సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

12, నవంబర్ 2013, మంగళవారం

యక్షప్రశ్నల్లో వెలుగూ చీకటీ !


తాటిచెట్టు ప్రమాణంలో ఉన్న యక్షుడి రూపం.
(1956 అక్టోబరు చందమామ ముఖచిత్రంగా ఎంటీవీ ఆచార్య వేసిన బొమ్మ)
‘నీ యక్షప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు’ అంటూ ఈసడిస్తాం.

 ‘యక్షప్రశ్నలడిగేసి బుర్ర తినేశాడు’ అని విసుగు ప్రదర్శిస్తాం.

 ‘అవి మామూలు ప్రశ్నలా? సాక్షాత్తూ యక్ష ప్రశ్నలు!’ అని హేళనగానో,  ఆశ్చర్యంగానో  వ్యాఖ్యానిస్తాం.

ఇలా మన తెలుగువారి  దైనందిన  జీవిత సందర్భాల్లో ఈ  ప్రశ్నల ప్రస్తావన  ఓ భాగమైపోయింది.

మహాభారతంలోని పాత్ర  ఈ యక్షుడు. ఇతడికి ప్రత్యేకంగా  పేరేమీ ఉండదు. పాండవులు వనవాసం చేస్తున్న కాలంలో ఇతడు ధర్మరాజును ఆసక్తికరమైన, వైవిధ్యమైన ప్రశ్నలతో  పరీక్షిస్తాడు.

విశేషమేమిటంటే... ఇతడు నిజమైన యక్షుడు కాదు. యక్షరూపంలో ప్రశ్నలడిగాడు కాబట్టి అవి  యక్షప్రశ్నలుగా ప్రసిద్ధికెక్కాయి! 

* * *

క్షప్రశ్నలనగానే  చాలామందికి గుర్తొచ్చే ప్రశ్న-  

*  గాలి కంటే వేగం కలదేది?  ( మనసు).

తల్చుకున్నంత మాత్రానే దూరభారాల ప్రసక్తి  లేకుండా తక్షణమే అక్కడికి చేరుకోగలుగుతుంది కదా మనసు. ఎంత వాస్తవం!  తల్చుకున్నకొద్దీ ఈ ప్రశ్న... సమాధానాల లోతు, గొప్పతనం అర్థమవుతుంది.

మరో రెండు ప్రశ్నలు కూడా ప్రాచుర్యం పొందినవే.

*  నిద్రలోనూ కన్నుమూయనిది ఏది?  (చేప)
*  పుట్టాక కూడా కదలనిది ఏది?  (గుడ్డు)

* * *

సలు ఈ ప్రశ్నలు మొత్తం ఎన్ని?-  ఈ  ప్రశ్నకు సమాధానం కోసం వెతికాను.  ఒక్కో పుస్తకంలో ఒక్కో రకంగా కనిపించింది.

ఈ క్రమంలో వంద సంవత్సరాలకు పూర్వం ఈ సబ్జెక్టుపై తెలుగులో ప్రచురించిన రెండు పుస్తకాల గురించి తెలిసింది. వాటిని పరిశీలించాను.



 ఆ అన్వేషణలోంచి రూపుదిద్దుకున్న వ్యాసం నవంబరు ‘తెలుగు వెలుగు’ మాసపత్రికలో ప్రచురితమైంది.


ఆ వ్యాసం  ఇక్కడ - 
  
   Yaksha Prasnalu by Reader on Scribd












* * *

స్కూలు రోజుల్లో ఓ పాఠంగా ఈ యక్షప్రశ్నలు  చదివి అబ్బురపడ్డాను.
ఆ కాలంలోనే  ‘చందమామ’ మాసపత్రికలో ఈ ఘట్టం చదివి ఆనందించాను.

ధర్మరాజును హెచ్చరిస్తున్న అశరీరవాణి  (చిత్రకారుడు శంకర్. 1972 మార్చి చందమామ)

తర్వాతి కాలంలో  నాస్తికత్వం, హేతువాదం, మార్క్సిస్టు భావజాలాల పరిచయం తర్వాత ఈ తరహా రచనలను చూసే దృష్టి మారింది.  పురాణేతిహాసాల్లోని అభూత కల్పనలనూ, మానవాతీత శక్తుల వర్ణననూ ఆ రచనకు సంబంధించిన  రూపం (form)లో భాగంగా భావించాలని అర్థమైంది. 

మహాభారతంలో భాగమైన ఈ ప్రశ్నోత్తరాల్లో ఆ ఇతిహాస రచనా కాలపు సంఘ పరిస్థితులు కొంతమేరకు ప్రతిఫలించాయి.  పాలక /  ఉన్నతవర్గాల్లో ఉన్నవారి  దృక్కోణం కొన్ని ప్రశ్నల్లో, జవాబుల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది.

ప్రకృతి గురించి చెప్పిన వాటిల్లో లోకజ్ఞానం వెలుగూ; సమాజం గురించి చెప్పినవాటిల్లో నాటి అసమానతల చీకటీ కనపడతాయి. కొన్ని వర్గాలపై  పక్షపాతం, మరికొందరిపై వ్యతిరేకత... ఇవన్నీ గమనించవచ్చు.

