సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, డిసెంబర్ 2012, ఆదివారం

దొరికిందోచ్... ‘బొట్టు కాటుక’ సినిమా లోగో!

ప్పుడెప్పుడో... 2010లో ఓ పోస్టు రాశాను-  తెలుగు సినిమా లోగోల గురించి (logo-  అక్షరాకృతి) .  అందులో  నాకెంతో నచ్చిన ‘బొట్టు- కాటుక’ లోగో ప్రత్యేకత వివరించాను కానీ, అప్పట్లో ఆ లోగో దొరక్క అది ఎలా ఉంటుందో  వర్ణించి సంతృప్తి పడ్డాను.

కానీ ఇన్నేళ్ళ తర్వాత అది  దొరికింది!

నా చిన్నప్పుడు ఆసక్తిగా గమనించిన సినిమా లోగో... 
చిత్రకారుడు  గంగాధర్ పేరు తల్చుకుంటే  నాకు గుర్తొచ్చే  లోగో!
33 సంవత్సరాల తర్వాత పునర్దర్శనమిచ్చింది!


అప్పుడు ఆ పోస్టులో రాసిన కొన్ని వాక్యాలు ఇక్కడ ఇస్తున్నాను...

‘‘ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో!

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో. మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!’’


ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పోస్టు లింకు చూడండి..  http://venuvu.blogspot.in/2010/07/blog-post.html

ఇప్పుడెలా దొరికింది?

నెట్ లో ఏదో వెతుకుంటే ... ఓ యూ ట్యూబ్   లింకులో  ‘బొట్టు- కాటుక’ సినిమా కనపడింది!

నా కుతూహలం ఒక్కసారిగా పెరిగిపోయింది. (ఎందుకంటే...  వాల్ పోస్టర్లలో వాడని ఆ  లోగోను  టైటిల్స్ లో వాడారని  1980ల్లో  ఆ  సినిమా చూసినపుడు గమనించాను.. అది గుర్తుంది! )

వెంటనే  ఉత్కంఠతో ఆ సినిమా ప్లే చేశాను.
సెన్సార్ సర్టిఫికెట్ కనపడింది. తర్వాత...  పంపిణీదారుల పేరు, కృతజ్ఞతలు, బ్యానర్ పేరు.. వరసగా  ఒకదాని తర్వాత మరొకటి కంప్యూటర్ తెరపై కనపడసాగాయి.

అప్పుడు...
నా  సంతోషాన్ని పెంచేస్తూ-
ఎప్పటినుంచో అన్వేషిస్తున్న లోగో-
కనపడింది...!


ఆ దృశ్యాన్ని  f...r..e..e..z..e... చేశాను .
స్నాప్ షాట్   తీసుకున్నాను!

ఇదిగోండి.... చూడండి- 


పెదాల ఆకారంలో  ‘ఈస్ట్ మన్ కలర్’  అనే అక్షరాలు గమనించారా?

తర్వాత  ఆ సినిమా పాటల పుస్తకం కూడా  దొరికింది .

వాల్ పోస్టర్లలో ఉపయోగించిన లోగో దానిలో ఉంది.   అది-



మరో  సంగతి...
ఈ ఆన్ లైన్  అన్వేషణలో మరో సంగతి కూడా బయటపడింది.

ఇందాక లింకు ఇచ్చానే.. ఆ పోస్టును  జులై 16,  2010లో రాశాను. అదే  పోస్టు  సెప్టెంబరు 16, 2011 నాటి  సూర్య పేపర్లో కథనంగా వచ్చింది- కానీ మరొకరి పేరుతో!

నేను చేసిన వర్ణన,  రాసిన వ్యక్తిగత స్పందన కూడా దానిలో యథాతథంగా వచ్చేశాయి.
చూడండి-
http://www.suryaa.com/archives/Article.asp?cat=4&subCat=3&ContentId=47455

ఇది ఆన్ లైన్లో పెట్టారు కాబట్టి  15 నెల్ల తర్వాతయినా ఈ ఘరానా వ్యవహారం బయటపడింది.  లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదేమో! 

గతంలో కూడా ఇలా కొందరు బ్లాగర్ల టపాలను యథేచ్ఛగా కథనాలుగా వాడేసుకున్న చరిత్ర సూర్య పత్రికది.
ఈ ధోరణి లో  మార్పేమీ రాలేదన్నమాట! 

ఇలా చేస్తుంటే...  ఇకపై  ‘సూర్య’ను  ‘చౌర్య’ అని పిలవాలేమో...
 
*****
 
తాజా చేర్పు... 21.9.2022 
నిన్న శ్యామ్ నారాయణ గారు గుంటూరు నుంచి  ఈ సినిమా లోగోను మెయిల్లో పంపించారు.   పాటల రికార్డులపై ఉండే కవర్ . 
 
దీనిలో  ఇదే లోగో  కాస్త భిన్నంగా ఉంది.   ‘ బొట్టు’, ఈస్ట్ మన్ కలర్ అక్షరాలూ..  ఇంకా మరికొన్ని సూక్ష్మమైన తేడాలతో.  అంటే గంగాధర్ ఈ విలక్షణమైన లోగోను పదేపదే మెరుగుపరచటానికి ప్రయత్నించారన్నమాట.   మీరే చూడండి!
 

 

13 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

సూర్య వాళ్లు నా వంటలు ఇలాగే తీసుకున్నారు. ఇదేంటని అడిగితే సమాధానం కూడా ఇవ్వలేదు.

vijay చెప్పారు...

సూర్య ఓనర్ ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంలో కూడా దొరికిపోయాడనుకుంటాను.

sasi చెప్పారు...

Super undi logo.What a collection sir.Hats off to Gangadhar.That is creativity

Sagar Reddy చెప్పారు...

చాలా చాలా బావుందండి మీ వివరణ
మీరు చెప్పిన తరువాతే నేను కాటుక గ్రహించగలిగాను
అద్భుతం
ఇంత బాగా అక్షరాకృతి తయారుచేసిన గంగాధర్ గారికి
ఎన్ని ధన్యవాదములు చెప్పినా తక్కువే
పాటల పుస్తకం దొరికింది అన్నారు, మీకు వీలైతే ఇవ్వండి
దయచేసి

వేణు చెప్పారు...

జ్యోతి గారూ! ‘సూర్య’ పత్రికతో మీకూ చేదు అనుభవం ఉందన్నమాట.. అభ్యంతరం చెప్పినా సమాధానం ఇవ్వకపోవటం ఘోరం.

Vijay (Sekhar) గారూ! ఔను, ఏదో ఇలాంటి వ్యవహారంలోనే! ఆ పత్రికాధిపతి ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడనుకుంటాను.

వేణు చెప్పారు...

Sasi గారూ! అవునండీ. చిత్రకారుడు గంగాధర్ సృజన శక్తికి ఇదో చక్కని ఉదాహరణ!

Sagar Reddy గారూ! ఈ లోగోలోని అందమే అది! ఇప్పటికీ చాలామంది మీలాగే చప్పున ‘కాటుక’ అక్షరాలు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోతున్నారు. :)

ఈ సినిమా పాటల పుస్తకం కావాలంటే నాకు మీ మెయిల్ id తో మెయిల్ రాయండి!

GKK చెప్పారు...

వేణుగారు! ఈ logo గంగాధర్ గారి ultimate effort అని చెప్పవచ్చు. జాలంలోనుంచి ఇలాంటి అనర్ఘ రత్నాలను వెలికి తీయటంలో మీరు కడు నేర్పరి. సూర్యలో మీ టపాను ప్రచురించటం. well imitation is the best form of flattery. what a great artiste. thanks for the nice post.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ! థాంక్యూ.

ఈ సబ్జెక్టుపై ఆసక్తి ఉంది కాబట్టే... ఇది నాకు కనపడింది, అంతే. నెట్ అన్వేషణ సాఫల్యానికి సంబందించిన మీ వ్యాఖ్యలో నా నేర్పు కంటే మీ అభిమానమే ఎక్కువ ఉంది :)

గంగాధర్ గారి బొమ్మలు ఒక ప్రత్యేకశైలితో నాకెంతో నచ్చుతాయి. ఆర్యచాణక్యకు ఆయన వేసిన బొమ్మలు అప్పట్లో అమితంగా ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీశ్రీ అనే రెండక్షరాల్లో పేద, ధనిక ప్రతినిధులను వేసిన బొమ్మ ఒకటి ఉంది. దాని గురించి ఎప్పుడైనా రాయాలి!

Anil Vakkalanka చెప్పారు...

sir erojune nenumee blog choosa mansuki entho haye anipinchindi okka sari gangadhar agri gurinchi chandama gurinchi chaduvuthunte naa manasu vayasu 5 samvastharaalaipoyindi thnaku very much sir for such a beautiful blog

వేణు చెప్పారు...

Anil గారూ, ఈ బ్లాగు నచ్చినందుకు సంతోషం. థాంక్యూ!

BVJ చెప్పారు...

నేను ఇది చాలాసార్లు చూసాను వేణుగారు, చిన్నప్పుడు....మా కజిన్ కి హోం లైబ్రరీ వుండేది; అందులో చాలా చాలా నవలలతో పాటు (over 300) , 'సంక్షిప్త చిత్ర కధలూ కూడా వుండేవి ...వాటిలో ఇది ఒకటి. చదివినట్టుకూడా గుర్తు. కాని (నవ్వకండేం), కళ్ళకి వున్న కాటుక తప్ప, స్క్రిప్ట్ లో కాటుక, మీ పోస్ట్ లోనే మొదటిసారి గమనించాను నేను. :-(

వేణు చెప్పారు...

BVJ శ్రీనివాస్ గారూ, సంక్షిప్త చిత్ర కథలంటే బహుశా అవి ‘విజయ’ మాసపత్రికలో pullouts గా వచ్చి ఉండొచ్చు.

>> కళ్ళకి వున్న కాటుక తప్ప, స్క్రిప్ట్ లో కాటుక, మీ పోస్ట్ లోనే మొదటిసారి గమనించాను నేను. >> భలే రాశారుగా!

BVJ చెప్పారు...

Thanks వేణుగారు.

లేదు, పుల్ అవుట్స్ కాదు (కనీసం అన్నీ కాదు); నవలల లాగానే, ప్రతేకంగా ప్రింట్ చేయబడేవి. మా కజిన్ దగ్గర దాదాపు 30-40 'సంక్షిప్త చిత్ర కధలు (బొమ్మలతో)' :-) వుండేవి. I read almost all the books he had in his library (baDadeedi, agnipoolu and so on ...200 odd novels etc. :-) ) ...this was all in school days. I used to maintain these books an catalogues; binding them, numbering them, tracking who rented and returned etc. My cousin used to be in Sobhanbabu fan club in Bhimavaram ...so huge collection of Sobhanbabu stuff also. Not sure what he did with all those. :-)