సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
చందమామ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చందమామ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ ‘శంకర్’ కుంచె విన్యాసాలు!

సూక్ష్మాంశాలతో  సజీవ రూపు ‘రేఖ’లకు తుది మెరుగులు దిద్దుతూ..  శంకర్

  
‘చందమామ’ పత్రిక  అంటే ఆహ్లాదపరిచే  కథలే కాదు; అపురూపమైన బొమ్మలు కూడా! 

ఎలాంటి బొమ్మలవి? 

కథలను అలంకరించేవీ, కథ చదవాలనే ఉత్సుకతను కలిగించేవీ.  వాటిలోని సహజమైన రూపురేఖలూ, పరిసరాలూ కథను సంపూర్ణంగా ఆస్వాదించేలా చేసేవి.  అంతర్లీనంగా .. చదివేవారి పరిశీలనా శక్తిని అద్భుతంగా పెంచగలిగేవి!      

చందమామ చిత్ర సౌథానికి నాలుగు స్తంభాలైతే.. వారు  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య;  చిత్రా, శంకర్ లు.  మొదటి ఇద్దరూ ప్రధానంగా ముఖచిత్ర రూపకర్తలు. చివరి ఇద్దరూ కథలను చిరకాలం గుర్తుండేలా చేసిన అజరామర చిత్ర లేఖనా శిల్పులు. 

వారిలో చందమామ వైభవ శకానికి తానొక్కరే సజీవ సాక్ష్యంగా ఉన్న శంకర్..  మొన్న సెప్టెంబరు 29న  కన్నుమూశారు.  

సంవత్సరాల తరబడి ఆయన గీసిన బొమ్మలు ఎన్నో తరాల మనసుల్లో నిలిచిపోయాయి.  ఆయన్ను ప్రత్యక్షంగా  చూడకపోయినా...  చిత్రాల అనుసంధానంతో,  అ అనుబంధంతో  ఎందరికో ఆత్మీయుడిగా నిలిచారు.  

నా బాల్యాన్ని-  

తన సున్నితమైన రేఖలతో, 

కనువిందైన రంగులతో, 

ముచ్చటైన నగిషీలతో, 

 ప్రశాంత ముని కుటీరాల,  

కీకారణ్యాల, 

అశ్వపద ఘట్టనల యుద్ధ ఘట్టాల, 

పౌరాణిక  రామణీయక దృశ్యాలతో  

సంతోషభరితం చేసిన.. చిత్రకారుడు శంకర్ గారి గురించి...

 దాదాపు 11 సంవత్సరాల క్రితం (30, నవంబర్ 2009)  ఇదే బ్లాగులో ఓ పోస్టు రాశాను. అందులోంచి కొంత.. 

--------------------

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

 
శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.


1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, 

భీష్ముడి అవక్ర పరాక్రమం, 

పాండవుల మహాప్రస్థానం; 

రాముడి అరణ్యవాసం, 

వాలి సుగ్రీవుల గాధ, 

వాలి వధ, 

హనుమంతుడి లంకా నగర సాహసాలు, 

వారధి నిర్మాణం, 

రామ రావణ యుద్ధం .. 

ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.


ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  

ఈ ఇద్దరు చిత్రకారులదీ  సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. 

అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  

చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’;  

శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’!  (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)


చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!

--------------------

ప్రస్తుతానికి వస్తే....

బేతాళ కథల బొమ్మ
బేతాళ కథలకు శంకర్  వేసిన విక్రమార్కుడి బొమ్మ (లోగో) ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఇది  గొప్పగా ఉందనటంలో సందేహమేమీ లేదు.  

కానీ -
 

శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే ఆ విక్రమార్కుడి బొమ్మను మొదట వేసింది ‘చిత్రా ’(1955  సెప్టెంబర్ సంచిక).  ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే.  దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. 

చిత్రా సృష్టించిన చిత్రమిదే.. 


ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్.  ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.  

శంకర్ మెరుగుపరిచిన  బొమ్మ

బేతాళ కథలకు శంకర్  పేటెంట్ చిత్రకారుడిలా ఎక్కువ బొమ్మలు వేశారు. 

