సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, జనవరి 2015, గురువారం

మాటలకు మెరుపులద్దిన గణేశ్ పాత్రో!


తెలుగు సినిమా సంభాషణల రచయిత గణేశ్ పాత్రో గురించి ఈ బ్లాగులో రాయాలని చాలాకాలం క్రితమే అనుకున్నాను. కానీ చాలా అశ్రద్ధ చేశాను.

ఆ  రాయదల్చిన పోస్టు ఒక  ‘జీవితకాలం’ లేటుగా పరిణమించింది.  గణేశ్ పాత్రో జనవరి 5న చనిపోవటానికి  రెండు రోజుల ముందు యాదృచ్ఛికంగా  ఆయన రాసిన ‘మనిషికో చరిత్ర’  డైలాగ్స్ ను మిత్రులకు గుర్తు చేశాను కూడా!

మొత్తానికి ఈ విషయంలో నన్ను పశ్చాత్తాపం ఆవరించింది.  అందుకే ...  వెంటనే ఏమీ రాయబుద్ధి కాక, ఇన్ని రోజులూ ఆగిపోయాను. 

ఒక వ్యక్తి జీవించివున్నపుడు కాకుండా చనిపోయిన వెంటనే ఆ వ్యక్తి  ఘనత గురించీ,  ప్రత్యేకతల గురించీ ఏకరవు పెట్టడం  నాకు సబబుగా అనిపించదు.  ఆ ప్రత్యేకతల గురించి రాయదలిస్తే బతికివున్నపుడే రాయాలి.  ఆ  వ్యక్తి  మనం రాసింది చూస్తారనీ, చూడాలనీ కాదు. 

చదివే వారి సంగతే ఇక్కడ ప్రధానం.  ఆ వ్యక్తి విశేషాలు బతికివున్నపుడే  పాఠకులకు తెలియాలి.  అలా కాకపోతే-  ‘ ఈ సంగతులన్నీ ఆయన జీవించివున్నపుడే తెలిస్తే బాగుండేది కదా... ‘ అని పాఠకులకు ఉసూరుమనిపిస్తే సరి కాదు కదా?

ఒక వ్యక్తి మరణించాక ఏమీ రాయకూడదని అనటం లేదు. ఎప్పుడో చనిపోయినవారి గురించి గుర్తు చేసుకోవటం వేరు. కానీ  సమకాలీనులమై ఉండి కూడా ఒక వ్యక్తి మరణ సందర్భం వరకూ ఆ మంచిమాటలేవో రాయకుండా ఆగిపోతే మాత్రం అది  అన్యాయమే. కావాలని ఆగకపోయినా అశ్రద్ధ వల్ల నేనీ  పొరపాటే చేశాను.

* * *

ణేశ్ పాత్రో బాలచందర్ కు  ‘తెలుగు ముఖమై’ నిలబడ్డారని గొల్లపూడి మారుతీరావు అన్నమాట అర్థవంతం.

తెలుగు సినిమాల్లో హీరో వాచాలత,  పంచ్ డైలాగుల కాలుష్యం  ఎక్కువైన ఈ రోజుల్లో పాత్రోచితంగా,  మెరుపు మాటలు రాసిన రచయితలూ ఉన్నారని  ఇప్పటి  యువతరానికి బహుశా తెలియదు. అలాంటి రచయితల్లో  గణేశ్ పాత్రో ఒకరు. 

మంచి కథ ఉండి,  పాత్రల మధ్య సంఘర్షణ ఉంటే  గణేశ్ పాత్రో కలం విశ్వరూపం దాలుస్తుంది. క్లుప్తంగా,  సూటిగా,  పదునుగా , భావగర్భితంగా ఉండే సంభాషణలు..  ప్రేక్షకుల్లో నాటుకుపోతాయి. సున్నితమైన హాస్యం తళుక్కుమంటుంది.

ఆయన గొప్పగా మాటలు రాసిన  సినిమాల జాబితా  చెప్పాలంటే.. 
మరో చరిత్ర,  ఆకలి రాజ్యం, నాలాగ ఎందరో, అందమైన అనుభవం, ఇది కథ కాదు, గుప్పెడు మనసు,  మనిషికో చరిత్ర,  సంసారం- ఒక చదరంగం, స్వాతి, పుణ్యస్త్రీ, మయూరి, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు....

కొన్ని చిత్రాల్లో  ఆయన రాసిన  కొన్ని సంభాషణలు గుర్తుచేస్తాను.


