సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, జులై 2012, శుక్రవారం

సినీ మా.గోఖలే... అపర శ్రీకృష్ణ సృష్టి!


‘మనసుంటే మార్గ’మే కాదు, ఆ మార్గం ఫలితాన్ని కూడా ఇస్తుందని నా విషయంలో చక్కగా రుజువైంది. మనం ఏ విషయంలోనైనా  ఆసక్తి పెంచుకుంటే దాని విశేషాలు  మనకే తారసపడతాయి!

కిందటి నెల మా.గోఖలే గురించి ఓ టపా  రాశాను.  ఆయన ప్రతిభా విశేషాల  గురించి   వివరంగా, మరింకేమైనా తెలిస్తే బాగుణ్ణనుకున్నాను.  

అంతే.. అప్పటినుంచీ ఆయన విశేషాలు తెలుస్తూనే వచ్చాయి. (ఇదేదో మాయో, మహిమో  కాదు. అంతకుముందు కూడా కనపడే వుంటాయి కానీ, నేనే వాటిని  పట్టించుకోలేదు).

ముఖ్యంగా గోఖలే  సృజనకు అద్దం పట్టే సెటింగ్ ల స్కెచ్ ల ప్రతిరూపాలూ, ఓ జానపద సీరియల్ కి  ఆయన వేసిన  బొమ్మలూ  దొరికాయి! 

మరి  వీటిని మీ అందరితో  పంచుకోవద్డూ? దీంతో- మా. గోఖలేపై  మరో టపా అనివార్యమైపోయింది.

* * * 

ఖైదుకు మారు పేరు శ్రీకృష్ణ జన్మస్థానం. 

‘వెన్న దొంగ- మా తొలిగురువు- తొలి నుంచీ మా కులగురువు’ అంటూ  ఖైదీలు కూడా (శ్రీశ్రీ కలం సాయంతో) ఆరాధించే పాత్ర శ్రీ కృష్ణుడు.

మరి అపర సినీ  శ్రీకృష్ణ  జన్మస్థానం  ఎక్కడో తెలుసా? ‘విజయా’వారి ఆస్థానం!

శ్రీకృష్ణుడంటే మన తెలుగువారికి  ఎన్టీ రామారావే!   తమిళంలోనూ ఆయనకు అంత పేరుందట.  అంతకుముందు సీఎస్సార్ లాంటివారు ఈ వేషం వేసినా అప్పట్లో కృష్ణుడి పాత్రకు ఈలపాట రఘురామయ్య  ప్రసిద్ధి. ఆయన్ను చూడ్డానికీ, ఈలపాట వినడానికీ (కృష్ణుడి వేషమైనా  ఈలపాడక తప్పేది కాదు పాపం ఆయనకి) అలవాటుపడ్డ ప్రేక్షకులు  మరొకర్ని ఆ పాత్రలో  జీర్ణించుకోలేరు కదా?

ఘంటసాల సొంత  చిత్రం ‘సొంత ఊరు’ (1956)లో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి  శ్రీకృష్ణుడిగా కనపడ్డారు. కానీ  ఆ పాత్రలో జనం ఆయన్ను ఆమోదించలేకపోయారు. థియేటర్లలో హేళనగా  ఈలలతో  గోలగోల చేశారు.

 ఈ సంగతి తెలిసి కూడా జంకకుండా, ఎన్టీఆర్ తోనే మాయాబజార్ (1957)లో శ్రీకృష్ణుడి పాత్ర వేయించిన కేవీ రెడ్డి గారి ధైర్యం, దూరదృష్టిని  మెచ్చుకుని తీరాలి. ఆయనకు కళాదర్శకుడు మా.గోఖలే  రూపంలో  అండ దొరికింది.


