ఆ పుస్తకం తెరవగానే ‘వేటూరి సుందర రామమూర్తి’ అనే సంతకం కనిపించింది.
ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్ళాను. అక్కడితో అది ఆగలేదు. పేజీల్లోకి , అక్షరాల్లోకి దృష్టి సారిస్తే ఆ జ్ఞాపకాల ప్రయాణం ఇంకా వెనక్కి... దశాబ్దాల వెనక్కి సాగిపోయింది.
వేటూరి పాటల సంగతులు ముందుకు సాగి, రాద్దామనుకున్న టపా సంగతి వెనకబడిపోయింది! :)
సినీ కవిగా అందరికీ తెలిసిన వేటూరి వచనంలోనూ చక్కని ప్రతిభ ప్రదర్శించారు. జర్నలిజంలో పదిహేనేళ్ళపాటు కొనసాగటం వల్లనా? సహజమైన ప్రతిభా వ్యుత్పత్తుల వల్లనా? ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాటల్లో చెప్పాలంటే... ‘ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాయితం వరకూ , దేన్ని గురించైనా అపారమైన పరిజ్ఞానం ’ వేటూరిది .
శ్రీశ్రీ మరణించినపుడు 1983లో జూన్ 17న ‘ఈనాడు’ లో వచ్చిన ప్రసిద్ధ సంపాదకీయం రాసింది వేటూరే. ‘శ్రీశ్రీ మొదలంటా మానవుడు- చివరంటా మహర్షి- మధ్యలో మాత్రమే కవి- ఎప్పటికీ ప్రవక్త’ అని ఎంతో క్లుప్తంగా , అనల్పార్థం స్ఫురించేలా శ్రీశ్రీని అక్షరాలతో sum up చేశారాయన.
‘కవిగా అతను తన జీవిత కాలంలోనే ‘లెజెండ్’ అయినాడు’ అని శ్రీశ్రీని ఉద్దేశించి వేటూరి రాసిన వ్యాఖ్య ఆయనకూ వర్తిస్తుంది.
వేటూరి గారు రాసిన ‘ఆర్ద్ర స్మృతుల అక్షరాకృతుల’ వ్యాసాలు ఆరేళ్ళ క్రితం ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకంగా విడుదలయ్యాయి. ఆ పుస్తకం ఈనాడు ఆదివారం లో సమీక్షించే అవకాశం నాకు వచ్చింది. 2004 సెప్టెంబరు 25 తేదీన వేటూరి గారు సంతకం చేసి పంపిన పుస్తకం అలా నా చేతికొచ్చింది. ‘సినీ మహనీయులకు నీరాజనం’ అనే శీర్షికతో 2004 సంవత్సరం అక్టోబరు 31న ఆ రివ్యూ ప్రచురితమైంది!
వేటూరి చక్కని కథా రచయిత కూడానట. ‘కవితా పరమైన శైలిలో మల్లాది రామకృష్ణశాస్త్రి గార్ని తలపించే తీపి తీపి తెలుగులో అలనాడే అద్భుతమైన కథలు రాశారని కొందరికే తెలుసు’ అని ఈ పుస్తకం ముందు మాటలో పైడిపాల అంటారు.
ఆ కథలు ఎక్కడున్నాయో... ఇప్పుడైనా అవి వెలుగులోకి వస్తాయా?
ఎదుటివారి ప్రతిభను మనస్ఫూర్తిగా ప్రశంసించే సంస్కారం వేటూరిది.
బాలూను - ‘బాల రసాల సాల అభినవ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఒక పుంస్కోకిల’ అని అభివర్ణించారు. ‘‘నైమిశారణ్యాలలో, గంధ మాదన పర్వతాలలో, చిరపుంజి చినుకులలో, సుందర వన సాగర తీరాలలో , మలయానిలాలలో వీచే పవన పరిమళాలు రాజన్ నాగేంద్రల సుస్వరాలు’ అంటారు.
శబ్ద చిత్రాలూ, ప్రాస క్రీడలతో తన వచనాన్ని ఆకర్షణీయంగా మలుస్తారు వేటూరి. ‘స్వరమేశ్వరుడు’, ‘పాటలీ కుసుమాలు’, ‘రాగతాళీయం’, ‘స్వరాయురస్తు’ అనే పద ప్రయోగాలే కాదు- ‘ఆదినారాయణరావుకు అంజలి’, ‘జంధ్యావందనం’ లాంటి అర్థవంతమైన శీర్షికల్లో ఆయన మార్కు మెరుపులు తళుక్కుమంటాయి!
