సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, ఆగస్టు 2017, గురువారం

మన కళ్ళనెలా ఉపయోగించాలి?


‘చందమామ’ పత్రికలో  రాతిరథం, యక్ష పర్వతం   సీరియల్స్ వస్తున్న రోజులు..

వాటిలో  ‘చీకటి కొట్లో బంధించటం’  గురించి చదువుతున్నపుడు ఆ శిక్షను  ఊహించుకుని  మనసులో హడలిపోయేవాణ్ణి.

మరి  అలా  అంధకారంలో ఉండాల్సిరావటమంటే  భయంకరమే కదా!

చిమ్మ చీకట్లో  వెలుగులు  చిలుకుతూ   నింగిలో  మినుకుమనే   చుక్కలూ,  నిప్పు కణికల్లా  గాల్లో  తేలివచ్చే  మిణుగురులూ  ఎంత ఆనందం కలిగిస్తాయో !  

కరెంటు పోయి.. హఠాత్తుగా లిఫ్టు ఆగిపోతే  ఆ కాసేపటి చీకటికే గందరగోళంగా మనకు ఉంటుంది.  లిఫ్టు నుంచి బయటికి వచ్చేలోగా కాస్త వెలుగైనా ఉంటే గానీ ప్రాణం కుదుటపడదు.

జీవితాంతం వెలుగనేదే  ఉండని ... అసలేమీ చూడలేని అంధత్వం మరెంతటి  దుర్భరం!

* * *

ఇంటర్ చదివే రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రార్థన’  సీరియల్ గా ఆంధ్రభూమి వీక్లీలో వచ్చేది.

వారం వారం ఆసక్తిగా చదివేవాణ్ణి.


ఆ నవల్లో  హుషారుగా తిరిగే  ఎకౌంటెంట్ కుర్రాడు సోమశేఖరం. ఓ  ప్రమాదంలో అతడికి  కంటి చూపు పోతుంది. అంతే కాదు.. మాట్లాడటం, వినటం కూడా చేయలేకపోతాడు.

అలాంటి ఘోరమైన  పరిస్థితిని తల్చుకుని దు:ఖంతో  ఏడ్చి బెంబేలెత్తడు. వేగంగా  తేరుకుంటాడు.  బ్రెయిలీ భాష నేర్చుకోవటంతో మొదలుపెట్టి తన దురవస్థను ఎంతో  గొప్పగా ఎదుర్కొంటాడు.

ఈ పాత్రను ఆ నవల్లో బాగా చిత్రించాడు రచయిత.

ఆ సోమశేఖరం  ‘నిశ్శబ్దపు చీకటిలో మౌనంగా నా భావాలు’ అనే పుస్తకం రాయాలనుకుంటాడు కూడా!

* * *
కె. విశ్వనాథ్ సినిమా  ‘సిరివెన్నెల’ (1986) లో కథానాయకుడు సర్వదమన్ బెనర్జీ  అంధుడు. నాయిక సుహాసిని మూగ. వారి మధ్య సన్నివేశాలు బాగుంటాయి.

 ఒక  సందర్భంలో అతడు తాను ప్రేమించిన  మూన్ మూన్ సేన్ రూపాన్ని గురించి  చెపుతుంటే  సుహాసిని శిల్పంగా మలుస్తుంది.

ఈ సందర్భంగా సాక్షి రంగారావు ..‘ ఎన్నడూ చూడని వ్యక్తి  రూపాన్ని అతడు వర్ణించి చెపుతుంటే.. అసలు ఆమెను ఎన్నడూ చూడని వ్యక్తి శిల్పంగా  చెక్కటం..’ అంటూ  ఆ విడ్డూరానికి  గందరగోళపడతాడు.

సినిమా కాబట్టి .. మూన్ మూన్ సేన్  రూపం అన్ని విధాలుగా సరిపోయేలా శిల్పం తయారవుతుంది.


* * *

అంధత్వం  గురించి తల్చుకున్నపుడు గుర్తొచ్చే పేరు- 
హెలెన్ కెల్లర్ ..!

1880- 1968 సంవత్సరాల మధ్య జీవించిన అమెరికన్.అనారోగ్యం వల్ల 19 నెలల వయసుకే  శాశ్వతంగా  అంధత్వం, చెవిటితనం వచ్చిందామెకు.   యానీ సల్లివాన్ అనే టీచరు ఆమెకు జ్ఞాననేత్రం అయింది. ఆ చేయూతతో  హెలెన్ కెల్లర్ తన లోపాలను అధిగమించటానికి అనితర సాధ్యంగా ప్రయత్నించింది. ప్రపంచవ్యాప్తంగా  ఎందరికో ఆదర్శంగా నిలిచింది.   

