‘ఆహారమూ, నీళ్ళూ లేకుండా ఎంతకాలం జీవించగలం?’
ఇలాంటి ప్రశ్నే పుస్తకాల విషయంలో నన్ను అడగవచ్చు.
‘పుస్తకాలూ, పత్రికలూ అసలేమీ చదవకుండా ఎన్ని రోజులు ఉండగలవు?’ అని.
పుస్తకాలను ప్రాణ సమానంగా ఇష్టపడేవారు ఎంతోమంది.
ఆ జాబితాలో నేనూ చేరతాను!
* * *
చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పత్రికల మీదుగా అడుగులు మొదలయ్యాయి.
సచిత్ర వార- మాస పత్రికలూ, డిటెక్టివ్, సాంఘిక నవలలూ, కథానికల మీదుగా... నా సాహిత్య పఠనం కొనసాగింది.
ఎవరైనా అంతేనంటారా?
అయితే, అందరిలాగే నేను కూడా!
పుస్తక పఠనం నాకు చాలా చిన్న వయసులోనే అప్రయత్నంగా అలవాటయింది.
నాలుగో తరగతిలో ఉన్నపుడు - తొమ్మిదేళ్ళ వయసులోనే ‘ చందమామ’లో వచ్చే ‘విచిత్ర కవలలు’ సీరియల్ ను నెలనెలా ఎంతో ఆసక్తితో చదివేవాణ్ణి. దానిలో చిత్రా వేసిన బొమ్మలు ఇష్టంగా ఉండేవి. కొత్త సంచిక కోసం ఎదురుచూసేవాణ్ణి.
పది సంవత్సరాలప్పుడు ఆంధ్రప్రభ వారపత్రికలో కార్టూనిస్టు బుజ్జాయి కామిక్ సీరియల్ ‘న్యాయానికి భయం లేదు’ చాలా భాగాలు చదివాను.
బొమ్మలను ఆస్వాదిస్తూ చదవటం అలా మొదలైంది.
చందమామలో బొమ్మలను చూడగానే సంతకంతో సంబంధం లేకుండా అవి చిత్రా, శంకర్, వ.పా. , జయ, రాజి- ఎవరు వేసినవో గుర్తుపట్టటం సరదాగా ఉండేది.
ఇంట్లో అన్నయ్యలు తెచ్చే పత్రికలూ , పుస్తకాలూ ఉండటం వల్ల సహజంగానే వాటిని చదవటం అలవడిందనుకుంటాను.
మా ఊళ్ళో తెలుగు మాస్టారి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది. ఆయన నా పుస్తక పఠనాన్ని బాగా ప్రోత్సహించారు.
ఆ లైబ్రరీ నా పుస్తక దాహాన్ని పెంచింది; కొంత తీర్చింది!
* * *
ఎప్పుడైనా ఖాళీ గా ఉండి చదవటానికి ఏమీ లేకపోతే సమయం వ్యర్థమయినట్టు అనిపిస్తుంది. ఆస్పత్రుల్లాంటి చోట్లకు వెళ్ళి గంటల తరబడి వేచి ఉండాల్సినపుడు చేతిలో పుస్తకం ఉంటే చాలనిపిస్తుంది.
అంటే ‘ఉత్తమ సాహిత్యం’ మాత్రమే చదివి జ్ఞానం పెంచుకుంటూ ఉంటానని కాదు.
సరదా, ఆహ్లాద రచనలూ; సస్పెన్స్, థ్రిల్లింగ్ రచనలూ చదవటం నాకిష్టమే.
మొత్తమ్మీద పుస్తక పఠనం నాకెంతో ఇష్టమైన వ్యాపకం. నాకున్న ఓ మంచి వ్యసనం!
* * *
పుస్తకాల్లో చాలా రకాలు.
అన్నీ అందరికీ నచ్చవు. నచ్చాలని కూడా లేదు.
ఒక దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి పుస్తకాలూ, మ్యాగజీన్లూ ఉపయోగపడతాయి. అలా ఏర్పరచుకున్నాక దానికి భిన్నంగా ఉండేవి అంతగా రుచించవు.
అందుకే...
‘ మంచి తెలుగు పుస్తకాల జాబితా ఇవ్వు. వాటన్నిటినీ చదువుతాను’ అని ఎవరైనా అడిగితే నాకు నవ్వొస్తుంది.
ఏ పుస్తకాలు తనకు నచ్చుతాయో, ఏమేం చదవాలో కూడా బోధపడని పరిస్థితి ఉందంటే ఆ పాఠకులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నారని అనుకోవచ్చు.
