడ కనిపించే ... ‘రాతి తల’ను వేసింది శంకరే. ‘ప్రపంచపు వింతలు’ అనే సింగిల్ పేజీ ధారావాహిక చందమామలో 1960లలో వచ్చేది. 1969 మార్చి సంచికలోది ఈ బొమ్మ.


శంకర్ గారి జీవిత విశేషాలు చాలా వివరంగా ఇక్కడ లభిస్తాయి. చదవండి...!

6, నవంబర్ 2009, శుక్రవారం

రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం!


వైద్యశాస్త్రం పేరు చెప్పుకుంటూ ఒక డాక్టర్  పిచ్చి వైద్యం చేశాడు. అప్పుడు తప్పు- వైద్యశాస్త్రానిదా? డాక్టర్ దా? 

డాక్టర్ దే కదా తప్పు?

కానీ- ఆ వైద్యం వల్ల తన కుటుంబం పడ్డ యాతనలు చూసిన ఓ యువతి వైద్యశాస్త్రమ్మీదే విముఖురాలైంది.

ఇక్కడ... డాక్టర్ చైనా కమ్యూనిస్టు పార్టీ అయితే,  వైద్యశాస్త్రం కమ్యూనిస్టు సిద్ధాంతం!

ఆ యువతి పేరు యుంగ్ చాంగ్. ఆమె ఇంగ్లిష్ లో  ‘వైల్డ్ స్వాన్స్’ అనే పుస్తకం రాసింది, 1991లో! ఇది కాల్పనిక నవల కాదు.  ఆమె కుటుంబ చరిత్రా  ;  చైనా, కమ్యూనిస్టు పార్టీల చరిత్ర కూడా కలిసిపోయి ఇందులో కనిపిస్తుంది. ఇది మూడు తరాల కథ.

మావో నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, దాని పరిపాలనా మీదా తీవ్ర విమర్శలున్నాయి ఈ పుస్తకంలో.

ఈ పుస్తకాన్ని వెనిగళ్ళ కోమల గారు  ‘అడవి గాచిన వెన్నెల’ గా తెలుగులోకి అనువదించారు.

కమ్యూనిస్టు పార్టీ కోసం చేసిన కృషి అంతా వృథా  అయిపోయిందని చెప్పడానికి అనువాదానికి ఈ పేరు పెట్టినట్టు ఊహించవచ్చు. 

హైదరాబాద్ లోని ‘రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ  630 పేజీల పుస్తకానికి రంగనాయకమ్మ గారు ‘విమర్శనాత్మక పరిచయం’ అందించారు. ఇది 'ఆంధ్రప్రభ'  ఆదివారం సంచికలో ఏడాది పాటు ధారావాహికగా వచ్చింది. 


ఇప్పుడు అది ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ అనే పుస్తకంగా వచ్చింది. 


టైటిల్ చూసి, ‘ఇదేదో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ గోలలా  ఉంది, మనక్కాదేమో ఈ పుస్తకం’  అని కొందరు  పాఠకులైనా  అపోహ పడే  అవకాశముంది. 

 ప్రధానంగా కమ్యూనిజం గురించి ఆసక్తి ఉన్న పాఠకులను లక్ష్యంగా చేసుకుని ఈ పుస్తకం రాసినా ... ఆ  క్రమంలో ప్రస్తావనకు వచ్చే ఎన్నో అంశాలు  సాధారణ పాఠకులు  కూడా  ఆలోచించాల్సినవిగా కనిపిస్తాయి.  

   
రంగనాయకమ్మ గారు ‘అడవి గాచిన వెన్నెల’పై విమర్శ మాత్రమే రాసివుంటే  సందర్భాలేమిటో అర్థం కాక గందరగోళం అయివుండేది. ఆ సందర్భాలను తెలపటం కోసం అనువాద రచనను చాలాసార్లు కోట్ చేయాల్సివచ్చేది.  దీనికంటే ఇలా ‘విమర్శనాత్మక పరిచయం’ చేయటమే బావుంది. 

 పైగా ఇలా చేయటం వల్ల- ఈ పుస్తకం  చదవకముందే ‘అడవి గాచిన వెన్నెల’ను  చదవాల్సిన అవసరం కనిపించదు. తర్వాత కూడా చదవొచ్చు.  ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్నీ, ఇంకా ఇంగ్లిష్ మూలం  ‘వైల్డ్ స్వాన్స్’ నూ కూడా చదవటం మంచిదే!  
 
‘‘దీన్ని తెలుగు పాఠకులకు అందించిన వారిని అభినందించాలి. అనువాదం చాలా సరళంగా, చాలా సృజనాత్మకంగా సాగింది. ఎక్కడ ఏ తెలుగు మాటలు పడాలో అవే పడ్డాయి’’ అంటూ  ‘అడవి గాచిన వెన్నెల’ అనువాదం గురించి రంగనాయకమ్మ గారు ప్రశంసిస్తారు.




‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ కాలక్షేపం పుస్తకం కాదని తెలిసిపోతూనే ఉంది కదా?  రంగనాయకమ్మ గారు రాశారు కాబట్టి తేలిగ్గానే  అర్థమవుతోందనుకోండీ.  కానీ చైనా పేర్లు... యుఫాంగ్, డేహాంగ్, వాంగ్, యుంగ్ చాంగ్... ఇవన్నీ అలవాటయ్యేదాకా  మొదట్లో  కాస్త ఇబ్బంది!

ప్రజలకు సుఖ శాంతులు కావాలంటే కమ్యూనిజం పనికి రాదనీ, అది దుర్మార్గమైనదనీ యుంగ్ చాంగ్ తన పుస్తకంలో తేల్చిచెపుతుంది. అంతే కాదు; పెట్టుబడిదారీ విధానమే సరైనదనీ, అదెంతో గొప్పదనీ కూడా చెప్పేస్తుంది.

ఆమె ఈ అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి  బలమైన కారణాలే కనిపిస్తాయి.

ఆమె తల్లిదండ్రులు నిజాయితీగా, కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారు. కానీ ఆ పార్టీ...  వారిని అవమానాల, కష్టాలపాలు చేస్తుంది. ఇలా నిరపరాధులు  చాలామంది బాధలు పడటం యుంగ్ చాంగ్ చూస్తుంది. దీంతో ఆమె చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, ఆ సిద్ధాంతం మీదా  విముఖత  పెంచుకుంటుంది.

‘‘కమ్యూనిస్టు పార్టీ చేసిన తప్పులకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కారణంగా చేయటమే పొరపాటు’’  అని రంగనాయకమ్మ గారు అభ్యంతరం చెపుతారు. ‘‘మంచి సిద్ధాంతం పేరు చెప్పుకునే వాళ్ళ ఆచరణ చెడ్డగా ఉంటే, అది ఆ సిద్ధాంతం తప్పు అవదు’’ అంటారు.

‘‘పెట్టుబడిదారీ విధానం పట్ల సమర్థనా, కమ్యూనిజం పట్ల వ్యతిరేకతా కూడా ఒక పోరాటమే. పోరాటం అంటే, కత్తులూ, తుపాకులూ పట్టుకోనక్కరలేదు. భావాల్లోనే, ఆలోచనల్లోనే, పోరాటం ఉంటుంది, ఇటు వేపు గానీ, అటు వేపు గానీ’’  అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తారు!



రంగనాయకమ్మ గారి విమర్శలూ, వ్యాఖ్యానాలూ, వివరణలూ ఈ విమర్శనాత్మక పరిచయాన్ని ఆసక్తి కరంగా మార్చాయి.  ఇక, ఆమె మార్కు రిమార్కులూ,  వ్యంగ్య హాస్య చమక్కులూ సీరియస్ సందర్భాల్లోనూ నవ్వులు పూయిస్తాయి! 

ఈ  పుస్తకంలో ఒక సందర్భం చూడండి.

‘‘.... పెళ్ళి ఆగిపోయిన రెండు వారాల తర్వాత, డేహాంగ్ తన ఉమెన్స్ ఫెడరేషన్ మీటింగ్ లో వుండగా, ... పార్టీ ఛీఫ్ నుంచి ఒక నోట్ అందింది- వెంటనే మీటింగ్ నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోమని! డేహాంగ్ ఆ నోట్ ని మీటింగ్ లో బాస్ కి అందించింది.

బాస్ కూడా ఆ నోట్ చదివి, ‘సరే వెళ్ళు’ అంది. డేహాంగ్, మీటింగ్ యూనిఫారమ్ లోనే పెళ్ళి కోసం వాంగ్ క్వార్టర్ వేపు పరుగు తీసింది. (అవును, తెలివైన పనే. ఆలస్యం చేస్తే  ‘పెళ్ళి ఆపండి’ అని ఇంకో నోట్ వచ్చినా రావచ్చు కదా? చెప్పలేం.) ’’

బ్రాకెట్లోని ఆ విసురు గమనించారు కదా!

ఈ సందర్భంలో దూసుకొచ్చిన  పదునైన వ్యాఖ్య ....

  ‘‘కమ్యూనిస్టు పార్టీని,  ‘ప్రేమించడానికి అనుమతి’ అడగడం ఏమిటి? దానికి అప్లికేషన్ పెట్టడమూ, అనుమతి దొరికితేనే ప్రేమించడమూనా? .... పురాణ కథల్లో అయినా పెద్దల్ని అనుమతి అడిగి ప్రేమించడం ఉంటుందా? ఫ్యూడల్ సమాజంలో అయినా ఇంత అజ్ఞానం ఉంటుందా? .... ప్రేమించడానికి పర్మిషన్లు అయ్యాక, అప్పుడు పెళ్ళికి మళ్ళీ కొత్త పర్మిషన్లు’’

 పార్టీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళ ప్రహసనం పై  రంగనాయకమ్మ గారు తన అనుభవం ఇలా పంచుకున్నారీ పుస్తకంలో!

‘'....పెళ్ళికి ముందు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, పెళ్ళికి పిలవడానికి కాదు; వేరే పని మీద. ‘నీ పెళ్ళి అట కదా? ఎప్పుడు?’ అని అడిగాను. ‘ఏమో, నాకింకా తెలీదండీ. మీటింగ్ ఎప్పుడు పెట్టారో ! రెండ్రోజులో మూడ్రోజులో ఉందనుకుంటా’’.... అంది. ‘పెళ్ళి కొడుకు ఎవరో అయినా తెలుసా?’ అని నేను అడగలేదు. అప్పటికే స్పృహ తప్పివున్నాను నేను.

తన పెళ్ళెప్పుడో తెలుసుకోవాలని ఆ అమ్మాయికి ఉత్సాహం లేదు, ఆతృత లేదు. ... ఇలాంటి పార్టీ కార్యకర్త, ‘నూతన సమాజం’ అనీ, ‘నూతన సంస్కృతి’ అనీ ఉపన్యాసాలిస్తూ ఉంటుంది.... అన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీల నూతనత్వాలూ ఒక్కలాగే ఉన్నట్టున్నాయి’’

అదండీ సంగతి!

 ‘‘చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, మావో మీదా,  తీవ్రమైన విమర్శలతో సాగిన ఈ పుస్తకాన్ని మన కమ్యూనిస్టులందరూ చదివి, నిశితమైన చర్చలు చేసుకోవాలి’’ అంటారు రంగనాయకమ్మ గారు.

  ఇక సందర్భానుసారంగా-  యువతీ యువకుల ప్రేమ గురించీ; ఆటల పోటీలూ, వస్త్ర ధారణా, ప్రాచీన  సాహిత్యం, వ్యక్తి పూజల గురించీ ఆమె  వ్యక్తీకరించిన అభిప్రాయాలు  చదవాల్సిందే!    

‘‘మనుషులు కోరుకోవలిసింది  తన స్వంత ఆనందం ఒక్కటే కాదు, స్వంత ఆనందం ఎప్పుడూ ఉండవలిసిందే. అది లేకపోతే జీవితం శూన్యం అయిపోతుంది. కానీ, దానితో పాటు, తను కూడా జీవించే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే ‘చిన్న ఆదర్శం’ కూడా ఉండాలి’’ అంటారు  ఈ పుస్తకంలో!

 ఈ  రచన చివర్లో  ఆమె రాసిన  మాటలు ‘కళాత్మక జీవితం’ గురించి  ఆలోచనలు రేపుతాయి.

