సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మీ గొప్పలు మీరే చెప్పుకోవాలా?న్మాన సభల్లో  కళాకారులను ధారాళంగా పొగుడుతూ చేసే కీర్తి గానాలు  దుర్భరంగా ఉంటాయి.

అవే అలా అనిపిస్తుంటే...

ఎవరికి వారు తమను  పొగుడుకుంటుంటే  వినాల్సిరావటం/  చదవాల్సిరావటం..
మరెంత  ఘోరం..!


*  *   * 

స్పీ బాలసుబ్రహ్మణ్యం  మధుర  గాయకుడిగానే కాదు-

చక్కని నటుడిగా , 
ప్రతిభావంతుడైన  డబ్బింగ్ ఆర్టిస్టుగా,
ప్రత్యేకించి అద్భుతమైన యాంకర్ గా  నాకెంతో ఇష్టం.

ఆయన ఇంటర్ వ్యూలు ఎప్పుడూ భలే  ఉంటాయి.  కొత్త విషయాలెన్నో తెలుస్తాయి.  అంతకుముందు తెలిసినవి కూడా  ఆయన మాటల్లో వింటే మరింత స్వారస్యంగా తోస్తాయి.

బాలూ పాడిన తొలిపాట రికార్డింగ్ జరిగి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పది రోజుల క్రితం  ఆయనతో చేసిన పెద్ద  ఇంటర్ వ్యూ ఈనాడు సినిమా పేజీలో వచ్చింది.

ఆసక్తిగా చదివాను.


 మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి గానీ... 

 రెండు చోట్ల మాత్రం ఆయన సమాధానాలు చదువుతుంటే  చేదుగా అనిపించింది.

‘ఈ దేశం ఓ గొప్పకళాకారుడిని  సృష్టించింది’ అనీ,   ‘నాలాంటి గాయకుడు పుట్టడం చాలా అరుదు’ అనీ తన ఘనతను తానే చాటుకున్నారు  బాలు.

 


ఈ  విషయాలు ఎంత నిజాలైనా కావొచ్చు; కానీ వాటిని  ఆయనే  చెప్పుకోవటం మాత్రం ఏమీ బాగా లేదు.

అడిగిన ప్రశ్నల తీరు అలా చెప్పేలా ప్రేరేపించివుంటుందని సర్దుకుందామా?  సినీ మాయామేయ ప్రపంచంలో  దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతూ  అసంఖ్యాకమైన ఇంటర్ వ్యూలు  ఇచ్చి  ఏది ఎలా ఎంతవరకూ  చెప్పాలో ఎంతో తెలిసిన  బాలూ  కదా..  అలా ఎలా చెప్పాడనే ప్రశ్న మాత్రం వదల్లేదు నన్ను.  
  
 ‘‘ఇప్పుడు కూడా  నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాడినవుతా!’’ అనే సమర్థన మరీ ఇబ్బందిని కలిగించింది. 

బాలూ!  మీ గురించి మీరలా చెప్పుకోకపోతే మీ గురించి  శ్రోతలకూ,  ప్రేక్షకులకూ  తెలియని పరిస్థితి  ఉందా?

మీరే ఇంతలా దీనంగా  భావిస్తుంటే... మరి మీ సీనియర్ గాయని సుశీల సంగతి?  

తెలుగు చిత్రసీమ  స్వర్ణయుగంలో అవిభాజ్య భాగమై..  ఘంటసాలతో,  మీతో  కూడా మరపురాని... మనోహరమైన పాటలనెన్నో ఆలపించిన సుశీల  ఇలా తన గొప్పలు తానే ఎన్నడైనా  చెప్పుకున్నారా?

అవార్డులే  కొలమానంగా భావించే, వాటికోసం  వెంపర్లాడే  సినిమా సంస్కృతిలో ఏళ్ళ తరబడి ఉంటూ కూడా ..

తను పాటలు పాడటం మొదలుపెట్టినపుడు బహుశా ఇంకా పుట్టని గాయని  చిత్రకు పద్మశ్రీ ఇచ్చి తనను పట్టించుకోకపోయినా-

ఆ గాన కోకిల  మౌనంగానే ఉన్నారు కదా?

ఆవేదనతోనో, ఆక్రోశంతోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం ఆమె  చేయలేదు కదా? (కొద్ది కాలం తర్వాత ఎవరి సిఫార్సు పనిచేసో.. అంతకన్నాపెద్ద అవార్డే  వచ్చిందనుకోండీ...)    

బాలూ... మీ గురించి మీరిలా చెప్పుకోవడం ద్వారా మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని కొంత  కుదించుకుని,  మిమ్మల్నిఅభిమానించేవారిని ఎంతో కొంత బాధపెట్టారనిపించింది.

