సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మే 2017, బుధవారం

ఆహ్లాదపరిచే కవిత్వ పరిమళం!
విత్వం గురించి పెద్దగా తెలియని అమాయకపు రోజుల్లో  నేనూ కవితలు రాశాననుకున్నాను . అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పంపిస్తే...  ఒకటి రెండు సార్లు ‘యువవాణి’ కార్యక్రమంలో ప్రసారం అయ్యాయి కూడా.

అయితే... Poetry is not my cup of tea... అని అర్థం చేసుకున్నాక  మళ్ళీ కవితలు రాసే జోలికి పోలేదెప్పుడూ! 

అంతేకాదు;  కవిత్వాన్ని అర్థం చేసుకునే,  ఆస్వాదించే లక్షణం నాలో తగినంతగా లేదనిపించేది. కవుల  భావనా ప్రపంచానికీ, నా లోకానికీ  పొంతన కుదరదనే నమ్మకం వల్ల కవిత్వాన్ని పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు.

కథలూ, నవలలూ, జీవిత చరిత్రలూ, నాన్ ఫిక్షనూ... అంతా వచనమే!  ఇవి చదవటమే  ఇష్టంగా ఉండేది. 

మంచి కవిత్వం నేను చదవకపోవటమూ, చదివిన కాస్త కవితలూ నాకు నచ్చకపోవటమూ ... ఈ రెండు కారణాలతో  కవిత్వంపై  చిన్నచూపు కూడా మొదలైంది.  

ఆ తక్కువ అభిప్రాయం మారేలా చేసిందిశ్యామల కవిత్వం!
చక్కని భావాలను చిక్కగా కవిత్వీకరించగల భాషా పటిమా, భావుకతా  ఈమె కవితల్లో  దర్శనమిస్తుంది.   

***

మె కవితలు  ‘నా గుండె గుమ్మానికి పచ్చనాకువై’,  ‘సజీవ క్షణాల కోసం’ అనే రెండు పుస్తకాలుగా  ఇప్పటికే వచ్చాయి.

ఇప్పుడు  ‘రెండు సంధ్యల నడుమ’  కొత్తగా విడుదలయింది.


దీనిలో 55 కవితలున్నాయి.  వీటిలో ఎక్కువ కవితలు చక్కని అనుభూతిని కలిగించేవే.  సమాజ శ్రేయస్సు కోరేవే! 

***

విత్వాన్ని ఆల్కెమీ ( రస వాదం) గా  వర్ణించిన మన తెలుగు కవి తిలక్  ‘అందం,  ఆనందం దాని పరమావధి’ అంటాడు.  ఈ రెండు లక్షణాలూ శ్యామల కవిత్వంలో కనిపిస్తాయి.

కళ్ళకు కట్టేలా అద్భుత వర్ణనలతో కవితలను  అలంకరించి తన అనుభూతిని పఠితలకు అందంగా అందేలా చేసే కవితలెన్నో ఉన్నాయి ఈ సంకలనంలో.

కొన్ని మచ్చుకు చూపిస్తాను..

‘వర్ణాలను రాశి పోసినవాడు’  నుంచి...

‘కాగితపు కుబుసాన్ని ఒలిచి వో చీరను మృదువుగా
బయటకు తీసి... ఒక్కొక్క పొరా విడుస్తుంటే
ఉరుముల మెరుపుల నల్ల మబ్బు నీడలో నాట్యమాడడానికి
సిద్ధమైన నెమలిపిట్ట వన్నెవన్నెల నెమలీకల పింఛాన్ని విప్పుకున్నట్లే వుంటుంది!’

‘నాట్లెయ్యడం చూసినాక’ నుంచి - 

‘పనిని వో పదంలా... పాటలా వాళ్ళు మట్టిలో విత్తుతుంటే
పులకించిన గాలి పిల్ల వారి కొంగుల ఉయ్యాలలో
ఊగుతూ వంత పాడుతుంది!
పొద్దు నడినెత్తికొచ్చాక..
సూరీడు ఎర్రగారమై వారి చద్దెన్నపు చందమామను
ముద్దాడి మురిసిపోతాడు’

 ‘వెన్నముద్ద చెట్టు’ నుంచి -

‘నా బాల్యాన్ని చిలికి తీసిన వెన్నముద్దను పూలలా పూసే
మా చెట్టంటే నాకెంతో యిష్టం
బహుశా పాలెక్కువై సలపరింతతో అమ్మ పిండి పాదులో
పోసిన పాలు తాగి పెరిగిన చెట్టు కాబట్టేమో !
అమ్మ ప్రేమంత కమ్మగా... అమ్మ నవ్వంత తెల్లగా యిప్పటికీ
పూస్తూనే ఉంది! నా తోటంతా పండు వెన్నెలలు కాస్తూనే ఉంది!’

