సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

21, డిసెంబర్ 2009, సోమవారం

విద్వేషాల గోలలో విజ్ఞతా స్వరం!


యప్రకాశ్ నారాయణ అంటే మీకు నచ్చకపోవచ్చు. ‘లోక్ సత్తా’ పార్టీ అంటే- మాస్ మసాలా సినిమాల వెల్లువలో ఎవరికీ పెద్దగా పట్టని ‘ఆర్ట్ ఫిల్మ్’  అనిపించొచ్చు. ఆ పార్టీ రాజ్యాంగ బద్ధంగా ప్రతిపాదించిన ‘జిల్లా ప్రభుత్వాల’ ఏర్పాటు మీకైనా, నాకైనా అసలు రుచించకే పోవచ్చు!


కానీ ప్రస్తుత సంక్షుభిత రాజకీయ, సామాజిక వాతావరణంలో, ఈ  నిరాశా తిమిరంలో  జయప్రకాశ్ నారాయణ (జేపీ) వైఖరి నాకు గోరంత దీపంలా తోస్తోంది.


ద్వేష భాషకు ప్రాంతం తేడా లేదు. విద్వేష భావనకు విచక్షణతో పనిలేదు.

అందుకే కదా,  ఇతర ప్రాంతాల వారిని వ్యతిరేకించటమే ‘సొంత’ ప్రాంతాభిమానంగా చెలామణీ అవుతోంది! అసహనం, క్రోధం... ఎవరికైనా ప్రమాదకరమని హితవు చెప్పేవారు అరుదైపోతున్నారుగా?

విధ్వంసమే సాహసంగా,
ఉన్మాదం వీరాభిమానంగా,
ద్వేష తీవ్రత... తీవ్ర భావోద్వేగంగా - చలామణీ అయిపోతోందిగా?


ఉత్సాహానికి ‘డౌన్ డౌన్’ నినాదాలు ప్రతీకలవుతున్నాయి. తగలబడుతున్న భవనాలు,

తగలబెడుతున్న దిష్టిబొమ్మలు, ధ్వంసమవుతున్న కార్యాలయాల దృశ్యాలు టీవీల తెరలంతా ఆక్రమించేస్తున్నాయి.

బంద్ లూ, రాస్తారోకోలూ , రైల్ లోకోల మూలంగా సామాన్య ప్రజలు నలిగిపోవటం అందరికీ అనుభవమే కదా? విద్యార్థుల చదువులు అటకెక్కటం చూస్తూనే ఉన్నాం.

ఆవేశాగ్నులు రగిల్చే ‘నాయకులకు’ కొదువ లేకుండా పోతోంది.


లాంటి గందరగోళంలో విజ్ఞతాయుతమైన గొంతు... సామరస్య స్వరం వినిపిస్తే అదెంత ఊరటగా ఉంటుంది?

జేపీ చేసింది అదే!

ఉద్రేకపూరిత వాతావరణం చల్లారాలని ఆకాంక్షిస్తూ ‘సామరస్య పరిష్కారం’ కోసం ప్రయత్నం చేసిన నాయకులు జేపీ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ( ఆయన ప్రయత్నం ఫలితమిస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. )


ఢిల్లీలో మూడు రోజులపాటు కేంద్రంలోని ముఖ్య నాయకులతో, రాజకీయ పార్టీల పెద్దలతో సంభాషణలు జరపటంలో ‘గొప్ప’ ఏమీ లేకపోవచ్చు. 

కానీ ‘ఒక పౌరుడిగా బాధ్యత తీసుకుని’ ఈ ప్రయత్నం చేసినందుకు జేపీని అభినందించవద్దా?

ఎంతసేపూ- ఈ వివాదంలో ప్రజల భావోద్వేగాల నుంచి రాజకీయ ప్రయోజనాలు సాధిద్దామనే సంకుచిత దృష్టి పెరగటమే తప్ప ... ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నాశనమవుతోందని ఆలోచించేవారే  అరుదైపోతున్నారు! 

..... ఇలాంటి  పరిస్థితుల్లో  జేపీ చర్య  ఆశా కిరణంలా  భాసిస్తోంది!


.........

ప్రస్తుత వివాదానికి సంబంధించి  జయప్రకాశ్ నారాయణ భావాలను ఇక్కడ ఇస్తున్నాను.  (ఆలోచించండి.. ఇవి  నచ్చినా, నచ్చకపోయినా సరే!).