ఈ ఆత్మ శ్లాఘనలు మీ ఔన్నత్యాన్ని తగ్గించాయనే  అభిప్రాయం  నాలాంటి అభిమానులకు  ఏర్పడిందంటే- ఇప్పుడు నిజంగానే మీకు మీరే  ద్రోహం చేసుకున్నట్టు అవలేదా? 

 
*  *   * 
‘ఆత్మ శ్లాఘన’అనే మాట వినగానే గుర్తొచ్చే రచయిత చెలం.

 శ్రీశ్రీ మహా ప్రస్థానానికి  ఆయన  రాసిన ‘యోగ్యతాపత్రం’లో  ఈ వాక్యాలు చూడండి-

‘‘అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీద పడి బతుకుతున్న ఈ  prasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.’’


అలాంటి శ్రీశ్రీ  తర్వాతి కాలంలో   ‘ఈ శతాబ్దం నాది’ అంటూ  గొప్పలు పోవటం బాగా అనిపించలేదు.

ఒక భాషా సాహిత్యంలోని ఒకానొక  ప్రక్రియలో ప్రభావశీలమైన ప్రతిభ చూపినంతమాత్రాన ఒక  శతాబ్దం మొత్తం ఆ కవిదే  అయిపోదు.  ఒకవేళ అయితే గియితే...ఆ మాట ఇతరులు.. విమర్శకులు చెప్పొచ్చు  గానీ..

ఒక కవి తన ప్రభావం గురించి తానే  ఎలుగెత్తి చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. 

ఆ  శ్రీశ్రీని  తొలి దశలో ప్రబావితం చేసిన  కవి  విశ్వనాథ  సత్యనారాయణ.   

 ‘ధిషణాహంకారం’తో  విశ్వనాథ  చేసిన స్వీయ కీర్తిగానాలూ  అంతే!


చూడండి-

‘‘అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోః
హల బ్రాహ్మీమయమూర్తి  శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశ స్వామి కున్నట్టుగన్
’’
(శ్రీమద్రామాయణ కల్పవృక్షం)

తనంతటివాడు శిష్యుడైన అదృష్టం చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రికి  దక్కింది గానీ నన్నయ, తిక్కనలకు కూడా  దక్కలేదట! 

తిరుపతి వేంకటకవుల్లో  ఒకరు ఈ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ఆ జంట కవులు విసిరిన సవాళ్ళలో  ఎంతెంత సొంత పొగడ్తలు కురిపించుకున్నారో చూడండి-"దోసమటం చెఱింగియును దుందుడు కొప్పఁగఁ బెంచినార మీ
మీసము రెండుభాషలకు మేమె కవీంద్రులమంచుఁ దెల్పఁగా
రోసము గల్గినన్ గవివరుల్ మము గెల్వుఁడు గెల్చిరేని యీ
మీసము దీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే."


తెలుగు, సంస్కృత భాషలు రెంటికీ వాళ్ళే కవీంద్రులట. అందుకే  మీసం పెంచారట.  తమను ఏ కవులైనా గెలిస్తే వారి మీసం తీసేసి, వాళ్ళ కాళ్ళ దగ్గరపెట్టి మొక్కుతామని సవాలు విసిరారు.

అప్పట్లో కొప్పరపు కవులకూ,  వీరికీ మధ్య  అవధానాల, కవనాల, వాగ్యుద్ధాలు హోరాహోరీగా  జరిగేవట. మొహమాటాలేమీ పడకుండా యథేచ్ఛగా ఎవరి  గొప్పలు వారే చెప్పుకోవటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

కొప్పరపు కవులు కూడా ఇలాగే తమ ఘనతను చాటుకున్నారో  లేదో  తెలియదు.

*  *   * 
హాభారత రచనా కాలం నాటికే  ఎవరిని వారు పొగుడుకోవటం  హీనమైన విషయంగా ఉంది.

కర్ణపర్వం మూడో ఆశ్వాసంలో  అర్జునుడు ఓ సందర్భంలో  దర్మరాజును నానా తిట్లూ తిడతాడు. ఆపై పశ్చాత్తాపంతో  తన తల నరుక్కుంటానని అంటాడు.

కృష్ణుడు " అర్జునా ! దానికీ ఒక ఉపాయం ఉంది !  తనని తాను పొగుడుకోవడం చావుతో సమానం అంటారు పెద్దలు. అందుచేత నిన్ను నువ్వు పొగుడుకో. అదే ప్రాయశ్చిత్తం.’’ అంటాడు.