బేతాళుణ్ణి  భుజాన  వేసుకుని, చెట్టు కొమ్మల్లోంచి దిగబోతున్న విక్రమార్కుడి బొమ్మ కూడా బాగుంటుంది. చిత్రా చిత్రించిన ఈ లోగోను మధ్యలో కొన్ని సంచికల్లో వరసగా  ప్రచురించారు. 
 
శంకర్ వేసినన్ని కాదు గానీ...  చిత్రా.. ఇంకా ఎంటీవీ ఆచార్య, బాపు.. తర్వాత కాలంలో రజీ, శక్తిదాస్ లు  బేతాళ కథలకు బొమ్మలు వేశారు.
 

చందమామలో శంకర్ తొలి బొమ్మలు...

1947 జులైలో ఆరంభమైన చందమామలోకి  శంకర్  1952 లో చేరారని తెలుసు.  కానీ  ఆ సంవత్సరం సంచికల్లో శంకర్ బొమ్మలేవీ లేవు.  బహుశా ఆయన  ఆ సంవత్సరాంతంలో చేరివుంటారు. 

ఆయన తొలి నాటి బొమ్మలు ఎలా ఉన్నాయి? వాటిని  చూడాలనే  ఆలోచన వచ్చింది.   

పాత సంచికలు తిరగేశాను, ఆసక్తిగా.

1953 జనవరి సంచికలో ఆయన మూడు కథలకు బొమ్మలూ, ఒక ఫీచర్ కు లోగో చిత్రించారు. 

సంచికలో మొదటగా కనిపించే ‘పాడుబుద్ధి’ కథకు వేసిన బొమ్మలను ఆయన మొదటి బొమ్మలనుకోవచ్చు. 


శంకర్ వేసిన  తొలి ఫీచర్ బొమ్మ

శంకర్ తొలినాటి ఓ  బొమ్మ... 

వీరబల్ (బీర్బల్) కథకు వేసిన బొమ్మ.. 1953 జనవరిలోదే

కథ మొత్తం కావాలంటే... ఈ నాలుగు పేజీలూ చదవండి..





అప్పట్లో ఆయన సంతకం ఇంగ్లిష్  కాపిటల్స్ లో  ఒద్దికగా ఉండేది. తర్వాత సంతకం.. మనందరికీ తెలిసినది- కుడివైపుకు ఏటవాలుగా వంగి,  స్వేచ్ఛగా స్మాల్ లెటర్స్ తో  ఉంటుంది. 

 
ఫిబ్రవరి 1953  చందమామ  సంచికలో దాదాపు అన్ని కథలకూ శంకరే వేశారు.  వీటిలో ఆలూరి బైరాగి, కొడవటిగంటి కుటుంబరావుల గేయమూ, కథా  ఉన్నాయి. 

కొడవటిగంటి  ‘అభేద్య’ కథ చివరి బొమ్మ ఇది. దీనిలో శంకర్  శైలి అనదగ్గ ‘నగిషీ’ మొదలైంది,  చూడండి.


ఆ నగిషీ తర్వాతి కాలంలో  చాలా చిత్రాల్లో ఉంటుంది. 

కింద ఈ రెండు బొమ్మలూ  చూడండి, ఆ నగిషీ ఎక్కడుందో గమనించండి.



సహజ ప్రతిభావంతుడైన శంకర్ గీతలో పరిణతీ, సాధికారతా ఆయన చిత్రించిన  రెండో సంచిక (1953 ఫిబ్రవరి) కల్లా  వచ్చేశాయి!

తర్వాతి  సంచిక... 1953 మార్చి నెలది.  ఈ సంచికకు శంకర్  ఏకంగా ముఖచిత్రమే వేసేశారంటే  ఆయన సామర్థ్యాన్ని  చందమామ ఎంతలా గుర్తించిందీ అర్థం చేసుకోవచ్చు!

శంకర్ వేసిన మొదటి ముఖచిత్రం

అలా ఆయన చందమామలో స్థిరపడిపోయారు.  క్రమంగా పౌరాణికాల చిత్రరచనలో స్పెషలైజ్  చేశారు.  

శంకర్ ప్రతిభ చందమామకే పరిమితం కాలేదు.  రామకృష్ణ ప్రభలో  కామిక్స్ లాంటి కొన్ని పౌరాణిక బొమ్మల కథలు వేశారు.  అవి పుస్తకాలుగానూ వచ్చాయి.


