లేత గొంతు నుంచి జాలువారే ఆ తీయని గానం జనం మనసులను ఇట్టే కట్టిపడేస్తుంది.
ఆ బెంగళూరు బాలుడి గళ వశీకరణం అలాంటిది.
పేరు- రాహుల్ వెల్లాల్ !
‘వెల లేని పువ్వు కదా మనిషికి చిరునవ్వు!’ అంటుంది కవయిత్రి యం.బి.డి. శ్యామల, ఓ గజల్ లో.
రాహుల్ వెల్లాల్ ను వీడియోల్లో చూస్తుంటే... ఆ వాక్యమే గుర్తొస్తుంది!
పాడుతున్నంతసేపూ చెదరని మందస్మితం. స్వచ్ఛంగా, అమాయకత్వం ఉట్టిపడే చిలిపి చిరునవ్వు.
మంద్ర-మధ్య- తార స్థాయి శ్రుతులకు తగ్గట్టుగా -
తలను చిన్నగా అటూ ఇటూ కదలిస్తూ...
ఒక్కోసారి కళ్ళు మూస్తూ..
చేతులను భావ స్ఫోరకంగా పైకెత్తుతూ ..
తాదాత్మ్యంతో
ఆరోహణ... అవరోహణలతో
రాహుల్ పాడుతూవుంటే...
త్యాగయ్య చెప్పినట్టు- ‘నాభీ హృత్కంఠ రసన నాసాదుల యందు’ పాడుతున్నాడా అనిపిస్తుంది !
బాణీలోని తీయదనం పంచుతూ పాట శ్రోతలకు రసానుభవాన్ని అందిస్తుంది.
* * *
ఎస్ వీ భక్తి చానల్ లో ప్రసారమైన.. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ పాటల కార్యక్రమాలు హైదరాబాద్ లోనే జరిగాయి. వాటిలో రాహుల్ తన గాన వైదుష్యంతో మెరిశాడు.
‘అయ్యో నేనేకా అన్నిటికంటె దీలు..’ అనే పాటను రాహుల్ పాడుతుంటే వేదిక మీద ఉన్న గాయని సునీత కదిలిపోయి, కన్నీరు కార్చి ‘మనసూ, దేహం, ఆత్మా స్వచ్ఛమయ్యాయి’ అంటూ’ సభాముఖంగా చెప్పారు.
సంగీత దర్శకుడు కీరవాణి ‘ రాగమయి అయిన సరస్వతి రాహుల్ వెల్లాల్ లో కనిపించింది’ అంటూ మెచ్చుకున్నారు.
బాణీని సరిగా నేర్చుకుని సంగీతపరంగా లోపాల్లేకుండా , భాషాపరంగా ఉచ్చారణ దోషాల్లేకుండా పాడినంతమాత్రానే ఏ పాటా మీటదు హృదయాల్ని. సాహిత్యంలోని భావం గ్రహించి రసానుభూతితో పాడటం కదా ముఖ్యం!
సంగీతం సమకూర్చిన జోశ్యభట్ల శర్మ గారి నుంచి ఆ పాట అర్థం చెప్పమని అడిగి, తెలుసుకున్నాకే నేర్చుకుని పాడాడు రాహుల్.
అంత శ్రద్ధ ఉంది కాబట్టే.. తనకు మాతృభాష కాని తెలుగులో 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య రాసిన పాటల విషయంలో తనకుండే పరిమితులన్నిటినీ అలవోకగా దాటేశాడు. అనితర సాధ్యమన్న రీతిలో పాడేశాడు!
‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ సిరీస్ లో రాహుల్ పాడిన -
* ‘అమ్మేదొకటియును..అసిమ లోని దొకటీ’
* ‘శోధించి చూడబోతే..’
* ‘ఏమని నుతించవచ్చు..’
పాటలు కూడా బాగుంటాయి.
