సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ ‘శంకర్’ కుంచె విన్యాసాలు!

సూక్ష్మాంశాలతో  సజీవ రూపు ‘రేఖ’లకు తుది మెరుగులు దిద్దుతూ..  శంకర్

  
‘చందమామ’ పత్రిక  అంటే ఆహ్లాదపరిచే  కథలే కాదు; అపురూపమైన బొమ్మలు కూడా! 

ఎలాంటి బొమ్మలవి? 

కథలను అలంకరించేవీ, కథ చదవాలనే ఉత్సుకతను కలిగించేవీ.  వాటిలోని సహజమైన రూపురేఖలూ, పరిసరాలూ కథను సంపూర్ణంగా ఆస్వాదించేలా చేసేవి.  అంతర్లీనంగా .. చదివేవారి పరిశీలనా శక్తిని అద్భుతంగా పెంచగలిగేవి!      

చందమామ చిత్ర సౌథానికి నాలుగు స్తంభాలైతే.. వారు  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య;  చిత్రా, శంకర్ లు.  మొదటి ఇద్దరూ ప్రధానంగా ముఖచిత్ర రూపకర్తలు. చివరి ఇద్దరూ కథలను చిరకాలం గుర్తుండేలా చేసిన అజరామర చిత్ర లేఖనా శిల్పులు. 

వారిలో చందమామ వైభవ శకానికి తానొక్కరే సజీవ సాక్ష్యంగా ఉన్న శంకర్..  మొన్న సెప్టెంబరు 29న  కన్నుమూశారు.  

సంవత్సరాల తరబడి ఆయన గీసిన బొమ్మలు ఎన్నో తరాల మనసుల్లో నిలిచిపోయాయి.  ఆయన్ను ప్రత్యక్షంగా  చూడకపోయినా...  చిత్రాల అనుసంధానంతో,  అ అనుబంధంతో  ఎందరికో ఆత్మీయుడిగా నిలిచారు.  

నా బాల్యాన్ని-  

తన సున్నితమైన రేఖలతో, 

కనువిందైన రంగులతో, 

ముచ్చటైన నగిషీలతో, 

 ప్రశాంత ముని కుటీరాల,  

కీకారణ్యాల, 

అశ్వపద ఘట్టనల యుద్ధ ఘట్టాల, 

పౌరాణిక  రామణీయక దృశ్యాలతో  

సంతోషభరితం చేసిన.. చిత్రకారుడు శంకర్ గారి గురించి...

 దాదాపు 11 సంవత్సరాల క్రితం (30, నవంబర్ 2009)  ఇదే బ్లాగులో ఓ పోస్టు రాశాను. అందులోంచి కొంత.. 

--------------------

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

 
శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.


1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, 

భీష్ముడి అవక్ర పరాక్రమం, 

పాండవుల మహాప్రస్థానం; 

రాముడి అరణ్యవాసం, 

వాలి సుగ్రీవుల గాధ, 

వాలి వధ, 

హనుమంతుడి లంకా నగర సాహసాలు, 

వారధి నిర్మాణం, 

రామ రావణ యుద్ధం .. 

ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.


ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  

ఈ ఇద్దరు చిత్రకారులదీ  సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. 

అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  

చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’;  

శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’!  (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)


చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!

--------------------

ప్రస్తుతానికి వస్తే....

బేతాళ కథల బొమ్మ
బేతాళ కథలకు శంకర్  వేసిన విక్రమార్కుడి బొమ్మ (లోగో) ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఇది  గొప్పగా ఉందనటంలో సందేహమేమీ లేదు.  

కానీ -
 

శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే ఆ విక్రమార్కుడి బొమ్మను మొదట వేసింది ‘చిత్రా ’(1955  సెప్టెంబర్ సంచిక).  ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే.  దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. 

చిత్రా సృష్టించిన చిత్రమిదే.. 


ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్.  ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.  

శంకర్ మెరుగుపరిచిన  బొమ్మ

బేతాళ కథలకు శంకర్  పేటెంట్ చిత్రకారుడిలా ఎక్కువ బొమ్మలు వేశారు. 

బేతాళుణ్ణి  భుజాన  వేసుకుని, చెట్టు కొమ్మల్లోంచి దిగబోతున్న విక్రమార్కుడి బొమ్మ కూడా బాగుంటుంది. చిత్రా చిత్రించిన ఈ లోగోను మధ్యలో కొన్ని సంచికల్లో వరసగా  ప్రచురించారు. 
 
శంకర్ వేసినన్ని కాదు గానీ...  చిత్రా.. ఇంకా ఎంటీవీ ఆచార్య, బాపు.. తర్వాత కాలంలో రజీ, శక్తిదాస్ లు  బేతాళ కథలకు బొమ్మలు వేశారు.
 

చందమామలో శంకర్ తొలి బొమ్మలు...

1947 జులైలో ఆరంభమైన చందమామలోకి  శంకర్  1952 లో చేరారని తెలుసు.  కానీ  ఆ సంవత్సరం సంచికల్లో శంకర్ బొమ్మలేవీ లేవు.  బహుశా ఆయన  ఆ సంవత్సరాంతంలో చేరివుంటారు. 

