సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2014, బుధవారం

పాతికేళ్ళుగా నడుస్తున్న విలక్షణ పత్రిక!

రుక్మిణీ కల్యాణ ఘట్టానికి  చిత్రరూపం

చాలా ఏళ్ళ క్రితం ...

హైదరాబాద్ లోని ఒక పత్రికా కార్యాలయానికి  వచ్చిందో యువతి. ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని  ప్రొఫెసర్లు చెప్పారనీ, తన వ్యాసం ప్రచురించమనీ కోరింది.

ఆ  సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.    

ఆమె అందించిన కాగితాలు చూశారు. వాటిమీద పన్నెండు ప్రశ్నలు రాశారు. వాటికి అదే క్రమంలో స్పష్టంగా సమాధానాలు రాసివ్వమన్నారు. అలా చేస్తే వ్యాసం సరిగా తయారవుతుందనీ, అప్పుడు ప్రచురిస్తాననీ తెలిపారు.

అది తన శక్తికి మించిన పని అంటూ ఆమె వెనుదిరిగివెళ్ళిపోవటం వేరే విషయం!

ఆ పత్రికే  ‘మిసిమి’! 

దానిలో ప్రచురించే వ్యాసాల స్థాయి అది. ధన సంపాదన కంటే విజ్ఞాన వ్యాప్తి ప్రధానమనే ఉద్దేశంతో కొనసాగుతోందీ మాసపత్రిక.

కొన్ని సంచికల  కవర్ పేజీలూ,  చిత్రాలూ   చూడండి....   

ఇది తొలి సంచిక

బౌద్ధ ప్రాంగణ ద్వారం


కిరాతార్జునీయం
ఇది నవంబరు 2014 సంచిక
కళలూ, సాహిత్యాంశాలను ప్రచురించే  పత్రికలు ఉండటంలో  పెద్ద విశేషమేమీ లేదు.

కానీ, ఈ పత్రికలో  హేతువాదానికీ, తర్కానికీ, శాస్త్రీయ విశ్లేషణకూ కొంత ప్రాధాన్యం ఉంటుంది.  చిత్ర, శిల్పకళలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది.  అదీ చెప్పుకోదగ్గ విషయం.  ముఖచిత్రం  విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.  

‘మిసిమి’ మాసపత్రిక రజతోత్సవం  నవంబరు 4న హైదరాబాద్ లో జరిగింది. ఒక సాహిత్య సభ  ప్రేక్షకులతో  కిక్కిరిసి హాలంతా నిండుగా ఉండటం నేనదే చూడటం. 

ఈ పత్రిక గురించి  తెలుగు వెలుగు డిసెంబరు 2014 సంచికలో ఓ వ్యాసం - ‘మిసిమిలమిలలు’ రాశాను.


 ఈ లింకు లో ఆ వ్యాసం చూడవచ్చు.

‘తెలుగు వెలుగు’లో  వ్యాసం వచ్చాక...  పాఠకుల నుంచి వచ్చిన ఫోన్లలో  ‘మిసిమి అనే పత్రిక ఒకటి ఉందా? దీని గురించి వినటం ఇదే మొదటిసారి ’ అని చాలామంది  చెప్పారు.

ఆశ్చర్యం కలిగింది!


25 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న పత్రిక పరిస్థితి ఇది!  సినీ టీవీ రంగాల్లో  నిన్న గాక మొన్న ప్రవేశించినవాళ్ళ  గురించి  (ముఖ్యంగా నటులు )  మాత్రం  కోట్ల మందికి  ఇట్టే  తెలిసిపోతుంటుంది.


పాత సంచికలకు ఇదిగో లింక్.. 

 1990 తొలిసంచిక నుంచి 2010 మే సంచిక వరకూ మొత్తం 245  ‘మిసిమి’ సంచికలు  పత్రిక వెబ్ సైట్ లో ఉచితంగా లభ్యమవుతున్నాయి.  ఈ లింకు నుంచి PDF  ఫైళ్ళను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా!
   

4, డిసెంబర్ 2014, గురువారం

‘మహాభారతం’పై రంగనాయకమ్మ పుస్తకం!


‘కల్పవృక్షం’ అని సూతుడు పొగిడిన కథ...  మహా భారతం!

ఇది  లక్షకు పైగా సంస్కృత శ్లోకాల గ్రంథం.  క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటి రచన.

"ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" (యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్)  అనీ,  ‘‘పంచమ వేద’’మనీ ప్రశస్తి పొందింది.
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ,  
అధ్యాత్మవిదులు వేదాంతమనీ,  
నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, 
కవులు మహాకావ్యమనీ; 
లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, 
ఐతిహాసికులు ఇతిహాసమనీ, 
పౌరాణికులు బహుపురాణ సముచ్చయమనీ ...  

ప్రశంసలు కురిపిస్తారనే  పేరు ఈ మహాభారతానికి!

ద్రౌపదీ పాండవుల  మహాప్రస్థాన ఘట్టాన్ని తెలిపే ఈ చిత్రం 19వ శతాబ్ది నాటి  Barddhaman edition of Mahabharata లోనిది.
 
ఈ పొగడ్తల్లో నిజానిజాలెంత?

వేద వ్యాస ముని రాసిన-  ఈ గ్రంథంపై రచయిత్రి  రంగనాయకమ్మ రాసిన క్లుప్త పరిచయం  ‘ఇదండీ మహా భారతం’ పేరుతో  పుస్తకంగా తాజాగా  విడుదలైంది.

వ్యాస మహాభారతానికి ఇంగ్లిష్ వచనానువాదం, కవిత్రయ భారతం , పురిపండా అప్పలస్వామి వ్యావహారికాంధ్ర మహాభారతం పుస్తకాల ఆధారంగా ఈ రచన సాగింది.

 ‘రామాయణ విషవృక్షం’ రాసిన దాదాపు నలబై ఏళ్ళ తర్వాత ‘మహా భారతం’ గురించి ఇప్పుడు  రాశారామె. 

‘‘భారతం కథని యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టే ఇచ్చాను. అసలు కథ ఎలా ఉంటుందో తెలియాలి పాఠకులకు. నా వ్యాఖ్యానాలు నేను వేరే చేసుకున్నాను. అంతేగానీ, అసలు కథలో నేను వేలు పెట్టలేదు.’’  అని ఈ పుస్తకం గురించి ఆమె చెప్పారు.

భారతం-  చరిత్ర అయినా కాకపోయినా ఆ రచనలో ఆ కాలంనాటి  సమాజ పరిస్థితులు ప్రతిబింబించకుండా ఉండవు.

అవెలా ఉన్నాయి?

భారతాన్ని ఇష్టపడి చదివే పాఠకులూ,  ఈ గ్రంథాన్ని  విమర్శనాత్మకంగా చదివే వారూ  కూడా  గమనించని కోణాల్లో..   మార్క్సిస్టు దృక్పథంతో  రంగనాయకమ్మ వ్యాఖ్యానం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు!

 * * * * * 

ఈ పుస్తకంలోని కొన్ని  వాక్యాలూ, వ్యాఖ్యానాలూ...

‘‘ భారతంలో వందలాది కథలు ఉన్నా , ఏ రెండు కథలు చెప్పే అంశాలకీ తేడా లేదు; చెప్పే ధర్మాలకీ తేడా లేదు. అన్నిటి గుణమూ, అన్నిటి సారాంశమూ , ఒకటే.  చాతుర్వర్ణాలూ, రాజుల ఈశ్వరత్వమూ, పురుషులకు భోగాలూ, స్త్రీలకు త్యాగాలూ, అన్ని చోట్లా  అవే.’’

‘‘ భారతం మొత్తంలో ఉన్నదంతా,  చాతుర్వర్ణ  వ్యవస్తా, రాజుల ఆధిపత్య పాలనా, కుప్పల తెప్పల మూఢ విశ్వాసాలూ,  పురుషాధిక్యతా-  ఇవన్నీ కలిసిన దోపిడీ వర్గ భావ జాలమే.’’

‘‘ కవిత్వ వర్ణనల్లో ఎన్ని సొగసులు ఉన్నా, ఆ సొగసులు, చదివేవాళ్ళకి ఏ జ్ఞానాన్నీ ఇవ్వవు. ఆ సొగసులు, చదువరుల్ని   భ్రమల్లోకి  లాక్కుపోతాయి. ఆ సొగసుల్లో వుండే సమాజం ఎటువంటిది- అనేదే చదివేవాళ్ళు గ్రహించాలి.’’

