ఇదంతా జరుగుతున్నపుడు... ఆ నిస్సహాయ స్థితిలో దుర్యోధనుడి మొహంలో భావాలు ఎలా ఉన్నాయి?
దర్శకుడైన రవి చోప్రాకు ఆ దృష్టి ఉన్నట్టు లేదు. అందుకే అతడి వైపు తిప్పనివ్వలేదు కేమెరాని!
బలరాముడు వెళ్ళిపోయాక.. నేలవాలిన దుర్యోధనుడి చుట్టూ పాండవులూ, కృష్ణుడూ నిలబడతారు. కేమెరా దుర్యోధనుడి తల వెనకభాగం మీదుగా వాళ్ళను చూపించింది.. అతడి ముఖం కనపడకుండా జాగ్రత్తపడుతూ!
దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న బీఆర్ చోప్రా సీరియల్ మహాభారత్. ఏదో వీలుండి... చూసిన ఆ 91వ ఎపిసోడ్ అంత నాసిగా అనిపించింది.
ఆఫీసుకు వచ్చాక... సినీరంగంతో సంబంధం ఉన్న మా సీనియర్ జర్నలిస్టు డి. చంద్రశేఖర్ గారితో ఇదంతా చెప్పాను, నా అసంతృప్తిని పంచుకున్నాను. అంతా విని ‘డైరెక్టోరియల్ యాంగిల్లో ఆలోచించావే..’ అంటూ ఆయన మెచ్చుకున్నారు.
ఆ కోణమూ అదీ నాకేమీ తెలీదు. అసలది కామన్ సెన్స్ పాయింటు కదా!
* * *
దర్శకుడు కె. విశ్వనాథ్ తీసిన ఎన్నో సినిమాలు నాకు ఇష్టం.
ఆయన సినిమాలు సమాజాన్ని మార్చాలనుకునే తరహావి కావు. వాటి లక్ష్యం అది కాదు.
ఉన్న వ్యవస్థలో ఉపరితలంగా కనిపించే ‘కొన్ని’ లోపాలను ఉదారంగా, సంస్కరణతో మెరుగుపరచాలనుకునేవి.
చౌకబారు హాస్యం, ద్వంద్వార్థాల సంభాషణలూ, చీదర పుట్టే ఐటమ్ సాంగులూ, కృత్రిమమైన పాత్ర చిత్రణలూ, అవకతవకల కథాంశాల సినిమాల మధ్య విశ్వనాథ్ సినిమాలు చాలా ఊరటనిస్తాయి.
సహజంగా సాగే సంఘటనలూ,
మానవత్వానికీ, సంస్కారానికీ ప్రతీకలైన పాత్రలూ...
అర్థవంతమైన... లోతైన హావభావాలూ...
కథలో భాగంగా వచ్చే సున్నిత హాస్యం...
వినసొంపైన సంగీతం, కనువిందు చేసే చిత్రీకరణా..
ఇవన్నీ విశ్వనాథ్ సినిమాల ట్రేడ్ మార్క్.
‘శంకరాభరణం’ (1979) రాకముందే ఎన్నో మంచి చిత్రాలు తీశారాయన. ఆత్మగౌరవం, చెల్లెలి కాపురం, కాలం మారింది, సీతామాలక్ష్మి, శారద, సిరిసిరి మువ్వ...
శంకరాభరణం తర్వాత మాత్రం?
సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం, శుభలేఖ, స్వర్ణ కమలం, స్వాతి కిరణం...
వ్యాపారాత్మక సినిమాల ఉరవడిలోనూ తన మార్గం వదల్లేదు.
ఏటికి ఎదురీది క్లాస్ మాస్ సరిహద్దులు ఎంతో కొంత చెరిపేశారు!
తన పరిధిలో సంస్కరణనూ, శ్రమైక జీవన సౌందర్యాన్నీ కళాత్మకంగా చెప్పటానికి ప్రయత్నించారు.
* * *
సంవత్సరాల క్రితం కె. విశ్వనాథ్ ను కలిసి వివరంగా ఇంటర్ వ్యూ చేసినట్టు కల వచ్చేది.
ఆ తర్వాత కొంత కాలానికి ఓ రోజు మా ఆఫీసు పై అంతస్తులో నిలబడివుండగా .. ఏదో టీవీ చర్చలో పాల్గొనటానికి ఆయన మెల్లగా నడిచివస్తూ కనిపించారు.
అదే ఆయన్ను తొలిసారి ప్రత్యక్షంగా చూడటం!
సంభ్రమంగా అలా చూస్తూవుండిపోయాను.
