సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జనవరి 2010, శుక్రవారం

జానపద కథల మాంత్రికుడే కానీ... బేతాళ కథల సృష్టికర్త కాదు!

ర్తమాన చరిత్రకు వార్తా పత్రికలు అద్దం పడతాయంటారు. అయితే, ‘Journalism is literature in a hurry' కాబట్టి వాటిలో పొరపాట్లు కూడా సహజమేనని సరిపెట్టుకోవాలేమో.

అద్భుత జానపద ధారావాహికలతో  తరతరాల ‘చందమామ’ పాఠకులను ఉర్రూతలూగించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి మరణ వార్తను పాఠకులకు అందించటానికి ప్రయత్నించిన పత్రికలను అభినందించాల్సిందే.

అయితే-

బుధవారం (జనవరి 27) విజయవాడలో కన్నుమూసిన ఆ జానపద కథల మాంత్రికుడి  గురించి రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్లో factual error దొర్లింది.

‘భేతాళ మాంత్రికుడు ఇక లేరు’అని శీర్షిక ఇచ్చిన పత్రిక ఆయన్ను ‘భేతాళ కథల సృష్టికర్త’గా అభివర్ణించింది.బేతాళుణ్ని భేతాళుడిగా రాయటం కాదు- ఇక్కడ సమస్య.

మరో పత్రిక ‘ఆగిన ‘చందమామ’ బేతాళ కథ’ అనే శీర్షికను ఇచ్చింది.‘బాల కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన బేతాళ కథలను దాసరి సృష్టించారు.ఐదు దశాబ్దాలపాటు బేతాళకథలు రాశారు’ అని పేర్కొంది.

వాస్తవానికి- దాసరి గారు బేతాళ కథల సృష్టికర్త కాదు!

చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావు గార్ల ఆలోచనలే చందమామలో బేతాళ కథలకు నాంది పలికాయి. 1980 తర్వాత మరో పాతికేళ్ళపాటు దాసరి గారు సంపాదక వర్గ సభ్యుడుగా బేతాళ కథలను పర్యవేక్షించినా, ఆయన ప్రధాన రచనా వ్యాసంగాన్ని ఆ కథలతో ముడిపెట్టటం సరి కాదు.


అసలు సుబ్రహ్మణ్యం గారి మౌలిక కృషి అజరామరమైన జానపద ధారావాహికలు. చందమామ పాలసీ మూలంగా ఆయనకు దక్కాల్సిన పేరు దక్కనే లేదు.జానపద సీరియల్స్ ను ఏళ్ళ తరబడి ఆనందించిన పాఠకులు కూడా రచయిత ఎవరో తెలియక, ఆయన్ను గుర్తుంచుకోలేదనిపిస్తుంది.


అసలు కృషిని సరిగా పట్టించుకోకుండా, దాసరి గారికి నేరుగా సంబంధం లేని కీర్తిని  ఆపాదించటం ఆయనకు గౌరవం కాదు!


దశాబ్దాల తరబడి, సాహిత్య సృష్టి చేసిన రచయితల కృషి గురించి కూడా ఇలా తారుమారు జరుగుతున్నపుడు-

ఇరవై ఒకటో శతాబ్దంలో,సమాచార యుగంలో కూడా ఇలాంటి దుస్థితా? అనిపిస్తోంది!


....

'I am overstay here' అని తన పెద్ద వయసు గురించి జోక్ వేసుకున్న అపురూప రచయిత దాసరి గారు.


‘కొ.కు.గారు 1980లో నాకన్న ముందుపోవడం నాకు తీరని ఆవేదన’ అంటూ బాధపడి, ఆ మాటలన్న ఎనిమిది మాసాలకే  జీవితం చాలించారు.


2009 మేనెల మొదటివారంలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో రెండోసారి (చివరిసారి) కలిశాను.ఆయనకు వినికిడిశక్తి తగ్గిపోవటంతో  రైటింగ్ పాడ్ మీద ఒక్కో ప్రశ్న రాసిస్తే, దానిమీదే స్వయంగా సమాధానాలు రాశారు.


సిగరెట్ తాగుతూ ఆ పొగ లోపలి గదిలోకి వెళ్ళకుండా ఆ తలుపు మూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. స్మృతులను నెమరువేసుకున్నారు. ‘స్మోకింగ్ ని మాత్రం వదల్లేకపోయాను’అని ఒప్పుకున్నారు, అడక్కుండానే.‘మీ జానపద సాహిత్యానికి ప్రేరణ ఏమిటి?’ అని అడిగినప్పుడు చాలా సంతోషించారు.అది ఆయన మొహంలో వ్యక్తమవ్వలేదు కానీ, ‘మేలిమి బంగారంలాంటి ప్రశ్న అడిగారు’ అంటూ సమాధానం ప్రారంభించినపుడు ఆయన సంతోషం  అవగతమయింది.2008లో  దసరా రోజున విజయవాడలో ఆయన అడ్రస్ అన్వేషించి , నివాసానికి వెళ్ళి తొలిసారి దాసరి గారిని చూడబోతున్నపుడు ఎంత ఉత్కంఠ అనుభవించానో ఇప్పటికీ గుర్తొస్తోంది. ఇంటిలోపల్నుంచి మెల్లగా నడిచొచ్చిన పొడుగ్గా, బలహీనంగా ఉన్న వృద్ధమూర్తిని చూడగానే సంబరంగా ‘ఈయనేనా అంతటి అద్భుత రచనలు చేసిన రచయిత!’ అనుకోకుండా ఉండలేకపోయాను.


ఆయన జీవన సంధ్యలో రెండు సార్లు వ్యక్తిగతంగా కలుసుకోగలిగాననే తృప్తి మాత్రమే ఇప్పుడు మిగిలింది.


ఇచ్చిన విజిటింగ్ కార్డును వెనక్కి తిప్పి, నేను ఆయన్ను కలిసిన  తేదీని ఎంత శ్రద్ధగా రాసుకున్నారో.

 ఇంటర్వ్యూ చేసిన గుర్తుగా ఆయన ఏటవాలు చేతిరాతతో ఉన్న రైటింగ్ ప్యాడ్ దీనంగా,విషాదంగా...నా దగ్గర!


...


మంత్రముగ్ధులను చేసే దాసరి సుబ్రహ్మణ్యం గారి కథా కథన శైలి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుందాం-

‘హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ, ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు ఎత్తి, బాణాలు ఎక్కుపెట్టేలోపలే, రెండు సింహాలు గర్జించుతూ వారికేసి దూకినై. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కివున్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగినై.’ (జ్వాలాద్వీపం)

‘హేయ్, కాలభుజంగా!కంకాళా!రండి,రండి!ఆ చతుర్నేత్రుణ్ణి వెతికి పట్టి హతమార్చండి!’అనే ప్రళయ భీకర నాదం దశదిశలా వ్యాపించింది’ (తోకచుక్క).


...


చందమామ చరిత్ర బ్లాగు లో రాజు గారు నిన్న (గురువారం) సమగ్రంగా రాసిన టపా కూడా చూడండి.

17, జనవరి 2010, ఆదివారం

‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’... ఈనాడు సమీక్ష!

రంగనాయకమ్మ గారి కొత్త రచన ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ ఈ మధ్యే విడుదలైంది.
 ఈ పుస్తకంపై నేను రాసిన సంక్షిప్త పరిచయం ఇవాళ (జనవరి 17) ‘ఈనాడు ఆదివారం’లో వచ్చింది.


ఈ పుస్తకం చదవడం అంటే అసలైన ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడం మొదలుపెట్టడం. పిల్లల కోసం ఉద్దేశించింది కాబట్టి ప్రాథమిక విషయాలే ఉంటాయి. అయినా అవి చాలామందికి తెలియనివి. ఇవి తెలుసుకోవడం పెద్దవాళ్ళకు కూడా అవసరమే కదా?


మన జీవిస్తున్న సమాజం ఎలా ఉంది? అందులో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనేవి కనీసంగా తెలుస్తాయి ఈ పుస్తకం చదివితే.


జటిలమైన ఆర్థిక శాస్త్ర విషయాలను హైస్కూలు స్థాయి పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా రాశారు రంగనాయకమ్మ గారు.

ఈ  పుస్తకం...  ఈ-బుక్ గా కినిగెలో లభిస్తోంది. లింకు- 

http://kinige.com/kbook.php?id=950&name=Pillala+Kosam+Ardhika+Sastramబొగ్గు కంటే బంగారానికి విలువ ఎక్కువని మనందరికీ తెలుసు.

ఎందుకనో ఎప్పుడైనా ఆలోచించారా?


‘బొగ్గు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. బంగారం ఎక్కడో కానీ దొరకదు. అందుకే దానికంత విలువ’ అనే సమాధానం తడుతోంది కదూ!


కానీ ఇది నిజం కాదు. ఏ వస్తువుకు ఉన్న విలువ అయినా ఆ పదార్థానిది కాదు. ఆ వస్తువు కోసం జరిగిన శ్రమలదే. బంగారం సంగతైనా ఇంతే!


భూమిలో నుంచి కిలో బరువున్న బొగ్గును తవ్వడం కోసం చెయ్యాల్సిన శ్రమ 2 గంటలనుకుందాం. కిలో బంగారాన్ని తవ్వాలంటే దానికి వేల రెట్ల శ్రమ అవసరమవుతుంది. ఎక్కువ శ్రమకు ఎక్కువ విలువ. తక్కువ శ్రమకు తక్కువ విలువ.


బంగారానికి ఎక్కువ శ్రమ పట్టడానికి కారణం, తక్కువగా దొరుకుతుంది కాబట్టే !

అన్ని దేశాల్లోనూ అసలైన డబ్బు బంగారమే. కాయితం డబ్బుకి గానీ, ఇంకో రకం డబ్బుకి గానీ అసలు మూలం బంగారమే. బంగారం బిళ్ళలు చలామణిలో తిరిగితే అరిగిపోతాయి కాబట్టి, ఆ తిరిగే పని బంగారం బిళ్ళకి బదులు కాయితం ముక్క చేస్తోంది. ప్రపంచ ధనం మాత్రం బంగారమే!నుషులు ఏ శ్రమలూ చెయ్యకుండా, ఒక రోజు నుంచీ హఠాత్తుగా శ్రమలన్నీ మానేస్తారని ఊహించండి. అప్పుడు ఏం జరుగుతుంది?


పొలాల్లో పనులూ, ఇతర పనులూ మానెయ్యాలి.

వంటలు మానెయ్యాలి.

బట్టలు ఉతుక్కోవడం, ఇళ్ళు శుభ్రం చేసుకోవడం, నీళ్ళు తెచ్చుకోవడం అన్నీ మానెయ్యాలి.

అప్పుడు-

ఇళ్ళల్లో సిద్ధంగా ఉన్న పళ్ళూ రొట్టెలూ లాంటివి ఉంటే తింటారు. సిద్ధంగా ఉన్న నీళ్ళు తాగుతారు. 2, 3 రోజులు అయ్యేటప్పటికి అన్నీ అయిపోతాయి. తర్వాత పిల్లలకు తిండి ఉండదు. తాగే నీళ్ళు ఉండవు. వెంటనే జబ్బులు మొదలవుతాయి. వైద్యం చేయడం ఆగిపోతుంది కాబట్టి ఏ మందూ ఉండదు. 2 రోజుల్లోనే, మొదట పిల్లలు చచ్చిపోవడం మొదలవుతుంది.


తర్వాత, అప్పటికే జబ్బులతో ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. మంచి నీళ్ళు కూడా లేక, 3 రోజుల్లోనే చాలా జనం చచ్చిపోతారు. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు అక్కడే పడివుంటారు. వాళ్ళని పూడ్చి పెట్టడాలూ, దహన క్రియలూ లాంటి పనులేవీ జరగవు. జంతువులకు తిండీ నీళ్ళూ ఆగిపోతాయి కాబట్టి, అవీ పడిపోతాయి. జంతువులూ, పిల్లలూ, పెద్దలూ అందరూ, ఇళ్ళలోనూ, వాకిళ్ళలోనూ, రోడ్ల మీదా చచ్చిపడివుంటారు.

 ఘోరాన్ని భరించలేక, ఎలాగైనా బతకాలనుకునేవాళ్ళు, అడవుల్లోకి పరిగెత్తుతారు. అక్కడ చెట్ల మీద ఏమన్నా దొరికితే తాగుతారు. అలా, ఆకలితో మాడుతూ, చెట్ల కింద తిరుగుతూ, కొన్నాళ్ళు గడుపుతారు. బట్టలన్నీ పీలికలైపోయి, ఆఖరికి నగ్నంగా మిగులుతారు. బట్టలు పోయిన క్షణం నించీ ఇక వాళ్ళు, జంతువులే. మానవ జంతువులు. జంతువులైతే అడవుల్లో హాయిగానే బతుకుతాయి. మానవ జంతువులు, అడవుల్లో ఎన్నో రోజులు బతకలేరు.

అంటే- మనుషులందరూ శ్రమలన్నీ మానెయ్యడం జరిగితే, మొత్తం మానవ సమాజమే అంతర్థానమైపోతుంది!

శ్రమలే చెయ్యకుండా మనుషులు జీవించడం ఏనాటికీ సాధ్యం కాదు!


స్తువుకు ఉండే విలువ గురించి పరిశోధన 2 వేల ఏళ్ళకిందటే ప్రారంభమైంది. ఈ పరిశోధన గ్రీకు మేధావి అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) తో మొదలై, ఇంగ్లండ్ మేధావి రికార్డో (క్రీ.శ. 1772-1823) ద్వారా 2 వేల ఏళ్ళ పాటు సాగింది. 1867లో కార్ల్ మార్క్స్ ‘విలువ’ పరిశోధనలో ‘శ్రమ దోపిడీ’ రహస్యం బయటపడింది.


ఈ పుస్తకం చదివితే...ఇలాంటి విషయాలెన్నో తెలుస్తాయి. మన చుట్టూ ఉంటూ, మనం గమనించని, అర్థం చేసుకోని  చాలా విషయాలు!