సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, డిసెంబర్ 2012, ఆదివారం

దొరికిందోచ్... ‘బొట్టు కాటుక’ సినిమా లోగో!

ప్పుడెప్పుడో... 2010లో ఓ పోస్టు రాశాను-  తెలుగు సినిమా లోగోల గురించి (logo-  అక్షరాకృతి) .  అందులో  నాకెంతో నచ్చిన ‘బొట్టు- కాటుక’ లోగో ప్రత్యేకత వివరించాను కానీ, అప్పట్లో ఆ లోగో దొరక్క అది ఎలా ఉంటుందో  వర్ణించి సంతృప్తి పడ్డాను.

కానీ ఇన్నేళ్ళ తర్వాత అది  దొరికింది!

నా చిన్నప్పుడు ఆసక్తిగా గమనించిన సినిమా లోగో... 
చిత్రకారుడు  గంగాధర్ పేరు తల్చుకుంటే  నాకు గుర్తొచ్చే  లోగో!
33 సంవత్సరాల తర్వాత పునర్దర్శనమిచ్చింది!


అప్పుడు ఆ పోస్టులో రాసిన కొన్ని వాక్యాలు ఇక్కడ ఇస్తున్నాను...

‘‘ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో!

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో. మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!’’


ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పోస్టు లింకు చూడండి..  http://venuvu.blogspot.in/2010/07/blog-post.html

ఇప్పుడెలా దొరికింది?

నెట్ లో ఏదో వెతుకుంటే ... ఓ యూ ట్యూబ్   లింకులో  ‘బొట్టు- కాటుక’ సినిమా కనపడింది!

నా కుతూహలం ఒక్కసారిగా పెరిగిపోయింది. (ఎందుకంటే...  వాల్ పోస్టర్లలో వాడని ఆ  లోగోను  టైటిల్స్ లో వాడారని  1980ల్లో  ఆ  సినిమా చూసినపుడు గమనించాను.. అది గుర్తుంది! )

వెంటనే  ఉత్కంఠతో ఆ సినిమా ప్లే చేశాను.
సెన్సార్ సర్టిఫికెట్ కనపడింది. తర్వాత...  పంపిణీదారుల పేరు, కృతజ్ఞతలు, బ్యానర్ పేరు.. వరసగా  ఒకదాని తర్వాత మరొకటి కంప్యూటర్ తెరపై కనపడసాగాయి.

అప్పుడు...
నా  సంతోషాన్ని పెంచేస్తూ-
ఎప్పటినుంచో అన్వేషిస్తున్న లోగో-
కనపడింది...!


ఆ దృశ్యాన్ని  f...r..e..e..z..e... చేశాను .
స్నాప్ షాట్   తీసుకున్నాను!

ఇదిగోండి.... చూడండి- 


పెదాల ఆకారంలో  ‘ఈస్ట్ మన్ కలర్’  అనే అక్షరాలు గమనించారా?

తర్వాత  ఆ సినిమా పాటల పుస్తకం కూడా  దొరికింది .

వాల్ పోస్టర్లలో ఉపయోగించిన లోగో దానిలో ఉంది.   అది-మరో  సంగతి...
ఈ ఆన్ లైన్  అన్వేషణలో మరో సంగతి కూడా బయటపడింది.

ఇందాక లింకు ఇచ్చానే.. ఆ పోస్టును  జులై 16,  2010లో రాశాను. అదే  పోస్టు  సెప్టెంబరు 16, 2011 నాటి  సూర్య పేపర్లో కథనంగా వచ్చింది- కానీ మరొకరి పేరుతో!

నేను చేసిన వర్ణన,  రాసిన వ్యక్తిగత స్పందన కూడా దానిలో యథాతథంగా వచ్చేశాయి.
చూడండి-
http://www.suryaa.com/archives/Article.asp?cat=4&subCat=3&ContentId=47455

ఇది ఆన్ లైన్లో పెట్టారు కాబట్టి  15 నెల్ల తర్వాతయినా ఈ ఘరానా వ్యవహారం బయటపడింది.  లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదేమో! 

గతంలో కూడా ఇలా కొందరు బ్లాగర్ల టపాలను యథేచ్ఛగా కథనాలుగా వాడేసుకున్న చరిత్ర సూర్య పత్రికది.
ఈ ధోరణి లో  మార్పేమీ రాలేదన్నమాట! 

ఇలా చేస్తుంటే...  ఇకపై  ‘సూర్య’ను  ‘చౌర్య’ అని పిలవాలేమో...
 
*****
 
తాజా చేర్పు... 21.9.2022 
నిన్న శ్యామ్ నారాయణ గారు గుంటూరు నుంచి  ఈ సినిమా లోగోను మెయిల్లో పంపించారు.   పాటల రికార్డులపై ఉండే కవర్ . 
 
దీనిలో  ఇదే లోగో  కాస్త భిన్నంగా ఉంది.   ‘ బొట్టు’, ఈస్ట్ మన్ కలర్ అక్షరాలూ..  ఇంకా మరికొన్ని సూక్ష్మమైన తేడాలతో.  అంటే గంగాధర్ ఈ విలక్షణమైన లోగోను పదేపదే మెరుగుపరచటానికి ప్రయత్నించారన్నమాట.   మీరే చూడండి!