* * *
సాన పెట్టిన కులదీప్ పాయ్
రాహుల్ వయసు ఇప్పుడు పన్నెండేళ్ళు. అయితే ఇతడి ప్రతిభ ప్రపంచానికి మూడేళ్ళ క్రితమే పరిచయం.
రెండేళ్ళ పసి వయసులో రాహుల్ పాటను గుర్తించటం, హమ్ చేయటం చూసి సంగీతం పట్ల అతడి ఆసక్తిని గమనించారు తల్లిదండ్రులు. అంత చిన్నవయసులో సంగీత ఉపాధ్యాయులెవరూ నేర్పలేమంటే.. నాలుగేళ్ళ వయసు వచ్చాక, శిక్షణలో ప్రవేశపెట్టారు.
సంగీత పాఠశాల వార్షికోత్సవంలో ఆరేళ్ళకే అరగంటసేపు మొదటి సంగీత కచ్చేరీని ఇచ్చేశాడు. మరో ఏడాదికి బెంగళూర్ లోని ఓ గుడిలో పాటల లిరిక్స్ కాగితాలేమీ చూడకుండా, వాద్యకళాకారులతో రిహార్సల్స్ లేకుండానే గంటన్నర సేపు రెండో కచ్చేరీ చేశాడు.
బెంగళూరులోనే ఉండే కళావతి అవధూత అతడి సంగీత గురువు.
నాలుగేళ్ళ క్రితం సూర్య గాయత్రిని చిన్న వయసులోనే డిస్కవరీ చేసి, సంప్రదాయ సంగీతంలో అద్భుత గాయనిగా తీర్చిదిద్దిన కులదీప్ ఎం. పాయ్ తెలుసుగా?
రాహుల్ వెల్లాల్ ప్రతిభకు సానపెట్టి చక్కని పాటలు పాడించి మనందరికీ తెలియజేసింది కూడా కులదీప్ పాయే..!
ముగ్గురు... గురు శిష్యుల ఆటవిడుపు |
( రాహుల్ ని మహావిష్ణువుగా, సూర్య గాయత్రిని సోదరి పార్వతిగా, ఎత్తుకుని మోస్తున్న తనను ఆదిశేషుడిగా పోల్చుకుంటూ కులదీప్ ఈ ఫొటోకు సరదా వ్యాఖ్య రాశారు).
సూర్య గాయత్రితో కలిసి...
* ‘బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే’
* ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడే’
‘ గతియై మమ్ము గాచే కమలాక్షుడూ’ అని స్థాయిని తగ్గించి పాడేటప్పుడు రాహుల్ కర విన్యాసం గమనించండి.
కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఈ బాల మేధావులు తమిళనాడులో స్థిరపడిన కులదీప్ ఆధ్వర్యంలో తెలుగు పాటలను శ్రవణపేయంగా పాడటం ముచ్చటగా అనిపిస్తుంది.
రాహుల్ ఒక్కడే పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతో బాగున్నవాటిలో..
సదాశివ బ్రహ్మేంద్ర సంస్కృత రచన -
* ‘పిబరే రామరసం’
మీరాబాయి హిందీ రాజస్థానీ భజన-
*‘పాయో జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో’
ఈ పాటలో స్వర విన్యాసాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా వీడియోలో 5.02 నిమిషాల దగ్గర ‘మీ...రా.. కే ప్రభూ’ అనేచోట శ్రోతలను సమ్మోహితులను చేస్తాడు.
వైవిధ్యం.. మాధుర్యం
13వ శతాబ్దం నాటి సంత్ జ్ఞానేశ్వర్ అభంగ్ లూ,
15వ శతాబ్ది నాటి అన్నమయ్య సంకీర్తనలూ,
వ్యాసరాయ తీర్థ కన్నడ కృతులూ,
16 శతాబ్దపు మీరాబాయి భజనలూ,
17వ శతాబ్దానికి చెందిన రామదాసు కీర్తనలూ,
18-19 శతాబ్దాలకు చెందిన త్యాగయ్య కీర్తనలూ,
సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలూ...
