సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఆలాపనతో ఇళయరాజా గీతాంజలి

 వేటూరి రాసి -  ఇళయరాజా స్వరపరిస్తే... బాలు సోలోగా  పాడిన రెండు పాటల గురించి ఈ పోస్టు.

పనిలో పనిగా  ఈ రెండు పాటలు పుట్టటానికి ఇరవై ఏళ్ళముందు వచ్చిన మరో పాట సంగతి కూడా చెప్పుకొస్తాను, చివర్లో! 

1989లో వచ్చిన  నాగార్జున ‘గీతాంజలి’ సినిమాలోని  ‘ఆమనీ పాడవే హాయిగా’ పాట ఎంత పాపులరో చాలామందికి తెలుసు. 

దానికి మాతృక అనదగ్గ పాట ఒకటుంది. 

అది అంతకుముందు మూడేళ్ళ క్రితం విడుదలైన ‘ఆలాపన’ సినిమాలోది.  ఆ సినిమా ఫ్లాప్ కాబట్టి ఈ పాట కూడా అంత పాపులర్ కాలేదు.

ఈ పాట ‘ఆమనీ పాడవే’ కంటే హాయిగా ఉంటుంది. అందుకే దీనికే నా మొదటి మార్కు. 

ఆ పాట- ‘ఆవేశమంతా ఆలాపనేలే..’.
ఈ పాటను బాలు కాస్త జలుబు చేసినట్టుండే గొంతుతో పాడినట్టు అనిపిస్తుంది.  

సంగీతాభిమానులు ఈ పాట ప్రత్యేకత ను గ్రహించి దానిలోని మెరుపులను ఆస్వాదించటం నాకు తెలుసు. (ఓసారి సంగీత దర్శకుడు బంటి ఈ పాటను టీవీలో పాడటం చూశాను; విన్నాను.) 

ఒక  పాటకు రెండోది  మాతృకలాంటిది అన్నానంటే ఆ రెండు పాటలకు ఆధారమైన రాగాల గురించి బాగా తెలిసి కాదు. ఆ రెండు పాటల పోకడలు చాలా దగ్గర గా ఉన్నట్టు అనిపించి. 



ఈ  రెండు పాటల్లోనూ  ప్రకృతి వర్ణనల పులకింతలు ఉన్నప్పటికీ  ‘అందాలు కరిగే ఆవేదన’ మొదటి పాటలోనూ, ‘గతించి పోవు గాథ’ రెండో పాటలోనూ వినిపిస్తాయి.

రెండు పాటల్లోనూ జ్వలించటం కామన్.  మొదటి పాటలో వర్ణాల రచన  జ్వలిస్తే... రెండో పాటలో వయసులోని వసంతం ఉషస్సులా జ్వలిస్తుంది.    

కథానుగుణంగా ఆలాపనలో ఆనందం పరుగులు పెడితే... గీతాంజలిలో నిరాశ నడకలు ధ్వనిస్తాయి!

‘ఆలాపన’ పాట ఇక్కడ చూడండి.
 పల్లవికీ, చరణాలకూ ముందు వచ్చే స్వరాల విన్యాసం వినసొంపుగా ఉంటుంది. దర్శకుడు వంశీ పాట చిత్రీకరణ వైవిధ్యభరితం.



పాట సాహిత్యం... 

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

అలపైటలేసే సెలపాట విన్నా
గిరివీణమీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
ఝరుల జతుల నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో
గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలో హృదయమే

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే

వనకన్యలాడే  తొలిమాసమన్నా
గోధూళి తెరలో మలిసంధ్యకన్నా
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం
పురి విడిన నెమలిపింఛం
ఎదను కదిపి నాలో
విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా

ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాలా
ఆవేశమంతా ఆలాపనేలే

ఇప్పుడు ‘గీతాంజలి’ గీతం చూద్దాం.



పాట సాహిత్యం 
ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించెలే మరీచికా
పదాల నా యెద
స్వరాల సంపద
తరాల నా కథ
క్షణాలదే కదా
గతించి పోవు గాథ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో

శుకాలతో పికాలతో
ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం
సృశించిన మహోదయం
మరో ప్రపంచమే
మరింత చేరువై..
నివాళి కోరినా
ఉగాది వేళలో
గతించి పోని గాథ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో
పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

విశ్వనాథన్  ‘గౌరవం’
1970లో  ‘గౌరవం’ అనే సినిమా వచ్చింది.  దానిలో  ‘యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమ కథా’అనే పాట నాకు అత్యంత ఇష్టం.  ఎమ్మెస్ విశ్వనాథన్ దీని స్వరకర్త.  పాడినవారు బాలు, సుశీల.

ఆలాపన పాటలో ‘అల పైటలేసే...’ చరణానికి ముందు స్వరాలతో పాటు వచ్చే మెరుపులాంటి క్లుప్తమైన వేణువు బిట్ వినండి.

దానికీ  ఈ ‘యమునా తీరాన..’ పాట ఆరంభంలోని వేణువు బిట్ కూ చాలా సారూప్యం కనపడుతుంది నాకు. 

ఎమ్మెస్ విశ్వనాథన్ ప్రభావం ఇళయరాజా మీద గాఢంగా ఉందనటానికి ఇదో ఉదాహరణ అనిపిస్తుంది.     

వినండి ఈ పాట...  

ఇది సినిమాలో ఎలా ఉంటుందో మరి.  ఈ వీడియోలో మాత్రం వరసగా రాధాకృష్ణుల  నిశ్చల చిత్రాలు మాత్రమే ఉంటాయి.


3 కామెంట్‌లు:

Surya Mahavrata చెప్పారు...

శివాజీ గణేశన్, ఉషానందినిల మీద చిత్రీకరించిన "యమునా నది" పాట తమిళ మాతృక లింకు ఇక్కడ: https://www.youtube.com/watch?v=wEFI9Fe5mrQ

anu చెప్పారు...

భలే పోల్చారే...!

GKK చెప్పారు...

వేణు గారు.మూడు హాయిగా సాగే పాటలు- చాలా రోజుల తరువాత విన్నాను. వినడానికి తేలికగాఉన్నా పాడటం కొంచెం కష్టమైన పాటలే. మూడు పాటల్లోను వేణువు bits మధురంగా ఉన్నాయి. ఆలాపన పాట చిత్రీకరణ చాలా బాగుంది. యమునా తీరాన పాట 1973 నాటిది. అప్పటికి ఇంకా బాలు గొంతు లేతగా ఉంది. ఆలాపన, గీతాంజలి పాటలలో బాలు పరిణితి చెందిన గొంతు బాగుంది.

ఆలాపన చిత్రంలో ఇళయరాజా పాటలు ఎంతో బాగుంటాయి. msv influence on ilayaraja. yes. it is all too evident.