‘‘ మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ  విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా ,  ‘దుర్గ్రంధమే’.’’‘‘ భారతం, ప్రకృతి  సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక  వందల ఏళ్ళ నాటిది. పైగా మూల మూలనా మూఢనమ్మకాలతో , శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణ గ్రంథాలకు చేతులు జోడిస్తున్నామంటే , మనం ఆధునిక మానవులం  కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం.’’

‘‘ తప్పులో  ఒప్పులో, ఆ నాటి రచన అది.  దాన్ని చదవాలి. చర్చించి చూడాలి. మాట్లాడుకోవాలి. లైబ్రరీలో  పెట్టి ఉంచాలి. అంతే. అది అంతకన్నా నిత్య  పారాయణానికి పనికి రాదు.’’

‘‘ ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో  ఆ సంగతి ఆ దేశంలో  జనాలకు నిజంగా తెలిస్తే , వాళ్ళు అదే రకం జీవితాల్లో వుండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా వుండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా వుండలేరు!’’* * * * * 

488
పేజీలతో  రాయల్ సైజులో, హార్డు బౌండుతో. తయారైన ఈ పుస్తకం వాస్తవ ధర కనీసం  రూ.240 ఉండాలి.  కానీ పాఠకులందరికీ అందుబాటులో ఉండటం కోసం  దీని ధరను కేవలం  రూ.100గా  నిర్ణయించారు!

 హైదరాబాద్ లో నవోదయ బుక్ హౌస్ లో ఈ పుస్తకం దొరుకుతుంది. విజయవాడలో  అరుణా పబ్లిషింగ్ హౌస్ ( ఏలూరు రోడ్డు) దగ్గర ప్రతులు లభిస్తాయి. ఫోన్ నంబర్: 0866- 2431181.

 తాజా చేర్పు :  ఈ-బుక్ ఇక్కడ దొరుకుతుంది-   http://kinige.com/book/Idandi%20Maha%20Bharatam

27, నవంబర్ 2014, గురువారం

రణంలో మరణించిన రాణీ రుద్రమ!


పోస్టు టైటిల్ చూసి ‘ఇది కొత్తగా తెలిసిన విషయమా?’  అని  కొందరికైనా అనిపించవచ్చు.  మరీ కొత్తది కాకపోవచ్చు కానీ...

నలబై ఏళ్ల క్రితమే చరిత్రలో నమోదైన వాస్తవమిది! 

*   *   *  

‘‘ వీర రుద్రమదేవి విక్రమించిననాడు
తెలుగు జెండాలు నర్తించె మింట’’    
  - దాశరథి

దాదాపు నూరేళ్ళ క్రితం... 1918లో రాసిన తెలుగు నవల ‘రుద్రమ దేవి’ని  ఈ మధ్య  చదివాను.  రచయిత ఒద్దిరాజు  సీతారామచంద్ర రావు  (1887- 1956).  తెలంగాణ వైతాళికులుగా పేరుపొందిన-  బహుముఖ ప్రజ్ఞాశాలురైన ఒద్దిరాజు సోదరుల్లో ఈయన ఒకరు.

రుద్రమదేవి ఘనత  గురించి స్థూలంగా  తెలుసు గానీ,  ఒక నవలా రూపంలో చదవటం ఇదే తొలిసారి.  1950 ప్రాంతంలో రాసిన  నోరి నరసింహశాస్త్రి గారి నవల బాగా ప్రాచుర్యం పొందినా దాన్నింకా  చదవలేదు.

ఒద్దిరాజు గారి నవల  దానికంటే పాతది.  బహుశా రుద్రమదేవి గురించి తెలుగులో వచ్చిన ప్రథమ నవల ఇదే!

గ్రాంథిక భాషలో రాసిన ఈ ‘ఆఖ్యాయిక’ ను చదవటం కష్టంగా ఏమీ అనిపించలేదు.  (పంచతంత్రాన్ని  చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గార్లు రాసిన గ్రాంథిక  భాషలో చదవటం  ఇష్టపడతాన్నేను.)

కథనం ఆసక్తికరంగా ఉండటంతో పాటు కథా రచనా కాలం దృష్టిలో పెట్టుకుని అప్పటి రచనా విధానాన్ని పరిశీలిస్తూ చదవటం..  బాగుంది కూడా!

ముఖ్యంగా రచనలో ఉపయోగించిన  తెలుగు పలుకుబడులు నాకెంతో నచ్చాయి.

కొమ్ముల గోసిన యెద్దు కోడె కాజాలదు 
పేదకు బిడ్డలెక్కువ
వంట ఇలు జొచ్చిన కుందేలు తప్పిపోగలదా?

 
రుద్రమదేవి  సామాన్యురాలు గాదు.  ఆవులించిన ప్రేవుల లెక్కించును
రుద్రమదేవి మగవారి జంపి పుట్టిన యాడుది
రుద్రమదేవి కనులు తలకెక్కినవి
(ఇవన్నీ..  ఆమె శత్రువుల మాటలు)

చేటెరుగని బోటి! నాకు చక్కట్లు గరపుదానివైతివా?
తలదాకి వచ్చినప్పడుమ్మలించిన లాభము లేదు
కార్యమంతయు వెల్లింగలిపిన చింతపండయ్యె గదా?
ఇంటినుండి పిల్లి యైనను బైట బోలేదని మేము నొక్కి చెప్పగలము


రచనా కాలానికి లభించిన శాసనాలనూ, ఇతర వనరులనూ ఆధారంగా చేసుకుని రాసిన నవల ఇది.  మూడు సంవత్సరాల్లోనే  రెండో ముద్రణకు వచ్చింది.  మూడో ముద్రణ  93 సంవత్సరాల వ్యవధి తర్వాత ... ఈ  సంవత్సరమే ( 2014)  రావటం అసలైన  విశేషం.

రచయిత కుటుంబ సభ్యుల చొరవ దీనికి కారణం!

రుద్రమా- మనవడూ..
రుద్రమదేవి జీవితానికీ,  ఆమె జీవిత చరిత్రకారులకూ,  మనవడి బంధానికీ ఏదో  సంబంధం ఉన్నట్టుంది.

ఆమె తర్వాత కాకతీయ రాజ్యాధికారానికి వచ్చింది ఆమె మనవడైన ప్రతాపరుద్రుడని మనకు తెలుసు.

ఈ రుద్రమదేవి నవల పునర్ముద్రణకు కారకులైన-  రచయిత మనవడు రామ్ కిషన్ రావు,  రచయిత మనవడి మనవడైన శ్రీహర్ష  (యు.ఎస్.లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్)ల  ఫొటోలను చివరి అట్టమీద ఇచ్చారు :)

నవల ముఖచిత్రంగా  కీ.శే.  కొండపల్లి శేషగిరిరావు గారి వర్ణచిత్రాన్ని ఉపయోగించారు.  చూడగానే ఆకట్టుకునేలా ఉందీ బొమ్మ.  తొలి మలి ప్రచురణల్లో ఏ ముఖచిత్రం ఉందో తెలియదు.

వెనిస్ చరిత్రకారుడు మార్కోపోలో రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించి ఆమె పాలన గురించి రికార్డు చేశాడు.  ‘ఈ రాజ్యం  రాజు పాలిస్తున్నట్టు ఉంది కానీ,  స్త్రీ పాలనలా లేదు. ఈమెను రాజు అనక తప్పదు ’ అని ప్రశంసించాడు.

ఆమె రూపంలో కూడా  పురుష లక్షణాలు కొంత ప్రతిఫలించేలా చేసి చిత్రకారుడు .. మార్కోపోలో వ్యాఖ్యను గుర్తుకు తెస్తున్నట్టు లేదూ?  ( పోస్టు ఆరంభంలో ఇచ్చిన- శేషగిరిరావు గారు వేసిన-  బొమ్మను పరిశీలించండి). 

రాజులు ఏళ్ళ తరబడి రాజ్యాలను పాలించటంలో  గొప్పేమీ లేదు.  ఏడొందల సంవత్సరాల క్రితమే ఒక మహిళ మూడు దశాబ్దాలు రాజ్యాధికారంలో కొనసాగటం అరుదైన విషయమే. 

కానీ దానికంటే మించి-  నిరంతరం  యుద్ధాల చికాకులు చుట్టుముట్టినప్పటికీ - సాగునీటి కొరత రాకుండా చెరువులు తవ్వించటం లాంటి మంచి పనులతో  సామాన్య ప్రజలకు మేలు చేసినందుకు ఆమెను శ్లాఘించాలి.  
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదున్న విగ్రహం

ఏడొందల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం...
క్రీ.శ. 1289 సంవత్సరం  నవంబరు 27.  
అంటే ఇవాళ...

