సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

13, అక్టోబర్ 2013, ఆదివారం

ఎన్టీఆర్ ‘నర్తనశాల’... కమల్ ‘విశ్వరూపం’!


గొప్ప నటుల అభినయంలో  కనపడే  పోలికలు ఆసక్తికరంగా ఉంటాయి.  కమలహాసన్ నటన చూస్తుంటే  నాకు చాప్లిన్ గుర్తొస్తుంటాడు. (ఆయన్ని కమల్ తెలిసో తెలియకుండానో  అనుకరిస్తుంటాడని నా నమ్మకం).  అలాగే  ఒక్కోసారి  నవ్వుల  రాజబాబు కూడా కమల్ నటనలో తొంగిచూస్తుంటాడు!

ఈ మధ్య  ఎన్టీఆర్  ‘నర్తనశాల’ చూస్తుంటే  సన్నివేశపరంగా  కమల్ ‘విశ్వరూపం’ గుర్తొచ్చింది. 
 

 ‘నర్తనశాల’లో నాట్యాచార్యుడైన  బృహన్నల పాత్ర అర్జునుడిగా మారి శంఖం పూరించినపుడు ఎన్టీఆర్ చూపిన వైవిధ్యం అబ్బురంగా కనపడుతుంది. 

 ‘విశ్వరూపం’లో కూడా కథక్ డాన్స్ మాస్టర్ గా పరిచయమై,  నపుంసక ఛాయల్లో  హావభావాలూ, సంభాషణలూ పలికే కమల్ ఒక్కసారిగా  మెరుపు ఫైట్ చేసి హీరోయిన్ నీ, ప్రేక్షకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు!

 సినిమా ఇంకా  చూడని వారు ఆ trasformation సన్నివేశాన్ని యూ ట్యూ బ్ లో చూడొచ్చు.

స్వర్ణోత్సవ సందర్భంగా ....
ఇంతకీ ‘నర్తనశాల’ చిన్నప్పుడెప్పుడో చూశాను కానీ  ఈ మధ్య  ఈనాడు సినిమా పేజీలో కథనం రాయటం  కోసం ఒకటికి రెండు సార్లు ఆ సినిమాను  చూడటం తటస్థించింది.


ఈ  చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు

ఈ సినిమా విడుదలై యాబై ఏళ్ళయిన సందర్భంగా రాసిన ఆ కథనం ఇక్కడ-




అర్జునుడి రాకతో పరవశుడై ద్రోణుడు  ఆలపించిన తిక్కన పద్యం -  'సింగంబాకటితో గుహాంతరమునన్‌ చేడ్పాటు మైనుండి...’ సన్నివేశం చూడండి-




అర్జునుడిని బృహన్నలగా తొలిసారి  చూసినపుడు ద్రౌపది (సావిత్రి)  ముఖంలో హావభావాలు
‘సఖియా వివరించవే...’

ఈ పాట పాడుతుంటే... తొలిసారి సైరంధ్రిని చూస్తాడు కీచకుడు.
 

ఆమెపై  మరులుగొని సెగలు కక్కుతున్న మోహావేశాన్ని తన ముఖకవళికల్లో అనితర సాధ్యంగా ప్రతిఫలించిన ఎస్.వి. రంగారావు

ఉత్తర గోగ్రహణం అడ్డుకున్న  యుద్ధంలో కౌరవ సేనపై  అర్జునుడి సమ్మోహనాస్త్ర ప్రయోగం 

అతిథి పాత్రలో నాటి అందాల తార కాంచనమాల

శ్రీమద్విరాట పర్వము

‘నర్తనశాల’ చూశాక  ఎన్టీఆర్  ప్రపంచ రికార్డు ‘పంచ పాత్రలు ’ వేసిన  ‘శ్రీమద్విరాట పర్వము’ ఎలా ఉందో అని ఆసక్తి కలిగింది.

చూశాను!

‘నర్తనశాల’ విడుదలైన  పదహారు సంవత్సరాలకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నమిది.

‘నర్తనశాల’ సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయకుడు (బాల మురళీ కృష్ణ) దీనికి కూడా పనిచేశారు.  ముఖ్యంగా ఎన్టీఆర్ నిర్మాణ - దర్శక బాధ్యతలతో పాటు  రెండు పాత్రల నుంచి ఐదు పాత్రలకు తన కృషిని విస్తరించారు. 

తగిన  ఫలితం రాకపోవటానికి  ఎన్నో కారణాలు...!

ద్రౌపది పాత్ర  ( సావిత్రి)   రూపకల్పనకు  ఎంతో విరుద్ధంగా ఉంది  వాణిశ్రీ ధరించిన పాత్ర.   

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు  పనిచేయలేదు సరే;   సావిత్రి , ఎస్వీ రంగారావులు లేని లోటు బాగా కనపడింది.  ఎల్. విజయలక్ష్మి లేకపోవటం కూడా! 

‘నర్తనశాల’లో  బృహన్నల పాత్రపై   తీసుకున్న శ్రద్ధ,  జాగ్రత్తలు  ‘శ్రీమద్విరాటపర్వము’ లో  కనిపించలేదు.

అసలు  స్క్రిప్టులో,  పాత్రల తీరుతెన్నుల్లోనే లోపాలుండటం ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం!

18 కామెంట్‌లు:

vijay చెప్పారు...

