సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, మార్చి 2011, మంగళవారం

బ్లాగ్ Vs బజ్!



‘నా వల్ల కాదు బాబోయ్...ఈ బజ్జులతో నేను వేగలేను’ అంటూ Buzzలో  విసుక్కున్నారో  బ్లాగర్ నిన్నటి రోజున. ఎందుకంటే- ‘శని ఆదివారాలు రెండురోజులూ మైల్ ఓపెన్ చెయ్యకపోయేసరికి ఈ రోజు అక్షరాలా 90 బజ్జులున్నాయి చూడడానికి...’!

తెలుగులో  బజ్జుల విజృంభణకు ఇదో  తాజా తార్కాణం!

‘ముందొచ్చిన బ్లాగుల కంటే వెనకొచ్చిన బజ్జులే  వాడి!’ అనొచ్చా? ప్రస్తుతానికి ఇలా అనటం  తొందరపాటూ, ‘టూ అర్లీ’ అవుతుంది కానీ, ఈ మధ్య కాలంలో  తెలుగు బ్లాగుల సంకలినుల్ని చూస్తుంటే నాకు ఆ ఒరిజినల్ సామెతే  గుర్తోస్తోంది.

నిన్న కూ, ఇవాళ్టికీ పెద్దగా తేడాలేమీ కనపడకుండా  - కథ ముందుకు సాగనంటూ  మొరాయించే టీవీ  డెయిలీ సీరియల్ మల్లే- బ్లాగ్ టపాలు భారంగా  కదులుతున్నాయి. ఒకప్పుడు టపాటపా దూసుకొచ్చేసి, పాత టపాలను వెనక్కి నెట్టేసే  కొత్త టపాలకు ఇప్పుడు గమనం అపురూపమై, మందగమనం స్వభావమైపోతోంది.

 పోనీ, వ్యాఖ్యలేవైనా  ఒకప్పటిలాగా శరపరంపరగా వచ్చేస్తున్నాయా అంటే అదీ లేదు.  వీటి తీరూ అంతే !



బ్లాగర్లు తమ టపాలనూ, వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యలనూ రాయటం అర్జెంటుగా  తగ్గించేసుకున్నారా అని అనుమానం వచ్చేలా తయారైన ఈ పరిస్థితికి కారణం....  బజ్జులనే నా నమ్మకం!

బజ్ ల మూలంగా మెయిల్ చెక్ చేసుకోవటం ఒకప్పటిలాగా కాకుండా  ఆసక్తికరంగా తయారయిందనేది కాదనలేని వాస్తవం. బజ్జులు చాట్ రూముల్లా సందడి చేస్తున్నాయి.  ఆట పాటలూ, కొత్త పరిచయాలూ, పాత జోకులూ, అభినయాలూ, అలకలూ..  అలవోకగా అక్షరరూపంలో కనిపిస్తున్నాయి.  బ్లాగు వ్యాఖ్యల్లాగా వీటికి  ‘ఓనర్’ అప్రూవల్ అవసరమే లేదు కదా!  సామూహికంగా, బహిరంగంగా సాగే ఈ  సంభాషణల్లో ... లైవ్ గా వచ్చేసే వ్యాఖ్యలను  చూస్తూ, వెంటనే  స్పందిస్తూ వాటిని తక్షణం చూసుకోగలిగే వెసులుబాటే  బజ్జులకు ఆకర్షణ తెచ్చిపెడుతోంది.

‘ఫలానా టపా రాస్తున్నాను, ఎలా రాస్తే బాగుంటుంది?’ అని బజ్ లో అభిప్రాయాలు తెలుసుకొని, టపాను చక్కగా తీర్చిదిద్దే  అవకాశముంది.

బజ్జుల్లో   ఎక్కువ భాగం మైక్రో బ్లాగింగ్ తరహానే!  ఒక చిన్న మాట,   వాక్యం  రాసేసి కూడా  అసంఖ్యాకమైన స్పందనలను పొందటంలో బజ్జులు ఆదరణ పొందుతున్నాయనిపిస్తోంది.

సరిగ్గా ఈ కారణం వల్లనే... ఎక్కువ సందర్భాల్లో  మన  విలువైన సమయాన్ని దారుణంగా  తినేసెయ్యటంలో బ్లాగులకు పెద్దన్నలాగా బజ్ తయారవుతోందనేది - నాణేనికి మరో వైపు!

కొత్తగా బ్లాగ్ లో  టపా  గురించి బజ్ లో లింకిచ్చామా...  బ్లాగుల్లో  వ్యాఖ్యల సంఖ్యను తగ్గించుకున్నట్టే!  బ్లాగు లో కామెంట్ రాయకుండా బజ్ ల్లోనే కామెంట్ రాస్తుంటారు చాలామంది. అలా వ్యాఖ్యలు  రెండు చోట్ల కు షేర్ కావటం ఏం బాగుంటుంది?