శంకర్ వేసిన పౌరాణికాల  బొమ్మలే  వేలల్లో ఉంటాయి.  ఆయన చిత్రలేఖన ప్రతిభను ప్రతిఫలించే  కొన్నిటిని  చూడండి.

    

వృత్రాసురుడి విజృంభణ


నరకుడి కొడుకు..భగదత్తుడు

భీష్ముడి యుద్ధ పరాక్రమంపై పాండవుల సమాలోచన

     దేవీ భాగవతం సీరియల్లో సింహ వాహినీ,  శ్రీ కృష్ణుడూ


కురుక్షేత్రంలో  క్రౌంచ (పక్షి) వ్యూహం

సీతాపహరణాన్ని అడ్డగిస్తూ రావణుడితో జటాయువు యుద్ధం

హనుమంతుడు చూస్తున్న లంకా నగర దృశ్యం

అనిరుద్ధుడి అదృశ్యం.. అతడి భార్యల కలవరం. దూరంగా ‘తాత’  శ్రీకృష్ణుడి సమాలోచనలు

శ్రీకృష్ణావతారం 

బేతాళ కథ చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా  (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)  చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


(చిత్రా కూడా ఈ బేతాళుడు చెట్టుమీదకు దూసుకుపోయే ఆఖరి పేజీ బొమ్మలు కొన్ని వేశారు.  విక్రమార్కుణ్ణి లాంగ్ షాట్లో  ఉంచి బేతాళుణ్ణి క్లోజప్ లో వేయటం చిత్రా స్పెషాలిటీ )
 
శంకర్ వేసిన ఆ బొమ్మలు కొన్ని ఇక్కడ చూడండి- 

 




















తన పౌరాణిక  బొమ్మల లోకంలో  శంకర్

 


21, మే 2019, మంగళవారం

‘జాతక కథలు’ చదివారా?


 వేల సంవత్సరాల క్రితం నాటి కథలు చదవటమంటే ఆ కాలానికి ప్రయాణించి, ఆ వాతావరణంలోకి ప్రవేశించటమే. 

ప్రాచీన సాహిత్యంలో  ఉత్ప్రేక్షలూ, నమ్మశక్యంకాని  కల్పనలూ, మహిమలూ ఉండొచ్చు గాక.  శ్రామికులపై  చిన్నచూపూ,  రాజులపై వల్లమాలిన  భక్తిప్రపత్తులూ చికాకు పెట్టవచ్చు గాక.


ఆ పరిమితులను  వదిలేస్తే ... స్థూలంగా అనూహ్యమైన మలుపులుండే ఆ కథావీధుల్లో సంభ్రమంతో సాగించే సంచారం సంతోషాన్నిస్తుంది.  ఆహ్లాదపరుస్తుంది. 

ఆత్మ ఉనికిని అంగీకరించనిది బౌద్ధం.  కానీ దీని  సాహిత్యంలో పునర్జన్మ కథలు పుట్టటం ఒక విచిత్రం !


జాతక కథలు నాకు ‘చందమామ’తో పరిచయమయ్యాయి.  చందమామలోనే  వరసగా కాదు కానీ, అప్పుడప్పుడూ చాలా జాతక  కథలు చదివాను.  

బోధిసత్త్వుడు  జాతక కథల నాయకుడు.  

ఇతడు మనిషిగా,  జంతువుగా ఏ రూపంలో జన్మించినా గొప్ప వివేకంతో,  ముందుచూపుతో, కరుణతో , త్యాగబుద్ధితో  ప్రవర్తిస్తుంటాడు ఈ కథల్లో. తనతో పాటు తోటివారికి  కష్టాలొస్తే కుంగిపోడు.  అనూహ్యమైన  సమయస్ఫూర్తితో ఆ చిక్కులనుంచి  బయటపడేస్తుంటాడు.  

1953 మార్చి సంచికలో  ‘సఫల యాత్ర’  అనే కథతో  చందమామ జాతక కథల ప్రచురణని మొదలుపెట్టింది.  తర్వాత  చాలా కథలను నెలనెలా ప్రచురించింది.
 

  మళ్ళీ 1980 ఆగస్టు నెల సంచిక నుంచీ  ఈ కథలన్నిటినీ పున: ప్రచురించారు.