అప్పుడు అర్జునుడు తనను ఇలా పొగుడుకుంటాడు-

 " ధర్మజా ! నా పరాక్రమం నీకు తెలియనిదా !  శివుడు వొక్కడూ తప్పిస్తే  విల్లు పట్టినవాళ్ళలో నాతో సాటి వచ్చేవాడు ముల్లోకాల్లోనూ లేడు. దిగ్విజయం చేశాను. కోట్లు కోట్లు ధనం నీ రాజసూయం దక్షిణల కోసం తెచ్చిపోశాను. సాటి లేని  సంశప్తకులను  నాశనం చేశాను. నా చేతిలో చచ్చిన కౌరవసేనలు ఎలా పడివున్నాయో ఒక్కసారి చూడు’’ 

‘నిన్ను నువ్వు పొగుడుకుంటే  నిన్ను నువ్వు చంపుకున్నట్టే’ అంటూ  సొంత డబ్బా కొట్టుకోవడాన్ని ఆ కాలంలోనే అంత తీవ్రంగా నిరసించేవారన్నమాట!

*  *   *  

రు సంవత్సరాల క్రితం రచయిత  నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి తిరుపతిలో  చెక్కు బహూకరణ సన్మానం జరిగింది.

ఆ సందర్భంగా తన  ప్రసంగ వ్యాసం- ‘పాఠకులారా! మిమ్మల్నిక్షమించలేను’లో  నామిని తన రచనల ఘనతను స్వయంగా చాటుకున్నారు. ‘ఆబాల గోపాలానికి ఎంతగానో ఉపయోగపడే ఇన్నిపుస్తకాలు’ రాశానన్నారు. పాఠకుల దేహాల్లో  ‘ఎప్పటికప్పుడు మంచి రసాయనాల ఇన్సులిన్ పడటానికి ’ తన  పుస్తకాలు కొనాలని చెప్పుకొచ్చారు.

దీన్ని రచయిత్రి  రంగనాయకమ్మ ఎలా దుయ్యబట్టారో చూడండి-

                             
‘‘ఏ మనిషి అయినా , ‘నేను అందరికన్నా చాలా గొప్పవాణ్ణి’ అన్నాడంటే , అనుకున్నాడంటే ఆ మనిషి మొదట అందరికన్నా అల్పుడు!  తర్వాత అందరికన్నా మూర్ఖుడు! 

నువ్వు చాలా గొప్పవాడివే అయితే , ఆ మాట, నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.  ఇంత చిన్నవిషయం తెలియని ఏ మనిషి అయినా , గొప్పవాడయ్యేది , అల్పత్వంలోనే !’’


‘గొప్పవాడయ్యేది అల్పత్వంలోనే... ’ -  ఎంత  పదునుగా ఉందో కదా  ఈ వ్యాఖ్య!

*  *   * 

న ప్రతిభా సంపత్తుల విషయంలో నమ్రతగా, వినయంగా  ఉన్న కవి కాళిదాసు!

రసవంతమైన- మనసుకు హత్తుకునే పోలికలు చెప్పటంలో  ‘ఉపమా కాళిదాసస్య’  అని  ప్రఖ్యాతికెక్కిన సంస్కృత కవి.

 తాను రాసిన  కావ్యం   ‘రఘువంశం’  మొదట్లోనే  తన గురించి ఏం చెప్పుకున్నాడో  చూడండి-
మన్ద: కవియశ: ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్
ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామన:


అంటే-

‘‘నేనొక తెలివితక్కువ వాణ్ణి.  కవి అనే కీర్తి పొందాలనే కోరిక ఉన్నవాణ్ణి . పొడుగైన వాళ్ళకు మాత్రమే అందే పళ్ళు అందుకోవాలని చేతులు సాచే పొట్టివాడిని చూసి నవ్వినట్టు జనం నన్ను చూసి నవ్వుతారేమో.’’

 కర్ణకఠోరమైన స్వీయ గుణగానాలతో ‘పోలిస్తే’ కాళిదాసు తన గురించి  చెప్పింది హాయిగానూ,  శ్రవణపేయంగానూ  లేదూ!  


30 కామెంట్‌లు:

sasi చెప్పారు...

చాలా బాగా చెప్పారు.ఇప్పటికి యేసుదాస్ తాను గొప్ప గాయకుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు.అంతకు ముందు ఘంటసాల,రఫి,కిషోర్ కుమార్,లత ,ఆశా,సుశీల,జానకి వీళ్లు ఎవరూ కూడా ఎప్పుడు చెప్పలేదు.వీళ్ల కంటే నిస్సందేహంగ గొప్ప గాయకుడు కాదు బాలు.ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి.నుస్రత్ ఫతే ఆలి ఖాన్ ప్రపంచ ప్రసిద్ది గాయకుడు.ఆయన ఎక్కడ కూడ తను గొప్ప అని చెప్పుకోలెదు.ఇక్కద సందర్భం కూడ అది కాదు.మీరు గొప్ప గాయకుడు కాదు అని ఎవరన్నా అంటే అప్పుడు అన్నా ఒక అందం. నా వరకు ఘంటసాల పాటలు వింటే వచ్చే ఆనందంలో 50% కూడా బాలు గారి పాటల వల్ల రాదు.ఆయన గొప్ప పాటలు అని అందరూ అనేవి విన్నప్పుడు కూడా.నాకు 30 యేళ్ళు.

