సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, డిసెంబర్ 2011, శనివారం

శ్రవణానంద కారకా... ఇళయరాజా ! (పార్ట్-2 )పాటల బాణీలు బాగుంటే వాటిని పాడుకుంటూ వుంటాం.  మధ్యలో వచ్చే ఇంటర్ ల్యూడ్స్ ని పెద్దగా పట్టించుకోం. అయితే  వీటికి కూడా కొత్తందాలు చేర్చటం  ఇళయరాజా ప్రత్యేకత.   
( మౌనగీతం లోని పరువమా... చిలిపి పరుగు తీయకే.. పాట కంటే  ఇంటర్ ల్యూడ్సే నాకు అత్యంత ఇష్టం )
శ్రీరామరాజ్యం పాటల్లో  ఇంటర్ ల్యూడ్స్ శ్రావ్యంగా, మధురంగానే కాకుండా కొత్తగా,  గమ్మత్తుగా కూడా ఉంటాయి. పాటలను  ఇవి  సహజంగా,  అందంగా  అలంకరించేశాయి. 
 సినిమా  పాటల్లోని కొన్ని  ఇంటర్ ల్యూడ్స్ క్లిప్స్ ను ఈ టపాలో  ఇవ్వబోతున్నాను.
అవి  మాత్రమే వినిపించటం కోసం లిరిక్ నీ, గాయకుల గాత్రాన్నీ తొలగించాల్సివచ్చింది.  ఆ పాటలను బాగా  ఇష్టపడేవారు తప్పనిసరి  రసభంగానికి  మన్నించాలి. 

దేవుళ్ళే మెచ్చింది -  మీ ముందే జరిగింది...
ఈ పాటలో   ... పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే... అనే ప్రయోగంలోని చమత్కారం బాగుంటుంది.  ఆ  తర్వాత  వినిపించే వాద్య సంగీతం ఎంత సమ్మోహనంగా ఉంటుందో,  సీత పాత్రను ధరించిన  తార  నయనాభినయం  అంత ఆహ్లాదకరం !
శ్రీరామ లేరా ఓ రామా...’


ఈ పాట లోని  వాద్య సంగీత ఝరి  ఆరంభం నుంచీ  చివరివరకూ  కొత్త తరహాలో ... సింఫనీని స్ఫురింపజేస్తూ  కర్ణపేయంగా వినిపిస్తుంది.  


ఇళయరాజా అలనాటి ఇన్ స్ట్రుమెంటల్  ఆల్బమ్  ‘నథింగ్ బట్ విండ్’  సంగీతం  తలపుకొస్తుంది.   

 ‘రామాయణమూ  శ్రీ రామాయణమూ..’ 

నాకెంతో బాగా నచ్చిన పాట ఇది.  బాణీ మాత్రమే కాకుండా  మధ్యలో కూర్చిన ఇంటర్ ల్యూడ్స్  వల్ల కూడా ఈ పాట ఆకట్టుకుంటుంది.  ‘శ్రీరామ పట్టాభిషేకం... ’  లిరిక్ కి ముందు వచ్చే వాద్య సంగీతం గమనించండి.    విషాదసూచకంగా ధ్వనిస్తూ  వింత అనుభూతినిస్తుంది.  ‘... చెదరని దరహాసం ... కదిలెను వనవాసం’ కి ముందు వచ్చే ధ్వని సంచయం  కూడా శ్రవణానందకరం.పాట మొత్తం వినాలనుకున్నవారి కోసం....

నేటి యువతరాన్ని లక్ష్యం చేసుకుని పద్యాల హడావిడి లేకుండా,  వేదాంత ధోరణితో ప్రౌఢంగా కాకుండా వీలైనంత సరళంగా తీసిన  ‘శ్రీరామరాజ్యా’నికి   సంగీత శాఖ  పెద్ద ఎసెట్ అనే భావిస్తున్నాను.


కొత్తదనంతో పరిమళించిన ఈ సంగీతం ఇళయరాజా  చాలా కాలం తర్వాత అందించిన   శ్రావ్యమైన ఆడియో.  


బాధ్యతగా బాణీలను కట్టి,  శ్రద్ధతో  మనసుపెట్టి   రీ రికార్డింగుని  సమకూర్చి - అందరినీ కాకపోయినా  అభిమాన శ్రోతల్లో చాలామందిని  సంతృప్తి పరిచాడు  మేస్ట్రో !


ఈ టపా మొదటి భాగం ఇక్కడ చూడండి. 

23, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రవణానంద కారకా... ఇళయరాజా ! (పార్ట్-1)


మాటలు విఫలమయ్యే చోటే  సంగీతం ప్రారంభమవుతుంది - ఇళయరాజా  రీ రికార్డింగ్ విశేషాలను తెలిపే ఓ   వెబ్ సైట్ హోమ్ పేజీలో కనపడే  వ్యాఖ్య ఇది.  

సినిమాల్లో  సంభాషణలకు ఆస్కారం లేని,  మాటలేవీ  పనిచేయని  దృశ్యాలుంటే  అక్కడి భావం ప్రేక్షకులకు అందించాలంటే ఎలా? ఇక్కడే  పాట సాయానికి వస్తుంది.

మరి   పాట అవసరం లేని,  దానికి  అవకాశం లేనిచోట  నేపథ్య సంగీతమే దిక్కు.   ఈ విషయంలో మనకున్న పెద్ద దిక్కు ఇళయరాజాయే!

చలనచిత్రాల్లోని  కొన్ని  సన్నివేశాలు  నీరసంగా ఉంటే..  వాటికి  నేపథ్య సంగీతం జోడించి  వాటికి  ఊపిరి పోసి ఊపునిస్తాడు  ఇళయరాజా!  నిస్సారంగా తోచే  దృశ్యాలు కూడా  ఆయన కూర్చిన ధ్వని ముద్రతో ,  ఒక్కోసారి  హఠాత్తుగా ఆగిపోయిన శబ్దంతో ...  నిశ్శబ్దంతో  వన్నెల వెలుగులద్దుకుంటాయి.  అనితరసాధ్యమనిపించేలా   అవసరమైన మూడ్ ని  సృష్టిస్తాయి.  (రీ రికార్డింగ్ లో ఇళయరాజా ప్రతిభను తెలుసుకోవాలంటే  మ్యూట్ లో దృశ్యాలను చూస్తే సరి!)