చదువరులకు తమ అభిరుచిని బట్టి మంచి పుస్తకాలేమిటో తెలుస్తూనే ఉంటుంది.
ఏ పుస్తకాలు చదవాలో తేల్చుకుంటే.. అవెక్కడ ఉంటాయో, వాటిని సంపాదించుకునే మార్గమేమిటో కూడా తెలిసిపోతుంది!
* * *
పుస్తకాల్లో పేజీ నంబర్లు పేజీకి పైన ఉంటాయి కదా? ఈ మధ్య వస్తున్న చాలా పుస్తకాల్లో ఆ నంబర్లు పేజీలకు కిందిభాగంలో వేస్తున్నారు.
పేజీ చదివి, తర్వాతి పేజీకి వెళ్ళేటపుడు పేజీ నంబర్ సరి చూసుకోవటం నా అలవాటు. (రెండు పేజీలు కలిసివుండి - తిప్పినపుడు ఒక పేజీ దాటిపోవచ్చు. కథలో లింకు పోయినట్టు ఒకోసారి తేడా తెలియక దాన్ని గుర్తించలేం కూడా.).
దీంతో ఈ ‘కొత్త’ పేజీ నంబరింగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తూ వస్తోంది.
ఇలా పేజీలకు కిందనే నంబరింగ్ ఇవ్వటం ‘ప్రచురణరంగంలో కొత్త నిబంధనా?’ అనిపించేంతగా దాదాపు ప్రతి పుస్తకంలోనూ ఇదే ధోరణి.
‘పాత పుస్తకాల్లో ఇలా ఉండేది కాదు; ఇప్పుడే ఈ కొత్త అసౌకర్యం ’ అని బ్లాగులో రాద్దామనిపించింది.
ఎందుకైనా మంచిదని పాత పుస్తకాలూ, మ్యాగజీన్లూ కొన్ని పరిశీలిస్తే- కళ్ళు తిరిగినంత పని అయింది.
చూడండి-
1935లో ముద్దుకృష్ణ సంకలనం చేసిన ఈ ‘ వైతాళికులు’ పుస్తకంలో పేజీ సంఖ్య పేజీ అడుగు భాగంలోనే ఉంది.
‘చందమామ’ మాసపత్రిక తొలి సంచిక (1947 జులై) నుంచీ పేజీల సంఖ్యను అడుగు భాగంలోనే వేస్తూ వచ్చింది. దీన్ని ఇంతకాలమూ గమనించకపోవటం నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
‘కన్యాశుల్కం’ నాటకం సంగతి?
1947, 1961 రెండు ప్రచురణల్లోనూ పేజీల సంఖ్యను పేజీల పై భాగంలోనే ముద్రించారు.
1948లో ప్రచురించిన ‘శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చిన్న కథలు’ పుస్తకంలో పేజీల అడుగున తెలుగు అంకెలను ఇచ్చారు.
మరి శ్రీశ్రీ మహాప్రస్థానం సంగతి?
1956 వచ్చిన ప్రచురణలో ఇలా... పేజీ అడుగు భాగంలో పేజీ నంబర్లను ఇచ్చారు.
కానీ 2000లో శ్రీశ్రీ చేతిరాతతో ముద్రించిన పుస్తకంలో మాత్రం పేజీ పై భాగంలోనే పేజీల సంఖ్యను ఇచ్చారు..
పుస్తకాల్లో పేజీల సంఖ్యను పేజీ అడుగు భాగంలో ఇవ్వటం కొత్త పద్ధతేమీ కాదని అర్థమైంది.
... కానీ ఆ సంఖ్యను పేజీల పై భాగంలో ఇవ్వటం పాఠకులకు అలవాటైన పద్థతి. నా ఉద్దేశంలో ఇది అనుకూలమైన, సౌకర్యమైన పద్ధతి కూడా!
1 కామెంట్:
పుస్తకాలలో పుటల సంఖ్య పైభాగంలో ఇవ్వాలన్న నీ అభిప్రాయం కరెక్టే!చదివే వారి వీలును ప్రచురణ కర్తలు దృష్టిలో పెట్టుకోవడం అవసరం !ఈ విషయంలో నీ పరిశీలనా దృష్టిలోకి తొలి చందమామ సంచికనుండి నేటి వరకు అనేకం రావడం ఆసక్తికరం!ఎందుకలా క్రిందివైపు పుట సంఖ్యను ప్రచురిస్తున్నారో!
కామెంట్‌ను పోస్ట్ చేయండి