సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

‘ఉక్కుపిడి మాయావి’.... తెలుసా మీకు?



‘సీక్రెట్ ఏజెంట్’ పేరు - లూయీస్ క్రాన్ డెల్.

కుడిచేతికి మెరిసే ఉక్కుపిడి!

దాని ద్వారా విద్యుత్తుని  ఒంట్లో ప్రవహింపజేసుకుని... క్షణాల్లో అతడు మాయమైపోతాడు... తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా!

ఈ  హీరో సాహసకృత్యాల తెలుగు కామిక్స్ బుక్స్ ఆచూకీ కోసం సరదాగా అన్వేషణ మొదలుపెట్టానీ మధ్య.

ఎక్కడో ఇంగ్లండ్ లో పుట్టిన ఈ హీరో తెలుగునేలపై  అడుగుపెట్టేసి... మా పల్లెటూరికి వచ్చేసి... చిన్నతనంలో నన్ను అమితంగా ఆకట్టుకున్నాడు.

అంతర్జాలం పుణ్యమా అని అప్పటికంటే ఇప్పుడే ఈ కాల్పనిక కథానాయకుడి  విశేషాలు ఎక్కువ తెలుస్తున్నాయి.

 ఈ ‘స్టీల్ క్లా’ రచయిత- టామ్ టులీ.  చిత్రకారుడు- జీసస్ బ్లాస్కో. 

*    1962 అక్టోబర్లో  ఈ కామిక్ కథ ప్రాణం పోసుకుంది. మొదట 15 వారాలకోసం అనుకున్నారట.  అద్భుతమైన పాఠక స్పందన  రావటంతో  ఎనిమిదేళ్ళపాటు పొడిగించాల్సివచ్చింది .

క్రాన్ డెల్  మొదట్లో లాబ్ అసిస్టెంటుగా ఉన్నపుడు ప్రయోగశాలలో ఓ పొరపాటు జరిగి, అనూహ్యంగా అతడికి అదృశ్య శక్తి వచ్చేస్తుంది.  ఒక్క ఉక్కు పిడికిలి మాత్రమే అందరికీ కనిపిస్తుంది!  ‘హ్యూమన్ సైబోర్గ్’ అన్నమాట...


*  హెచ్ జీ వెల్స్ ‘ఇన్విజిబుల్ మ్యాన్’ ఈ పాత్ర రూపకల్పనకు స్ఫూర్తి అయివుండొచ్చు.

* ఉక్కు పిడికిలిలోని ఒక్కో వేలు ఒక్కో ఆయుధంగా పనిచేస్తుంది.  కరెంట్ షాకునిస్తుంది. పిస్టల్ గా, బ్లేడ్ గా, నెర్వ్ గ్యాస్ డిస్పెన్సర్ గా, రేడియోగా ఉపయోగపడుతుంది!


Steel claw అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారట. కానీ ఇతడి గురించి  అంతర్జాలంలో వెతకొచ్చని బహుశా తోచక  (నా సంగతీ అంతేగా? .. కొద్దిరోజుల ముందువరకూ నాకీ ఆలోచనే తట్టలేదు)  ఆ అభిమానులు నెట్ లో అంత యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించటం లేదు.


British comic art  బ్లాగు   లో కిందటి సంవత్సరం అక్టోబర్ 14న Steel claw గురించి ఓ టపా వచ్చింది. ఈ ఫిబ్రవరి 16న నేను రాసిన వ్యాఖ్య తప్ప ఇంకెవరూ అక్కడకు వచ్చి స్పందించలేదు!


ఎడిట్ పేజీలో కామిక్స్

‘ఈ  కామిక్స్ చిన్నపిల్లల వ్యవహారం కదా!’ అని చిన్నచూపు చూడకండి .

కథల్లో రచయితల కల్పన మన ఊహలకు రెక్కలు తొడిగితే... కామిక్స్ లో చిత్రకారుల చిత్రకల్పన మన మనసును రెక్కలు కట్టి ఆ పేజీల్లో వాలేలా చేస్తుంది!  

ఒకప్పుడు ‘ఈనాడు’ ఎడిట్ పేజీలో వచ్చే బొమ్మల కథలు ఎంతో అద్భుతంగా ఉండేవి.  ఆ పేజీలోని గంభీరమైన రాజకీయ, సామాజిక సమస్యల ప్రస్తావనల మధ్య ఈ కామిక్స్ చక్కగా రిలీఫ్ నిచ్చేవి.  జానపద, పౌరాణిక, చారిత్రక  కథలు ఎక్కువగా వచ్చేవి.  ‘అంగుళమాలి’ మొదలైన కథలను ఎంతో ఉత్కంఠగా చదువుతూ ప్రతిరోజూ వాటికోసం ఎదురుచూస్తుండేవాణ్ణి. అవి ‘అమర చిత్ర కథల’ నుంచో, మరెక్కడినుంచో  స్వీకరించిన అనువాదాలే. బొమ్మలు అలాగే ఉంచి,  కథనాన్నీ, సంభాషణలనూ తెలుగులోకి మార్చేవారు.


