సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జనవరి 2010, శుక్రవారం

జానపద కథల మాంత్రికుడే కానీ... బేతాళ కథల సృష్టికర్త కాదు!

ర్తమాన చరిత్రకు వార్తా పత్రికలు అద్దం పడతాయంటారు. అయితే, ‘Journalism is literature in a hurry' కాబట్టి వాటిలో పొరపాట్లు కూడా సహజమేనని సరిపెట్టుకోవాలేమో.

అద్భుత జానపద ధారావాహికలతో  తరతరాల ‘చందమామ’ పాఠకులను ఉర్రూతలూగించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి మరణ వార్తను పాఠకులకు అందించటానికి ప్రయత్నించిన పత్రికలను అభినందించాల్సిందే.

అయితే-

బుధవారం (జనవరి 27) విజయవాడలో కన్నుమూసిన ఆ జానపద కథల మాంత్రికుడి  గురించి రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్లో factual error దొర్లింది.

‘భేతాళ మాంత్రికుడు ఇక లేరు’అని శీర్షిక ఇచ్చిన పత్రిక ఆయన్ను ‘భేతాళ కథల సృష్టికర్త’గా అభివర్ణించింది.బేతాళుణ్ని భేతాళుడిగా రాయటం కాదు- ఇక్కడ సమస్య.

మరో పత్రిక ‘ఆగిన ‘చందమామ’ బేతాళ కథ’ అనే శీర్షికను ఇచ్చింది.‘బాల కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన బేతాళ కథలను దాసరి సృష్టించారు.ఐదు దశాబ్దాలపాటు బేతాళకథలు రాశారు’ అని పేర్కొంది.

వాస్తవానికి- దాసరి గారు బేతాళ కథల సృష్టికర్త కాదు!

చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావు గార్ల ఆలోచనలే చందమామలో బేతాళ కథలకు నాంది పలికాయి. 1980 తర్వాత మరో పాతికేళ్ళపాటు దాసరి గారు సంపాదక వర్గ సభ్యుడుగా బేతాళ కథలను పర్యవేక్షించినా, ఆయన ప్రధాన రచనా వ్యాసంగాన్ని ఆ కథలతో ముడిపెట్టటం సరి కాదు.


అసలు సుబ్రహ్మణ్యం గారి మౌలిక కృషి అజరామరమైన జానపద ధారావాహికలు. చందమామ పాలసీ మూలంగా ఆయనకు దక్కాల్సిన పేరు దక్కనే లేదు.జానపద సీరియల్స్ ను ఏళ్ళ తరబడి ఆనందించిన పాఠకులు కూడా రచయిత ఎవరో తెలియక, ఆయన్ను గుర్తుంచుకోలేదనిపిస్తుంది.


అసలు కృషిని సరిగా పట్టించుకోకుండా, దాసరి గారికి నేరుగా సంబంధం లేని కీర్తిని  ఆపాదించటం ఆయనకు గౌరవం కాదు!


దశాబ్దాల తరబడి, సాహిత్య సృష్టి చేసిన రచయితల కృషి గురించి కూడా ఇలా తారుమారు జరుగుతున్నపుడు-

ఇరవై ఒకటో శతాబ్దంలో,సమాచార యుగంలో కూడా ఇలాంటి దుస్థితా? అనిపిస్తోంది!


....

'I am overstay here' అని తన పెద్ద వయసు గురించి జోక్ వేసుకున్న అపురూప రచయిత దాసరి గారు.


‘కొ.కు.గారు 1980లో నాకన్న ముందుపోవడం నాకు తీరని ఆవేదన’ అంటూ బాధపడి, ఆ మాటలన్న ఎనిమిది మాసాలకే  జీవితం చాలించారు.


2009 మేనెల మొదటివారంలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో రెండోసారి (చివరిసారి) కలిశాను.ఆయనకు వినికిడిశక్తి తగ్గిపోవటంతో  రైటింగ్ పాడ్ మీద ఒక్కో ప్రశ్న రాసిస్తే, దానిమీదే స్వయంగా సమాధానాలు రాశారు.


