‘నా వల్ల కాదు బాబోయ్...ఈ బజ్జులతో నేను వేగలేను’ అంటూ Buzzలో విసుక్కున్నారో బ్లాగర్ నిన్నటి రోజున. ఎందుకంటే- ‘శని ఆదివారాలు రెండురోజులూ మైల్ ఓపెన్ చెయ్యకపోయేసరికి ఈ రోజు అక్షరాలా 90 బజ్జులున్నాయి చూడడానికి...’!
తెలుగులో బజ్జుల విజృంభణకు ఇదో తాజా తార్కాణం!
‘ముందొచ్చిన బ్లాగుల కంటే వెనకొచ్చిన బజ్జులే వాడి!’ అనొచ్చా? ప్రస్తుతానికి ఇలా అనటం తొందరపాటూ, ‘టూ అర్లీ’ అవుతుంది కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు బ్లాగుల సంకలినుల్ని చూస్తుంటే నాకు ఆ ఒరిజినల్ సామెతే గుర్తోస్తోంది.
నిన్న కూ, ఇవాళ్టికీ పెద్దగా తేడాలేమీ కనపడకుండా - కథ ముందుకు సాగనంటూ మొరాయించే టీవీ డెయిలీ సీరియల్ మల్లే- బ్లాగ్ టపాలు భారంగా కదులుతున్నాయి. ఒకప్పుడు టపాటపా దూసుకొచ్చేసి, పాత టపాలను వెనక్కి నెట్టేసే కొత్త టపాలకు ఇప్పుడు గమనం అపురూపమై, మందగమనం స్వభావమైపోతోంది.
పోనీ, వ్యాఖ్యలేవైనా ఒకప్పటిలాగా శరపరంపరగా వచ్చేస్తున్నాయా అంటే అదీ లేదు. వీటి తీరూ అంతే !
బ్లాగర్లు తమ టపాలనూ, వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యలనూ రాయటం అర్జెంటుగా తగ్గించేసుకున్నారా అని అనుమానం వచ్చేలా తయారైన ఈ పరిస్థితికి కారణం.... బజ్జులనే నా నమ్మకం!
బజ్ ల మూలంగా మెయిల్ చెక్ చేసుకోవటం ఒకప్పటిలాగా కాకుండా ఆసక్తికరంగా తయారయిందనేది కాదనలేని వాస్తవం. బజ్జులు చాట్ రూముల్లా సందడి చేస్తున్నాయి. ఆట పాటలూ, కొత్త పరిచయాలూ, పాత జోకులూ, అభినయాలూ, అలకలూ.. అలవోకగా అక్షరరూపంలో కనిపిస్తున్నాయి. బ్లాగు వ్యాఖ్యల్లాగా వీటికి ‘ఓనర్’ అప్రూవల్ అవసరమే లేదు కదా! సామూహికంగా, బహిరంగంగా సాగే ఈ సంభాషణల్లో ... లైవ్ గా వచ్చేసే వ్యాఖ్యలను చూస్తూ, వెంటనే స్పందిస్తూ వాటిని తక్షణం చూసుకోగలిగే వెసులుబాటే బజ్జులకు ఆకర్షణ తెచ్చిపెడుతోంది.
‘ఫలానా టపా రాస్తున్నాను, ఎలా రాస్తే బాగుంటుంది?’ అని బజ్ లో అభిప్రాయాలు తెలుసుకొని, టపాను చక్కగా తీర్చిదిద్దే అవకాశముంది.
బజ్జుల్లో ఎక్కువ భాగం మైక్రో బ్లాగింగ్ తరహానే! ఒక చిన్న మాట, వాక్యం రాసేసి కూడా అసంఖ్యాకమైన స్పందనలను పొందటంలో బజ్జులు ఆదరణ పొందుతున్నాయనిపిస్తోంది.
సరిగ్గా ఈ కారణం వల్లనే... ఎక్కువ సందర్భాల్లో మన విలువైన సమయాన్ని దారుణంగా తినేసెయ్యటంలో బ్లాగులకు పెద్దన్నలాగా బజ్ తయారవుతోందనేది - నాణేనికి మరో వైపు!
కొత్తగా బ్లాగ్ లో టపా గురించి బజ్ లో లింకిచ్చామా... బ్లాగుల్లో వ్యాఖ్యల సంఖ్యను తగ్గించుకున్నట్టే! బ్లాగు లో కామెంట్ రాయకుండా బజ్ ల్లోనే కామెంట్ రాస్తుంటారు చాలామంది. అలా వ్యాఖ్యలు రెండు చోట్ల కు షేర్ కావటం ఏం బాగుంటుంది?
‘ఇవాళ తలనొప్పిగా ఉంది!’ అని బజ్ రాశామనుకోండీ...
కొందరు దాన్ని publicly reshare చేస్తారు. కొంతమంది విచిత్రంగా like కూడా చేయవచ్చు. కాసేపయ్యాక వేరే టాపిక్ లోకి జంప్ చేస్తూ స్పందనలు మొదలవుతాయి. అలా అలా మనకు ‘తలనొప్పి’ ఎగిరిపోతుందో లేదో గానీ, తలనొప్పి టాపిక్ మాత్రం ఎగిరిపోతుంది! కాశీ మజిలీ కథల్లో ఉపకథలోని ఉపకథలోకి వెళ్ళినట్టు అవుతుంది పరిస్థితి !
బ్లాగు టపాలకు సంకలినులు ఉన్నట్టే... బజ్జులక్కూడా భవిష్యత్తులో సంకలినులు వస్తాయేమో!
బజ్ లంటే బృందాలుగా విడిపోయి, ఎవరికి వారు కబుర్లాడుకున్నట్టు నాకు తోస్తుంది. బ్లాగుల్లో అలా ఉండదు! అందుకే... నాకయితే బజ్జుల కంటే బ్లాగులే ఇష్టం ! (ఏ రాయి అయితేనేం- అనకండి.... ) :)
అందుకే... నేను బజ్జుల్లో రాయటం చాలా తక్కువ. బ్లాగు టపాలు నెలకొకటి తగ్గకుండా- బాగానే రాస్తున్నాను కదా: )