సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?‘భారతదేశంలో  రామాయణాన్ని గానీ, మహాభారతాన్ని గానీ  తొలిసారే ఎవరూ చదవరు’ అంటారు సాహితీవేత్త ఏకే రామానుజన్. (మొదటిసారి చదవటానికి ముందే ఆ కథలు తెలిసివుంటాయని అర్థం.) .

ముఖ్యంగా మహాభారత కథను  తొలిసారే ఎవరూ చదవరు కానీ, తర్వాతయినా చాలామంది అరకొరగానే  చదువుతారనీ, మూలగ్రంథంలో ఏముందో పట్టించుకునేవారు చాలా తక్కువమంది అనీ ఈ వ్యాఖ్యను పొడిగించవచ్చు. 

వినికిడి పరిజ్ఞానంతోనో, కళారూపాలు చూడటం వల్లనో మాత్రమే ఎక్కువమందికి భారత కథ తెలిసివుంటుంది.. 

నాకైతే  భారత కథ కొంచెం వివరంగా  ‘చందమామ’ మాసపత్రిక ద్వారానే తెలిసింది. ముఖ్యంగా మహా ప్రస్థాన,  స్వర్గారోహణ ఘట్టాలను అంతకుముందెప్పుడూ వినలేదు.  చందమామలో 1952-64 సంవత్సరాల్లో  మొదటి వెర్షన్;  1969-74 సంవత్సరాల్లో రెండో వెర్షన్ సీరియల్ గా వచ్చాయి. 


 చందమామలో నేను చదివిన మహాభారతం (రెండో వెర్షన్) ఆరంభ సంచికలోని పేజీ  ఇది.   పాఠకులను ఆకట్టుకునేలా  ఈ సీరియల్ ని  రాసింది  కొడవటిగంటి కుటుంబరావు గారు.

నలబై సంవత్సరాల క్రితం  ‘రామాయణ విషవృక్షా’న్ని సమీక్షిస్తూ ఆయన సమాజ పరిశీలనకు రామాయణం పనికి రాదు కానీ, భారతం పనికివస్తుందన్నారు.

ఆ పరిశీలన ఆయన చేయలేదు కానీ, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ  అది రంగనాయకమ్మ గారి ద్వారానే జరిగింది ....  ‘ఇదండీ మహా భారతం’ ద్వారా!  ఈ పుస్తకం మహాభారత క్లుప్త పరిచయమైనప్పటికీ ఆ రచనాకాలపు సమాజ పరిశీలన కూడా దీనిలో ఉంది.  ఈ పుస్తకం 2014 డిసెంబర్లో  విడుదలైనపుడు నేనో  పోస్టు రాశాను. అది ప్రివ్యూ లాంటి ‘కర్టెన్ రైజర్’మాత్రమే. ( ఆ  పోస్టుతో పాటు ఈ బ్లాగులో  ఇచ్చిన పాండవుల మహాప్రస్థాన చిత్రాన్ని ‘ఇదండీ మహా భారతం’ రెండో ముద్రణలో వెనక అట్ట మీద ఉపయోగించారు!) 

మరిప్పుడు ఈ  తాజా పోస్టు  ఏమిటి?  నా పఠనానుభవం  జోడించి రాస్తున్న  టపా ఇది!

మహా భారతానికి  పరిచయం

మహాభారతంపై  తరతరాలుగా పొగడ్తలు కురుస్తూనే ఉన్నాయి.  కానీ దీనికి భిన్నంగా ఆ గ్రంథంలో అసలేముందో చెప్పే పుస్తకం ‘ఇదండీ మహా భారతం’.  కథను చెపుతూనే బ్రాకెట్లలో రచయిత్రి  సందర్భాన్ని బట్టి  కటువుగానే  విమర్శలు చేశారు.  ఈ గ్రంథ సంగ్రహార్థాన్నీ, పరమార్థాన్నీ చర్చించారు.

‘ఆమె వ్యాఖ్యానాల్లో న్యాయం ఉందా, లేదా?’   అనేది  చదివేవారు గమనించాలి. 

కానీ- ఈ పుస్తకంలో ఏం రాశారో  చదవకుండానే ‘ఇది భారతాన్ని వక్రీకరించిన రచన’ అనేస్తున్నారు కొందరు,  టీవీ కార్యక్రమాల్లో!  ( ఎక్కడ వక్రీకరించారో నిర్దిష్టంగా  చెప్పగలగాలి. అదేమీ లేకుండా ఇలాంటి  ఆరోపణలు చేస్తే  ఆ  మాటలకు విలువ  ఏమీ ఉండదు).    