నీహారిక చెప్పారు...

భగవంతుడు పుట్టేముందు గంధర్వులు పుడతారు.ఆ సంగతి గంధర్వుడికీ తెలియదు భగవంతుడికీ తెలియదు.ప్రశ్నని బట్టి జవాబు ఉంటుంది కానీ అర్ధం చేసుకునేవారి మనస్థత్వాన్ని బట్టి సత్యం ఉండదు.(భగవంతుడు అంటే మోడీ అనుకునేరు సుమా...ఆయన అటు సంసారీ కాడు ఇటు సన్యాసీ కారు)

కళాకారులెవరయినా భగవంతుని కోసం సృష్టించబడతారు కాబట్టి ప్రజల చేత సృష్టించబడ్డ కళాకారుడినని ఆయన చెప్పారు.మీకైనా,నాకైనా,ఎవరికైనా ప్రజలే దేవుళ్ళు కదా ? రంగనాయకమ్మ కానివ్వండి రంగనాధుడు కానివ్వండి ప్రజల మెప్పుపొందని కళాకారుడు జీవించినా మరణించినట్లే !

పూలతీగ చెప్పారు...

"ఆ సంగతి గంధర్వుడికీ తెలియదు భగవంతుడికీ తెలియదు"

భగవంతుడికీ తెలియని విషయాలుంటాయా? చోద్యం కాకపోతే. మధ్యలో ఈ‌ గంధర్వుడి గోలేమిటో. పోనీయండి సర్వఙ్ఞులు సెలవిచ్చినప్పుడు వినాలి కామోసు.

నీహారిక చెప్పారు...

మనిషే భగవంతుడిగా పుట్టాడని మీరే వాదిస్తున్నారుగా ? భగవంతుడినని తెలిసే తప్పులు చేసాడా ? పూలన్నీ సర్వజ్ఞుడిని చేరలేవు. కొన్ని నేలపాలు అవ్వవలసిందే కదా ?

Unknown చెప్పారు...

ఆత్మ స్తుతి పరనిందా ఈ నాటి నైజం! తన గొప్పలు తానూ చెప్పుకొపోతే చెప్పే వాడు ఉండడు ఈ పోటి ప్రపంచంలో? ఎవడికి వాడే గొప్ప! వినమ్రత ఈ నాడు తునీకరించ బడుతుంది! వినమ్రుడెవడైనా తన గోతి తానే తవ్వు కున్న వాడైతాడు. ఇది ఈ నాటి న్యాయం. అలా అని బాలుని సమర్ధించడం కాదు !

Sravan చెప్పారు...

అద్భుతం... పోలికలతో పాటు ముగింపు కూడా గొప్పగా ఉంది.

kalyani sj చెప్పారు...

Very well said!

Vidyamanohar చెప్పారు...

దీన్ని 'గొయ్యి మీద దుశ్శాలువ పరుచుకొని కూచోవడం' అని చెప్పుకోవచ్చేమో

చిత్రహేల చెప్పారు...

Great Article!
Really worth reading!
I had many similar views on him for many years!
I shared your post in Facebook and this is my comment on one of the posts mentioned in FB:


"తెలుగు పాటల్లో సాహిత్యం చచ్చిపోయింది! మా రోజుల్లో..."
"అదేంటి? మీరు 'నీయమ్మ నా అత్తో', 'గు గు గ్గుడెసుంది - మ మ మ్మచముందీ పాటలు...? ఆ ట్రెండు మొదలు పెట్టింది...?"
"ఓ! అవా! నిర్మాత కోసం పాడాల్సి వచ్చింది...? దాన్ని ట్రెండు సెట్టింగ్ అనరు..."
"మరి...?"
"సినిమా మొత్తం అన్ని పాటలూ ఒక్కరే మింగేసే ట్రెండు సృష్టించాను, మీరెవరూ గమనించినట్లు లేరు."
"చాలా విషయల్లో నాకు నేనే ట్రెండు సెట్టర్ని!"
"ఆ...!?...!?"

GKK చెప్పారు...

బాలు is a hyperactive genius. Many a time he loses control and goes overboard. ఈనాడు వ్యాసంలో బాలుగారి గురించి చేసిన వర్ణనలు చూడండి. అంత అతి అవసరమా? పొగిడినా తిట్టినా అతి చేయటం వికారంగా ఉంటుంది. బాలు గొప్పగాయకుడు. ఆయన ఎన్ని మంచిపాటలు పాడాడో అంతకు పదింతలు చెత్తపాటలు కూడా పాడాడు. తనకుతానే సన్మానం చేసుకోవటం ఎందుకు.

Kottapali చెప్పారు...