రాహుల్ వెల్లాల్ గొంతులోని వైవిధ్యాన్నీ, మాధుర్యాన్నీ వెలారుస్తున్నాయి.
ముఖ్యంగా మన తెలుగు పాటలను ఎంత చక్కని ఉచ్చారణతో పాడుతున్నాడో! ( సూర్య గాయత్రి దీ ఇదే తీరు).
‘ద లయన్ కింగ్ ’ తెలుగు అనువాద చలన చిత్రంలో రాహుల్ ‘నేనే రాజా ఎప్పుడౌతానూ ’ అనే హుషారు పాటను హరిప్రియ, రాములతో కలిసి పాడాడు.
సినీరంగంలో బహుశా తన తొలి అడుగు ఇదే.
మన బాలమురళీ కృష్ణ తనకు ఆదర్శం అని చెపుతాడు.
ఇలా మొత్తానికి రాహుల్ కీ తెలుగుకూ చాలా అనుబంధం పెరుగుతున్నట్టే ఉంది.
వెంటాడుతున్న అభంగ్
ఈ జనవరిలో విడుదలైంది రాహుల్ పాడిన ‘యోగ యాగ విధీ.. యేణే నోహే సిద్ధి వాయాచి ఉపాధి దంభ ధర్మ'
అనే సంత్ జ్ఞానేశ్వర్ ‘ హరిపాఠ్ అభంగ్’.
నేను విన్నది కొద్ది రోజుల క్రితమే. కులదీప్ ఎం. పాయ్ అద్భుతమైన స్వరకల్పన, రాహుల్ తాదాత్మ్యతతో పాడిన విధానం గొప్పగా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో నన్ను బాగా హాంట్ చేసేసి, ఎక్కువ సార్లు వినేలా చేస్తున్న మరాఠీ పాట ఇది.
మీరూ ఆ వీడియో చూడండి-
అష్టాంగ యోగాలూ, యాగాలూ లాంటి తంతులు మనిషికి ముఖ్యం కాదనీ, అవి డాంబికానికే, అహంకారానికే పనికొస్తాయనీ ఈ అభంగ్ చెపుతుంది. అలాగని ఇది హేతువాద రచనేమీ కాదు. ఆధ్యాత్మిక ‘సిద్ధి’ని ప్రబోధించేదే.
రాహుల్ గాన కళా చాతుర్యం
ఇంతగా వికసించటానికి స్వయం ప్రతిభతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం తొలి కారణం. గురువుల, పాటల సంగీత దర్శకుల, వాద్య బృందాల సహకారమూ ఎంతో ఉంది.
ఇతణ్ణి అభినవ బాలమురళీ కృష్ణ అనీ, జూనియర్ శంకర్ మహదేవన్ అనీ పోలికలు తెస్తున్నారు చాలామంది. కానీ ఎవరితోనూ పోల్చనవసరం లేకుండా సొంత ముద్రతో గానకళలో ఎంతో ఎత్తుకు వెళ్ళగలిగే సత్తా రాహుల్ కి ఉందనేది నిస్సందేహం.
* * *
భారతీయ సంప్రదాయ సంగీతమంటే నాకు చాలా ఇష్టమూ, ఆసక్తీ !
కానీ ఆ సంగీతంతో అనుసంధానమై ఉండే ‘దైవ భక్తి’తో గానీ, ‘ఆధ్యాత్మికత’తో గానీ నాకే మాత్రమూ ఏకీభావం లేదు, ఉండదు.
రాహుల్ ను గానీ, సాంప్రదాయిక సంగీతకారులు మరెవరినైనా గానీ అభిమానించటమంటే సంగీత కళలో వారి విశిష్ట ప్రతిభను అభిమానించటం మాత్రమే. ఆ కళను ఆస్వాదించటమే. ఆ పాటల్లో పొదిగివున్న భక్తినీ, వాటిలోని భావాలనూ ఔదలదాల్చటం మాత్రం కాదు !