సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, సెప్టెంబర్ 2017, శనివారం

రాతల్లో- గీతల్లో పొదుపూ అదుపూ !


‘బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్’  అని ఓ పాత్ర చేత అనిపిస్తాడు  షేక్ స్పియర్ ‘హేమ్లెట్’ నాటకంలో.

 క్లుప్తంగా  ఉంటేనే  జోక్ కి  విలువా,  సార్థకతా!

 సాగదీస్తూ చెప్తేనో,  వివరించే ప్రయత్నం చేస్తేనో  .. ఆ జోకు  దారుణంగా విఫలమైనట్టే.


చాలా కాలం క్రితం  ‘రసాయన మూలకాల రహస్యాలు’ అనే రష్యన్ అనువాద పుస్తకం చదివాను.

పీఠికలో  ఓ  పిట్ట కథ ఆకట్టుకుంటుంది. అదేంటంటే..

ప్రాచ్యదేశంలో ఓ మేధావి అయిన రాజు  ప్రపంచంలోని అన్ని జాతుల చరిత్ర పుస్తకంగా రాయమని మేధావులకు చెప్పి  ఐదు సంవత్సరాల గడువు ఇస్తాడు.  వాళ్ళు  వందల వేల పుస్తకాలు రాసి తీసుకొస్తారు.

‘వీటిలో పదో వంతు చదవటానికైనా  జీవితకాలం సరిపోదూ,  సంగ్రహంగా కావాలి’ అని మరో ఏడాది గడువిస్తాడు.  అలా ఓ రెండొందల పుస్తకాలు తీసుకొస్తే ... సర్వజాతుల్లో  సర్వకాలాల్లో జరిగిన  అతి ముఖ్య సంఘటనలు  ఇంకా సంగ్రహంగా కావాలంటాడు.

అప్పుడో  వృద్ధ మేధావి ‘ రేపటికి మీ కోరిక నెరవేరుతుంది’ అని  చెప్తాడు.

మర్నాడు  తీసుకొస్తాడో  పెట్టె. దానిలో  చిన్న పత్రం. దానిలో ఒకే ఒక వాక్యం -
     
‘వారు పుట్టారు, జీవించారు, గిట్టారు’లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ రాసిన చిన్న ఎలిజీ (విషాద కవిత) అందరికీ తెలిసిందే.

‘పుటక నీది
చావు నీది
బతుకుంతా దేశానిది’ 


ఎన్నెన్ని సుదీర్ఘ వ్యాసాలైనా సరే, దీనిముందు వెలవెలపోవలసిందే కదా?

అల్పాక్షరాల్లో అనల్పార్థం  సాధించటం అంత తేలికేమీ కాదు.  పొదుపుగా, సమర్థంగా  చెప్పాలంటే విషయంపై  పట్టూ,  వ్యక్తీకరణపై  అదుపూ ఉండితీరాలి. 


శ్రీశ్రీ ‘మహాప్రస్థానాని’కి రాసిన ముందుమాట- ‘యోగ్యతాపత్రం’లో చలం ఇద్దరు తెలుగు కవుల కవిత్వతత్వాన్ని ఇలా  చెప్తాడు-

‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’. 

ఈ  వ్యాఖ్యను  ఇంతకంటే మించి  సరళంగా,  అద్భుతంగా చెప్పటం  అసాధ్యమనిపిస్తుంది.


17-18 శతాబ్దాల్లో జీవించిన మన  వేమన  జీవిత సత్యాలను అలతి పదాల్లో ఎంత చిక్కగా చెప్పాడో  మనందరికీ తెలుసు.

‘నిక్కమైన నీలమొక్కటైన చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల? ’
***

 చిత్రకళ పదును దేరిన కొద్దీ  గీతలను  పొదుపుగా వాడటం చిత్రకారుడికి అలవాటవుతుంది.  బాపు లాంటి వారి  బొమ్మలను చూస్తే ఇది తెలుస్తుంది.

బాపు సంతకం కూడా ఈ పరిణామాన్ని ఎంచక్కా రుజువు చేస్తుంది.
బొమ్మల్లో / కారికేచర్లలో  క్లుప్తత, సరళతల గురించి ఆలోచించినపుడు వెంటనే నాకు తట్టే పేరు కార్టూనిస్టు రంగా (1924-2002).
 