అంతా బాగుంది గాని విరాట రాజును తిక్కమనిషిగా చూపించడానికి కమలాకర గారు ఇచ్చిన వివరణ అర్ధవంతంగా లేదు. పిరికివాడికి జన్మనిచ్చిన తండ్రి, కీచకుడి చెప్పుకింద బతికిన రాజు తిక్క మనిషి ఎలా అవుతాడు? అయితే (అయితేనే) పిరికివాడు అవుతాడు గాని!

రమాసుందరి చెప్పారు...

విశ్వరూపం నేను చూడలేదు కాని నర్తకశాల సాంకేతికంగాను, సంగీత నృత్య పరంగాను అప్పటి ప్రామాణికాలకు మించిన సినిమా. ఎస్వీరంగారావు, సావిత్రి ముఖ భంగిమలను భలే పట్టుకొన్నారు.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

నర్తన శాలలో ఎన్టీఆర్,ఎస్వీఆర్,సావిత్రి గారలు పోటీపడి నటించారు! ఫిలిం ఫెస్టివల్లో బహుమతి మాత్రం ఎస్వీఆర్ గారికే వచ్చింది! జాతీయ బహుమతులలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం అదే!దానికిముందు కాని,దాని తర్వాత కాని ఆ స్థాయిని ఏ తెలుగు చిత్రం అందుకోలేదు! మనకుమాత్రం ప్రథమ బహుమతి అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడూ రాలేదు! మనం ఇప్పుడు తీసే సినిమాలన్నీ మూస సినిమాలేగా!ఇప్పుడు తెలుగు సినిమాల స్థాయి,ప్రమాణాలు చవకచవకగా అధోస్థాయిలో ఉన్నాయి! పెడుతున్న ఖర్చులు మాత్రం మిన్నంటి కూర్చున్నాయి!

వేణు చెప్పారు...

JUBV PRASAD- ‘ఈ అభిప్రాయాన్ని మీ బ్లాగులో వెయ్యలేక పోయాను. పెద్దదై పోయిందని గోల పెట్టింది వెబ్ సైటు’ అంటూ మెయిల్ కి పంపించారు.

రెండు భాగాలుగా ఆయన స్పందన ఇస్తున్నాను...

ఈనాడులో మీ వ్యాసం చదివాక, నాకు కలిగిన కొన్ని భావాలు రాయాలని అనుకున్నాను. మీరు, ఆ వ్యాసం బ్లాగులో ఎప్పుడూ పెడతారా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు పెట్టేశారు. ఆ వ్యాసమే కాకుండా, ఇంకా కొన్ని వేరే విషయాలు కూడా రాశారు. అన్ని విషయాల మీద నా అభిప్రాయాలూ, నాకు అనిపించినవీ కలగాపులగంగా రాసేస్తాను.

మొదటగా, మీరు, "... నపుంసక ఛాయల్లో హావభావాలూ....", అని రాశారు. నా అభిప్రాయం ఇది ఒక తప్పు మాట. కమల హాసన్‌ పాత్రకి సంబంధించి కూడా. నాట్యంలో అనేక హావ భావాలను, ఫ్యూడల్ సాంప్రదాయాల రీత్యా, స్త్రీత్వానికి సంబంధించినట్టుగా భావిస్తారు. ఎవరైనా పురుషుడు, ఆ హావ భావాలని ప్రదర్సిస్తే, అతను, స్త్రీలా హావ భావాలను ప్రదర్శిస్తున్నాడని అంటారు. నాట్యం శివుడి దగ్గర్నించీ వచ్చిందంటారే గానీ, ఆ రంగంలో స్త్రీలే అధికంగా వున్నారు. ఎన్నో అంశాలు స్త్రీలకి సంబంధించినవే వున్నాయి. ప్రియుడి కోసం ఎదురు చూసే ప్రేయసి నృత్యాన్ని, ఒక పురుషుడు అభినయిస్తే, ఆ పురుషుడు స్త్రీలా హావభావాలు చూపిస్తున్నాడంటారు. అలా స్త్రీత్వపు (ఫ్యూడల్ సాంప్రదాయం ప్రకారం) హావ భావాల్ని పురుషుడు చూపిస్తే, అతన్ని, "ఆడంగి" అనీ, "నపుంసకుడు" అని అనేస్తారు. ఆ సినిమాలో, కమల్ హాసన్ పెళ్ళయిన మనిషి. కధక్ నాట్యం నేర్పుతూ వుంటాడు. దాన్నిండా స్త్రీలు అభినయించే హావ భావాలే. స్త్రీల నాట్య అంశాలూ, పురుషులు నాట్య అంశాలూ వేరుగా వున్నప్పుడే, ఈ మాటలు మారతాయి.

"నపుంసకత్వం" అనేది ఒక శారీరక లోపం, అది ఎలా వచ్చినా సరే. దాన్ని అవహేళన చెయ్యడం సరైన విషయం కాదు. ఆ పదాన్ని తప్పు సందర్భాలలో వాడటమే, దాన్ని అవహేళన చెయ్యడం. (ఇంకా ఉంది)

వేణు చెప్పారు...

... (రెండో భాగం)

నర్తనశాల సినిమా గురించి. నాకూ ఇష్టమే, ఈ సినిమా అన్నా, పాటలు అన్నా, సావిత్రి నటన అన్నా. చాలా సార్లు చూశాను చిన్నతనంలో.