రీ రికార్డింగ్ కళలో  ఇళయరాజా ప్రతిభా సంపత్తిని చాటే  తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి.  సితార, గీతాంజలి, శివ, నాయకుడు’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’,  అన్వేషణ ....

తాజా ఉదాహరణ శ్రీరామరాజ్యం !

 మరల నిదేల శ్రీరామ రాజ్యమం’టే....
నిజమే.  ఈ సినిమా మంచి చెడ్డల గురించి వెబ్ సైట్లలో, బ్లాగుల్లో,  ఆన్ లైన్ మ్యాగజీన్లలో  ఇప్పటికే ఎన్నో టపాలు వచ్చేశాయి.  అయితే ఇది సమీక్ష కాదు. కనీసం పాటల విశ్లేషణ కూడా కాదు. కేవలం నేపథ్య సంగీతం గురించి మాత్రమే!

ఈ సినిమాకు   సమకూర్చిన సంగీతం విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.  ‘ఇళయరాజాకు ఏం పుట్టిందో ... విదేశీ వాద్యాలు ఉపయోగించాడు’ అని చిరాకు పడినవారున్నారు.  అయితే సంగీత వాద్యాల విషయంలో స్వదేశీ, విదేశీ అనే భేదం లేదనీ, కొన్ని పరదేశ వాద్యాలు మన సంగీతంలో భాగమైపోయాయనీ  బాలు ఈ మధ్యే ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.

నాకైతే  ఈ సినిమాలో పాటలు బాగా  నచ్చాయి.  సంగీతం కొత్తగా,  వినసొంపుగా,  మధురంగా  ఉంది. . రీ రికార్డింగు చాలాచోట్ల ఎంతో బాగా వచ్చింది.  మరపురాని మెరుపులెన్నో వినిపించాయి. పాటల మధ్యలో ని ఇంటర్ ల్యూడ్స్ ఇంకా ఇష్టంగా అనిపించాయి. 

వాటిని సరదాగా  పంచుకోవటానికే ఈ టపా !

దు:ఖోద్వేగ భరితం
శ్రీరామరాజ్యం సినిమాలో  గుర్తుండిపోయే సన్నివేశాల్లో  రాముడు  సీత కాళ్ళ దగ్గర తలపెట్టుకుని దు:ఖించటం ఒకటి.  శయన మందిరంలో నిద్రపోతున్న ఆమెను హృదయభారంతో రాముడు చూసే విషాదభరిత సన్నివేశానికి  గాఢతను అద్దుతూ  సమకూర్చిన  అర్థవంతమైన నేపథ్య సంగీతమిది.  

( ఈ ఎంపీత్రీ మాతృక అయిన యూట్యూబ్  వీడియో ను అందించిన  sharanKay కు కృతజ్ఞతలతో... ) 
 

 స్వర్ణసీతను చూసిన వేళ...
సినిమాలోని థీమ్ మ్యూజిక్.  వాల్మీకి మహిమతో  రామ మందిరంలోకి ప్రవేశించిన సీత  తన బంగారు ప్రతిమను అబ్బురంగా తిలకించే  సన్నివేశానికి ఇళయరాజా అందించిన  నేపథ్య సంగీతం... సీత మనసులో చెలరేగే  పరవశ మధుర భావాలకు శబ్దరూపాన్నిస్తూ... !
A melodious theme track from Ilayaraja's magnum opus "Sri Rama Rajyam". (Sita visits Rama mandiram, finds her own golden statue). This film's BGM is the best ever to come out from Indian film industry.
 
ఇదే సినిమాలోని థీమ్ ట్రాక్ వినండి. భావగర్భితంగా సాగే ఈ జంత్ర సంగీతం మధ్యలోకొచ్చేసరికి విచిత్ర అనుభూతికి గురిచేసేలా ఉంటుంది.
(పై  రెండు BGMs ను నవ తరంగం సైట్ ద్వారా  అందించిన  pkiran కు కృతజ్ఞతలు )
 
పాటలను అలంకరించిన ఇంటర్ ల్యూడ్స్ గురించి...  (రెండో భాగంలో)

30, నవంబర్ 2011, బుధవారం

ఇసుక శిల్పాల ఇంద్రజాలం!


‘తివిరి ఇసుమున తైలంబు’ తీయటం సుభాషిత కర్తకైనా కష్టమే.  నదుల, సముద్రాల ఒడ్డున  పడివుండే అలాంటి  ఇసుక నుంచి సమ్మోహనపరిచే కళను వెలికితీయటంలో మాత్రం ఆధునిక కళాకారులు అసమాన ప్రతిభా విశేషాలు చూపిస్తున్నారు.  

ఒక ఆకారం అంటూ లేకుండా  ఇష్టమొచ్చిన దిశలో జారిపోయే ఇసుక - వారి చేతుల్లో మంత్రముగ్ధ అయిపోతుంది.   జలంతో జత కట్టి  సరికొత్త రూపాలు ధరించటానికి ముస్తాబైపోతుంది.  

అయినా ఆ ఇసుకతో అబ్బురపరిచేలా  శిల్పాలను మలచటం, కోటలను కట్టటం అంత తేలికేమీ కాదు. దానికెంత సహనం,  నేర్పరితనం  ఉండాలి! ఈ సైకత కళలో రాణించాలంటే  విపరీతమైన శక్తి, శారీరక కష్టం అవసరమవుతాయి.  ఒక శిల్పం గానీ, కట్టడం గానీ రూపుదిద్దుకోవాలంటే  టన్నుల కొద్దీ ఇసుకను నేర్పుగా  ఉపయోగించాల్సిందే.   

ఇసుకతో  గూళ్ళూ, బొమ్మరిళ్ళూ కట్టటం పల్లెటూళ్ళలో పెరిగినవారికి అనుభవమే.  అలాంటి సరదా అభిరుచిని  భారీ స్థాయిలో నైపుణ్యంగా మలుచుకుని,  సంక్లిష్ట  సూక్ష్మవివరాలతో  ప్రాణ ప్రతిష్ఠ  చేసేవారే  సైకత కళాకారులు
    
అతి పెద్ద పరిమాణంలో  ఉండే ఆకారాలూ,  విచిత్ర జీవులూ, అనూహ్యంగా షాక్ చేసే ఘట్టాలూ ఈ కళలో ఎక్కువగా కనిపిస్తాయి.  భారీ బడ్జెట్  సినిమాల సెటింగ్స్ లాగా,  గాజా పిరమిడ్ దగ్గరుండే గ్రేట్ స్ఫింక్స్ మాదిరిగా  పెద్ద తలలూ,   మోడ్రన్ ఆర్ట్ లో మల్లే  దేహభాగాల  క్లోజప్ లూ  ఇట్టే మనల్ని ఆకట్టుకుంటాయి.

