సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, ఏప్రిల్ 2013, మంగళవారం

వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా?


రచయిత పుస్తకం రీ ప్రింటుకు వెళ్ళబోతోంది. ఆ రచనను అమితంగా అభిమానించే పాఠకుడికి ఆ కాయితాలు  చూసే అవకాశం వచ్చింది. 

ఆ పుస్తకంలోని ఓ  ఘట్టంలో  ‘... రుజువు కాదా?’ అంటూ ముగిసే  వాక్యం చూసి,  ఇది    ‘... రుజువు కాదూ?’ అని ఉండాలి కదా?’  అన్నాడు పాఠకుడు.

రచయిత  అవాక్కయ్యేలా- పాత ప్రచురణలో పాఠకుడు  చెప్పినట్టే ఉంది.

అంత అతి స్వల్పమైన మార్పును కూడా గుర్తుంచుకున్నందుకూ, గమనించినందుకూ ఆ రచయిత ఆశ్చర్యపోయారు!   

‘ఎన్నోసార్లు చదివి, కంఠతా వచ్చిన వాక్యాలవి’  అని వివరించాడు ఆ  పాఠకుడు. 

ఐదారేళ్ళక్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది!

పాఠకులంతే ...!   

రచనలను అభిమానించేటపుడు అక్షరం అక్షరం ప్రాణం పెట్టి చదువుతారు.   రీ ప్రింట్లలో  చిన్న మాట తేడాగా వచ్చినా భరించలేరు! 

*  *  *

పునరపి కథనం

తెలుగులో రచయితలూ, కవులూ తన రచనలకు రెండో వర్షన్ రాసుకున్న సందర్భాలున్నాయి.

*  గురజాడ ‘కన్యాశుల్కం’నాటకానికి  రెండో వర్షన్ రాశాడు. 

*  తన  ‘దిద్దుబాటు’ కథలో భాషను కొంతమార్చి రెండో వర్షన్ తయారుచేశాడు.  


*  తిలక్ ‘మైనస్ ఇంటూ ప్లస్’ కవితను మరో రూపంలోనూ రాశాడు.  


ఇలా ఎవరి రచనలను వారు  మార్చుకోవటంలో పేచీ లేదు.

కానీ వేరే రచయిత అలా చేయొచ్చా? 

అప్పటికే  పాఠక లోకంలోకి వెళ్ళిపోయిన రచనలను క్లుప్తం చేసో, వర్ణనలు తగ్గించో  వేరే రచయితలు తిరగరాయటం నా దృష్టిలో ఆక్షేపణీయం, అనుచితం.

అసలు వేరే రచయితలు ఆ రచనల్లో వేలుపెట్టడమే అసంబద్ధం!

‘కొత్త తరం పాఠకులకు పరిచయం’ చేయాలనే దృష్టి ఉంటే  ఆ రచనలను  అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.

వాటికి  పరిచయాలూ, విశ్లేషణలూ ఎంతైనా రాసుకోవచ్చు.

కానీ ఆ కథను పున:కథనం (రీ టెల్లింగ్) చేసే పనికి పూనుకోవటం ఆ రచయితకే కాదు;  ఆ రచయిత రాసిన పుస్తకాలను  ఆరాధించే పాఠకులకు కూడా అవమానం చేసినట్టే !

అనువాదాల సంగతి వేరు

వేరే భాషలో ఉన్న రచనలను అనువదించి, మన భాషలోని పాఠకులకు అందుబాటులోకి తేవటం వేరు. అలా చేసేటపుడు యథాతథంగా ఇవ్వలేకపోతే, క్లుప్తం చేయటం కూడా సమంజసమే.

ఎలెక్స్ హేలీ  రచన ‘ఏడు తరాలు’ను అనువదించినపుడు  సహవాసి చేసిందదే.

ఒకే భాషలో  గ్రాంథిక భాషలోనో, పద్యరూపంలోనో ఉన్న రచనలను వాడుకభాషలోకి మార్చటంలో  అర్థం ఉంటుంది. ఆ భాషనూ, పద్యాలనూ అవగాహన చేసుకోలేనివారికి అది ప్రయోజనం. 

అదే భాషలో ఉన్న రచనలను సంగ్రహం చేసి,  ‘పిల్లల కోసం ’చిన్నచిన్న పదాలతో  రీ టోల్డ్ స్టోరీలు రాయటాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లలు కొంత వయసు వచ్చాక , ఒరిజినల్ కథలను చదివే అవకాశం ఉంటుంది కాబట్టి.  

 కానీ అదే  భాషలో - వాడుక భాషలోనే రాసిన ఆధునిక రచనలను ... పాఠకులందరికీ  అర్థమవుతూ ఉన్న రచనలను... వేరే రచయితలు కలగజేసుకుని  పునర్లిఖించటమా?

కొమ్మూరి... మల్లాది    

మల్లాది వెంకటకృష్ణమూర్తి తను అభిమానించే కొమ్మూరి సాంబశివరావు నవల ‘ప్రాక్టికల్ జోకర్’ను ఈ రకంగానే ‘రీ టోల్డ్’ పద్ధతిలో తిరగరాసినపుడు ఆశ్చర్యం వేసింది.

 సరళ- వ్యావహారిక  శైలిలో రాసిన కొమ్మూరి రచనలు  అర్థం కాకపోవటమా? అవి చదవటానికి పాఠకులకు మల్లాది సాయమో, మరెవరి సాయమో అవసరమా?


ఆధునిక వ్యవహార భాషలో ఉత్కంఠ, కథన వేగం మిళితం చేసి  రాసి, వేలమంది పాఠకులను  అభిమానులుగా చేసుకున్న రచయిత   కొమ్మూరి సాంబశివరావు.