''హత్యలు అవలీలగా చేసే కిరాతకుడు కూడా చేతిలో కత్తితో పోతూ, దారిలో మొక్కల మీద విప్పారి వున్న పూలు కంటబడ్డ క్షణాల్లో తనకు తెలియకుండానే ఆనందంతో స్పందిస్తాడు. ఆఖరికి జంతువులు కూడా పచ్చికలో సేద దీరి, చల్లగాలినీ, వెన్నెలనీ మోరలెత్తి అనుభవిస్తాయి.

మనుషులైనవాళ్ళు ప్రకృతిని ఆస్వాదించడంలో కొత్త జ్ఞానమూ లేదు, కొత్త సంస్కారమూ లేదు. మనుషులుగా పుట్టి పెరుగుతోన్నవాళ్ళు నేర్చుకోవాలసింది, మనుషుల గురించి. మనుషుల సంబంధాలలోనూ, మనుషుల జీవితాలలోనూ, రహస్యంగా దాగివున్న సత్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సిద్ధాంతం ఒకటి ఉంది. దానిముందు ప్రేమతో మోకరిల్లడం మనుషుల విధి!''

యుంగ్ చాంగ్ వేదనను సానుభూతితో  అర్థం చేసుకుంటూనే; ఆమె ఆలోచనల్లో, ఆచరణలో   లోపాలను  వెల్లడించటం  ఈ విమర్శనాత్మక పరిచయం  విశిష్టత.

''... మానవ జీవితానికి నిజమైన ఆనందం, ప్రేమానురాగాలతో నిండిన మానవ సంబంధాల సౌందర్యంలో దొరికేదే గానీ, ప్రకృతి పరిశీలనల్లో దొరికేది కాదు. ఈ రచయిత్రి (యుంగ్ చాంగ్) మేధావితనం, ఆమెకా విషయం బోధించలేదు’’
 
ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టు రాసేటప్పుడు....  ఆ వాక్యాలు  తన  హృదయంలోంచి సూటిగా వచ్చినట్టు  శక్తిమంతంగా రాస్తారు రంగనాయకమ్మ గారు!


 ‘‘ఆమె (రచయిత్రి యుంగ్ చాంగ్) కోరుకున్న బూర్జువా రుచుల ముందు తల్లిదండ్రుల ఆదర్శాలేవీ పనిచెయ్యలేదు... ఆమె, ఆ  అవగాహన ఏర్పరుచుకునివుంటే, దోపిడీ నీచత్వంలో ఆరితేరిన బూర్జువా విధానాన్ని కీర్తించే, మానవుల వల్ల మానవులకే ద్రోహం జరిగే క్రూర విధానాన్ని ఆలింగనం చేసుకునే పతనావస్థ  ఆమెకి తప్పేది.’’



 ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ రాయల్ సైజులో 250 పేజీలున్న పుస్తకం.  ధర 60 రూపాయిలు. విశాలాంధ్ర, నవోదయ లాంటి పెద్ద పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఇవి అందుబాటులో లేనివారు విజయవాడలోని ‘అరుణా పబ్లిషింగ్ హౌస్’ (ఫోన్ : 0866-2431181) ని సంప్రదించవచ్చు. 

కినిగెలో ఈ - బుక్ కావాల్సినవారు చూడాల్సిన లింకు- 
http://kinige.com/kbook.php?id=947&name=Communistu+Party+Ela+Vundakudadu

 ఈ టపాలో నేను రాసినవాటి కంటే రంగనాయకమ్మ గారి పుస్తకంలోని వాక్యాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయా?:) .....  నిజమే!

30, అక్టోబర్ 2009, శుక్రవారం

ఎమ్వీయల్... నూజివీడూ!


ముళ్ళపూడి వెంకటరమణతో ఎమ్వీయల్...  పక్కన బాపు

నూజివీడు అంటే- 'రసాల మామిడి పండ్లు' గుర్తొస్తాయి ఎవరికైనా!


ఆ ఊరి గురించి తెలిసినవారికి అక్కడి జమీందారీ భవనాల అవశేషాలూ, చారిత్రక గుర్రం గేటూ, కుక్కల గేటూ-

ఆ రెంటి మధ్యలో ఉండే ధర్మ అప్పారావు కాలేజీ, దగ్గర్లోనే పీజీ కాలేజీ...

ఇవన్నీ తలపుల్లో మెదులుతాయి.

సాహితీ అభిమానులకైతే నూజివీడు అనగానే ఎమ్వీయల్ గుర్తొచ్చేస్తారు. 

42 ఏళ్ళకే అస్తమించిన ప్రతిభాశాలి ఆయన!

బాపు వేసిన ‘ముత్యాల ముగ్గు’(1975) కు నిర్మాతా;
బాపు నడిపిన ‘తూర్పు వెళ్ళే రైలు’(1979) కు మేలిముత్యాల్లాంటి మాటలు రాసిందీ ఎమ్వీయల్లే.


‘‘ కన్నీటికి ఆనకట్ట కట్టు

 కరెంటు పుట్టుకొస్తుంది

  కష్టాల కొమ్మలు నరికవతల పెట్టు

   కొత్త చిగురు వేస్తుంది’’

 - ఇంతటి ఉత్తేజకరమైన కవిత రాసింది ఆయనే.

 
‘షా’ అనే ఈ కవిత-

‘‘చేతిలోని గీత తప్పు

 నుదుటి పైన రాత తప్పు’’
 అంటూ మూఢత్వాలను నిరసిస్తూ యువతను ఉద్బోధిస్తూ సాగుతుంది.



ఆంధ్రజ్యోతి వీక్లీలో (బహుశా 1978 ప్రాంతాల్లో) ‘యువ జ్యోతి’ శీర్షికను అద్భుతంగా నిర్వహించారు ఎమ్వీయల్ . ఇది సెంటర్ స్ప్రెడ్ లో నిలువుగా ఉండేది. పాఠకులు అడిగే సరదా ప్రశ్నలకు చమత్కారంగా, చురకలంటిస్తూ ఆయన చెప్పే సమాధానాలు చాలా ఆసక్తిగా ఉండేవి.


‘‘పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ‘ఈనాడు’ చదవమంటారా? ‘రేపు’చదవమంటారా?’’ (అప్పట్లో 'రేపు' మాసపత్రిక ఉండేది కదా!)..

ఇలాంటి కొంటె ప్రశ్నలెన్నిటికో ఆయన అంతే దీటుగా ‘సటిల్’ జవాబులు చెప్పేవారు.


‘ఎమ్వీయల్’ అంటూ పేరు రాసుకోవటంలోనే విలక్షణత్వం ఉంది. ఆయన పూర్తి పేరేమిటో చాలామందికి అంతుబట్టేది కాదు.


యువజ్యోతి శీర్షికలో ఒక రీడర్ ‘‘మీ పూర్తి పేరు ముళ్ళపూడి వెంకట రమణా?’’ అని అడిగారు.

దానికాయన చెప్పిన సమాధానం- ‘‘ఔను. చిన్నప్పట్నుంచీ నాకు ‘ర’ పలికేది కాదు. ‘ముళ్ళపూడి వెంకట లమణ’ అని పలికేవాణ్ణి. అలా ఎమ్వీయల్ అనే పేరొచ్చింది’’.


ఈ సమాధానం చదివి కన్ ఫ్యూజ్ అయిన వాళ్ళలో నేనూ ఉన్నాను. ఇంతకీ ఆయన అసలు పేరేమిటా అని!

కొన్నేళ్ళ తర్వాత నూజివీడులోని ధర్మ అప్పారావు కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరినప్పుడు కానీ నాకు సమాధానం దొరకలేదు. ఆ కాలేజీ తెలుగు విభాగాధిపతి ఎమ్వీయల్ గారే!

కాలేజీ మ్యాగజీన్ లోనో, ప్రాస్పెక్టస్ లోనో ఆయన పూర్తి పేరు ఎం.వి.ఎల్.(మద్దాలి వెంకట లక్ష్మీ ) నరసింహారావు అని చూశాను. ఇంతకాలమూ ఎం.వి.ఎల్. అనే abbreviation లోనే పేరుంది అనుకుంటూ ఊహించటానికి ప్రయత్నించాను. తీరా ఎమ్వీయల్ అనేది ఆయన అసలు పేరుకు ముందొచ్చే మాటలేనని అర్థమైంది.

ఇంటర్లో మార్కుల కోసం ద్వితీయ భాషగా సంస్కృతమే తీసుకుంటారు కదా ఎక్కువమంది?
పైగా నేనప్పటికే ఓరియెంటల్ స్ట్రీమ్ లో సంస్కృతం మూడేళ్ళు చదివివున్నాను. కానీ నేను ఎమ్వీయల్ గారి పాఠాలు వినటం కోసమే తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకున్నాను!


ఎప్పుడో గానీ క్లాసు తీసుకునేవారు కాదు. మొహం సీరియస్ గానే కనిపించేది; దానిలోంచి హాస్య చతురత అల్లరిగా తొంగి చూసేది.

పాఠం చెపుతోంటే... ఆ మాటలు ప్రాసలుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవాహంలా దూసుకొచ్చేవి.

తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పేజీ కూడా తిరిగేది కాదు.

కానీ ఆయన ఉపన్యాస శాఖా చంక్రమణంలో బోలెడన్ని సాహిత్యపు విశేషాలూ, వ్యాఖ్యానాలూ, చమక్కులూ.

ఆయన వేపు కళ్ళప్పగించి చూస్తూ... ఆసక్తిగా వినేవాళ్ళం. అవర్ అయిందనే గుర్తుగా బెల్లు మోగితే నిరాశగా అనిపించేది.


నవలీకరణలో ఎమ్వీయల్ ముద్ర ‘అందాల రాముడు’(1973) వెండితెర నవల్లో కనిపిస్తుంది. ఆ నవల చదివిన తర్వాతే సినిమా చూశాను.

నవల్లో నచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమా చూసినప్పుడు  నిరాశ కలిగించాయంటే నవలీకరణ (ముళ్ళపూడి మార్కు సంభాషణలూ, స్క్రీన్ ప్లే కూడా ) ఎంతో బావున్నట్టే కదా?




ఆయన కవితలు ‘కవన కదనం’ పేరుతో 1984లో సంపుటంగా వచ్చాయి. దీన్ని ‘ముత్యాల ముగ్గు కాంట్రాక్టర్’ రావుగోపాలరావు గారికి అంకితమిచ్చారు. విజయవాడ నవోదయ వారు పంపిణీ చేశారు.


‘‘అబద్ధాన్ని కవి సమయాల ఒరల్లో దాచి

నిజాన్ని కవిత్వంతో చంపకు’’

అనే పంక్తులు ‘గంధర్వ గానం’ అనే కవితలోవి.


‘‘కష్టజీవి కండలలో, గుండెలలో ఖజానాలున్నాయి’’ అంటూ శ్రామిక పక్షపాతం చూపిస్తారు.


‘ఆనంద ముద్ర’ అనే కవిత చూడండి-


‘‘బాధలు

సూదులనుకుంటే

జీవితం పిన్ కుషన్


సంతృప్తిని అచ్చుకిస్తే

లోకమే

ప్రింటింగ్ మిషన్’’



‘సింహనాదం’ అనే కవిత ఉపసంహారమిది-

‘‘ఈ తరం తరంగంలా విరుచుకుపడుతుంది

కురంగంలా పరుగులు పెడుతుంది

మొండి రాళ్ళ మీద విరిగిపడినా

వేటగాళ్ళ గురి తగిలి పడినా- ’’



మినీ కవితలు రాసే యువతను ప్రోత్సహించటంలో ముందుండేవారు. ‘‘ కోడెకారు కవులు సూటిగా, ఘాటుగా ధ్వనిస్తున్న కవితలు కొన్ని వందల సభలలో వినిపించి శ్రోతలలో కనిపించిన స్పందనకు పులకించి, వారి ఆనందోద్రేకాలలో పాలు పంచుకున్నాను’’ అని స్వయంగా చెప్పారు.


‘కవన కదనం’ కాకుండా ఎమ్వీయల్ ఇతర రచనలు పుస్తకాలుగా వచ్చాయో లేదో తెలియదు.

