సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

20, మార్చి 2014, గురువారం

నా బాల్య స్మృతుల్లో... బుజ్జాయి బొమ్మల కథ!

 కప్పటి ‘ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక’ను తల్చుకుంటే ...  వెంటనే నాకు రెండు బొమ్మల కథలు గుర్తొస్తాయి. ఒకటి ... ‘ రాము- శ్యాము’  అనే బొమ్మల కథ.  అనంతపాయ్, మోహన్ దాస్ లు దీని సృష్టికర్తలు.

రెండోది... దానికంటే ముందే ప్రచురించిన  ‘న్యాయానికి భయం లేదు’ అనే కామిక్  సీరియల్! 

1975లో వచ్చిందిది.

ఈ  సీరియల్ కథను అప్పట్లో  చాలా ఉత్కంఠను అనుభవిస్తూ వారం వారం  చదివాను.

వారపత్రికలు తెప్పించుకోవటం అంటే  అప్పట్లో లగ్జరీయే.  అంతటి  ఆర్థిక స్తోమత ఉండేది కాదు మాకు.  అప్పటికి గ్రంథాలయం కూడా లేని పల్లెటూరు మాది.  అలాంటిచోట - మా ఇంటి దగ్గర్లో అద్దెకుండే  గవర్నమెంటు ఉద్యోగి వాళ్ళు ఈ వారపత్రిక తెప్పించేవారు. అక్కడికి వెళ్ళి ఆ వారపత్రికనూ, దానిలో వచ్చే ఈ కామిక్ కథనూ ఆసక్తిగా చదువుతూ ఉండేవాణ్ణి.

అసలీ కథ పేరే వింతగా తోచేది.  న్యాయానికి భయం లేకపోవడం- అనే వాక్యం తికమకగా ఉంది కదా?  అదేమిటో  అర్థమయ్యేది కాదు. ‘న్యాయంగా ఉన్నవారికి భయం లేదు’ అని తర్వాతికాలంలో అర్థం చేసుకున్నాను.

మొత్తానికి సందిగ్ధ  టైటిల్ దగ్గర్నుంచీ సస్పెన్స్ తో సాగటం వరకూ ఈ కామిక్ కథ మనసులో ముద్రపడిపోయింది.  

హీరోను భూగృహంలో బంధించి నీళ్ళు వదులుతారు విలన్ మనుషులు. అప్పుడు హీరో పరిస్థితి గురించి కంగారు పడ్డాను. అతడు వాచీలోని  సన్నటి తీగలాంటి రంపంతో చేతికట్లు కోసుకుని చివరిక్షణంలో బయటపడటం చదివి, ఆ తెలివికి భలే సంతోషించాను. 

కథలో మలుపులన్నీ ఊపిరిబిగబట్టి చదివాను!  ముగింపులో హీరో  ఎంట్రీ కూడా విపరీతంగా నచ్చింది.  బొమ్మలన్నీ బాగా ఇష్టపడ్డాను.





ఈ కథ తో పాటు దానికి  బొమ్మలు వేసిన బుజ్జాయి పేరు (ఈ పేరు కొంచెం వింతగా కూడా ఉంది కదా?)  అంత చిన్న వయసులో కూడా బాగా గుర్తుండిపోయింది.

అప్పట్లో  సీరియల్ అన్ని భాగాలూ చదవలేదు. కొన్ని భాగాలు మిస్సయ్యాను.  కానీ ఆ బొమ్మలూ, కథా ఛాయామాత్రంగా జ్ఞాపకాల పొరల్లో ఉండిపోయాయి.

ఆంధ్రప్రభ వారపత్రిక పాత సంచిక కనపడితే చాలు...  దానిలో  ఈ సీరియల్ ఉందా అని వెతికేవాణ్ణి.  సంవత్సరాలు గడిచినా దీని గురించి మర్చిపోలేదు.  అవకాశమున్నచోట  దీనికోసం  వెతుకుతూ వచ్చాను. 