అంతలోనే అంతర్థానం    
శిలతో చేసేదయితే శాశ్వతంగా ఉండే అవకాశముంది.  ( అందుకనేగా,  మన రాజకీయ నాయకులకు  శిలా విగ్రహాలంటే అంత మోజు!

కానీ ఈ సైకత శిల్పాలకు ఆ భరోసా కూడా  లేదు, వీటి ‘జీవన’ కాలం స్వల్పమే.  ‘ఇసుక గడియారం’లో ఇసుకలాగా కాలం వేగంగా జారిపోతుంటే... వాతావరణంలో మార్పులు  ఎంతటి కళారూపాలనైనా  నిర్దయగా రూపం మార్చేస్తాయి.  

అయినా ఈ పరిమితులేవీ  సృజనకూ,  ఆస్వాదనకూ అవరోధం కావటం లేదు!  సమకాలీన ఘటనలపై తక్షణ స్పందనకు ఈ కళారూపం  గొప్పగా ఉపయోగపడుతోంది.   

సైకత శిల్పాలూ, కోటలే కాకుండా ఇసుక  పెయింటింగ్ కూడా చూసేవారిని అబ్బురపరుస్తుంది.  

చూడండి ఈ చిత్రం- 

 ఇప్పుడు ఈ డైనోసార్  సైకత  శిల్పం  చూడండి.... 

దీని పేరు  డైనో స్టోరీ.  ఏ ఒక్క కళాకారుడో కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ కళాకారులు  కొందరు బృందంగా ఏర్పడి  కలిసికట్టుగా ఆస్ట్రేలియాలో 2008/09 లో దీన్ని రూపొందించారు. 

సైకత కళా విన్యాసాలకు కొన్ని దృష్టాంతాలు.... 


నిద్రావస్థలోనో,  విశ్రాంతిలోనో  ఉన్న ఈ వదనం బాగుంది... కానీ పరిమాణం ఎంతుందో?

 ఇప్పుడు చక్కగా  తెలుస్తోంది...  ఎంత పెద్దదో!

మరికొన్ని ....


 సుదర్శన మాంత్రికుడు
నిజానికి ఈ సైకత  కళ ఒరిస్సా లో ప్రాచీన, మధ్యయుగాల్లో  ప్రాచుర్యంలో ఉండేదట. తర్వాత  ఇటీవలి కాలం వరకూ ఉనికిలోనే లేకుండా పోయింది.  

సైకత శిల్పం అనగానే మనందరికీ  గుర్తొచ్చే పేరు  సుదర్శన్ పట్నాయక్ ! ఒడిశా కళాకారుడైనా దేశమంతటికీ తెలిసిన వ్యక్తి. 

బడికి వెళ్ళటానికి వీల్లేకుండా చేసిన పేదరికం అతనిది. ఈ దుస్థితి అంతిమంగా అతనికి మంచే చేసిందనాలి.  12 ఏళ్ళ వయసులో సముద్రపుటొడ్డుకు వెళ్ళి ఇసుకతో బొమ్మలు చేయటం సొంతంగా నేర్చుకున్నాడు.  

తెల్లారకముందే ఇంటికి 3 కి.మీ. దూరంలో ఉన్న పూరీ గోల్డెన్ బీచికి వెళ్ళి ఇసుకతో దేవతల శిల్పాలు మలచటం, సూర్యోదయానికి ముందే వెనక్కి తిరిగివచ్చెయ్యటం... ఇదీ అతడి ప్రభాత దినచర్య. 
 
మనసాగక... మధ్యాహ్నం మళ్ళీ సముద్ర తీరానికి  వెళ్ళేవాడు. తను చెక్కిన  బొమ్మలను చూసి జనం ఏమనుకుంటున్నారో ఆసక్తితో గమనించేవాడు!
 
కళానైపుణ్యం క్రమంగా పదునెక్కింది. జనం మెచ్చుకోవటమూ పెరిగింది. అలా మొదలైంది, సైకత కళతో సుదర్శన్ సహవాసం.  

ఒరిస్సాలో ఏడో శతాబ్దంలో ఈ కళ ఉండేదట. 14 వ శతాబ్ది రచనల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత ఈ కళ  అంతరించిపోయింది. 

దీని పునరుజ్జీవానికి అనుకోకుండానే  కారకుడయ్యాడు సుదర్శన్.

అతడి కళా చాతుర్యానికి కొన్ని తార్కాణాలు...

కోణార్క్ ఆలయ నమూనాకు రూపమిస్తూ...


సముద్రుడు 

ధ్యాన బుద్ధుడు

బిస్మిల్లా ఖాన్ కు నివాళి


గణేశుడు


హరిత దుర్గ

కళకు కొత్త రూపునివ్వటమే అతడి విజయ రహస్యం. తాజా సంఘటనలనూ, వర్తమాన సమస్యలనూ తన కళలో వెనువెంటనే ప్రతిఫలిస్తాడు.  ఇతడి కళ ప్రాచుర్యం పొందటంలో  టీవీల,  పత్రికల పాత్ర కూడా ఉంది.


భూతాపం కావొచ్చు, అంతరించిపోతున్న జీవులూ, హెచ్ఐవీ- ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులూ కావొచ్చు. పండగలూప్రసిద్ధ వ్యక్తులకు నివాళులూ ...  ఏదైనా ఈ సైకత కళలో ఒదిగేలా చేయగలడు, తన కళాచాతుర్యంతో  వాటిపై అందరిలో కాసేపైనా ఆలోచనలు రేగేలా చేయగలడు.  

చల్లని సైకత వేదిక...
డిసెంబరు 1 నుంచి 5 వరకూ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ (అంతర్జాతీయ సైకత కళోత్సవం)  జరగబోతోంది.  ఒడిశా లోని కోణార్క్ దగ్గరున్న చంద్రభాగ బీచ్ దీనికి వేదిక.  