‘నాకు నచ్చిన కథ’గా ఎన్.ఆర్.నంది ‘ద్వేషం’ కథను స్వాతి (?) మంత్లీలో పరిచయం చేశారు. ఈ కథను చదివి ‘ఎవరీ నందీశ్వరుడు?’ అని ఆయనపై ద్వేషం పెంచుకున్నానని చమత్కరిస్తారు.

చివరిదశలో ‘తాగుడు మూతలు’ అనే కాలమ్ (‘రచన’లో?) నిర్వహించారు.


యనది అకాల మరణం (1944-1986). మితి మీరిన మద్య సేవనం దీనికి కారణమంటారు. ఇలాంటి అలవాట్లు ఎందరు ప్రతిభావంతుల జీవితాలను అర్థాంతరంగా బలి తీసుకుంటున్నాయో కదా అనిపిస్తుంది!

 ఇంటర్నెట్ లో ఆయన  వేరే ఫొటోలు  గానీ, పూర్తి వివరాలు గానీ దొరకటం లేదు.

 ప్రతిభా సంపత్తి పూర్తిగా వెల్లడి కాకముందే అకస్మాత్తుగా అస్తమించిన రచయితా, కవీ, వక్తా, అధ్యాపకుడూ ఎమ్వీయల్!

19, అక్టోబర్ 2009, సోమవారం

'చందమామ'పై చెరగని సంతకం ‘చిత్రా’!


అందమైన 'చందమామ' బొమ్మ. దానికి మరో పేరు.... 'చిత్రా'!

కళ్ళకు కనికట్టు చేసే చిత్ర రేఖా విన్యాసం ఆయన విశిష్టత.

1947 జులై లో వెలువడిన ‘చందమామ’ మొదటి సంచికకు ముఖచిత్రం వేసిందీ, 1955 సెప్టెంబరులో వచ్చిన తొలి బేతాళ కథకు అపురూప చిత్రం సమకూర్చిందీ కూడా చిత్రానే. ఈ ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న విక్రమార్కుడి భంగిమను మార్చి, బేతాళుడి కాళ్ళకు బదులు తల కనపడేలా చేసి మరింత మెరుగుపరిచారు శంకర్.



మనందర్నీ ఇంతగా ఆకట్టుకున్న ఈ బొమ్మ వెనక ఈ ఇద్దరు చిత్రకారులున్నారంటే విశేషమే కదా!

చందమామ ఇంటింటి పత్రికగా పాఠకాదరణ పొందటంలో ప్రధాన పాత్ర జానపద ధారావాహికలది. వాటికి చిత్రా బొమ్మలు ప్రాణం పోశాయి.

అజరామరమైన కళా సృష్టి అది! మొదట్లో వెలువడిన సంచికల్లో దాదాపు ప్రతి కథకూ ఆయనే బొమ్మలు వేసేవారు. మూడు దశాబ్దాల్లో పదివేల చిత్రాలను సృజించారు. ఇంత విస్తృతంగా, అద్భుతంగా వైవిధ్యభరితమైన బొమ్మలను గీసిన చిత్రా ప్రతిభకు తగినంత ప్రాచుర్యం రాలేదు!

ఆయన ఏదైనా కథకు బొమ్మలు గీస్తే... అవి ఆ కథ స్థాయిని పెంచేసి, ఆ కథ నిజమని భ్రమ కలిగిస్తాయి. కథలో వాతావరణాన్ని ఒక్కోసారి రచయిత ఊహల కంటే మిన్నగా కళ్ళముందుకు తెచ్చేసే అపార ప్రజ్ఞ ఆయన సొంతం.

చిత్రా బొమ్మల్లో ఒకనాటి మధ్యతరగతి లోగిళ్ళూ, పేదల పూరి గుడిసెలూ ఏవో పాతకాలం నాటి జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. ప్రశాంతమైన ముని వాటికలూ, రాజ ప్రాసాదాల సంగతి చెప్పేదేముంది? రాజ భవనాల్లో దుస్తుల అలంకరణలూ, కుడ్యాలకు అలంకరించే అందమైన తెరలూ, స్తంభాల నగిషీలూ, నేలకూ, పై కప్పుకూ ముచ్చటైన డిజైన్లూ ... ఆ అతి సూక్ష్మ వివరాలన్నీ అలాగే ఆ బొమ్మలను చూస్తూ ఉండాలనిపించేస్తాయి.

ఒకనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ఆయన బొమ్మల్లో పున: సృష్టిస్తారు. అంతేనా? చీనా జానపదమైనా, గ్రీకు పురాణ గాధ అయినా, బెంగాలీ నందినుల కథలైనా ఆ గీతల్లో అలా ఒదిగిపోవాల్సిందే! ఆయన రేఖల కలయికతో నిర్జనమైన అడవులూ, కలవరపరిచే కడలీ, విశాలమైన మైదానాలూ దృశ్యబద్ధమవుతాయి. అశ్వ పద ఘట్టనా, మద గజ ఘీంకారం, చండ సింహ గర్జనా ఆ చిత్రాల్లోంచి వినిపిస్తాయి.


ఆ వర్ణ చిత్రాలు... కంచుకోటలై కనువిందు చేస్తాయి. జ్వాలా ద్వీపాల్లో, రాకాసి లోయల్లో విచిత్రాకార జీవులై ఆకాశయానంతో అలరిస్తాయి. పాతాళ దుర్గాలైనా, యక్ష పర్వతాలైనా ఆ కుంచె స్పర్శతో రమణీయమై శోభిస్తాయి. ఆ చిత్రాల స్మృతులు శిథిలాలయాలనూ, వాటి ప్రాకారాలనూ దాటేసి, విశాలమైన ప్రకృతిలోకీ, నిసర్గ సౌందర్యం నిండిన అరణ్యాల్లోకీ పరుగులు తీస్తాయి. చిత్ర విచిత్రాలు చేసే ఆ బొమ్మలు మాయా సరోవరాలై ఆహ్లాదపరిచి, తరతరాల చిత్ర కళాభిమానుల జ్ఞాపకాల్లో రాతిరథంలా చెక్కుచెదరకుండా నిలిచివుంటాయి!

రాజ కుమారుల ఆహార్యం అద్భుతంగా ఉండదూ? ముంజేతికి లోహ కంకణాలూ, మెరిసే కత్తి ఒరా, నుదురుపైనా, మెడ వేపూ ఒంపు తిరిగిన శిరోజాలూ, శరీరంపై వేలాడే అంగీ, పాదాలకు అంటిపెట్టుకుని వుండే ‘కుర్తా’, చివరి భాగం సన్నగా వెనక్కి ఒంపు తిరిగి ఉండే పాదరక్షలూ ...

‘అలాంటి డ్రెస్సులు ఇప్పుడు అందరూ ఎందుకు వేసుకోరు? అలా వేసుకుంటే ఎంతో బావుంటుంది కదా!‘ అనే ఊహలు బాల్యంలో ఎవరికైనా వచ్చేస్తాయి. ఆ బొమ్మల ఘనత అలాంటిది!

కదిలే నిశ్చల ‘చిత్రా’లు!

పేరుకు నిశ్చల చిత్రం... కానీ దానిలో అద్భుతమైన కదలిక చిత్రా బొమ్మల ప్రత్యేక లక్షణం. వీలున్న ప్రతి సందర్భంలోనూ పాత్రల కదలికలను చూపించటానికి ఇష్టపడతారని ఆయన బొమ్మలే సాక్ష్యం చెపుతాయి. పోరాట సన్నివేశాల్లో యుద్ధోత్సాహం చిత్రించేటప్పుడు ఆయన కుంచె కదం తొక్కుతుందనిపిస్తుంది!

వీచే గాలిని బొమ్మల్లో చూపించటం కష్టం. కానీ చిత్రా ముద్రతో అది సుసాధ్యమైపోయింది. కొండ మీదో, మైదానంలోనో పాత్రలు నిలబడివుంటే వారి ఉత్తరీయాలూ, దుస్తులూ గాలికి ఎగురుతున్నట్టు గీస్తారాయన.

ఫొటోగ్రఫీలో అభినివేశం ఉండటం వల్ల కాబోలు... విభిన్నమైన కోణంలో బొమ్మను చూపించటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఎంతో ఎత్తు నుంచి కింద దృశ్యాలను చూపించటమో, కింద నుంచి- ఎత్తయిన కోణంలోని దృశ్యాలను వివరాలకు భంగం రానీయకుండా చిత్రించటమో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది.


చందమామలో విశేష పాఠకాదరణ పొందిన తొలి జానపద ధారావాహిక నెల ‘విచిత్ర కవలలు’. రాజారావు గారు రాసిన ఈ ఏకైక సీరియల్ 1950 జులై- 1951 డిసెంబర్ మధ్య ప్రచురితమైంది. దీనికి నలుపు తెలుపు బొమ్మలను వేసిన చిత్రా ఇదే సీరియల్ 24 ఏళ్ళ తర్వాత (1974 జులై- 1975 డిసెంబర్) తిరిగి ప్రచురించినపుడు వర్ణచిత్ర మాయాజాలం చేశారు. పాతవాటికంటే ఎంతో మెరుగ్గా సరికొత్త బొమ్మలను గీసి పాఠకులను ముగ్ధుల్ని చేశారు.

చందమామకు అట్టవెనక బొమ్మలు కూడా కొన్ని వేశారు చిత్రా. అయితే అవి పెద్దగా ఆకట్టుకోవు! పెయింటింగ్స్ లో కంటే రేఖా చిత్రాల్లోనే ఆయన శైలి ప్రస్ఫుటమవుతుంది.

కథల, సీరియల్స్ టైటిల్స్ ను కథాంశం వ్యక్తమయ్యేలా చిత్రా చక్కగా రాసేవారు. ‘తోకచుక్క’ సీరియల్ కు రాసిన అక్షరాలు తోకచుక్క ఆకారంలోనే కనిపిస్తాయి. చైనా కథల టైటిల్స్ చైనీస్ అక్షరాలను పోలివుండేలా, దయ్యాల కథలకు అక్షరాలు వణుకుతున్నట్టుగా, భలే ఉంటాయి ఆయన లోగోలు!

ఆ అక్షరాల తీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. గుండ్రటి తెలుగు అక్షరాలను పలకలుగా రాసి, వాటి లోపల అందమైన నగిషీలు చెక్కటం చూడొచ్చు.

‘మాయా సరోవరం’ ధారావాహిక, చిత్రా మృతి చెందిన మరుసటి నెలే ముగిసింది. అప్పటికే ఆయన బొమ్మలు గీయటం పూర్తి చేయటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కు ... జయ బొమ్మలు గీశారు. ఆయన బాగానే వేశారు గానీ, చిత్రాతో పోలిస్తే... నిలబడే చిత్రాలు కావు. ఆ రకంగా చిత్రా తోనే సుబ్రహ్మణ్యం గారి ‘ఉజ్వల శకా’నికి తెరపడిందనిపిస్తుంది!

చిత్రా, నేనూ!


1978 మే 6న అస్తమించిన చిత్రా గురించి తర్వాతి నెలలో చందమామలో ప్రచురించినపుడు, నా చిన్నపుడు- చదివాను, బాధ అన్పించింది. కానీ కాలక్రమంలో చిత్రా గొప్పతనం ఎక్కువగా అర్థమయ్యాక ఆయన లోటు మరింతగా తెలిసొస్తోంది.

‘పాతాళ దుర్గం’ ధారావాహికలో ఒక సన్నివేశం ఉంది. చెట్టుకొమ్మల్లో ధూమక సోమకులు దాక్కునివుంటారు. సోమకుడు ఉగ్రసేనుడికి గురిచేసి బాణం ఎక్కుపెట్టిన దృశ్యాన్ని చిత్రా చాలా బాగా గీశారు. అది నాకు బాగా నచ్చేసింది.

ఉండబట్టలేక- తెల్ల చాక్ పీస్ తో ఆ బొమ్మను అనుకరించి గీశాను. ఎక్కడంటే- మా ఇంటి గేటు దాటగానే ఎదురుగా గోడమీద కనిపించే చిన్న బ్లాక్ బోర్డు మీద! గ్యాస్ సిలెండర్ తెచ్చిన ఓ వర్కర్ ఆ బొమ్మను చూసి, ‘ఎవరు వేశారండీ, ఆ బొమ్మను?’ అని అడిగి, ‘చాలా బావుంది, చాలా బావుంది!’ అని ‘నన్ను’ మెచ్చుకున్నాడట. ఆ సమయంలో నేను ఇంటి దగ్గర ఉండివుంటే ‘అది చిత్రా గీసిన బొమ్మ’ అంటూ దాని గురించి ఉత్సాహంగా వర్ణించి చెప్పేవాణ్ణి! బొమ్మలను చూసి, ఆనందించే కళా హృదయం అందరికీ ఉండదు కదా!