 తాము బొమ్మలతో ప్రచురించిన జాతక కథలను  చందమామ వారే   ఒక పుస్తకంగా కూడా వేశారని  చందమామ పరిశోధకుడూ, రచయితా అయిన దాసరి వెంకటరమణ గారు చెప్పారు.  అరుదైన ఆ పుస్తకం ఆయన దగ్గరుంది.

‘సఫల యాత్ర’  కథను ఇక్కడ చదువుకోవచ్చు- 

   jataka katha by Reader on Scribd


ఈ రోజు ఈనాడులో...


ఈ రోజు  ఈనాడు ‘చందమామ’లో  జాతక కథలను ఇలా  పిల్లల కోసం పరిచయం చేశాను.  

అక్కడ రాసిన  కథనం - 

‘పంచతంత్ర’ కథలు మీకు తెలిసే ఉంటాయి. వాటికంటే ప్రాచీనమైన ‘జాతక కథల’ గురించి విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా వీటికి ఎంతో పేరు. ఎన్నో భాషల్లోకి ఈ కథలు వ్యాపించాయి. మీరెప్పుడైనా అజంతా గుహల సందర్శనకు వెళ్తే అక్కడ ఈ జాతక కథలు బొమ్మల రూపంలో కనిపిస్తాయి. మంచి మంచి విషయాలను చెపుతూ మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథల విశేషాలను చెప్పుకొందామా?

‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో..’ అంటూ జాతక కథలు మొదలవుతాయి. గౌతమ బుద్ధుడి పూర్వజన్మల్లో జరిగిన గాథలే ఈ కథలు. బోధిసత్త్వుడు (బుద్ధుడి మరో పేరు) తపస్విగా, రాజకుమారుడిగా, సింహం, ఏనుగు, లేడి.. ఇలా రకరకాల జన్మలెత్తి తన తెలివితేటలతో చిక్కు సమస్యలను పరిష్కరిస్తుంటాడు. విశాల దృక్పథం, అహింస, కరుణలాంటి గొప్ప లక్షణాలతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంటాడు.

సిద్ధార్థుడు బుద్ధుడిగా మారేలోపు 547 జన్మలు ఎత్తాడని బౌద్ధ సాహిత్యం చెపుతుంది. అందుకే జాతక కథల సంఖ్య మొత్తం 547. ఇవి మొదట్లో సింహళ భాషలో ఉండేవి. ఐదో శతాబ్దంలో మన తెలుగువాడైన బుద్ధఘోషుడు ‘పాలీ’ భాషలోకి అనువదించాడు. ఆ పాలీ నుంచి నేరుగా తెలుగులోకి తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి అనే రచయిత ఏడు సంపుటాలుగా అనువదించారు. వాటిని క్లుప్తంచేసి, వాడుక భాషలోకి మార్చి వివిధ ప్రచురణ సంస్థలు ఎన్నో పుస్తకాలను ప్రచురించాయి.

ఎందుకు చదవాలి?
వేల సంవత్సరాలుగా తరతరాలను అలరిస్తున్న కథలివి. వీటి ప్రాముఖ్యం ఎంతటిదంటే... వీటిలో కొన్ని ఈసప్‌ కథల్లో, పంచతంత్ర కథల్లో కూడా కనిపిస్తాయి. అద్భుతాలు, సాహసాలు, ఊహించని మలుపులు పెద్దలనూ, పిల్లలనూ ఆశ్చర్యపరుస్తాయి. ఆనందపరుస్తాయి. కథారూపంలో ఆహ్లాదపరుస్తూనే మానవుడు పాటించాల్సిన ధర్మాలు, నీతి నిజాయతీలను సూచిస్తాయి. పరోపకారం, త్యాగం మొదలైన గుణాలకు శాశ్వత విలువ ఉంటుందనీ, ముప్పు ముంచుకొచ్చినప్పుడు దుఃఖించకుండా తెలివితేటలు ప్రదర్శించాలనీ ప్రబోధిస్తాయి.


