సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జులై 2011, శుక్రవారం

ముక్కోతి కొమ్మచ్చి... నాలుగిందాల నచ్చి!



క్షరాలా ఈ బుక్కు ముళ్ళపూడి  మార్కు మ్యాజిక్కు!

ఏకబిగిన చదివేసి, తొందరగా పూర్తిచేయటమెందుకని  రోజుక్కొంత నంజుకుంటుంటే  పఠనోత్సాహం పుంజుకుని  పరవళ్ళు తొక్కింది.  అయినా ఏ కాస్త విరామం దొరికినా మళ్ళీ ఈ పుస్తకమే  చదవబుద్ధేసింది.

చదవటం మొదలెట్టాక పూర్తయ్యాకా, తర్వాత కూడా  రమణీయ ఇంద్రజాలం ఆవహించినట్టయింది.

అసలిలాంటి పుస్తకాల్లో ఏముందనేది కాదు కొశ్చను.  ఎంత ముద్దుగా, ఎంత సొగసుగా  చెప్పుకొచ్చారన్నదే పాయింటు!

చిత్రాక్షరాలు.. అక్షర చిత్రాలు
ఇది రమణ ఆత్మ కథ మాత్రమేనా? కాదు!  సొంత సంగతులే  కాకుండా  తన పరిధిలోకి వచ్చిన ఎందరో వ్యక్తుల గురించీ,  వారి వ్యక్తిత్వ ప్రత్యేకతల గురించీ అలవోకగా చెప్పుకుంటూ,  అక్షర చిత్రాలు చెక్కుకుంటూ  పోయాడు రమణ.  మాట తప్పినవారిపై,  మనసు  నొప్పించినవారిపై  విసుర్లు లేకపోలేదు;  కానీ  చమత్కార గుళికలు  రంగరించేసి...  అవి కూడా సుతిమెత్తగానే ధ్వనించేలా  ‘అండర్ ప్లే’ చేశాడు.

సమవుజ్జీగా బాపు బొమ్మలూ, కార్టూన్లూ పుస్తకం విలువ పెంచాయి.

ఏ కొమ్మను  ఎంచి,   ఏ  సంఘటనను  వరించి...   ఏది వివరించినా  ఆ చెప్పిన ఒడుపుకీ, ఆ చెప్పటంలో స్వారస్యానికీ ఎంతగానో ముచ్చటేస్తుంది.   సందర్భవశాత్తూ   వేరే కొమ్మకు దూకటం  అందంగానే ఉంది.  మళ్ళీ బుద్ధిగా వెనక్కి వస్తున్నట్టు చెప్పటంలో మరింత అందం.. చందం!

అసలు కథను కాస్త ఆపి ఉపకథల్లోకి  జారిపోవటం వల్ల  ఆసక్తికరమైన విషయాలెన్నో బయటికొచ్చాయి.   ‘కార్ష్ ఆఫ్ అటావా’ అనే గొప్ప పోర్ట్రెయిట్ ఫొటోగ్రాఫర్ గురించి తొలిసారిగా ఈ పుస్తకం ద్వారానే  తెలిసింది.
విన్ స్టన్ చర్చిల్ ఉగ్ర స్వరూప స్వభావాలను ఫొటోగా  ఒడిసిపట్టటానికి  కార్ష్ ప్రయోగించిన టెక్నిక్  గురించి రమణ మాటల్లోనే చదవాలి!   

‘ముత్యాల ముగ్గు’ సినిమా  విశేషాలు చెపుతూ దారి మళ్ళి ..  వేరే సంగతులు చెప్పేశాక... ‘మళ్ళీ ముగ్గులోకి వద్దాం’ అని చదవగానే థ్రిల్లింతగా అనిపించింది.

‘వంశ వృక్షం’ ముచ్చట్లు చెపుతూ  అంతలోనే  శాఖాచంక్రమణం చేసి,  ఆపై...  ‘సారీ- దారితప్పి కొమ్మ మారిపోయాను. ఎంత కాదన్నా ఇది వంశ ‘వృక్షం’ కదా...’ అనటంలో ఎంత చిలిపిదనం!


రామన్... రమణన్ !
తమిళ అరవ్వాడు  మన  రమణ పేరును  ‘రామన్’ చేశాడట.  కాదూ కూడదంటే  ‘రమణన్’ చేశాడు  గానీ రమణ అనటానికి ఒప్పుకోలేదట.  ‘ఈ పాపిష్టి నకారప్పొల్లు నస్మరంతి అయిపోనూ!’ అని మెటికలు విరిచినట్టు పెట్టిన ఆ  శాపనార్థంలో కూడా ఎంత గమ్మత్తు !

‘ముక్కోతి కొమ్మచ్చి’లో కొన్ని భాగాలను స్వాతి వీక్లీలో వస్తున్నపుడే చదివాను. రెండోసారి  ఈ పుస్తకంలో చదివినా  ‘బోర్’ కొట్టకపోడానికి -  అచ్చంగా   రమణ  రాసే ‘రేసీ’ శైలే  కారణం!

నాకెంతో ఇష్టమైన ‘అందాల రాముడు’ సినిమా నిర్మాణ విశేషాలు చదవటం సంతోషం కలిగించింది.

ఇంకా  ఎన్నెన్ని అక్షర  చిత్రాలో....
బాపు   ‘క్రాపు’
అజంతా అసహనం
సూర్యకాంతం ప్రసాదాలు
కాట్రగడ్డ నరసయ్య సినీ స్లోగన్లు

... ఇవి మాత్రమే  కాదు.