ఈ పుస్తకం గురించి  రంగనాయకమ్మ గారి  ఇంటర్ వ్యూ  ఫిబ్రవరి 15న మొదట టీవీ నైన్ లో  ప్రసారమైంది.  ఈ పుస్తకాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు వ్యాఖ్యలతో కలిపి మర్నాడు మరో కార్యక్రమం వచ్చింది.

తర్వాత ఎన్ టీవీలో  ఫిబ్రవరి 17న మరో ఇంటర్ వ్యూ వచ్చింది.

దీంట్లోంచి తీసిన రెండు నిమిషాల భాగాన్ని ఇక్కడ చూడొచ్చు. ‘‘అట్టను చూస్తే  కోపమొస్తుందేమో.  లోపలికి వెళ్ళండి. న్యాయం లేకుండా, చర్చ లేకుండా,  పరిశీలించకుండా కోప్పడితే  అది తప్పవుతుంది కదా?’’  అంటున్నారు రచయిత్రి.

 * * *

పుస్తకం  మొదటి ముద్రణ (డిసెంబరు 2014) ప్రతులు 1500 విడుదలైన కొద్దిరోజుల్లోనే  అయిపోయాయి.

రెండో ముద్రణ (జనవరి 2015) ప్రతులు 2,000  కూడా ఇంకా వేగంగా  దాదాపు  అమ్ముడయ్యాయి.

మూడో ముద్రణ ప్రతులు కొద్దిరోజుల్లో మార్కెట్లోకి వస్తున్నాయి.
kinige లో విడుదలైన దగ్గర్నుంచీ  టాప్ టెన్ పుస్తకాల జాబితాలోనే  ఉంటూ వస్తోంది ఈ-బుక్! 

తక్కువ ధరకు  ఇవ్వటం వల్లా,  ‘చర్చనీయాంశం’ అవటం వల్లా పుస్తకాల విక్రయాలు కొంత పెరిగివుండొచ్చు. కానీ పుస్తకంలో  ‘విషయం’ లేకుండా ఇంత ఆదరణ సాధ్యం కాదు.  

తర్కాన్నీ, చర్చనూ, విమర్శనూ  స్వాగతించే పాఠకులు ఎక్కువ సంఖ్యలోనే  ఉన్నారనటానికి  ఇది నిదర్శనం.

 * * *

చిన్నప్పటినుంచీ  మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం!

నేలమీద  ద్రౌపదీ,  తమ్ముళ్ళూ పడిపోయి ప్రాణాలు కోల్పోయినా  వారిని  చూడకుండా...  అసలేమాత్రం పట్టించుకోకుండా-  వెంట నడిచే  కుక్కతో పాటు ధర్మరాజు ముందుకు సాగిపోతున్న దృశ్యం...  వ.పా. చిత్రం

చందమామలో...  శంకర్,  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య గార్ల అద్భుతమైన వర్ణ చిత్రాలు చూస్తూ ఆ కథను చదవటం -

రేడియోలో... ఉషశ్రీ గారి గంభీరగళంతో  భారత యుద్ధఘట్టాలను వినటం - 


తెలుగు పౌరాణిక సినిమాల్లో...  మహాభారత సన్నివేశాలను  చూడటం - 

ఇవన్నీ సంతోషకర అనుభవాలే !

ఆ కథలోని ఆసక్తికరమైన మలుపుల వల్లా, వీర-రౌద్ర- భయానక- బీభత్స- అద్భుత రసాలతో కూడిన ఘట్టాల వల్లా ఈ గ్రంథాన్ని అంతగా ఇష్టపడ్డానని అనిపిస్తోంది.

అయితే ఇన్నేళ్ళుగా మూల గ్రంథాన్ని (కనీసం సంగ్రహ వచన అనువాదాన్ని అయినా)  మాత్రం చదవటానికి ప్రయత్నించలేదు.
  
వ్యాస మహర్షి   సంస్కృతంలో రాసిన మహా భారతం  క్రీస్తుపూర్వం నాటి రచన.   క్రీ.శ. 11-14 శతాబ్దాల మధ్య ఇది  పద్య కావ్యంగా తెలుగులోకి వచ్చింది. కవిత్రయం రాసిన ఈ ‘శ్రీ మదాంధ్ర మహాభారతము’ సంక్షేపించిన (కుదించిన) రచన. కానీ వారు  ఏ ఘట్టాన్నీ అనువదించకుండా  వదిలెయ్యలేదు. 

అయితే...  తెలుగులో - ఆ మాటకొస్తే హిందీలో కూడా  ప్రతిపదార్థ- తాత్పర్యాలతో యథాతథ అనువాదం ఇన్ని వందల- వేల సంవత్సరాల తర్వాత కూడా వెలువడలేదంటే ఎంతో ఆశ్చర్యం!  