*  తాజా సంక్షోభం రాజకీయ దివాళాకోరు తనానికి ప్రబల నిదర్శనం. ఇది తెలుగు ప్రజల భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం.


ప్రధాన పార్టీలు ముందొక మాట చెప్పటం... తర్వాత అవసరం తీరగానే ఆ మాట తప్పడం, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం... వీటి పర్యవసానమే రాష్ట్రంలోని నేటి సంక్షోభం!


పార్టీల హద్దులు చెరిగిపోయాయి. ప్రతి పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని నాయకులే చెబుతున్నారు. సిద్ధాంతాల ఊసే లేదు.

*  (మన నేతలు) తాత్కాలిక ప్రయోజనాల కోసం విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరగవు. రాష్ట్రం విడిపోతే కొంపలు మునిగిపోవు. తెలంగాణా ఇచ్చినా ఒక్కటే; సమైక్యాంధ్రగా ఉన్నా ఒక్కటే. రేపు తెలంగాణా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. అంతకంటే ఎక్కువగా దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ లోగా మూడు దశల్లో మధ్యంతర ఏర్పాట్లు చేపట్టాలి.

*  ప్రజలు ఉద్వేగాలకు లోనుకాకుండా తమ భావాలను శాంతియుతంగా, ప్రజాస్వామికంగా వ్యక్తం చేయాలి. అప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వీలవుతుంది!
                       
   
                                                          *                 *                * 


‘మోహన’ గారి ‘విశాల ప్రపంచం’ బ్లాగులో  జయప్రకాశ్ నారాయణ గారితో టీవీ 9 ఇంటర్ వ్యూ
భాగాలున్నాయి; ఇక్కడ   చూడండి!

13 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అసంఖ్య చెప్పారు...

you right. there is nothing much we can do except trusting JP.

Ravi చెప్పారు...

>>ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరగవు. రాష్ట్రం విడిపోతే కొంపలు మునిగిపోవు. తెలంగాణా ఇచ్చినా ఒక్కటే; సమైక్యాంధ్రగా ఉన్నా ఒక్కటే. రేపు తెలంగాణా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. అంతకంటే ఎక్కువగా దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు

దీనితో నేను కూడా అంగీకరిస్తాను. కాకపోతే ఇప్పుడున్నది అలాగే ఉంటే అదనపు సమస్యలు( రాష్ట్ర విభజన అంటే సవాలక్ష సమస్యలుంటాయి కదా) రావు అన్నది నా అభిమతం. ఇలాంటి విషయాలు ప్రజలకు నచ్చజెపుతున్న జీపీ అభినందనీయులు. తటస్థ థృక్పథం లో ఉన్న మరికొంత మంది నాయకులు కూడా ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రజల్లో ఆవేశకావేశాలు తగ్గుతాయి.

రవి చెప్పారు...

స్థానిక ప్రభుత్వాల గురించి జేపీ గారు ఇదివరకు చాలా సార్లు, వివరణాత్మకంగా చెప్పారు. ఆయనలా అంటుంటే, సిగ్గుమాలిన రాజకీయవాదులు మాత్రం, ప్రతీదానికి కేంద్రం, కేంద్రం అంటూ పరిగెడుతూ ఉన్నారు. జేపీ వంటి నిజాయితీ గల నాయకులు కనీసం పాతికమందైన కావాలి, ఈ రాష్ట్రానికి.

durgeswara చెప్పారు...

జెపీలాంటి నిజాయితీ పరుల మాటలను విని ఆలోచించే సహనం ప్రస్తుతం రాష్ట్రం లో లేదు . వ్యూహాత్మకంగ ప్రతిదానికి ఉద్వేగానికి గురై ఆందోలనతో బ్రతికేట్లు శిక్షన మొదలైనది జనం పైన. అనేక మార్గాలద్వారా ఈ ఉన్మాద స్థితిని పెంచుతున్న శక్తుల కుట్రలు మరెన్ని అనర్ధాలను సృష్టించనున్నాయో !

వేణు చెప్పారు...

సుజాతా ! జేపీ విజ్ఞతా స్వరం టపాపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

> "రాష్ట్ర విభజన" కేవలం మాప్ లో ఒక గీత ఏర్పడటమే అన్నది పూర్తిగా సత్యం కాదు....

ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వకూడదనే దృష్టితోనే జేపీ ఇలా చెప్పారనుకుంటాను.


ధవళ సోమశేఖర్, థాంక్యూ!