దీనికి బ్రాండ్ అంబాసిడర్ మరెవరో కాదు, సుదర్శనే
చిన్నపుడు చదువుకోవటం కుదరని సుదర్శన్ తన కళతో పాటు ఎదిగి మాతృభాష ఒరియాలోనే కాకుండా మరో మూడు భాషల్లో పరిజ్ఞానం పెంచుకున్నాడు. Sand Art గురించి పుస్తకమూ రాశాడు. 

అతడి ఈ- మెయిల్  id ఇదీ- sudarsansand@gmail.com

28, అక్టోబర్ 2011, శుక్రవారం

మనుషులూ... మతాలూ... దేవుళ్ళూ!

మధ్య నేను ఎక్కువగా చదివినవి రచయితల స్వీయ కథలూ,  యదార్థ గాథలే.  ఈ  పరంపరకు భిన్నంగా వైజ్ఞానిక దృక్పథంతో సాగిన ఓ రచనను కొద్దిరోజుల క్రితం చదివాను.

ఈ వ్యాస సంకలనం  పేరు ‘మనుషులు చేసిన దేవుళ్ళు’. శాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత  కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన.  ఈ- పుస్తకం లభించే  కినిగె లింకు- http://kinige.com/kbook.php?id=397&name=Manushulu+Chesina+Devullu

ఈ పుస్తకం పేరు విన్నపుడు వందేళ్ళ క్రితం గురజాడ రాసిన కథ శీర్షిక – ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?’ గుర్తొస్తుంది.

‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగునుఅని  ఆ మహాకవి ఎందుకు ఆకాంక్షించాడో  స్పష్టమవుతుంది.

మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషణ చేసిన పుస్తకమిది.  ఆస్తికులుగానో, నాస్తికులుగానో ఉండకుండా తటస్థంగా ఉన్నవారికి ఈ రచన ఎక్కువ ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా హేతువాద దృక్పథం ఉన్నవారు తమ భావాల శాస్త్రీయ ప్రాతిపదిక కోసం ఇది తప్పనిసరిగా  చదవదగ్గది. 

‘మరి భక్తి విశ్వాసాలున్నవారు ఈ  పుస్తకం చదవకూడదా?’ అంటే చదవొచ్చు.   

ఈ ప్రపంచం మనిషి కోసమే ఉందనీ, మానవులుగా  పుట్టటం ఎంతో ఉత్కృష్టమైన విషయమనీ నమ్మేవారికి ఈ భూగోళమ్మీద మనిషి ఎంతో జూనియర్ అనీ, అతడి ప్రమేయం లేకుండా ఎంతో సుదీర్ఘకాలం గడిచిందనీ చెప్పే సైన్స్ వివరణ అంత తేలిగ్గా మింగుడుపడకపోవచ్చు.  ‘‘చావు విషయంలో మనకూ, ఊరకుక్కలకూ, బొద్దింకలకూ తేడా ఏమీ ఉండదని నమ్మడం ఏ మనిషికైనా చాలా కష్టమే’’  అంటారు రచయిత ఈ పుస్తకంలో. 

తాము విశ్వసిస్తూ పాటిస్తున్న భావాలకు మూలాలేమిటో  వేరే కోణంలో చదవటం- మత విశ్వాసాలున్నవారికి భిన్నమైన అనుభవమే అవుతుంది కదా?

పుస్తకంలో ప్రస్తావించినవాటిలో దేని గురించి అయినా వివరాలు కావాలంటే రచయిత ఈమెయిల్ rohiniprasadk@yahoo.com  ద్వారా సంప్రదించే అవకాశముంది.
 

 ‘ఏ మాత్రమూ ఆవేశానికీ, ఉద్వేగాలకూ, ముందే మనసులో ఉన్న మార్క్సిజం వంటి సిద్ధాంతాలకూ లోబడకుండా మతాల గురించి విశ్లేషణ చేసుకోవచ్చు. కాస్త ప్రాథమిక విజ్ఞాన వైఖరి ఉంటే చాలు’ అంటారు ఉపోద్ఘాతంలో రచయిత.

ఈ పుస్తకం గురించి అక్టోబరు 23 ఈనాడు సండే మ్యాగజీన్ లో చిన్న పరిచయం రాశాను.


రచయిత మాటల్లో...
ఈ పుస్తకంలో ఆలోచనాత్మకంగా, ఆసక్తికరంగా ఉన్న కొన్ని అంశాలను యథాతథంగా ఇస్తున్నాను.


తాల గురించి విజ్ఞానపరంగా ఆలోచించడం సబబు కాదని చాలామంది అనుకుంటారు. వీరిలో మతాలలో నమ్మకం లేనివారు కూడా ఉండవచ్చు. మతాలు అకస్మాత్తుగా తలెత్తినవి కావనీ, మానవ సమాజం పరిణామ దశల్లో మొదలైనవేననీ గుర్తుంచుకుంటే మతాలనేవి ప్రజల మనసుల్లో ఎలా రూపు దిద్దుకున్నాయో అర్థమవుతుంది.

*   *    *

1400 కోట్ల ఏళ్ళ వయసు గల విశ్వంలో భూమి పుట్టి 500 కోట్ల ఏళ్ళు కూడా కాలేదు. జరుగుతున్నవి చూసి, అర్థం చేసుకోగలిగిన మానవజాతి మొదలై 2 లక్షల ఏళ్ళు కూడా గడవలేదు.

... భూమి వయసుతో పోలిస్తే మనవంటి జీవరాశి వయసు చాలా తక్కువన్నమాట. మొదటి 400 కోట్ల సంవత్సరాల కాలంలో ఎవరైనా గ్రహాంతర యాత్రికులు భూమిని సందర్శించినట్టయితే వారికి కనబడే  జీవపదార్థం కేవలం నాచు లాంటిది మాత్రమే అయివుండేది.

... జీవకణాలు పుట్టిన ఎంతోకాలానికి గానీ మానవజాతి రూపొందలేదు. అందుకనే ఈ ప్రపంచమంతా మనుషుల కోసమే అనే భావన అర్థం లేనిదిగా అనిపిస్తుంది. అంతేకాక మనిషీ, దేవుడూ, జీవాత్మా, పరమాత్మా అంటూ మనవాళ్ళు అల్లుకునే ఊహలు ఎంత సంకుచితమైనవో తెలుస్తుంది.