‘ఆకలి రాజ్యం’  (దర్శకుడు - బాలచందర్ )
 ఈ సినిమా అప్పటికింకా చూడకముందే   రివ్యూను  ‘సితార’లో చదివాను.  గణేశ్ పాత్రో సంభాషణలు  ‘పాత్రోచితం’గా ఉన్నాయని రాసిన వాక్యం బాగా గుర్తు.  (రివ్యూ చేసింది  గుడిపూడి శ్రీహరి గారనుకుంటాను). ఆ చిత్రంలో  పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా మహాకవి  శ్రీశ్రీ కవిత్వ పాదాలను కథానుగుణంగా తెలివిగా, అర్థవంతంగా వాడుకుంటూ సంభాషణలు రాయటం చాలా నచ్చింది.

ఆకలి బాధతో  డబ్బుల కోసం శ్రీశ్రీ మహా ప్రస్థానం మొదలైన పుస్తకాలను కథానాయకుడు తూకానికి అమ్మేసిన సందర్భంలో  కథానాయికతో తన బాధను పంచుకున్న సంభాషణలు- 

‘విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయిలు’

‘ఆకలేసీ  కేకలేశాడు శ్రీశ్రీ.  నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ’
 
‘మూడు రూపాయిలున్నాయి. ఇవి కూడా ఖర్చయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు’


‘మా నాన్న గారితో బీరాలు పలికాను. నా బతుకు నేనే బతుకుతానని. ఎలాగైనా బతకాలంటే ఎలాగోలా బతికేద్దును. కానీ ఇలాగే బతకాలనుకున్నాను.  అదీ వీలుపడదు ఈ దేశంలో’


‘నాలాగ ఎందరో’ (దర్శకుడు- ఈరంకిశర్మ)
బాలచందర్ పర్యవేక్షణలో తయారైన  చిత్రమిది. దీనిలో  నటుడు హేమసుందర్, నటి రూప పాత్రలకు  రాసిన మాటలు మనసు కదిలించేలా బాగుంటాయి.


‘సంసారం- ఒక చదరంగం’ (దర్శకుడు- ఎస్.పి. ముత్తురామన్) 
ఈ చిత్రం పొడవునా మాటల ఆణిముత్యాలే.  ముఖ్యంగా గొల్లపూడి , సుహాసిని పాత్రల సంభాషణలు. 

‘ఫుణ్యస్త్రీ’(దర్శకుడు రవిరాజా పినిశెట్టి)
కార్తీక్, రాజేంద్రప్రసాద్ లు నటించిన చిత్రం. ముఖ్యంగా కార్తీక్ పాత్రకు రాసిన మాటలు బాగుంటాయి.


‘సీతారామయ్య గారి మనవరాలు’ (దర్శకుడు- క్రాంతికుమార్)
ఈ సినిమాలో  అక్కినేని కుటుంబం సమక్షంలో  ఆయన  కొడుకు రాజా- వాళ్ళ అక్కల సంభాషణ-( రాజా పెళ్ళి సంబంధం గురించి...)

‘తమ్ముడూ... నాన్న ఎవరికో మాట ఇచ్చాడు’-
‘నేను మనసు ఇచ్చానక్కా!’


ఇదే చిత్రంలో మీనాను అమెరికా తిరిగి వెళ్ళిపొమ్మంటూ  అక్కినేని చెప్పే దృశ్యం ఎంతో ఆర్ద్రంగా ఉంటుంది. ఆ సన్నివేశంలో అక్కినేనికి గణేశ్ పాత్రో రాసిన మాటలు-

‘ఇరవై ఏళ్ళుగా మా గుండెల్లో దాచుకున్న బాధను గుండెల్లోనే పెట్టుకుని  మామూలుగా బతుకుతున్నాం.  ఏ ఆశలూ, నిరాశలూ, ఎదురుచూపులూ, ఎదురుదెబ్బలూ లేకుండా ఉన్నాం. కానీ నువ్వు వచ్చిన తర్వాత  మా బతుకుల్లో ఏదో అలజడి బయల్దేరింది.


అంటే నువ్వు రావడం తప్పని కాదమ్మా... నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావ్.... కానీ మాకేం జరిగింది?  చెడు....   


వాడు లేని వెలితి నిన్ను చూసినప్పుడల్లా గుర్తుకొస్తోంది....

ఈ రాత్రికే వెళ్ళు.....  అమ్మా..!  వెళ్ళేటపుడు ఎవరికీ చెప్పొద్దు. చెపితే నిన్ను ఎవరూ వెళ్ళనివ్వరు. ఎవరో ఎందుకూ....?  నాకే నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు!’