ఈమె గురించి స్కూలు రోజుల్లో  ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలో  ఓ పాఠం ఉండేది.  "Three days to see'  అని.

ఆమె..  తనకు మూడు రోజులు కంటి చూపు వస్తే  ఏమేం చేయాలనుకుంటున్నానో దానిలో  చెపుతుంది. 

ఆ పాఠం ఏళ్ళు గడిచినా ఇంకా గుర్తుంది.

ఆ మధ్య ఆమె జీవిత గాథ  చదివాను. తన లోపాలను అధిగమించిన తీరు మనల్ని ముగ్ధులను చేస్తుంది. పరిసరాలపై, ప్రపంచంపై ఆమె పరిజ్ఞానం, అవగాహన ఆశ్చర్యపరిచేలా  ఉంటుంది.

హెలెన్ కెల్లర్ గురించి తెలుగులో  1956లో, 1959లలో  ప్రచురితమైన రెండు పుస్తకాలు చదివాను.
 మొదటిది  హెలెన్ కెల్లర్ ఆత్మకథ- ‘ఆశాజ్యోతి’. సుభద్రా నందన్ పాల్ అనువాదం.

 


రెండోది వాన్ బ్రూక్స్ అనే రచయిత రాసిన  హెలెన్ కెల్లర్  (జీవిత చిత్రణ) పుస్తకం. ఎన్ ఆర్ చందూర్ దీన్ని అనువదించారు.

వినికిడి ఘనం.. చూపు వరం

‘త్రీ డేస్ టూ సీ’ వ్యాసం  ఇంగ్లిష్ లో  నెట్ లో దొరుకుతుంది.
దాన్ని క్లుప్తంగా  తెలుగులో  ఇక్కడ  ఇస్తున్నాను.

‘‘ ప్రతి రోజూ మనకిదే ఆఖరిది’ అనుకుని బతకాలని నాకు ఒక్కో సారి అనిపిస్తుంది. చెవిటివారికే వినికిడిలోని గొప్పతనం తెలుస్తుంది. అంధులకు మాత్రమే చూపు ఎంతటి వరమో  అర్థమవుతుంది.

ప్రతి మనిషికీ కొద్ది రోజుల పాటు  చెవిటితనం, అంధత్వం  ఉంటే వారికే మంచిదని నాకు అనిపిస్తుంటుంది. అప్పుడు చీకటి.. వారికి చూపు ఎంత ఘనమైనదో  తెలుపుతుంది. నిశ్శబ్దం...  ధ్వనుల వల్ల వచ్చే ఆనందాన్ని తెలిసేలా చేస్తుంది.

ఈ మధ్య వన విహారానికి వ్యాహ్యాళికి  వెళ్ళి  అప్పుడే తిరిగివచ్చిన  ఓ మిత్రురాలిని అడిగాను...‘ ఏమేం చూశావు?’ అని.  ‘ప్రత్యేకంగా ఏమీ లేదు’ అందామె.

గంటసేపు అక్కడికి  వెళ్ళి  చెప్పుకోదగ్గదంటూ ఏమీ చూడకుండా ఉండటం ఎలా సాధ్యం?

నేను కంటితో చూడలేను గానీ,  వందలాది విషయాలు నాకు ఆసక్తిని కలిగిస్తాయి.

నేను ఏదైనా యూనివర్సిటీ  అధ్యక్షురాలినైతే  ‘మీ కళ్ళనెలా ఉపయోగించాలి?’ అనే కోర్సు  ప్రవేశపెడతాను.

మీకు  ఓ  మూడు రోజులు  మాత్రమే  చూపు ఉంటే  కళ్ళను ఎలా ఉపయోగిస్తారు? ఆ విలువైన సమయాన్ని ఎలా గడుపుతారు?

ఏదో అద్భుతం జరిగి ఓ మూడు రోజుల చూపు నాకు వస్తే...