రుద్రమదేవి  కన్నుమూసిన  రోజు!

ఈ సంగతి  1974 వరకూ చరిత్రకు అందలేదు. అప్పటివరకూ ఆమె  1295-1296 వరకూ జీవించివుందనే భావించారు.  

అంతే కాదు;   ఆమెది  సహజ మరణమైవుంటుందనే నమ్ముతూ వచ్చారు.

నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలోని చందుపట్ల గ్రామంలో  శివాలయ ప్రాంగణంలో కనిపించిన  శిలా శాసనం  ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది.

ఈ  శాసనంలో  రుద్రమదేవి నిర్యాణం గురించిన  ప్రస్తావన ఉంది. 

యుద్ధంలో మరణించినట్టు  ఆ శాసనంలో  లేదు. రాజు (రాణి) తో పాటు సేనాధిపతి ఒకే సమయంలో చనిపోవటం కేవలం యుద్ధ సమయంలోనే జరిగే అవకాశం ఉంది  ఆ రకంగా రుద్రమదేవి యుద్ధ సందర్భంలోనే చనిపోయివుండాలి.     

భారతి మే 1974 సంచికలో  చరిత్ర పరిశోోధకుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి గారు  ఈ విషయాలను చర్చిస్తూ  సవివరంగా వ్యాసం రాయటంతో  ఈ సంగతి ప్రపంచానికి తెలిసింది.


రుద్రమదేవి... తన అధికారాన్ని ధిక్కరించిన  అంబదేవుడిపై   యుద్ధానికి వెళ్ళి  సేనాధిపతి మల్లికార్జున నాయునితో సహా  రణరంగంలో మరణించిందనే సంగతి  వెల్లడైంది!

శిలా శాసనం  ప్రస్తుతం ఇలా ఉంది  (హిందూ పత్రిక  సౌజన్యంతో)
ఆగ్రహించిన  ప్రతాపరుద్రుడు  అంబదేవుణ్ణి  తరిమికొట్టి-  అతడి వంశాన్ని (కాయస్థ వంశాన్ని)  సమూలంగా నిర్మూలించాడట.

(వ్యక్తుల మీద పగ... వారి కుటుంబాలనే కాకుండా,  చివరకు వంశాన్నే  నాశనం చేసేలా  ప్రేరేపిస్తుందన్నమాట...)   

ఈ  తుది సమరం  చేసినపుడు రుద్రమదేవి వయసు.. 80 సంవత్సరాలు!

ఆ వయసులో రుద్రమ యుద్ధానికి వెళ్తుంటే యువకుడైన  ప్రతాపరుద్రుడు గానీ, మరెవరు గానీ  వద్దని వారించలేదా? ఆమె యుద్ధరంగంలోనే చనిపోయిందా? అక్కడ గాయపడి తర్వాత  మరణించిందా?

ఇవన్నీ తీరని సందేహాలే! 
           

30, అక్టోబర్ 2014, గురువారం

బ్రహ్మన్న బొమ్మా.... నా అన్వేషణా!

చూసీ చూడగానే ఆకట్టుకుంది. మనసులో ముద్రించుకుపోయింది.

కాలం గడుస్తున్నా వెంటాడింది!

అదో వర్ణ చిత్రం..
‘బ్రహ్మనాయుడి’ రూపం!

మా. గోఖలే గీసిన ఆ పెయింటింగ్... ఒరిజినల్ ని ఇంకా చూడలేదు.  ఫొటో మాత్రమే చూశాను.

ఆ చిత్రం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం  పెరుగుతూవచ్చింది.

మాధవపెద్ది గోఖలే
 1999లో  ‘ఆంధ్రప్రభ’ వాళ్ళు తెలుగు సినిమా విశేషాలతో ‘మోహిని’ పేరుతో రెండు పుస్తకాలు వేశారు. రెండో పుస్తకంలో మా. గోఖలే గురించి చిత్రకారుడు ఎస్.వి. రామారావు రాసిన వ్యాసం యథాలాపంగా చదివాను;  మర్చిపోయాను.

ఆ వ్యాసం టైటిల్ కింద బ్రహ్మనాయుడు పెయింటింగ్ ని  ఇచ్చారు... బహుశా మొదటిసారి ఈ బొమ్మను అక్కడే చూశాను.

తర్వాతి కాలంలో ముఖ్యంగా చిత్రకారుడిగా మా. గోఖలే వివరాల కోసం అన్వేషిస్తుంటే ఒక్కోటీ తెలుస్తూవచ్చాయి.

‘మాయాబజార్’ సినిమా కళాదర్శకుడిగా ఘటోత్కచ,  శ్రీకృష్ణ  పాత్రలకు ఆకట్టుకునేలా రూపురేఖలను సమకూర్చటం,  ముఖ్యంగా ‘మహాప్రస్థానం’ పుస్తకానికి  ఉత్తేజకరమైన ముఖచిత్రం గీయటం,  చందమామలో ‘బాలనాగమ్మ’ సీరియల్ కి బొమ్మలు వేయటం.... ఇవన్నీ. 

ఈ విశేషాలను అందరితో పంచుకోవటం కోసం ఈ బ్లాగులో రెండేళ్ళ క్రితం  వరసగా రెండు పోస్టులు కూడా రాశాను.

వాటిలో ఒకదానిలో  ‘బ్రహ్మనాయుడు’బ్లాక్ అండ్ వైట్ బొమ్మను కూడా ఇచ్చాను.

ఆ పోస్టుకు ‘కమనీయం’ ఓ వ్యాఖ్య రాస్తూ  ‘మా. గోఖలే చిత్రించిన బ్రహ్మనాయుడి వర్ణ చిత్రం ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది’  అంటూ సమాచారం తెలిపారు.

అక్కడితో ఆ బొమ్మ గురించిన ఆలోచనలు ఆగిపోలేదు!

ళ్ళీ ఈ మధ్య ‘మోహిని’ దొరికింది.

ఎస్.వి. రామారావు వ్యాసం మళ్ళీ  చదివాను. ఈసారి నాకు పరిచితుడైన ‘గోఖలే’గురించి మరిన్ని విశేషాలు తెలిశాయి. బ్రహ్మనాయుడి చిత్రం గురించి విశిష్ట చిత్రకారుడైన ఎస్. వి. రామారావు అభిప్రాయం కూడా దీనిలో ఉంది.

కానీ...
ఓ కొత్త సందేహం పుట్టుకొచ్చింది!

 ఆ వ్యాసంలో ఇలా ఉంది-

‘(గోఖలే) ఇంట్లో ఆయన వేసిన ‘బ్రహ్మన్న’ పెయింటింగ్ ఉండేది. అది ఎందరో చిత్రకారులకు స్ఫూర్తిదాయకంగా ఉండేది. ‘జీవం’ ఉట్టిపడేట్టు ఉండేది. రాయలసీమ ప్రాంతానికి చెందిన భూమిపుత్రుడు బ్రహ్మన్న బాసంపట్టు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిన ఆ భంగిమను చూస్తే ఎన్నెన్నో విషయాలు మనసులో మెదిలేవి’
 

ఇప్పటిదాకా ఈ బొమ్మ పల్నాటి బ్రహ్మనాయుడిది అనుకుంటున్నాను కదా? 

కాదా?

ఈ బ్రహ్మన్న ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  రాయలసీమ చరిత్ర, సాంస్కృతిక వివరాలూ స్థూలంగా పరిశీలించాను. ఎక్కడా బ్రహ్మన్న పేరే కనపడలేదు.

అయినప్పటికీ ... స్వయంగా చిత్రకారుడైన ఎస్.వి. రామారావు తను ఇంతగా వర్ణించిన గోఖలే చిత్రం విషయంలో  పొరబడివుంటారని అనుకోలేకపోయాను.

పల్నాటి బ్రహ్మనాయుడి ప్రధాన ఆయుధం పేరు ‘కుంతం’ అని చదివాను. 

శిల్పులు దీన్ని  రెండు రకాలుగా  చెక్కుతున్నారు...

ఒకటి-  చివర్లో  U ఆకారం ఉన్న ఈటె.  ఆ రెండు చివరలూ చెరోవేపూ మొనదేలివుండటం.

 హైదరాబాద్  ట్యాంక్ బండ్ మీద పెట్టిన బ్రహ్మనాయుడు విగ్రహంలో అలాగే ఉంది. 