*   *    *

దేవుళ్ళూ, పూనకాలూ, దెయ్యాలూ, చేతబడులూ, ప్రేతాత్మలూ అన్నీ ఎంతో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న మూఢనమ్మకాలు.
*   *    *

తాలంటే కేవలం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టటమే కాదు.  పునర్జన్మలూ, బాబాల మహిమలూ, జాతకాలూ, చిలకజోస్యం అన్నీ కూడా కంటికి కనబడని అతీత శక్తిలోని నమ్మకాలకు దృష్టాంతాలే.  ఈ భ్రాంతికి కారణాలు-
కొన్ని చరిత్రాత్మకమైనవి,
కొన్ని సామాజికమైనవి,
కొన్ని బూటకపు మోసాల ఫలితాలు,
మరికొన్ని మన నాడీమండలం మనమీద కలిగించే ప్రభావాలు.


*   *    *

న శరీరంలో పెద్దపేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు మనకు పనికొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేకపోగా అప్పుడప్పుడూ అపెండిసైటిస్ వ్యాధిని కూడా కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.  

ఉపసంహారం
మెదడుపై జరుగుతున్న ఆధునిక పరిశోధనలవల్ల  తెలిసిన ఒక  విషయం గురించి రచయిత ఈ పుస్తకంలో ప్రస్తావిస్తారు. 

అదేమిటంటే... 

ఉన్నవీ, లేనివీ కల్పించుకునే అనవసరమైన ఊహాశక్తి ప్రకృతిసిద్ధంగా మన మెదడుకు అలవడిన లక్షణమట.  అందుకే పూర్తిగా హేతువాదవైఖరి కలిగినవారు చాలా అరుదుగా ఉంటారట.

అసలు మన సమాజంలో  హేతువాదులే  చాలా తక్కువమంది. ఆ తక్కువమందిలో కూడా పూర్తి హేతువాదులు  మరీ స్వల్పం!  దీనికి మెదడుకు  అలవడిన లక్షణం కూడా కారణమన్నమాట!

సమాజంలో హేతువాద భావనలు బలపడేందుకు కృషి మరింత పట్టుదలతో  జరగాలని ఆకాంక్షిస్తూ ముందుమాటలో ఇలా రాశారు టంకశాల అశోక్ -

‘మనిషిని, ప్రకృతిని, సమాజాన్ని, వ్యవస్థలను, ఇటీవలి చారిత్రక పరిశోధనలను తరచి చూసి రాసిన ఈ వ్యాసాల సంకలనం ఇప్పటికే హేతువాదులైనవారికి కూడా చదవదగినది అవుతున్నది’

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఎన్టీఆర్... అక్కినేనీ ... ‘కళర్ మాంత్రికుడూ’!

హాభారతంలో భీముడెలా ఉంటాడు?

ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానాన్ని అన్నదమ్ముల్లాగా తలవంచుకుని భరించలేక  ఆగ్రహావేశాలతో ఊగిపోతూ భీముడు చేసిన శపథాన్ని  వెయ్యి సంవత్సరాల క్రితమే నన్నయ ఇలా వర్ణించాడు -

‘ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరు దేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్’


70 ఏళ్ళ క్రితం శ్రీశ్రీ ‘జ్వాలాతోరణం’లో భీముణ్ణి కళ్ళకు కట్టాడు.

‘... కురుక్షేత్రమున కృద్ధ వృకోదరు
గదాఘాతమున గజగజలాడగ ...’


46 సంవత్సరాల కిందట వచ్చిన ‘పాండవ వనవాసం’లో భీముడి పాత్ర పోషణ చేసిన ఎన్టీఆర్  హావభావాలు చిరస్మరణీయం.

వాల్ పోస్టర్లలో వాటికి వన్నెలద్ది, మెరుగుపరిచి సినీ అభిమానులను సమ్మోహనపరిచిన చిత్ర కళానైపుణ్యం పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ది!ఒరిజినల్ లో ఉన్న భీమసేనుణ్ణి  ఎంతగా ఇంప్రొవైజ్ చేశారో చూశారా? తలను కొంచెం వంపుతిప్పటం వల్ల మెరుగుదల వచ్చింది. ఇక స్వర్ణాభరణాల నగిషీల పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పదేముంది?


ఆలోచనలో, విచారంలో  నిమగ్నత..  తర్వాత  ఉగ్రమూర్తిగా రౌద్రం...!

కృద్ధ వృకోదరుడి హావభావాలు  చూడండి-

కొంచెం క్లోజప్ లో....  క్లోజ్ క్లోజప్ లో...!

శ్వర్  రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకం ఈ మధ్యనే విడుదలైంది.  దానిలో  ఇచ్చిన  వర్ణచిత్రాలివి. 


ఎన్నో విశేషాలతో రూపొందిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని (చవి) చూసిన అనుభూతి తో ఈశ్వర్ గురించి నాలుగు మాటలు ఇలా.. రాయాలనిపించింది.

ఈ- పుస్తకంగా  దీన్ని  చదవాలనుకున్నవారు  చూడాల్సిన  కినిగె లింకు- 
http://kinige.com/kbook.php?id=1852&name=Cinema+Poster

కొన్ని దశాబ్దాల క్రితం అయస్కాంతంలా ఆకట్టుకునేవి సినిమా ప్రకటనలు. వాటి కిందిభాగంలో ESWAR అనో, గంగాధర్ అనో సంతకాలను గమనించి, ఆ చిత్రకారుల కళను ఆరాధనగా చూస్తూ, వాళ్ళ సంతకాలూ, రాసే అక్షరాల తీరూ అనుకరిస్తూ ఆనందిస్తూ మురిసిపోయేవాణ్ణి.
చందమామకు చిత్రా, శంకర్ లు ఎలాంటివారో వెండి(తెర) చందమామకు ఈశ్వర్, గంగాధర్ అలాంటివాళ్ళనిపిస్తుంది. వీరిలో ముగ్గురి పేర్లు శివుడితో సంబంధమున్నవి కావటం ఆసక్తికరం!


‘ప్రకటనా చిత్ర కళలో
కళని నిలువెత్తుగా నిలబెట్టి
పోస్టర్ పోర్ట్రైట్ స్థాయికి
పెంచి చూపెట్టిన
కళర్ మాంత్రికుడు..’


అంటూ బాపు, రమణల ప్రశంసలు పొందిన కళాకారుడు ఈశ్వర్.  