డిటెక్టివ్ కామిక్స్ 

కామిక్స్ లో డిటెక్టివ్ కామిక్స్ ప్రత్యేకం.  వీటిలో కథ తక్కువే ఉన్నప్పటికీ  చిత్రకారుల కళా కౌశలంతో  కథా వాతావరణం, పాత్రల హావభావాలూ, సాహసాలూ కళ్ళకు కట్టేవి.  విభిన్నకోణాల్లో ఎంత అద్భుతంగా చిత్రించేవారో!

ఆంధ్రప్రభ వారపత్రికలో బుజ్జాయి ‘న్యాయానికి భయం లేదు’ అనే పేరుతో సింగిల్ పేజీ కామిక్స్ సీరియల్ నిర్వహించేవారు. దాన్ని చాలా ఉత్కంఠగా వారం వారం చదివేవాణ్ణి.  అయితే అది పుస్తకంగా వచ్చినట్టు లేదు. 

డిటెక్టివ్ కామిక్స్ ‘ఉక్కుపిడి మాయావి’ సిరీస్ తప్ప తెలుగులో మరేవీ రాలేదనుకుంటాను.



శత్రు దుర్భేద్యాలను దాటుకుని, దుష్టుల పని పట్టేసే ఈ ‘ఉక్కుపిడి మాయావి’ బ్రిటిష్ గూఢచారి.  1970లలో ఇంగ్లండ్ దాటుకుని, చాలా దేశాల్లో ప్రవేశించాడు. మనదేశంలోకీ, ముఖ్యంగా తమిళనాడు, కేరళల్లోకి కామిక్స్ పుస్తకాల రూపంలో విచ్చేశాడు.

ఆ తర్వాత ‘బాలమిత్ర’ ఈ కామిక్స్ ను మన భాషలో ప్రచురించి, మాయావిని తెలుగునేల మీదకు తీసుకువచ్చింది!

ఈ సిరీస్ లో  ‘ఉక్కుపిడి మాయావి’, ‘సర్పదీవి’ పేర్లు మాత్రమే నాకు గుర్తున్నాయి. చుట్టూ పాముల మధ్య పడివున్న ‘మాయావి’ బొమ్మ నన్ను ఎంతగా ఆకట్టుకుందంటే...  ‘సర్పదీవి’ (snake island) ని పోస్టులో తెప్పించుకుని, చదివిందాకా ఆగలేకపోయాను.  ఇప్పుడా పుస్తకం లేదు... ఎక్కడో పోయింది.

దీనికంటే ముందు మాయావి పరిశోధన ‘విష వలయం (?) అనే పుస్తకం చాలా నచ్చింది. (అంతగా నచ్చిన పుస్తకం పేరు మాత్రం సరిగా గుర్తు లేదు.. ప్చ్...)

ఈ కథ ఏంటంటే...  

కొండమీద స్థావరం ఏర్పరచుకున్న విలన్...  శాస్త్రవేత్తలను అపహరించి, రాకెట్ల ప్రయోగం ద్వారా ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటాడు.  ఆ చుట్టుపక్కల యువకులను అపహరిస్తుంటాడు.  అప్పుడు క్రాన్ డెల్ రంగప్రవేశం చేస్తాడు!

 అతడు తన స్థావరానికి  రావటాన్ని విలన్ సీసీ టీవీల ద్వారా చూసి కొంతమేరకు కొండను పేల్చి రాళ్ళ తుపాను సృష్టిస్తాడు. అయినా దాన్ని తట్టుకుని స్థావరంలోకి వేరే మార్గంలో  ప్రవేశిస్తాడు క్రాన్ డెల్. అదృశ్య రూపం పొందటం,  సాహసాలూ... మామూలే. చివరకు  విలన్ అతణ్ణి  రాకెట్ స్థావరంలో బంధించి,  రాకెట్ ప్రయోగం ఆరంభిస్తాడు.  ఓ పక్క రాకెట్ లాంచింగ్, మరో పక్క ఆ మంటల్లో హీరోను అంతం చేయటం... ఇదన్న మాట ప్లాన్.  ( ‘కౌంట్ డౌన్’ అనే మాట తొలిసారి ఈ కామిక్స్  ద్వారానే పరిచయమయింది నాకు. )  విలన్ ఆట ఎలా కట్టిందనేది మిగతా కథ!