(తాజా కలం in August 2013 :  ఈ విషయం వాస్తవం కాదని  సినీ విమర్శకుడు   డా. వి.ఎ.కె.రంగారావు  ‘నవ్య’లో ఈ లేఖ రాశాక తెలిసింది-    ఎన్.టి.రామారావు మొట్టమొదటి కృష్ణరూపం ధరించింది సొంత వూరు’ (1956) లో కాదు; ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954)లో. ఆయన వేషాన్ని  ఎవరూ విమర్శించలేదు. ఆ సినిమాలు రెండూ బాగా ఆడలేదు. అంతే. తెలియనివారూహించటం, అనడం, తక్కినవారు గొర్రెదాటు వాటాన్ని అనుసరించడం అలవాటైపోయింది’ ) 

ఎన్టీఆర్ ని కృష్ణుడిగా ఒప్పించాలన్నది   సవాలుగా తీసుకున్న  గోఖలే  ఊహలు రెక్క విప్పుకున్నాయి.  సహచరుడు కళాధర్ సాయంతో  కిరీటం, నగలూ రూపొందించారు. వివిధ రూపురేఖలతో రకరకాల స్కెచ్చులూ, గెటప్ లూ వేశారు. ఫొటోలు తీశారు. 

అప్పటిదాకా పరిచితమైన  కృష్ణుడి రూపుకు పూర్తి భిన్నమైన ఆహార్యం కోసం కృషి చేశారు. సగం కిరీటం కాస్తా  పూర్తి కిరీటంగా మారింది. వీటన్నిటికీ  ఎన్టీఆర్ రూపం, నడక, కొంటెదనపు  చిరునవ్వు తోడై  సినీ శ్రీకృష్ణుడు అవతరించాడు.

ప్రేక్షకులను నొప్పించిన  కృష్ణుడిని.. చివరకు వారిచేత  ఒప్పించటమే కాదు, మెప్పించి.. అంతటిలో ఆగకుండా  అశేష నీరాజనాలు పలికే స్థాయిలో  విజయవంతమైన  ఈ ప్రయత్నం  అమోఘం!  

భక్తుల కలల్లోకి  శ్రీకృష్ణుడు  వచ్చాడంటే...అది నిశ్చయంగా  ఎన్టీఆర్ రూపంలోనే అనే  స్థితి  ఏర్పడిపోయింది! :) 

అలా శ్రీకృష్ణ పాత్రే తానుగా మారారు ఎన్టీఆర్. కాసేపున్నా చాలనిపించేలా, ఆఖరికి సాంఘిక సినిమాల్లోకి కూడా ఆ పాత్ర  చొరబడింది.  1973లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కథాపరంగా  ‘మరల రేపల్లె వాడలో మురళి మోగి’ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ సమ్మోహనరూపం  కళ్ళబడినపుడు తెలుగు ప్రేక్షకుల సంతోషం తనలో ప్రతిఫలించిందా అన్నట్టు-   ఎస్వీ రంగారావు  మొహంలో సంతోషం వెల్లివిరుస్తుంది! 

తన దర్శకుడి  నిర్ణయం ఎంత కచ్చితమైనదో ఈ కళా దర్శకుడు తిరుగులేనివిధంగా  అలా నిరూపించారు! 

 * * * 

హైహై నాయకా  
మాయాబజార్ లో  ఘటోత్కచుడి ఆహార్యం మా.గోఖలే మరో అద్భుత సృష్టి.
ఆయన ఆ పాత్ర ఎలా ఉండాలో ఊహించి స్కెచ్ వేశారు. 

ఆ స్కెచ్ నీ , దాని ఆధారంగా రూపొందిన పాత్రధారినీ   చూడండి.

కొండల్లో కోనల్లో తిరిగేవాడు కాబట్టి కిరీటంపై ఈకలు డిజైన్ చేశారు.  కర్ణాభరణాలు పెద్దగా వెంకటేశ్వరస్వామి నగల మల్లే ఉన్నాయి. పూసలూ, కంఠాభరణాలూ కూడా అటవీ సంస్కృతిని గుర్తుచేసేవే.

ఈ గెటప్ కు ఎస్వీ రంగారావు గారి నటన  తోడై, ఘటోత్కచుడి పాత్ర గొప్పగా పండింది!
* * * 

తీయని ఊహల పూలతోట  
 పాతాళభైరవి సినిమాలో కథానాయిక  చెలికత్తెలతో  ‘తీయని ఊహల హాయిని గొలిపే వసంత గానమె హాయీ’ పాట పాడుకుంటుంది కదా? ఆ తోట  నిజమైన ఉద్యానవనంలాగే  ఉంటుంది. కానీ అది సెట్. మా.గోఖలే చేసిన మాయాజాలం!


