సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

రంగుల కళ!



స్కూలు రోజుల్లో సైన్సు పాఠం ‘న్యూటన్ వర్ణచక్రం’ ఉండేది.

గుండ్రటి  అట్ట మీద VIBGYOR-  ఏడు రంగులూ  వేసి, ఆ అట్టను వేగంగా గిరగిరా తిప్పితే ఆ రంగులన్నీ మాయమైపోయి... తెల్ల రంగు కనపడటం ఆ ప్రయోగం!



అదంతా అబ్బురంగా అనిపించేది.

ఉదయమో, సాయంత్రమో సూర్యకాంతి ఉండగానే జల్లులు పడి, ఆకాశంలో ఈ మూల నుంచి ఈ మూలకు సప్త వర్ణాల ఇంద్ర చాపం ఏర్పడితే... ఆ ప్రకృతి ఇంద్రజాలాన్ని అది కరిగిపోయేలోపు ఇష్టంగా చూస్తుండటం ఇప్పటికీ సంతోషకర అనుభవమే!

అంతేనా?

పొద్దున్నే మొహం కడుక్కునేటప్పుడు నోట్లో నీరు పుక్కిటపట్టి.. నీటి తుంపరలను ఒక కోణంలో వెదజల్లుతూ అక్కడికక్కడే మినీ ఇంద్రధనుస్సును సృష్టించటం, దాన్ని పక్కనున్న వాళ్ళక్కూడా   చూపించటం సరదాగా ఉండేది.

* * *

‘ఇంద్రధనుస్సు ’ (1978) పేరుతో సినిమాయే ఉంది.
దానిలో ఆత్రేయ ...

‘ఏడు రంగుల ఇంద్ర ధనుసు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లెరంగు నా మనసు’ 


... అంటూ ఓ యువతి మనోభావాలను చిన్నచిన్న మాటల్లో ప్రతిబింబించారు.

ఈ పాటలో ఒక్కో రంగును ఒక్కో శరీర భాగానికి  ఇలా అన్వయించారు:

‘పసిడి పసుపు మేని రంగు
సందె ఎరుపు బుగ్గ రంగు
నీలి రంగుల కంటిపాపల కొసలలో నారింజ సొగసులు
ఆకుపచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు
ఆ ఆశలన్నీ ఆకసానికి ఎగసి వెలసెను ఇంద్రధనుసై . .’’



నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో  ‘ఆకలి రాజ్యం’ (1981) ఒకటి.


నిరుద్యోగ సమస్య తీవ్రతను దర్శకుడు కె. బాలచందర్ సెల్యులాయిడ్ పై కళాత్మకంగా చిత్రించిన సినిమా ఇది.

శ్రీశ్రీ కవితా పాదాలను ఎన్నో సన్నివేశాల్లో సందర్భోచితంగా అద్భుతంగా ఉపయోగించుకోవటం, పదునైన సంభాషణలూ (గణేశ్ పాత్రో), మంచి పాటలూ (ఆత్రేయ- ఎమ్మెస్ విశ్వనాథన్).. ఇవన్నీ ఈ చిత్రం ప్రత్యేకతలు.

ఈ ఆకలిరాజ్యం సినిమాను మొదట తమిళంలో 1980లో తీశారు. ఇంగ్లిష్ లిపిలో రాస్తే... Varumaiyin Niram Sivappu. దీని అర్థం- ‘పేదరికం రంగు ఎరుపు’ అని.   (ఇలాంటి టైటిల్ ని తెలుగులో ఎన్నడైనా ఊహించగలమా?)

దాన్నే ఏడాది తర్వాత తెలుగులో పునర్నిర్మించారు.

ఈ సినిమాలో హీరో కమల్ హాసన్, పెయింటర్ భరణి ల మధ్య ఓ సన్నివేశం ఉంది.

ఏ రంగు దేన్ని సూచిస్తుందో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చాలా బాగుంటుంది.

ఎరుపు రంగు  శ్రీశ్రీ చెప్పిన ‘కలకత్తా కాళిక నాలిక’గా,  ‘గురజాడ అడుగుజాడ’ గా  హీరో వర్ణిస్తే  కాదంటాడు పెయింటర్.   పేదరికమూ, తిరుగుబాటూ కూడా కాదంటాడు.

చివరికి  ఆ రంగును ‘ఆకలి’ అని చెప్తే ...  ఒప్పుకుంటాడు. 

ఒరిజినల్ అయిన తమిళ వర్షన్లో ఎరుపు రంగును పేదరికానికి ప్రతీకంగా చెప్పారు. దాన్నే టైటిల్ గానూ పెట్టారు!

 రెండు నిమిషాల  ఈ  ఆసక్తికర సన్నివేశాన్ని ఇక్కడ చూడొచ్చు. 



* * *

‘పెళ్ళిపందిరి’లో (1997)   హీరో్యిన్ అంధురాలు. ఆమెకు ప్రపంచంలోని రంగుల గురించి హీరో వర్ణించి చెప్పే సన్నివేశం ఓ పాటగా ఉంటుంది.

‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా’  అనే ఈ పాట రచన: గురుచరణ్ 

‘బుగ్గమీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనమంటే చెబుతుందీ
పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమయిన నీ చిరునవ్వు
తెల్లరంగు అట్టా ఉంటుంది
నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరుని అవుతావమ్మా
దిగులు రంగే నలుపు అనుకో
ప్రేమ పొంగే పసుపు అనుకో ’


ఈ  చిత్రానికి 11 సంవత్సరాల ముందు వచ్చిన సినిమా- ‘సిరివెన్నెల’ (1986).

 
ఈ చిత్రంలో హీరో అంధుడు. అతడికి ప్రకృతి గురించీ, రంగుల గురించీ  హీరోయిన్ వివరించే సన్నివేశం ఉంది.

తనను ప్రకృతిగా భావించమని చెప్పి,  హరివిల్లులోని  ఏడు రంగులను  పెదాల స్పర్శతో అతడు అర్థం చేసుకునేలా చేస్తుంది!

* * *
రంగులు ఏ భావాలను సూచిస్తాయో ఆధునిక పరిశోధకులు చెప్పే సంగతులు -

నలుపు :  మృత్యువునూ, విషాదాన్నీ సూచిస్తుంది.

తెలుపు :  స్వచ్ఛతకూ, అమాయకత్వానికీ ప్రతీక.

ఎరుపు:  ప్రేమను సూచిస్తుంది. (మరి ‘ఆకలిరాజ్యం’ హీరో తెలుపు రంగంటే  ప్రేమ అన్నాడేమిటబ్బా?!  ఇక ‘పెళ్ళిపందిరి’  హీరో  ప్రేమ పొంగును పసుపు అనుకోమన్నాడేమిటో... )

నీలం:   శాంతి, ప్రశాంతత

ఆకుపచ్చ :  ప్రకృతినీ, ఆరోగ్యాన్నీ ప్రతిబింబిస్తుంది.

పసుపు :  ఆశాభావం, సంతోషాలకు ప్రతీక .

ఇంతకీ ఏ రంగుకు ఏమి అర్థం? ఏ రంగు దేన్ని సూచిస్తుందనేది ఒక్కో దేశంలో, ప్రాంతంలో, ఒక్కో  సంస్కృతిని బట్టి ఒక్కోలా మారిపోతుంటుంది !

అందరూ ఏకీభవించే రంగులూ- ప్రతీకలూ  అంటూ ఏమీ ఉండవు.

రంగుల వల

వ్యక్తికి ఇష్టమైన రంగును బట్టి భవిష్యత్తు చెప్పటం,  రంగురాళ్ళను ధరిస్తే  అదృష్టం వస్తుందనటం... ఇవన్నీ కేవలం మూఢ నమ్మకాలని  చెపితే .. వాటిని  నమ్మేవారు ఓ పట్టాన ఒప్పుకోరు.

ఆధునిక ప్రచారసాధనాల్లో  ‘సెలబ్రిటీలు’ ప్రచారం చేస్తున్నారనో, సరికొత్త మొబైల్ యాప్స్ గా వచ్చాయనో  వాటి ప్రభావానికి తేలిగ్గా గురయ్యే పరిస్థితులే ఎక్కువ కదా? 

రంగులతో సంబంధం లేని మూఢ నమ్మకాలు కూడా కొల్లలుగా ఉన్నాయనుకోండీ!  పొద్దున్నే టీవీ పెట్టి చూస్తే వాటి విశ్వరూపం దర్శనమిస్తుంది.

* * *

దృశ్యకావ్యంగా పేరు తెచ్చుకున్న మాయాబజార్ (1957) నలుపు తెలుపు సినిమాకు ఎంతో కష్టపడి రంగులద్ది విడుదల చేస్తే  అభిమానులు హతాశులయ్యారు.

కల లాంటి సినిమా లోని కళ... కలర్ లో వెలవెల పోయింది మరి!

‘దేవదాసు’(1953) లోని  హృదయవిదారక  విషాదం .. ఆ సినిమా నలుపు తెలుపుల్లో ఉండటం వల్లనే బాగా పండిందని నాకు అనిపిస్తుంది.

ద్వితీయార్థ భాగంలో సినిమా క్లైమాక్స్ చేరువవుతున్నకొద్దీ  హీరో అవస్థ దారుణంగా దిగజారిపోవటం నలుపు తెలుపుల్లో బలీయంగా ప్రతిఫలించింది.


ముఖ్యంగా  ‘కుడి ఎడమైతే..’ పాట...!

 ఇక్కడ చూడండి,  ఆసక్తి ఉంటే! 



ఈ ‘దేవదాసు’ సినిమాకు కూడా  రంగుల హంగులు చేర్చే ప్రయత్నం చేయలేదెవరూ.

మంచి విషయమే!

 * * *
పికాసో ఆయిల్ పెయింటింగ్  ‘గెర్నికా’ (1937)  నలుపు తెలుపు, బూడిద రంగుల్లో ఉంటుంది!


కానీ ఇది హింసనూ, యుద్ధ బీభత్సాన్నీ ఎంత శక్తిమంతంగా చూపించిందో కదా!


రంగుల కబుర్లు  ప్రస్తుతానికి  ఇక  చాలిస్తాను. :)

3 కామెంట్‌లు:

Lalitha చెప్పారు...

పాటలే బాగు అనుకుంటే - రంగులు పూసిన పాటలు బహు బాగు. మీ రంగుల-పాటల పోస్ట్ బాగు-బాగు!

వేణు చెప్పారు...

Thank you for your comment!

వేణు చెప్పారు...

Thank you for your comment!