సిగరెట్ తాగుతూ ఆ పొగ లోపలి గదిలోకి వెళ్ళకుండా ఆ తలుపు మూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. స్మృతులను నెమరువేసుకున్నారు. ‘స్మోకింగ్ ని మాత్రం వదల్లేకపోయాను’అని ఒప్పుకున్నారు, అడక్కుండానే.



‘మీ జానపద సాహిత్యానికి ప్రేరణ ఏమిటి?’ అని అడిగినప్పుడు చాలా సంతోషించారు.అది ఆయన మొహంలో వ్యక్తమవ్వలేదు కానీ, ‘మేలిమి బంగారంలాంటి ప్రశ్న అడిగారు’ అంటూ సమాధానం ప్రారంభించినపుడు ఆయన సంతోషం  అవగతమయింది.



2008లో  దసరా రోజున విజయవాడలో ఆయన అడ్రస్ అన్వేషించి , నివాసానికి వెళ్ళి తొలిసారి దాసరి గారిని చూడబోతున్నపుడు ఎంత ఉత్కంఠ అనుభవించానో ఇప్పటికీ గుర్తొస్తోంది. ఇంటిలోపల్నుంచి మెల్లగా నడిచొచ్చిన పొడుగ్గా, బలహీనంగా ఉన్న వృద్ధమూర్తిని చూడగానే సంబరంగా ‘ఈయనేనా అంతటి అద్భుత రచనలు చేసిన రచయిత!’ అనుకోకుండా ఉండలేకపోయాను.


ఆయన జీవన సంధ్యలో రెండు సార్లు వ్యక్తిగతంగా కలుసుకోగలిగాననే తృప్తి మాత్రమే ఇప్పుడు మిగిలింది.


ఇచ్చిన విజిటింగ్ కార్డును వెనక్కి తిప్పి, నేను ఆయన్ను కలిసిన  తేదీని ఎంత శ్రద్ధగా రాసుకున్నారో.

 ఇంటర్వ్యూ చేసిన గుర్తుగా ఆయన ఏటవాలు చేతిరాతతో ఉన్న రైటింగ్ ప్యాడ్ దీనంగా,విషాదంగా...నా దగ్గర!


...


మంత్రముగ్ధులను చేసే దాసరి సుబ్రహ్మణ్యం గారి కథా కథన శైలి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుందాం-

‘హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ, ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు ఎత్తి, బాణాలు ఎక్కుపెట్టేలోపలే, రెండు సింహాలు గర్జించుతూ వారికేసి దూకినై. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కివున్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగినై.’ (జ్వాలాద్వీపం)

‘హేయ్, కాలభుజంగా!కంకాళా!రండి,రండి!ఆ చతుర్నేత్రుణ్ణి వెతికి పట్టి హతమార్చండి!’అనే ప్రళయ భీకర నాదం దశదిశలా వ్యాపించింది’ (తోకచుక్క).


...


చందమామ చరిత్ర బ్లాగు లో రాజు గారు నిన్న (గురువారం) సమగ్రంగా రాసిన టపా కూడా చూడండి.

6 కామెంట్‌లు:

duppalaravi చెప్పారు...

మనసును తాకిన మాటలు రాశారు. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
amma odi చెప్పారు...

చిన్నప్పుడు మేము, ఇప్పుడు మా పాప ఆ కథలని ఎంత ఆనందించామో! రచయిత ఎవరో తెలియక పోయింది. ఇప్పుడు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు! బహుశః ఈ టపా చదవకపోయి ఉంటే ఎప్పటికి దాసరి సుబ్రమణ్యం గారి గురించి తెలుసుకోలేకపోయే వాళ్ళమేమో! మరో సారి నెనర్లు!

Ravi చెప్పారు...