ఆన్ లైన్ వ్యాసంగం కారణంగా  శ్యామ్ నారాయణ గారు పరిచయమయ్యారు.  2011 సెప్టెంబర్లో  బుజ్జాయి డుంబు కామిక్ పుస్తకం ‘నవ్వులబండి’ని ఆయన నాతోపాటు కొందరు మిత్రులకు  మెయిల్లో పంపారు.  


 ఇదే సందర్భం అనుకుని- ఆ మిత్రులందరికీ  ఇలా మెయిల్ రాశాను-

‘‘ బుజ్జాయి గారిదే  ‘న్యాయానికి భయం లేదు’  అనే బొమ్మల ధారావాహిక (comic strip)  ఉండాలి. ఆంధ్రప్రభ వారపత్రికలో దాదాపు 30-35 ఏళ్ళ క్రితం వచ్చిందది.  ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ’’

కానీ  ఎవరూ స్పందించలేదు.

చూడబోతే ఈ కామిక్ గురించి నేను తప్ప ఎవరూ పట్టించుకున్నట్టు లేదే అనుకునేవాణ్ణి.

2013 అక్టోబర్లో  స్వయంగా హైదరాబాదులోనే బుజ్జాయి గారినే  కలుసుకునే అవకాశం వచ్చింది.  వాళ్ళబ్బాయి దేవులపల్లి కృష్ణశాస్త్రి  ఆంగ్ల నవల ‘Jump Cut'  ఆవిష్కరణ సందర్భం అది. 

అప్పుడు వెళ్ళటం కుదర్లేదు. వెళ్ళివుంటే బుజ్జాయి గారిని కలిసి ‘న్యాయానికి భయం లేదు’ గురించి చెప్పి, అదెక్కడైనా దొరుకుతుందా అని అడిగేవాణ్ణి.  

విచిత్రం...
అది జరిగిన  నెలా పదిహేను రోజుల్లోనే  ఆ కామిక్ సీరియల్ నాకు దొరికింది! 

పాత ఆంధ్రప్రభ వారపత్రికలను  శ్యామ్ నారాయణ గారు పంపించగానే... వాటిలో  ఈ సీరియల్ కోసం వెతికాను.  సుమారు అంచనాతో  1975కి అటూ ఇటూ ఉత్కంఠతో వెతికాను...

..  దొరికింది!

చూడగానే భలే సంతోషం వేసింది.  బాల్య మిత్రుణ్ణి  ఎంతో కాలం తర్వాత  మళ్ళీ  చూసినట్టు... !

ఇన్నేళ్ళకు  మళ్ళీ నా కంటపడిన సీరియల్  అన్ని భాగాలనూ కట్ చేశాను. వాటిని  ఒక ఫైలుగా కూర్చాను.   (ఒక భాగం మాత్రం  మిస్సయింది. మొదటి రెండు భాగాలూ అంత  స్పష్టంగా లేవు..) ​

ఈ రంగుల సీరియల్  నలుపు తెలుపుల్లోనే నాకు దొరికింది. దీనితోనే సంతృప్తిపడాల్సివస్తోంది, ప్రస్తుతానికి.

దీన్ని scribd లో అప్ లోడ్ చేశాను.



ఇక్కడ చదువుకోవచ్చు. 



ఎవరీ బుజ్జాయి?
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయే ఈ బుజ్జాయి. అసలు పేరు సుబ్బరాయ శాస్త్రి 

బుజ్జాయి  తన కొడుక్కి  తండ్రి పేరు పెట్టుకున్నారన్నమాట!

17 సంవత్సరాల వయసులో బుజ్జాయి  'బానిస పిల్ల' అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారట. 
బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే.

పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో  1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. లక్షలమందిని ఆకట్టుకున్నారు.  ఈ ఇంగ్లిష్ కామిక్స్  5 పుస్తకాలుగా వచ్చాయి.


మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి  తెలుగులోనూ దొరుకుతున్నాయి.



బుజ్జాయి వేసిన డుంబు, భైరవ్, పెత్తందార్ కామిక్ స్ట్రిప్పులను ఈ లింకులో మచ్చుకు చూడొచ్చు.