(ఇక్కడ రెండు కథలను క్లుప్తంగా ఇచ్చాను. వాటిలో ఇదొకటి)

రాతి కింద జల
వందల బళ్లతో వర్తకం చేసే సార్థవాహక వంశంలో పుట్టాడు బోధిసత్త్వుడు. ఒకసారి అతడి బిడారు అరవై యోజనాల నిడివి ఉన్న ఎడారి ప్రాంతం చేరింది. పగలంతా భగభగ మండే కుంపటిలా ఉండటంతో రాత్రివేళల్లోనే ప్రయాణించేవారు. నక్షత్రాల సాయంతో దారి గమనించి ముందుకు సాగేవారు. మరో యోజనం మాత్రమే ప్రయాణం మిగిలివుండగా బరువు తగ్గించుకుంటే ప్రయాణం మరింత చురుగ్గా సాగుతుందని వంటచెరకూ, నీరూ పారబోయించాడు బోధిసత్త్వుడు. అయితే దారి నిర్ణయించే వ్యక్తి బడలిక వల్ల నిద్రపోవటంతో ఎడ్లు అదుపుతప్పి, వచ్చినదారే పట్టాయి. సూర్యోదయం అవుతుండగా అతడు నిద్రలేచి, బళ్లు వచ్చిన దిక్కుకే పోతున్నట్టు గ్రహించి, బళ్లను వెనక్కి తిప్పమని కేక పెట్టాడు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయి, కిందటి సాయంకాలం బయలుదేరినచోటకే బిడారు చేరుకుంది. నీరు మాత్రం లేదు!

జరిగిన పొరపాటుకు విచారిస్తూ నిస్పృహతో అందరూ బళ్లకింద చతికిలబడ్డారు. తను కూడా వాళ్లలాగా అధైర్యపడితే అందరూ చచ్చిపోవటం తప్పదనుకున్నాడు బోధిసత్త్వుడు. అటూ ఇటూ తిరుగుతూ ఓ చోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బు చూశాడు. కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు కదా? వెంటనే పలుగు తెప్పించి అక్కడ తవ్వించాడు. అరవై మూరల లోతు తవ్వాక కంగుమని రాయి తగిలింది. అందరూ నిరాశపడిపోయారు. కానీ బోధిసత్త్వుడు కిందకు దిగి, రాతికి చెవి పెట్టి ఆలకించాడు. రాతికి దిగువగా పారుతున్న నీటి చప్పుడు వినిపించింది. ఇక రాతిని పగలగొట్టగానే తాటి చెట్టు ప్రమాణంలో ఉవ్వెత్తుగా నీరు పైకి చిమ్మింది. ప్రాణాలు లేచొచ్చి అందరూ దాహం తీర్చుకున్నారు. క్షేమంగా గమ్యం చేరుకున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లో అధైర్య పడకుండా సమయ స్ఫూర్తిని ప్రదర్శించి బోధిసత్త్వుడు ఇలా అందరి ప్రాణాలూ కాపాడాడు.

ఐదు సంపుటాలూ నెట్ లో ...
సరళ గ్రాంథిక భాషలో శివశంకర శాస్ర్తి గారు రాసిన  జాతక కథలు  మొత్తం ఏడు సంపుటాలు.  వాటిలో ఐదు మాత్రం  నెట్ లో దొరుకున్నాయి. 

 ఆసక్తి ఉన్నవారు  వీటిని    గురుకుల్  సైట్  లింకులో  డౌన్ లోడ్ చేసుకుని, చదువుకోవచ్చు.    మొత్తం 1880కు పైగా పేజీలు.   ( గురుకుల్ అనే పదం మీద క్లిక్  చేస్తే సరి). 

29, అక్టోబర్ 2017, ఆదివారం

కలలో నీలిమ కని .... వేణువు విని!



సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం!

రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది.

ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రస హృదయులకు పంచుతోంది.

అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది. 

సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను - 
వినటానికి మాత్రం చాలా కాలం పట్టింది.  

ఆ పాట దొరికి,  విన్నాను -  కొద్ది రోజుల క్రితం! 

రేడియోకు సంబంధించి నాకు ఏదైనా సమాచారం  కావాలంటే...
మలపాక పూర్ణచంద్రరావు  గుర్తొస్తారు.

‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ గారి  ద్వారా ఆయన నాకు పరిచయం.  యువభారతి ఫౌండేషన్ కార్యదర్శి.    ఆ పాట కావాలని అడిగితే...  తన కలెక్షన్లోంచి వెతికి ఆయన  నాకు పంపించారు.