ఆ రచనలను అభిమానించిన వ్యక్తే ఆయన రచనను తిరగరాయటమంటే తన అభిమాన రచయితను గౌరవించినట్టవుతుందా? 

అది ఆయనకు చేసిన అవమానం తప్ప మరొకటి కాదు. అంతే కాదు; 
కొమ్మూరి అభిమాన పాఠకుల కోణంలో కూడా అది అపరాధమే!


ఖదీర్ బాబు పున:కథనంః
 
‘నూరేళ్ల తెలుగు కథ’  పేరిట వందమంది రచయితల ప్రసిద్ధ కథలు పునఃకథనం చేసిన మహమ్మద్ ఖదీర్‌బాబు చేసింది కూడా ఇదే !  


 భావం చెడకుండా కథలను  సంక్షిప్తం చేసే ప్రయత్నం కష్టమైనదే  కావొచ్చు. కానీ అంత కష్టానికి  పాల్పడాల్సిన అవసరమేముంది?

ఆ ఒరిజినల్  కథలపై, కథకులపై అభిమానమే ఉంటే... వాటిన్నటినీ సంకలనంగా తెచ్చే ప్రయత్నం -  అదెంత కష్టమైనా సరే, చేసివుండాల్సింది!

*  *  *


రచయిత సంతకం

కథ కావొచ్చు; నవల కావొచ్చు- రచయిత రాసిన ప్రతి అక్షరం, పద ప్రయోగం,  వాక్యనిర్మాణం, చివరికి విరామచిహ్నం  కూడా ఆ రచనలో అంతర్భాగాలే! 

ఆ రచనా శైలి  రచయిత సంతకం!

అది ఇతరులు  అనుకరించినా సంపూర్ణంగా సాధ్యంకాని ప్రత్యేకత!
పాఠకులను చేరటం కోసం రచయిత  సృష్టించుకున్న ఆత్మీయ వాహకం!

వేరే రచయితలు ఆ రచనను తిరగరాస్తే - ఇతివృత్తం మారకపోవచ్చు కానీ కథ ఇక  ఆ ఒరిజినల్  రచయితది అవ్వనే అవ్వదు. 

గొంతుతో ముడిపడిన శ్రావ్యత 


ఘంటసాల గాన ప్రతిభ గురించి చెప్పదల్చుకున్నవాళ్ళు ఆయన పాటను పాడి  విశ్లేషిస్తే,  ఎందుకంత మధురంగా ఉందో వివరిస్తే మంచిదే! 


అంతే కానీ-  ‘ఘంటసాల పాట ఇదీ’  అంటూ తామే పాటంతా  పాడేసి, దాన్ని రికార్డుగా మార్కెట్లో  విడుదల చేయకూడదు.

కళ  వ్యాపారంగా , మార్కెట్ సరుకుగా,  లాభార్జన సాధనంగా   మారటంలో ఏర్పడిన  వికృత పద్ధతుల్లో ఇదొకటి.

మనలాంటివాళ్ళం  ఘంటసాల,  బాలుల పాడినవాటినో;   సుశీల,   జానకిల పాటలనో   ముచ్చటగా, ఆరాధనగా, ఇష్టంగా  పాడుకోవటం, ఆనందించటం;  ఇతరులకు వినిపించి వాళ్ళను  సంతోషపెట్టటం  వేరు.  

దాని సంగతి కాదిది.

ఈ అనుకరణ  వేత్తలు   తాము  గొప్ప పాత పాటలను  అత్యాధునిక సాంకేతిక ధ్వని ముద్రణను  జోడించి, ఒరిజినల్ గా ఉండేలా  పాడటానికి ఎంత కష్టమైనా  పడివుండొచ్చు.

కానీ అసలు అసలే; నకలు నకలే!

గీతాదత్  పాట గొప్ప పాటను తనే  లతా మంగేష్కర్ పాడి రికార్డుగా  విడుదల  చేసిందంటే అది గీతాదత్ పై  లత గౌరవం చూపినట్టవుతుందా?

ఏమాత్రం కాదు. గీత పాట తియ్యగా ఉందంటే  అది ఆమె గొంతుతో ముడిపడివున్న విషయం.

 ఆ గొంతు లేనపుడు... అది ఇక గీత పాట కానే కాదు. 
కనీసం  అది లత పాట కూడా కాబోదు. 
విషాదకరమైన నకలు పాట అవుతుంది.

ఒక గాయకుడు పాడిన  (సినిమా) పాటను మరొకరు తమ గొంతుతో పాడి రికార్డులుగా విడుదల చేయటం అంటే... ఆ గొంతుతో పెనవేసుకునివున్న శ్రోతల అనుభూతిని ధ్వంసం చేయటమే. శ్రోతల మనసుల్లోని సున్నితమైన బంధాన్ని తుంచివేయటమే!

ఈ చెడు సంప్రదాయం లతతోనే ఆగలేదు.

‘లివింగ్ లెజెండ్’ పేరుతోనో, మరో పేరుతోనో   లతకు ‘నివాళి’ పేరుతో లత పాటలను  అనూరాధ పాడ్వాల్ పాడి రికార్డులుగా విడుదల చేసింది.  రేపు అనూరాధ పాటలను కూడా మరెవరో ఇలాగే చేస్తారు!

ఒక పాటకు దాన్ని పాడిన  గాయకుల గొంతుతో ఉన్న అవినాభావ అనుబంధమే ... ఒక రచనకు దాన్ని రాసిన  రచయితల భాషతో,  శైలితో ఉంటుంది! 


( ఫొటోలు ... google  సౌజన్యంతో)