ఈ కామిక్స్ అప్పటివరకూ నాకసలు తెలియని విదేశీ వాతావరణాన్ని పరిచయం చేశాయి.  ‘విమానం లోపలి భాగం’ ఎలా ఉంటుందో అంత చిన్నప్పుడే ఈ కామిక్స్ ద్వారా తెలిసింది. ఈ సిరీస్ విశేష ఆదరణ పొందటానికి ఓ ముఖ్య కారణం..  ఎప్పటికీ  స్మృతిపథంలో నిలిచేలా గీసిన వైవిధ్యభరిత చిత్రాలు.


అసలు-  కరెంటు షాకుతో  మనిషి అదృశ్యమైపోవటమనేదే  గొప్ప థ్రిల్లింగ్ పాయింట్ కదా!                                    








16 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

సుజాత గారూ! ఈ మాయావి నా పుస్తకాల కలెక్షన్నుంచి ఎప్పుడో ‘అదృశ్యమైపోయాడు’. అది నిర్థారణ అయినపుడు నాకు ‘కరెంట్ షాక్’ కొట్టినట్టయింది.

ఈ ‘ఉక్కుపిడి మాయావి’ సిరీస్ లో కొన్ని పుస్తకాలనైనా సంపాదిస్తాన్లెండి, తప్పకుండా! అప్పుడు మీరూ చదవొచ్చు!

Gopal చెప్పారు...

విజయవాడనుండి తణుకు బస్సులో ప్రయాణం చేస్తూ మధ్యలో ఏలూరులో బస్సు ఆగినప్పుడు అక్కడ పుస్తకాల షాపులో దీనిని చూసేవాడిని. కొనాలని ఉండేది కాని అప్పుడు మనదగ్గర డబ్బులేవి? ఇది 75 - 80 ల మధ్యమాట!!

వేణు చెప్పారు...

అయ్యో.. అలాగా వేణుగోపాల్ గారూ! ఆ సమయంలో మీదగ్గర కొంచెం డబ్బులుంటే ఎంత బాగుండేదో కదా. నిజమే, ఈ ‘ఉక్కుపిడి మాయావి’ కామిక్స్ ఎక్కువగా బస్ స్టాండ్ల బుక్ స్టాల్స్ లో దొరికేవి!

కొత్త పాళీ చెప్పారు...

వావ్ .. దీనివెనక ఇంత కథ ఉందా!! హైస్కూల్లో ఉండంగా, అట్టలు చిరిగిపోయి, చివరిపేజీలు చిరిగిపోయి (కథ ఎలా అంతమవుతుందో తెలీనే తెలీదు!) మాత్రమే దొరికేవి ఈ పుస్తకాలు - అంటే అప్పటికే బాగా పాతవి, కొత్తవి ఎక్కడా కనబడేవి కావు - అయినా భలే క్రేజు ఉండేది ఇవంటే - క్లాసుమేట్లందరం వంతులేసుకుని చదివేవాళ్ళం.

వేణు చెప్పారు...

కొత్త పాళీ గారూ! ‘ఉక్కుపిడి మాయావి’కామిక్స్ గురించి మీ జ్ఞాపకాలు బాగున్నాయి. ఈ పుస్తకాలకు నాతో పాటు మా అన్నయ్యలు కూడా వీరాభిమానులు. ఇవి పాకెట్ సైజులో హాండీగా, నలుపు తెలుపు బొమ్మలతో ఉండేవి!

Rajendra Devarapalli చెప్పారు...

బావూ.... యేను బావు :) ఇన్నాల్లకి అట్టుకోనిచ్చినారు నన్ను తమరుగోరిని,ఓపాలి కాల్చెయ్యండి.

సుజాత వేల్పూరి చెప్పారు...

రాజేంద్ర కుమార్ గారూ,
వేణు గారు చాలా సాధు ప్రాణి! పిస్తోలెలాగుంటాదో తెలీని మనిషిని "డిష్కావ్" అని కాల్చేమంటే ఎలాగ?

వేణు చెప్పారు...

రాజేంద్ర గారూ! సుజాత గారి వ్యాఖ్య చూశారుగా?
‘ఉక్కుపిడి మాయావి’ టపాలో రాశారు కాబట్టి ‘కాల్చెయ్యండి’ అనే మాటను ‘పిస్టల్’తో అనే మాటతో కలిపేసి అర్థం చేసుకుంటున్నాను. :)

ఇంతకీ ఈ మాయావి మీకు తెలుసా? ఆ కామిక్ బుక్స్ మీ దగ్గర గానీ, మీకు తెలిసినవాళ్ళ దగ్గర గానీ ఉన్నాయా? చెప్పెయ్యాలి మరి- చకచకా...!

GKK చెప్పారు...