ఈ విషయంలో కచ్చితంగా విభేదిస్తాను. బాలుకి అంత ఉందో లేదో నాకు తెలీదు గానీ ఉన్నవాళ్ళు నాకు ఉంది అని చెప్పుకోవడంలో ఏమీ తప్పులేదు. చెప్పుకోకుండా ఉన్న వాళ్ళు మహామహులైతే అవ్వొచ్చు గాక, చెప్పుకున్న వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఏమీ తక్కువ కాలేదు.

సురేష్ పిళ్లె చెప్పారు...

వేణూ ..
అభినందనలు. వ్యాసం చాలా గొప్పగా ఉంది.
తనకు అవకాశాలు ఇవ్వని సంగీత దర్శకులు స్వరపరిజ్ఞానం లేని మూర్ఖులు అని భావించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అహంకారానికీ, పోలికల్లో కొన్ని అభ్యంతరాలున్నాయి నాకు. తిరుపతి వేంకటకవులు లాంటి వారు తమని తాము కీర్తించుకోవడం అనేది ప్రధానంగా పోటీలకు దిగిన సందర్భాల్లో చెప్పుకున్న పద్యంగా గుర్తించలేదు. ఆ సందర్భం చాలా ముఖ్యం. పోటీకి బరిలో దిగినప్పుడు తనను తాను పొగడుకుంటే.. దానిని స్వోత్కర్ష, ఆత్మస్తుతి కింద పరిగణించక్కర్లేదని నా అభిప్రాయం.
ఎన్నికల్లో దిగిన ప్రతివాడూ తనను మించిన ప్రజాసేవకుడు లేడంటాడు. ఇది కూడా అలాంటిదే అయి ఉండొచ్చు. తిరుపతి కవుల సందర్భం కూడా అలాంటిదని నా అభిప్రాయం. బాలు, నామిని, విశ్వనాథ ల అహంకారం ఒకే కేటగిరీకి చెందినది.
కానీ వ్యాసం చాలా చక్కగా ఉంది.

sugar candy చెప్పారు...

in my view spb is just a singer no compariison betwen him and ghantasala. i dont like some one call him amaragayaka or gandhrvagana only ghantasala is deserved for that title. SPB is trying to boost up himself as he is losing ground bcos there are hundreds of singers in AP exactly like his voice but no one so far like ghantasala . I have never enjoyed his songs except allu and rajababus songs i dont kno why he is thinking of himslef so much he is just a singer ony not madhura

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో తప్పేమీలేదు అన్నది ఆ స్ధాయికి ఎదిగిన వ్యక్తికి అనవసరం అని నా అభిప్రాయం. అయితే తిరుపతి వేంకటకవుల "దోసమటంచు ....." ఆత్మస్తుతి కానేరదని సురేష్ పిళ్ళా గారు అన్నదానితో నేనూ ఏకీభవిస్తాను.

VISWANADHAM NAGA SURYANARAYANA SARMA చెప్పారు...

పెద్దలను విమర్శించతగదు.

MV Ramana Murty చెప్పారు...

He never wholeheartedly appreciates Ghantasala Garu. He in fact tries to belittle him by saying a particular song sung by Ghantasala is a copy, real credit goes to so and so music director etc etc. Same is the case with Suseelamma. He blames latest songs and music directors but he is the one who started singing meaningless and useless songs initially.

mannam krishnamurthy చెప్పారు...

Generally 'balu' maintains low profile with an intention that others to feel that 'balu' is great. This time he himself could not hide.

Zilebi చెప్పారు...నేను నారాయణ స్వామి గారి అభిప్రాయం తో పూర్తిగా సహ్మతీ హూన్

Winhearts చెప్పారు...

Jeevitha satyam telusukunnanu

వేణు చెప్పారు...

ఈ పోస్టుకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు.

ఇతర గాయకులతో పోలిస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తక్కువ స్థాయి కళాకారుడనే అభిప్రాయాలను కొందరు వ్యక్తపరిచారు.

అలా పోల్చి ఆయన్ను తక్కువ చేయటంపై నాకు ఏకీభావం లేదు. ఎందుకంటే నేను బాలునూ, ఆయన పాటలనూ చాలా ఇష్టపడతాను. అభిమానిస్తాను. ఆయన ఆత్మస్తుతి గురించి మాత్రమే నా అభ్యంతరం.

మరో మాట- ఈ పోస్టు కేవలం బాలుకే పరిమితమైనది కాదు. స్వోత్కర్షలతో స్వీయ గుణగానాలు చేసుకునేవారందరికీ ఇక్కడి విమర్శలు వర్తిస్తాయి. స్వోత్కర్షల బలహీనతను వీలైనంత బలంగా నిరసించాలనేదే నా ఉద్దేశం.