**** *****
సినిమా నటుడవుదామని ఆశించి, అవకాశం వచ్చినా తర్వాత భయంతో ఆ ఆలోచన విరమించుకున్నారు వేటూరి. సినీ రంగంలో ప్రసిద్ధుడయ్యాక అది నెరవేరింది.
‘మల్లెపందిరి’ సినిమాలో వేటూరితో కకుంభంజకం స్వాములవారి పాత్ర వేయించారు జంధ్యాల. మరో రెండు సినిమాల్లో కూడా వేటూరి సరదా పాత్రలు వేశారు.
వేటూరి వి ప్రైవేటు క్యాసెట్లు ‘గీతాంజలి’ పేరుతో వచ్చాయి. ఇవన్నీ భక్తి గీతాలే. సినీ ప్రముఖులే స్వరకల్పన చేశారు.
* శ్రీ వేంకటేశ్వర పదములు - కె.వి. మహదేవన్.
* భద్రాచల శ్రీరామ పట్టాభిషేకం - చక్రవర్తి
* కబీర్ వాణి - చక్రవర్తి
* క్రీస్తు గానసుధ - బాలు.
* స్వామియే శరణం అయ్యప్ప - రాజ్ కోటి.
**** *****
తెలుగు సినిమా పాటకు పర్యాయపదంగా మారిపోయిన వేటూరి అంటే ... నాకైతే ‘శంకరాభరణం’పాటలే చప్పున గుర్తొస్తాయి.
సినీ రంగంలో అడుగిడిన తొలి సంవత్సరాల్లో ‘ఝుమ్మంది నాదం’, ‘శివశివ శంకర భక్త వశంకర’ అంటూ తాపీగా, సాఫీగా సాగిన ఆయన కలం క్రమంగా విశృంఖలమైంది.
కమర్షియల్ అడవి బాటలో చెలరేగి ‘చిలకకొట్టుడు’తో యమగోల గోలగా ‘తిక్కరేగి’న వేటూరి పాళీకి ఉన్న పదునునూ, ఘనతనూ తెలిసేలా చేసి... కవిగా వేటూరిని కూడా రక్షించిన సినిమా ‘శంకరాభరణం’.
ఈ అజరామర చిత్రం విజయ సిద్ధికి ‘గానమె సోపానం’గా అమర్చిపెట్టిన మహదేవన్, పుహళేంది కనుమరుగైపోగా.. ఇప్పుడు ఇలా... వేటూరి!
వేటూరి గారిని కలుసుకున్నాను, కొన్నేళ్ల క్రితం.... సహ జర్నలిస్టు ఆయన్ను ఇంటర్ వ్యూ చేస్తున్నపుడు తనతో కలిసి వెళ్ళి .... హైదరాబాద్ లో ఆయన ఇంటి దగ్గర !
నాది ఆ సందర్భంలో దాదాపు ప్రేక్షక పాత్రే.. ఏవో ఒకటి రెండు మాటలూ, వాక్యాలూ మాట్లాడానంతే. కాకపోతే ఆయన్ను సన్నిహితంగా అభిమానంగా, అపురూపంగా చూస్తూ, ఆయన మాటలు వినగలిగాను.
ఎప్పుడో స్కూల్ రోజుల్లో ‘ఝుమ్మంది నాదం’ సిరిసిరి మువ్వ సవ్వడిగా చెవులకింపుగా రేడియో తరంగాల్లో తేలివచ్చినపుడు ఆ పాట రాసిందెవరో పట్టించుకోలేదు. తర్వాతి కాలంలో తెలుగు సినీ పాటలకోటను త్రివిక్రముడిలా ఆక్రమిస్తూ వచ్చిన వేటూరిని పట్టించుకోకుండా ఉండటం ఎలా సాధ్యం?
ఆ పాటల మధురిమను ఆహ్లాదిస్తూ, ఆస్వాదిస్తూ, ఆ అక్షరజాలాన్నీ, చిలిపిదనాల ప్రయోగశీలతనూ గమనించటం అప్రయత్నంగానే అలవాటయింది.
‘పంతులమ్మ’ సినిమాలో రాజన్ నాగేంద్ర స్వరపరిచిన ‘మానసవీణా మధు గీతం’ పాట అలాంటిదే! ఎమ్వీఎల్ లాంటివారు ఈ పాటను ఆరాధిస్తూ దాని గురించి పత్రికల్లో కూడా రాశారట.
‘కురేసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమనీ, తడిసేదాకా అనుకోలేదు తీరని దాహమనీ..’ అనే చరణ భాగం ఎంత బావుంటుందో! తర్వాత ‘కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ..’- ఇది వినగానే అద్భుత భావన మనసును ఆవరించేస్తుంది!
