సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఆగస్టు 2016, సోమవారం

విన్నారా ఈ చిన్నారి గానం?

నిమిషంనర నిడివి కూడా లేని ఆ పాట...  నాకు అమితంగా నచ్చింది.

నిండా పదేళ్ళు కూడా  లేని ఓ బాలిక...  తన గాన మహిమతో నన్ను సమ్మోహితుణ్ణి  చేస్తోంది!

*  *  * 
సంగీతమంటే  నాకు ఎక్కువ తెలిసినవి సినిమా పాటలే ! 

రేడియోలో  లలిత సంగీతమూ,  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళిల పాటలూ వినలేదని కాదు.

అయినా అవి పరిమిత స్థాయిలోనే!

అప్పుడప్పుడూ  ‘అనుపల్లవి’ బ్లాగులో  ‘తెలుగు అభిమాని’ రాసే  పోస్టుల ద్వారా శాస్త్రీయ సంగీత గుళికలు కాసింత రుచి చూస్తుండటం ... అంతే!

ఈ ఆగస్టు మొదట్లో  రచయిత్రీ,  కళాభిమానీ  శ్రీదేవి మురళీధర్  గారు నాకు కొన్నిపాటల  యూ ట్యూబ్  లింకులు పంపారు.

ఆ విధంగా  సూర్య గాయత్రి  అనే కేరళ చిన్నారి  పాటలు నాకు పరిచయమయ్యాయి.

అవన్నీ‘భక్తి’ పాటలే! 

ఈ  పదేళ్ళ పాప ... గానం చేసేటపుడు చూపే  తాదాత్మ్యత  మొదట నన్ను ఆకట్టుకుంది. 
 


ఆ గొంతులోని  శ్రావ్యత,  మాధుర్యం సరే సరి!

*  *  *

చిన్న వయసులో  పిల్లల వోకల్ కార్డ్స్ పూర్తిగా వికసించవు కాబట్టి  రాగ ప్రస్తారానికీ, పాటకు పూర్తి న్యాయం చేయటానికీ వారికి సహజంగానే  పరిమితులుంటాయి.

కానీ ఈ సూర్య గాయత్రి మాత్రం నిజంగా సు గాత్రి! 

ఆమె గళంలో  ఏ కోశానా  ఆ  పరిమితులు కనిపించటం లేదు.

పరిణత గాయనిలా - తడబడకుండా-  స్వచ్ఛమైన ఉచ్చారణతో  వినసొంపుగా  పాడుతుంది.

కుడి అర చేతి వేళ్ళను కలిపి  కొంచెం ముందుకు వంచి,  పాము పడగలాగా చేసి  
అలవోకగా,
స్వేచ్ఛగా,
హాయిగా ....
ఆస్వాదిస్తూ 
గానం చేస్తుంది. 

*  *  *

సూర్య గాయత్రి  తండ్రి  పీవీ అనిల్ కుమార్ మృదంగ  కళాకారుడు.  తల్లి  దివ్య .. కవయిత్రి.

వీరు ఐదేళ్ళ  వయసు నుంచీ పాపను కర్ణాటక సంగీతం నేర్చుకునేలా చేశారు. ఇప్పటికీ వారానికి నాలుగు రోజులు సంగీతం నేర్చుకుంటుందట.

ఆమెలోని గాన ప్రతిభను డిస్కవరీ చేసి,  ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసినది-  ఆమె గురువుల్లో ఒకరైన కర్ణాటక సంగీత కళాకారుడు కులదీప్ ఎం.పాయ్. ఈయనది తమిళనాడు

కిందటి సంవత్సరం  మే- జూన్ లలో  సూర్య గాయత్రి పాడిన   ‘గణేశ పంచరత్నమ్ ’ వీడియో  ఫేస్ బుక్,  యూ ట్యూబ్ లో  పెట్టారు.

అది నాంది! 

అప్పట్నుంచీ ఆమె,  కులదీప్ లు  పాడిన పాటలు యూట్యూబ్ లో,  ఫేస్ బుక్ లో  విడుదలవుతున్న కొద్దీ  ఆమె గానంలోని ప్రత్యేకత ఎంతోమంది  శ్రోతలకు అంతకంతకూ  తెలుస్తూ వచ్చింది.      

సూర్య గాయత్రి పాటల ద్వారా  డబ్బు సంపాదించే  ఉద్దేశం  లేదనీ, అందుకే  వాణిజ్య పరంగా  ఆల్బమ్ లుగా,  సీడీలుగా చేసి  విక్రయించటం లేదనీ ఆమె గురువు  కుల దీప్ పాయ్  చెపుతున్నారు.

సంగీత కళ నేర్చుకునేలా పిల్లలకు ప్రేరణ కలిగించటం కోసం  యూ ట్యూబ్ లో, ఫేస్ బుక్ లో  పెట్టి అందరూ  వినేలా చేస్తున్నారు.

ఇది చాలా మంచి విషయం!

*  *  *

మొదట ‘గణేశ పంచరత్నమ్ ’ విన్నాను.  సూర్య గాయత్రీ,  ఆమె గురువుల్లో  ఒకరైన  కుల్ దీప్ కలిసి  హుషారుగా పాడుతుంటే  తమాషాగా,   ఉత్సాహంగా అనిపించింది.

‘నాగేంద్ర హారాయ’ పాటను  ఈ  చిన్నారి అంకితభావంతో  సంలీనమైనట్టు పాడటం ఆకట్టుకుంది.

ఈమె  పాడినవన్నీ బాగున్నాయి.

వాటిలో  ప్రత్యేకంగా  నాకు బాగా నచ్చి,  రోజూ విన్నా తనివి తీరనట్టున్నపాటలు మాత్రం రెండు-

మొదటి పాట...  

‘‘శ్రీరామ చంద్ర కృపాలు భజ మన  హరణ భవ భయ దారుణం
నవ కంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం ...’’


శ్రీరాముడి ఘనతను వర్ణించే పాటన్నమాట.

రాసినవారు  పదహారో శతాబ్దికి చెందిన  సంత్ తులసీదాస్. 

ఇక్కడ  వీడియో  చూస్తూ  వినండి-   ఈ పాట విన్నాక.... యూ ట్యూబ్ లో  లతా మంగేష్కర్ పాడిన ఇదే పాట కూడా విన్నాను.

అయినా సూర్య గాయత్రి  పాటపై ఇష్టం తగ్గలేదు.

ఫస్ట్ ఇంప్రెషన్ ప్రభావం ఏమైనా ఉండొచ్చు గానీ... చిన్నారి గాయని  ప్రతిభకు ఇది తార్కాణంగా భావిస్తున్నాను.

క నాకు అమితంగా నచ్చిన రెండో పాట (పోస్టులో నేను మొదట ప్రస్తావించింది దీన్ని గురించే) ... చాలా చిన్న బిట్!  

అక్కడున్న  లిరిక్ కూడా ఒకే ఒక వాక్యం!   ( ఒరిజినల్ పాట పెద్దదే గానీ,  ఇక్కడ ఈ పాప పాడింది మాత్రం ఈ  ఒక లైనే..)

‘‘జయ్  రఘునందన జయ్ సియారామ్   మన్ సే...  జప్ లే తూ  సీ తారామ్’’

దీన్ని సూర్య గాయత్రి ఐదు సార్లు  ప్రతిసారీ ఒక్కో రకంగా గానం చేస్తుంది. 

ఆ స్వరకల్పనలోని  సొగసును అద్భుత  గమకాలతో/ సంగతులతో  ఆమె ఎలా ఆవిష్కరించిందో విని ఆస్వాదిస్తేనే బాగుంటుంది.

పక్కన వాద్యసహకారం అందిస్తున్నవారే  కులదీప్ పాయ్. పాడటంలో  ఎంత ఈజ్
ఎంత సాధికారత
పాటలో  ఎంత  తీయదనమో గమనించారా?

ఇక  ఈ పాట నన్ను తన మాధుర్యంతో వెంటాడటం (హాంటింగ్ )  మొదలుపెట్టింది.

దీంతో   దీన్ని ఎవరు రాశారు? ఇంత శ్రావ్యంగా  సంగీతం కూర్చినదెవరు? అనే సందేహాలు మొదలయ్యాయి!
 
ఘరానా (1961) అనే హిందీ సినిమాలో  ఇదే పల్లవితో  ఆశా భోస్లే,  రఫీలు పాడిన ఓ  పాట ఉంది కానీ, అది పూర్తిగా వేరు.

ఒక ఆధారం ఉన్నపుడు వెదకటం  కష్టమేమీ కాదు  కదా?

పూర్తి  పాట దొరికింది, యూ ట్యూబ్ లో.

ఈ పాటను గాయని  దేవకీ పండిట్ ఎంతో బాగా పాడారు.  వేణువు, సితారల సమ్మేళనం హాయి గొలుపుతుంది !

సంగీత దర్శకుడి పేరు హేమంత్ మత్తాని   అని  తెలిసింది.  రచన కూడా  బహుశా ఈయనే.

ఈ పాట విన్నాక  కూడా సూర్య గాయత్రి పాట వినసొంపుగానే అనిపిస్తుండటం  విశేషమే కదా?

స్వరకల్పనలో  జోడించిన  చమక్కులు కూడా దీనికి  కారణం!

*  *  *
సూర్య  గాయత్రి  ఆధ్యాత్మిక గాయనిగా  పేరు తెచ్చుకుంటోంది.  ఇతర రాష్ట్రాల్లో కూడా  కచేరీలు ఇస్తోంది.  హైదరాబాద్, తెనాలి లాంటి చోట్లకు కూడా ఆమెను ఆహ్వానించి పాడిస్తున్నారు.


సెలబ్రిటీ హోదా :  ఇలాంటి  పెద్ద  హోర్డింగులూ  పెడుతున్నారు
ఆమెను  ఎమ్మెస్  సుబ్బులక్ష్మి వారసురాలిగా కీర్తించటం,
‘గాన సరస్వతి’ లాంటి బిరుదులివ్వటం,
సన్మానాలు చేయటం...
ఇవన్నీ అప్పుడప్పుడైనా జరుగుతున్నాయి. 

ఇంకా ఎంతో  నేర్చుకోవలసిన దశలో ఇలాంటి పొగడ్తలూ,  ప్రోత్సాహాలూ  అవసరం లేదు.

పైగా ఇవన్నీ  ఆమె ప్రగతికి ఎంతో కొంత అవరోధాలయ్యే అవకాశముంది.   

అందుకే  వీటిని పరిమితం చేయగలిగితే  ఆ బాల గాయని భవిష్యత్తుకే మేలు!

‘‘సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా ’’ అన్నాడు  త్యాగయ్య.

నిజానికి  సంగీత జ్ఞానం సంపాదించాలంటే  భక్తి (పాటల సాధన)  వినా మార్గం లేదు! 

త్యాగరాజు కీర్తనలైనా,  అన్నమయ్య రచనలైనా, రామదాసు భజనలైనా దేవుడి ఘనతను  కీర్తించేవే కదా!

దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన  పాటలు వింటూ  తన్మయత్వం చెందుతున్నారంటే...

అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి  భావన మూలంగా కాదు,

రస భరితమై అంతరంగాన్ని తాకే  సంగీత కళ వల్లనే! 

18 కామెంట్‌లు:

M b d syamala చెప్పారు...

వేణూ!నీ బ్లాగ్ మనసును పరవశింప చేసింది! నువ్వు పంపిన లింంకుల వలన చిన్నారి గాయత్రి పాటలను నేనుకూడా ఆస్వాదించాను! గణేశ్ పంచరత్నాలు కులదీప్ పాయ్ తో కలిసి పాడినవి జయరఘునందన నాగేంద్రహారాయ అన్నీ చాలా బాగున్నాయి!అన్టికన్నా ముఖ్యం ఆ కళలో ఆ పాపకున్న involvement భావనలో సంలీనమైపోయే విధానం ఆశ్చర్యానందాలని ఏకకాలంలో కలిగించింది!ఈ బాలసరస్వతిని ఇంత చక్కగా పరిచయం చేసి నీబ్లాగు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది

shri చెప్పారు...

శ్రీ వేణుగారు అద్భుతమైన గానానికి అపురూపమైన సమీక్ష రాశారు.
సహృదయులకు కళాప్రియత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట నిజం చేశారు.

చిరంజీవి నిజంగానే దివ్యఅంశ సంభూతురాలు.ఎంత మంది పిల్లలు పాడటం లేదు ..అందరినీ తలచు కుంటూన్నామా . మీ టపా చాలా స్ఫూర్తిదాయకం.

GKK చెప్పారు...

మంచి వ్యాసం వేణుగారు. మీ బ్లాగులో child prodigy సూర్య గాయత్రి పరిచయం చూసి చాలా ఆనందం కలిగింది. ఎంత చక్కని గానం. పరిణితి చెందిన గాయకులకు కూడా కష్టసాధ్యమైన శ్రుతి శుద్ధమైన గాత్రం. స్పష్టమైన ఉచ్చారణ. బాలసరస్వతి అని శ్యామలగారు అన్న మాట అక్షరసత్యం. ముఖ్యంగా కులదీప్ పాయ్ అనే గొప్ప గురువు దొరకటం ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యం. ఇలాగే తన సంగీతయాత్రను కొనసాగించి పెరిగి పెద్దై గొప్ప గాయని అవుతుంది అని మనందరి నమ్మకం, ఆకాంక్ష.

vahini చెప్పారు...

అద్భుతం

hari.S.babu చెప్పారు...

రాముణ్ణీ కృష్ణుణ్ణీ అపహాస్యం చేస్తూ అద్భుతమైన రచనలు చేసిన శ్రీమతి ముప్పాళ రంగనాయకమ్మ గారి అభిమానులు ఈ పోష్టులో ఆ దైవాలని కీర్తంచే సూర్యగాయత్రిని ఇంతగా పరవశించడానికి కారణం ఏమిటి?

రాముడి చేతిలో చచ్చిన వాలినీ అర్జునుడి చేతిలో చచ్చిన కర్ణుడినీ అభిమానించే మీకు సూర్యగాయత్రి వారిని కీర్తిస్తున్నపుడు పులకింతలు కల్గుతున్నాయా - హవ్వ!!

అది చేసినా ఇది చేసినా పాప్యులారిటీ కోసమేనా!రోడ్డుమీద హఠాత్తుగా ఒక మనిషి దభాలన పడిపోయి గిలగిలా తన్నుకుంటే తలతిప్పి చూస్తాం - ఆ రకంగా ఫోకస్ కోసం తిప్పలు పడకుండా ఏదో ఒకదానికి నిజాయితెగా కట్టుబడితే బాగుంటుంది!బహుశా మీ అభిమాన రచయిత్రి ఆ రామాయణ మహాణార్తాల్ని విమర్శించడానికి కరణం కూడా అదేనేమో - కాదా?

మద్దెలకి అటో దెబ్బా ఇటో దెబ్బా అన్నట్టు ఎందుకండీ ఈ వూగిసలాట?చేస్తే శుద్ధక్షవరం చెయ్యాలే తప్ప మొరికీలు పెట్టగూడదని పెద్దల వాక్యం!

వేణు చెప్పారు...

@ Haribabu: నా పారవశ్యానికి కారణం ఈ పోస్ట్ లోనే స్పష్టంగానే రాశాను. నాది ఊగిసలాటో,పాపులారిటీ యావో అనుకునేవారి అపోహలకు నా బాధ్యతేమీ లేదు!

hari.S.babu చెప్పారు...

ఒక మనిషి ఒకవైపు రాముడిలో తప్పులు వెదికిపట్టుకుని చీల్చి చెండాడిన రచయిత్రిని అభిమానిస్తూ మరోవైపు అదే రాముడిని సూర్యగాయత్రి పరవశంగా పాడిందని ప్రశంసించటంలో ఆత్మద్రోహం,నైతికపతనం లాంటివి ఏవీ ఉండవని నిర్ధారించితే తప్ప మీ కారణం స్పష్టంగా ఉండదండీ!మామూలుగా ఇటువంటి ధోరణిని రెండు నాల్కలతో మాట్లాడటం,ఏ ఎండకా గొడుగు పట్టడం అంటారు మరి?బహుశా మీరు మేధావి రంగనాయకమ్మ అభిమాని గాబట్టి ఈ రూల్సు మీకు వర్తించహ్వు కాబోలు!మహా మహా సైంటిఫిక్ ప్రినిసిపుల్సుకే బోల్డన్ని ఎక్సెప్షన్లు ఉంటున్నాయి,కదా!

వేణు చెప్పారు...

@ Haribabu: సంగీత ఆస్వాదనకు సంబంధించి నా వైఖరి నాది. దానిలో వైరుధ్యమేదీ లేదు. అసలు అది పోస్ట్ లోనే ఉంది, గ్రహించదలిస్తే! మీరు కన్విన్స్ అవ్వదలచకపోతే అది మీ ఇష్టం!

Zilebi చెప్పారు...చాలా బాగుంది .

మంచి పరిచయం .

ఇంత చిన్ని వయసు లో స్వర మాధుర్యం అపూర్వం .

వయసు ని బట్టి చూస్తోంటే ఎమ్ ఎస్ వారు 2004 లో కాలం చెందడం ఈ పాప భరత భూమి కి ప్రకృతి ప్రసాదించిన వరం లా ఉంది

భావికాలం లో మరింత ప్రజ్వలితమౌతుందని ఆశిస్తో


జిలేబి

hari.S.babu చెప్పారు...

@venu
సంగీత ఆస్వాదనకు సంబంధించి నా వైఖరి నాది. దానిలో వైరుధ్యమేదీ లేదు.
@hari.S.babu
మొండివాడు రాజుకన్న బలవంతుడు,నవ్విపోదురు గాక నాకేటి వెరపు,సీజరు పెళ్ళాం తప్పు చెయ్యదు అన్నట్టు,అంతేనా?

వేణు చెప్పారు...

@ Haribabu: మీరు ఉటంకించిన సామెతలు/ సూక్తులు మీకు వర్తిస్తాయో, నాకు వర్తిస్తాయో పాఠకులే నిర్ణయించుకుంటారు!

Unknown చెప్పారు...

--------
పోస్ట్ బాగుంది, సర్.
విశదీకరణ, విశ్లేషణ ఆసక్తికరంగా ఉన్నాయి.
......
ఈ కింది మాటలు బాగా ఆలోచింపజేశాయి.

‘‘సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా ’’ అన్నాడు త్యాగయ్య.

"నిజానికి సంగీత జ్ఞానం సంపాదించాలంటే భక్తి (పాటల సాధన) వినా మార్గం లేదు!
త్యాగరాజు కీర్తనలైనా, అన్నమయ్య రచనలైనా, రామదాసు భజనలైనా దేవుడి ఘనతను కీర్తించేవే కదా!

దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన పాటలు వింటూ తన్మయత్వం చెందుతున్నారంటే...

అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి భావన మూలంగా కాదు,
రస భరితమై అంతరంగాన్ని తాకే సంగీత కళ వల్లనే!"
.......

hari.S.babu చెప్పారు...

తన ముడ్డినలుపు తనకి తెలియని ప్రతి అడ్డగాడిదకీ రాముడిలో తప్పులు కనిపిస్తాయి!రాముడి చేతిలో చచ్చినందుకు వాలీ,కృష్ణుడి చేతిలో చచ్చినదుకు కర్ణుడూ వీడికి హీరోల్లా కనపడతారు!మరి వాళ్ళు హీరోలు అయినప్పుడు వాళ్ళని చంపినవాళ్ళు ఏమవుతారు?తనకి నచ్చినవాణ్ణి చంపినవాణ్ని పొగిడేవాడు ఏమవుతాడు?తనకి బాధ్యతే ఉండి తను పాటిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్న నాస్తికత్వం పట్ల నిబద్ధత ఉంటే ఇన్నేళ్ళుగా దైవనామసంకీర్తనల్ని విని పరవశిస్తూ ఉండేవాడు కాదు గదా!ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా కొన్ని అభిప్రాయాల్ని ఏర్పరచుకోవటానికీ,దేని గురించి అయినా ఎవరయినా ఇతరులకి చెప్పటానికీ,సామాజికార్ధికాధ్యాత్మిక విషయాల్లోని నైతికతకీ గీటురాయి సత్యమే!ఒక వ్యక్తిని సత్యానికి కటుబడ్డ మనిషిగా గుర్తించటానికి మానవులు ముందుగా చూసేది అతని ప్రవర్తనలోని రుజుత్వమే!ఏది ధర్మం ఏద ధర్మం అనేవి స్పష్టంగానే ఉండాలి,ఉంటాయి కూడా - లేని పక్షంలో ఆచరించడం కష్టం!మరి,అలాంటప్పుడు దేవుడు లేడు అని బల్లగుద్ది చెప్తూ సంగీతం నచ్చిందనే కుంటిసాకుతో దైవనామసంకీర్తనల్ని విని పులకించిపోవడంలో ఉన్న నిబద్ధత ఏమిటి?దేవుడు ఉన్నాడు అని నమ్మినవాళ్ళు అతనికి ఒక రూపాన్ని ఇచ్చి ప్రశంసిస్తుంటే తలయూగిస్తూ వింటూ వింటూ చొల్లుకార్చుకునేవాడు నాస్తికుడెట్లయితడు!

