సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఆగస్టు 2012, బుధవారం

పాటగా జాలువారిన గురజాడ ‘కవిత్వపు కానుక’... వింటారా?


హాకవి గురజాడ అప్పారావు గారు 1910లో రాసిన  ‘దేశభక్తి’ గేయం స్కూలు రోజుల్లో చదువుకున్నదే. అయితే ప్రపంచసాహిత్యంలో ఇది ఆణిముత్యమని అప్పుడు తెలీదు.

తెలిశాక కూడా  ఈ గేయం/ గీతంలో గొప్పతనమేమిటో చాలాకాలం వరకూ అర్థం కాలేదు!

ఏ దేశభక్తి గేయమైనా దేశాన్ని గురించిన పొగడ్తలతో,  ఘనతను వర్ణిస్తూ భావుకత్వంతో  ఉంటుంది. కానీ గురజాడ గేయానికి  వాస్తవికతే  ప్రాణం! 

సంకుచిత పరిధులను అధిగమించి విశ్వవ్యాప్తంగా  ప్రపంచంలోని  ఏ దేశ ప్రజలకైనా  వర్తించగలిగే విలువైన విషయాలను తేలిక మాటల్లో తెలిపే  గేయమిది.

ముఖ్యంగా దీనిలోని  ‘దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి!’ బాగా ప్రాచుర్యం పొందింది.

సాటి మనుషులను పట్టించుకోకుండా భౌగోళిక సరిహద్దులకే  ప్రాధాన్యం ఇచ్చే ధోరణిపై  ఆధునిక కవితా వైతాళికుడి  త్రివిక్రమ ‘పాదం’ఇది!

మనుషులను ప్రేమించలేనిది నిజమైన  దేశభక్తి  కాదని ‘శషభిషలు’లేకుండా చెప్పారాయన.

మాటలు కాదు, చేతలు ముఖ్యమని సూటిగా, సులభంగా చెప్పిన ఈ పాదాలు ఎంత గొప్పవో కదా?
- ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయి!’, 

‘దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పకోకోయి - పూని యేదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి!’

‘మంచి గతమున కొంచెమేనోయి’ అని ఎవరైనా ఇంత ధీమాగా చెప్పారా?

‘మతం వేరైతేను యేమోయి? మనసు వొకటై మనుషులుంటే’ అనీ,

 ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి!’ అనీ  ఐకమత్య భావనను చిన్నచిన్న మాటల్లో కవిత్వీకరించారు.

ఇవన్నీ నీతులు  ప్రబోధించినట్టు కాకుండా నిజం గుర్తు చేస్తున్నట్టు ఉండటమే ఈ గేయం ప్రత్యేకత!

పావురమూ, సింహమూ!

‘గురజాడ రచనలన్నీ నష్టమై పోయి ఒక్క  ‘దేశభక్తి’ గీతం మిగిలినా చాలును. అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించ దగిన మహాక఼వి అని రుజువుకావడానికి . ఎందువల్లనంటే  ‘దేశ భక్తి’ గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయగీతం ’ అంటాడు శ్రీశ్రీ.

‘ఒక తెలుగు కవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక ఇది’ అని  ప్రశంసించాడు.

‘ఒక కాలానికీ ఒక స్థలానికీ పరిమితం కాని సందేశం ఇచ్చేది ఈ గీతం. పావురం లాగ ప్రశాంతంగా రవళిస్తూనే , సింహం  చేసే క్ష్వేళాధ్వనిని స్పురింపజేస్తుంది ఈ గీతం’ అని అభివర్ణించాడు శ్రీశ్రీ.

రాసిన మూడేళ్ళకు  ‘కృష్ణా పత్రిక’లో  ఆగష్టు 9, 1913 తేదీన ఈ గేయాన్ని తొలిసారిగా  ప్రచురించారు.

కవిత కోయిలల.. గానం
ఈ గీతానికి  వయొలిన్ విద్వాంసడు  ద్వారం వెంకటస్వామి నాయుడు గారు స్వరాలు సమకూర్చారు.

ఆ నొటేషన్ చూడండి-


మూడు బాణీలు...

ఈ దేశభక్తి గీతాన్ని మూడు  రకాల బాణీల్లో విందాం...

 1940లో   టంగుటూరి సూర్యకుమారి పాడిన బాణీ వినండి..


1954లో వచ్చిన ‘జ్యోతి’ సినిమాలో  జి. వరలక్ష్మి గానం... సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు.బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరిచిన ఈ పాటను లలితా సాగరి పాడారు.
(ప్రసారభారతి తెలుగు ఆడియో సీడీ-20 సౌజన్యంతో... )


ఈ మూడు పాటల్లోనూ ఏది ఎక్కువ శ్రావ్యంగా అనిపిస్తోందో  చెప్పండి..!
 - - - -  -  -------------------------------------------- - -- -

 (అడిగిన మరుక్షణాల్లోనే ఏ పాటనైనా ఫోన్లో  వినిపించగల విద్యుద్వేగం;                            
కోరిన  ఆడియో- వీడియో- సమాచారం- ఏదైనా తక్షణమే  మెయిల్దారిని బయల్దేరదీసి,
 మరు నిమిషంలోనే  అవతలివారికి  చేర్చగల ప్రతిభా ఉన్న-
ఒకే ఒక్కడు ...
శ్యామ్ నారాయణ గారి  సహకారంతో.. .)