చందమామ సంపాదకీయం పేజీలో ఉండే చిత్రా బొమ్మ గుర్తుందా? కొలనులో మెడలను అందంగా వంచేసిన రెండు హంసలూ, పద్మాలూ, నీళ్ళలో ప్రతిబింబించే కొండల నీడలూ, ఆకాశం, మబ్బులూ- ఈ దృశ్యం నన్నెంతో ఆకట్టుకునేది. ఆ బొమ్మ ఎడమవేపు కింది భాగంలో స్వేచ్ఛగా పెట్టిన చిత్రా సంతకం కూడా నాకు ఇష్టమే!

మరణించి 30 ఏళ్ళు గడిచినా చిత్రా స్థానం భర్తీ కాలేదంటే ఆయన ముద్ర ఎంత బలీయమైనదో అర్థమవుతుంది. 66 సంవత్సరాలకే జీవితం చాలించకపోతే మరెన్ని అద్భుత వర్ణచిత్రాలు ఆయన గీసేవారో కదా!

కథల మాంత్రికుడి మాటల్లో.....

చిత్రా గురించి చెప్పుకునేటప్పుడు- జానపద ధారావాహికల స్రష్ట దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోకుండా ఉండలేం. వారిద్దరిదీ అపూర్వ సమ్మేళనం! ‘తోకచుక్క’ నుంచి ‘మాయా సరోవరం’ వరకూ దాసరి- చిత్రాల కాంబినేషన్ ‘చందమామ’ వేదికగా అద్భుతాలు సృష్టించి పాఠకలోకాన్ని ఉర్రూతలూగించింది.

సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో కలిసినప్పుడు చిత్రా గారి గురించి ఆయన్ను చాలా అడిగాను. ఆ విశేషాలు...

చిత్రాతో మీ అనుబంధం...

‘‘ఆర్టిస్ట్ చిత్రాను, నేను 1952 జనవరిలో, చందమామ సంపాదక వర్గంలో చేరిననాడు, చూడడటం జరిగింది. ఆయన 1947లో చందమామ ప్రథమ పత్రిక వెలువడిననాడే, అందులో పనిచేస్తున్నాడు. చిత్రకారుడిగా, ఇలస్ట్రేటర్ గా ఆయన చాలా ప్రతిభావంతుడు.


నేను 1954 జనవరిలో రాయడం ప్రారంభించిన, నా ‘తోకచుక్క’ సీరియల్ కు, ముందుగా చందమామలో (ఒక నెలకు ముందు) ఒక పేజీ రాబోయే కథలోని బొమ్మలను వేసి, దానికి మంచి ఆదరణ (ప్రారంభంలోనే) కలిగేట్టు చేశాడు.


తర్వాత నే రాసిన ‘మకర దేవత’, ‘ముగ్గురు మాంత్రికులు’, ‘కంచుకోట’ ... అలా మరికొన్నిటికి చిత్రాలు వేశారు.

ఆయనది చాలా అకాల మరణం. ఆయనతో నా అనుబంధం- కేవలం రచయితా, చిత్రకారులుగానే కాక, చాలా స్నేహ, పరస్పర గౌరవాదరాలతో కూడినది.

చిత్రా స్వగ్రామం, ఇప్పటి ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్ళూరు దగ్గిర చిన్న గ్రామం అని కొద్దిగా గుర్తు. ఆయన చందమామలో చేరిన - తర్వాతి ఆర్టిస్టుల్లా కాక, తెలుగు రాయా చదవా ఎరిగినవాడు.’’

చిత్రా బొమ్మల ప్రత్యేకత, ఆయన శైలి....

‘‘ఆయన బొమ్మల ప్రత్యేకత... బొమ్మల్లో, ఆయా వాతావరణానికి (Background) తగిన రీతిలో వాస్తవంగా కదులుతున్నట్టు ఉండేవి. ఇంక శైలి మాటకొస్తే, ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్నదని నేననుకోను.

ఆనాటీ, ఈనాటీ ఆర్టిస్టుల్లో ఆయన సమర్థుల్లో అత్యంత సమర్థుడు.’’

జానపద సీరియల్స్ పాత్రల చిత్రకల్పన విషయంలో మీ ఇద్దరూ చర్చించుకునేవారా?‘‘నేను రాసిన జానపద సీరియల్స్ మొత్తం జనవరి 1954 నుంచి 1978 వరకూ పన్నెండు. వాటిని గురించిన చర్చ (పాత్ర- చిత్రకల్పన) వగైరా చిత్రా గారి తోనే కాదు, ఆ తర్వాత చిత్రాలు వేసిన జయ గారితో కూడా చర్చించడం జరగలేదు. అంత అవసరం అనుకుంటే పాత్రల వేషధారణలో కొన్ని మార్పులు చెప్పేవాడిని.’’

యక్షపర్వతం, రాతిరథం సీరియల్స్ కథానాయకులు ఖడ్గ వర్మ, జీవ దత్తుల పాత్రల ఆహార్యం మీరు ఊహించినట్టే వచ్చిందా? అంతకంటే బాగా వచ్చిందా?

‘‘మీరు ఉదాహరించిన పాత్రలే కాదు, తర్వాత రాసిన సీరియల్స్ లోని పాత్రలూ, నా ఆలోచనకు పూర్తి అనుగుణంగా వచ్చినవి. ఇప్పుడు (2009లో ప్రచురణ జరుగుతున్న) ‘పాతాళ దుర్గం’ బొమ్మలతో పాటు లోగడ ఆయన చిత్రించిన సీరియల్ బొమ్మలు, ఈ నాటికీ... ఇన్నేళ్ళ తర్వాత కూడా అద్భుతం అనుకుంటున్నాను.’’

రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాల్లో...
చందమామను అనితర సాధ్యంగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన లెజెండ్ కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన కుమారుడు రోహిణీ ప్రసాద్ గారు 2006 జనవరిలో ఈ మాట లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు ’ విలువైన సమాచారంతో ఉన్న వ్యాసం. దీనిలో చిత్రా గారి ప్రస్తావన ఇలా ఉంటుంది-

‘‘ చిత్రాగారు చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశారు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఎప్పుడూ నీట్‌గా డ్రస్‌ చేసుకుని వచ్చేవారు. మితభాషి. అస్తమానం ఇన్‌హేలర్‌ ఎగబీలుస్తూ ఉండేవాడు.

చిన్నప్పుడు నాకు బొమ్మలు గీసే అలవాటుండడంతో ఆయన పక్కన గంటల తరబడి కూర్చుని చూసేవాణ్ణి. ముందుగా పెన్సిల్‌ స్కెచ్‌ గీసుకుని, ఆ తరవాత ఇండియన్‌ ఇంక్‌తో ఆయన బొమ్మలు వేసేవారు. ఒక సందర్భంలో బాపూ చిత్రాగారి బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం గీసే ఆయన పద్ధతి తనకు నచ్చుతుందనీ మాతో అన్నారు.

అమెరికన్‌ కామిక్స్‌ “చందమామ” ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవారు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు.

దాసరి వారి సీరియల్‌కు చిత్రాగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యంగారు “మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు” మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవారు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా గారి బొమ్మల వల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.

శంకర్‌ ఆర్టు స్కూల్‌కు వెళ్ళిన మనిషి. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత.

మొత్తం మీద వీరిద్దరూ డిటెయిల్స్‌తో కథలకు బొమ్మలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు. “చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి.’’

ఈ టపాలో మొదట ఇచ్చిన చిత్రం ‘జ్వాలా దీపం’ధారావాహికకు చిత్రా కుంచె చిత్రించిన బీభత్స దృశ్యం.

ఇప్పుడు 'తోకచుక్క','మాయా సరోవరం' సీరియల్స్ లోని రెండు అద్బుత చిత్రాలు చూడండి!




















చిత్రా గురించి ఇటీవల శివరామప్రసాద్ గారూ, రాజశేఖర రాజుగారూ తమ బ్లాగుల్లో రాశారు. వాటి లింకులు ఇస్తున్నాను.

‘సాహిత్య అభిమాని’ బ్లాగు టపా.

‘చందమామ చరిత్ర’ బ్లాగు టపా.





28, సెప్టెంబర్ 2009, సోమవారం

నృత్య ప్రధాన దృశ్య కావ్యం ’సాగర సంగమం’!

సున్నితమైన మానవ సంబంధాలను మనసుకు హత్తుకునేలా వెండితెరపై మలిచిన దృశ్య కావ్యం- ‘సాగర సంగమం’(1983)

శాస్త్రీయ సంగీతం ప్రధానాంశంగా ‘శంకరాభరణం’ (1979) తీసిన ఏడిద నాగేశ్వరరావు, పూర్ణోదయా పతాకంపై దాదాపు అదే స్థాయిలో నిర్మించిన నృత్య ప్రధాన చిత్రమిది.

విడుదలై పాతిక సంవత్సరాలు గడిచి పోయినా ఈ సినిమాలోని సన్నివేశాలు ఇప్పటికీ ఎంతోమంది స్మృతుల్లో పదిలంగా ఉన్నాయి.

దర్శకుడు విశ్వనాథ్ అసమాన ప్రతిభకు సాంకేతిక నిపుణుల, నటీనటుల సామర్థ్యం తోడై, ఈ చిత్రం కళాత్మకంగా రూపుదిద్దుకుంది.

ఇళయరాజా వినసొంపైన పాటలూ, సందర్భాలను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం; నివాస్ కనువిందైన ఛాయాగ్రహణం, జంధ్యాల పదునైన సంభాషణలూ, వేటూరి సుందర గీతాలూ అద్భుతంగా అమరాయి.

టైటిల్స్ నేపథ్య దృశ్యాలూ, నేపథ్య సంగీతం- ఒక సంగీత నృత్య ప్రధాన చిత్రం చూడబోతున్న మూడ్ ని ఏర్పరుస్తాయి.

రెండు గంటల నలబై నిమిషాల ఈ సినిమాలో మనసు ఆర్ద్రమయ్యే, ఉద్వేగం కలిగే రసవద్ఘట్టాలు అర డజను పైగానే ఉన్నాయి.

బాలకృష్ణ (కమల్ హాసన్) అనే నృత్య కళాకారుడి గతి తప్పిన విషాద జీవితం ఈ చలన చిత్రం.
అనామకంగా పడివున్న తన ప్రతిభను మొదట్లోనే గుర్తించి ఎంతో ప్రోత్సహించిన మాధవి (జయప్రద) పై అతనికి ప్రేమ అంకురిస్తుంది.

కానీ ఆమెకు అంతకుముందే పెళ్ళయిందని తెలుస్తుంది. మామ గారి ఆస్తి కోసం పట్టుబట్టి వివాహాన్ని కాదనుకున్న ఆమె భర్త తిరిగి వస్తే, వారిద్దరినీ కలుపుతాడు.

తల్లికీ, ప్రేమించిన వ్యక్తికీ దూరమై నిరాశ - అతడి ‘బతుకు’లో ‘ నిత్య నృత్యం’ చేసింది.
‘జీవితమే చిర నర్తనం’ కావాలన్న తన ఆకాంక్షలను విస్మరిస్తాడు.

తన ‘పంచ ప్రాణాల’నూ ‘నాట్య వినోదం’గా సంభావించిన సంగతి మరచిపోతాడు. కళకు అంకితం కావాల్సింది, మద్యానికి బానిసైపోతాడు; ఆరోగ్యాన్నీ, ఆత్మ అయిన కళనూ నిర్లక్ష్యం చేస్తాడు.

చివరకు జయప్రద పునరాగమనంతో తప్పు తెలుసుకుంటాడు.

ఆమె కూతురు శైలజకు తన కళను నేర్పటం ద్వారా తన కృతజ్ఞత చూపిస్తాడు. శిష్యురాలి ద్వారా నాట్య కళను బతికించుకోవాలని ఆరాటపడతాడు.

