ఈ పోస్టు టైటిల్ చూసి ‘ఇది కొత్తగా తెలిసిన విషయమా?’ అని కొందరికైనా అనిపించవచ్చు. మరీ కొత్తది కాకపోవచ్చు కానీ...
నలబై ఏళ్ల క్రితమే చరిత్రలో నమోదైన వాస్తవమిది!
* * *
‘‘ వీర రుద్రమదేవి విక్రమించిననాడు
తెలుగు జెండాలు నర్తించె మింట’’ - దాశరథి
దాదాపు నూరేళ్ళ క్రితం... 1918లో రాసిన తెలుగు నవల ‘రుద్రమ దేవి’ని ఈ మధ్య చదివాను. రచయిత ఒద్దిరాజు సీతారామచంద్ర రావు (1887- 1956). తెలంగాణ వైతాళికులుగా పేరుపొందిన- బహుముఖ ప్రజ్ఞాశాలురైన ఒద్దిరాజు సోదరుల్లో ఈయన ఒకరు.
రుద్రమదేవి ఘనత గురించి స్థూలంగా తెలుసు గానీ, ఒక నవలా రూపంలో చదవటం ఇదే తొలిసారి. 1950 ప్రాంతంలో రాసిన నోరి నరసింహశాస్త్రి గారి నవల బాగా ప్రాచుర్యం పొందినా దాన్నింకా చదవలేదు.
ఒద్దిరాజు గారి నవల దానికంటే పాతది. బహుశా రుద్రమదేవి గురించి తెలుగులో వచ్చిన ప్రథమ నవల ఇదే!
గ్రాంథిక భాషలో రాసిన ఈ ‘ఆఖ్యాయిక’ ను చదవటం కష్టంగా ఏమీ అనిపించలేదు. (పంచతంత్రాన్ని చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గార్లు రాసిన గ్రాంథిక భాషలో చదవటం ఇష్టపడతాన్నేను.)
కథనం ఆసక్తికరంగా ఉండటంతో పాటు కథా రచనా కాలం దృష్టిలో పెట్టుకుని అప్పటి రచనా విధానాన్ని పరిశీలిస్తూ చదవటం.. బాగుంది కూడా!
ముఖ్యంగా రచనలో ఉపయోగించిన తెలుగు పలుకుబడులు నాకెంతో నచ్చాయి.
కొమ్ముల గోసిన యెద్దు కోడె కాజాలదు
పేదకు బిడ్డలెక్కువ
వంట ఇలు జొచ్చిన కుందేలు తప్పిపోగలదా?
రుద్రమదేవి సామాన్యురాలు గాదు. ఆవులించిన ప్రేవుల లెక్కించును
రుద్రమదేవి మగవారి జంపి పుట్టిన యాడుది
రుద్రమదేవి కనులు తలకెక్కినవి (ఇవన్నీ.. ఆమె శత్రువుల మాటలు)
చేటెరుగని బోటి! నాకు చక్కట్లు గరపుదానివైతివా?
తలదాకి వచ్చినప్పడుమ్మలించిన లాభము లేదు
కార్యమంతయు వెల్లింగలిపిన చింతపండయ్యె గదా?
ఇంటినుండి పిల్లి యైనను బైట బోలేదని మేము నొక్కి చెప్పగలము
రచనా కాలానికి లభించిన శాసనాలనూ, ఇతర వనరులనూ ఆధారంగా చేసుకుని రాసిన నవల ఇది. మూడు సంవత్సరాల్లోనే రెండో ముద్రణకు వచ్చింది. మూడో ముద్రణ 93 సంవత్సరాల వ్యవధి తర్వాత ... ఈ సంవత్సరమే ( 2014) రావటం అసలైన విశేషం.
రచయిత కుటుంబ సభ్యుల చొరవ దీనికి కారణం!
రుద్రమా- మనవడూ..
రుద్రమదేవి జీవితానికీ, ఆమె జీవిత చరిత్రకారులకూ, మనవడి బంధానికీ ఏదో సంబంధం ఉన్నట్టుంది.
ఆమె తర్వాత కాకతీయ రాజ్యాధికారానికి వచ్చింది ఆమె మనవడైన ప్రతాపరుద్రుడని మనకు తెలుసు.