ఎన్టీఆర్  నటించిన పల్నాటి యుద్ధం సినిమాలో  దాదాపు ఇలాంటి ఆయుధాన్నే  చూపించారు.


పల్నాటి యుద్ధం జరిగిన   ప్రదేశం ... కారంపూడి ఊరి మధ్యలో  బ్రహ్మనాయుడి విగ్రహం  ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం చేతిలోని ఆయుధం మాత్రం  మరో రకంగా ఉంది. 
 
చూడండి...  ఆ  విగ్రహం !  కానీ..  గోఖలే వేసిన బొమ్మలో  పొడవాటి ఖడ్గం కదా  ఉన్నదీ? 

అందుకే  ఆ  బొమ్మ-  పల్నాటి బ్రహ్మన్నది  కాకపోవచ్చనే అనుకున్నా.

లోపు-  కిందటి సంవత్సరం జనవరిలో  కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట వెంకట అప్పారావు)  తన బ్లాగులో  బహ్మనాయుడి  బొమ్మను  ప్రచురించారు...  ‘భారతి’ పత్రిక  నుంచి సేకరించానంటూ!

ఇప్పటివరకూ  నేను  చూసిన బొమ్మల్లో  క్వాలిటీ పరంగా ఇదే  అత్యుత్తమం!  (దీన్ని చివర్లో చూద్దాం) .


అయితే ఇది  ఆంధ్రపత్రికలోది కాదా? భారతి పత్రికలోదా? భారతిలో ప్రచురించివుంటే  ఏ నెల? ఏ సంవత్సరం? అనే వివరాలు అప్పారావు గారి దగ్గర కూడా దొరకలేదు.

ఇలా కొత్త సందేహాలు...

మిసిమి పత్రిక 1992 అక్టోబరు సంచికలో  ఇదే బొమ్మను ముఖచిత్రంగా వేసింది. 
ఆ సంచికలో ఈ బొమ్మ వివరాలుంటాయని ఆశపడ్డాను.  ఏమీ లేవు.  పైగా ‘ముఖచిత్రం మాదవపెద్ది ఘోఖలే’  అంటూ ఆయన పేరు రెండు తప్పులతో అక్కడ కనపడింది!

హతవిధీ... అనుకోవాల్సివచ్చింది!

ఈ లోపు  ఈ సబ్జెక్టు గురించి బ్లాగు పోస్టు రాయాలనిపించింది.
ఆ ఆలోచన రాగానే నా సందేహాలు తీర్చుకోవటానికి  ప్రయత్నించాను.

ఈ క్రమంలో...  తెలుగు విశ్వవిద్యాలయం 1995లో ప్రచురించిన పుస్తకం చూశాను. మొదలి నాగభూషణశర్మ, ముదిగొండ వీరభద్రశాస్త్రి సంపాదకులుగా తెచ్చిన ఈ పుస్తకం పేరు History and culture of the Andhras. 

183 వ పేజీ మొత్తం గోఖలే బ్రహ్మనాయుడు బొమ్మను  (బ్లాక్ అండ్ వైట్ )  ప్రచురించారు.

ఆ ముందుపేజీలో  పల్నాటి బ్రహ్మనాయుడి వివరాలు ఉన్నాయి.

అంటే ఆ బొమ్మ  పల్నాటి బ్రహ్మనాయుడిదేనని ఆ ప్రచురణకర్తలు కూడా భావించారన్నమాటే కదా?

ఆ పుస్తక ప్రచురణ నాటికి గోఖలే చనిపోయారు (1981). 

రాయలసీమ బ్రహ్మన్నా?  పల్నాటి బ్రహ్మన్నా?
ఏమీ నిర్థారణ కాలేదు.

కొ.కు. నా సాయానికొచ్చారు!
ఇంతలో... విరసం ప్రచురించిన కొడవటిగంటి రచనా ప్రపంచంలోని ‘సాహిత్య వ్యాసాలు’ రెండు పుస్తకాలుగా కొరియర్ లో వచ్చాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన  ‘నాయకురాలు’నాటకంపై ఆంధ్రప్రభలో కొ.కు.  చేసిన సమీక్ష  ఓ పుస్తకంలో  ఉంది. నాయకురాలు నాగమ్మ ఉంటే బ్రహ్మనాయుడు కూడా ఉండాల్సిందే కదా? 

నాక్కావలసిన సమాచారం సమీక్ష చివర్లో కనపడి చాలా సంతోషం వేసింది.

‘.. అట్ట మీద గోఖలే బ్రహ్మనాయుడి చిత్రానికి అనుకరణ ఉన్నది’(ఆంధ్రప్రభ వారపత్రిక 25.4.1970).

అనుకరణ బొమ్మ సంగతి అటుంచి... గోఖలే వేసింది పల్నాటి బ్రహ్మనాయుడనటంలో సందేహం లేదన్నమాట...

ఈ విషయం సాక్షాత్తూ  కొడవటిగంటి కుటుంబరావు సర్టిఫై చేసినట్టయింది.  (గోఖలేతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉంది మరి) .

చిక్కుముడి వీడింది...!

 ఈ బొమ్మ గురించి చిత్రకారుడు ఎస్.వి.రామారావు గారు ఇంకా ఏమని వర్ణించారో చూడండి-


‘... మట్టి రంగులతో చిత్రించిన ఆ పెయింటింగ్ లో వీరుని పౌరుషం స్పష్టంగా కనిపించేది. అతని ముందు డాలు, ఒరలో కత్తి, తలకు పాగా, పంచె తెలుగుదనం ఆ ఆకారంలో కొట్టొచ్చినట్టు కనిపించేది. ఆ బొమ్మకు చారిత్రక న్యాయం చేకూర్చాలన్న తపనతో గీసినట్టు ప్రస్ఫుటంగా కనిపించేది. ’

‘అలా ఆయన ఎన్నో ఎన్నెన్నో మరపురాని, మరువలేని చిత్రాలను గీశారు.  స్కెచ్ లు వేశారు. అవి చాలావరకు తెలుగువారికి  తెలియకపోవడం దురదృస్టకరం. వాటర్ కలర్స్ లో,  ఆయిల్ కలర్స్ లో ఆయన అపురూప చిత్రాలను గీశారు. వాటి ఎవాల్యుయేషన్ జరగనేలేదు.’


ఈ పెయింటింగ్ ను  అమ్మటానికి గోఖలే ఇష్టపడలేదట. 

‘నాన్న పెయింటింగ్స్ ‘బ్రహ్మనాయుడు’, ‘బొబ్బిలి మల్లన్న’, ‘పావురాలు’ ఆనాటి ప్రఖ్యాత నటులు కొందరు చాలా నచ్చి కొందామని ప్రయత్నించారు. వారు ఎంత మొత్తం చెప్పినా నాన్న అంగీకరించలేదు’ అని గోఖలే రెండో కుమార్తె  ఉపాధ్యాయుల జ్యోతి 2009 లో ‘మా నాన్నగారు’సంకలనంలోని వ్యాసంలో గుర్తు చేసుకున్నారు.

సరే.. ఇంతకీ కొడవటిగంటి  చెప్పిన  అనుకరణ  ముఖచిత్రం ఎలా ఉంటుందో చూడాలని ఉబలాటపడ్డాను. నెట్ లో... కొద్దిసేపట్లోనే దొరికింది!
                          
 

అదే ఇది...

ఈ నాయకురాలు నాటకం 1969 ప్రచురణ.

తొలిసారి 1926లో ప్రచురితమైనపుడు ఏ బొమ్మ ఉండేదో మరి!


రెండు తెలుగు సినిమాల్లో...
పల్నాటియుద్ధం సినిమాను తెలుగులో రెండు సార్లు తీశారు.

1947లో  తీసిన సినిమాలో  బ్రహ్మనాయుడుగా గోవిందరాజు సుబ్బారావు నటించారు. (బాలచంద్రుడు అక్కినేని) .


1966లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడు ఎన్టీ రామారావు. (బాలచంద్రుడు హరనాథ్) .

వీరిద్దరి ఆహార్యం స్థూలంగా చూస్తే దాదాపు ఒకే విధంగా అనిపిస్తుంది.  తలపాగా, పెద్ద మీసాలు, పూసల దండలు మొదలైనవి.

ఇద్దరిలో  ఎన్టీఆర్ వేషం మాత్రం కొంత మెరుగుపరిచినట్టు ఉంటుంది.

గోఖలే వర్ణచిత్ర  ప్రభావం పల్నాటియుద్ధం (1966) సినిమాలోని  బ్రహ్మనాయుడి  ‘రూప’కల్పనలో ఏమైనా ఉందా అనే ఆలోచన వచ్చింది.