‘వేదం అణువణువున నాదం’ పాట చిత్రీకరణ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆస్పత్రి బెడ్ మీద నుంచే కమల్ శైలజకు నాట్యంలో శిక్షణ ఇవ్వడం, వేదికపై ఆమె ప్రదర్శన... ఇదంతా క్లైమాక్స్ లోకి వేగంగా దూసుకెళ్తుంది.

శైలజ ప్రదర్శన చూసిన సంతృప్తితో తుది శ్వాస విడుస్తాడు. అతన్ని వీల్ చైర్ లో తీసుకెళుతుంటే వర్షం పడుతుంది. అప్పుడు అతడి స్నేహితుడు (శరత్ బాబు) తన శరీరంతో కమల్ ని కప్పే దృశ్యం కదిలిస్తుంది.


మసిబారిపోయిన తన బతుకు కొడిగట్టకముందే... దానికో అర్థం కల్పించుకోవటానికి పరితపించిన వ్యక్తిగా కమల్ హాసన్ నటన శిఖర స్థాయిని అందుకుంది. తల్లి చనిపోయే ఘట్టంలో అతడి నటన పరాకాష్ఠకు చేరినట్టు అనిపిస్తుంది.

మొదట్లో ‘‘అసలు శాస్త్రీయ నృత్యం గురించి రాయటానికి నీకేం అర్హత ఉందిరా? నువ్వేమైనా భరతమునివా?’’ అని శైలజ ఫియాన్సీ తనను దూషించినపుడు కమల్ ముఖకవళికల్లో పలికించే భావం అనితర సాధ్యం! అప్పుడు కమల్ చేసి చూపించే భరతనాట్యం, కథక్, కథాకళి రీతుల నాట్యం ఎంత అలవోకగా, వేగంగా, ‘స్టైల్’గా ఉంటుందంటే- కన్నార్పకుండా చూడటం తప్ప మరేం చేయలేం!

ఆ సీన్ చివర్లో కమల్ కాలు పైకి లేచి టీ ట్రే కి తగులుతుంది. గ్లాసులన్నీ పైకి ఎగరటం, కింద పడ్డ ఓ గ్లాసు శైలజ కాలిదగ్గరే గుండ్రంగా దొర్లిపోవటం... ఆ ఘట్టంలోని గాంభీర్యతను రెట్టింపు చేస్తుంది!

‘‘నీ దృష్టి- ప్రేక్షకుల మీద; మనసు- వాళ్ళు కొట్టే చప్పట్ల మీద; ధ్యాస- అందుకోబోయే బిరుదుల మీద’’ అంటూ శైలజను ‘‘నాట్యమయూరి’’ అని హేళనగా సంబోధిస్తాడు. తనను దూషించిన శైలజ ఫియాన్సీని ‘‘ఏమన్నావ్? బాస్టర్డా?’’ అంటూ లాగి చెంపమీద కొట్టి తన ఆత్మగౌరవం ప్రదర్శిస్తాడు.

వెళ్ళిపోతున్న కమల్ కి గేటుకీపర్ ‘‘నమస్తే సార్’’ అంటూ కొత్తగా మర్యాద ఇవ్వటం ఈ మొత్తం సన్నివేశానికంతటికీ మరపురాని కొసమెరుపు!

విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా... ఈ ముగ్గురు ప్రతిభావంతుల త్రివేణీ సంగమం- ఈ సాగర సంగమం. 

విశ్వనాథ్, కమల్ లకే కాదు; విశ్వనాథ్, ఇళయరాజాలకు కూడా ఇది తొలి సమ్మేళనమే.

ఈ సినిమా లోని ఎన్నో సన్నివేశాలు ‘స్పాంటేనిటీ’తో రూపుదిద్దుకున్నాయనీ, అప్పటికప్పుడే ఇంప్రొవైజ్ అయ్యాయనీ కమల్ చాలా సార్లు చెప్పాడు. అందుకే ‘‘వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్’’ అని ఈ చిత్రాన్ని ఆయన అభివర్ణించారు.

ఆ నోస్టాల్జియా ప్రేరేపించే కావొచ్చు- తన ‘దశావతారం’లో సాగర సంగమం నాయిక జయప్రదకూ, భంగిమ కుర్రాడు చక్రికీ స్థానం కల్పించాడు.

‘‘కమల్ కోసం ‘టైలర్ మేడ్’గా తయారుచేసిన కథ ఇది’’ అంటారు విశ్వనాథ్.

ఆయన ఇంకా ఏం చెప్పారో చదవండి-

‘‘Subtleties లో కమల్ తర్వాతే ఎవరైనా! అతని స్పాంటేనిటీ, టైమింగ్ అన్ బిలీవబుల్. ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో ఒక్కొక్క పెర్ఫార్మర్ గురించి జయప్రదతో డిస్కస్ చేస్తూ ఇన్విటేషన్ తిరగేస్తున్న కమల్, ఒక్కసారిగా దానిలో తన పేరు చూసుకుని షాకవుతాడు! నిజ జీవితంలో అలాంటి సందర్భాల్లో ఏడ్చేస్తారు, ఎక్స్జైట్ అవ్వరు. అలానే ఈ సినిమాలో కూడా కమల్, జయప్రద చెయ్యి పట్టుకుని ఏడుస్తాడని ప్లాన్ చేశాం. 

కెమెరా రోల్ అయింది, యాక్ట్ చేయడం మొదలెట్టాడు. 

ఎందుకో నాకు సడన్ గా అనిపించింది- చివరిలో నవ్వితే బాగుంటుందని. వెంటనే ‘కమల్, లాఫ్’ అని అరిచాను. 

నా ఇన్ స్ట్రక్షన్ ని తను క్షణంలో రిసీవ్ చేసుకోవడం, కరెక్ట్ టైమింగ్ తో దాన్ని ఫాలో అయిపోవడం... క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడనిపించింది- అతని పొజిషన్ లో వేరే ఏ ఆర్టిస్టున్నా ‘ఏంటి సార్?’ అని షాట్ ఆపి అడిగుండేవారని!’’

కమల్ ఈ సీన్ లో మనసారా తృప్తిగా నవ్వుతుంటే... వెంటనే కనిపించే ఎగిరే పక్షుల దృశ్యం చక్కని సాదృశ్యంలా భాసిస్తుంది.

మరో ఘట్టం గురించి విశ్వనాథ్ మాటల్లోనే...


‘‘కృష్ణాష్టమి రోజు తాగొచ్చాననే గిల్టీ ఫీలింగ్ తో లోపలికి రానంటాడు కమల్... అప్పుడు శరత్ బాబు భార్య కమల్ కి ఫలహారం పెట్టడానికి తనే బయటికొస్తుంది. 

అప్పుడతను ‘నేనెక్కువేం తాగలేదు’ అంటాడు. 
వెంటనే ఆమె ‘నేనేం అడగలేదే!’ అంటుంది. 

ఆ అనే తీరుకి... మన కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి’’.


‘తకిట తథిమి’పాట చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశం అత్యద్భుతం. వాన నీటకి జయప్రద బొట్టు కరిగిపోకుండా కమల్ తన చేతిని నుదిటికి అడ్డు పెట్టడం- మాటలకందని భావానికి మచ్చుతునక!

మానవ స్వభావం...
ఈ సినిమాలో మానవ మనస్తత్వాన్ని అనితర సాధ్యంగా ఆవిష్కరించిన రెండు సన్నివేశాలున్నాయి.

శైలజ నాట్య ప్రదర్శనలో చేసిన పొరపాట్లను ఎత్తిచూపి, ‘నాట్య శాస్త్రానికి తీరని కళంకం’గా ‘నటరాజుకు శిరోభారం’గా పత్రికలో రాస్తాడు కమల్. ఆమె నృత్యాన్ని ‘కుప్పిగంతులూ, కప్ప గెంతులూ’గా అపహాస్యం చేస్తాడు.

అలాంటివాడు చివర్లో శైలజ జయప్రద కూతురని తెలిశాక...

‘‘చిన్న పిల్ల! ఎలా నేర్పుతారో అలా చేస్తుంది’’ అని సమర్థిస్తాడు. పైగా ‘‘చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది’’ అంటూ ‘ఆ ముద్రా- అదీ- పర్ఫెక్ట్, పర్ఫెక్ట్!’’ అని పొగిడేస్తాడు. ‘‘ఏదో ఎక్కడో చిన్న తప్పు చేస్తే ... ఫూల్ ని, ఛండాలంగా రాయాలా?’’ అని తనపై తాను కోపం తెచ్చుకుంటాడు!

ఈ సన్నివేశం ఎంత సహజంగా ఉందో కదా?


మరో ఘట్టం-

కార్లో కమల్, జయప్రదా వెళ్తుంటారు. తనను సెక్రటరీగా వేసుకోమని జయప్రద అంటే- ‘‘మీరెప్పుడూ నా పక్కనే ఉంటారా?’’ అనడుగుతాడు కమల్. ‘‘ఓ ష్యూర్! వై నాట్? ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ’’ అంటుంది జయప్రద. ‘‘నిజంగా?’’ అంటే ‘‘ప్రామిస్’’ అంటుందామె.

అప్పుడు కారు ఆపమనీ, చిన్న పనుందనీ అక్కడికక్కడే దిగిపోతాడు, కమల్. రోడ్డు పక్కనే ఉన్న చిన్న కొండ అంచున ఏకాంతంగా కూర్చుని తనలో పొంగిపొరలే సంతోషాన్ని ఆస్వాదిస్తాడు.

ఇక్కడ అతడికి ఆనందం జయప్రద వల్లనే. కానీ దాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందటానికి మాత్రం ఆమె ఉనికీ, సామీప్యమూ అవరోధమవటమే వైచిత్రి!

ప్రేమించిన వ్యక్తి వల్ల పుట్టిన సంతోషాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోవటానికి ఆ ప్రేమికురాలి నుంచి ఒంటరితనం కోరుకోవటం...! ఇలాంటి కథానాయకుడు మరే సినిమాలోనైనా మీకు తారసపడ్డారా?

మనిషి స్వభావంలోని లోతును అద్భుతంగా ప్రదర్శించిన ఈ ఘట్టం అజరామరమనిపిస్తుంది.

జయప్రద ఇంటికి వెళ్ళగానే పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి, మరోసారి అదే ప్రశ్నను అడిగి, అదే జవాబు చెప్పించుకుని, ‘‘థాంక్యూ , థాంక్యూ వెరీమచ్’’ చెప్తాడు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ‘‘ఐ లవ్ యూ’’ చెప్తాడు.

నచ్చనివీ ఉన్నాయి!
ఆస్తి కారణంగా దూరమైన జయప్రద భర్త చివరకు తిరిగి వచ్చి, కమల్- జయప్రదలను ‘ముచ్చటైన జంట’ అవుతారని ప్రకటిస్తాడు. తను ‘శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నా’నని మామగారికి చెప్తాడు. అయినా కమల్ వారిద్దరినీ కలిపి, సాగనంపుతాడు.

ఇక్కడ హీరోయిన్ మనోభావాలేమిటో తెలుసుకోవాలనే కనీస బాధ్యత కూడా హీరో ఫీలవ్వకపోవటం విచిత్రంగా అనిపిస్తుంది.

ఆమె కూడా కమల్ మాటలకు తలూపి, భర్తతో వెళ్ళిపోతుంది.

అతి మంచివారైన భర్తా, ప్రేమికుడూ తమ ఆదర్శ నిర్ణయాలు ప్రకటించి, ఆమెకు వ్యక్తిత్వం ఉందనే సంగతి మరిచారనిపిస్తుంది.

పోనీ, కమల్ ఆ జంటను కలిపాక, నాట్య కళకే జీవితాన్ని అంకితం చేయవచ్చు కదా? ‘‘ఒంటరి తనాన్ని దూరం చేసుకోవటానికి తాగుడుకు దగ్గరవ్వటం’’ ఎందుకూ?

చివర్లో- జయప్రదనుద్దేశించి ‘‘ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అనే మాటలు ‘విని’ శైలజ పశ్చాత్తాపపడి, మారిపోతుంది. ఆమె ఈ మాటలు ఒకవేళ వినకపోతే ఏమయ్యేది? అసలు కమల్ జయప్రదను ‘‘ఆ మహాతల్లి’’ అని సంబోధించకపోతే వారి అనుబంధం పవిత్రం అయ్యేది కాదా? ఇవన్నీ సందేహాలే!