వేణు గారు! as always, thoroughly researched and well written article. చాలా lively గా ఉంటుంది మీ టపా. చిన్నప్పుడు నేనుకూడా ఉక్కుపిడి మాయావి ఆసక్తిగా చదివే వాడిని. మనో పథంలో నుంచి దాదాపుగా అదృశ్యమైన విషయాలు మళ్ళి మీ టపాలో చూడగలిగాను

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని (కిరణ్) గారూ! ‘ఉక్కుపిడి మాయావి’ గురించి తెలిసినవాళ్ళు బ్లాగ్లోకంలో తక్కువమందే కనిపిస్తున్నారు. మీకు ఈ మాయావి తెలుసని తెలిసి సంతోషం వేస్తోంది. టపాపై మీ అభినందనలకు కృతజ్ఞతలు!

Saahitya Abhimaani చెప్పారు...

వేణూ గారూ,

మీకులాగే నాకు కూడా ఉక్కుపిడి మాయావి గురించి ఇంటర్నెట్లో వెతకచ్చు అన్న విస్జయం ఇవ్వాల్టివరకూ తట్టలేదు. గూగులమ్మ అడగ్గానే మీ బ్లాగ్ చూపించింది.

నా దగ్గర
1 . ఉక్కుపిడి మాయావి
2 . సర్ప దీవి
3 . ఫ్లైట్ 731

ఉన్నాయి. జాగ్రత్తగా బైండ్ చేయించి ఉంచాను. ఆ బొమ్మలన్నీ కూడా స్కాన్ చేసి ఒక మల్టీ మీడియా చేద్దామని ఎప్పటినుంచో ప్రాజెక్ట్ అలా ఉంది పోయింది.

ఈ సిరీస్ లోనే "విష వలయం" అన్న పుస్తకం వచ్చింది. అది ఈ మధ్య వరకూ కూడా నా దగ్గర ఉండేది కాని ఇప్పుడీ మధ్య కనపడటం లేదు.

సరే అందులో బొమ్మలు మొదలుగాగాలవి అన్ని కలగలపి ఒక వ్యాసం వ్రాస్తాను.

ఈ పుస్తకాలు అన్నీ కూడా 1973-74 lO బాల మిత్ర వారు అనుకుంటాను ప్రచురించారు.

Thanks for getting me the name of the original.

అజ్ఞాత చెప్పారు...

నా చిన్నప్పుడు మా అన్నయ్య శివ గారు తెస్తే చదివాను. దాని ఇస్పిరేషనుతోనే[కాపి] "ఇనపచెయ్యి మహత్తు" అని వ్రాసాను. అది చదివి మా పెద్ద వాళ్ళు ఒకటే నవ్వు. అప్పట్లొ పుస్తకాలకి స్వర్ణ యుగం. రకరకాల పుస్తకాలు వచ్చేవి. వాటిని జనం కూడా బాగా ఆదరించేవారు; ఎందుకంటే టీ.వీ ల గోల ఉండేది కాదు. ఉక్కుపిడీ మాయవిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

వేణు చెప్పారు...

శివ గారూ, రాధాకృష్ణ గారూ,
మీ ఇద్దరి స్పందనా నాకు ఉత్సాహాన్నిచ్చింది.

శివ గారూ, అయితే ‘విష వలయం’ అనే పేరు సరైనదా, కాదా అనే విషయంలో సందిగ్ధత ఇప్పటివరకూ ఉండేది. ఆ పేరు కరక్టే అన్నమాట! ఆ పుస్తకం మీ చేజారిపోయిందంటారా? అలా జరిగితే మాత్రం బాధాకరం.

మీ దగ్గరున్న మూడు పుస్తకాల్లో చివరి రెండూ చదివాను. మొదటిది మాత్రం చదవలేదనుకుంటాను.

రాధాకృష్ణ గారూ!
ఉక్కుపిడి మాయావిని తెలిసినవారు ఎవరన్నా ఉన్నారంటే చాలా సంతోషం వేస్తుంటుంది. అలాంటి కామిక్స్ ఇప్పటి తెలుగు పిల్లలకు అందుబాటులో లేవు కదా అని విచారం వేస్తుంటుంది.

మీరు రాసిన ‘ఇనపచెయ్యి మహత్తు’ చదవాలని ఉంది. ఎలా కుదురుతుంది?

అజ్ఞాత చెప్పారు...

వేణు గారు నా "ఇనుప చెయ్యి మహత్తు" కధ చదవలనుకున్న మీకు నా ధన్యవాదాలు. కానీ, అది ఎప్పుడో నా చిన్నప్పుడు క్లాసు పుస్తకాల్లొ వ్రాసినది. ఒకవేళ అది దొరికితే మీకు పంపగలను.

వేణు చెప్పారు...

రాధాకృష్ణ గారూ,
థాంక్యూ. మీ "ఇనప చెయ్యి మహత్తు" కథ త్వరగా దొరికితే బాగుణ్ణు!