@ నీహారిక: ప్రశ్నను బట్టి జవాబు ఉంటుందన్నారు మీరు. కొత్తగా ఇంటర్వ్యూలు ఇచ్చే కళాకారులు జవాబివ్వటంలో తడబడుతూ తబ్బిబ్బవుతుంటారు కానీ, ఎన్నో ఢక్కామొక్కీలు అలవాటైన బాలుకు ఆ పరిస్థితి లేదు. ఆ రెండు ప్రశ్నలకూ నమ్రతగా జవాబు ఇవ్వదల్చుకుంటే బాలూ ఇచ్చేవారే. కానీ ఆయన తనను గొప్ప చేసుకోవటాన్నే ఇష్టపడ్డారు కాబట్టి అలాంటి సమాధానాలు ఆయన్నుంచి వచ్చాయి.

@ THIRUPALU P: గొప్పలు చెప్పుకోవడం నేటి నైజమనీ, అలా చేయకపోతే పోటీలో నిలవలేడనీ అంటున్నారు మీరు. పోటీలో నిలవడం కోసం పొగుడుకోవాల్సిందేనన్నమాట. దానిపై మీకు వ్యతిరేకత ఉన్నట్టు లేదు. అలా అయితే బాలు చేసిందాంట్లో దోషమేమీ లేనట్టే కదా? మరి దీనికి వ్యతిరేకంగా ‘ బాలును సమర్థించటం లేదు’ అనీ మీరే అంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం బోధపడలేదు నాకు.

@ Vidyamanohar Sharma : ‘గొయ్యి మీద దుశ్శాలువ పరుచుకొని కూచోవడం' అన్నమీ పోలిక భలే వింతగా ఉంది.

@ తెలుగు అభిమాని: ‘ తనకు తానే సన్మానం చేసుకోవటం ఎందుకు? ’ అనే మీ వ్యక్తీకరణ బాగుంది.

Narayana Swamy: తమకున్న ఘనతను చెప్పుకుంటే - అలా చెప్పుకోవడం వల్ల తప్పులేదనీ, దానివల్ల వారు ఏమీ తక్కువ కాలేరనీ అంటున్నారు మీరు. సరే. మీ భేదాభిప్రాయానికి నా ఆహ్వానం!

తమ ఘనత గురించి ఎవరైనా తామే చెప్పుకుంటే ... దానిలో ఎంత వాస్తవమున్నప్పటికీ వినేవాళ్ళలో చాలామందికి చెప్పేవారిపై అపనమ్మకం ఏర్పడుతుంది (అని నా అభిప్రాయం.) అంటే తక్కువ స్థాయి అభిప్రాయం ఏర్పడుతుందన్నమాట! దానికి సిద్ధపడేవారే స్వీయ కీర్తిగానాలు చేస్తుంటారేమో.

వేణు చెప్పారు...

@ సురేష్ పిళ్లె: మీ స్పందనకు థాంక్యూ. తిరుపతి వేంకటకవులు ఇతర కవులపై సవాళ్ళు విసిరినప్పుడు కూడా- ఉండదల్చుకుంటే వినయంగా, నమ్రతగా ఉండొచ్చు. అది అసాధ్యమేమీ కాదు. (ఆ సవాళ్ళ సందర్భాన్ని నా పోస్టులో కూడా ప్రస్తావించాను కదా?) ‘పలికించెడి వాడు రామభద్రుండట’ టైపులో తమ పాండిత్య విశేషాలను వివరించవచ్చేమో.

అసలు సొంత గొప్పలు చెప్పకోకూడదనే ఉద్దేశం మొదట ఆ కవులకు లేదనేది ఇక్కడ పాయింటు. ఎంతటి తీవ్ర వివాదాల్లోనైనా వారి స్వభావం వారి వ్యక్తీకరణ తీరులో ప్రతిఫలించదా?

ఎన్నికల్లో రాజకీయ నాయకులు ‘తాము చేసిన పనులు చెప్పుకోవడం’ ప్రచారం కింద వస్తుంది. ఆ ప్రచారమైనా వినయంగా ఉండాలి. ‘నాలాంటి రాజకీయ నాయకుడు పుట్టడం అరుదనీ, నేను గొప్పరాజకీయ నాయకుణ్ణనీ’ చెప్పుకుంటే అది ఏహ్యంగా అనిపిస్తుంది కదా?


@ విన్నకోట నరసింహా రావు: ‘ ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో తప్పేమీలేదు అన్నది ఆ స్ధాయికి ఎదిగిన వ్యక్తికి అనవసరం’ అన్నారు. చెప్పుకోవడం ఒప్పా కాదా అనేది ముఖ్యమని నా ఉద్దేశం. అది ఒప్పయినపుడు బాలు స్థాయి వ్యక్తికి అనవసరం అని మీకనిపించింది. కానీ బాలు పరంగా చూస్తే అది ఆయనకు అవసరమేనని తెలుస్తోంది కదా?