కమల్ ఆశయం- వివిధ ప్రాంతాల నృత్యరీతుల సమ్మేళనంతో ‘భారతీయ నృత్యం’ రూపొందించటం. ఇది శైలజ ద్వారా నెరవేరినట్టు చూపించివుంటే అర్థవంతంగా ఉండేది.

శ్రావ్యమైన, తీయని పాట- ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి..’. దీని స్థాయికి తగ్గట్టుగా చిత్రీకరణ ఉండదు; చాలా నిరాశపరుస్తుంది.

మరికొన్ని విశేషాలు ...
జయప్రద ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఆమె అపురూప సమ్మోహన రూపాన్ని క్లోజప్ షాట్స్ లో అద్భుతంగా ఒడిసి పట్టాడు ఛాయాగ్రాహకుడు.
ముఖ్యంగా- భంగిమ కుర్రాడి పాలబడ్డ కమల్ ని చాటుగా ఫొటోలు తీసే సన్నివేశంలో జయప్రద సౌందర్యం కనువిందు చేస్తుంది.

*
శైలజ ఫియాన్సీకి డబ్బింగ్ చెప్పింది నేటి హీరో రాజేంద్రప్రసాద్. మరో విశేషం- కమల్ అనువాద చిత్రం ‘తెనాలి’(2000) లో జయరామ్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా రాజేంద్రప్రసాదే. జయరామ్ భార్య దేవయానికి డబ్బింగ్ చెప్పింది ఎస్పీ శైలజ!

* ఎస్పీ శైలజకు నటిగా ఇదే తొలి చిత్రం. చివరి చిత్రం కూడా!

జయప్రద భర్త పాత్రధారికి డబ్బింగ్ అందించినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

భంగిమ కుర్రాడిగా కమల్ ని అదరగొట్టిన చక్రి ఈ మధ్యే విడుదలైన ‘ఈనాడు’కు దర్శకుడిగా ఎదిగాడు.

‘బాలా కనకమయ చేల సుజన పరిపాల’ పాటలో వేదికపై మంజుభార్గవికి బదులుగా కమల్ ని తల్లి ఊహించుకుంటుంది. చివర్లో ‘వేదం అణువణువున నాదం’ పాటలో జయప్రద తన కూతురు నర్తిస్తుంటే కమల్ నాట్యం చేస్తున్నట్టు భావిస్తుంది. (నడి వయసులో ఉన్న కమల్ ని కాకుండా యువకుడైన కమల్ ని ఊహించుకోవటంలో ఎంతో ఔచిత్యం కనిపిస్తుంది).

‘శంకరాభరణం’లో ‘బ్రోచే వారెవరురా’ పాటలో మంజుభార్గవి... తులసి పాడుతుంటే హఠాత్తుగా జేవీ సోమయాజులే కళ్ళముందు పాడుతున్నట్టు స్ఫురించి, పులకించిపోయిన ఘట్టం ఈ సన్నివేశాలకు మాతృక అయివుండాలి.

‘తకిట తథిమి తకిట తథిమి’ పాటలో... ‘గుండియలను అందియలుగ చేసీ..’ అనే ప్రయోగం చేశారు వేటూరి. ‘వేదం అణువణువున నాదం’ పాటలో కూడా ఇదే కొంచెం మార్పుతో విన్పిస్తుంది- ‘గుండియలే అందియలై మ్రోగా’- అని. అంతే కాదు; ఇదే పాటలో ‘ఎదలాయె మంజీర నాదం’ అని ఇదే వ్యక్తీకరణ చూడొచ్చు.

మరో ఐదేళ్ళ తర్వాత వచ్చిన స్వర్ణ కమలం (1988)లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇదే ఛాయల్లో ‘అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా?’ అని రాశారు!

7, సెప్టెంబర్ 2009, సోమవారం

విచిత్ర కవలల స‘చిత్రా’లు!




కప్పుటి 'చందమామ'లో పూర్తి పేజీ సైజు బొమ్మలు నాకెంతో ఇష్టం.

వీటి సంగతి ఆన్‌లైన్ చందమామలో నిన్న వచ్చిన ఆర్టికిల్ లోప్రస్తావించాను. చందమామ చరిత్ర బ్లాగులో ఆన్ లైన్ చందమామ అసోసియేట్ ఎడిటర్ కె. రాజశేఖరరాజు గారి పరిచయ వాక్యాలతో దీన్ని ప్రచురించారు.

సరే, సందర్భం వచ్చింది కదా అని ‘విచిత్ర కవలలు’ సీరియల్ లో నాకెంతో ఇష్టమైన రెండు వర్ణచిత్రాల గురించి ఇప్పుడిలా రాస్తున్నాను.

‘చందమామ’లో పాఠకాదరణ పొందిన తొలి ధారావాహిక ‘విచిత్ర కవలలు’.

రచయిత పేరు తెలీదు. 

(తాజా చేర్పు:  ఈ పోస్టు రాసినపుడు తెలియదు కానీ,  తర్వాత కాలంలో ఈ నవలా  రచయిత  పేరు రాజారావు గారని  తెలిసింది...) .

దీని ప్రచురణ (1950 జులై- 1951 డిసెంబరు) తర్వాతే దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘తోక చుక్క’కు అంకురార్పణ జరిగింది.

చందమామలో రెండోసారి ప్రచురించినపుడే (1974 జులై- 1975 డిసెంబరు) ఈ ‘విచిత్ర కవలలు’ ధారావాహికను చదివాను.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత, 2009 జనవరిలో చదివితే బాల్యం రోజుల్లో అనుభవించినంత స్థాయిలో  ఉత్కంఠ కలగలేదు. కానీ, నాటి అపురూప  అనుభూతులు స్ఫురణకు వచ్చాయి.

ధారావాహికలో ముగ్గురు కవల సోదరులు కథానాయకులు.

ఉదయనుడూ, 
సంధ్యా, 
నిశీధుడూ.

వీరు తప్పిపోయిన కథానాయికల (సుహాసిని, సుభాషిణి, సుకేశిని) అన్వేషణకు వెళ్తారు. గుర్రాల మీద వెళ్తుండగా ఉదయనుడు కందకంలో పడి, హఠాత్తుగా కనపడకుండా పోతాడు.

మిగిలిన ఇద్దరిలో సంధ్య దప్పిక వేసి, కొలనులో నీళ్ళు కొంచెం తాగగానే శిలాప్రతిమగా మారిపోతాడు.

నిశీధుడు దాహం సంగతి వాయిదా వేసి, ఓ తోటలో మామిడి పండు కొరగ్గానే కోతి రూపం వచ్చేస్తుంది.

ఆ కోతిరూపంతోనే నిశీధుడు, సంధ్య శిలారూపం దాల్చిన కొలను దగ్గరకొచ్చి చుట్టుచుట్టూ తిరగటం మొదలుపెడతాడు.

అప్పుడే కొలనులోంచి ఓ హంస బయటకు వచ్చి, ఉదయనుడిగా మారిపోతాడు.

సంధ్య శిలాప్రతిమ కంటబడి కొయ్యబారిపోతాడు. ఇంతలో కోతి రూపంలో ఉన్న నిశీధుడు ఉదయనుడి దుస్తులను పట్టుకు లాగుతూ కాళ్ళు చుట్టేసుకుంటాడు.

ఇదీ సందర్భం!

దీనికి  'చిత్రా' వేసిన ‘పేజీ సైజు బొమ్మ’  పైన  టైటిల్ కిందనే పెట్టాను,   చూడండి. ఎంత బావుంటుందో!

నీళ్ళు తాగుతూ శిలగా మారిన సంధ్యా కుమారుడూ, 
అతణ్ణి చూస్తూ ఉదయనుడు నిశ్చేష్టుడైవున్న భంగిమా, 
మర్కట రూపంలో నిశీధుడి విచారం... 

ఇవన్నీ ‘చిత్రా’ చాలా అద్భుతంగా వేశారు.

నా చిన్నప్పటి స్మృతిలో ఇప్పటికీ చెదరని చిత్రమిది.

మరో బొమ్మ-

కొలనులో దూకుతూ హంసలుగా మారిపోతున్న నాయికా నాయకులు!

ఇద్దరి చేతులూ హంసల మెడలుగా మారిపోతూండటం, కొలనులోకి దూకుతున్న యాక్షన్ భంగిమా .... వీటిని భలే ఊహించి చిత్రించారు కదూ?

కథలో ఉత్కంఠ కూడా కలిసి, ఈ వర్ణ చిత్రం అప్పట్లో నన్నెంతగా సంభ్రమంలో ముంచెత్తిందో, సమ్మోహితం చేసిందో చెప్పలేను!

( ఈ డిజిటల్ బొమ్మలో క్వాలిటీ లేక అంత స్పష్టంగా కనపడటం లేదు).

ఈ ధారావాహికలో మరెన్నో కనువిందు చేసే వర్ణచిత్రాలున్నాయి.

‘విచిత్ర కవలలు’ను ‘ బ్లాగాగ్ని’ బ్లాగులోకి వెళ్ళి ఎంచక్కా మీ సిస్టమ్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి!


ఆకాశంలో చందమామను ఆహ్లాదించని బాల్యం ఎంత నిస్సారమో... 
'చందమామ' పత్రికలో బొమ్మలను చూసి, ఆనందించని బాల్యమూ అంతే అనిపిస్తుంది !

( ‘చిత్రా’ గురించి నేను రాస్తానన్న టపా ఇది కాదు.:) 

 దాని గురించి మరోసారి!)

31, ఆగస్టు 2009, సోమవారం

ఈ ‘...చక్కని పాడియావు’ ఎవరిది?



రంగనాయకమ్మ గారు రాసిన కొత్త పుస్తకం ఇది! తాజాగా విడుదలైంది.

విశేష ప్రాచుర్యం పొందిన ఈ ‘భరత ఖండంబు...’ పద్యం ఎవరు రాశారనే దానిపై ఈ మధ్య వివాదం రేగిందని చాలామందికి తెలుసు.

దీని గురించి వెలువడిన రెండు పక్షాల వాదనలనూ పరిశీలించి, రంగనాయకమ్మ గారు ఈ చిన్న పుస్తకం రాశారు!

ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారని మనమందరం చిన్నప్పట్నుంచీ చదువుకున్నాం. కానీ నిజానికి ఆయన రాయలేదనీ, చెన్నాప్రగడ భానుమూర్తి గారు ఈ పద్యం రాశారనే వాదన- వివాదానికి కేంద్రం.

విశేషమేంటంటే....చిలకమర్తి గారూ, భానుమూర్తి గారూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఊళ్ళో, ఒకే బళ్ళో కలిసి చదువుకున్నారు కూడా. చిలకమర్తి గారు రాసిన ఒక నవలను భానుమూర్తి గారు నాటకంగా మార్చారు. భానుమూర్తి గారు చిన్నప్పట్నుంచీ పద్యాలు రాసేవారనీ, ఆయన్ను చూసే తను కవిత్వం రాయడం మొదలుపెట్టాననీ చిలకమర్తి గారు స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

అసలు ఈ పద్యం ఎవరిదనే విషయం గురించిన వివాదం ఈ ఇద్దరి జీవించి ఉన్నపుడు రాలేదు. కాబట్టి ఈ వివాదంతో వారిద్దరికీ సంబంధం లేదు. భానుమూర్తి గారు 1947లో చనిపోతే; చిలకమర్తి గారు అంతకంటే ఏడాది ముందే కన్నుమూశారు.

1959లో ఈ వివాదానికి బీజం వేసింది పోతుకూచి సూర్య నారాయణ గారు. అప్పట్లో ఆయన ‘సాహితీ కౌముది’ అనే పత్రికకు రాసిన ఉత్తరంలో దీన్ని ప్రస్తావించారు. కానీ ‘ఉపపత్తులు’ (ఆధారాలు) చూపమని ఆ పత్రిక వారు అడిగితే... ఇప్పటిదాకా మౌనం వహించి, ఉండిపోయారు.

ఈ సంవత్సరం మార్చిలో కరణం సుబ్బారావు గారి ‘ఈ పద్యాన్ని వ్రాసిందెవరు?’ పుస్తకం తో ఈ వివాదం ఇన్నేళ్ళ తర్వాత మొదలయింది.