* * * 

క్కడ కొన్ని సెటింగ్స్, వాటికి ముందుగా వేసుకున్న స్కెచెస్ చూడండి.

తన డిజైన్  సంతృప్తికరంగా వచ్చి, గోఖలేకి నచ్చిన ఈ సెట్ ‘జగదేకవీరుని కథ’లోది.ఇది మాయాబజార్ లో శశిరేఖ భవంతి .చంద్రహారంలోనిది ఈ  కన్నులపండువైన ఈ సెట్.

సహజత్వం,  భారీతనం,  కథాస్థలంలోకీ, కథా కాలంలోకీ తీసుకువెళ్ళగలిగే  నేపథ్య కల్పన, పాత్రలకు సముచితమైన  ఆకట్టుకునే ఆహార్యం.... ఇవీ-  మా.గోఖలే కళాదర్శకత్వంలో కనపడే విశేషాలు.
 * * * 

వైముఖ్యం నుంచి  ప్రాముఖ్యం
గూడవల్లి రామబ్రహ్మం గారి ‘రైతుబిడ్డ’ (1939)  సినిమా ఆర్ట్ విభాగంలో పనిచేసిన గోఖలేకు ఆ పని అంత ఉత్సాహం కలిగించలేదు.  ఇక సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయకూడదని నిశ్చయించుకుని పదేళ్ళ పాటు సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు.

అలాంటిది చక్రపాణి ప్రమేయంతో  షావుకారు (1950) కు కళా దర్శకుడి బాధ్యత స్వీకరించారు. తన పని విలువా,  ప్రాముఖ్యం తెలిసిన నిర్మాతలవటం వల్ల విజయా ఆస్థాన కళా దర్శకుడిగా కొనసాగారు.  అజరామర చిత్రాలకు పనిచేశారు.

* * * 
చిత్రకారునిగా...

మా.గోఖలే డ్రాయింగ్ టీచర్ గా పనిచేశారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో రాజకీయ కార్టూన్లు వేశారు. చక్రపాణి  ఆయన్ని 1948లో మద్రాస్ పిలిపించుకుని తన సంపాదకత్వంలోని యువ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బొమ్మలు వేయించారు.

గోఖలే  ‘చందమామ’ తొలి సంచికల్లో కూడా  బొమ్మలు వేశారని కొత్తగా తెలిసింది. ఆయన బొమ్మలు వేసిన సీరియల్  ‘బాలనాగమ్మ’!

సమాచారం తెలిస్తే అలా ఊరుకోలేను కదా? ఆ సంచికలు సంపాదించి, ఆ  బొమ్మలను చూసి  ఆనందించాను.  కొన్ని చిత్రాలు   మీరూ చూడండి...

 8 సంచికలుగా విస్తరించిన ఆ సీరియల్ భాగాలను ఒకే pdf ఫైలుగా కంపైల్ చేశాను. ఈ సీరియల్ 66 పేజీలుంది.  50 mb.

మరి మన మిత్రులకు దీన్ని  ఎలా అందుబాటులోకి తేవడం? రాపిడ్ షేర్ లో అప్ లోడ్ చేశాను.

ఆసక్తి ఉన్నవారు కింది బొమ్మ మీద క్లిక్ చేసి,  ‘బాలనాగమ్మ’ సీరియల్ ని  డౌన్ లోడ్ చేసుకోవచ్చు
 
http://rapidshare.com/share/13AF3DFBD6F284057C27CC4A5504D90F


(‘సినిమా రంగం’ సంపాదకుడు కీ.శే. జి.వి.జి. గారు, ‘బ్లాక్ అండ్ వైట్’ రచయిత రావి కొండలరావు గారు,  ‘చందమామ’ సంస్థాపకుల సౌజన్యంతో ఈ టపాలో కొన్ని అంశాలూ, చిత్రాలూ ఉపయోగించుకున్నాను. వారికి  నా  కృతజ్ఞతలు).
 
3.12. 2020 
తాజా చేర్పు:  చందమామ 1948 జనవరి సంచికలో మా. గోఖలే వేసిన  దమయంతి రంగుల  చిత్రం