మీకు సరే నిజాలు తెలుసు కాబట్టి పొరబాటని సరిపెట్టుకున్నారు. అసలు నిజం తెలియని మాలాంటి వాళ్ళు వార్తాపత్రికల్లో చూసి అదే నిజమనుకోవాలి.కనీసం ఇలాంటి ప్రసిద్ధి గాంచిన రచయితల గురించి రాసేటపుడైనా కనీసం సమాచారం సరిచూసుకోకుండా ప్రచురించడం వారి బాధ్యతా రాహిత్యం. అమూల్యమైన విషయాలు తెలియజేశారు.

kanthisena చెప్పారు...

"ఆయన జీవన సంధ్యలో రెండు సార్లు వ్యక్తిగతంగా కలుసుకోగలిగాననే తృప్తి మాత్రమే ఇప్పుడు మిగిలింది."

అసాధారణమైన ఈ మనీషి స్పర్శను మీరు చవిచూశారు. నేను ప్రయత్నించీ విఫలమైనందుకు బాధగా ఉంది.

"ఇంటర్వ్యూ చేసిన గుర్తుగా ఆయన ఏటవాలు చేతిరాతతో ఉన్న రైటింగ్ ప్యాడ్ దీనంగా,విషాదంగా...నా దగ్గర!"

మీ విషాదం మా అందరిదీ. ఇక్కడ చందమామ ఆఫీసులో మూడేళ్ల క్రితం వరకూ ఆయన ఆప్యాయతను, సాన్నిహిత్యాన్ని పొందినవారు, ఆయన పలకరింపుతో కరిగిపోయినవారు నిన్న సంతాప సమావేశంలో తల్చుకుని తల్చుకుని విలపించారు. సీఈఓను, టీ, కాఫీ అందించే బాయ్‌ని కూడా సమానంగా పలకరించే, వ్యవహరించే ఈ అపరూప మూర్తిమత్వం ఈకాలంలో ఎక్కడ చూడగలం. ఎక్కడ చూసినా అహాల గొడవే, ఘనతల ప్రచారాల గొడవే.. మళ్లీ సమాజానికి కాస్తంత పనికొచ్చే పని చేస్తారా అంటే లేదు. వద్దులెండి ఎవరిని ఏమన్నా మళ్లీ మనమే బాధపడాలి. ఎందుకన్నామురా ఆని.

బేతాళ కథల రచయిత దాసరి అని నిన్న పత్రికలు పొరపాటుగా రాయడంలో ఎక్కడనుంచో వారికి మిస్‌ఫీడ్ దొరికిందని అనుమానం. లేకుంటే పత్రికలూ, టీవీలు కలిసి ఒకేలా చెప్పలేవుకదా. ఆయన బేతాళ కథల సృష్టికర్తా కాదా అని నిర్థారించుకునే సమయం ఉందో లేదో తమకు వచ్చిన సోర్స్‌ను గుడ్డిగా నమ్మారో మరి. పొరపాటయితే జరిగిపోయింది. ఇక్కడ మనం బ్లాగుల్లో ఎంత గొప్పగా రాసినా పత్రికలో పొరపాటు వార్త వచ్చిందంటే అదే ఎక్కువమందిపై ప్రభావం చూపుతుంది. పోనివ్వండి.

చందమామ వెబ్‌సైట్‌లో ఇవ్వాళ దాసరి గారి గురించి మూడు వ్యాసాలు హోమ్‌పేజీలో ప్రచురించాము చూడండి. మీరు నా మెయిల్‌కు రెస్పాండ్ అయి ఉంటే మీ బ్లాగ్ ఆర్టికల్ కూడా ఇవ్వాళే గెస్ట్ ఆర్టికల్‌గా చందమామ వెబ్సైట్‌లో వచ్చేది. ఫర్వాలేదు లేండి. మీరు అనుమతించారు కాబట్టి వచ్చే వారం తప్పక ప్రచురిస్తాము.

మంచి సమాచారాన్ని పంచుకున్నందుకు అభినందనలు

రాజు
telugu.chandamama.com

Unknown చెప్పారు...

చిన్నప్పుడు నేను ఎంతో ఇష్టం గా చదివి ఆనందించిన, ఈ అద్భుతమైన జానపద సీరియల్స్ రాసిన రచయిత వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.