‘‘వంద సంవత్సరాల నాటి పద్యం నా కంట పడింది. అంతే. దాని వెంట పడ్డాను. నా పంట పండింది.’’ అన్నారాయన.

ఆయన వాదనను ఖండిస్తూ ఈ పద్యం చిలకమర్తిదే అని వాదించేవారి ప్రతినిధిగా దివాన్ చెరువు శర్మ గారు నిలబడ్డారు.

ఈ సంవత్సరం మే, జూన్ నెలల్లో రాజమండ్రిలో రెండు వర్గాల వారూ పోటాపోటీగా సభలు జరిపారు. తర్వాత ఈ రెండురకాల వాదనలను చెపుతూ పుస్తక రూపంలో రాని అచ్చు, రాత ప్రతులు కూడా విడుదలయ్యాయి.

ఈ వివాదం మీద ఆసక్తితో రంగనాయకమ్మ గారు ఆ సమాచారాన్నంతా సంపాదించి పరిశీలించారు. చిలకమర్తి, భానుమూర్తి గార్ల రచనలు కూడా ఈ సందర్భం కోసం చదివారు.

‘‘ప్రారంభంలో నేను, ఇటూ అటూ ఎటూ కాదు. కానీ, చివరికి నేను కూడా ఒక అభిప్రాయానికి వచ్చాను’’ అంటూ రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో చెపుతారు. వివాదానికి కేంద్రమైన పద్యానికి ఉన్న దీర్ఘ చరిత్రను ఐదారు ఘట్టాలుగా చెపుతూ పరిశీలన సాగించారు.

కూలంకషంగా ఈ వివాదాన్ని చర్చించారు... ఒక్కొక్కరి వాదనలోని వైరుధ్యాలనూ, లోపాలనూ బట్టబయలు చేస్తూ!

‘‘ఏ ఆధారాలూ లేని మార్పుల్ని చూసి సందేహాలు పడి మౌనాలు వహిస్తే, ఆ మౌనాలే ఆధారాలా?’’

‘‘నాలుగు రాళ్ళు విసిరితే, ఏదో ఒక రాయి తగలకపోతుందా- అనే ఆశ ఇది! కానీ ఇక్కడ డజను పైగా రాళ్ళు విసిరినా, ఏదీ లక్ష్యాన్ని తాకకుండానే కిందపడ్డాయి’’.

సీరియస్ వాదనకు కూడా అక్కడక్కడా హాస్య గుళికలను జత చేయటం రంగనాయకమ్మ గారి ముద్ర. పుస్తకంలో రెండు మూడు చోట్ల ఇది కనిపిస్తుంది.

చర్చ కొనసాగిస్తూనే... దానిలో భాగంగా చిలకమర్తి, భానుమూర్తి గార్ల ఊహాత్మక సంభాషణలు రాశారు. వాటిని చదువుతుంటే తెగ నవ్వొచ్చేస్తుంది!

ఇలాంటి పరిశీలనా వ్యాసాన్ని శ్రద్ధగా రాయటం ఒక ఎత్తయితే, స్పష్టంగా ఆసక్తిగా కూడా మలచటం మరో ఎత్తు. రంగనాయకమ్మ గారు ఇదంతా అలవోకగా సాధించగలరని మరోసారి నిరూపిస్తుందీ పుస్తకం.

ఇంతకీ- రంగనాయకమ్మ గారు ఆ పద్యం ఎవరిదని అభిప్రాయపడ్డారు చివరకు ? ఇదే కదా మీ సందేహం?
అది తేల్చుకోవాలంటే... చదవాల్సిందే ఈ పుస్తకం!

20 రూపాయిల వెల ఉండే ఈ పుస్తకం కాపీలు విశాలాంధ్ర లాంటి పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. అక్షరాల ఫాంట్ రెగ్యులర్ సైజులో కాకుండా కాస్త పెద్దగా ఉండటం వల్ల చదవటం తేలిగ్గా అనిపిస్తుంది.

ఈ పుస్తకం షాపుల్లో దొరకనివాళ్ళు - అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ- 520 002 (ఫోన్: 0866-2431181) వారిని సంప్రదించొచ్చు!

తాజా కలం:    ఇది చిన్న  పుస్తకం కదా? అందుకే  దీన్ని ‘అసమానత్వంలో నించి అసమానత్వంలోకే’  పుస్తకంలో కలిపేశారు. 

కినిగెలో  ఈ-బుక్ కొనుగోలు చేయాలంటే ఈ లింకు చూడండి-  

 http://kinige.com/kbook.php?id=1010&name=Asamanatvamlo+Ninchi+Asamanatvamloke

6, ఆగస్టు 2009, గురువారం

మధుర స్వరాల ‘మధువొలకబోసిన’ వి. కుమార్!

‘చిత్ర తరంగిణి’ మొదలైతే చాలు... ఆకాశవాణి తరంగాల్లో తేలి వచ్చే ఆ పాట కోసం అప్రయత్నంగానే రోజూ ఎదురుచూసేవాణ్ణి. విజయవాడ రేడియో కేంద్రం వాళ్ళు నన్ను నిరాశపరిచేవారు కాదు.
తరచూ ఆ పాట ప్రసారం చేసి, నా నిరీక్షణ సార్థకం చేసేవాళ్ళు. అది కన్నవారి కలలు సినిమా లోని ‘మధువొలకబోసే... ఈ చిలిపి కళ్ళు...’ పాట!

పన్నెండేళ్ళ వయసులో .. నాటి నా బాల్యంతో పెనవేసుకునివున్న మధుర గీతమది.

మా ఇంటికి చాలాదూరంగా ఉండే మా ‘తోట’ లో పనిచేయటానికి ఉదయాన్నేవెళ్ళినపుడు పని మీద కంటే పక్కింట్లోంచి వినిపించే రేడియో పాటల మీదే ధ్యాస ఉండేది నాకు. దాదాపు ప్రతిరోజూ ఈ పాట హాయిగా పలకరిస్తూ ‘మధువొలికిస్తుంటే ’ నా చెవులప్పగించేసి తోట పని వదిలేసి, పాట పని పట్టించుకునేవాణ్ణి. మా అన్నయ్యల చీవాట్లు... పాట పూర్తయ్యేదాకా చెవులకెక్కేవే కాదు!


ఈ పాట చాలామందికి ఇష్టం. కానీ దీన్ని స్వరపరిచిందెవరంటే చెప్పగలిగేవాళ్ళు తక్కువమందే! ఎవరిదాకో ఎందుకూ? ఇంతగా ఈ పాటను ఇష్టపడ్డ నేను కూడా బాణీ కట్టిందెవరో సీరియస్ గా నిన్న మొన్నటి దాకా పట్టించుకోలేదు. ఆ సంగీత కర్త... వి.కుమార్ గారు.

కన్నవారి కలలు
(1974) పాటలన్నీ బావుంటాయి. ‘మధువొలకబోసే’ తో పాటు ‘ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు’, ‘సారీ.. సో సారీ- నా మాట వినుంకొకసారి..’ , ‘ అందాలు కనువిందు చేస్తుంటే... ఎదలోన పులకింత రాదా’ ఇవి. బాలు ఈ సినిమాలో పాడిన ఏకైక పాట ‘చెలి చూపులోన’ కూడా మరోటి.

మరి ఈ సంగీత దర్శకుడు ఇంకా ఏమేం తెలుగు సినిమాలకు పనిచేశారని వెతికితే... మరో అద్భుతమైన పాట కూడా కుమార్ సుస్వరాలఖాతాలో ఉన్నట్టు తెలిసింది. ఆనందాశ్చర్యాలు కలిగాయి.

‘మామా చందమామా’ పాట అది. సంబరాల రాంబాబు (1970) సినిమాలోది.

సుశీల గారు పాడిన అరుదైన కామెడీ సాంగ్ ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ..’ దీనిలోదే. ఇంకా ‘జీవితమంటే
అంతులేని
ఒక పోరాటం..’ పాట కూడా.

ఇక నా ఆసక్తి మంద్ర స్థాయిని దాటింది. మధ్యమాన్నీ.. ఆపై తార స్థాయినీ చేరుకుంది.

నెట్
లో అన్వేషించాను. వికీపీడియాలోనూ పొడిపొడిగానే వివరాలు కనిపించాయి.తెలుగు ఫాంట్ సాయంతో వెతికాక, ఇక ఇంగ్లిష్ ఫాంట్ తో !

కుమార్ సంగీతం సమకూర్చిన మరో సినిమా అందరూ మంచివారే (1975) కనిపించింది. దానిలో ‘కట్టింది ఎర్రకోక..పొయ్యేది యాడదాక’ అనే పాట ఉంది.

వి.కుమార్ చాలా తమిళ సినిమాలకు సంగీతం సమకూర్చారనీ, ఆయనకు 'మెలడీ కింగ్’ అనే పేరుందనీ, ఆయన వివరాలు కొన్ని తెలిశాయి. కుమార్ ... కె.బాలచందర్ డిస్కవరీ. తనను తమిళ సినిమా రంగానికి పరిచయం చేసింది బాలచందరే. ‘కవితాలయ’ ‘జెమినీ’ సంస్థలకు ఎక్కువ పనిచేశారు. 16తమిళ సినిమాలకు స్వరాలు కూర్చారు. వీటిలో కమల్ హాసన్ సినిమా ‘అరంగేట్రం’ (1973 ) కూడా ఉంది.
1934 జులై 28న కేరళలో జన్మించారట. మే7 1996 లో చనిపోయారని తెలిసి ‘అయ్యో’ అనిపించింది.

అప్పుడొచ్చింది అసలైన సందేహం....ఈ తెలుగు, తమిళ కుమార్ లు ఇద్దరూ .. ఒకరేనా అని!

వెంటనే సినీ సంగీతంపై అథారిటీ ‘రాజా’ గారు గుర్తొచ్చారు. (వార్తలో కాలమ్ ఆ పాత మధురాలు తెలిసిందే కదా?) ఆయన సంగీత విశేషాలను తెలిపే బ్లాగు. కూడా నడుపుతున్నారు.
రాజా గారికి మెయిల్ చేస్తే వెంటనే స్పందించారు. ఇద్దరూ ఒకరేనని తేల్చారు.

అంతే
కాదు, వి.కుమార్ 'కలెక్టర్ జానకి ' అనే మరో తెలుగు సినిమాకి కూడా సంగీతాన్ని అందించిన సంగతీ గుర్తు చేశారు. ఆ సినిమాకి మూలం తమిళం లో బాలచందర్ తీసిన ' ఇరు కోడుగళ్ ' అనీ, ఆ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించినది వి. కుమార్ గారేనని చెప్పారు.

కలెక్టర్ జానకి (1972)లోకూడా మంచి పాటలున్నాయి. ‘పాట ఆగిందా... ఒక సీటు గోవిందా’ అంటూ బాలు పాడే హుషారైన సరదా పాట దీంట్లోదే !

వి. కుమార్ పాటలు మృదుత్వానికీ, శ్రావ్యతకూ పేరు. భారతీయ, పాశ్యాత్య వాద్యాలను మాధుర్యం ఒలికేలా సమ్మిళితం చేసి, శ్రోతలకు గొప్ప రసానుభూతిని కలిగిస్తారాయన. సినీ సంగీత శిఖరాలైన ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్ ల శైలికి భిన్నమైన స్వతంత్ర శైలి కుమార్ ది.

ఇంతా చేసి, కుమార్ గారి ఫొటో ఒక్కటి కూడా నెట్ లో ఎక్కడా దొరకలేదు. ఎంత బాధాకరమో కదూ?

‘మధువొలకబోసే... ’ ఉన్న ‘కన్నవారి కలలు’ సినిమా 1974లో విడుదలైంది. ... 35 సంవత్సరాల క్రితం! అంటే కనీసం 32 సంవత్సరాల క్రితం నేనీ పాటను తొలిసారిగా వినివుండాలి. వినగానే ఆకట్టుకునే ఈ పాట సాహిత్యం గురించి నేను మొన్నటిదాకా పట్టించుకోలేదు. (అసలు నచ్చిన పాట అంటే- చాలా సందర్భాల్లో నా ఉద్దేశం అది బాణీ పరంగానే! పాట అంటే ట్యూనే. పాడుకోవాలంటే ‘ఆధారం’ కావాలి కాబట్టి ‘లిరిక్’ అవసరమనిపిస్తుంది.)