 ‘మనిషికో చరిత్ర’ (దర్శకుడు- తాతినేని ప్రసాద్)
ఈ సినిమాలో సంభాషణలు చాలా ప్రత్యేకం. గొల్లపూడి మారుతీరావుకు  ఇంటిముందు చెత్తకుప్పలో డబ్బులు దొరుకుతాయి. అప్పుడు  అతడిలా అంటాడు-

‘ఇది చెత్త కుండీయా? తిరపతి హుండీయా?’.

ఇంకా ఆయన  గొప్పగా రచన చేసిన సినిమాల్లో  కోట్ చేయదగ్గ  సంభాషణలు చాలానే ఉన్నాయి.  మాస్ కమర్షియల్  పంథాలో నాటు మాటలు అందించిన కొన్ని ‘భార్గవ్ ఆర్ట్స్’ చిత్రాలూ లేకపోలేదు. కానీ అవి  గణేశ్ పాత్రో ప్రతిభకు అద్దం పట్టేవి కావు.

ఆయన రచనా పటిమను సమర్థంగా వినియోగించుకున్న దర్శకుల్లో బాలచందర్,  క్రాంతికుమార్, కోడి రామకృష్ణలు ముందు వరనలో నిలుస్తారు! 


* * *

 ‘పాత్రోచితం’ పేరుతో  ‘సితార’లో  వారం వారం ఓ కాలమ్ రాశారు చాలాకాలం క్రితం.

ఆ కాలమ్ లో...  తన తొలి విమాన ప్రయాణం గురించి రాసింది మాత్రం గుర్తుంది. నటి జమున ఆయనతో ప్రయాణించారట. సీటు బెల్టు సరిగా ఎలా పెట్టుకోవాలో  ఆమెను అడగటానికి మొహమాటం వేసి,  ఎంత అసౌకర్యంగా, భయం భయంగా ప్రయాణం చేసిందీ సరదాగా వివరించారాయన. భేషజాలకు పోకుండా విషయం చెప్పేసివుంటే  ఆ ప్రయాణాన్ని చక్కగా ఆస్వాదించి వుండేవాణ్ణని రాశారు.

గణేశ్ పాత్రో  రాసిన ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’ నాటకాల గురించి వినటమే. అవి ఇంకా చదవలేదు.  

 బాలచందర్ తో పనిచేస్తూ  సెట్లోనే అప్పటికప్పుడు దర్శకుడికి  తట్టిన సన్నివేశాలకు కూడా వెంటనే మాటలు సమకూర్చటంలో  గణేశ్ పాత్రో నేర్పు సాధించారు. ‘అందమైన అనుభవం’లో అలాగే కొన్ని సన్నివేశాలు రూపుదిద్దుకున్నాయి.. 

గణేశ్ పాత్రో...   ‘బాలచందర్  తెలుగు ముఖం’గా  ఎంతగా  ప్రాచుర్యం పొందారంటే... తను మాటలు రాయకపోయినా   ‘అంతులేని కథ’ను కూడా గణేశ్ పాత్రో  ఖాతాలో  చేర్చేసేటంత!

5 కామెంట్‌లు:

రామ్ చెప్పారు...

వేణు గారు
మీరు స్మరించుకున్న పాత్రో గారి 'బాణిముత్యాలు' బాగున్నాయి.
నా వాటాగా - నాకు గుర్తు ఉండి పోయిన -'పాత్రో'చిత సంభాషణం :

"రుద్రవీణ"చిత్రం లో జెమినీగణేషన్ క్లైమాక్స్ స్పీచ్ లో భాగంగా వస్తుంది -- "సంగీతం అంటే సంఘహితం అని నాకు ఇప్పటికి అర్ధమయింది"

Padmarpita చెప్పారు...

కుదురైన కూర్పుతో తెలియని విషయాలని తెలిపారు. బాగుందండి.

GKK చెప్పారు...

వేణు గారు: గణేశ్ పాత్రో గారి సంభాషణలు simple గా ఉంటూనే చప్పున ఆకట్టుకుంటాయి. మంచి సినీ రచయిత. subtle sense of humour కూడా కనిపిస్తుంది. గొఫాల గొఫాల లో పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా.'కొన్నిసార్లు వ్రాయటం లేటేమో కానీ రాయటం మాత్రం పక్కా'గా చక్కగా వ్రాశారు మీరు.

రమణ మూర్తి చెప్పారు...