***

‘కవిత్వం బాధకు పర్యాయపదం’ అన్నాడు శ్రీశ్రీ.

ఈ సంపుటిలో  ‘బాధ ఓ జీవితావసరం’ అనే కవిత బాధను కొత్త కోణంలో చూపిస్తుంది.

కొన్ని పంక్తులు ఇక్కడ ఇస్తున్నాను.

‘పుట్టుక నుండి చావు దాకా
మనిషి. పాడుకునే బతుకు పాటకు పల్లవి బాధే  
...
బాధ ఆనందానికి సోపానం
బాధ ఒకోసారి ఆయుధం కూడా అవుతుంది’
...
బాధను భరించేవాడికే ప్రశ్నించే హక్కు
నిలదీసే ... నినదించే హక్కు ఉంటాయి!
నిజమే... బాధ వో జీవితావసరం!!’’


***
‘వంటిల్లు’ అనగానే విమల రాసిన కవిత గుర్తొస్తుంది.

‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైనా
మా నాన్న పేరే !

నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాలలా ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లొక కసాయి
దుకాణంలా ఉంది’ ... 

ఇవి విమల  కవితలో  కొన్ని భాగాలు...


అదే పేరుతో ఈ  ‘రెండు సంధ్యల నడుమ’  పుస్తకంలో  కవిత రాసిన  శ్యామల  వంటింటిని మరో కోణంలో దర్శింపజేస్తుంది.


‘నన్ను ప్రేమగా పలకరించే ప్రియసఖి నా వంటిల్లే!’ అనటమే కాదు;

‘పద చిత్రాల్ని భావ చిత్రాల్ని ఏరేరి తెచ్చుకుని అపురూపంగా
అల్లిన కవిత ’ అంటూ వంటను వర్ణిస్తుంది.

వంటిల్లు తన కవితా రచనకు మౌన సహచరి అంటూ కితాబునిస్తుంది.

‘అన్నిటికీ తానే వేదికై... వేడుకగా.. కిటికీల కళ్ళెత్తి
అబ్బురపడుతూ వింటుంది’

చివరికొచ్చేసరికి...  స్త్రీవాద ఛాయలతో ముగుస్తుందీ కవిత.

‘చిన్నప్పటి నుండీ.. ఇప్పటివరకూ
వంటింటి సదుపాయాలు మారాయేమో గానీ..
వంటింటి పాత్రలూ అవే !
వంటగత్తె పాత్రలూ అవే!

గిన్నె గరిట బాండి కుక్కరు
అమ్మమ్మ అమ్మ నేను నా పాప!

వంటిల్లు మాత్రం ఎప్పటికీ నిత్య స్త్రీ లింగమే!’


భావుకత, పఠనీయత నిండుగా ఉన్న ఈ కవితలకు చిదంబరం  అర్థవంతమైన బొమ్మలను జోడించారు.   

‘సామాజికత, మానవత, ప్రౌఢత ముప్పేటలుగా అల్లుకున్న  కవిత్వం’ అంటూ డా. ఎన్. గోపి తన ముందుమాటలో  అంచనా వేశారు.  ‘రెండు సంధ్యల మధ్య ఎండలాంటి స్వచ్ఛమైన కవిత్వమిది’ అని ప్రశంసించారు. 

వీటిలోని  రాజకీయ, సామాజిక కవితలు సమూల సామాజిక మార్పును  కాకుండా, సంస్కరణవాదాన్ని కోరేవే  కావొచ్చు. ఆ పరిమితుల్లోనూ  ఆహ్లాదపరిచి, ఆలోచింపజేసి... కవిత్వంపై మంచి అభిప్రాయం కలగజేస్తాయీ కవితలు !