సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

5, జులై 2009, ఆదివారం

హిమగిరి సొగసులు!


సంస్కృత మహాకవి కాళిదాసు రాసిన ‘కుమార సంభవం’ నాకు బాగా ఇష్టం.

హిమవత్పర్వత అద్భుత వర్ణనతో ఈ కావ్యం ఇలా ఆరంభమవుతుంది.

‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః ...’ అంటూ.

క్రీ.శ. 4-5 శతాబ్దాల్లో జీవించిన కాళిదాసు కవితా సౌందర్యం గురించి ఎందరో ఎన్ని రకాలుగానో చెప్పారు.

అరవిందుడి మాటల్లో- ‘‘కాళిదాసు ఏ విషయం ప్రస్తావించినా, ప్రవచించినా దాన్ని తన మధుర హస్తాలతో రస ప్లావితం చేస్తాడు. సౌందర్య శోభలతో తీర్చిదిద్దుతాడు.’’

కాళిదాసు వర్ణనల ప్రత్యేకత ఏమిటి?

అందమైన పద బంధాలతో, సకారణ తార్కాణాలతో, అనూహ్యమైన ఊహలతో ప్రకృతిని కళ్ళకు కట్టేలా కనికట్టు చేస్తాడు. ఎంత సూక్ష్మాంశం కూడా తన దృష్టిని దాటిపోదనిపిస్తుంది.

పొదలూ, పూలూ, పశువులూ పక్షులూ, గాలీ, ధూళీ ఆ కమనీయ కవితా స్పర్శతో అపురూపమైన ఉపమాలంకారాలతో సరికొత్తగా సాక్షాత్కరిస్తాయి.

హిమగిరి సొగసులన్నిటినీ ‘కుమార సంభవం’ ప్రథమ సర్గంలో పదహారు శ్లోకాల్లో ఇమిడ్చి అక్షరాభిషేకం చేశాడు కాళిదాసు.

ఈ హిమాలయాల వర్ణన యథాతథంగా ఉండే ఫొటోగ్రాఫిక్ చిత్రంలా ఉండదు.

చేయి తిరిగిన చిత్రకారుడు కావ్య కథా వాతావరణానికి తగ్గట్టు తన ఊహల ఉత్ప్రేక్షలతో రంగుల పరిమళం అద్ది తనివితీరా సృజించిన పెయింటింగ్ లా పలకరిస్తుంది.

యథార్థాన్ని కూడా నిరాకరించాలనిపించేలా సమ్మోహితం చేస్తుంది.

తొలి శ్లోకంలో హిమాలయాన్ని ‘దేవతాత్మ’గా సంభావించి నగాధిరాజు గా సంబోధిస్తాడు కాళిదాసు. రత్నాలూ, ఓషధులూ ఎన్ని ఉంటే మాత్రమేం... ఉన్నదంతా నిలువెల్లా మంచు మాత్రమే కదా ? అనే ప్రశ్న వేసుకొని, అయినా... అతడి ఘనత ఏమీ తగ్గదంటూ... అర్థవంతమైన అర్థాంతర న్యాసంతో హిమవంతుణ్ణి అలంకరిస్తాడు.

‘‘అనన్త రత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతమ్’’

ఎన్నోసద్గుణాలున్నవాళ్ళలో ఒక్క దుర్గుణం ఉన్నా ఫర్వాలేదులే అని దృష్టాంతంగా చంద్రుణ్ణి సపోర్టు తీసుకొచ్చేసి గడుసుగా సమర్థించేస్తాడు.

ఆ శ్లోకం రెండో పాదంలో ఇలా- ‘‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’’ చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య కళంకానికి నింద రాలేదు కదా అని అర్థం అన్నమాట.

హిమవత్పర్వతంలో ఏనుగులు తమ చెక్కిళ్ళ దురదలు పోగొట్టుకోవడానికి దేవదారు వృక్షాలకు రాచుకుంటే- ఆ చెట్ల నుంచి పాలు కారి ఆ పరిమళం కొండ చరియలకు వ్యాపిస్తుంటుందని ఓ శ్లోకంలో వర్ణిస్తాడు.

‘‘కపోల కండూః కరి భిర్వి నేతుం విఘట్టితానాం సరళ ద్రుమాణామ్
యత్ర స్రుత క్షీరతయా ప్రసూత స్సానూని గంధస్సుర భీకరోతి ’’
(సరళ ద్రుమాణామ్= దేవదారు చెట్ల)

నెమలి పింఛమంటే ఎవరికిష్టం ఉండదు? కాళిదాసుక్కూడా అంతేనన్పిస్తుంది.