మళ్ళీ కొన్నేళ్ళకు హైదరాబాద్ లోనే ఓ పెళ్ళి కార్యక్రమంలో ఆయన్ను దగ్గర్నుంచి చూశాను.
తెలిసినవారూ, తెలియనివారూ ఆయనకు నమస్కారాలూ, విష్ చేయటం చేస్తూనేవున్నారు...
నేనూ పలకరించవచ్చు గానీ...
ఏమని మాట్లాడాలి? మీరు సినిమాలు బాగా తీస్తారు అనా? శంకరాభరణానికంటే ముందు నుంచే మీ సినిమాలంటే నాకు ఇష్టం.. అనా? మిమ్మల్ని నా కలలో ఇంటర్ వ్యూ చేశాననా?...
పేలవంగా ఉండదూ!
అందుకనే మౌనాన్ని ఆశ్రయించాను.
* * *
ప్రతి పాత్రకూ నిర్దిష్ట స్వభావం నిర్వచించుకుని, ఆ పాత్ర చూపులో, చర్యలో, మాటలో, మౌనంలో అది వ్యక్తం అవుతూవుండాలనే దృష్టి ఉన్న దర్శకుడు విశ్వనాథ్.
నవల్లో అయితే రచయితకు పాత్రల అంతరంగాన్ని చిత్రించే సౌలభ్యం ఉంటుంది.
కానీ దృశ్య మాధ్యమంలో ఆ వెసులుబాటు ఉండదు.
పాత్రల మొహాల్లో ... తగిన మోతాదులో... వ్యక్తం కావాల్సిందే.
దాన్ని చూపించటం దర్శకులకు కొన్ని సందర్భాల్లో కత్తిమీద సాముగా పరిణమిస్తుంది.
అంతరంగ సంఘర్షణ!
ఒక చిన్న సన్నివేశం...దానిలో నాలుగే డైలాగులు... ప్రతిభావంతులైన నటులు!
ఇక చిత్రీకరించటం ఎంతసేపు!
కానీ దానిలో ఒక పాత్ర స్పందన (రియాక్షన్)....అది ముఖంలోనే ప్రతిఫలించాలి. మౌనమే... మాటలుండవు. అంతరంగాన్ని వ్యక్తం చేసేలా పలకాలి ముఖ కవళికలు!.
అవి... ఎలా ఉండాలనేది స్పష్టం చేసుకుని, దాన్ని చిత్రీకరించటానికి ఏకబిగిన 19 గంటలు... పగలూ, రాత్రీ మథనం చేశారు విశ్వనాథ్! అంతటి తపన ఎందరు దర్శకులకు ఉంటుంది?
స్వాతిముత్యం (1985) లోది ఆ సన్నివేశం!
తనకు మంచి చెయ్యాలని తాళి కట్టిన లౌక్యం తెలియని అమాయకుడు కమల్ ఓ రాత్రి హఠాత్తుగా తన పక్కలోకి వచ్చి పడుకుంటాడు. ఉలిక్కిపడి లేచిన రాధికలో కొద్ది క్షణాల్లో అంతరంగ సంఘర్షణ ఎలా చెలరేగుతుంది?
దీని గురించి దర్శకుడు విశ్వనాథ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.
ఆ సన్నివేశం ఇక్కడ చూడండి
* * *
చూపులో శోధన!!
సిరివెన్నెల (1986) లో నాయకుడు సర్వదమన్ బెనర్జీ అంధుడు, నాయిక సుహాసిని మూగది. అతడి పట్ల అనురాగం పెంచుకున్న ఆమెకు అప్పటికే ఓ అతడో స్త్రీని ఆరాధిస్తున్నాడని తెలుస్తుంది.
అది తెలిశాక.. అతడిని మొదటిసారి చూసినపుడు ఆమె చూపు ఎలా ఉంటుంది? అంతకుముందులాగా మాత్రం ఉండే అవకాశం లేదు.
ఆ చూపు... అప్పటి ఆమె మనోభావాలను ప్రతిబింబించేలా ఉండాలి.
అందుకే... అతడిని ఆమె కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు.. ఒక శోధనతో చూస్తుంది.
దర్శకుడు విశ్వనాథ్ ఆ సన్నివేశ ప్రత్యేకతను ఇలా వివరించారు.
* * *
ఈ రెండు సన్నివేశాల్లోని లోతును నేను ఆ సినిమాలు చూసినప్పుడే గ్రహించానా?
లేదు.
దర్శకుడు ఇలా ఇంటర్ వ్యూల్లో వివరించాకే వాటిని తెలుసుకోగలిగాను.