ఎవరు ఈ  సినిమాకు కళాదర్శకుడు?

టైటిల్స్ చూస్తే...  కనపడింది... ఆ కళాదర్శకుడు సాక్షాత్తూ... మా.గోఖలే! 

గోఖలే కళాదర్శకత్వం గురించి నెట్ లో అందుబాటులో ఉన్న వివరాల్లో ఈ సినిమా పేరు ఎక్కడా కనపడదు. అదో విచిత్రం!
 
 భారతి/ ఆంధ్రపత్రిక లో ప్రచురితమై నన్ను ఆకట్టుకున్న బ్రహ్మనాయుడి  బొమ్మ  ఇదిగో.. (కార్టూనిస్టు సురేఖ గారి సౌజన్యంతో...) 


 బ్రహ్మన్న ఘనత ఏమిటి?
అమానుషమైన కుల వ్యవస్థ మీద 12వ శతాబ్దంలోనే యుద్ధం ప్రకటించినవాడు పల్నాటి బ్రహ్మన్న!  ‘చాప కూడు’ పేరుతో అన్ని కులాలవారికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సంస్కర్త.

కుల వ్యవస్థ ఇప్పటికంటే  ఘోరంగా ఘనీభవించివున్న అన్ని వందల సంవత్సరాల క్రితం నిమ్నకులాల వారిని ఆదరించటం, ఇలాంటి ఒక ప్రయత్నం చేయటం సామాన్యమైన సంగతి కాదు.  మానవత, సమతా భావాలతో పాటు ఎంతో సాహసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!

తెలుగు విశ్వవిద్యాలయం  ‘తెలుగు వైతాళికులు’ సిరీస్ లో  1988లో బ్రహ్మనాయుడు పుస్తకం ప్రచురించింది.

దాన్ని ఇక్కడ చదవొచ్చు...
   

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ముఖచిత్ర వివాదం - బాపు Vs రంగనాయకమ్మ!


బాపు గీసిన బొమ్మల్లోని అందం, వైవిధ్యం నాకు ఇష్టం. 
ఆయన వేసిన కార్టూన్లలో గిలిగింతలు పెట్టే హాస్యం, క్యాప్షన్ల సహజత్వం నచ్చుతాయి.

బాపు తీసిన కొన్ని సినిమాల్లోని కళాత్మకత ; ఆయన దస్తూరి ఒరిజినాలిటీ, ప్రయోగశీలత- ఇవన్నీ బాగుంటాయి.

బాపు ముఖచిత్రంతో కొత్త పత్రికలు ప్రారంభించటం తెలుగునాట ఓ సంప్రదాయంగా కొనసాగింది.

తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా చక్కని బొమ్మలు వేశారు బాపు. 

‘మహా ప్రస్థానం’లోని ‘ఋక్కులు’ కవితకు కవి శ్రీశ్రీని హంస వాహనుడైన చతుర్ముఖ బ్రహ్మగా వేశారు.

  త్రిపురనేని రామస్వామి  ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడిలా  విషాదయోగంలో కూర్చుని ఉండగా రచయిత  రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు.

 ( పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన గీతోపదేశమే ఈ భగవద్గీత. ‘శకటములందెల్ల ధూమశకటము నేనే.. యెడారులలోన సహారా యెడారిని నేనే..  పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’- ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన).

 .   భాగవతంలోని పోతన  ప్రసిద్ధ పద్యం ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’ చాలామందికి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించి  ఓ  కార్టూన్ వేశారు.  హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ.

వీటిలోని  చమత్కారం బోధపడక  కోపాలు తెచ్చేసుకుని  నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు. కానీ  కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం.  తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు!     

ఎవరినీ నొప్పించని సున్నిత మనస్కుడిగా - వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా అభిమానులు  ఆయన్ను చెపుతుంటారు. కానీ  ఆయన ‘అలా చేసివుండకూడదు’ అని గట్టిగా అనిపించే  సందర్భం ఒకటుంది. అది రంగనాయకమ్మ రచన ‘రామాయణ విషవృక్షం’ పుస్తకానికి బాపు ముఖచిత్రం వేయటానికి నిరాకరించిన తీరు గురించినది. 

* * *

అసలు జరిగిందేమిటి?
నలబై ఏళ్ళ క్రితం... 1974లో రామాయణ విషవృక్షం తొలి భాగం ప్రచురణ జరిగింది. రచయిత్రి నవలలు కొన్నిటికి అప్పటికే బాపు ముఖచిత్రాలు వేసివున్నారు.

దీంతో  బాపును విషవృక్షానికి ముఖచిత్రం వేయమని ఆమె అడిగారు. దానిలో ఏయే అంశాలు ఉండాలని భావిస్తున్నదీ ఉత్తరంలో  వివరించారు.

కానీ  ‘‘అంతంత ఎత్తయిన, గొప్పవయిన, ఆలోచనలు నా బోటివారు అర్థం చేసుకుని బొమ్మ వెయ్యడం సాధ్యం కాని పని’’ అని బాపు జవాబు ఇచ్చారు. ఆమె పంపిన డిమాండ్ డ్రాఫ్టు వెనక పెద్ద అక్షరాలతో  ‘‘రామ- రామ’’ అని రాసి తిప్పి పంపారు. 

దీని గురించి ‘రామాయణ విషవృక్షం’ మొదటి భాగంలో రచయిత్రి  ఇలా రాశారు-
దీనిలో బాపు పేరును ఆమె ప్రస్తావించలేదు.  ‘ఒక చిత్రకారుడు గారు’ అని మాత్రమే అన్నారు.  ఆ చిత్రకారుడు ఎవరో  కొందరు ఊహించినప్పటికీ... చాలామంది పాఠకులకు స్పష్టంగా తెలియదు.

దాదాపు మరో 20 సంవత్సరాల తర్వాత  బాపు రాసిన వ్యాసం ద్వారా ఆ చిత్రకారుడు ఆయనేనని పాఠకులకు అర్థమైంది.  ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రత్యేక సంచికలో రాసిన ఆ వ్యాసంలో ఆయన ఇలా రాశారు-  
   
‘‘... ఇంకో సంఘటన - డబ్బులొచ్చాయి. కానీ సబ్జెక్టు కష్టం! రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా ‘రామాయణ విషవృక్షం’ అన్న పుస్తకం- ముఖచిత్రానికి చెక్కు పంపారు. అంత గొప్ప రైటరు? ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానం వహించిన ఆ గ్రంథాన్ని ఇలా  అర్థం చేసుకున్నారా అని చెక్కు వెనక  రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా. అది ఆ గొప్ప రచయిత రచనా సామర్థ్యం మీద కామెంట్ కాదు. కేవలం జాలి. ’’

‘రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా..’-
రామాయణ కల్పవృక్షానికీ, రామాయణ విషవృక్షానికీ సంబంధమే లేదు. కేవలం పేర్లలో కల్పవృక్షం- విషవృక్షం అనే మాటలను బట్టి బాపు  ఇలా పొరపడ్డారు. ఈయనే కాదు; ఎంతోమంది సాహితీకారులూ , పాఠకులూ కూడా విశ్వనాథ  కల్పవృక్షంపై విమర్శగా రంగనాయకమ్మ విషవృక్షం రాశారని భావిస్తుంటారు. విషవృక్షాన్ని చదవకుండా, దానిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా  ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలివి.

‘చెక్కు వెనక రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా.’-
చెక్కు కాదు; డీడీ! ఇన్ని సంవత్సరాల్లో  చెక్కో, డీడీయో ఆయన మర్చిపోయారన్నమాట. 

ఒక పుస్తకాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు. రామాయణాన్ని మార్క్సిస్టులు ఆ దృష్టికోణంలోనే చూస్తారు. వారు భక్తుల కోణంలో చూడలేదని ఆశ్చర్యపడటంలో, జాలిపడటంలో అర్థం ఏముంటుంది? (రచయిత్రి  పవని నిర్మల ప్రభావతి  రామాయణాన్నీ; రామాయణ విషవృక్షాన్నీకూడా సమానంగా ఇష్టపడతారు. ఇదో మినహాయింపు).  

రామాయణ విషవృక్షానికి బొమ్మ వేయటం తనకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్నేబాపు ... రచయిత్రికి  వ్యంగ్యాలేమీ లేకుండా సూటిగా/ మర్యాదగా/ సున్నితంగా చెప్పివుండాల్సింది. డీడీని కూడా యథాతథంగా వెనక్కిపంపివుండాల్సింది.  ‘తాను స్వీకరించదలచని’ డీడీ మీద ఏ రాతలైనా ఆయన ఎలా రాయగలిగారు?  