క్కినేని నాగేశ్వరరావు అనగానే గుర్తొచ్చే చిత్రం ఒకటుంది కదా! స్టిల్ ఫొటోగ్రాఫర్ మన సత్యం దీన్ని తీశారనుకుంటాను. ఆ ఫొటోను రేఖల్లో, రంగుల్లో రూపచిత్రంగా ఈశ్వర్ ఎలా మలిచారో చూడండి...

వర్ణచిత్రం లేతవయసును ప్రతిబింబిస్తోంది. రేఖాచిత్రంలో మీసాలు చిత్రించి  కొంచెం వయసును పెంచినట్టుంది! 

‘సినిమా పోస్టర్ ’ పుస్తకం గురించిన పరిచయం కాదిది. కానీ ఓ మాట చెప్పకుండా ఉండలేను.

పుస్తకం  చివర్లో ఇచ్చిన వర్ణచిత్రాలు న భూతో.. !

ఇక వివిధ సినిమాల, నటీనటుల
నలుపు తెలుపు  
రూపచిత్ర 
విన్యాసమంటారా..!  

----------------------------------------------------------------------
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 
----------------------------------------------------------------------
తాజా చేర్పు:
టపాను  ‘నమస్తే ఆంధ్ర ’  మ్యాగజీన్ లో మే 2012లో  ప్రచురించారు.  చూడండి. 30, ఆగస్టు 2011, మంగళవారం

రంగనాయకమ్మగారి నవల కాని నవల!చాలా కాలం తర్వాత రంగనాయకమ్మ గారి సీరియల్ ప్రచురితమవుతోంది.  ‘నవ్య’ వీక్లీ లో 29 వారాలుగా  వస్తోందీ ధారావాహిక.  

పేరు ‘కళ్ళు తెరిచిన సీత’

ఇదో  కొత్త సాహితీ ప్రక్రియ.  ఇది కథో,   నవలో కాదని  రంగనాయకమ్మగారన్నారు. నాకైతే నవలగానే అనిపిస్తోంది.


సీరియల్ పూర్తి కాకుండానే దీని గురించి రాయటానికి  కారణం...  దీనిలో ఎన్నో విశేషాలుండటం! 

కల్పన లేని వాస్తవిక సంఘటనలకు  అక్షర రూపకల్పన ఇది.  (తాజా కలం:  పుస్తకరూపంలో వెలువడిన ఈ నవల కాని నవలను ఈ-బుక్ గా చదవాలంటే  ....    http://kinige.com/kbook.php?id=944&name=Kallu+Terichina+Sita )

సీత  (మారు పేరు) అనే హైదరాబాద్ అమ్మాయి  పెళ్ళి చేసుకుని  భర్తతో అమెరికా వెళ్ళింది.  అక్కడ కష్టాలు పడింది,  అవమానాల పాలైంది.

పెళ్ళి విషయంలో పొరబడ్డానని గుర్తించి,  చివరకు  స్నేహితుల సాయంతో భర్త బారి నుంచి  బయటపడింది.


రచయిత్రి  స్వయంగా దీనిలో ఒక పాత్రధారి.

ఆమె కొడుకు, కోడలు, వాళ్ళ పాపాయి మాలతీ, బాబు స్పార్టకస్...  వీళ్ళే కాదు,  రంగనాయకమ్మ గారి పాఠకులు (అభిమానులు అనే మాట ఆమె ఉపయోగించరు)  కూడా ఈ సీరియల్లో తారసపడతారు.

సీత అమెరికా లోని భర్త ఇంటి నుంచి తప్పించుకుని,  విమానంలో హైదరాబాద్ చేరుకునే ఘట్టం ఉత్కంఠభరితంగా  ఉంటుంది.

ఇలాంటి  సీరియస్  సీరియల్లో కూడా అక్కడక్కడా రచయిత్రి మార్కు  హాస్యపు  చెళుకులూ,  జోకులూ, వ్యంగ్య వాఖ్యలూ  ఆహ్లాదపరుస్తుంటాయి.  

ఈ సీరియల్లో చర్చించిన విషయాలను అభినందిస్తూ, విమర్శిస్తూ  వచ్చే పాఠకుల లేఖలు కూడా ఆసక్తికరం.  ఇందులో ప్రస్తావించిన వ్యక్తులు ‘మెయిల్ బాక్సు’లో పాఠకులుగా  తమ అనుభవాలు పంచుకోవటం గమ్మత్తయిన  విశేషం.  సీత తండ్రి ,  శ్యామల (ఈమె  సీత కు అమెరికాలో  సాయపడింది)  తండ్రి  ఇలాగే తమ అభిప్రాయాలతో లేఖలు రాశారు. 

క్లిష్టమయిన ప్రక్రియ

రచయితలెవరికైనా  కల్పిత కథను రాయటం మంచినీళ్ళ ప్రాయం. సంఘటనలను ఎలా పడితే అలా కూర్చే సౌలభ్యం ఉంటుంది. 

కానీ వాస్తవిక ఘట్టాలను కథగా మల్చటం తేలికైన పనేమీ కాదు.

వ్యక్తుల స్వభావాన్ని చిత్రించేలా, వాస్తవికంగా  సంభాషణలు ఉండాలి. అన్ని కథల్లో లాగా రచయిత ‘సర్వాంతర్యామి’లా  పాత్రల మనసులో ఆలోచనలను రాసే అవకాశం లేదు. చూడని,  తెలియని ఘట్టాలను ఊహించి రాసే అవకాశమే లేదు.  

స్వయంగా రచయిత్రే పాత్రధారి కావటం వల్ల...  రచయిత్రి నిద్రపోయినపుడు జరిగిన సంఘటనలను తెలుసుకుని,  తర్వాత వాటిని  రాయాల్సివస్తుంది.  ఇలాంటపుడు కథనం నీరసపడే ప్రమాదముంది.   ఇవన్నీ కథనానికి ఉన్న పరిమితులు!   

 కానీ ఈ ‘కళ్ళు తెరిచిన సీత’ కథనం కాల్పనిక నవలా అన్నట్టుగా సూక్ష్మ వివరాలతో,   సాఫీగా, ఆసక్తికరంగా సాగటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.  చర్చలూ, వరుస సంఘటనలూ, సంభాషణలూ ఇవన్నీ...   రచనా సామర్థ్యానికి గీటురాళ్ళుగా నిలిచేవే! 