‘ఇవాళ తలనొప్పిగా ఉంది!’  అని బజ్ రాశామనుకోండీ...
కొందరు దాన్ని  publicly reshare చేస్తారు. కొంతమంది విచిత్రంగా  like  కూడా చేయవచ్చు.  కాసేపయ్యాక  వేరే టాపిక్ లోకి జంప్ చేస్తూ  స్పందనలు  మొదలవుతాయి. అలా అలా మనకు  ‘తలనొప్పి’ ఎగిరిపోతుందో లేదో గానీ, తలనొప్పి టాపిక్ మాత్రం ఎగిరిపోతుంది!   కాశీ మజిలీ కథల్లో ఉపకథలోని ఉపకథలోకి  వెళ్ళినట్టు  అవుతుంది పరిస్థితి !

బ్లాగు టపాలకు సంకలినులు ఉన్నట్టే... బజ్జులక్కూడా భవిష్యత్తులో  సంకలినులు వస్తాయేమో!

బజ్ లంటే   బృందాలుగా విడిపోయి, ఎవరికి వారు కబుర్లాడుకున్నట్టు నాకు  తోస్తుంది.   బ్లాగుల్లో అలా ఉండదు! అందుకే... నాకయితే  బజ్జుల కంటే బ్లాగులే  ఇష్టం !  (ఏ రాయి అయితేనేం-  అనకండి.... ) :)

అందుకే... నేను బజ్జుల్లో  రాయటం  చాలా తక్కువ. బ్లాగు టపాలు  నెలకొకటి తగ్గకుండా-  బాగానే  రాస్తున్నాను కదా: )

18, మార్చి 2011, శుక్రవారం

ఇద్దరు కవుల ‘విగ్రహ’వాక్యాలు!

విధ్వంసకుల  ఉన్మాద చర్యకు జాలి..
వారి సమర్థకుల దబాయింపులకు విస్మయం...

ఇలాంటి  భావాలన్నీ కలగాపులగమవుతున్న తరుణంలో  ముఖ్యంగా జాషువా... శ్రీశ్రీ లు  ‘విగ్రహ ప్రతిష్ఠాపన’లపై  రాసిందీ... మాట్లాడిందీ గుర్తుకొచ్చింది.

"రాజు మరణించెనొక తార రాలిపోయె
సుకవి మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములయందు
సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"


అనేది జాషువా తత్వం.  ‘రాతి విగ్రహం’ పగలగొట్టి  ఆయన్ను అవమానించగలరా ఎవరైనా?


ఇక శ్రీశ్రీ కి సంబంధించిన ఉపాఖ్యానం :
‘మీ  విగ్రహాన్ని భారీ ఖర్చుతో తయారుచేసి, ఘనంగా నాలుగు రోడ్ల కూడలిలో పెడదామనుకుంటున్నాం’ అని  అభిమానులెవరో ఆయనతో అన్నారట.

దారుణమైన ఆర్థిక సమస్యల్లో ఉన్న శ్రీశ్రీ  ఏమన్నాడో తెలుసా?- ‘‘ఆ విగ్రహానికి పెట్టే ఖర్చేదో నాకు ఇచ్చెయ్యండి.  ఆ కూడలికి నేనే వెళ్ళి నిలబడతాను’అని!  పైకి జోక్ గా కనిపించినా ఆ మహాకవి దారిద్ర్యానికి అద్దం పట్టే వ్యాఖ్య ఇది!

అంతే కాదు;
శిలా విగ్రహాలు పెట్టించుకోవాలనే మోజు  లేని శ్రీశ్రీ ని  విగ్రహ విధ్వంసంతో ఎవరు మాత్రం దెబ్బతీయగలరు?

విద్వేషం...  విధ్వంసాన్ని మించి  ప్రమాదకరం.
‘మూర్తి’కంటే ‘స్ఫూర్తి’ ప్రధానం!

తెలుగు నుడిలో,  పలుకుబడిలో... ఈ కవుల రచనలు ఎప్పుడో భాగమైపోయాయి.  అక్షరాల్లో ఆర్ద్రత వర్షించిన జాషువా, అగ్ని వెదజల్లిన శ్రీశ్రీ  ప్రాముఖ్యం, ప్రాసంగికతా ‘మాకు  వద్దం’టే మాత్రం మాయమైపోతాయా?

శ్మశాన ఘట్టాన్ని జాషువా మల్లే ఎవరు అభివర్ణించగలరు?


‘శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ’ వెలువడిన శ్రీశ్రీ కవితాఝరిని ఎవరు మాత్రం అడ్డగించగలరు? 

*  *   *

‘కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన
నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’


అని జాషువా ఘోషిస్తే...  ఆ విశ్వనరుణ్ణి  ఓ ప్రాంతానికి మాత్రమే  పరిమితం చేయటం హ్రస్వ దృష్టి మాత్రమే!

‘చీనాలో రిక్షావాలా,
 చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ’
అంటూ అంతర్జాతీయ దృక్పథంతో ...

‘నేను  సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’
అని ప్రకటించుకున్న  శ్రీశ్రీ   సంకుచితమైన సరిహద్దుల్లో ఒదుగుతాడా?