నాలుగు స్తంభాలాట లో ప్రేమ భావనను వేటూరి హృద్యమైన గీతంగా ఎలా మలిచారో కదా! ‘హిమములా రాలి, సుమములై పూసి రుతువులై నవ్వి మధువులా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’.
అంతేనా? ‘మౌనమై మెరిసి, గానమై పిలిచి, కలలతో అలిసి, గగనమై ఎగసె’ అంటారు.
తెలుగునాటి అందాలనీ, రుచులనీ, రాగాలనీ, పెదవి విరుపులనీ అందించే తెలుగు కవుల సంప్రదాయం, సరసం సినిమా పాటలోకి తేవాలనేది వేటూరి తాపత్రయం. అది జంధ్యాల సినిమాల ద్వారా కొంత తీరిందనుకోండీ.
‘రెండు జెళ్ళ సీత’ పాట గుర్తొచ్చిందా?
‘కొబ్బరి నీళ్ళా జలకాలాడ’ పాటలో వచ్చే ఊరగాయ స్తోత్రం చూడండి.
‘మాగాయే మహా పచ్చడి
పెరుగేస్తే మహత్తరి
అది వేస్తే అడ్డ విస్తరి
మానిన్యాం మహా సుందరి’.
ఇక ‘ప్రేమించు పెళ్లాడు’లో ‘గోపెమ్మ చేతిలో గోరుముద్ద’ ఎంత రుచిగా ఉంటుందీ! ముద్దుముద్దుగా తెలుగు అక్షరమాలలోని అలూ, అరూ, ఇణీ వరసగా చెంగుమని పాటలోకి గెంతుకుంటూ వచ్చేయవూ! వేటూరి మాటల్లో చెప్పాలంటే- ‘అదొక సరసం, అదో చిలిపితనపు మోజువీడు చిన్న రసం’.
వేటూరి సినీ గీతాల సుందరోద్యాన వనంలోకి పూర్తిగా అడుగుపెడితే ఆ సుమ సుగంధాల నుంచి బయటపడటమూ, బయటికి రావటమూ చాలా కష్టం. ‘ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల’ తిరుగుతూ ఉండాల్సిందే. అందుకనే ‘ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై’న వేటూరి ప్రతిభను సంస్మరిస్తూ ఇలా అర్థోక్తి లో ఆపెయ్యటం అర్థవంతమే అనుకుంటాను!
17 కామెంట్‌లు:
మీ వ్యాసానికి ధన్యవాదాలు. వేటూరిగారి పుస్తకం గురించి తెలియదు. చదివే లిస్ట్ లో పెట్టుకున్నాను.
ఎంత చక్కటి వివరణ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇంత అందమైన పాటలు ఇంకా ఇంకా వినే అవకాశం కోల్పోయామంటే మనసులో బాధ ముల్లై గుచ్చుతోంది. వేటూరి గారికి నా నివాళి.
మీ వ్యాసం అద్బుతంగా ఉంది.
పంతులమ్మలో ఆ పాట నాకు చాలా ఇష్టం.ఆ పాటలోనే కాదు మిగతా వేటురి పాటలన్నీ సాహిటి సుమపారిజాతాలే
వేటూరిగారి భక్తిరచనలైనా, శృంగారరచనలైనా, చమత్కారమైనా, ఆవేశపూరితరచనలైనా - అవి మనసుకు హత్తుకునేలాగా ఉంటాయండి. తెలుగుకు పెద్ద పీట వేసి, ఆ పక్కనే కూర్చుని సేవ చేసిన మహానుభావుడు. తెలుగు సినిమాల్లో ఇంక అచ్చతెలుగు నుడికారం, ముచ్చటైనా పరిహాసం, చిరునవ్వు తెప్పించే చిలిపిదనం, పరవళ్ళు తొక్కించే పడుచుదనం - కనబడవేమో అనే బాధ నన్ను క్రుంగదీసేస్తోంది.
వేటూరి కథల గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ చిన్న సమాచారం. కౌముది జులై 2009 సంచికలో వేటూరిగారి "శ్రీకాకుళే మహాక్షేత్రే" అన్న కథ వుంది. చూడండి. http://www.koumudi.net/Monthly/2009/july/index.html
Prasad , జయ, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ధన్యవాదాలండీ.
సుజాతా! వేటూరి ‘మోజువీడు’ గురించి కొంత చెప్పాలి. నూజివీడునీ, వెంటనే గుర్తొచ్చే మామిడినీ, అక్కడి రచయిత ఎమ్వీఎల్ నీ సందర్భం వచ్చినపుడు వేటూరి తన పాటల్లో, వ్యాసాల్లో స్మరించుకున్నారు.