‘ఇదండీ మహా భారతం’ చదవటం  నాకు మూడు రకాలుగా ఉపయోగపడింది.
1)  మహా భారత మూలంలోని కథాంశం మొత్తాన్నీ (సంగ్రహంగా)  చదవగలిగాను. 
2)  చాలా పాత్రలపై అప్పటివరకూ ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి.
3)  ఈ ఇతిహాస సారంపైనా, దాని లక్ష్యంపైనా స్పష్టత వచ్చింది.

హాస్య వ్యంగ్యాలతో  చురకలు

రంగనాయకమ్మ గారి ఏ రచనలోనైనా హాస్య వ్యంగ్యాలు బోనస్. ‘ఇదండీ మహాభారతం’చదువుతుంటే అక్కడక్కడా  వేసే చురకలు చిరునవ్వులు పూయిస్తాయి.   

‘‘కొడుకులే కావాలి. వందమంది, వెయ్యిమంది, కొడుకులే, కొడుకులే కావాలి’’- కానీ,  ఆ కొడుకులందరికీ పెద్దయ్యాక సానులు కావాలి.

‘గొడుగు దానం చేస్తే  సంతానవంతులవుతారు’- (ఏ రంగు గొడుక్కి , ఏ సంతానం?)

ఆదిపర్వంలో- హిడింబుడు చెల్లెలి మీద అరిచినపుడు ఆమె భీముడి వెనకాల నక్కిన సందర్భంలో- రాక్షసుల్లో కూడా మగవాళ్ళ పెత్తనాలే అన్నమాట!

కొన్ని వ్యాఖ్యలు చదువుతుంటే మనం అసలు ఊహించని కోణంలో వ్యాఖ్య దూసుకొస్తుంది.

అరణ్యపర్వంలో- ద్వైత వనంలో ధర్మరాజు ‘భూదేవి లాగ క్షమాగుణం గలవాడికి ఎప్పుడూ జయమే కలుగుతుంది’ అంటాడు. నిజమే కదా? అనిపిస్తుంది. కనీసం అక్కడ ఆక్షేపించదగ్గది ఏదీ  తోచదు. కానీ  రంగనాయకమ్మ గారు ఇక్కడ చేసిన వ్యాఖ్య చూడండి ...

 ‘భూదేవికేం క్షమ ఉంది? జన నాశనం చేసి, బరువు తగ్గించమని కోరింది కదా? అదేనా భూదేవి క్షమ?’  

భీష్మపర్వంలో- భీష్ముడు లేని కౌరవసేన, భర్త లేని భార్యలా అయిపోయింది. (భీష్ముడికి బ్రహ్మచారితనం వదిలి, భర్తతనం వచ్చింది. సంతోషం).


దోషారోపణం..అనుచిత సంభాషణం
ఆనుశాసనిక పర్వంలో  భీష్ముడూ, ధర్మరాజూ  స్త్రీలను దారుణంగా అవమానించే వ్యాఖ్యలతో మాట్లాడుకుంటారు.

ద్వితీయాశ్వాసంలో  ధర్మరాజు  ‘పాపాలన్నిటికి మూలం స్త్రీలే కదా?’ అంటూ దాన్ని వివరించమంటాడు.

‘స్త్రియోహి మూలం దోషాణాం’ అని వ్యాసుడు సంస్కృతంలో చాటినా,


‘యోషిజ్జనంబులు దోషంబులకు నెల్ల మూలంబు’ అని తిక్కన  తెలుగులో పద్యరూపంలో చెప్పినా.. విషయం మాత్రం ఒకటే!

(ఈ సందర్భంగా ఇదండీ మహాభారతంలోని  చిన్న భాగం...) 


ఇదే ఘట్టం  పురిపండా అప్పలస్వామి గారి ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ లో ఎలా ఉంది?  ఇక్కడ కొంచెం చూడండి.‘స్త్రీ  అనేది మండే నిప్పు! పదునైన కత్తి. ఘోర విషం! మహా సర్పం! అన్నీకలిసినదే ఆడది’
  అంటూ భీష్ముడు బోధలు చేస్తాడు మనవడికి.


పరిశీలనలో పదును
‘ఇదండీ మహా భారతం’లో  ఆలోచించదగ్గ మౌలిక అంశాల చర్చ కనిపిస్తుంది. (బోల్డ్ లెటర్స్ లోనివి రంగనాయకమ్మ గారి వాక్యాలు. )

1)   దుర్యోధనుడి పుట్టుక కారణం:   మహాభారతంలో ప్రధాన వైరుధ్యం గురించి రచయిత్రి వ్యాఖ్య ఇక్కడ-


2) అమృతం, అశుచిత్వం:  ఆదిపర్వంలో ఉదంకుడు ఎద్దు పేడ తింటాడు.  అది పేడ కాదనీ, అమృతమనీ తర్వాత  గురువు చెప్తాడు. ఈ సందర్భంలో రచయిత్రి విశ్లేషణ-  ‘‘మాయలతో మంత్రాలతో తయారుచేసే కట్టు కథలు కూడా అందులో పెట్టుకునే హద్దులకే లోబడివుండాలి. అమృతాన్ని పవిత్రమైనదని ఒక పక్క చెపుతూ, అది తినడం వల్ల అశుచి అయినట్టు ఇంకో పక్క చెపితే , ఆ అతకనితనం కట్టుకథకి కూడా పనికి రాదు.’’