పెద్దయ్యాక చూసినప్పుడు ఒకటి అస్తమానూ అనిపిస్తూ వుండేది. అంత పెద్ద పొట్ట వేసుకుని వున్న రామారావుని, అందరూ కృష్ణుడిగా, రాముడిగా, అర్జునుడిగా ఎలా ఆరాధించారా అని ఒకటే ఆశ్చర్యం నాకు. బహుశా ఆ మొహం వల్లా, ఆ మొహంలో పలికే అభినయం వల్లా అయి వుండొచ్చు.

"జయ గణ నాయక.." అన్న పాట నాకు చాలా ఇష్టం. మీరు రాసింది చదివాక, యూట్యూబ్ లో ఆ పాట మళ్ళీ చూశాను. నాట్యం గురించి కొంత అర్థం చేసుకున్నాక, రామారావూ, విజయలక్ష్మిల నాట్యాలు నచ్చ లేదు బొత్తిగా.

మొదట రామారావు నృత్యం గురించి. ఆయన, వెంపటి సత్యం దగ్గర ఒక నెల పాటు నృత్యం నేర్చుకున్నాడన్నారు. ఏం నేర్చుకున్నాడో నాకు బొత్తిగా అర్థం కాలేదు. కేమేరా ఎక్కువగా విజయలక్ష్మినే చూపించడం వల్ల, రామారావుకి వచ్చే నెగిటివ్ మార్కులు తగ్గాయని అనుకుంటాను. నాట్యానికి అతి ముఖ్యమైన అరమండి అనే భంగిమని రామారావు ఒక్క సారి కూడా పెట్ట లేదు. సరే, వదిలేద్దాం. ఆయన గురువు. అంతా చెయ్యక్కర్లేదు. చేసిన కాస్తా కూడా ఏడం కాళ్ళేసుకుని, గడ కర్రలా నించుని చేశాడు. ఎక్కువ అడుగులు కూడా లేవు. అదీ వదిలేద్దాం. హస్త విన్యాసాలు వుంటాయి నృత్యంలో. పతాక అనేది ఒక హస్త విన్యాసం. అయిదు వేళ్ళూ దగ్గరగా, నిలువుగా పెట్టి, బొటన వేలు మాత్రం పై కణత దగ్గర వంచుతారు. విజయలక్ష్మి ఆ విన్యాసాన్ని చక్కగా చేసింది. రామారావు, తన చేతి వేళ్ళని ఎడం ఎడంగా పెట్టి, అతి ఘోరమైన హస్త విన్యాసం వేశాడు. ఒక్క కటకా ముఖ హస్త విన్యాసం మాత్రం కాస్త సరిగా చేశాడు. అది కూడా, భుజాలు కిందకి దింపేసి, చాలా చెత్తగా కనిపించే విధంగా చేశాడు. ఆ నాట్య దర్శకులు ఈయన చేత ఆ మాత్రం చేయించ లేక పోయారంటే ఆశ్చర్యమే. నాట్యం గురించి బొత్తిగా తెలియని వాళ్ళని బాగా అలరిస్తుందీయన నృత్యం. కాస్త తెలిసున్న వాళ్ళని మాత్రం చికాకు పెడుతుంది.

ఇక విజయలక్ష్మి నృత్యం. ఈవిడ అరమండి భంగిమ పెట్టింది గానీ ఆ అరమండి అంత బాగోలేదు. కింద పాదాల మధ్య బోలెడంత ఎడం. ఒక పాదం దూరంగా పెట్టి, ఒక అడుగు వేసి, వెనక్కి తీసుకు వచ్చినప్పుడు, అది రెండో పాదానికి దగ్గరగానే లేదు. చాలా గేప్ వుంది రెండు పాదాల మధ్యా.

"విజయలక్ష్మి చాలా స్పీడుగా నృత్యం చేస్తుందని రామారావుగారన్నారని" రాశారు. ఈ స్పీడుగా నృత్యం చెయ్యడం ఏమిటో? ఇదేమన్నా ప్రభుదేవా నృత్యమా? ఒక శాస్త్రీయ నృత్య అంశానికి ఒక రిథం వుంటుంది. ఆ రిధంకి అనుగుణంగా, కొన్ని అడుగులు ఒక స్పీడులోనూ, మరి కొన్ని అడుగులు మరొక స్పీడులోనూ వేస్తారు. సాధారణంగా ఒక అడుగు మూడు స్పీడులలో వేస్తారు. సెకనుకి ఒక అడుగూ, సెకనుకి రెండు అడుగులూ, సెకనుకి నాలుగు అడుగులూ. లాస్‌ ఏంజలీస్‌లో వుండే ఒక నాట్య పాఠశాలలో, సెకనుకి ఎనిమిది అడుగులు వేయడం కూడా నేర్పుతారని విన్నాను. అప్పుడు ఆ రిథం ఆ స్పీడుకి తగ్గట్టుగా వుండాలి. ఇదంతా, అప్పటికప్పుడు ఆలోచించి చెయ్యరు ఎవరూ. ప్రతీ నాట్య అంశానికీ, ముందరే నాట్య అడుగుల్ని నిర్ణయించి, వాటినే సాధన చేస్తారు. నాట్యంలో వుండే అనేక రీతుల్ని (స్టైలుల్ని) బట్టి, ఒకే రిథానికి అనుగుణంగా, రకరకాల అడుగులు వేస్తారు.