నాకు  ప్రతి బుధవారం నవ్య కోసం  ఎదురుచూడటం ఈ మధ్య అలవాటైపోయింది.  ఆన్ లైన్లో ఒక వారం లేటుగా అప్ డేట్ అవుతుంది. పాత సంచికలను ఆర్కైవ్స్ లో చదవొచ్చు. ప్రస్తుత సంచికను ఈ లింకులో చూడొచ్చు.

పాఠకుల సందేహాలు

సీరియల్ ప్రచురించే పేజీల్లోనే  పాఠకుల ప్రశ్నలకు రంగనాయకమ్మగారిచ్చే సమాధానాలు మూడు వారాలుగా వస్తున్నాయి.


‘... నాకు హేతువాదమే ఇష్టం, సీతకి లాగ.  కానీ సీత, నాగరాజు నాస్తికుడో కాదో తెలుసుకోకుండా పెళ్ళాడేసిందే. నేను అలా చెయ్యలేను. కానీ  నాస్తిక అబ్బాయిలు నిజంగా స్థిరంగా ఉన్నవాళ్ళు కనపడడం లేదు.  ఈ సమస్యకు పరిష్కారం ఎలాగండీ?’
అంటూ  స్వాతి అనే  పాఠకురాలు అమెరికా నుంచి అడిగింది.

‘.... నీ భావాలతో సరిపడే మనిషి ఎదురయ్యేదాకా నిరీ్క్షించు! ఎంతకాలం అయినా! ఒక వయసు దాటిన తర్వాత ఆ నిరీక్షణ కూడా వదిలెయ్యి! నీ జీవితం నీ ఇష్టం. రాజీలు పడుతూనే బతకాలని రూలేమీ లేదు. ఏ సమస్యకైనా రెండే మార్గాలు- రాజీ గానీ, స్థిరత్వం గానీ. మూడో మార్గం ఉండదు.’

ఇలాంటి సమాధానం  రంగనాయకమ్మ గారు తప్ప ఎవరివ్వగలరు!

29, జులై 2011, శుక్రవారం

ముక్కోతి కొమ్మచ్చి... నాలుగిందాల నచ్చి!క్షరాలా ఈ బుక్కు ముళ్ళపూడి  మార్కు మ్యాజిక్కు!

ఏకబిగిన చదివేసి, తొందరగా పూర్తిచేయటమెందుకని  రోజుక్కొంత నంజుకుంటుంటే  పఠనోత్సాహం పుంజుకుని  పరవళ్ళు తొక్కింది.  అయినా ఏ కాస్త విరామం దొరికినా మళ్ళీ ఈ పుస్తకమే  చదవబుద్ధేసింది.

చదవటం మొదలెట్టాక పూర్తయ్యాకా, తర్వాత కూడా  రమణీయ ఇంద్రజాలం ఆవహించినట్టయింది.

అసలిలాంటి పుస్తకాల్లో ఏముందనేది కాదు కొశ్చను.  ఎంత ముద్దుగా, ఎంత సొగసుగా  చెప్పుకొచ్చారన్నదే పాయింటు!

చిత్రాక్షరాలు.. అక్షర చిత్రాలు
ఇది రమణ ఆత్మ కథ మాత్రమేనా? కాదు!  సొంత సంగతులే  కాకుండా  తన పరిధిలోకి వచ్చిన ఎందరో వ్యక్తుల గురించీ,  వారి వ్యక్తిత్వ ప్రత్యేకతల గురించీ అలవోకగా చెప్పుకుంటూ,  అక్షర చిత్రాలు చెక్కుకుంటూ  పోయాడు రమణ.  మాట తప్పినవారిపై,  మనసు  నొప్పించినవారిపై  విసుర్లు లేకపోలేదు;  కానీ  చమత్కార గుళికలు  రంగరించేసి...  అవి కూడా సుతిమెత్తగానే ధ్వనించేలా  ‘అండర్ ప్లే’ చేశాడు.

సమవుజ్జీగా బాపు బొమ్మలూ, కార్టూన్లూ పుస్తకం విలువ పెంచాయి.

ఏ కొమ్మను  ఎంచి,   ఏ  సంఘటనను  వరించి...   ఏది వివరించినా  ఆ చెప్పిన ఒడుపుకీ, ఆ చెప్పటంలో స్వారస్యానికీ ఎంతగానో ముచ్చటేస్తుంది.   సందర్భవశాత్తూ   వేరే కొమ్మకు దూకటం  అందంగానే ఉంది.  మళ్ళీ బుద్ధిగా వెనక్కి వస్తున్నట్టు చెప్పటంలో మరింత అందం.. చందం!

అసలు కథను కాస్త ఆపి ఉపకథల్లోకి  జారిపోవటం వల్ల  ఆసక్తికరమైన విషయాలెన్నో బయటికొచ్చాయి.   ‘కార్ష్ ఆఫ్ అటావా’ అనే గొప్ప పోర్ట్రెయిట్ ఫొటోగ్రాఫర్ గురించి తొలిసారిగా ఈ పుస్తకం ద్వారానే  తెలిసింది.
విన్ స్టన్ చర్చిల్ ఉగ్ర స్వరూప స్వభావాలను ఫొటోగా  ఒడిసిపట్టటానికి  కార్ష్ ప్రయోగించిన టెక్నిక్  గురించి రమణ మాటల్లోనే చదవాలి!   

‘ముత్యాల ముగ్గు’ సినిమా  విశేషాలు చెపుతూ దారి మళ్ళి ..  వేరే సంగతులు చెప్పేశాక... ‘మళ్ళీ ముగ్గులోకి వద్దాం’ అని చదవగానే థ్రిల్లింతగా అనిపించింది.

‘వంశ వృక్షం’ ముచ్చట్లు చెపుతూ  అంతలోనే  శాఖాచంక్రమణం చేసి,  ఆపై...  ‘సారీ- దారితప్పి కొమ్మ మారిపోయాను. ఎంత కాదన్నా ఇది వంశ ‘వృక్షం’ కదా...’ అనటంలో ఎంత చిలిపిదనం!