‘సాగర సంగమం’లో కూడా ఎప్పుడూ తనతోనే ఉంటానని హీరోయిన్ చెప్పగానే హీరో తన సంతోషాన్ని ఆస్వాదించటానికి ఆమె నుంచే ఏకాంతం కోరుకుంటాడు. ఆమెతో పాటు వెళ్తున్న కారులోంచి దిగిపోతాడు. దీనిలోని సైకలాజికల్ పాయింటును దర్శకుడు చెప్పలేదు కానీ... ఓ మిత్రుడు చెపితే దాన్ని గ్రహించాను.
ఇలాంటివి వివరిస్తే గానీ అర్థం కావటం లేదంటే అది ఆ దర్శకుడి లోపమనుకోకూడదు. వివరించకపోయినా గ్రహించే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. (దర్శకుడు కూడా ఆలోచించని విషయాలను ‘సింబాలిక్ గా గొప్పగా చెప్పారం’టూ అన్వయించి చెప్పేవాళ్ళు కూడా ఉంటారనుకోండీ...)
ఆ సన్నివేశాల రూపకల్పన వెనకునన్న ఆంతర్యం తెలియకపోయినా సినిమా ఆస్వాదనకు లోటుండదు.
కానీ ఆ లోతు తెలిస్తే మరింత ముగ్ధులమవుతాం!
ఏ కళారూపమైనా ...
మరీ నిగూఢంగా, మార్మికంగా, పాషాణ పాకంలా, అయోమయంగా ఉండకూడదు కానీ...
తరచిచూసిన కొద్దీ... ఆలోచించిన కొద్దీ.. కొత్త అందాలూ, కోణాలూ తెలిసేలా చేసేది ఉత్తమ కళే!
అది-
రచన కావొచ్చు.
సంగీత రచన కావొచ్చు.
చిత్రం కావొచ్చు..
చలన చిత్రం కావొచ్చు!
(యూ ట్యూబ్ ద్వారా ఈ వీడియోలు అందుబాటులో ఉంచిన సంబంధిత టీవీలకూ, వాటిలో పాల్గొన్న యాంకర్లకూ కృతజ్ఞతలు. వీడియోల్లో ఈ పోస్టుకు ‘ అవసరమైనంతవరకూ ’క్రాప్ చేశాను..)
9 కామెంట్‌లు:
అద్భుతంగా వర్ణించారు వేణు గారు. విశ్వనాథ గారి మీద చాలా మంచి పోస్ట్ రాసినందుకు ధన్యవాదాలు.
ఫాల్కే అవార్డుని శంకరాభరణం కాటేసింది, వేయి పడగల పాము భలే పడగెత్తి ఆడింది అని ఒక పెద్దాయన కామెంట్ చేశారు.ఇది ఉత్త యాంత్రిక ధోరణి అనే అనుకుంటున్నా. విశ్వనాధ రచనలంత ప్రమాదకరమా ఈ సినీ విశ్వనాధ? మీరు ఈ అంశాన్ని కూడా చర్చిస్తే బాగుండేది.
కాస్తంత మానసిక సంస్కారాన్ని, మృదుత్వాన్ని నేర్పే కళల్లో కొంత సాంప్రదాయ వాసనలు కనపడినా, అవి మత చాందసాన్ని బోధించే వేయిపడగలంత హానికరం కానే కాదు. ఇది
అస్తిత్వవాదనల్ని యాంత్రికంగా అన్వయించడం తప్ప మరేమీ కాదు.
అసలు ఆత్మలే లేనప్పుడు, ఆత్మగౌరవం అనేమాట ఏం బాగుంది, ఇంకో మాట వాడాలిగానీ అని ఒకరు ఈ మధ్య అన్నారు. ఆత్మగౌరవం అనే మాటని లిటరరీ అర్ధంతో ముక్కలుగా విడగొట్టి చూస్తే అంతే మరి!
అలాగే విశ్వనాద్ ని, బాలమురళీని వాళ్ళ కులాలకారణంగా వ్యతిరేకించడం అంత అభ్యుదయం ఈనాడు!
కళాతపస్వికి నువ్వు పట్టిన నీరాజనం ఈ పోస్టు. చదవగానే ముగ్దురాల్నయ్యాను! మహా సముద్రంలో ఏ అల సౌందర్యాన్ని, మనోహరత్వాన్ని వర్ణించగలం! ఆయన ప్రతి సినిమా వో సౌందర్యార్ణవం. అయినా అద్భుతమైన సన్నివేశాలనే ఉదాహరించావు.
ఎప్పటిలానే నీ పోస్టు అక్షరాల నుంచీ కాక ఆత్మానందం నుంచే ప్రభవించింది. బ్లాగు పోస్టుల ద్వారా అనుభూతుల మల్లెలో, కళాత్మక కర్పూర చేమంతులో దోసిట నింపే నీకు కృతజ్ఞతలు.