ఒక గంభీరమైన తాత్విక దృక్కోణంతో జీవితకాలపు కార్యాచరణ కోసం ఓక విషయం గురించి ఏర్పర్చుకున్న అభిప్రాయాలకి విరుద్ధమైనవాటిని ప్రశంసించడం అంటే మన ఉచ్చిష్టం మనమే తినడం,మనం నమ్మని విషయాల్ని ఎదటివాళ్లకి చెప్పటం మన ఉచ్చిష్టాన్ని వాళ్ళకి తినిపించడం!వాడు క్యాపిటలిస్టా కమ్యునిష్టా అనే తేడా లేకుండా ఎదటివాళ్ళ మీద పెత్తనం చెయ్యాలనుకునేవాడు చేసే మొదటి అని తనకి నమ్మకం లేకపోయినా ఏ విషయాన్ని ఎదటివాడు ఎట్లా నమ్మితే తనకి లాభమో ఆ రకమైన పులుముడుతో ఎదటివాళ్ళకి చెప్పటం - అబద్ధాలు చెప్పటం!అది తప్పని తెలిసే చేస్తాడు,మనం నిలదీసినా అది తప్పు కాదని దబాయిస్తాడు - వీడిలాగే!

ఆ రామద్వేషికి నిజంగా తన భావాల పట్ల నిబద్ధత ఉంటే తన బ్లాగునుంచి ఆ పోష్టును తక్షణం తీసేసి ఇకముందు తన నమ్మకాలకి విరుద్ధమైన రాతలు రాసి బ్లాగువీక్షకులకి తన ఉచ్చిష్టాన్ని తినిపించే పాపకార్యాన్ని మానుకుంటాడు.కానీ యేళ్ళ తరబడి తెగబడి చేస్తున్న పనిని ఒకే ఒక ఆత్మశోధనాత్మకమైన నిర్ణయంతో చెయ్యకుండా ఉండగలిగే నిబద్ధత ఆ నీచుడిలో ఉందా అని నాకు అనుమానం!
---------------------------------------
పాఠకులూ,చదువరులూ తర్వాత ఎప్పుడో తీరిగా తేల్చుకుంటారో లేదో అనే విషయం పకన పెడితే ఈ తులసీదాసు అంత భక్తిగా పరవశించి గానం చేసింది ఎవర్ని?మీకు ఎంతో ఇష్టమైన వాలిని చంపినవాణ్ణే గాదా!ఆ దురాగ్రహమూ ఈ పరవశమూ ఓకేసారి మీ మనసులోకి రావా?ఓకటి వచ్చినప్పుడు రెండోది ఎక్కడికి పోతుంది?

వాలిని చంపినందుకు రాముణ్ణి ఏమాత్రం క్షమించలేని మీకు మానసిక ప్రశాంతత కోసం మళ్ళీ ఆ రామభక్తియే ఆధారభూతం అవుతున్నదంటే మీరెంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో గదా!

రాముడు దుర్మార్గుడని తిడుతున్నారు,రాముణ్ణి కీర్తిస్తుంటే పులకిస్తున్నారి - నరంలేమి నాలుకతో రెండుమాటలూ మాట్లాడే సిగ్గులేనితనం మీ దగ్గిర పెట్టుకుని కూడా ఏ ధైర్యంతో అవి ఎవరికి తగుల్తాయో పాఠకులు ఆలోచించుకుంటారు అనేటంత ధీమాగా ఉన్నారు?
---------------------------------------
అప్పటివరకు అంత ధీమాగా నా కామెంట్లని ప్రచురంచిన వాడు దీన్ని మాత్రం ప్రచురించి కవుంటర్ ఇవ్వకుండా వదిలేశాడు, ఎందుకనో!