3) కౌరవులు ఓడిపోయుంటే:   మాయాజూదం ఆడి పాండవులను అడవులపాలు చేశారని  కౌరవుల మీద చాలామందికి వ్యతిరేకత ఉంటుంది.  ‘‘(జూదంలో) ధర్మరాజే  గెలిస్తే , అప్పుడు కౌరవుల రాజ్యం ధర్మరాజుకి రావలసిందే కదా? అప్పుడు కౌరవులైనా అడవికి పోవలసిందే కదా?’’

ఇది  ఈ పుస్తకంలో  చదివినపుడు ‘ఈ కోణం  మనకు తట్టలేదేమిటి?’  అనిపిస్తుంది.

4)  కురుక్షేత్ర యుద్ధం తర్వాత :  ధర్మరాజు , మొత్తం కౌరవ-పాండవ రాజ్యాలకు మహారాజు అయ్యాడు. వాళ్ళు యుద్ధం చేసింది , తమ రాజ్యం కోసమే. దానినే తను తీసుకుని, కౌరవుల రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికే ఎందుకు పట్టం కట్ట కూడదు?  

ఈ రకమైన  తర్కంతో  ధర్మరాజు  చర్యలోని  లోపాన్ని వెల్లడించటం అనూహ్యం అనిపిస్తుంది.  


5) ధర్మరాజు గమ్యం ఏమిటి :  ధర్మరాజు మహాప్రస్థానంలో ఇంద్రుడు ఎదురొచ్చాడు. ముందు నిలిచాడు.. ధర్మరాజు ఆగిపోయి ఇంద్రుడికి నమస్కరించాడు.  ‘‘ఇతడి మహాప్రస్థానం ఇంద్రుడు కనపడేవరకేనా? ఇతడి గమ్యం, ఇంద్రుడి దర్శనమేనా? భార్యనీ, నలుగురు తమ్ముల్నీ ( నేలమీద పడిపోయినా వెనుదిరిగి) చూడకుండా నడిచిపోయినవాడు ఇంద్రుణ్ణి చూడకుండా వెళ్ళిపోతూవుండాలి. కానీ ఆగిపోయాడు!’’ 

నేలమీద  ద్రౌపదీ,  తమ్ముళ్ళూ పడిపోతున్న సంగతి తెలిసి కూడా వారిని చూడకుండా.. అసలేమాత్రం పట్టించుకోకుండా-  పైగా వాళ్ళ తప్పులను భీముడితో  ఎత్తి చెపుతూ ధర్మరాజు ముందుకు సాగిపోవటానికి  కారణం ఏమిటో చదివేవారికి అంతుపట్టదు.


6)  గీతకు వ్యతిరేకంగా  ఫలశ్రుతి :   కృష్ణుడు, ఏ కర్మ చేసినా ‘ఫలితాల మీద దృష్టి పెట్టవద్దు’ అన్నాడు కదా? అలాంటప్పుడు ఈ ఫలశ్రుతి (ఈ మహాభారతం భక్తితో చదివినా , విన్నా సిరిసంపదలు దొరుకుతాయి; కొడుకులు పుడతారు. పాపాలు పోతాయి....)  ఎందుకు? ఈ కవి కృష్ణుడి బోధన పట్టించుకోలేదు. కృష్ణుణ్ణి సృష్టించి ఆ పాత్రతో అలా చెప్పించింది కవే.  ఆ కవే ఫల శ్రుతి చెప్పాడంటే... తను రాసినదాన్ని తనే పట్టించుకోలేదని అర్థం.


* * *

‘సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో’ అంటాడు బుద్ధుడు. 

అమానుషమైన కుల విధానాన్ని (చాతుర్వర్ణాశ్రమ ధర్మాలను) నిలబెట్టడమే ఈ గ్రంథ లక్ష్యం అని తెలిశాక;

స్త్రీలను సజీవంగా కాల్చెయ్యడాన్ని (సతీ సహగమనం)  పవిత్ర పుణ్యకార్యంగా ప్రబోధించిందని గ్రహించాక...

అప్పుడు కూడా...
‘మహాభారతం’పై  అప్పటివరకూ పెంచుకునివున్న ఇష్టం, అభిమానం-

అలాగే..
అదే స్థాయిలో నిలిచివుంటాయా?!