 


 బాపు వ్యాసం వచ్చాక...  గుంటూరు నుంచి ఎస్.వి. రాజ్యలక్ష్మి  అనే గుంటూరు  పాఠకురాలు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనే  ఓ లేఖ రాశారు-

 ‘బొమ్మలు వేయించుకున్న పబ్లిషర్లెందరో డబ్బు ఇచ్చేటపుడు ఇబ్బంది పెట్టేవారని ఆయనే చెప్పుకున్నారు. అలాంటి మనుషుల మధ్య , రంగనాయకమ్మ బొమ్మ వెయ్యకముందే చెక్కు పంపించారంటే, అది ఆమె సంస్కారానికి గుర్తుగా కనపడుతోంది.  ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’

ఈ ఉత్తరం బాపు చూశారో లేదో గానీ ఆయన ఆ వివాదంలో తన వైఖరికే చివరివరకూ కట్టుబడివున్నారని అర్థమవుతోంది.  ముఖీ మీడియా వారు  బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక ( 2011)  వేస్తూ దానిలో  ఈ వ్యాసం పున: ప్రచురించటమే దీనికి రుజువు. (ప్రచురణకర్తలు బాపుకు చెప్పివుంటారు కదా... ఆ వ్యాసాన్ని వేస్తున్నామని...)   ‘కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా విషవృక్షం..’ అనే factual error కూడా ఆయన ఇన్నేళ్ళుగా గమనించనేలేదన్నమాట.  ఆయన  సన్నిహితులూ,  సాహితీ మిత్రులూ కూడా దీన్ని ఆయనతో ప్రస్తావించివుండకపోవటం విచిత్రం! 

జరిగింది ఇదీ !

బాపు కన్నుమూశాక ఆయన గురించి ప్రసారం చేసిన/ ప్రచురించిన టీవీలూ, కొన్ని పత్రికలూ, సంస్మరణ సభల్లో  కొందరూ  ఈ సంఘటనను ప్రస్తావించటం గమనించాను.  తనది కాని డీడీ వెనక రాతలు రాసి వెనక్కి పంపించటం సరికాదని వీరెవరికీ అనిపించలేదు. పైగా అలా చేయటంపై  ప్రశంసలు కూడా కురిపించారు .  ‘విలువలకు కట్టుబడటం’!  'ఈ పని నేను చెయ్యను అని చెప్పీ చెప్పకుండా చెప్పటం’! ‘నిజ జీవిత సమయస్ఫూర్తీ’, ‘తరగని రామభక్తీ’!...  ఈ రకంగా!   

కళాకారుడిగా బాపు కృషిని అభిమానించటం వేరు; ఒక ప్రత్యేక సందర్భంలో ఆయన తీరుపై విమర్శగా ఉండటం వేరు! దీనికి ఆయన సజీవంగా ఉన్నారా లేదా అన్నదానితో నిమిత్తం లేదు.   

* * *
కల్పవృక్షం... ఖండనం
సందర్భం వచ్చింది కాబట్టి  ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి కొన్ని విషయాలు...  

విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు. ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య అన్నికాండల ముద్రణా పూర్తయింది.

ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు.  ఈ విమర్శ  ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది.  దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి  జ్ఞానపీఠ బహుమతి వచ్చింది!

మరి ‘రామాయణ విషవృక్షం’ సంగతేమిటి?  ఇది వాల్మీకి రచించిన రామాయణంపై మార్క్సిస్టు దృక్పథంతో చేసిన పరిశీలన, విమర్శ.  ఇది వ్యాసాలుగా కాకుండా.. కథల  రూపంలో ఉంటుంది. అవసరమైనచోట వాల్మీకి మూలగ్రంథంలోని  శ్లోకాలూ, వాటి తెలుగు అర్థ తాత్పర్యాలూ, వివరణలూ ఫుట్ నోట్లుగా ఉంటాయి. ఈ పుస్తకానికి  ముఖచిత్రం అందించిన చిత్రకారుడు త్రిగుణ్!

31, ఆగస్టు 2014, ఆదివారం

రమణకు అపురూప నివాళి... ‘కొసరు కొమ్మచ్చి’!హుషారున్నరగా కోతి కొమ్మచ్చిలాడుతూ మూడు భాగాల్లో ఆత్మకథను విలక్షణంగా చెప్పుకొచ్చిన రమణ... ఆ తర్వాత ‘రాయడానికి ఉత్సాహంగా లేదండీ’ అంటూ వాయిదాలు వేస్తూ , ‘విషయాల్లో స్పైస్ లేనప్పుడు ఏం  రాస్తాం? ఫ్లాట్ గా వుంటుంది కదా?’ అని వాదిస్తూ వచ్చారు.

రాయాల్సింది ఇంకా ఎంతో ఉండగానే 2011 ఫిబ్రవరి 23న కన్నుమూశారు.  

ఆ లోటు తీర్చడానికి  ఆయన కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, అభిమానులూ చేసిన ప్రయత్నం  ‘కొసరు కొమ్మచ్చి’గా మనముందుకొచ్చింది!  ఆటో బయాగ్రఫీ ... అనివార్యంగా బయాగ్రఫీ రూపంలోకి మారింది.

***   ***   ***

కోతికొమ్మచ్చి, (ఇం)కోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి - ఈ మూడు పుస్తకాలూ చదివేసినవారికి దీనిలో కొన్ని విషయాలు ‘తెలిసినవే  కదా! ’అనిపిస్తాయి.  కానీ ఇవి మరో కోణంలో నుంచి చెప్పినవి కాబట్టి చర్విత చర్వణం అనిపించదు.  

‘నాన్న అల్ప సంతోషి’ అంటారు ముళ్ళపూడి వర. 

‘మామ (బాపు) రామాయణ గాధలు, నాన్న జీవిత కధలు ఈ రోజుకీ మాకే కాధు, మా పిల్లలకి కూడా ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్సు’ అంటారు ముళ్ళపూడి అనూరాధ.

‘ఏడుపొస్తున్నపుడు నవ్విన హీరో’ అని తల్చుకుంటారు ఆయన శ్రీమతి ముళ్ళపూడి  శ్రీదేవి. 

ఎప్పుడో దశాబ్దాల క్రితం నాటి రమణ రచనలు కాలగర్భంలో కలిసిపోకుండా తవ్వితీసి, పేర్చి, కూర్చి ‘సాహితీ సర్వస్వం’ సంపుటాలుగా వెలుగులోకి తెచ్చిన ఎమ్బీఎస్  ప్రసాద్  రమణంటే ‘పడి చచ్చేవాళ్లలో’ ఒకరు.

‘ముక్కోతి కొమ్మచ్చి’ పుస్తకంగా రాకముందే తర్వాత రాయాల్సినవి ఎన్నో ఉన్నాయని గుర్తుచేసి, రాయమని బతిమాలి,  వేధించి కూడా సాధించలేకపోయారు. అందుకే రమణను   ‘మహా మొండి మనిషి’  అంటారాయన.

ఇక సీతారాముడు - బాపు రమణల ఆప్త మిత్రుడు!  ఓ  సరదా సంగతి  ‘రమణని కలుసుకున్నపుడు చెపితే రోజంతా నవ్వుతూనే వున్నాడు- రాస్కెల్!’ అంటారు.  ‘చెయ్యి చాచితే చాలు, జేబులో చేతికందినది తీసి ఇచ్చేస్తాడు రమణ’  అంటూ దాన గుణం గురించి ఉదాహరణలు చెప్పారు. 

నాకెంతో ఇష్టమైన ‘అందాల రాముడు’ నిర్మాణ విశేషాలను పంచుకున్నారు.

 బాపు రమణలకిష్టులైన ఎమ్వీయల్, శ్రీరమణల గురించి కొన్ని సంగతులు  రాశారు. 

***   ***   ***

పుస్తకంలో బాపు గీసిన బొమ్మలతో పాటు సందర్భోచితమైన ఛాయాచిత్రాలు చాలా ఉన్నాయి. దీన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దటానికి   ‘హాసం ప్రచురణల’ నిర్వాహకులు ఎంతో  శ్రమించారు. 