‘కొండవీటి సింహం’ సినిమాలో ఓ పాటలో మామిడి పండ్ల రకాలతో యుగళగీతం రాశారాయన. ఆ సినిమా విడుదలైనపుడు నేను నూజివీడులోనే ఇంటర్ చదువుతున్నాను! పాటలో ‘నూజివీడు’ ప్రస్తావన రాగానే థియేటర్లో ఈలలు వినిపించి ఖుషీగా అనిపించింది! మీ స్పందనకు థాంక్యూ.
సత్యప్రసాద్ గారూ, వేటూరి కథ లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు! 2003 జనవరిలో ‘రచన’లో ఇది ప్రచురణ అయిందని ఈ లింక్ ద్వారానే తెలిసింది.
Sandeep గారూ! ‘తెలుగు సినిమాల్లో ఇంక అచ్చతెలుగు నుడికారం, ముచ్చటైనా పరిహాసం, చిరునవ్వు తెప్పించే చిలిపిదనం, పరవళ్ళు తొక్కించే పడుచుదనం - కనబడవేమో’ అన్న మీ వ్యాఖ్యలో ఎంతో వాస్తవముంది!
చాలా చక్కగా రాసారు.బాగుందండి..ధన్యవాదాలు.
“అలలు కదిలినా పాటే
ఆకు కదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే…”
**
“కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..మహాపురుషులౌతారు..
తరతరాలకు తరగని వెలుగౌతారు..ఇలవేలుపులౌతారు..”
**
ఓం నమ:” పాటలో “నీ హృదయం తపపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో..”
“సూరీడే ఒదిగి ఒదిగీ జాబిల్లి ఒడిని అడిగే వేళా..”
***
"రవివర్మకే అందని ఒకే ఒక అందనివో..
రవి చూడని.. పాడనీ.. నవ్య నాదానివో..."
**
గోదావరి లో "ఉప్పొంగెలే గోడావరీ.." పాట మొత్తం..
..చెప్పుకుపోతే ఎలా ఎన్నో...may his soul rest in peace.
@సత్యప్రసాద్ : కథ లింక్ ఇచ్చినందుకు మీక్కూడా ధన్యవాదాలు.
బాగుందండి, నేను చాలా సార్లు చదివేను ఈ పుస్తకం, చాలా సర్లు సమీక్ష రాద్దామనుకున్నా కాని అంత దృశ్యం నాకు లేదని వూరుకున్నా. జంధ్యా వందనం అన్నా మోజువీడు అన్నా, పాటల కడలి మాటల జలధి అని సముద్రాల గారి గురించి చెప్పినా వెన్నెల స్వరమేశ్వరుడి గానవాహిని అల అని రమేష్ నాయుడి గారిని ప్రస్తుతించినా ఆ పెద్ద మనసు వచనా విశిష్టత బయట పడుతుంది. పైడిపాల బాలు గారి ముందు మాట కూడా బాగా నచ్చింది నాకు ఆ పుస్తకం లో. తప్పక చదవ వలసిన పుస్తకం.
తృష్ణ గారూ, ధన్యవాదాలు.
ఎస్. రాజేశ్వరరావు గారి దగ్గర్నుంచి కేఎం రాధాకృష్ణన్ వరకూ వేటూరి సాహిత్యం ఎన్నితరాల స్వరకర్తల ప్రతిభకు ఆలంబనగా నిలిచిందో! ముఖ్యంగా మహదేవన్, రమేష్ నాయుడు, ఇళయరాజా.. ఈ ముగ్గురూ వేటూరి పాటల కుసుమాలను పరిమళభరితం చేశారు.
భావన గారూ, థాంక్యూ.
venu gaaru,
veturi gaaru paramapadinchadam oka shocking news naaku, aayana gurinchi evaraina blogs lo raasthe chadivi thariddaamani nenu chadive anni blogs vethikaanu, enduko meeru raasthaaranipinchi mee blog kosthe kanipinchindi, aayana raasina anni paataloo akshara kusumaalenandi, veturi sundara raama moorthy gaariki ki na ashru nivaali
aparna
వేణు గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
వేణు గారూ...
చాలా అద్భుతంగా రాసారు. నాకు తెలియని చాలా విషయాలు బోధపడ్డాయి. keep it up.
Ramu
apmediakaburlu.blogspot.com
అపర్ణ గారూ, ధన్యవాదాలు. కొత్తగా బ్లాగు ప్రారంభించినందుకు అభినందనలు!
రాము గారూ, థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి