సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, ఫిబ్రవరి 2012, సోమవారం

కాళిదాసూ... చందమామా !

ప్పుడో 61 సంవత్సరాల క్రితం ఎంటీవీ ఆచార్య గారు  ‘చందమామ’కు వేసిన ముఖచిత్రం ఈ ఫిబ్రవరి సంచికలో పునర్ముద్రించారు. ఏకకాలంలో విభిన్నరూపులతో వేర్వేరుచోట్ల కనపడే కృష్ణ లీలలను నారదుడు ఆశ్చర్యంతో  చూసే దృశ్యమిది. 

అప్పటి సంచిక  చూడకపోయినా  ఇంటర్నెట్  పుణ్యమా అని ఆ సంచిక  పీడీఎఫ్ కాపీ రెండు మూడేళ్ళ  క్రితమే  చూడగలిగాను. మళ్ళీ ఫిబ్రవరి సంచికలో ఆ ముఖచిత్రం   దర్శనమిచ్చింది.

ఈ రెండు ముఖచిత్రాలూ ఇక్కడ చూడండి.



నదీ తీరంలో చెట్టుకింద  మైమరిచి వేణుగానం చేస్తున్న కృష్ణుడి బొమ్మ చాలా బాగుంది. 

దాన్ని విడిగా...





పాత బొమ్మలను  రంగుల పరంగా, స్పష్టత కోణంలో  ‘ఇంప్రొవైజ్ ’ చేయటం  అభినందనీయం.  అయితే పాత బొమ్మల ఒరిజినాలిటీ,  యాంటీక్ వాల్యూ ని  విస్మరించలేం.

అలనాటి  వెన్నెల
చందమామ  వైభవం  అంతా గతంలోనే  కాబట్టి  పాత కథలను చిత్రా, శంకర్ ల బొమ్మలతో  పునర్ముద్రించటం  నాలాంటి పాఠకులకు సంతోషం  కలిగిస్తుంటుంది.

పాత కథలను అప్పట్లో చదివినా చదవకపోయినా  బొమ్మల్లోని వాతావరణం, అలనాటి ఇళ్ళూ, వాకిళ్ళ , అలంకరణల  నేపథ్యం అందమైన గతంలోకి   ప్రయాణించేలా చేస్తుంది.

అందుకే ఇప్పుడు కొత్త చందమామను మిస్సయితే మంచి పాత కథలనూ, కనువిందు చేసే  బొమ్మలనూ మిస్సవాల్సివస్తుందని కొంటున్నాను!

ఫిబ్రవరి సంచికలోనే  ‘ఎవరు జూదగాడు?’ అనే కథ చిత్రా బొమ్మతో వచ్చింది.


దీన్ని చూడగానే ఇది ‘మాయా సరోవరం’ ఆరంభ సంచికకు వేసిన తొలి బొమ్మ అని అర్థమైపోయింది.

ఈ కథకు కొత్త బొమ్మను వేయించకుండా ఎప్పుడో  36 ఏళ్ళక్రితం ప్రచురించిన  సీరియల్ కు  చిత్రా  వేసిన  బొమ్మ గుర్తొచ్చి, దాన్ని  ఉపయోగించవచ్చనే  ఆలోచన ఎవరికి వచ్చిందో ! అలా గుర్తుకురావటం మెచ్చుకోదగిందే.



కానీ మెచ్చుకోలేని విషయం ఏమిటంటే... బహుళ పాఠకాదరణ పొందిన సీరియల్స్ లోని బొమ్మలను ఇలా  సందర్భం కుదిరింది కదా అని    ఎడాపెడా వాడేసెయ్యటం! ఆ సీరియల్ తో, నాటి చిత్రాలతో   పెనవేసుకునివున్న  అందమైన పాత జ్ఞాపకాలను  ఇది మసకబారుస్తుంది.


మాయా సరోవరం నాయకుడు జయశీలుడు మొదట్లో జూదరి కావొచ్చు కానీ,  జూదరుల కథ దొరికింది కదా అని ఆ బొమ్మను వెతికి పట్టుకుని,  వాడేసెయ్యటం ఏం బాగుందీ? 

చందమామలో వచ్చే ప్రతి బేతాళ కథలోనూ  చివరి బొమ్మ తెలిసిందే కదా? ‘శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కే’ బేతాళుడూ, మౌనభంగం తర్వాత జరిగిన ఈ పరిణామానికి  అవాక్కై చూసే విక్రమార్కుడూ , శ్మశానం, ఒక పక్కకు వంగిన పురాతనమైన చెట్టూ .. వీటితో  ఉండే  బొమ్మను  వందలాదిగా ఎప్పటికప్పుడు  కొత్తవి వేయించిన చరిత్ర ‘చందమామ’ది.

 ఆ పత్రికలో  ఇలా జరగటం ఆశ్చర్యంగానే ఉంది.

అయితే  ఒక్క స్వల్పలోపం లోపమే  కాదు, పట్టించుకోదగ్గది కాదని ‘కుమార సంభవం’లో కాళిదాసు  చందమామను (పోలిక చెపుతూ) వెనకేసుకొస్తాడు. ఎలా అంటే... ‘ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ’ (చంద్రుడికి ఉన్న ఎన్నో శుభ గుణాల మధ్య  మచ్చ ఉన్నంతమాత్రాన  నింద రాలేదు కదా ).

ఆ రకంగా  చందమామ పత్రికకు కూడా ఇదేమంత  లోపం కాదని  ‘చంపి’ల్లో కొందరైనా  సమర్థించుకోవచ్చనుకోండీ!
 

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుబాగు

వేణు చెప్పారు...

puranapandaphani గారూ, మీ స్పందనకు కృతజ్ఞతలు!

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

Dear Sri Venu garu,

While going through your reflective Articles on Sri Dasari Subrahmanyam garu I had found yesterday an interesting hagiographical account of his with photographs of the house he lived in and the places he had frequented. It was a lovely sight to revisit everything down the memory lane. As I lost the web-link to your writing, I am adducing a comment here.

He was also an avid enthusiast of Horse Races and visited the Guindy Race Course religiously every Sunday with his friends. You had made a reference to his unassuming service at Chandamama organization for over five decades. Probably you didn’t have an inkling to the fact that he was in the habit of submitting a resignation letter there on a regular basis – once every few months; and, Sri B.N. Reddy garu, Sri Viswanatha Reddy garu or someone in the management would laugh it off and bail him out from the latest debt he had incurred at the Race Course by releasing his PF amount and he would be back to work. He enjoyed his addiction so well that he had a million stories to narrate of his experience on the field. Illustrious people like KRV Bhakta (Photographer, Vijayachitra), Penumaka Krishna Murthy (Assistant Film Director), Kanakamedala Venkateswara Rao (renowned poet, novelist and film producer) and Dhanikonda Hanumantha Rao (eminent author, Editor, Publisher and Printer) were his steadfast companions among others.

His practical sense of humour was formidable. He once took us to the Race Course and displayed his considerable skill at calculating odds at breakneck speed before betting. He was a master of the outlandish jargon on the field. After losing his salary for the month on the first day itself, he told us in a pensive mood:

“After playing for over four decades, I had found the secret why I am always losing at the horse races.”

He looked intensely at our inquisitive faces and continued the rumination with a straight face:

“You know, it was because I am always betting on the wrong horse!”
Such was his merriment even while amidst a crisis.

With best wishes,

Sincerely,
Elchuri Muralidhara Rao

kanthisena చెప్పారు...

వేణు గారూ,
కాళిదాసు... చందమామా కథనంలో మీరు పేర్కొన్న విషయాలు ప్రస్తుత చందమామలో రోజువారీగా, లేదా నెలవారీగా జరుగుతూ వస్తున్నవే. ఏకకాలంలో నలుగురు దిగ్గజ చిత్రకారులు చందమామకు వన్నెలద్దిన చరిత్ర గతించిన విషయమే. ఇప్పుడు భారతీయ భాషల్లో వస్తున్న చందమామ ఒరజినల్ చిత్రకారులు లేకుండానే నడుస్తోంది. ఒక్క శంకర్ గారు మాత్రమే కొత్త బేతాళ కథకు, మరో కొత్త కథకు బొమ్మలు కొత్తగా వేస్తున్నారు. దాదాపు 88 ఏళ్ల వయసులో ఆయనను వత్తిడి పెట్టడం ఇష్టంలేకే ఆయనకు బాగా పని తగ్గించడమైనది. ఇక కొత్త కథలకు సంబంధించి ఈ మధ్యనే చందమామ అలనాటి తాత్కాలిక చిత్రకారులు సీతారాం -సీతారామాచార్యులు- గారి సేవలను తిరిగి పొందగలుగుతున్నాము. దీంతో అనివార్యంగా జరుగుతున్నదేమిటంటే చందమామలో ప్రస్తుతం సగం కథలు పాతవి, సగం కథలు కొత్తవి వే్స్తున్న నేపథ్యంలో పాత కథలన్నింటికీ పాత చిత్రాలు ఉపయోగించండం, మీరు చెప్పినట్లు ఒకటీ రెండు కొత్త కథలకు కూడా సందర్భానికి తగినట్లుగా పాత చిత్రాలను ఉపయోగించడం అనివార్యమవుతోంది.

టూ కలర్ చిత్రాలను నాలుగు రంగుల చిత్రాలుగా మారుస్తున్న ప్రస్తుత అవసరంలో అనివార్యంగానే పాత ముఖచిత్రం ప్రకాశవంతమైన రంగుల సొగసులు అద్దుకుంటూ తన పాత పరిమళాన్ని పొగొట్టుకుంటోందనుకుంటాను. శంకర్ గారు గతంలో మాన్యువల్‌గా వపా, చిత్రా గార్ల బొమ్మలకు రంగులు అద్దేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పోవడంతో పాత చిత్రాలను ట్రేస్ పేపర్ ద్వారా తిరిగి గీసి వాటికి మళ్లీ రంగులు అద్దడం. ఇంకా సులభమార్గంగా పాత చిత్రాలను హై రిజల్యూషన్‌తో స్కాన్ చేయించి వాటికి కంప్యూటర్‌ సహాయంతో రంగులద్దడం.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న క్రమం.

నేననుకోవడం ఏమంటే దిగ్గజ చిత్రకారుల శకం ముగిసిన తర్వాత చందమామ ఇలా కొనసాగక తప్పదు. ఇంగ్లీష్ చందమామ, జూనియర్ చందమామలకు మాత్రమే పూర్తి స్థాయి చిత్రకారులు ఆధునిక శైలితో చిత్రాలు గీ్స్తున్నారు. దేశీయ భాషల చందమామలకు ఈ సౌలభ్యం లేకపోవడంతో చందమామకు అందుబాటులో ఉన్న 40 వేలకు పైగా పాత చిత్రాలను ఉపయోగించడం అనివార్యమే అవుతోంది.
అసలు విషయం ఇదీ మరి.

మీకు మరో ముఖ్యమైన విషయం తెలుపాలి. 2000 నుంచి 2009 వరకు దేశీయ చందమామల్లో దాదాపు అన్ని కథలూ పాత చందమామలలోవే తీసి వేసేవారు. 2010 నుంచి ఈ ధోరణి కాస్తమారి కొత్త కథలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. ఈ నేపథ్యంలో అన్ని కొత్త కథలూ బాగున్నాయని చెప్పలేము కాని పాత కథలతో పోటీ పడుతున్న అద్భుతమైన కొత్త కథలు ఇప్పుడు చందమామలో ప్రచురించబడుతూ 12 భాషల చందమామ పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

గత పాతికేళ్లలో ఎన్నడూ లేనిది చందమామ పాఠకుల పేజీ ప్రస్తుతం రెండు పేజీలకు పెరిగింది.

ఇక పాఠకుల చందమామ జ్ఞాపకాలు ఇటీవలి కాలంలో సంచలనాత్మక విజయం సాధించిన శీర్షికలాగా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఆస్ట్రేలియా, మలేషియా తదితర దేశాలనుంచి కూడా చందమామ పాఠకులు తమ మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉత్తరాలు, అనుభూతులు పంపడం జరుగుతోంది.

మొత్తంమీద మంచివిషయమే తడిమారు. అభినందనలు.
రాజు.

kanthisena చెప్పారు...

ఈ కథనంకి జోడింపుగా వచ్చిన మురళీధరరావు గారి వ్యాఖ్య దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కనుమరుగై ఉన్న విషయాలాను అద్భుతంIE తడిమింది. ఒక ప్రక్క కమ్యూనిజం పట్ల ప్రగాఢ విశ్వాసమూ,మరోవైపు మద్రాసు గిండీ రేస్ కోర్సుతో నిత్య సంబంధమూ.. ఎన్నటికీ అర్థం కాని వైవిధ్యపూరిత జీవితం. జీవితం ఇలాగే ఉండాలి, ఇలాగే బతకాలి అని మనం ఎవరినీ శాసించలేమనుకుంటాను.