ఈ  పుస్తకంలో రమణ గారి అమ్మాయి అనూరాధ రాసిన ‘నాన్న మామ మేము అను తోక కొమ్మచ్చి’కి  ఎక్కువ మార్కులు వేస్తాను. తండ్రి  శైలి అనుకరిస్తూ  ఆమె  ఎంతో ఈజ్ తో రాశారు.  (ఈ వ్యాసం 2012లోనే స్వాతి వార పత్రికలో వచ్చింది...).

కొన్ని వాక్యాలు చూడండి-

‘‘పంతాలు, కోపాలు, ఆర్గ్యుమెంట్లు, సెంటిమెంట్లు, నాన్న స్క్రిప్టులా, మామ కార్టూనులా, మహదేవన్ గారి బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సహా 35 ఎమ్మెమ్ ఈస్ట్మన్ కలర్ సినిమాలా వుండేది, మా ఇల్లు’’

 ‘‘పెద్దావిడ, పెంచిన ప్రాణం, జీవన సత్యాలు నేర్పిన తల్లి/ గురువుకా? లేక, అంత పెద్దింటి పిల్ల, సొంతాలన్నీ వొదులుకుని, తన ఒక్కగానొక్క స్నేహితుడిని నమ్మి వొచ్చిన ఇంటి కోడలికా? లేక, ‘లేదు’ అన్న మాటకి అర్ధం తెలీని పసిగుడ్డు, దేశ సేవలకోసం వారమంతా కష్టపడి, చెమటోడ్చి స్కూలుకి వెళ్ళొచ్చి, ఉద్ధరించిన సొంత కూతురికా??? ఆ సమస్యకి, మేము ముగ్గురం – అహా యెంత  గొప్పవాడో, నా తరఫునే జడ్జిమెంట్ ఇచ్చాడు/ రు అనే అనుకునేవాళ్ళం. అదీ ముళ్లపూడి గారి మాయ.’’

‘‘అత్త అంటే నాన్నకి చాలా గౌరవము…  దాని కంటే యెక్కువ… గారాబం. నాకంటే కూడా! ఒట్టు! డాడ్ ప్రామిస్! ’’
(గాడ్ ప్రామిస్ ను ఎలా పన్ చేశారో చూశారా?)

 ‘‘ఇక మిగిలింది రాక్షసి పొజిషన్. తప్పనిసరై ఆ భారం నేను నెత్తిన వేసుకున్నాను. కొన్ని సార్లు ఫామిలీ కోసం యెంతైనా శాక్రిఫైస్ చెయ్యాలికదా.’’

‘‘నా చిన్నప్పుడు, అంటే చాలా చిన్నప్పుడు, నన్ను పొద్దున్నే ఆరు గంటలకి స్కూలుకి రెడీ అవ్వడానికి అమ్మ లేపేది.  అప్పుడు చూస్తే, నాన్న మంచం మీద పడుకుని వుండేవారు. అమ్మా! నన్ను మట్టుకు స్కూలుకి పంపుతున్నావు, నాన్న మట్టుకు ఇంకా పడుకునే వున్నారు… అని భూపాల రాగం మొదలుపెట్టేదాన్ని. షుష్. నాన్న పని చేసుకుంటున్నారు. వాట్? పని? అంటే వర్క్? కాం? వెలై? ఆహా, జన్మలో చేస్తే ఇల్లాంటి పనే చెయ్యాలి నా సామిరంగా, అనుకునేదాన్ని. చాల యేళ్ళ తరవాత తెలిసింధి… నాన్న, నిజంగానే పని చేసేవారని.’’
 
‘‘పెద్దయ్యాక యెన్ని ఊళ్ళు తిరిగినా, యెన్ని కల్చర్స్  ఎక్స్‌పీరియన్స్ చేసినా, ఇంత సంపూర్ణంగా, రెండు చేతులతో జీవితాన్ని ఇంత మనస్ఫూర్తిగా వెల్కం చేసిన ఇద్ధరు వ్యక్తుల్ని నేనైతే యెక్కడా చూడలేదు.’’


***   ***   ***

మణ ‘గురించి’ ఎంచక్కటి విశేషాలూ, విషయాలూ ఉన్నప్పటికీ ఆయన ‘రాసినవి’ లేవు కదా అని నిరాశపడేవారికి పుస్తకం పొడవునా వచ్చే రమణ సంభాషణల్లోని,  రచనల్లోని మెరుపు కోట్స్ కొంత సంతృప్తి కలిగించవచ్చు.

రచయితగా రమణ విస్తృతీ, వైవిధ్యం ; నిర్మాతగా- నిర్వాహకుడిగా ఆయన ప్రత్యేకతలూ,  వ్యక్తిగా ఆయన స్వభావం.. వీటన్నిటితో  ఆయన సమగ్ర స్వరూపం విశ్వరూపంలా ఈ ‘కొసరు కొమ్మచ్చి’లో మనకు కనడుతుంది.

చదివి ఎవరికి వారు ఆస్వాదించాల్సిన ‘బాపూ రమణీయం’ ఇది!  

కొసరు చేర్పు : 
సెప్టెంబరు 7  ఈనాడు ఆదివారం మ్యాగజీన్ లో ఈ పుస్తకం గురించి  ఇలా రాశాను...  
 

29, జులై 2014, మంగళవారం

ఇరవై ఏళ్ళ తర్వాత కలిసిన ‘మంచి మిత్రులు’!చిన్నప్పుడు ఒక  తెలుగు నవల చదివాను.  చివరి పేజీలు చినిగిపోయిన ఆ  పుస్తకం  పేరు గుర్తులేదు.  రచయిత పేరు తెలియదు.  అక్క చెల్లెళ్ళు  ప్రధాన పాత్రలు. ధనికురాలైన అక్క  పేద చెల్లెలి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తుంటుంది. చెల్లెలి భర్త  ఏదో వ్యాధితో బాధపడుతుంటాడు. పేరు విభూది బాబు అని గుర్తు.  (ఈ పేరుబట్టే అది బెంగాలీ అనువాద నవల అని ఊహిస్తున్నాను. )  ఈ కథలోని విషాదం వల్లనేమో..... ఇన్నేళ్ళుగా  ఆ నవల గురించి మర్చిపోలేదు. పాత పుస్తకాల షాపులకూ , లైబ్రరీలకూ వెళ్ళినపుడు అప్రయత్నంగానే  దీని  కోసం  వెతుకుతుంటాను!

అది గొప్ప పుస్తకం అని కాదు. కానీ  దొరికితే  మళ్ళీ చదవాలని ఎందుకంత ఆసక్తి?  కథ మొత్తం తెలుస్తుందనే కాదు; ఇన్నేళ్ళ తర్వాత  చదివితే ... పాత జ్ఞాపకాలను తడిమి చూసుకోవచ్చనే కోరిక కూడా కారణమనుకుంటాను.

ప్రాణం లేని పుస్తకాలకే ఇంత శక్తి ఉంటే మరి సజీవమైన మనుషుల సంగతి?

బాగా తెలిసిన వ్యక్తులను ఈ జీవన ప్రయాణంలో పెద్ద విరామం తర్వాత మళ్ళీ చూడటం థ్రిల్ కలుగజేస్తుంది.  

ఓ హెన్రీ  ఓ కథ
ఈ ‘పునర్దర్శనం’లో  మానవాసక్తికరమైన ఎలిమెంట్ ఉంది  కాబట్టే  కొసమెరుపు రచయిత ఓ హెన్రీ  After twenty years  అనే కథానిక రాశాడు.

స్కూలు రోజుల్లో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలో చదివాను. కథ నచ్చింది కానీ,  అప్పుడు రచయిత ఎవరో పట్టించుకోవాలని తెలియదు.  తర్వాతి కాలంలోనే  దీన్ని రాసింది సాక్షాత్తూ ఓ హెన్రీ అని తెలిసింది.

ఇద్దరు స్నేహితులు బతుకు తెరువు కోసం వేర్వేరు చోట్ల బతకాలని  నిశ్చయించుకుని మళ్ళీ  ఇరవై సంవత్సరాల తర్వాత అదే సమయానికి అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ కలుసుకుంటారా? అప్పుడేమవుతుంది?  ఇదీ కథాంశం.

ఊహించని మలుపు ప్రవేశపెట్టి పాఠకులను ఆకట్టుకునే నేర్పును రచయిత దీనిలో ప్రదర్శించాడు.

ముఖ్యంగా నాటకీయతతో పాటు రిటార్టుతో పదునుగా ఉండి, కథ ముగిసినా వెంటాడే సంభాషణలు- 

"Twenty years is a long time, but not long enough to change a man's nose from a Roman to a pug."