ఈ రుద్రమదేవి నవల పునర్ముద్రణకు కారకులైన- రచయిత మనవడు రామ్ కిషన్ రావు, రచయిత మనవడి మనవడైన శ్రీహర్ష (యు.ఎస్.లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్)ల ఫొటోలను చివరి అట్టమీద ఇచ్చారు :)
నవల ముఖచిత్రంగా కీ.శే. కొండపల్లి శేషగిరిరావు గారి వర్ణచిత్రాన్ని ఉపయోగించారు. చూడగానే ఆకట్టుకునేలా ఉందీ బొమ్మ. తొలి మలి ప్రచురణల్లో ఏ ముఖచిత్రం ఉందో తెలియదు.
వెనిస్ చరిత్రకారుడు మార్కోపోలో రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించి ఆమె పాలన గురించి రికార్డు చేశాడు. ‘ఈ రాజ్యం రాజు పాలిస్తున్నట్టు ఉంది కానీ, స్త్రీ పాలనలా లేదు. ఈమెను రాజు అనక తప్పదు ’ అని ప్రశంసించాడు.
ఆమె రూపంలో కూడా పురుష లక్షణాలు కొంత ప్రతిఫలించేలా చేసి చిత్రకారుడు .. మార్కోపోలో వ్యాఖ్యను గుర్తుకు తెస్తున్నట్టు లేదూ? ( పోస్టు ఆరంభంలో ఇచ్చిన- శేషగిరిరావు గారు వేసిన- బొమ్మను పరిశీలించండి).
కానీ దానికంటే మించి- నిరంతరం యుద్ధాల చికాకులు చుట్టుముట్టినప్పటికీ - సాగునీటి కొరత రాకుండా చెరువులు తవ్వించటం లాంటి మంచి పనులతో సామాన్య ప్రజలకు మేలు చేసినందుకు ఆమెను శ్లాఘించాలి.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదున్న విగ్రహం |
ఏడొందల ఇరవై ఐదు ఏళ్ళ క్రితం...
క్రీ.శ. 1289 సంవత్సరం నవంబరు 27.
అంటే ఇవాళ...
రుద్రమదేవి కన్నుమూసిన రోజు!
ఈ సంగతి 1974 వరకూ చరిత్రకు అందలేదు. అప్పటివరకూ ఆమె 1295-1296 వరకూ జీవించివుందనే భావించారు.
అంతే కాదు; ఆమెది సహజ మరణమైవుంటుందనే నమ్ముతూ వచ్చారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలోని చందుపట్ల గ్రామంలో శివాలయ ప్రాంగణంలో కనిపించిన శిలా శాసనం ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది.
యుద్ధంలో మరణించినట్టు ఆ శాసనంలో లేదు. రాజు (రాణి) తో పాటు సేనాధిపతి ఒకే సమయంలో చనిపోవటం కేవలం యుద్ధ సమయంలోనే జరిగే అవకాశం ఉంది ఆ రకంగా రుద్రమదేవి యుద్ధ సందర్భంలోనే చనిపోయివుండాలి.
భారతి మే 1974 సంచికలో చరిత్ర పరిశోోధకుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి గారు ఈ విషయాలను చర్చిస్తూ సవివరంగా వ్యాసం రాయటంతో ఈ సంగతి ప్రపంచానికి తెలిసింది.
రుద్రమదేవి... తన అధికారాన్ని ధిక్కరించిన అంబదేవుడిపై యుద్ధానికి వెళ్ళి సేనాధిపతి మల్లికార్జున నాయునితో సహా రణరంగంలో మరణించిందనే సంగతి వెల్లడైంది!
శిలా శాసనం ప్రస్తుతం ఇలా ఉంది (హిందూ పత్రిక సౌజన్యంతో) |
(వ్యక్తుల మీద పగ... వారి కుటుంబాలనే కాకుండా, చివరకు వంశాన్నే నాశనం చేసేలా ప్రేరేపిస్తుందన్నమాట...)
ఈ తుది సమరం చేసినపుడు రుద్రమదేవి వయసు.. 80 సంవత్సరాలు!
ఆ వయసులో రుద్రమ యుద్ధానికి వెళ్తుంటే యువకుడైన ప్రతాపరుద్రుడు గానీ, మరెవరు గానీ వద్దని వారించలేదా? ఆమె యుద్ధరంగంలోనే చనిపోయిందా? అక్కడ గాయపడి తర్వాత మరణించిందా?
ఇవన్నీ తీరని సందేహాలే!