రంగా (కమల్ హాసన్)కి ఉద్యోగం కావాలి. అసలే పేదరికంలో మగ్గిపోతున్న రంగాకి అదనపు భారం కావడం ఇష్టం లేక, దేవి (శ్రీదేవి) - ప్రతాప్ (పోతన్) తో పెళ్ళికి సిద్ధపడుతుంది. అయితే ఒక కండిషన్ - ప్రతాప్ తన తండ్రితో మాట్లాడి రంగాకి ఉద్యోగం వేయించాలి. ఉద్యోగం ఇచ్చాకే పెళ్ళి. రంగా అంటే నచ్చని కారణంగా కడుపు మండిపోతున్నా, ప్రతాప్ కి కాదనలేని పరిస్థితి. దేవి అంటే అంత 'పిచ్చి' ఇష్టం అతనికి.
పై కథ జరుగుతున్నప్పుడే, రంగాకి ప్రతాప్ తండ్రితో ఓ పార్కులో పరిచయం అవుతుంది. చదువుకున్న నిరుద్యోగి అని తెలుసుకున్న ఆయన, అతన్ని తన ఇంటికి రమ్మంటాడు - ఉద్యోగం విషయమై. అయితే, ఆయనకి కొంచెం మతిమరుపు.
కాసేపయ్యాక ఇంటికి వచ్చిన రంగాని అతికష్టం మీద గుర్తుపట్టిన ఆ పెద్దాయన, అతన్ని ఇంటి లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఈ లోగా - ప్రతాప్, దేవితో మెట్లు దిగుతూ కిందికి వస్తుంటాడు. దేవిని ప్రతాప్ తో చూసిన రంగా అవాక్కయిపోతాడు.
పరిచయాలు. పెద్దాయన రంగాని ప్రతాప్ కీ, దేవికీ పరిచయం చేస్తాడు. ఫలానా - ఎమ్మే - నిరుద్యోగి అనీ, తను ఉద్యోగం ఇస్తున్నాననీ. రంగా పేరు మాత్రం ఆయనకి గుర్తుండదు. ఆ తర్వాత, రంగాకి ప్రతాప్ నీ, దేవినీ పరిచయం చెయ్యాలి.
"మా అబ్బాయి - ప్రతాప్" అని పేరు బాగానే చెప్తాడు. "ఈ అమ్మాయి మా వాడి గర్ల్ ఫ్రెండ్ - పేరు... " అని తడుముకుంటూ ఉంటాడు.
ఈ సీన్ లో ప్రతాప్, ఆ అమ్మాయి పేరు దేవి అని చెప్పాలి. సాధారణంగా "నేను చెప్పానుగా, దేవి!" అని ఉండాలి.
కానీ, అలా చెప్తే, తన తండ్రికి ఒక్కడికే సమాధానం చెప్పినట్లవుతుంది. కానీ, ఈ సీన్ లో ప్రతాప్ కి మంచి అవకాశం దొరికింది. ఆ అమ్మాయి పేరు 'దేవి' అని తండ్రికి చెప్పాలి; తను దేవికి చాలా దగ్గర అని చెప్పి రంగా కడుపు ఇంకా మండించాలి; తన తండ్రి రంగాకి ఉద్యోగం ఇవ్వబోవడం తన రికమెండేషన్ వల్లనే అని అప్పనంగా ఆ క్రెడిట్ కొట్టేయాలి.
అన్నింటికీ కలిపి - ఒకే ఒక్క డైలాగ్. అది కూడా, పై డైలాగ్ ని స్వల్పంగా మారిస్తే వచ్చే ఎఫెక్ట్!
"నేను చెప్పానుగా, దేవీ?"
..
'ఆకలిరాజ్యం' సినిమా అది. అలాంటి సన్నివేశం కల్పించడానికి బాలచందర్ లాంటి దర్శకుడు ఎంత అవసరమో, గణేష్ పాత్రో లాంటి ప్రతిభావంతుడు కూడా అంతే అవసరం.

వేణు చెప్పారు...

వ్యాఖ్యాతలకు కృతజ్ఞతలు. లేటుగా ప్రతిస్పందిస్తున్నందుకు ఏమీ అనుకోకండి..

@ రామ్: మీరు చెప్పిన గణేశ్ పాత్రో కొటేషన్ చాలా బాగుంది. నాకు గుర్తు రాలేదు.

@ Padmarpita: మీ స్పందనకు కృతజ్ఞతలు

@ తెలుగు అభిమాని: మీరన్నట్టు subtle sense of humour పాత్రో సంభాషణల్లో ఒక ముఖ్యమైన లక్షణం. ‘ఇది కథ కాదు’ సినిమా మొదట్లో రైల్లో జయసుధ గురించి తెగ ఆరా తీస్తున్న భార్యతో పీఎల్ నారాయణ చెప్పే డైలాగ్ ఇలాంటిదే!

@ రమణమూర్తి: మీరు ప్రస్తావించిన ఆకలిరాజ్యం సన్నివేశం- ఆ సంభాషణా బాగున్నాయి. థాంక్యూ.