"It sometimes changes a good man into a bad one"

ఈ కథ ను ఈ లింకు లో చదవొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆడియో (7.5 నిమిషాలు) కూడా వినొచ్చు.

నూటెనిమిది ఏళ్ళ క్రితం...
1906 లో రాసిన ఈ కథకు అనుసరణలుగా  ఎన్నో భాషల్లో ఎన్నో కథలు వచ్చాయి.

ఓ హెన్రీ కథలు తెలుగులో ఎప్పుడో అనువాదాలుగా వచ్చాయి. శ్రీరాగి అనువాదం చేసిన ఈ  After twenty years తెలుగు అనువాదం ఇక్కడ చదవొచ్చు.


ఎందుకు నచ్చింది?
ఇద్దరు స్నేహితులు ఇరవై సంవత్సరాల తర్వాత... తాము అనుకున్న మాటను సిన్సియర్ గా గుర్తుంచుకుని కలుసుకోవాలనుకోవటం-  బాగా నచ్చిన పాయింట్.  స్నేహం కంటే విధినిర్వహణకే  ప్రాముఖ్యం ఇవ్వటం చిన్నప్పుడు ఎంతో నచ్చేవుంటుంది.

కానీ దీన్నిప్పుడు చదివితే జిమ్మీ ప్రవర్తనలో కొంత లోపం కనిపించి, అతడి వైఖరి అంత గొప్పగా అనిపించటం లేదు!

కథ ప్రకారం- వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి తనను కలుసుకోవటానికి వచ్చిన ‘బాబ్’తో  ‘జిమ్మీ’ ప్లెయిన్ గా వ్యవహరించలేదు. బాబ్ మొహం లైటర్ వెలుగులో చూడకముందే  జిమ్మీకి అతడెవరో అర్థమైవుండాలి.  "I'm just waiting for a friend. It's an appointment made twenty years ago...’  అని స్పష్టంగానే చెప్తాడు బాబ్.  వెంటనే జిమ్మీ సంతోషాన్ని గానీ, ఎక్సైట్ మెంటును గానీ ఏమీ ప్రదర్శించలేదు.

అలా గంభీరంగా ప్రవర్తించటం అతడికి ‘డ్యూటీ’నేర్పిన కిటుకో, సహజంగా వచ్చిన అలవాటో తెలియదు కానీ అది అసహజంగానే ఉందనిపిస్తోంది. 

కథలో చెప్పనంతమాత్రాన  జిమ్మీ మానసిక సంఘర్షణ పడలేదని చెప్పలేం. నోట్ రాసి, వేరే వ్యక్తిని పంపించడంలో అది సూచనప్రాయంగా కనపడుతుంది. తను సకాలానికే ‘సంకేత స్థలానికి’ వచ్చానని మిత్రుడికి తెలియజెప్పిన సిన్సియారిటీని  కూడా అతడు ప్రదర్శించాడు. ‘నోట్ ’ చదివిన బాబ్ చేతులు వణకటం దేనికి సూచన? అరెస్టు భయానికా? మిత్రుడి నిబద్ధతను  తెలుసుకున్నందుకా?  ప్రియమిత్రుడి  ప్రమేయంతో  చిక్కుల్లో పడ్డానే అన్న బాధతోనా?  దేనికైనా కావొచ్చు.

ఇంత చిన్న కథలో  పేజీల కొద్దీ విశ్లేషణ చేయదగ్గ అంశాలున్నాయి. ఏమైనా దీని గురించి ప్రస్తావించే  సందర్భాల్లో  ‘జిమ్మీ ప్రవర్తన సవ్యమైనదా? కాదా? ’ అనే చర్చ జరుగుతూనే ఉంది.

కామిక్ రూపంలో....
ఈ కథను  కామిక్ బొమ్మల రూపంలో కూడా చదవటం ఆసక్తికరంగా ఉంటుంది. మన ఊహల్లో ఉన్నవ్యక్తులూ, పరిసరాలూ కళ్ళముందుకు వస్తారు.

పైకో క్లాసిక్స్ సంస్థ ప్రచురించిన ‘The best of O henry ’ పుస్తకంలో ఈ కథ ఉంది.

దీన్ని  సచిత్రంగా ఇక్కడ చదవొచ్చు.

ఇలస్ట్రేషన్లు వేసినవారు- యాంటన్ కారవానా.రెండు విరుద్ధ మార్గాలు పట్టిన ఈ స్నేహితుల కథ  చదివాక-  ‘మంచి మిత్రులు’ (1969)  సినిమాలోని ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ పాట గుర్తొస్తుంది!

30, జూన్ 2014, సోమవారం

వేణువే అంత!


టైటిల్ చూడగానే...  ఇదేదో  ఈ బ్లాగు గురించి రాసుకున్న సంగతేమో  అనుకునే అవకాశం ఉంది కదూ?

కానీ కాదు!   

ఇదో కవిత.

సంగీత పరికరమైన  వేణువు  ప్రత్యేకత గురించి చెప్పేది కాదిది.

వేణువుకు ప్రతిరూపంగా, పర్యాయపదంగా ప్రసిద్ధికెక్కిన పండిట్ హరి ప్రసాద్ చౌరసియా కళా ప్రతిభకు నివాళులర్పిస్తూ రాసిన కవిత ఇది.విమర్శకుడూ, కవీ  పాపినేని శివశంకర్ గారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం రాశారు దీన్ని.

‘సిరివెన్నెల’(1986)  సినిమా ద్వారా అప్పటికే హరిప్రసాద్ చౌరసియా గురించి  తెలుసు.  దాంతో కవిత చదవగానే బాగా నచ్చింది.   ఒకసారి మాత్రమే చదివినప్పటికీ  ఇన్నేళ్ళుగా బాగా గుర్తుండిపోయింది.

 తర్వాతి కాలంలో  ఇళయరాజా- హరిప్రసాద్ చౌరసియాల సమ్మేళనంలో...
 Nothing but wind  అనే అద్భుతమైన ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ పుట్టింది.

 దీనిలో వినిపించే  వేణుగానం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

అయినా  ఆయన వేణు గానం గురించి నాలాంటి  ఎవరో చెప్పింది వినటం వేరు.

ఆయన వేణువును నేరుగా ‘వినటం’ వేరు!

‘మోజార్ట్ ఐ లవ్యూ’ అనే భాగం ఇక్కడ  ఇస్తున్నాను.

వినండి... అచ్చంగా చెవుల్లో  అమృతం పోసినట్టే  అనిపిస్తుంది. మరి  నా అనుభవమది!మళ్ళీ కవిత గురించి...

పాపినేని శివశంకర్ గారు రాసిన ఆ  కవితను మళ్ళీ చదవాలనిపించింది. పాత ఆంధ్రజ్యోతి తేదీ,  సంవత్సరం గుర్తు లేదు.

మరెలా?
పాపినేని గారిని  మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేశాను. ఆ వివరాలడిగాను. ఆయన శ్రద్ధగా ఓపిగ్గా  వివరాలు అందించారు.

ఈ కవిత   జనవరి 7, 1994  ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయిందని తెలిపారు.  అంతే కాదు; ఆ  కవిత కాపీని కూడా పంపించి సంతోషపెట్టారు! 

ఆ రకంగా చాలాకాలం తర్వాత ఈ కవితను మళ్ళీ చదవగలిగాను.
 
ఈ కవిత పాపినేని గారి  ‘ఆకుపచ్చని లోకంలో` కవితా సంపుటిలో వేశారనీ, ఇది ఆంగ్లం లోకి కూడా అనువాదమైందనీ కూడా తెలుసుకున్నాను.

కవిత్వాన్ని గానీ, జోకును గానీ చెప్పి ఊరుకోవాలి తప్ప,  వివరించటానికి ప్రయత్నించకూడదు.

అందుకే ఈ కవితను ఇక్కడ ...scribd లో   ఇస్తున్నాను. ఎవరికి వారు చదివి ఆనందించటానికి!
ఇది చదివితే ...

హరిప్రసాద్ చౌరసియా  వేణుగాన మహిమ తెలిసినవారికి  మళ్లీ ఆ మాధుర్యం  తలపులోకి రాకమానదు.

చౌరసియా  చేతిలోని ఆ  ‘కోటి ప్రకంపనల మధుర పరికరం’  లోంచి గానం పొంగిపొరలి  ‘ఎక్కడో రహస్యపు పొరల్లో   అద్భుత జీవరసాయన సమ్మేళనం’ జరిగి  వింటున్నవారిని  ‘ఆనందమై వేధిస్తుంది’ !