నాస్తిక దూషణ!
వేదాలనూ, ధర్మశాస్త్రాలనూ నమ్మకపోతే ఎప్పటికీ నరకంలో పడివుండాల్సిందేననే హెచ్చరిక ఒక జవాబులో  ఉంది.

ఆ గ్రంథాలను నమ్మనివాళ్ళు ... 
అంటే నాస్తికులు!
ప్రాచీన భారతదేశంలోని తాత్విక చింతనకు ప్రతినిధులు! 
 
ఆ కాలంలో అలాంటివాళ్ళు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారనీ, వాళ్ళు ఇగ్నోర్ చేయదగ్గ  స్థితిలో లేరనీ -  అందుకే బెదిరించాల్సిన పరిస్థితి వచ్చిందనీ ఈ ప్రశ్నోత్తరాల ద్వారా ఊహించవచ్చు!


యక్ష ప్రశ్నల మొత్తంలో ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నలోనే  ఉన్న సందర్భం ఒక్కటే.  నాస్తికులను తీవ్రంగా దూషించిన సందర్భమది!

‘మూర్ఖుడెవరు? నాస్తికుడెవరు?’
అనే రెండు ప్రశ్నలకు కలిపి-
 ‘నాస్తికో మూర్ఖ ఉచ్యతే’( మూర్ఖుడే నాస్తికుడు)  అని ధర్మరాజు ఒకే సమాధానం చెపుతాడు.
 

ఆ రోజుల్లో నాస్తికుల ప్రాబల్యం, అధికార స్థానాల్లోనివారికి వారిపట్ల ఉన్న ద్వేషాలకు ఇది సూచిక!

ఆధ్యాత్మిక భావజాలం

నేరుగా కాకుండా గూఢార్థంతో అడిగిన ప్రశ్నలకు ఆలంకారికంగా చెప్పిన  సమాధానాల్లో ధర్మరాజు  నమ్మిన ఆధ్యాత్మిక భావజాలం ఉంది.  (యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు కూడా వీటితో ఏకీభవించాడు కాబట్టే అవి సరైన సమాధానాలయ్యాయి).

* సూర్యుణ్ణి ఉదయింపజేసేది ఏది?  (పరబ్రహ్మం )
* సూర్యుణ్ణి  అస్తమింపజేసేది ఏది? (ధర్మం) ఇలాంటివి....

సమాజంలో మగ సంతానానికి ఉన్న ప్రాముఖ్యం భారత రచనా కాలానికీ,  నేటికీ ఏమీ మారలేదు.  ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అనే విశ్వాసం అప్పట్లో ఎంత ప్రబలంగా ఉండేదో  యక్ష ప్రశ్నల్లో  రెండు ప్రశ్నలు సాక్ష్యమిస్తాయి. 

* మనుషునికి ఆత్మ ఏది?
(పుత్రుడు) 
* సంతానం పొందేవారికి  ఏది శ్రేష్ఠం? (పుత్రుడు).

* * *
నిత్యసత్యాలు

దారిద్ర్యం గురించీ, రుణభారం గురించీ అడిగిన ప్రశ్నలు అన్ని కాలాలకూ, అందరికీ వర్తించే నిత్యసత్యాల్లాంటివి!

* చనిపోయినవాడితో ఎవరు సమానం? (దరిద్రుడు).  నిరుపేదతనం ఏ కాలంలోనైనా దుర్భరమే. 

 ‘అప్పు లేనివాడు సంతోషంగా ఉంటాడు’ అనే సమాధానం అప్పటికీ- ఎప్పటికీ  నికార్సయిన నిజం.

‘యాచన అనేది విషం’ అని నిక్కచ్చిగా చెప్పిన ధర్మరాజు దానాన్ని మాత్రం బాగా శ్లాఘిస్తాడు.

* చనిపోయేవాడికి ఏది నేస్తం? (దానం)
* కీర్తికి ముఖ్యమైన ఆశ్రయం?
(దానం)
* మానవునికి  ముఖ్యంగా కోరదగినది?
(దానం)
* దైవం ఏది?
(దానఫలం)

*  సుఖాల్లో ఉత్తమ సుఖమేది? (తృప్తి).
నిర్వివాదాంశమైన నిజం.  తృప్తి లేకపోతే సుఖమే లేదు.  అసంతృప్తికీ  సుఖానికీ చుక్కెదురు కదా!

‘జయించటానికి శక్యంకాని శత్రువు ఏది?’ అంటే ‘కోపం’ అని సమాధానం. ‘తన కోపమె తన శత్రువు’  అనీ, దాన్ని జయించటం కష్టమనీ ధర్మరాజు ద్వారా వ్యాసుడు ఎప్పుడో  చెప్పాడన్నమాట.
      
‘ప్రాణులు రోజూ చనిపోతుండటం చూస్తూ కూడా తను మాత్రం స్థిరంగా ఉంటాననుకోవటం’ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని  ధర్మరాజు చెప్పిన సమాధానం -

మానవ స్వభావానికి పట్టిన నిలువెత్తు దర్పణం!