పురుషులు నాట్యాచార్యులుగా వుంటే, వారిని నపుంసకులుగా పరిగణించడమో, సినిమాలో అలా చూపించడమో చాలా ఘోరమైన విషయం. ఏటి నించీ కుండతో నీళ్ళు తెస్తూ, కృష్ణుడి కోసం వెదుకుతున్న గోపిక నృత్యం ఒక పురుషుడి చేత చేయిస్తే, ఎలా వుంటుందీ?

"సాగరం సంగమం" సినిమా చూసే వుంటారు. అందులో కమల్ హాసన్ చేసిన నృత్యాలు నాకు చాలా నచ్చక పోయినా, ఏ నృత్యంలోనూ, స్త్రీల హావ భావాలు లేవు. "విశ్వ రూపం" సినిమాలో మాత్రం అలా చూపించారు.

అయితే, కధ ప్రకారం, బృహన్నలది నపుంసక పాత్ర. అది వేరే సంగతి.

మొత్తానికి ఈ నాట్యంలో సినిమా నాట్యం పాళ్ళే ఎక్కువ, శాస్త్రీయ నృత్యం పాళ్ళ కన్నా, సాగర సంగమం సినిమాలో లాగా.

hari.S.babu చెప్పారు...

విరాట రాజుని తిక్కగా చూపించదానికి సంబంధించి నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను.మన నాటక లక్షణాల్లో ఒక పాత్ర యే ప్రయోజనాని కైతే ఉద్దేశించబడిందో ఆ స్వభావాన్ని మొదటి నుంచీ హైలైట్ చేసి ప్రేక్షకుల ముందుంచి అవగాహన కల్పించదం అనే సూచన ఉంది. ఆ రకంగా చూస్తే విరాట రాజు తన యొక్క అసలైన ప్రయోజనం తెలిసే సన్నివేశంలో అతడు ప్రదర్శించింది - తన కొడుకుని అతిగా పొగడడం, ధర్మరాజు అర్జునుడ్ని పొగిడితే అది సహించలేక అప్పుడు చేతిలో ఉన్న పాచికల్ని విసిరి గాయపర్చటం - తిక్కగానే ఉంది కదా. దాన్నే సినిమా మొదటి నుండీ ఎస్టబ్లిష్ చెయ్యడంలో తప్పు లేదు.
ఇక విరాట రాజు కానీ ఉత్తర కుమారుడు కానీ మరీ అంత పిరికి వాళ్ళు కాదు. కురుక్షత్ర యుద్దంలో పాండవుల తరపున యుధ్ధం చేస్తారు. వాళ్ళు కూడా వీరులే. కాకపొతే అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు ఒక్కసారిగా భీష్మ ద్రోణాదు లందర్నీ చూస్తే కొత్తగా యుధ్ధ్దానికి బయల్దేరిన వాడికి అలాగే ఉంటుంది మరి.

అజ్ఞాత చెప్పారు...

వేణూ గారూ,

నేను నిన్న రాసిన దానికి కొనసాగింపు ఇది.

ముందరగా, "హస్త విన్యాసం" అనేది అంత సరైన పద ప్రయోగం కాదు."హస్త ముద్ర" అనేదే సరైన పద ప్రయోగం. ముందర తట్ట లేదు.

"విరాట పర్వం" సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సినిమా కొంచెమే గుర్తు నాకు. అందులో, కీచకుడు, ద్రౌపదిని అనుమానిస్తాడు. ఇష్టపడి నట్టు నటిస్తాడు. భీముడిని చితక బాదేస్తాడు. సత్యనారాయణ, భీముడి వేషంలో, చాలా చావు దెబ్బలు తింటాడు. చివరలో, కీచకుడిని హతమార్చలేక, కత్తితో పొడిచి చంపుతాడు. అలా పొడిచాడని, "పిరికి బంద" (ఈ తిట్టో, మరొకటో గుర్తు లేదు) అని తిట్టి, మొహం మీద వుమ్ముతాడు. కీచకుడు, భీముడి మొహం మీద వుమ్ముతాడు! అప్పుడు, మన ద్రౌపది, అదే మన వాణిశ్రీ, వికట్టహాసం చేస్తుంది, కీచకుడు మరణిస్తున్నందుకు. ఈ సినిమా చూస్తే, పాండవులు చెడ్డవాళ్ళనీ, ద్రౌపది దుష్టురాలనీ, కీచకుడు మహా ఉత్తముడనీ అర్థం అవుతుంది.

"నర్తనశాల" సినిమాలో, ఇంద్రుడు వేషం వేసినాయన, మా మేనమామ కూతురి మామగారు. ఆయన్ని ఎప్పుడూ చూడలేదనుకోండీ. కొన్నేళ్ళ కిందట మరణించారని విన్నాను.