ఇదో ప్రేమ గీతం. ఈ పాటలో సాహితీ విలువలు గొప్పగా ఉన్నాయని కాదు. కానీ పల్లవిలో తొలి పదమే ‘మధువొలకబోసే’ వినగానే ఆకట్టుకుంటుంది. ‘మూగ భాషలో బాస చేయనీ’ అనే చమత్కారాలు లేకపోలేదు. ‘ఈనాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ’ అనటం మాత్రం వింతగా తోచింది. సాధారణంగా నూరేళ్ళు అనాలి కదా, వెయ్యేళ్ళు అనెందుకు అనాల్సివచ్చింది? బహుశా హాయి- వెయ్యి... ఈ పదాల సామరస్యం కోసం అలా రాసివుండాలని తోస్తోంది.


ఈ యుగళగీతం పాడింది రామకృష్ణ, సుశీల గార్లు . గీత రచయిత ఎవరనేది కచ్చితంగా తెలియటం లేదు. చాలాచోట్ల రాజశ్రీ అనీ, కొన్నిచోట్ల సినారె అనీ కనిపిస్తోంది. ఆ పాట పూర్తి పాఠం కింద ఇస్తున్నాను.


మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ

అడగకనే .. ఇచ్చినచో .. అది మనసుకందమూ
అనుమతినే .. కోరకనే .. నిండేవు హృదయమూ

తలవకనే .. కలిగినచో .. అది ప్రేమబంధమూ

బహుమతిగా .. దోచితివీ .. నాలోని సర్వమూ


మనసు మనసుతో ఊసులాడనీ

మూగభాషలో బాస చేయనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ

మధువొలకబోసే .. ఈ చిలిపి కళ్ళూ

అవి నాకు వేసే .. బంగారు సంకెళ్ళూ


గగనముతో .... ఆ భ్రమరం .. తెలిపినది ఏమనీ

జగమునకూ .. మన చెలిమీ .. ఆదర్శమౌననీ


కలలు తీరగా కలిసిపొమ్మనీ

కౌగిలింతలో కరిగిపొమ్మనీ

ఈ నాటి హాయీ వెయ్యేళ్ళు సాగాలనీ


మధువొలకబోసే .. హా ..
ఈ చిలిపి కళ్ళూ ఆ ఆఆ ఆ ...

అవి నాకు వేసే .. హా ఆఆ...
బంగారు సంకెళ్ళూ



పాట ఎత్తుగడలోనే... ‘మధువొలకబోసే’ లో ‘బోసే’ దగ్గర కట్ చేయటంలో అందం కనిపిస్తుంది. ‘కళ్ళు’- ‘సంకెళ్ళు’ అనే పదాలను కొంచెం ఎక్కువ వ్యవధి తీసుకునేలా ట్యూన్ చేయటం మధుర తరంగా తోస్తుంది.

పల్లవి తర్వాత ఇంటర్లూడ్ లో వీణావాదన హాయిగా సాగి, తొలి చరణానికి సొగసైన దారి కల్పిస్తుంది.

మొదటి చరణంలో రెండో భాగం ‘మనసు మనసుతో..’ దగ్గర స్వరకల్పన మెట్టుమెట్టుగా మాధుర్య సోపానాలను అధిరోహిస్తుంది. వెంటనే ‘ఊసులాడనీ’ తర్వాత సితార బిట్ చటుక్కున పలకరించి, తేనెని చిలకరించేస్తుంది.

‘మూగభాషలో’ దగ్గర కూడా ‘లో’ అనే చోట స్వర సోపానాలను గమనించొచ్చు.

రెండు చరణాల మధ్య ఇంటర్లూడ్ లో వేణువూ, వీణా స్వర మైత్రీ యాత్ర చేస్తూ వరసగా విచ్చేస్తాయి. వీనుల విందు చేస్తాయి. తొలి చరణంలాగానే స్వరాల పూలు గుబాళిస్తాయి.

‘ఈ నాటి హాయి’ దగ్గర ‘హాయి’ ని (రెండో చరణం చివర్లో) సుశీల గారు తన గళంలో అనుపమానంగా , పాట భావం వ్యక్తమయ్యేలా ఎంత బాగా పలికించారో విని తీరాల్సిందే!

ముగింపులో పల్లవి మళ్ళీ వస్తుంది కదా? రామకృష్ణ గళం నుంచి జాలువారే పల్లవీ, దానికి జతగా సుశీల అద్భుత ఆలాపనలూ పాట మాధుర్యానికీ, భావానికీ పరాకాష్ఠ గా అనిపిస్తాయి.

తీయని పాట విన్న అనుభూతి మాత్రం మనకు మిగులుతుంది!

ఈ పాటను వినండి.



ఇంతకీ... ఈ సినిమాను ఇన్నేళ్ళ తర్వాత కూడా నేను చూడటం కుదర్లేదు.

ఈ టపా రాద్దామనే ఆలోచన వచ్చాక ‘దిశాంత్ సైట్’లో 'మధువొలకబోసే..’ పాట వీడియో కనిపించి, చూశాను. చిత్రీకరణ నాకేమీ నచ్చలేదు!


18, జులై 2009, శనివారం

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు!




































‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున ఏం గుర్తుకొస్తాయి? నాకైతే... శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు.


































వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని మే నెల మొదటివారంలో విజయవాడలో కలిశాను. (ఆయన్ను మొదటిసారి 2008అక్టోబర్లో కలిశాను). ఈసారి అభిమాన పాఠకునిగా మాత్రమే కాకుండా జర్నలిస్టుగా కలిశాను. ఎనిమిది దశాబ్దాల కాలం నాటి జ్ఞాపకాల్లోకి ఆయన్ను తీసుకువెళ్ళాను. ఆ అనుభవాలు తలపోసుకునేటప్పుడు ఆయన ముఖంలో ఎంత సంతోషమో! ‘కరుడు కట్టుకుపోయిన ఆ నాటి జ్ఞాపకాలు’ కరిగి, కదిలి అక్షర రూపంలోకి ప్రవహించాయి.

ఆ కథనం ఇవాళ- ‘ఈనాడు ఆదివారం’ 19జులై 2009సంచికలో వచ్చింది.


జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారి పేరు- చందమామ అభిమానుల్లోనే చాలామందికి తెలీదు. దీనికి కారణం- ధారావాహికల రచయిత పేరును ప్రచురించకుండా ‘చందమామ’ అని మాత్రమే ప్రచురించే ఆ పత్రిక సంప్రదాయమే. 1952లో చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా చేరారు సుబ్రహ్మణ్యం. అలా.. 2006వరకూ 54 సుదీర్ఘ సంవత్సరాలు చందమామ పత్రిక సేవలో తన జీవితాన్ని వెచ్చించారు.

పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు ఆయన! తోకచుక్కతో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో భల్లూక మాంత్రికుడు వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది.



సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!
తోకచుక్క- 1954
మకర దేవత -1955
ముగ్గురు మాంత్రికులు-1957
కంచుకోట - 1958

జ్వాలాద్వీపం- 1960
రాకాసిలోయ- 1961
పాతాళదుర్గం - 1966
శిథిలాలయం- 1968
రాతిరథం- 1970
యక్ష పర్వతం- 1972
మాయా సరోవరం- 1976
భల్లూక మాంత్రికుడు- 1978


ఈనాడు ఆదివారంసంచికలో ప్రస్తావించని ఇంటర్వ్యూ భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను.


తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, 'I am over stay here!' అని సున్నితంగా జోక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. తన దశాబ్దాల స్మృతులను దశాబ్దాల నేస్తం సిగరెట్ ను వెలిగించి, ఆ పొగ రింగుల్లో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి నెమరువేసుకున్నారు. నా విజిటింగ్ కార్డు తీసుకుని, దాని వెనక ఆ రోజు తేదీని నోట్ చేసుకున్నారు. ‘మీరు ఎప్పుడు వచ్చారో దీన్ని చూస్తే తెలుస్తుంది’ అంటుంటే... ఆ శ్రద్ధకు ఆశ్చర్యమనిపించింది.

12 సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైనది?
 

   ఈ ప్రశ్న కాస్త ‘జటిల’మైనది. చంద   మామలో రాసిన ఆ పన్నెండు సీరియల్స్  24సంవత్సరాలపాటు వరసగా రాసినవి.  వాటిల్లో కొన్నిటి పేర్లు నాకు గుర్తు కూడా  లేవు. కొంచెం ఆలోచించి చూస్తే-  అన్నిటికన్నీ నాకు ఇష్టమైనవే  అనవలసివస్తుంది. చిత్రగుప్త, తెలుగు  స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, అభిసారిక... ఇలా కొన్ని పత్రికల్లో సాంఘిక కథలు రాశాను. అవీ, ఈ చందమామ సీరియల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే. ప్రత్యేకంగా బాగా ఇష్టమైనవంటూ ఏమీ లేవు.

కొ.కు. గారితో మీ అనుబంధం గురించి....

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారిది తెనాలి. శ్రీ చక్రపాణి గారిదీ తెనాలే. కొ.కు. గారితో నా అనుబంధం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇద్దరం అభ్యుదయ వాదులం. అనేక రాజకీయ, సామాజిక సమస్యల గురించి ఏకాభిప్రాయం కలవాళ్లం. ఆయన రాసిన చదువు, కాలభైరవుడు లాంటి రచనలు చదవడమే గాక, ఆయన గురించి లోగడ విన్నవాణ్ణి. కానీ ఆయనతో ముఖాముఖి పరిచయం 1955లో. చందమామ సంపాదకత్వం పనిని అప్పట్లోనే శ్రీ చక్రపాణి గారు కుటుంబరావు గార్కి ఒప్పగించారు. మొదటిసారి ఆఫీసులో ఆయనను కలిసినపుడు , ఆయనతోపాటు నేనున్న ఆఫీసు గదిలోకి ఎవరు వచ్చారో గుర్తులేదు. పరిచయ వాక్యాలు అయాక, కొ.కు. గారు ‘‘స్వతంత్ర, ఇతర పత్రికల్లో మీరు రాసిన కథలు చదివాను. అవి రాసింది తెనాలిలో మా కుటుంబాన్నెరిగిన దాసరి సుబ్రహ్మణ్యం ఏమో అనుకున్నాను. అయితే వ్యక్తిగా ఆయన్ని నేను చూడలేదు. ఏనాడో ఊరొదిలి పోయాడు’’, అన్నారు.

* * *

సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం విజయవాడలో తన అన్నయ్య కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు. ఆయనను సంప్రదించటానికి అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను.
దాసరి సుబ్రహ్మణ్యంc/o శ్రీమతి ఝాన్సీ
G-7వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్
దాసరి లింగయ్య వీధి
మొగల్రాజపురం, విజయవాడ-10
ఫోన్- 0866 6536677

* * *


ఇంతకీ... కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన సుబ్రహ్మణ్యం గారు- హేతువాదీ, నాస్తికుడూ!

ఆయన పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు హేతువాదిగా చాలా ప్రసిద్ధుడే. ‘‘మా పెద్దన్నయ్య శ్రీ ఈశ్వరప్రభు దగ్గిర చాలా పురాతన సాహిత్యం ఉండేది. ఆ గ్రంథాలు పనిగట్టుకొని చదివాను. నేను అన్నలూ, అక్కయ్యలూ గల కుటుంబంలో అందరికన్నా చిన్నవాణ్ణి; ఆఖరివాణ్ణి. పది సంవత్సరాల వయసులోపలే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాణ్ణి గనక పెద్దన్నయ్యా, వదినెల దగ్గిర పెరిగాను, వాళ్ళు నాకు చిన్నమెత్తు పని చెప్పకపోగా, చదువుకో, స్కూలుకు పో అని బలవంతపెట్టేవాళ్ళు కాదు. అలా పెరిగాను’’ అని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్యం గారు- తన అన్నగారి గురించీ, బాల్యం గురించీ!


ఈ జానపద ధారావాహికల గురించి చెప్పేటప్పుడు అపురూపమైన ఆ కథల్లోని వాతావరణాన్ని కళ్లముందుంచే అద్భుత వర్ణ ‘చిత్రా’లను తల్చుకోకుంటే అది అన్యాయమే!

ఆ విశేషాలు... మరో టపా రాసేంత ఉన్నాయి మరి!