వినగానే  ఎంత  సంతోషమయిందో!

సంగీత తరంగాలపై  నన్ను తేలుస్తూ-  దశాబ్దాల వెనక్కి-  ‘ఆకాశవాణి  మంచి  రోజుల్లోకి’  నన్ను తీసుకువెళ్ళింది  ఆ పాట!

రేడియో కళాకారులూ, అనౌన్సర్లూ మన ఇంటి సభ్యులేనని భావించిన కాలమది.  వారి  రూపం ఎన్నడూ చూడకపోయినా వారు మనకు బాగా తెలుసనీ, మనకెంతో ఆత్మీయులనీ  అనిపించేది.

ఆ పాట  పాడినది  రేడియో కళాకారులూ,  సంగీత విద్వాంసులూ  మల్లాది సూరిబాబు.  

 ఆయన అమేయ సంగీత ప్రతిభకు ఈ లలిత సంగీతపు పాట గానీ,  మరొక పాట గానీ మాత్రమే  ప్రాతినిధ్యం వహించవు.   నాకు నచ్చిన ఆయన పాటలను స్మరించుకోవటం మాత్రమే ఇది.

 ఇదీ ఆ పాట-



కలలో నీలిమ కని
నీలిమలో...  కమల పత్ర చారిమ గని   //కలలో//


కమల పత్ర చారిమలో  సౌహృద మృదు రక్తిమ కని
అగరు ధూప లతిక వోలె
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు...  ఎంత వెర్రిదే   ఆ....  //కలలో //

కలలో మువ్వలు విని
మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని  //కలలో//


సిరి సిరి నవ్వులలో  మూగ వలపు సవ్వడి విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు-  ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే    ఆ....  //కలలో //

కలలో వేణువు విని
వేణువులో విరహ మధుర వేదన విని   //కలలో//


విరహ మధుర వేదనలో  ప్రణయ తత్వ వేదము విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే     //కలలో //


ఈ పాట  సంగీత కర్త  సూరిబాబు గారి గురువుల్లో ఒకరైన   ఓలేటి వేంకటేశ్వర్లు 


రాసిన వారు  ఎస్.వి. భుజంగ రాయ శర్మ

రంగుల రాట్నం (1966) లోని పాట  గుర్తుందా?

- ‘కలిమి నిలవదు  లేమి మిగలదు-  కల కాలం ఒక రీతి గడవదు-  నవ్విన కళ్లే చెమ్మగిల్లవా?  వాడిన బ్రతుకే పచ్చగిల్లదా  ఇంతేరా ఈ జీవితం - తిరిగే రంగుల రాట్నమూ ’ రాసింది భుజంగ రాయశర్మే.  

సాహిత్యంలో  మెరుపులు
‘ముక్త పద గ్రస్తం’ అనే అలంకారం  తెలుసు  కదా?
ముందు రాసి  విడిచిన పదాన్నే  మళ్ళీ గ్రహించి రాయటం-   అది ఈ పాటలో  చూడవచ్చు.

కలలో నీలిమ- నీలిమలో కమల పత్ర చారిమ (సౌందర్యం) -  కమల పత్ర చారిమలో సౌహృద మృదు రక్తిమ

రెండో మూడో చరణాల్లో కూడా ఇలా  ఒక మాట రాసి,   దాన్ని మళ్ళీ  మరోదానికి  అందంగా లంకె  వేయటం కనిపిస్తుంది. 

‘అగరు ధూప లతిక’  అన్న ప్రయోగం చూడండి.   అగరు పొగ... తీగలాగా వంపులు తిరుగుతూ  పైకి సాగిపోవటం  కళ్ళ ముందు కనిపించదూ!

 ఆ  ధూపాన్ని పట్టుకోవడం గానీ, ఆపటం గానీ  అసాధ్యం కదా? అందుకే  దాన్ని వశంలో లేని మనసుతో  పోల్చారు కవి.   

పాటలోని   పదాలూ, పదబంధాలూ కొత్తగా   అనిపిస్తాయి. 
నీలిమ , చారిమ, రక్తిమ, లతిక-  ఈ  తరహా ‘derived/ modified ’ పదాల్లో ఒక అందముంటుంది.