రవిచంద్ర, తటస్థ దృక్పథం ఉన్న ‘మరికొంత మంది నాయకులు’ ఎక్కడున్నారు? ప్రజల్లో ఆవేశ కావేషాలు రెచ్చగొట్టటంలో మునిగిపోయినవాళ్ళే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు కదా! మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

రవి గారూ, జేపీ లాంటి నాయకులు పాతికమంది కాదు, పదిమందైనా దొరకటం చాలా కష్టం కదూ? మీ అభిప్రాయానికి థాంక్యూలు.


durgeswara గారూ, ‘ఉన్మాద స్థితిని పెంచుతున్న ’ పరిస్థితిపై మీ ఆవేదనే ఆలోచనా పరులందరి ఆవేదన కూడా. ధన్యవాదాలు!

Saahitya Abhimaani చెప్పారు...

తెలంగాణా ప్రాంత ప్రజలు వేర్పాటు మీద ఎందుకు మక్కువ చూపుతున్నారు, 1972-73లో సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, తెలంగాణ వేర్పాటువాదులు ఆ ఉద్యమానికి దన్నుగా నిలవలేదు. కారణం తెలియదు. 1969 తెలంగాణా ఉద్యమానికి ఆంధప్రాంత ప్రజల మద్దతు లేదు. అప్పుడే కనుక రెండు ప్రాంతాలలోనూ వేర్పాటు వాదాలు వినిపించి ఉంటే ఏమయ్యేదో మరి! ఒక ప్రాంతం వారు "ప్రత్యేకం" అన్నప్పుడు రెండో ప్రాంతం వారు మిన్నకుండటం, లేక సమైక్యతా రాగం వినిపించటానికి గల కారణాలు మూలాలోకి వెళ్ళి విశ్లేషించి పరిష్కారం కనుగోవాలి. 1972-73లో, తెన్నేటి విశ్వనాధం వంటి నిస్వార్ధ నాయకుని నాయకత్వంలో 350మందిని బలి చేసుకుని ఒక ఆరు నెలలపాటు సీమాంధ్ర ప్రాంతం అంతా అతలా కుతలం అయిపోయి, పూర్తిగా సి ఆర్ పి దళాల చేత నిర్ద్యాక్షిణ్యంగా అణచి వేయబడినది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. మళ్ళీ ఇప్పుడు అదే ప్రాంతంలో (అప్పటి తరం వారసులు)సమైక్యతా రాగం ఆలపిస్తున్నారు.ఇది 37 సంవత్సరాలలో వచ్చిన మార్పా లేక పరిణితా!

అటు తెలంగాణాలో గాని, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోగాని రోడ్ల మీదకి వచ్చి బస్సులు తగలపెడుతూ, బందులు చేస్తూ నానా రగడ చేస్తూ ఉండేవారే ప్రజా అభిప్రాయానికి దర్పణం పడుతున్నట్టా?? ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, అనవసరంగా బయటకి రాకుండ,అవేశ కావేశాలకు లోను కాకుండా తమ పనేదో తాము చేసుకుంటూ, తానొవ్వక ఇతరులను నొప్పింపక, తప్పించుకు తిరుగుతూ జీవించే ఉన్న అనేక కోట్లమంది సామాన్య ప్రజా మనోగతం తెలుసుకునేదెట్లా?

ఎప్పటికప్పుడు తాత్కాలికమైన పరిష్కారాలను కనుగొనే అతి తెలివిగాళ్ళను(అన్ని పార్టీలలోను ఉన్న "హైకమాండు" గా పిలవబడుతున్న "జోకర్ల గుంపు"), దశాబ్దాలనుండి రాజకీయాలలో ఉంటూ మంత్రి పదవులను ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ వేర్పాటు/సమైక్యతా వాదాలను, తమకు అవసరం అనిపించినప్పుడు మాత్రమే రాజకీయ సోపానంగా వాడుకుంటూ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళను పక్కనపెట్టి, సామాన్య ప్రజలలోనుండి అన్ని వర్గాలనుండి నిస్పక్షపాతంగా, ఆవతలి వారి అభిప్రాయాలను, అర్ధంచేసుకుంటూ గౌరవించగలవారు ఒక వేదిక మీదకు రాగలిగి చర్చీంచగలిగితే గాని ఈ సమస్యకు నిజాయితీ ఐన, కలకాలం మన్నగలిగిన పరిష్కారం దొరకదు. ఈ ఉత్కృష్టమైన పని చెయ్యగల సత్తా, చేవ, నిజాయితీ గా వ్యవహరించగల అందరి గౌరవ మన్ననలు పొందే నాయకుడు/లేదా పత్రిక/టి వి మన దురదృష్టం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనె లేడు/లేదు. అందుకనే ఇలా మనం 20-30 ఏళ్ళకు ఒకసారి ఇటువంటి ఉత్పాతాలను ఎదుర్కోవలసి వస్తున్నది.

