సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

17, జనవరి 2010, ఆదివారం

‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’... ఈనాడు సమీక్ష!

రంగనాయకమ్మ గారి కొత్త రచన ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ ఈ మధ్యే విడుదలైంది.
 ఈ పుస్తకంపై నేను రాసిన సంక్షిప్త పరిచయం ఇవాళ (జనవరి 17) ‘ఈనాడు ఆదివారం’లో వచ్చింది.


ఈ పుస్తకం చదవడం అంటే అసలైన ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడం మొదలుపెట్టడం. పిల్లల కోసం ఉద్దేశించింది కాబట్టి ప్రాథమిక విషయాలే ఉంటాయి. అయినా అవి చాలామందికి తెలియనివి. ఇవి తెలుసుకోవడం పెద్దవాళ్ళకు కూడా అవసరమే కదా?


మన జీవిస్తున్న సమాజం ఎలా ఉంది? అందులో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనేవి కనీసంగా తెలుస్తాయి ఈ పుస్తకం చదివితే.


జటిలమైన ఆర్థిక శాస్త్ర విషయాలను హైస్కూలు స్థాయి పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా రాశారు రంగనాయకమ్మ గారు.

ఈ  పుస్తకం...  ఈ-బుక్ గా కినిగెలో లభిస్తోంది. లింకు- 

http://kinige.com/kbook.php?id=950&name=Pillala+Kosam+Ardhika+Sastram



బొగ్గు కంటే బంగారానికి విలువ ఎక్కువని మనందరికీ తెలుసు.

ఎందుకనో ఎప్పుడైనా ఆలోచించారా?


‘బొగ్గు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. బంగారం ఎక్కడో కానీ దొరకదు. అందుకే దానికంత విలువ’ అనే సమాధానం తడుతోంది కదూ!


కానీ ఇది నిజం కాదు. ఏ వస్తువుకు ఉన్న విలువ అయినా ఆ పదార్థానిది కాదు. ఆ వస్తువు కోసం జరిగిన శ్రమలదే. బంగారం సంగతైనా ఇంతే!


భూమిలో నుంచి కిలో బరువున్న బొగ్గును తవ్వడం కోసం చెయ్యాల్సిన శ్రమ 2 గంటలనుకుందాం. కిలో బంగారాన్ని తవ్వాలంటే దానికి వేల రెట్ల శ్రమ అవసరమవుతుంది. ఎక్కువ శ్రమకు ఎక్కువ విలువ. తక్కువ శ్రమకు తక్కువ విలువ.


బంగారానికి ఎక్కువ శ్రమ పట్టడానికి కారణం, తక్కువగా దొరుకుతుంది కాబట్టే !

అన్ని దేశాల్లోనూ అసలైన డబ్బు బంగారమే. కాయితం డబ్బుకి గానీ, ఇంకో రకం డబ్బుకి గానీ అసలు మూలం బంగారమే. బంగారం బిళ్ళలు చలామణిలో తిరిగితే అరిగిపోతాయి కాబట్టి, ఆ తిరిగే పని బంగారం బిళ్ళకి బదులు కాయితం ముక్క చేస్తోంది. ప్రపంచ ధనం మాత్రం బంగారమే!



నుషులు ఏ శ్రమలూ చెయ్యకుండా, ఒక రోజు నుంచీ హఠాత్తుగా శ్రమలన్నీ మానేస్తారని ఊహించండి. అప్పుడు ఏం జరుగుతుంది?


పొలాల్లో పనులూ, ఇతర పనులూ మానెయ్యాలి.

వంటలు మానెయ్యాలి.

బట్టలు ఉతుక్కోవడం, ఇళ్ళు శుభ్రం చేసుకోవడం, నీళ్ళు తెచ్చుకోవడం అన్నీ మానెయ్యాలి.

అప్పుడు-

ఇళ్ళల్లో సిద్ధంగా ఉన్న పళ్ళూ రొట్టెలూ లాంటివి ఉంటే తింటారు. సిద్ధంగా ఉన్న నీళ్ళు తాగుతారు. 2, 3 రోజులు అయ్యేటప్పటికి అన్నీ అయిపోతాయి. తర్వాత పిల్లలకు తిండి ఉండదు. తాగే నీళ్ళు ఉండవు. వెంటనే జబ్బులు మొదలవుతాయి. వైద్యం చేయడం ఆగిపోతుంది కాబట్టి ఏ మందూ ఉండదు. 2 రోజుల్లోనే, మొదట పిల్లలు చచ్చిపోవడం మొదలవుతుంది.