దేవుదు లేడంటాడు,దైవప్రార్ధనలు విని పులకిస్తాడు - సిగ్గులేని జన్మ!

anu చెప్పారు...

దైవ భావననూ, సృష్టికర్త ఉనికినీ నమ్మని నాలాంటివారు ఆధ్యాత్మికపరమైన పాటలు వింటూ తన్మయత్వం చెందుతున్నారంటే...
అది -

ఆ పాటల సాహిత్యంలో పొంగిపొరలే భక్తి భావన మూలంగా కాదు,
రస భరితమై అంతరంగాన్ని తాకే సంగీత కళ వల్లనే!

నిజమే.. సంగీత పారవశ్యానికీ, భక్తి భావనకూ సంబంధం లేదు.. అయినా మీ పోస్టు చదివినవారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది మీరు నాస్తికులని! దానికి భంగం కాకుండా ఎంత బాగా రాశారో.. ఒకమంచి పరిచయాన్ని అందించినందుకు థాంక్స్.

bandi చెప్పారు...

భక్తి భావన అనేది భగవంతుబి పట్లే ఉండనవసరం లేదు. భక్తి అనేది మనం అమితం గా గౌరవించే,ప్రేమించే ఒక వ్యక్తి పట్లకూడా ఉండవచ్చును. ఆ విధం గా నాస్తికులకి కూడా భక్తి భావన అనుభవం లోకి రావచ్చు. ఇక మనిషి ముదుగా శబ్ధానికీ, తరువాత ఉద్వేగానికీ, తరువాత భావానికీ (అర్ధానికీ) స్పందిస్తాడు. మనిషి మనసు పరిణామ క్రమం కూడా ఆ విధం గానే ఉంటుంది. అంటే సంగీతం వినేటపుడు ముందు గా శబ్ధ స్థాయి లో స్పందించి, తరువాత ఉద్వేగ స్థాయి లో స్పందించి, చివరికి అర్ధం స్థాయి లో స్పందిస్తాం. అనే క హిందీ సంగీతానికి అర్ధం తెలియక పోయినా ఆ పాటల లోని ఉద్వేగాన్ని ఆస్వాదించటానికి అది అడ్డుకాదు. ఒక పాట లోని అర్పణ (surrender), మానసిక అలసటా, ప్రకృతి వర్ణన లాంటి వాటికి స్పందించటానికి, పాట అర్ధం పూర్తిగా తెలియనవసరం లేదు. ఆ అర్ధం తో మీరు పూర్తిగా ఏకీభవించనవసరం లేదు. అర్ధం చేసుకొనే ఆనందించాలంటే, సంగీతాన్ని పశువులూ, శిశువులూ ఆనందిస్తాయనే నానుడి వచ్చి ఉండకపోయేది. నేను దేవుడిని నమ్మక పోయినా, అన్నమయ్య సినిమా లోని, "అంతర్యామీ అలసితి సొలసితి", పాటని నేను మానసికం గా, భావోద్వేగపరం అలసి పోయినపుడు వింటే, జీవన ప్రయాణం లోని నా అలసట గురించే అన్నమయ్య పాడుతున్నాడనిపిస్తుంది.

bandi చెప్పారు...