పైగా 50 సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా మహానగరంలో ఒంటరి జీవితం గడిపిన దాసరి గారికి అనివార్యంగా వచ్చిన వ్యాపకాలలో భాగంగానే ఆయన రేసుగుర్రాల పిచ్చి, సిగిరెట్ వ్యామోహంని పరగణించవలసి ఉంటుంది.

ఒకటి మాత్రం నిజం చందమామలో నిరంతరం పనిచేస్తూ, రేసుకోర్సులో క్రమం తప్పకుండా హాజరవుతూ చందమామకు బయట దాదాపు 20 పైగా జానపద సీరియల్స్ ఎలా ఈయన రాయగలిగారనేది చరిత్రలో అతి గొప్ప నిగూఢ రహస్యంగా ఉండిపోతుందనుకుంటాను.

ఒక దశలో బొమ్మరిల్లు పత్రికకు మొత్తం కంటెంటును ఇచ్చి సాయపడిన ఘనత కూడా ఈయనకే ఆపాదించబడుతోంది. ఎలా సాధ్యం అంటే మనం జవాబు చెప్పలేమేమో..

ఒకటి మాత్రం నిజం.. దాసరి గారు 50 సంవత్సరాలకు పైగా బాలసాహిత్యానికే కట్టుబడిపోయారు. -ఆయన సాంఘిక కథలు పుస్తకంగా అచ్చయినప్పటికీ-

1970లు 80లలో తెలుగులో వచ్చిన బాలసాహిత్య పత్రికలన్నింటికీ ఈయన కథల కంట్రిబ్యూషన్ చేశారని తెలుస్తోంది.

ఇంత ఘనతర చరిత్రముందు చంద్రుడిలోని మచ్చలు ఏపాటివనిపిస్తుంది?

వేణు చెప్పారు...

నెలవంక (రాజు) గారూ!

మీ వ్యాఖ్య ద్వారా నా సందేహాలకు సమాధానాలు దొరికాయి! థాంక్యూ.

>> చందమామకు అందుబాటులో ఉన్న 40 వేలకు పైగా పాత చిత్రాలను ఉపయోగించడం అనివార్యమే అవుతోంది. >>

అంటే చందమామ బొమ్మల అభిమానిగా రాబోయే నెలల్లో మరిన్ని షాకులకు సిద్ధం కావాల్సిందేనంటారా?

ఏమైనప్పటికీ .. పాత కథలు వేసేటపుడు పాత చిత్రాలను ఎలాగోలాగు ఉపయోగించండి. కానీ కొత్త కథలకు పాతవాటిని (ముఖ్యంగా పాఠకాదరణ పొందిన సీరియల్స్ బొమ్మలు) ఉపయోగించటమే మానెయ్యమని నా గట్టి సూచన!

వేణు చెప్పారు...

నెలవంక (రాజు) గారూ!

మురళీధరరావు గారి వ్యాఖ్య దాసరి సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కనుమరుగై ఉన్న విషయాలాను అద్భుతంగా తడిమిందన్న మీ వ్యాఖ్య అక్షర సత్యం.

>> ఇంత ఘనతర చరిత్రముందు చంద్రుడిలోని మచ్చలు ఏపాటివనిపిస్తుంది? >>
నేను టపాలో చందమామను ఉద్దేశించి రాసిన ముగింపు వాక్యాల సారాన్నే మీరు దాసరి గారికి కూడా భలే అన్వయించారు !

వేణు చెప్పారు...

పాత బొమ్మనే మళ్ళీ ఉపయోగించటం గురించి మరికొన్ని సంగతులు -

36 ఏళ్ళ క్రితమే కాకుండా 10 సంవత్సరాల క్రితం కూడా మాయా సరోవరం (రెండో సారి) సీరియల్ గా చందమామలో వచ్చింది.

రెండు బొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తే ఓ విశేషం గమనించొచ్చు. కొత్తగా వేసిన కథలో పులి-మేక ఆట ఉంది కాబట్టి పాతదానిలో ఉన్న పచ్చీసు ఆట బొమ్మను మార్చేసి, పులి-మేక బొమ్మ వేశారు. అంతేనా? నేపథ్యంలో జూదమాడుతున్నవారినీ, ద్వారం దగ్గరున్న వ్యక్తినీ కొత్త బొమ్మలో తెలివిగా తొలగించేశారు!

యథాతథంగా వాడకుండా ఇలా ఎంతోకొంత మార్పులూ చేర్పులూ చేయటం ‘గుడ్డిలో మెల్ల’ అనుకోవచ్చేమో!