ఆ పర్వతంలో వేట కోసం బోయవాళ్ళు వెళ్తే వారి అలసట తీర్చేలా చల్టని గాలి గంగ మీదుగా దేవదారు వృక్షాల సుగంధాలతో కలిసి వీస్తుందట. ఆ సమయంలో నెమళ్ళు తమ పింఛాలను విప్పటం వల్ల (‘‘భిన్న శిఖండి బర్హః ) గాలి వేగం తగ్గి, మందంగా వీస్తుందట.

హాయిగా సేదతీరటానికి మందానిలం అవసరమే కదా?

సూర్యుడి బారి నుంచి తప్పించుకు వచ్చి శరణు వేడిన చీకటిని హిమ శైలం తన గుహల్లో దాచుకుని రక్షిస్తోందంటూ మరో వర్ణన !

‘‘దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాన్ధకారమ్ ’’

‘‘సప్తర్షి హస్తాపచితావ శేషాణ్యధో వివస్వాన్ పరివర్తమానఃపద్మాని యస్యాగ్ర సరోరుహాణి ప్రబోధయత్యూర్థ్వ ముఖైర్మయూఖైః ’’

హిమవత్పర్వతం ఎంత ఎత్తుగా ఉందో చెప్పటానికి కాళిదాసు సప్తర్షి మండలం తో పోల్చి చెపుతున్నాడు. సప్తర్షి మండలం సూర్య మండలం కంటే ఎత్తు ఉంటుందని సంప్రదాయం.
ఆ రుషులు తమ దగ్గర్లో ఉన్న హిమాలయ శిఖరాల సరోవరాల్లో పూసిన పద్మాలను తమ పూజకు కోసుకుంటుంటారు. ఇక మిగిలిన పద్మాలను సూర్యుడు వికసించేలా చేస్తాడట.

కానీ ... సూర్యుడు ఆ సరోవరాల కిందసంచరిస్తుంటాడు కదా.. మరెలా? అందుకే... తన ఊర్థ్వ కరాలతో... అంటే పైకి వ్యాపించే కిరణాలతో (ఊర్థ్వ ముఖైః మయూఖైః ) పద్మాలను చేరి, విచ్చుకునేలా చేస్తాడట!

ఈ హిమవత్పర్వత షోడశ శ్లోకాల వర్ణనల్లో కిన్నరాంగనల మంద గమనాలూ, విద్యాధర యువతుల ప్రేమ లేఖలూ కనిపిస్తాయి. అప్సపరలూ, కింపురుష స్త్రీలూ కూడా తారస పడతారు.


ఏనుగులను వేటాడే సింహాలూ ... 
వాటిని మంచు గుర్తుల్లో వెంటాడే కిరాతుల పద ఘట్టనలూ ,  
చమరీ మృగాలూ, 
గుహలకు అడ్డంగా విచ్చేసే మేఘాలూ, 
కిన్నరులు పాడే... గాలిలో తేలే గాంధార షడ్జమాలూ ... 

ఇలా ఎన్నో దర్శనమిస్తాయి.

* * *

కాళిదాసు హిమవత్పర్వత వర్ణనలు చూసి, ఆయనది ఉజ్జయిని కాదూ, హిమాలయ పరిసర ప్రాంతమే అంటూ సందేహపడిన చరిత్ర కారులూ ఉన్నారు.

కాళిదాసును మన తెలుగు కవులు ఎన్నో సినిమాల్లో చాలా పాటల్లో స్మరించుకున్నారు.

‘కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి నీవే’

‘కాళిదాసుని దివ్య కావ్య కన్నియవోకణ్వముని కనువెలుగు శకుంతలవో’

‘ఏ శిల్పి కల్పనవోఏ కవి భావనవో కవి కాళిదాసు శకుంతలవో’

తరతరాలుగా హిమాలయాలు ఎందరికో కవులకూ, చిత్రకారులకూ, సామాన్యులకూ ప్రేరణ ఇస్తూనే ఉన్నాయి.

రష్యన్ చిత్రకారుడు నికొలస్ రోరిక్ కూడా హిమాలయాలతో గాఢంగా ప్రేమలో పడిపోతే, వెలిసిపోని వర్ణచిత్రాల ధారావాహికలు వెలిశాయి.  

(ఆయన గీసిన  వర్ణ చిత్రమే ఈ పోస్టు  మొదట్లో పెట్టినది...) 