స్టేట్స్ మన్,  ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ద ట్రిబ్యూన్ లలో  పనిచేసిన  ఈయన  పూర్తి పేరు ఎన్.కె. రంగనాథ్ .

ముందుకు వంగి కర్ర సాయంతో నడిచివెళ్ళే  గాంధీని  రెండు మూడు గీతల్లో -  ఇలా  అలవోకగా రూపు కట్టిస్తాడు రంగా. 

ఇదే పంథాలో ...  నెహ్రూతో పాటు నడిచివెళ్తుండే గాంధీని  ఆయన  చిత్రించాడు.  
శాంతి కపోతంగా...దేశపటం రూపంలో... 
 ***
క్కువ లైన్లలో బొమ్మను వేయటం  ‘మినిమలిజం ఇన్ డిజైన్ ’.   సింగిల్ స్ట్రోక్ - వన్ లైన్ ఇలస్ట్రేషన్స్ కు పేరుపొందిన  యు.కె. ఆర్టిస్ట్  క్రిస్ థార్న్ లీ.  


‘మినిమల్ ఈజ్ గుడ్’   పేరుతో ఆయన వేసిన రేఖాచిత్రాలు ఇవి.  అన్నీ స్త్రీ మూర్తులవే. 

ఒక్కోటి వేయటానికి ఆయనకు పట్టిన సమయం నిమిషం కన్నా తక్కువే.***

సింగిల్ లైన్ ఇలస్ట్రేషన్లతో మెప్పించే మరో కళాకారుడు  ఫ్రెంచి ఆర్టిస్టు  క్రిస్టఫీ లూయిస్ క్విబ్. ఆయన గీసిన చిత్రాలు చూడండి.
 వివిధ భంగిమల్లో,  కోణాల్లో  గీసిన  ముఖాలు-

ఒకే గీత  ఎక్కడా ఆగకుండా...  ఎన్నెన్ని  చిత్ర  విన్యాసాలు చేసిందో చూడండి-  

ఒంటి గీతతో ఈయన వేసిన ఐన్ స్టెయిన్ బొమ్మ  ఇది- 

దీన్ని న్యూ సైంటిస్ట్ ముఖచిత్రంగా ఉపయోగించారు.ఒకే  గీతతో  వినాయకుడి బొమ్మను కూడా ఆయన వేశారు.‘వన్ లైన్ గణేశ్’  అని దీనికి పేరు పెట్టారీ ఫ్రెంచి చిత్రకారుడు.


సెర్జ్  అనే వ్యక్తి రూపచిత్రాన్ని  క్విబ్  ఇలా ఒంటి గీతతో వేశారు. 
అంతటితో ఊరుకోకుండా ఆయన పేరు ఇంగ్లిష్ స్పెలింగ్  SERGE నే ఆయన బొమ్మగా మలిచిన చమత్కారి  క్విబ్.

ఆ అక్షరాలు  బొమ్మ రూపంలోకి  వచ్చి చేరటాన్ని తమాషాగా ఇలా  వరసగా  చూపించారాయన.

ఇన్ని చమక్కులు చేసే ఈ చిత్రకారుడు  ఒకే గీతతో  తన రూప చిత్రాన్ని వేసుకోకుండా ఎలా ఉంటారు?

అది  ఇదిగో...


విత్వంలో క్లుప్తత ఉంటుంది కానీ... వచనంలో ఉండదు కదా! ఆలోచనా పరిధిని  పెంచే   పుస్తకాల మాటేమిటి?

సూక్ష్మ వివరాలతో  అసంఖ్యాకమైన  రేఖలతో   శ్రద్ధగా  నగిషీలు   చెక్కే బొమ్మల సంగతేమిటి?

వాటి  విలువ  వాటిదే!

అయితే  ఆ గీతలూ, రాతలూ సూక్ష్మంగా, సరళంగా ఉంటే  ఆ  ప్రభావం ఎక్కువ... చాలా సందర్భాల్లో!

‘కొండ అద్దమందు కొంచెమై’ ఉండేలా చేయగలగటం కళా చాతుర్యమే కదా?

ఎందుకంటే... వేమనే చెప్పినట్టు- ‘కొంచెముండుటెల్ల కొదువ గాదు’!