తొలి రోజు :
ఇప్పటివరకూ  స్పర్శ ద్వారా మాత్రమే తెలిసిన నా  స్నేహితుల, బంధువుల  ముఖాలను మొదటిసారి చూస్తాను. ముఖ్యంగా నా ప్రియమైన టీచర్  యానీ సల్లివాన్ దివ్యమైన ముఖాన్ని చూస్తాను.  సహనంతో దయతో ఆమె అందించిన తోడ్పాటుతోనే నాకు ఈ ప్రపంచం తెలిసింది.   ఇంకా నమ్మకానికి మారుపేరైన కుక్కల మొహాలు చూస్తాను. ఇంట్లో  ఇంతవరకూ చూడకుండానే ఉపయోగిస్తూవచ్చిన  సామాన్లన్నీ చూస్తాను. సాయంత్రం చెట్లల్లోకీ, పొలాల్లోకీ ఇష్టంగా నడుస్తూ వెళ్ళి ప్రకృతి అందాన్ని తిలకిస్తాను.  చూపు వచ్చిన సంతోష పారవశ్యంతో రాత్రంతా మెలకువగానే ఉండిపోతాను.

రెండో రోజు: 
ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తాను. న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని చూస్తాను. ఆదిమ కాలం నుంచి  ప్రస్తుతం వరకూ ఈ భూమ్మీద జీవనం ఎలా అభివృద్ధి చెందిందో అక్కడ తెలుసుకుంటాను.  తర్వాత మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ సందర్శిస్తా. సాయంత్రం థియేటర్ లో నాటకమో,  సినిమానో చూసి ఆనందిస్తాను.

మూడో రోజు:
మళ్ళీ సూర్యోదయాన్ని పలకరిస్తాను. ప్రతిరోజూ దీనిలో కొత్త అందం ఉండే తీరుతుంది.  ఇక చుట్టూ  హడావుడిగా సాగే జీవితాన్ని గమనిస్తాను.  అడవీ, కొండలూ, పొడవైన ద్వీపం, తూర్పు నది, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఫిఫ్త్ ఎవెన్యూ,  పార్క్ ఎవెన్యూ... ఒకదాని తర్వాత ఒకటి చూసేస్తాను. జన సమ్మర్దం ఉండే కూడళ్ళలో  ఉరుకుల పరుగుల జనం సందడి చూసి సంతోషిస్తాను.  కర్మాగారాలనూ,   పార్కుల్లో ఆడుకునే పిల్లలనూ చూస్తాను. సాయంత్రం మళ్ళీ  థియేటర్ కి వెళ్ళి, సరదా నాటకం చూస్తా.

అర్ధరాత్రికల్లా మళ్ళీ నా జీవితంలోకి శాశ్వతమైన చీకటి వచ్చేస్తుంది. కానీ  ఒక తేడాతో.  ఇప్పుడైతే.. ఈ మూడు రోజుల గొప్ప జ్ఞాపకాలు ... సుదీర్ఘమైన చీకటి రాత్రి లాంటి నా జీవితంలో వెలుగునిచ్చే కొవ్వొత్తి మల్లే - ఎప్పటికీ ప్రకాశిస్తాయి!’’

* * *
సంతోషపు తలుపు 

హెలెన్ కెల్లర్ చెప్పిన  ఎన్నో  కొటేషన్లు అర్థవంతంగా, స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి.‘‘ప్రపంచమంతా దు:ఖంతో నిండివుంది. అయితే.. దాన్ని అధిగమించటం కూడా అదే స్థాయిలో ఉంది’’

 ‘‘వెలుగులో  ఒంటరిగా నడవటం కంటే  నేస్తంతో కలిసి  చీకట్లోనైనా నడవటానికే  ఇష్టపడతాను.’’

‘‘ఆశావాదం అనేది మనల్ని  విజయం వైపు  నడిపించే నమ్మకం. ఆశ, నమ్మకం లేకపోతే ఏదీ చేయలేము’’

‘‘ఒక సంతోషపు తలుపు మూసుకుపోతే మరోటి తెరుచుకుంటుంది. కానీ తరచూ  మూసిన తలుపు వైపే ఎక్కువసేపు చూస్తుంటాం కానీ మన కోసం తెరుచుకున్న తలుపును గమనించం’ * * *

హెలెన్ కెల్లర్  చెప్పినట్టు... చూపూ, వినికిడీ  లేని పరిస్థితి  మనకు (కొద్ది రోజులు మాత్రమే సుమా)  వస్తే  ఎలా ఉంటుంది!  ఊహించండి.