అన్నట్టు- మన గొప్ప పౌరాణిక చిత్రం ‘పాండవ వనవాసము’ లో భీముడూ ద్రౌపదీ కలిసి, ఘంటసాల సుశీలల యుగళంలో హిమవన్నగ పరిసరాల్లో పాడుకున్న ‘హిమగిరి సొగసులూ’ పాట గుర్తుకు తెచ్చుకోండి.

‘‘హిమగిరి సొగసులూ
మురిపించును మనసులూ
చిగురించునేవొ ఏవో ఊహలూ ...

యోగులైనా మహా భోగులైనా
మనసు పడే మనోజ్ఞ సీమ
సురవరులూ సరాగాల చెలుల
కలసి సొలసే అనురాగ సీమ ’’

పాటకు ముందు హాయిగా తేలివచ్చే ఆలాపన కూడా ... ఎంత అద్భుతంగా ఉంటుంది!

ద్విజావంతి రాగంలో పొదిగిన... ఒదిగిన ఆ మాధుర్యం తలపులోకి వచ్చిందా?

సౌగంధిక పుష్ప సౌరభమెలా ఉంటుందో ఏమో గానీ అలాంటిదేదో అనుభూతిలోకి వస్తుంది కదూ !

‘‘ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి...
కేళి తేలి లాలించెనేమో’’


అంటూ ‘కుమార సంభవ’ గాధను ద్రౌపదీ భీములు స్ఫురణకు తెచ్చుకోవటం ఈ పాట విశేషం!


హిమాలయాల నిసర్గ సౌందర్యానికి అందమైన నివాళి ఈ పాట! మరి వింటారా ఓసారి?

ఇక్కడున్న లింక్ ను మీ టూల్ బార్ లో కాపీ చేసి, క్లిక్ చేస్తే సరి....
http://www.chimatamusic.com/playcmd.php?plist=578


9 వ్యాఖ్యలు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కృతజ్ఞతలు. ఇంతకన్నా ఏం చెప్పలేను...

కొత్త పాళీ చెప్పారు...

చాలా సంతోషం. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
మురళి చెప్పారు...

అబినందనలు...

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాశారండీ! అద్భుత వర్ణన చదువుతుంటే చప్పున హిమాలయాలు వెళ్ళొచ్చేయాలనిపిస్తోంది.అప్పుడప్పుడు ఇలాంటి రస భరితమైన టపాలు చదువుతూ ఉంటే ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత విశ్రాంతి దొరికినట్లు అనిపిస్తుంది.
థాంక్స్!

వేణు చెప్పారు...

మందాకిని, కొత్త పాళీ, సుజాత, మురళి, neelaanchala గార్లకు ధన్యవాదాలు!

Unknown చెప్పారు...

చాలా బాగుంది


వేణు చెప్పారు...


కవయిత్రి డా. ఎం.బి.డి. శ్యామల ఈ పోస్టుపై తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేశారు:

'' కాళిదాసు కవిత్వాన్ని ఇంక చక్కగా ఆవిష్కరించగలవని నేను అనుకోలేదు వేణూ. నువ్వే చెప్పినట్లు ఒక ఫొటోగ్రాఫ్ లా కాకుండా చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన అద్భుత చిత్రంలా హిమాలయాలను కళ్ళముందు దృశ్యీకరించావు. ఎన్నుకున్న ఉదాహరణలు కూడా కాళిదాసు కమనీయ కవితామూర్తిని సాక్షాత్కరింప చేయటానికి తగిన విధంగా ఉన్నాయి. హిమాలయాల్లోని గొప్పతనాన్ని, అపార సౌందర్యాన్ని వివిధ కోణాల్లో కాళిదాసు ఎంత చక్కగా వర్ణించాడో అంత చక్కగా దాన్ని అద్దం పట్టినట్టు ఆవిష్కరించావు.

ముందుగా ‘ఏకో హి దోషో..’ అని చెప్పి మొదలుపెట్టటం నీ సమీక్షకు ఇంకా వన్నెతెచ్చింది. కళాపిపాసువులైన మన కవులు ఎందరెందరు హిమాలయాలను వర్ణించారో చివర తెలియజేయటం ఈ వ్యాసానికి నిండుదనం చేకూర్చింది. రస పిపాసువుల దోసిట్లో కాళిదాసు కవితా మాధురిని నింపిన నీకు హృదయపూర్వక అభినందనలు!''

వేణు చెప్పారు...

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం- ఆంధ్రీకరణలపై పరిశోధన చేసిన మీరు ఈ కాళిదాసు వర్ణనల పోస్టుపై వెలిబుచ్చిన అభిప్రాయం విలువైనదిగా భావిస్తున్నాను. థాంక్యూ వెరీమచ్!