వేణు చెప్పారు...

శివ గారూ, ప్రజలు ఎప్పుడూ విధ్వంసానికీ, హింసాత్మక చర్యలకూ వ్యతిరేకమే!

‘తెలంగాణాలో గాని, ఇటు సీమాంధ్ర ప్రాంతంలోగాని రోడ్ల మీదకి వచ్చి బస్సులు తగలపెడుతూ, బందులు చేస్తూ నానా రగడ చేస్తూ ఉండేవారు’ ప్రజాభిప్రాయానికి దర్పణం పడుతున్నట్టు కానే కాదు.

ప్రాంతీయ ఆకాంక్ష వేరు; విధ్వంస కాండ వేరు. విచక్షణ లేనిది ఉద్యమం కానే కాదు- అది ఏ ప్రాంతానిదైనా సరే!

మీరన్నట్టు- ‘సామాన్య ప్రజలలోనుండి అన్ని వర్గాలనుండి నిష్ఫక్షపాతంగా, అవతలి వారి అభిప్రాయాలను, అర్ధంచేసుకుంటూ గౌరవించగలవారు ఒక వేదిక మీదకు రాగలిగి చర్చించగలిగితే’ ఎంత బావుంటుంది!

మోహన చెప్పారు...

నమస్తే వేణు గారు,

నా బ్లాగ్ లింక్ మీ టపాలో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఐతే, లింక్ తప్పు ఉంది గమనించగలరు.

వేణు చెప్పారు...

మోహన గారూ,
తెలంగాణా గురించి జేపీ అభిప్రాయాలను ఆలోచనా పరులందరూ పరిశీలించాలనేది నా ఆకాంక్ష.
ఇక- మీ బ్లాగ్ లింక్ ‘ఇప్పుడు ఇచ్చిన పద్ధతి’లో సరిగానే ఉంది!

kanthisena చెప్పారు...

మీ పోస్ట్ ప్రేరణతో నా బ్లాగులో తెలంగాణాపై రంగనాయకమ్మగారు పేరిట ప్రచురించిన పోస్ట్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. నాబ్లాగులో అత్యంత ప్రాచుర్యం పొందిన పోస్టులలో ఇది రెండో స్థానంలో నిలిచింది. వ్యాఖ్యల కంటే చదవడం ద్వారా పాఠకులలో దీనికి వచ్చిన స్పందనను చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. దానిపై కామెంట్లను మళ్లీ ఓ సారి చూడగలరు.

రాష్ట్ర విభజన అనేది మనందరి భావోద్వేగాల పరిమితులను దాటి ఓ స్పష్టమైన విభజన దిశగా అడుగేస్తోందనే నా ప్రగాఢాభిప్రాయం. వికృత రాజకీయ క్రీడలను మనం ఎంత అసహ్యించుకున్నప్పటికీ రాష్ట్ర విభజన తప్పనిసరి అనే అంశాన్ని మనందరం గుర్తించక తప్పదు. గత 50 ఏళ్లుగా ఎవరికి ఎంత అన్యాయం జరిగిందని లెక్కలు తేల్చటం కన్నా విడిపోవడం తప్పని చారిత్రక అనివార్యతను మనందరం గుర్తించక తప్పదు.

సమైక్యాంధ్ర భావన ఓడిపోయింది. ఇక ఎంతమంది అతుకులు వేసినా ఇది అతకదు. ఈ వాస్తవాన్ని అందరం గుర్తిస్తే కనీసం విడిపోయే సమయంలో అయినా సామరస్య ధోరణికి అలవాటుపడవచ్చు.

నిజంగా మీ తాజా పోస్టింగులో జయప్రకాష్ నారాయణ్ గారన్నట్లు "రేపు తెలంగాణా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. అంతకంటే ఎక్కువగా దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు." ఈ 'గీతా' సారాన్ని జెపీ ఎంత సులువుగా చెప్పేశారు!

రాజు.

అజ్ఞాత చెప్పారు...

konni nijalu

http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/28/%E0%B0%9A%E0%B1%87%E0%B0%A6%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%82-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95/