ఆయన తొలి నాటి బొమ్మలు ఎలా ఉన్నాయి? వాటిని  చూడాలనే  ఆలోచన వచ్చింది.   

పాత సంచికలు తిరగేశాను, ఆసక్తిగా.

1953 జనవరి సంచికలో ఆయన మూడు కథలకు బొమ్మలూ, ఒక ఫీచర్ కు లోగో చిత్రించారు. 

సంచికలో మొదటగా కనిపించే ‘పాడుబుద్ధి’ కథకు వేసిన బొమ్మలను ఆయన మొదటి బొమ్మలనుకోవచ్చు. 


శంకర్ వేసిన  తొలి ఫీచర్ బొమ్మ

శంకర్ తొలినాటి ఓ  బొమ్మ... 

వీరబల్ (బీర్బల్) కథకు వేసిన బొమ్మ.. 1953 జనవరిలోదే

కథ మొత్తం కావాలంటే... ఈ నాలుగు పేజీలూ చదవండి..





అప్పట్లో ఆయన సంతకం ఇంగ్లిష్  కాపిటల్స్ లో  ఒద్దికగా ఉండేది. తర్వాత సంతకం.. మనందరికీ తెలిసినది- కుడివైపుకు ఏటవాలుగా వంగి,  స్వేచ్ఛగా స్మాల్ లెటర్స్ తో  ఉంటుంది. 

 
ఫిబ్రవరి 1953  చందమామ  సంచికలో దాదాపు అన్ని కథలకూ శంకరే వేశారు.  వీటిలో ఆలూరి బైరాగి, కొడవటిగంటి కుటుంబరావుల గేయమూ, కథా  ఉన్నాయి. 

కొడవటిగంటి  ‘అభేద్య’ కథ చివరి బొమ్మ ఇది. దీనిలో శంకర్  శైలి అనదగ్గ ‘నగిషీ’ మొదలైంది,  చూడండి.


ఆ నగిషీ తర్వాతి కాలంలో  చాలా చిత్రాల్లో ఉంటుంది. 

కింద ఈ రెండు బొమ్మలూ  చూడండి, ఆ నగిషీ ఎక్కడుందో గమనించండి.



సహజ ప్రతిభావంతుడైన శంకర్ గీతలో పరిణతీ, సాధికారతా ఆయన చిత్రించిన  రెండో సంచిక (1953 ఫిబ్రవరి) కల్లా  వచ్చేశాయి!

తర్వాతి  సంచిక... 1953 మార్చి నెలది.  ఈ సంచికకు శంకర్  ఏకంగా ముఖచిత్రమే వేసేశారంటే  ఆయన సామర్థ్యాన్ని  చందమామ ఎంతలా గుర్తించిందీ అర్థం చేసుకోవచ్చు!

శంకర్ వేసిన మొదటి ముఖచిత్రం

అలా ఆయన చందమామలో స్థిరపడిపోయారు.  క్రమంగా పౌరాణికాల చిత్రరచనలో స్పెషలైజ్  చేశారు.  

శంకర్ ప్రతిభ చందమామకే పరిమితం కాలేదు.  రామకృష్ణ ప్రభలో  కామిక్స్ లాంటి కొన్ని పౌరాణిక బొమ్మల కథలు వేశారు.  అవి పుస్తకాలుగానూ వచ్చాయి.


శంకర్ వేసిన పౌరాణికాల  బొమ్మలే  వేలల్లో ఉంటాయి.  ఆయన చిత్రలేఖన ప్రతిభను ప్రతిఫలించే  కొన్నిటిని  చూడండి.

    

వృత్రాసురుడి విజృంభణ


నరకుడి కొడుకు..భగదత్తుడు

భీష్ముడి యుద్ధ పరాక్రమంపై పాండవుల సమాలోచన

     దేవీ భాగవతం సీరియల్లో సింహ వాహినీ,  శ్రీ కృష్ణుడూ


కురుక్షేత్రంలో  క్రౌంచ (పక్షి) వ్యూహం

సీతాపహరణాన్ని అడ్డగిస్తూ రావణుడితో జటాయువు యుద్ధం

హనుమంతుడు చూస్తున్న లంకా నగర దృశ్యం

అనిరుద్ధుడి అదృశ్యం.. అతడి భార్యల కలవరం. దూరంగా ‘తాత’  శ్రీకృష్ణుడి సమాలోచనలు

శ్రీకృష్ణావతారం 

బేతాళ కథ చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా  (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)  చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


(చిత్రా కూడా ఈ బేతాళుడు చెట్టుమీదకు దూసుకుపోయే ఆఖరి పేజీ బొమ్మలు కొన్ని వేశారు.  విక్రమార్కుణ్ణి లాంగ్ షాట్లో  ఉంచి బేతాళుణ్ణి క్లోజప్ లో వేయటం చిత్రా స్పెషాలిటీ )
 
శంకర్ వేసిన ఆ బొమ్మలు కొన్ని ఇక్కడ చూడండి- 

 




















తన పౌరాణిక  బొమ్మల లోకంలో  శంకర్