( నవలలు బాగా చదివిన అలవాటు ఉన్న పాఠకులకు  ఇలాంటి  మాటలు బాగానే పరిచయం ఉంటాయి.   అరుణిమ, రూపసి, వీణియ, నిష్కృతి... ఇలాంటివే.)  

*** 

 ఆలోచనామృతమైన  సాహిత్యం ... ‘ఆపాత మధుర’ సంగీతానికి  ఆలంబన కదా!

‘‘సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం ’’  అంటారు మల్లాది సూరిబాబు.

 ఈ మధ్య  ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉదయం వేళల్లో ఈ లలిత సంగీతపు పాటలను ప్రసారం చేస్తోందట.  గత ఏడాది నవంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన ఓ వ్యాసంలో  మల్లాది సూరిబాబు ఈ సంగతి చెప్పుకొచ్చారు.
 
‘‘ఓపికతో వినే ప్రయత్నం చేస్తే, రణగొణ ధ్వనుల కాలుష్యంతో నిండిపోయిన చౌకబారు పాటలకూ, వీటికీగల తేడా ఏమిటో  గమనించగలం’’ అంటారాయన.

***
సూరిబాబు మరో గురువు...  గాన రుషిగా పేరుపొందిన  శ్రీపాద పినాకపాణి . 


 ఆయన స్వర కల్పన చేసిన  అన్నమయ్య పాటల్లో ఒకటి-  ‘ చందమామ రావో ’. 
 
ఈ పాట తెలియని వాళ్ళుండరు కదా?

 ఈ పాటను   సూరిబాబు 2014లో  - మూడేళ్ళ క్రితం- సంగీత శిక్షణ కార్యక్రమంలో ఇలా  పాడారు.

బాణీ లోనూ.  గానంలోనూ  ముగ్ధులను చేసే  సంగతులను  విని తెలుసుకోవాల్సిందే !   ముఖ్యంగా ‘జాబిల్లి’ అన్నచోట ఆ బాణీలో ఎంత ఆప్యాయత,  లాలిత్యం!



చందమామ రావో
జాబిల్లి రావో   //చందమామ//

కుందనపు పైడి కోర
వెన్న పాలు తేవో  //చందమామ//

నగుమోము చక్కనయ్యకు
నలువ పుట్టించిన తండ్రికి  //నగుమోము//
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి  

జగమెల్ల నిండిన సామికి 
చక్కని ఇందిర మగనికి  //జగమెల్ల//
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల బాలునికి  //చందమామ//


ఇంకో రెండు చరణాలు కూడా ఉన్నాయి ఈ పాటలో.

వెన్న,  పాలు  రెండూ అని అర్థమా?  ఒకవేళ అది వెన్నపాలు అయితే- ఇప్పుడు మనం వాడే ప్యాకెట్ పాలలో  క్రీమ్ మిల్క్/ హోల్ మిల్క్ అన్నమాట !  :)

***

ళ్ళీ మొదటి పాట దగ్గరికి వెళ్దాం !

‘కలలో నీలిమ కని’ పాట   కృష్ణుడిని తల్చుకుంటూ  రాధికో, గోపికో  పాడుకున్న  విరహ గీతికేమో  అనిపిస్తుంది .

పాట  నిలువెల్లా  బృందావన  కృష్ణుడిని తలపించే  ప్రతీకలే ఉన్నాయి.
నీలిమ.  కమల పత్రాలు ( యమున ఒడ్డున ),  మువ్వలు,  నవ్వులు , వేణువు... విరహం,  ప్రణయ తత్వం-  

కానీ  ఈ పాటను గాయనితో కాకుండా  గాయకుడితో పాడించటానికి  కారణమేమైనా ఉందా?

ఏదేమైనా...  మల్లాది సూరిబాబు దీన్ని శ్రావ్యంగా, అనుపమానంగా  పాడి  ఎంతో  ప్రాచుర్యంలోకి  తెచ్చారు

ఆయన  పాడి  దశాబ్దాలు గడిచినా  ఇప్పటికీ  దాన్ని ఇష్టంగా  తల్చుకునేవాళ్ళుండటమే దీనికి తిరుగులేని రుజువు కదా!