"నర్తనశాల" సినిమాలో ఒక సంఘటన వుంది. నాకు ఎప్పుడూ అది సరిగా అర్థం అయ్యేది కాదు. ఆ పిట్ట కధలో, కాంచన మాలా, సూర్యకాంతం ఒక పిల్లాడి గురించి, "నా పిల్లాడంటే, నా పిల్లాడ"ని ఘర్షణ పడతారు. అంటే, ఇద్దరికీ పిల్లాడంటే, (సమానంగా కాకపోయినా) ప్రేమ వుందనీ, ఆ పిల్లాడు తమకే కావాలనీ కదా, అర్థం? ఆ వివాదానికి తీర్పుగా (వాళ్ళని పరీక్షించడానికే అనుకోండీ), ధర్మరాజు, పిల్లాడిని రెండు భాగాలు చేసి, చెరో భాగాన్నీ చెరో తల్లీ తీసుకోవాలంటాడు. దానికి సూర్యకాంతం (నిజం తల్లి కాదు ఈవిడ) మౌనంగా అంగీకరించడమో, లేక నిజంగా అంగీకరించడమో చేస్తుంది. కాంచన మాల (నిజం తల్లి ఈవిడ) మాత్రం, తన పిల్లాడిని రెండు భాగాలు చెయ్యడానికి వీలు లేదూ, ఎక్కడో ఒక చోట జీవించి వుండాలీ అంచెప్పి, పిల్లాడిని రెండు భాగాలు చెయ్యడానికి ఒప్పుకోదు. దాని వల్ల, ఆమే నిజమైన తల్లి అని ధర్మరాజు గ్రహించి, ఆమెకే పిల్లాడిని అప్పగిస్తాడు. చిన్నప్పుడు కూడా, అసలు తల్లికి న్యాయం జరిగినందుకు సంతోషించాను గానీ, ఒక విషయం అర్థం కాలేదు. ఆ విషయం ఇప్పుడూ అర్థం కాదు. పిల్లాడి కోసం (ప్రేమ కొద్దీ గానీ, ఇష్టం కొద్దీ గానీ - ఎందుకంటే, ఆ పిల్లాడికి ఏవేవో సంపదలున్నట్టూ, వాటి కోసమే సూర్యకాంతం ప్రయత్నిస్తున్నట్టూ ఎక్కడా కధలో లేదు) రాజు కొలువులో కూడా (శిక్ష పడుతుందేమోననే భయం కూడా వదులుకుని) అంత ఘర్షణ పడే సూర్యకాంతం, పిల్లాడిని రెండు భాగాలు చేస్తానంటే ఎలా ఒప్పుకుంటుందీ? అసహజంగా లేదూ ఆ కధనం? ఆ పాత్ర ఏమన్నా పిచ్చిదా, రెండు భాగాలు చేసినా పిల్లాడు బతికే వుంటాడనుకోవడానికి? తెలివి తక్కువగా అనిపిస్తుందీ కధ.

- ప్రసాద్

అజ్ఞాత చెప్పారు...

వేణూ గారూ,
మరీ సతాయిస్తున్నానని అనుకోక పోతే, ఒక చిన్న అనుమానం.
"జయ గణ నాయక" అనే పాటలో కూచిపూడి నృత్యం చూపించారని ఒకాయన తన బ్లాగులో రాశారు. నాకున్న అతి తక్కువ నృత్య జ్ఞానంతో చూసినా, అది కూచిపూడే నని అనిపించింది - ఒక చోట మాత్రం భరత నాట్యంలో వున్న ఒక అడవు కనబడింది - బహుశా అది కూచిపూడిలో కూడా వుండొచ్చు లెండి - నాకు కూచిపూడి బాగా తెలీదు. అలాగే, రామారావు వెంపటి (పెద) సత్యం దగ్గర నేర్చుకున్నారని రాశారు. ఈ వెంపటి వారు కూచిపూడి గురువులని చదివాను. వీటన్నిటి వల్లా ఆ నృత్యం కూచిపూడిదేనని ఒప్పేసుకుందాం. ఇప్పుడొక ప్రశ్న. భారతం కాలం నాటికి కూచిపూడి వుందా? ఈ కూచిపూడి నృత్య రీతి ఈ మధ్య కాలంలో (ఏభైలలో అని ఎక్కడో చదివాను) వచ్చినది కదా? దాన్ని భారత కధలో ఎలా చూపించారూ?
ఎన్ని అనుమానాలో నాకు!!
ప్రసాద్

వేణు చెప్పారు...

@ vijay: మీ సందేహం బాగుంది. మహాభారతం ప్రకారం చూసినా విరాటరాజు యోధుడే. అయినా కీచకుడికి లొంగివుండటం (ఏ కారణం వల్లనైనా సరే) అతడి లోపం. దీన్నిబట్టి ‘నర్తనశాల’లో అలా పాత్రను మార్చివుంటారు.

@ honey: ఎస్వీ రంగారావు, సావిత్రి పాత్రలకు సంబంధించి ఈ దృశ్య భంగిమలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటిని కాప్చర్ చేసి ఇచ్చాను. థాంక్యూ!

వేణు చెప్పారు...

@ సుజాత: పాటలన్నీ బాగున్నా- సుశీల గొప్పగా పాడిన సఖియా వివరించవే, జననీ శివకామినీ పాటలు ప్రత్యేకంగా నాకిష్టం.

కమల్ కీ, ఎన్టీఆర్ పాత్రల పోలిక నాకు తట్టిందే. కమల్ కు ఎస్వీ రంగారావు నటన అంటే ఇష్టం కాబట్టి ‘నర్తనశాల’ చూసేవుంటాడు. ఆ ప్రభావం పరోక్షంగానైనా ‘విశ్వరూపం’లో ప్రతిఫలించీ ఉండవచ్చు.

నటనాపరంగా ఎన్టీఆర్- ఎస్వీరంగారావు- సావిత్రి.. ఈ ముగ్గురికీ సమానంగా నా ఓటు :)

వేణు చెప్పారు...

@ hariSbabu: ఈ సినిమాలో చూపిన విరాటరాజు ‘తిక్క’ను భలే సమర్థించారే!

అయితే అరణ్యపర్వంలోని యక్ష ప్రశ్నలను విరాటరాజు అడిగినట్టూ ధర్మరాజు సమాధానాలు చెప్పినట్టూ చూపించటం మాత్రం బాగా లేదు. సినిమాలో విరటును పాత్ర స్వభావం/పరిధి దృష్ట్యా చూసినా అలాంటి గంభీరమైన ప్రశ్నలను అతడు అడగటం అసహజమే!

వేణు చెప్పారు...

@ JUBV Prasad: వివరంగా వ్యాఖ్యలు రాసినందుకు థాంక్యూ !

>> ‘"నపుంసకత్వం" అనేది ఒక శారీరక లోపం, అది ఎలా వచ్చినా సరే. దాన్ని అవహేళన చెయ్యడం సరైన విషయం కాదు. >> మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
>> పురుషులు నాట్యాచార్యులుగా వుంటే, వారిని నపుంసకులుగా పరిగణించడమో, సినిమాలో అలా చూపించడమో చాలా ఘోరమైన విషయం. >> ఔను.

నపుంసకులను అసమర్థతకు ప్రతీకగా చూపటం అన్యాయమే. కానీ ఈ ధోరణి సమాజంలో ఉంది.

‘ విశ్వరూపం’ సినిమా ప్రకారం కమల్ (పాత్ర ) నడకలో, సంభాషణల్లో కూడా నపుంసక వైఖరి కనపడుతుంది. మంచితనం ఉన్నా పిరికితనం కూడా ఉంది. అతడిపై భార్యకూ, ఆమె ప్రియుడికీ కూడా
తక్కువ భావమే ఉంటుంది. స్త్రీల హావభావాలుండే ‘కథక్’నాట్యం చేయటం వల్ల ఈ పాత్రకు నిర్దేశించిన స్వభావం ఎస్టాబ్లిష్ అవుతుందని దర్శకుడు భావించాడనుకుంటాను.

సినిమా సంగీతాలు కానీ, నాట్యాలు కానీ అసలు కళలకు ఛాయలు మాత్రమే. వాటిని యథాతథంగా, పద్ధతి ప్రకారం తీసేంత శ్రద్ధ దాదాపు ఎవరికీ ఉండదు. ప్రేక్షకుల్లో కళల గురించి వివరంగా తెలియనివాళ్ళే ఎక్కువ కాబట్టి లోపాల గురించి చర్చలు తక్కువ వినపడుతుంటాయి.

>> కేమెరా ఎక్కువగా విజయలక్ష్మినే చూపించడం వల్ల, రామారావుకి వచ్చే నెగిటివ్ మార్కులు తగ్గాయని అనుకుంటాను. >> నాదీ ఇదే ఫీలింగ్.

ఎల్. విజయలక్ష్మికి మంచి డాన్సర్ అనే పేరుతో పాటు ఆమెకు స్పీడ్ డాన్సర్ అనే పేరుంది (ట). ఆ వేగానికి కూడా కొన్ని లెక్కలున్నాయని మీ వ్యాఖ్య ద్వారానే తెలిసింది.

ఇద్దరు తల్లుల వివాదంలో మీ వాదన అర్థవంతం.

కూచిపూడి నాట్యం ప్రాచీనమైనదే. అయితే ఇప్పటిరూపంలో ఉండేది కాదట. క్రీ.పూ. ఒకటో శతాబ్దం నాటికే ఇది ఉంది. 15 శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి దానిలో సంస్కరణలు తెచ్చాడు. 1950లలో దాని ప్రాచుర్యం పెరిగింది. ఏమైనా ఈ నాట్యం మహాభారత రచనాకాలం (క్రీ.పూ. 3-4 శతాబ్దాలు?) నాటికి లేదు కాబట్టి బృహన్నలా, ఉత్తరా ఆ నాట్యం చేసినట్టు చూపించటం లోపమే.

దీనిపై నాకు అసలు సందేహమే రాలేదు! మీ పరిశీలన అభినందనీయం.

అజ్ఞాత చెప్పారు...

హరి గారు, "ఇక విరాట రాజు కానీ ఉత్తర కుమారుడు కానీ మరీ అంత పిరికి వాళ్ళు కాదు. కురుక్షత్ర యుద్దంలో పాండవుల తరపున యుధ్ధం చేస్తారు. వాళ్ళు కూడా వీరులే. కాకపొతే అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నట్టు ఒక్కసారిగా భీష్మ ద్రోణాదు లందర్నీ చూస్తే కొత్తగా యుధ్ధ్దానికి బయల్దేరిన వాడికి అలాగే ఉంటుంది మరి." అని రాశారు.

