సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

9, జులై 2015, గురువారం

నేటి ‘బాహుబలి’ ... నాటి ‘కంచుకోట’!



‘కంచుకోట’  అంటే  1967లో వచ్చిన  ఎన్టీఆర్ జానపద  సినిమా అనుకుంటారేమో ... అదేమీ  కాదు!  అప్పటికింకా  పదేళ్ళ ముందటి  జానపద గాథ  సంగతి!


ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా  ‘బాహుబలి’ సినిమా విశేషాలు  మార్మోగిపోతున్నాయి... టీవీల్లో, పత్రికల్లో, ఎఫ్ ఎం రేడియోల్లో!  

ఇదొక  కాల్పనిక జానపద కథ అంటున్నారు.

ఊహాజనిత నగరం   ‘మాహిష్మతి’ గురించి విన్నపుడు మాత్రం  అంతకుముందెప్పుడో  దీని గురించి చదివానేమో  అనిపించింది.

అది నిజమేనని  అర్థమైంది.   అదేమిటో  ఈ పోస్టు  చివర్లో  చెప్తాను.


***

మాహిష్మతీ నగరం  ఎక్కడుంది?

ఈ నగరం ప్రస్తావన  రెండు పురాణాల్లో  కనిపిస్తోందని   లేటెస్టుగా తెలుసుకున్నాను.  


వరాహ పురాణంలో- ‘మాహిష్మతి’ అనే రాక్షస వనిత (మహిషాసురుడి  తల్లి ఈమే), మాహిష్మతి అనే  పట్టణం పేరూ  కనిపిస్తాయి.


బ్రహ్మాండ పురాణం ప్రకారం- కార్త వీర్యార్జునుడి రాజధాని పేరు ‘మాహిష్మతీపురం’. ఇది వింధ్య పర్వతాల దగ్గర ఉండేదట.

ఈ కార్తవీర్యార్జునుడికీ,  చేతులకూ (బాహువులు) సంబంధం ఉంది.  కథ ప్రకారం... ఇతడికి వెయ్యి చేతులు!

 జమదగ్ని ఆశ్రమంలోని  హోమధేనువును బలవంతంగా తీసుకువెళ్ళినందుకు కోపించిన  పరశురాముడు ఇతడి చేతులన్నీ నరికేసి, చంపేస్తాడు.

ఇది 18వ శతాబ్దం నాటి పెయింటింగ్
  శాపవశాన  చేతుల్లేకుండా పుట్టి, తపస్సు చేసి  వెయ్యి  చేతులు సంపాదించిన కార్త వీర్యుడు మళ్ళీ శాపం కారణంగానే   ఆ చేతులన్నిటితో పాటు  ప్రాణాలూ కోల్పోతాడన్నమాట.


ఈ విధంగా  బాహువులను బలి తీసుకున్న పరశురాముడిని ‘ బాహు బలి’ అనుకోవచ్చేమో కదా! 

***

ర్ణాటక లోని  గోమఠేశ్వరుడిని  ‘బాహుబలి’ అంటారు. మహా మస్తకాభిషేకం జరిగే నిలువెత్తు విగ్రహం  చాలామందికి తెలిసేవుంటుంది.

ఈ  గోమఠేశ్వరుడి కథ   ఆసక్తికరంగా ఉంటుంది. బాహుబలీ, భరతుడూ అన్నదమ్ములు. ఇద్దరి మధ్యా    పోరు జరుగుతుంది. దానిలో యుద్ధ రీతులూ, మలుపులూ బాగుంటాయి. రాజమౌళి  మార్కు    కొత్త రకం ఆయుధం అంటుంటారు కదా... అలాంటి ఆయుధం   'చక్రరత్న' కూడా ఈ  జైన బాహుబలి కథలో భాగం. 

అమరచిత్ర కథ వారు ప్రచురించిన ఈ కథ ముఖచిత్రం ఇది...



      ***

మళ్ళీ మాహిష్మతి దగ్గరకు...

 చందమామలో వచ్చిన దాసరి సుబ్రహ్మణ్యం గారి  ‘కంచుకోట’(1958) సీరియల్  అన్ని భాగాలూ కూర్చిన  pdf ఫైల్ ను  మొన్నీమధ్య  అనుకోకుండా  మరోసారి చూశాను.

సీరియల్ మొదటి  భాగం - మొదటి పేజీ- మొదటి పదమే ఆశ్చర్యం లో ముంచెత్తింది.  ‘మాహిష్మతీనగర రాజైన యశోవర్థనుడు..’ అంటూ  ఈ సీరియల్ ప్రారంభమైంది.

చూడండి-
ఈ  జానపద ధారావాహిక   మొదటి - చివరి పేజీలు. 



 బాహుబలి సినిమాలోని  మాహిష్మతి రాజ్య దృశ్యాన్నీ -

చందమామలో చిత్రకారుడు చిత్రా  చిత్రించిన బొమ్మ  క్లోజప్ నూ  చూడండి- 


ఈ రెంటికీ  నాకైతే పోలికలు కనపడుతున్నాయి. రెండూ ఏరియల్ వ్యూ అవటం వల్ల కూడా ఇలా అనిపిస్తోందేమో!


దాసరి సుబ్రహ్మణ్యం గారు నాస్తికుడైనప్పటికీ   సాంప్రదాయిక  గాథలు  బాగా  చదివినవారు. ‘మాహిష్మతీ  నగరం’ అనే పేరును  ఆయన పురాణాల నుంచే గ్రహించి  ‘కంచుకోట’లో  ఉపయోగించివుంటారు.

‘బాహుబలి’ కథకులు ఈ సీరియల్ ను చదివి  ప్రేరణ పొందారో  లేదో- ఈ పేరు పెట్టటం  కాకతాళీయమేమో తెలియదు.

కానీ ఈ సీరియల్లో  సుబాహు’ అనే పాత్ర  కూడా  ఉండటం మాత్రం కాస్త  విచిత్రమే అనిపిస్తోంది!