తర్వాత, అప్పటికే జబ్బులతో ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. మంచి నీళ్ళు కూడా లేక, 3 రోజుల్లోనే చాలా జనం చచ్చిపోతారు. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు అక్కడే పడివుంటారు. వాళ్ళని పూడ్చి పెట్టడాలూ, దహన క్రియలూ లాంటి పనులేవీ జరగవు. జంతువులకు తిండీ నీళ్ళూ ఆగిపోతాయి కాబట్టి, అవీ పడిపోతాయి. జంతువులూ, పిల్లలూ, పెద్దలూ అందరూ, ఇళ్ళలోనూ, వాకిళ్ళలోనూ, రోడ్ల మీదా చచ్చిపడివుంటారు.

 ఘోరాన్ని భరించలేక, ఎలాగైనా బతకాలనుకునేవాళ్ళు, అడవుల్లోకి పరిగెత్తుతారు. అక్కడ చెట్ల మీద ఏమన్నా దొరికితే తాగుతారు. అలా, ఆకలితో మాడుతూ, చెట్ల కింద తిరుగుతూ, కొన్నాళ్ళు గడుపుతారు. బట్టలన్నీ పీలికలైపోయి, ఆఖరికి నగ్నంగా మిగులుతారు. బట్టలు పోయిన క్షణం నించీ ఇక వాళ్ళు, జంతువులే. మానవ జంతువులు. జంతువులైతే అడవుల్లో హాయిగానే బతుకుతాయి. మానవ జంతువులు, అడవుల్లో ఎన్నో రోజులు బతకలేరు.

అంటే- మనుషులందరూ శ్రమలన్నీ మానెయ్యడం జరిగితే, మొత్తం మానవ సమాజమే అంతర్థానమైపోతుంది!

శ్రమలే చెయ్యకుండా మనుషులు జీవించడం ఏనాటికీ సాధ్యం కాదు!


స్తువుకు ఉండే విలువ గురించి పరిశోధన 2 వేల ఏళ్ళకిందటే ప్రారంభమైంది. ఈ పరిశోధన గ్రీకు మేధావి అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) తో మొదలై, ఇంగ్లండ్ మేధావి రికార్డో (క్రీ.శ. 1772-1823) ద్వారా 2 వేల ఏళ్ళ పాటు సాగింది. 1867లో కార్ల్ మార్క్స్ ‘విలువ’ పరిశోధనలో ‘శ్రమ దోపిడీ’ రహస్యం బయటపడింది.


ఈ పుస్తకం చదివితే...ఇలాంటి విషయాలెన్నో తెలుస్తాయి. మన చుట్టూ ఉంటూ, మనం గమనించని, అర్థం చేసుకోని  చాలా విషయాలు!

6 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

థాంక్యూ. నిజమే, - ఈ పుస్తకానికి బొమ్మలు వేసిన విజయనగరం డ్రాయింగ్ టీచర్ చింతాడ అప్పలరాజు గారి పేరు రాయటం మర్చిపోయాను.

ఆయన వేసిన కొన్ని బొమ్మలు చాలా బావున్నాయి. పేదల, ధనికుల తారతమ్యాలు చూపే చిత్రాలను ఆయన చక్కగా చిత్రించారు. ముఖ్యంగా- గుహల్లో బతికే ఆదిమ మానవుల బొమ్మా, శ్రమలన్నీ ఆగిపోతే ఏమవుతుందో తెలిపే బొమ్మా నాకు నచ్చాయి.

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

అయితే చదవాల్సిందే.... :)

SURYA చెప్పారు...

Very interesting. I am being tempted to buy and read this book.

kanthisena చెప్పారు...

రంగనాయకమ్మ గారు 'జానకి విముక్తి' కాలం నుంచి, అంతకుముందు నుంచి కూడా సామాజిక జ్ఞానాన్ని సులభశైలిలో రాస్తూ వస్తున్నారు. పిల్లలకోసం ఆర్థిక శాస్త్రం అనేసరికి మరింత సులువుగా, స్పష్టంగా రాసినట్లుంది. ఏమయినా ఆమె కలం ఇంత పెద్దవయసులో కూడా పరుగులు తీస్తూనే ఉంది. "పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం" మనలో ఎవరికయినా ఇలాంటి ఊహ ఇంతవరకూ తట్టిందా? అందుకే ఇలాంటివి ఆమెకే చెల్లు. మీకు అబినందనలు..

వేణు చెప్పారు...

@ విశ్వప్రేమికుడు,

@ Surya: ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ పుస్తక సమీక్షపై మీ స్పందనలకు ధన్యవాదాలు.

@ Chandamama: రాజు గారూ, సులభశైలిలో వివరించటం రంగనాయకమ్మ గారికి ‘పెన్నుతో పెట్టిన విద్య’. ‘పునరుక్తి’ అనిపించేంత సరళంగా, స్పష్టంగా ఆమె రాస్తారని చేరా గారనుకుంటాను, ఓసారి రాశారు! థాంక్యూ.