వేణు గారు,
మీ పోస్ట్ లోనే మీరు స్పష్టం గా చెప్పారు, ఆ చిన్నారి గాత్రం లోని తీయదనం, ఈజ్ వంటి లక్షణాల గురించీ, అంతరంగాన్ని తాకే సంగీత కళ గురించీ. ఏదైనా ఒక ఫాంటసీ సినిమాకి వెళ్ళినపుడు, ఆ సినిమా లో మనకి నచ్చే అనేక విషయాలు ఉన్నందువలన, కాసేపు మన అపనమ్మకాన్ని పక్కన పెట్టి, ఆకాసేపు సినిమాని, దాని కథనీ, మాయలనీ మంత్రాలనీ ఎంజాయ్ చేస్తాం.చాలా మంది పెద్దలు టాం అండ్ జెర్రీ కార్టూన్లు ఎంజాయ్ చేస్తారు. అంత మాత్రాన వారు mentally retarded అవ్వరు. అలానే ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమా కి వెళ్ళీ కాసేపు మన thinking caps పక్కన పెట్టి సినిమా ఎంజాయ్ చేయవచ్చు. అమెరికా లో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్న తెలుగు వారే మన హీరోల ఫైట్స్, డాన్సులూ చూసి ఎంజాయ్ చేసే వారున్నారు. థియేటర్ బయటికి వచ్చిన తరువాత మళ్ళీ వారు తమ thinking caps ని పెట్టుకొంటారు. dogmatic fights కి రెడీ అయే వాళ్ళ గురించి మీ స్పందన సరైనది. అభినందనలు.

sambasiva చెప్పారు...

వేణు గారూ! మీ టైం లైన్ లో ఉంచిన మీ మాటలనే ఇక్కడ పోస్ట్ చేస్తున్నా!

"విమర్శ అంటే దూషణ కాదు.
విభేదించటం అంటే సంస్కారం మరిచి అసహనంతో బూతులు లంకించుకోవటం అసలే కాదు!
విమర్శ అనేది ఒకటి ఉంటే దానికి ప్రతివిమర్శ చేయొచ్చు. కానీ ఎదుటివాళ్ళు రాసిందేమిటో చదవకుండానే తిట్లతో, అశ్లీల పదజాలంతో దాడి చేస్తూ తమ మూర్ఖత్వాన్నీ, ఇరుకు మనస్తత్వాన్నీ బయటపెట్టుకునేవాళ్ళతో సంభాషణకూ, కనీస చర్చకూ ఆస్కారం ఉంటుందా?
వాళ్ళకు చెప్పేదీ, వాదించేదీ మాత్రం ఏముంటుంది?
ఆ చెత్తను ఇగ్నోర్ చేసి, వాళ్ళ అజ్ఞానానికి వాళ్ళను వదిలేయటం తప్ప!"

చాలా బాగున్నాయి!
రంగనాయకమ్మ గారిని నీచాతినీచంగా స్వైరిణి అని దూషించిన వారికి కూడా కామెంట్స్ బాక్స్ లో చోటు ఇస్తారా? అలాంటి చెత్త మనుషులు మాట్లాడే మాటల్లో కుతర్కమే కాకుండా, కుటిల తర్కం కూడా వుంటుందని, దానికి ఏగాని పాటి విలువ కూడా ఇవ్వనక్కరలేదనే విషయం- ప్రజాస్వామిక ధోరణిలో పోవాలనే తాపత్రయంలో మర్చిపోయారు.

Unknown చెప్పారు...

అస్సలు నేను ఎందుకో ఆరోజు యు ట్యూబ్ ఓపెన్ చేసాను. చాలా సంవత్సరాలు ఐనది. జై గణేశ జై గణేశ సాంగ్ ఇంక నామనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు ఈ అమ్మాయి. ఎవరూ ఈ గురువు. రోజూ నా మనసు దొలిచేస్తోంది. అడ్రెస్ పట్టుకోవాలి. 4 నెలలు వెతికాను. తర్వాత ఒక మహాను భావుడు కొవ్వూరు నుండి వివరాలు పోస్ట్ చేసాడు. అప్పటి నుండి నేను ఆ అమ్మాయి సూర్య గాయత్రి ఫ్యాన్ ఐయ్యాను. ఇంకా మా బంధువులకి స్నేహితులకి సాంగ్స్ పంపడం చేసాను. గాయత్రీ పాట తో లేస్తాను. పాట విన్నాకే నిద్ర. ఆమె పాడినప్పుడు expressions చాలా బాగుంటాయి. నిండు నూరేళ్లు బంగారం. ఎప్పటికైనా తనని కలిసి శుభాకాంక్షలు చెప్పాలని ఆశ. తన మొదటి పాట వున్నపుడే అనుకున్నాను. ఎప్పటికైనా ఎం.ఎస్.అమ్మ అంత పెరు వస్తుందని. (నేనొక ప్రైవేట్ ఉపాధ్యాయుడి ని) నిడదవోలు.