సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, అక్టోబర్ 2010, ఆదివారం

అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!


ఎంటీవీ ఆచార్య! ...

ఈ చిత్రకారుడి పేరు 2006 ఆగస్టులో తొలిసారి నాకు  తెలిసింది. (మడిపడగ బలరామాచార్య అనే చిత్రకారుడి బొమ్మలు మాత్రం అప్పటికే తెలుసు. ఆయన ఎన్నో ఏళ్ళ క్రితం పాఠశాల పాఠ్యపుస్తకాలకు చక్కటి బొమ్మలు వేశారు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈ మాట’లో  ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసంలో ఆచార్య గారి గురించి చాలా గొప్పగా రాశారు. ఇలా...

‘‘మహా భారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ ఆయన అద్భుతమైన బొమ్మలు గీశారు. ఆయనకు మనుషుల ఎనాటమీ క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీసినట్టు గుర్తు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు మేకప్‌ అంతా “చందమామ”కు కాపీ అని నా ఉద్దేశం.’’


చందమామలో ‘మహా భారతం’ అంటే నాకు శంకర్ బొమ్మలే తెలుసు. ఆచార్య గారు అంతకుముందే మహాభారతానికి ఇంత సుదీర్ఘ కాలం అద్భుతమైన బొమ్మలు వేశారనే సంగతి అప్పుడే తెలిసింది. విపరీతమైన ఆసక్తి ఏర్పడి, ఆయన వివరాల కోసం నెట్ లో అన్వేషించాను. కొన్ని వివరాలే తెలిశాయి. తర్వాత నాగమురళి బ్లాగు ద్వారా www.ulib.org లో పాత చందమామల ఆచూకీ తెలిశాకే ఆచార్య గారి వర్ణచిత్రాలను చూసే అవకాశం కలిగింది.

కానీ ఆయన ఫొటో దొరకనే లేదు!


తాజాగా అక్టోబరు నెల చందమామ ముఖచిత్రంగా ఆచార్య గారి బొమ్మనే ప్రచురించారు. ఈ సందర్భంగా   టపా రాద్దామనుకునేలోపే రాజశేఖరరాజు గారు చందమామ చరిత్ర.లో రాసేశారు.:)


పైన ‘కీచక వధ’ ఘట్టాన్ని ఎంత  బాగా చిత్రించారో చూడండి. అస్పష్టమైన చీకటి నేపథ్యంలో భీమ, కీచకుల పోరాటం, ద్రౌపది హావభావాలు గమనించండి!అంతకుముందు భీముడితో  మొరపెట్టుకుంటున్నద్రౌపదిఆచార్య గారి చిత్ర కళా వైభవం ‘చందమామ కలెక్టర్స్ ఎడిషన్లో’ ఇచ్చిన ఈ రెండు బొమ్మల్లో చూడవచ్చు. మరికొన్ని బొమ్మలు చూడండి....

ఉత్తర గోగ్రహణంఉత్తర కుమారుడి ప్రగల్భాలు 
ఉత్తరకుమారుడి యుద్ధ భీతి

                కంకుభట్టు రక్తం చిందకుండా సైరంధ్రి ప్రయత్నం

యమధర్మరాజుతో సావిత్రీ సత్యవంతులు

నర్తన శాలలో బృహన్నలా, ఉత్తరా
పార్థుడూ,  సారథీ
‘బావా!  ఎప్పుడు వచ్చితీవు’ కి ముందు
బాలకృష్ణుడి దగ్గరకు వస్తున్న పూతన

అజ్ఞాతవాసంలో ద్రౌపదీ, పాండవులూ