బాపురమణలతో  తెలుగు తెర మీద  ‘ముత్యాల ముగ్గు’ వేయించారు కదా మా నూజివీడు లెక్చరర్  ఎమ్వీయల్?  ‘నవ్వు ఆరిపోయింది- చీకటి వెలిగింది- పున్నమి నాడే అమావాస్య దాపురించింది’ అంటూ ఆయన స్మృతుల్ని తల్చుకున్నాడు రమణ.

అలనాటి ‘కార్ట్యూనుల’ తీరులో  ఇలా ఇద్దరూ కలిసి  రేఖా చిత్ర నివాళిని అందించారు-


‘గోరంత దీపం’ విడుదల సమయంలో  ‘వాణిశ్రీధర్’ అని రాసి  పబ్లిసిటీ చేశారు.  అదెంత  బాగుందో కదా అనుకోనివారు లేరు. నాయికా నాయకుల పాత్రల  అనుబంధాన్ని సరిగా, ముక్తసరిగా  వ్యక్తీకరించిన  ఈ చక్కటి పదబంధం సృష్టికర్త ఎమ్వీయల్లేనని ఇన్నేళ్ళ తర్వాత ఈ పుస్తకం ద్వారానే  తెలిసింది నాకు !
   
ప్ర్రాక్టికల్ జోకు!

వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పిందంటాం కదా?   కానీ ఒక వెంట్రుక పెళ్ళి ప్రమోదాన్ని తెచ్చిపెట్టింది.   ప్రేమికులుగా కలిసిమెలిసి ఉంటున్న రావి కొండలరావూ, రాధాకుమారీ  అర్జెంటుగా పెళ్ళి కి సిద్ధపడేలా  చేసిన ప్రాక్టికల్ జోకు  భలే నవ్విస్తుంది.  ‘నల్లటి పొడూఘ్ఘా వున్న’ తలవెంట్రుకను ఠావు తెల్ల  కాయితానికి ఒక కొస అంటించి,  రాసిన  దొంగ ఉత్తరం టపాకాయలా  పేలింది!   లేడీస్ హాండ్ రైటింగులా ఉండాలని  ఎడం చేత్తో  దస్తూరీ తిలకం దిద్దింది  రమణో, బాపో గానీ (రాశాం అని బహువచన ప్రయోగం చేశాడు రమణ)   ఆ ఐడియాను మెచ్చుకుని తీరాలి.

ఈ కేశ పాశోపాఖ్యానానికి  బాపు ఎలా  వేశాడో  బొమ్మ ... చూడండి!  



వీఏకే  రంగారావు గురించిన  అక్షర చిత్రం -
‘... లలితసంగీత నాట్య శాస్త్రాలలో ఈదులాడి, వాదులాడి ఫిలిం హిస్టోరియన్ గా జర్నలిస్టుగా కాలమిస్టుగా వికసించి విజృంభించాడు.’
‘... ధారాళంగా వ్యాసాలు రాస్తాడు. నిర్భయుడై కుండలు బద్దలు కొట్టేస్తాడు... వాళ్ళ వీధి నిండా ఆ కుండల చిళ్ళ పెంకులే!...’

HMV రికార్డు సింబల్ ను వీఏకేకి అన్వయించి బాపు గీసిన  బొమ్మ  గ్రామఫోను  రికార్డుల సేకరణ కృషీవలుడైన వీఏకేకి  చిత్ర నీరాజనం!



‘నువ్వు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి- నీ కష్టాలు నువ్వే భరాయించుకోవాలి’అంటూ ‘గోరంత దీపం’లో రమణ కొండంత వెలుగిచ్చే మాటలు రాశాడు.  మేకప్ లేకుండా వాణిశ్రీ నటించటం అప్పట్లో చర్చనీయాంశమయింది.  ఆ విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 



దాదాపు యాబై ఏళ్ళుగా ‘రూపాయి కథ’ రాస్తానని  నవోదయ రామ్మోహనరావు గారిని   ఊరిస్తూ వచ్చాడట
రమణ.  ఈ వయసులోనూ  ఆ కథ రాయగలననే విశ్వాసమూ కనపరిచాడు.  కానీ రూపాయి కథ రూపు దిద్దకుండానే, ఆ బాకీ ని  తీర్చకుండానే  రుణపడిపో్యి వెళ్ళిపోయాడు  రమణ!

అజరామరమైన ‘అప్పారావు’ను సృష్టించి పాఠకులను రుణానందలహరిలో ఓలలాడించిన రమణ...  ‘అవసరానికి ఆదుకున్నవాణ్ణి వెతికి వెంటాడి మరీ రుణ విముక్తుడైన’ రమణ...  ఇంత పని చేస్తానని తనకే తెలిసుండదు!

ఈ ‘ముక్కోతి కొమ్మచ్చి’రచన అర్థాంతరంగానే  ముగిసింది కదా!  మరి ఈ పుస్తకం  చివరి పేజీ సంగతేమిటి?

ఆ పేజీని  రమణ కుమార్తె అనూరాధ ఇలా రాశారు- 
‘తెలుగు భాష ఉన్నంత కాలం , ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రచనలు సాగించేవారున్నంతకాలం, ముళ్ళపూడి రమణీయం.. చివరి పేజీ లేని ఓ కావ్యం! ’