ఉత్తర కుమారుడికి ఇది అన్నప్రాశనే అనుకుందాం. ఈ అన్న ప్రాశనప్పుడు కూడా అతను ఏమీ తినలేదు, అంటే యుద్ధం ఏమీ చెయ్యలేదు, అనుభవం కోసం. అంటే, అన్న ప్రాశనే జరగలేదు. రథం నడిపాడంతే. పోనీ, ఆ యుద్ధం చూసి చాలా నేర్చేసుకున్నాడా అంటే, అదీ లేదు. వాళ్ళందరూ, కాసేపు పద్యాలు పాడేసుకున్నారు ముందరగా. ఆ తర్వాత అర్జునుడు నమస్కార బాణాలు వేశాడు. ఆ తర్వాత సమ్మోహనాస్త్ర్హం వేసి, యుద్ధం అక్కడికి ముగించాడు. అంత మంది కౌరవుల్లో, ఒక్కడంటే ఒక్కడు కూడా చిన్న మట్టి బెడ్డ అయినా, అర్జునుడి మీదకి గానీ, ఉత్తర కుమారుడి మీదకి గానీ విసరలేదు. కాబట్టి, ఆ యుద్ధంతో ఉత్తర కుమారుడికి పిరికి తనం అయితే వచ్చింది గానీ, ధైర్యం నేర్చుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత, వేరే యుద్ధాలు ఏమీ లేకుండా, వేరే అనుభవం ఏమీ సంపాదించే వీలు లేకుండా, కురుక్షేత్రం మొదలయ్యింది. అప్పటికి, ఉత్తర కుమారుడు మంచి వీరుడయిపోయాడు. అదెలా సాధ్యం? అన్న ప్రాశనే లేకుండా, అన్నం కూడా కలుపు కోకుండా, ఉత్త ఆవకాయ మాత్రమే ఎలా తిన్నాడూ అతను? అర్థమే కాలేదు నాకు.

అసలు ఈ బాణాల యుద్ధమే అర్థం కాదు నాకు. భీముడూ, దుర్యోధనుడూ గదల యుద్ధం చేశారంటే, బాగానే అర్థం అవుతుంది. వీళ్ళందరూ బాణాలు ఆకాశంలోకి వేస్తారు. అవి అక్కడ కొన్ని మాయలు చేసి, చివర్లో తగిల్తే తగులుతాయి. ఒకళ్ళ మీదకి ఒకరు డైరెక్టుగా బాణాలు వేసుకోరు. అన్నీ అస్త్రాలే అన్న మాట. వాటికి గురి ఎందుకో బొత్తిగా అర్థం కాదు. కురుక్షేత్రం మొదటి రోజు, భీష్ముడు బాణాలు వేసి ఎంతో మంది పాండవ సైనికులని హతమార్చేడు అని చదువుతాము. ఇది అంత కన్నా అర్థం కాదు. బాణాలతో అంత మంది సైనికులని ఎలా హతమారుస్తాడూ? ఏదో అస్త్రం వేసి, కొంత మంది సైనికులని ఒకే సారి హతమారుస్తున్నాడనుకోండీ. అప్పుడు మిగిలిన సైనికులు, రాయో, రప్పో, కత్తో, కర్రో విసర్రా? ఈ పురాణ యుద్ధాలు బొత్తిగా సహజత్వానికి దూరంగా జరుగుతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య బాణాల యుద్ధమో, కత్తుల యుద్ధమో బాగానే అర్థం అవుతుంది. ఒకడు రధం మీద కూర్చుని, ఉత్త బాణాలతో, వేలకు వేల సైనికులని చంపేశాడంటే, అస్సలు అర్థమే కాదు. మహేష్ బాబే నయం, మన సినిమాల్లో. ఒకటీ, రెండు డజన్ల మందినే బాదేస్తాడు, అది కూడా వాళ్ళు, చాలా న్యాయంగా, ఒకరి తర్వాత ఒకరు వస్తేనే. అందరూ ఒకే సారి మీద పడితే ఏం చేస్తాడో! డైరెక్టరు అలా పడనియ్యడు. ఒక వేళ అలా పడ్డా కూడా, నోటితో గాలి వూది, వాళ్ళని చెల్లా చెదురు చేసేస్తాడు లెండి. మన పురాణ యుద్ధాల్లో కూడా అలాంటి గొప్పలు వున్నాయని అర్థం చేసుకోవడమే మార్గం. రథంలో వున్న ప్రతీ ఒక్కడికీ నేల మీద వున్న సైనికులు చీమల్లాగా కనబడతారు కామోసు, చక చకా హతమార్చడానికి.

ప్రసాద్

అజ్ఞాత చెప్పారు...

వేణూ గారూ,

మీరు, "‘ విశ్వరూపం’ సినిమా ప్రకారం కమల్ (పాత్ర ) నడకలో, సంభాషణల్లో కూడా నపుంసక వైఖరి కనపడుతుంది. మంచితనం ఉన్నా పిరికితనం కూడా ఉంది. అతడిపై భార్యకూ, ఆమె ప్రియుడికీ కూడా
తక్కువ భావమే ఉంటుంది. స్త్రీల హావభావాలుండే ‘కథక్’నాట్యం చేయటం వల్ల ఈ పాత్రకు నిర్దేశించిన స్వభావం ఎస్టాబ్లిష్ అవుతుందని దర్శకుడు భావించాడనుకుంటాను. " అని రాశారు.

అసలు మీ దృష్టిలో, "నపుంసక వైఖరి" అంటే ఏమిటీ? ఒక పురుషుడు, ఒక స్త్రీ లాగా, వయ్యారంగా, తిప్పుకుంటూ, మాటలు సాగదియ్యడమా? ఈ సినిమాలో కమల్ చేసింది అది మాత్రమే. అది కూడా, ఆడవాళ్ళ నృత్యాలు చేసీ, చేసీ, ఎంతోమంది ఆడవాళ్ళకి అవి నేర్పించీ, నేర్పించీ వచ్చిన తిప్పుకోవడం అది. పెళ్ళి చేసుకుని, భార్యతో వున్న పాత్రని, ఆ భార్య ఆ భర్త మీద చిన్న చూపుతో వున్నా, నపుంసక పాత్ర అని ఎలా అంటారూ? ఆ పాత్ర నపుంసకుడని ఎక్కడా ఎవరూ అనలేదు. ఎంతో మంది నిజమైన నపుంసకులకి, ఎటువంటి తిప్పుకోడాలూ, వయ్యారాలు పోవడాలూ వుండనే వుండవు. ప్రతీ నపుంసకుడూ, బృహన్నల పాత్ర లాగా, తిప్పుకుంటూ వుండనక్కర్లేదు. పిరికితనం కూడా నపుంసక లక్షణం కాదు. ఆ సినిమా నేనూ చూశాను. వాళ్ళు తమకు కావాలన్నట్టుగానే తీశారు. ఎంతో మంది ఆడపిల్లల మధ్య పెరిగిన కొంత మంది మగ పిల్లలకి, ఆ తిప్పు కోవడం వచ్చేస్తుంది, రోజూ రోజూ చూసి. అంత మాత్రం చేత వాళ్ళు నపుంసకులైపోరు. నపుంసకత్వం వేరూ, ఆడ వాళ్ళలా తిప్పుకుంటూ, వయ్యారాలు పోతూ నడవడమూ, మాట్టాడ్డమూ వేరు. ఆ సినిమాలో కమల్ పాత్ర, నపుంసక పాత్ర కాదు.



ప్రసాద్

వేణు చెప్పారు...

@ సుజాత: మీ సందేహం కరెక్టే. ‘విశ్వరూపం’ సినిమాకు ఇన్ స్పిరేషన్ విరాటపర్వం కథేనని కమలహాసన్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడట.

ఇవాళ నెట్ చూస్తుంటే ఈ సమాచారం కనపడింది.

1) Kamal Haasan mentioned in an interview that the one liner of this story was an inspiration from Virata Parva of the Mahabharata.

If we try to relate it now, in fact, Wisam's character is a mix of the mythological Arjuna (who, transforming into a eunuch in Virata's
Kingdom, is an acclaimed dance-exponent) and Bhima (who is a great cook, and so is Wiz in this film). His uncle/boss Shekhar Kapoor is like a mentor, much like Krishna to Arjuna. And, Mr. Kapoor is aptly named Jagannath (another name by which Lord Krishna is known)!

(February 28, 2013 by karthik S)

వేణు చెప్పారు...

ప్రసాద్ గారూ,
ఔను. కమల్ ది ఈ సినిమాలో నపుంసక పాత్ర కాదు. ఆ తరహా పాత్ర మాత్రమే!

సుజాత వేల్పూరి చెప్పారు...

ప్రసాద్ గారూ,

నపుంసక పాత్రలు వాటి వైఖరి మీద మీ అభిప్రయాలతో ఏకీభవిస్తున్నాను.

కాకపోతే సినిమాలేవీ సమాజ పరిథిని దాటి ముందుకు పోవు కదా! విశ్వరూపంలో కమల్ ది మహా వీరుడి పాత్ర. కానీ అతడు మహావీరుడని తెలీకూడదు బయటికి. కనీసం భార్యకు కూడా! అందుకే నాట్యాచార్యుడుగా స్త్రీ పాత్రలు వొలికిచే వొయ్యారాలతో భార్యకు కూడా యాక్ అనిపించేలా (అలా ఆడ ఒయ్యారాలు ఒలకబోసే భర్త అంటే మండదా మరి). ప్రవర్తిస్తాడు. ఆమె పని చేసే ఆఫీస్ లోనే ఆమె మరొక వ్యక్తితో పరిచయం పెంచుకోడానికి ఈ వైఖరితో అతడే దారిని సుగమం చేస్తాడు. ఎందుకంటే అతడిని కూడా ఇతడు పరిశీలిస్తున్నాడు కాబట్టి, భవిష్యత్తులో భార్య సహకారం అక్కడ అవసరం అవుతుందనీ.... కదా!

ఈ నేపథ్యంలో కమల్ పాత్రను అర్థం చేసుకోవాలి తప్ప డాన్స్ చేసినంత మాత్రాన నపుంసకుడని నిర్థారించలేం! అసలు నపుంసకులు అలా తిప్పుకుంటూ ఉంటారని కూడా అన్ని చోట్లా చెప్పలేం! వారిలో చాలా మంది స్త్రీలలా అలంకరించుకోవడం, కొన్ని చోట్ల ఆ లక్షణాలతో ఉంటారు కాబట్టి సినిమాల్లో మరీ సర్వత్రా అదే వాడేస్తున్నారు.