@ VISWANADHAM NAGA SURYANARAYANA SARMA: విషయ విమర్శల్లో, చర్చల్లో, సంవాదాల్లో గురువుతో కూడా గుద్దులాడొచ్చని పోట్లాడొచ్చని) ఆ పెద్దలే చెప్పలేదా అండీ?

@ Winhearts: జీవిత సత్యం తెలుసుకున్నానని రాశారు. ఏ జీవిత సత్యం? ఈ చర్చ విషయంలో మీ భావం మాత్రం అర్థం కాలేదు సుమండీ!

Vidyamanohar చెప్పారు...

దుశ్శాలువ పరుచుకోవడం = తన సన్మానం తనే చేసుకోవడం = స్వోత్కర్ష

గొయ్యి మీద కప్పడం = పడిపోవడమే పర్యవసానం .. ఇలా రెండూ ఒకేసారి చెప్పడానికి చేసిన ప్రయత్నం...

శ్యామలీయం చెప్పారు...

>ఇతర గాయకులతో పోలిస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం....
ఘంటసాల మాష్టరుతో ఒకరు పోల్చినట్లు చూసాను. ఆయన్నే మీరు ఒక 'ఇతర్ గాయకుడిని' చేసారే!

వేణు చెప్పారు...

శ్యామలీయం గారూ!మొదటి వ్యాఖ్య చూడండి. ఘంట సాల, ఏసుదాసు, రఫీలతో పోలిక!

Unknown చెప్పారు...

ఇదే విశయాన్ని నేను ఓ సారి యూట్యూబులో ప్రస్తావించాను. యుట్యూబు వారే చేసేదిలేక కామెంట్లను డిస్లైకులను డిలీట్ చేసేశారు.విశయం క్లుప్తంగా ...వెనుకటికి ఒకడు తన కాళ్ళకు తానే మ్రొక్కి తానే దేవుడినని చెప్పుకొన్నట్లు ఈయనగారు తన పాటలకు తానే పరీక్షకర్తగా ఉండి పిల్లలను తప్పు ఒప్పులని పట్టడేమిటని ఏమిటని... ఇంకా ఇతర గాయకులను,వారి శాస్త్రీయతను, సంగీతంలో లోతు పాతులను కాకుండా కేవలం సినిమా సంగీతమే అసలైన సంగీతంగా ప్రచారం కల్పించడేమిటని ..దానికి ఓ వేదిక చేసుకొని ప్రపంచం అంతా తిరుగుతూ ఏం సాధిస్తున్నారని అడగడం జరిగింది.ఇంచు మించు అదే విశయాన్ని మీరు కూడా ప్రస్తావించడంతో ఇంకో విశయాన్ని సభాముఖంగా పంచుకోవాలను కొంటున్నాను. మన తెలుగు టీవి చానెళ్ళ వారు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకొంటున్నారో తెలియదు కాని ఇతర భాషా చానెళ్ళవారు ఉదా:- మలయాళం తమిళు ఎంత మంచి మంచి ప్రోగ్రాములు ఆర్గనైజు చేస్తూ ప్రజల్లో ఓ అవగాహన కల్పిస్తున్నారు. ముందు తరాల వారికి తమదంటూ ఓ సంపదను ఇస్తున్నారు. ఆ ప్రోగ్రాములలో తెలుగు భాషా పాటలు మన శైలి,మనప్రాంత సంగీత వాయిధ్యాలు,వివీరాలు కూడా పంచుకోవడం వారి విద్వత్తు సూచిస్తున్నాయి. మరి మన వారో?

వేణు చెప్పారు...

ఢా. ఎం.బి.డి. శ్యామల తన అభిప్రాయం ఇలా తెలిపారు:

‘‘ వేణూ, బాలు గారిపై నువ్వు వ్రాసింది చదివాను. నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఎంత గొప్పవారికైనా స్వోత్కర్ష మంచిది కాదు. అలాగే నువ్వన్నట్టు ఒక రంగంలో ప్రతిభ వున్నంతమాత్రాన ‘నా వంటి గొప్ప వ్యక్తి పుట్టడం ఈ దేశం అదృష్టం’ లాంటి మాటలు ఆయా కళాకారులను అభిమానించేవారికి నిజంగా బాధను కలిగిస్తాయి. ఎందుకంటే మనం వారి వ్యక్తిత్వాన్ని కూడా గొప్పగా భావిస్తాం. జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల? అన్నట్లు బాలు గొప్పతనం, గాన మాధుర్యం అందరికీ తెలుసు. తనను తాను పొగుడుకోవడం తనను తాను తక్కువ చేసుకోవడమే. నీ మాటల్లో చెప్పాలంటే.. తన దైన్యాన్ని, అభద్రతా భావాన్ని ప్రకటించుకోవడమే! కానీ అతడు ఒక మనిషే కదా! బలహీనత అని భావించి సరిపెట్టుకోవడమే! పబ్లిక్ ఫిగర్సు జాగ్రత్తగా మాట్లాడాలని మీ వంటి వారు గుర్తు చేస్తారు. ఏదిఏమైనా ఏది వ్రాసినా పరిశోధనాత్మకంగా వ్రాస్తావు. మహాభారతం ఉదాహరణ అథెంటిక్ గా వుంది. విస్తృతమైన నీ విషయ పరిజ్ఞానానికి నా అభినందనలు.’’