రామన్... రమణన్ !
తమిళ అరవ్వాడు  మన  రమణ పేరును  ‘రామన్’ చేశాడట.  కాదూ కూడదంటే  ‘రమణన్’ చేశాడు  గానీ రమణ అనటానికి ఒప్పుకోలేదట.  ‘ఈ పాపిష్టి నకారప్పొల్లు నస్మరంతి అయిపోనూ!’ అని మెటికలు విరిచినట్టు పెట్టిన ఆ  శాపనార్థంలో కూడా ఎంత గమ్మత్తు !

‘ముక్కోతి కొమ్మచ్చి’లో కొన్ని భాగాలను స్వాతి వీక్లీలో వస్తున్నపుడే చదివాను. రెండోసారి  ఈ పుస్తకంలో చదివినా  ‘బోర్’ కొట్టకపోడానికి -  అచ్చంగా   రమణ  రాసే ‘రేసీ’ శైలే  కారణం!

నాకెంతో ఇష్టమైన ‘అందాల రాముడు’ సినిమా నిర్మాణ విశేషాలు చదవటం సంతోషం కలిగించింది.

ఇంకా  ఎన్నెన్ని అక్షర  చిత్రాలో....
బాపు   ‘క్రాపు’
అజంతా అసహనం
సూర్యకాంతం ప్రసాదాలు
కాట్రగడ్డ నరసయ్య సినీ స్లోగన్లు

... ఇవి మాత్రమే  కాదు.

బాపురమణలతో  తెలుగు తెర మీద  ‘ముత్యాల ముగ్గు’ వేయించారు కదా మా నూజివీడు లెక్చరర్  ఎమ్వీయల్?  ‘నవ్వు ఆరిపోయింది- చీకటి వెలిగింది- పున్నమి నాడే అమావాస్య దాపురించింది’ అంటూ ఆయన స్మృతుల్ని తల్చుకున్నాడు రమణ.

అలనాటి ‘కార్ట్యూనుల’ తీరులో  ఇలా ఇద్దరూ కలిసి  రేఖా చిత్ర నివాళిని అందించారు-


‘గోరంత దీపం’ విడుదల సమయంలో  ‘వాణిశ్రీధర్’ అని రాసి  పబ్లిసిటీ చేశారు.  అదెంత  బాగుందో కదా అనుకోనివారు లేరు. నాయికా నాయకుల పాత్రల  అనుబంధాన్ని సరిగా, ముక్తసరిగా  వ్యక్తీకరించిన  ఈ చక్కటి పదబంధం సృష్టికర్త ఎమ్వీయల్లేనని ఇన్నేళ్ళ తర్వాత ఈ పుస్తకం ద్వారానే  తెలిసింది నాకు !
   
ప్ర్రాక్టికల్ జోకు!

వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిందంటాం కదా?   కానీ ఒక వెంట్రుక పెళ్ళి ప్రమోదాన్ని తెచ్చిపెట్టింది.   ప్రేమికులుగా కలిసిమెలిసి ఉంటున్న రావి కొండలరావూ, రాధాకుమారీ  అర్జెంటుగా పెళ్ళి కి సిద్ధపడేలా  చేసిన ప్రాక్టికల్ జోకు  భలే నవ్విస్తుంది.  ‘నల్లటి పొడూఘ్ఘా వున్న’ తలవెంట్రుకను ఠావు తెల్ల  కాయితానికి ఒక కొస అంటించి,  రాసిన  దొంగ ఉత్తరం టపాకాయలా  పేలింది!   లేడీస్ హాండ్ రైటింగులా ఉండాలని  ఎడం చేత్తో  దస్తూరీ తిలకం దిద్దింది  రమణో, బాపో గానీ (రాశాం అని బహువచన ప్రయోగం చేశాడు రమణ)   ఆ ఐడియాను మెచ్చుకుని తీరాలి.

ఈ కేశ పాశోపాఖ్యానానికి  బాపు ఎలా  వేశాడో  బొమ్మ ... చూడండి!  వీఏకే  రంగారావు గురించిన  అక్షర చిత్రం -
‘... లలితసంగీత నాట్య శాస్త్రాలలో ఈదులాడి, వాదులాడి ఫిలిం హిస్టోరియన్ గా జర్నలిస్టుగా కాలమిస్టుగా వికసించి విజృంభించాడు.’
‘... ధారాళంగా వ్యాసాలు రాస్తాడు. నిర్భయుడై కుండలు బద్దలు కొట్టేస్తాడు... వాళ్ళ వీధి నిండా ఆ కుండల చిళ్ళ పెంకులే!...’

HMV రికార్డు సింబల్ ను వీఏకేకి అన్వయించి బాపు గీసిన  బొమ్మ  గ్రామఫోను  రికార్డుల సేకరణ కృషీవలుడైన వీఏకేకి  చిత్ర నీరాజనం!‘నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి- నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి’అంటూ ‘గోరంత దీపం’లో రమణ కొండంత వెలుగిచ్చే మాటలు రాశాడు.  మేకప్ లేకుండా వాణిశ్రీ నటించటం అప్పట్లో చర్చనీయాంశమయింది.  ఆ విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు యాబై ఏళ్ళుగా ‘రూపాయి కథ’ రాస్తానని  నవోదయ రామ్మోహనరావు గారిని   ఊరిస్తూ వచ్చాడట
రమణ.  ఈ వయసులోనూ  ఆ కథ రాయగలననే విశ్వాసమూ కనపరిచాడు.  కానీ రూపాయి కథ రూపు దిద్దకుండానే, ఆ బాకీ ని  తీర్చకుండానే  రుణపడిపో్యి వెళ్ళిపోయాడు  రమణ!

అజరామరమైన ‘అప్పారావు’ను సృష్టించి పాఠకులను రుణానందలహరిలో ఓలలాడించిన రమణ...  ‘అవసరానికి ఆదుకున్నవాణ్ణి వెతికి వెంటాడి మరీ రుణ విముక్తుడైన’ రమణ...  ఇంత పని చేస్తానని తనకే తెలిసుండదు!

ఈ ‘ముక్కోతి కొమ్మచ్చి’రచన అర్థాంతరంగానే  ముగిసింది కదా!  మరి ఈ పుస్తకం  చివరి పేజీ సంగతేమిటి?

ఆ పేజీని  రమణ కుమార్తె అనూరాధ ఇలా రాశారు- 
‘తెలుగు భాష ఉన్నంత కాలం , ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రచనలు సాగించేవారున్నంతకాలం, ముళ్ళపూడి రమణీయం.. చివరి పేజీ లేని ఓ కావ్యం! ’