ఒక వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత ఆ వ్యక్తి బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక తెలిస్తే... ?
నాకైతే...
ఆ కళాకారుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.
అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు.
సినీ సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన పాటలన్నా నాకు చాలా ఇష్టం.
ఆయన సజీవంగా ఉన్నపుడు కూడా ఆయన కళా ప్రతిభ గురించి తెలుసు. కానీ ఆయన చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాతే ఆయన పాటల్లోని మాధుర్యం నాకు సంపూర్ణంగా అవగతమయింది. అందుకే ఆయన్ను చూడలేకపోయాననీ, మాట్లాడలేకపోయాననీ బాధ వేస్తుంటుంది.
ఆయనతో అత్యధిక చిత్రాలకు పనిచేయించుకున్న ముగ్గురు దర్శకుల్లో ... జంధ్యాల, దాసరి నారాయణరావులు ఇప్పుడు సజీవంగా లేరు.
మిగిలిన దర్శకురాలు విజయనిర్మల. ఆమెను కలిసి, రమేశ్ నాయుడి గురించీ, ఆయన బాణీల విశేషాల గురించీ చాలా వివరాలు తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది.
ఇది సాధ్యం కాని విషయమేమీ కాదు కూడా!
* * *
రమేశ్ నాయుడు పాడిన పాటల్లో రాధమ్మ పెళ్ళి (1974) సినిమాలోని ‘అయ్యింది రాధమ్మ పెళ్లి ’,
చిల్లరకొట్టు చిట్టెమ్మ ( 1977) లోని ‘తల్లి గోదారికి ఆటు పోటుంటే’ ..
ఇవి శ్రోతలకు బాగా తెలుసు.
మరో పాట కూడా ఉందని ఇవాళే నాకు తెలిసింది.
మరి సినీ అభిమానులైన పాఠకులకు ఈ పాట సంగతి తెలుసో లేదో నాకు తెలియదు.
ఆ పాట -
‘సూర్యచంద్రులు ’ (1978) సినిమాలోది.
ఇదే సినిమాలోని ‘ఒకే మనసు... రెండు రూపాలుగా..’ పాట కోసం నెట్ లో వెతుకుతుంటే ఈ విశేషం తెలిసింది.
లిరిక్ ఇది... చూడండి. (చిత్రభూమి బ్లాగ్ సౌజన్యంతో).
జంధ్యాల మాటల రచయితగా, దర్శకునిగా అందరికీ తెలుసు. సినిమా పాట కూడా రాశారనేది కొత్త విషయం. పైగా దాన్ని రమెశ్ నాయుడే స్వయంగా పాడటం!
జంధ్యాల- రమేశ్ నాయుడి ద్వయం భవిష్యత్తులో ఎన్నోమంచి సినిమాలు కలిసి పనిచేయటానికి ఈ పాట కూడా ప్రాతిపదిక అయివుండవచ్చు.
ఈ పాట బాణీ ఇంకా దొరకలేదు, వినటానికి .
ఇంతకీ నేను ఈ బ్లాగులో ప్రస్తావించాలనుకున్న అసలు పాట ఇది-
‘అన్నదమ్ములుగా జన్మిస్తే అది చాలదు చాలదు అంటాను
కవలలుగా జన్మించే జన్మ కావాలి కావాలంటాను’
ఈ పాటలో ఈ సెంటిమెంట్ నచ్చిందో... భావం నచ్చిందో చెప్పలేను. కానీ రమేశ్ నాయుడి బాణీ మాత్రం అద్భుతంగా నచ్చింది.
బాలుతో పాటు కలిసి పాడిన గాయకుడు జి. ఆనంద్ అనుకున్నాను, ఇవాళ్టి వరకూ. కానీ ఆ గాయకుడి పేరు చిత్తరంజన్. ఈయన రేడియోలో ప్రతి ఆదివారం 'ఈ మాసపు పాట' శీర్షికతో అస్సామీస్, ఒరియా, తమిళ్, సింధీ లాంటి వివిధ భాషల పాటలు నేర్పించేవారు.
* * *
రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చిన పాటల్లో చాలా ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి.
ఓ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనిలో కూడా నేను నమ్మని పునర్జన్మల సంగతి ఉండటం కాకతాళీయం కావొచ్చు.
జీవితం (1973) అనే సినిమాలోది ఈ పాట. సినారె రాసిన ఈ పాటను సుశీల, రామకృష్ణ పాడారు.
పాట లిరిక్ ఇది-
ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో.. ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో కలుసుకున్నాము
నీలనీల గగనాల మేఘ తల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి
ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము
నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఏమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము... ఎప్పుడో కలుసుకున్నాము
మనసుకు దగ్గరైన వ్యక్తులనూ, ఆత్మీయులైనవారినీ ఇక్కడే కాదు, గతంలోనే ‘ఎప్పుడో కలుసుకున్నాము’ అనుకోవటంలో ఎంతో తృప్తి ఉంటుంది. అదొక అనిర్వచనీయమైన భావం.
ఈ పాటలో ‘చరణ దాసి’ లాంటి వ్యక్తీకరణలు నేను ఇష్టపడనివి. కానీ దాన్ని పట్టించుకోకుండా, పదేపదే వినాలనిపించేంత మాధుర్యం బాణీలో ఉంది.
* * *
రమేశ్ నాయుడి పాటల గురించి ఇంతేనా? ఇంకేమీ లేదా రాయటానికి.. అనకండి.
ఇంకో పోస్టు రాస్తాను, మరెప్పుడైనా!
కొన్నేళ్ళ క్రితం ఆయన గురించి ఈ బ్లాగులో ‘విన్నారా అలనాటి వేణుగానం’ అనే పోస్టు రాశాను.
అలాంటి పోస్టులు ఎన్నో రాసి, ఇష్టంగా గుర్తు చేసుకోదగ్గ విశేష ప్రతిభావంతుడాయన!