వేణు చెప్పారు...

@ డా. ఎం.బి.డి. శ్యామల: Thanks a lot for your opinion and appreciation.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

ప్రియమిత్రులు వేణు గారికి
నమస్కారములతో,

చాలా కాలం తర్వాత అంతర్జాలంలోకి అడుగుపెట్టి, అనుకోకుండా ఈ రోజున ఈ మీ వ్యాసాన్ని చదవటం తటస్థించింది. ‘మహనీయుల (పెద్దల?) ఆత్మప్రశంస’ (స్వోత్కర్ష?) ను గురించి చెప్పదగిన ఎన్నో విషయాలున్నా, మీరు కొన్నింటినైనా ప్రస్తావించి ఉండటం హృద్యంగా అనిపించింది. క్రమంగా మీ తక్కిన వ్యాసాలనూ చదువుకొంటాను.

పైని మీరు తిరుపతి వేంకటకవుల “దోసమటం చెఱింగియును” పద్యాన్ని ఉదాహరించారు. ఆత్మకూరు సంస్థానంలో చాలా వాదవివాదాల తర్వాత, ఆస్థానపండితులు “మీకు మీసాలు ఉండటం వల్ల మీరు పండితులు కారు (కనుక నాతో వాదానికి తగరు అని భావం)” అని అన్నప్పుడు అందుకు వారు సమాధానంగా ఎంతో అందమైన ఆ పద్యాన్ని సందర్భోచితంగా చెప్పారు. అక్కడి సందర్భం కేవలం "స్వోత్కర్ష" కాకపోవచ్చును.

ఇంతకీ కుశలానుయోగాలతోపాటు ఈ లేఖను మీకు వ్రాసిన కారణం ఏమిటంటే, తిరుపతి వేంకటకవులు ఆ పద్యాన్ని చెప్పిన ఆ వారంలోనే వారికి మొదట శిష్యులూ, ఆ తర్వాత వైరిపక్షం వారూ అయిన వేంకట రామకృష్ణకవులు పిఠాపురంలో ఒక సరసమైన పద్యాన్ని కరపత్రంగా అచ్చువేశారు:

ప్రాసంబున్, యతియున్, విరుద్ధగతి శబ్దంబున్ బ్రయోగించుచున్
మీసంబుల్ మెలివెట్టి, "మా కుపమ మేమే" యంచు నెందున్ దుర
భ్యాసం బొప్పఁగ నుండువారు కవులై, పద్యంబులం జెప్పినన్
వాసిం గన్న కవీశ్వరుల్ సభలలో వర్ణింతురే వారలన్!

అని. ఆ వృత్తాంతం వేరే ఒక కథ అయినా, పద్యం ఉల్లాసంగా ఉంటుందని ఉదాహరించాను.

తిరుపతి వేంకటకవులు “ముదిమికి బాలవన్నెలు” అన్న పద్యంలో చెప్పినట్లు, ఇంతకాలానికి నాకూ అంతరంగోదితంగా ఒక బ్లాగును మొదలుపెట్టాలనే ఉత్సవోత్సాహాన్ని మీ రచన కలిగిస్తున్నది!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు

Zilebi చెప్పారు...


ఏల్చూరి వారు,

మీ ఉత్సవోత్సాహం తెలుగు బ్లాగు లోకాని ఎంతైనా అవసరం. మీ కామింట్లని అక్కడక్కడా చదవడం జరిగింది.
మీ లాంటి వారు తప్పక తెలుగు బ్లాగు లోకానికి మంచి రచనలను బ్లాగు టపాల ద్వారా అందించ గలరు. తప్పక మీరు బ్లాగు మొదలెడతారని ఆశిస్తో

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

ఏల్చూరి మురళీధర రావు గారూ,
బహుకాలానికి మీ పేరు అంతర్జాలంలో చూడడం ఆనందాన్ని కలిగించింది.
ఈరోజే నా బ్లాగులో పోకూరి కాశీపతి గారి 'త్రింశదర్థ పద్యరత్నము'ను పరిచయం చెస్తూ మిమ్మల్ని ప్రస్తావించాను. రేపటినుండి వరుసగా రోజుకొక అర్థాన్ని ఇస్తున్నాను.