.... విశ్వనాధ రచనలంత ప్రమాదకరమా ఈ సినీ విశ్వనాధ? ....
చిత్రం. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రసక్తి ఎందుకు తెచ్చినట్లు? వీలు చూసుకొని వెక్కిరించటం అంత అవసరమా? ఒకరు లేదా ఒక వర్గం గౌరవించినంత మాత్రాన ఎవరూ గొప్పవారు ఐపోరు - ఒకరు లేదా ఒక వర్గం వెక్కిరించినంత మాత్రాన ఎవరూ పనికిరానివాళ్ళు ఐపోరు. కాలం అనే గీటురాయి తేలుస్తుంది కాని మన ఆవేశకావేశాలతో తేలేది మన స్థాయి మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.
కవిసామ్రాట్ విశ్వనాథ వారు తాను నమ్మిన విషయాలను గురించి రచనలు చేసారు. అందులో వ్యాపారాత్మకధోరణి ఏమీ ఉందనుకోలేము.
సినీదర్శకుడు విశ్వనాథ గారు మనకు మన కళలూ సంస్కృతి అనే వాటిపై ఉన్న గౌరవభావం అనేది పెట్టుబడిగా సినిమాలు తీసారు - సినిమా అనేది నూటికి నూరు శాత వ్యాపారమే. అందులో ఒక్కో దర్శకుడూ ఒక్కో పంథా ఎంచుకున్నా సరే. ఈయన ఎంచుకున్న విధానం ఇది. అదృష్టవశాత్తు అది సఫలీకృతం ఐనది. నా దృష్టిలో కళాతపస్వి వంటి బిరుదులూ ఏదో కళారంగోధ్ధరణ చేసారన్నట్లుగా అవార్డులూ అవీ కూడా ఎబ్బెటుగానే తోస్తున్నాయి. నా అభిప్రాయం అందరికీ నచ్చకపోవచ్చును. అది వేరే సంగతి.
కాని ఒకరిని పొగడటానికి మరొకరిని తెగడటం అనే ఊతకర్ర అవసరం అనుకోవటం సమంజసం కాదని చెప్పటం ఇక్కడ నా ముఖ్యోద్దేశం. ఎవరికైనా నొవ్వు కలిగితే దయచేసి మన్నించండి.
Venu Garu. The way viswanath garu blended music dance and other art forms along with human values in his films is great. శంకరాభరణం సాగర సంగమం సప్తపది .. they are all-time classics. He is a true legend.
@శ్యామలీయం:
మాస్టారూ మీ వ్యాఖ్యతో స్థూలంగా ఏకీభవిస్తూనే శృతిలో కొద్దిపాటి తేడా (nuance):
రాసేటప్పుడు వ్యాపార ధోరణిలో వెళ్ళాలా వద్దా అన్నది రచయిత సొంత నిర్ణయం. ప్రచురణ ఖర్చులు తక్కువ కనుక సృజనాత్మతపై ఆంక్షలు ఆట్టే ఉండవు.
రచనా మాధ్యమం ఇచ్చే ఈ స్వేచ్ఛ సినిమా రంగంలో లేదు. సినిమాలలో కొంతయినా వ్యాపార ధోరణి ఉండడం అవసరం. ఎంత గొప్ప దర్శకుడయినా కొద్దో గొప్పో రాజీ పడాల్సి వస్తుంది.
దర్శకుడు విశ్వనాధ్ గారు తనకున్న ఈ పరిధిలో సఫలీకృతమయ్యారు. వారి బాణీ ఎంతో మంది "కమిటెడ్" దర్శకుల కంటే చాలా మెరుగు.
ప్రస్తుత అవార్డు కూడా సినీ రంగానికి చెందిందే కనుక దీనికి ఇతర పురస్కారాలతో పోలికలు లేవు. విశ్వనాధ్ గారి ఎంపిక పూర్తిగా సబబని నా అభిప్రాయం.
జై గారు. మీరన్నది నిజం. కాని తపస్వి వంటి మాటల బిరుదులను ఇవ్వటమూ పుచ్చుకోవటమూ కూడా అంత సమంజసం కాదని నా అభిప్రాయం. ఈమాట అందరికీ నచ్చక పోవచ్చును.
@శ్యామలీయం:
100% కరెక్ట్ సార్.
K. విశ్వనాథ్‌గారికి అవార్డ్ వచ్చిన సందర్భంలో మీ ఈ పోస్ట్ చాలా బావుంది. చాలా మంచి సినిమాల సన్నివేశాలు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి