సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

1, జులై 2018, ఆదివారం

ఏ పేరులో ఏ పెన్నిధి ?

 

దుటి వ్యక్తి పేరును సంబోధిస్తూ సంభాషిస్తుంటే వాళ్ళను ఇట్టే ఆకట్టుకోవచ్చట. మనస్తత్వశాస్త్రవేత్తలు  చెప్పే మాట ఇది!

కారణం?


ఎవరి పేరు వాళ్ళకు ప్రియాతిప్రియంగా ఉంటుంది కదా? కాబట్టి అలా పిలవటం  నచ్చి, ఆ పిల్చినవాళ్ళమీద ఇష్టం దానికదే వచ్చేస్తుందన్నమాట. 

దీనికి మినహాయింపులూ ఉన్నాయి.

కొంతమందికి వాళ్ళ పేరు ససేమిరా నచ్చదు. (పాత చింతకాయ పచ్చడి పేరైతే నచ్చకపోవటం సరే... కానీ ఆధునికమైన పేరు పెట్టినా..  చాలామంది దాన్నే పెట్టుకున్నారని,  తమ పేరుపై విరక్తి పెంచుకున్నవాళ్ళూ తెలుసు నాకు).

ఇలాంటివాళ్ళ ముందు సైకాలజిస్టులు చెప్పిన పై చిట్కా ఫలించదు.   పైగా అలా పదేపదే  తమ పేరు ఉచ్చరించినందుకు వాళ్ళు కోపాలు తెచ్చుకున్నా  ఆశ్చర్యం లేదు.




‘నా పేరు తాసీల్దారు.. నేను రామలింగాన్ని’

‘అందాల రాముడు’  సినిమా చూశారా? దానిలో తీసేసిన తాసిల్దారు (తీతా) పాత్ర వేసిన అల్లు రామలింగయ్య డైలాగ్ అది. తన పేరే హోదా...  అనుకునేంత తాదాత్మ్యం.

ఆ  తికమకలోని స్వారస్యం  వేగంగా సాగే  సినిమాలో చప్పున  స్ఫురించదు.   ఎమ్వీయల్  ఆ సినిమా వెండితెర రాశారు. తన  నవలీకరణలో ఇలాంటి చమక్కులెన్నో  వెలికితీశారాయన.  


 అలా కొంతమందికి వాళ్ళ  పేరు కంటే ప్రియమైనది వాళ్ళ వృత్తి/ హోదా.  ముఖ్యంగా డాక్టరేట్లు పొందిన కొంతమందికీ,  చాలామంది మెడికల్ డాక్టర్లకూ వాళ్ళ పేరు సరిగా పలక్కపోయినా పట్టించుకోరు కానీ, ముందు డాక్టర్ అనకపోతే ... క్షమించరు.

కొంతమందికి వాళ్ళ పేరు కంటే ఇంటి పేరే ప్రియాతిప్రియం.  ‘ఇదే ఇంటిపేరు ఎంతోమందికి  ఉంటుంది, మీకు పెట్టిన  పేరు కదా మిమ్మల్ని రిప్రజెంట్ చేసేది?’ అని అడిగితే  ఆ లాజిక్కులకు వాళ్ళకు ఒళ్ళు మండుకొస్తుంది.  ‘మరి ఇదే పేరు కూడా చాలామందికి  ఉండదా?’ అని తమ ఇంటిపేరును ఆప్యాయంగా తల్చుకుంటూ.. ఎదురు ప్రశ్న వేయవచ్చువాళ్ళు.

కొన్ని ఇంటిపేర్లు  ఇంపుగా అనిపించవు.  కానీ వాళ్ళ చెవులకవి ఎంతో మధురంగా ధ్వనిస్తాయి.  అందుకే .. శుభలేఖల్లో, కార్ల అద్దాల మీదా తమ ఇంటిపేరును పెద్ద అక్షరాల్లో వేయించుకుని  గర్వపడుతూ, మురిసిపోతుంటారు.

కుల పరిశోధకులు

కొందరుంటారు. వీళ్ళకు ఎదుటి మనిషి కులమేమిటో తెలుసుకోకపోతే  ఊపిరాడదు. ఇంటిపేరు ఉంది కదా? అదే వాళ్ళ బలమైన ఆధారం. దానితో కులాన్ని ఇట్టే కనిపెట్టేసే పరిశోధకులు మనకు ఎక్కడబడితే అక్కడ కనపడుతుంటారు.

రెండు మూడు కులాల్లో ఒకే ఇంటిపేరు ఉంటే..?  అంత తేలిగ్గా ఓటమి ఒప్పుకుని వ్యా‘కుల’పడరు. ఇంకా సూక్ష్మపరిశీలనకు పూనుకుంటారు కానీ,  ఆ ప్రయత్నం మానరు గాక మానరు.  ప్రాంతం, భాష, ఆహారపు అలవాట్లను బట్టి  మరీ  కులాన్ని డిస్కవరీ చేసేస్తారు.  అది తెలిసేదాకా, ఆ కులమేదో తేలేదాకా, తేల్చుకునేదాకా  విశ్రమించరు.

‘బావ గారూ..’

పేర్లు ఉన్నప్పటికీ  బంధుత్వపు పేర్లతో పిలిపించుకోవటం, పిలవటం చాలామందికి ఇష్టంగా ఉంటుంది.   ఓసారి ఒకాయన నన్ను బంధుత్వం ప్రకారమే..  ‘బావ గారూ!’ అని ఫోన్లో పిలవగానే ఉలిక్కిపడ్డాను.  ‘బాబాయి’ అనే పిలుపు బాగా అలవాటు.  ‘అంకుల్’, ‘సర్’ అనే పిలుపులు కూడా  అలవాటయ్యాయి. కానీ ఈ ‘బావ గారూ’ పిలుపు మాత్రం చాలా కొత్తగా , వింతగా అనిపించింది!

ఇలాంటివి మనకిష్టం లేకపోయినా వినటానికి అలవాటుపడాలి కాబోలు. 


 ఈ మధ్య శుభలేఖ సుధాకర్ ని ఆంధ్రజ్యోతి ఆర్కే ఓపెన్ హార్ట్ లో ఇంటర్ వ్యూ చేశారు. ఆ సంభాషణ  చూడండి-

ఆర్కే: మీరు బాలూగారిని బావగారు అని పిలవరా? ‘సార్‌’ అనే సంబోధిస్తారా?

సుధాకర్: నాకు బాలూగారు ఓ సింగర్‌. లెజెండ్‌గా తెలుసు. అప్పటినుంచే ‘సార్‌’ అని అలవాటైపోయింది. శైలజతో పెళ్లయ్యాక ఆయనే ఓ సందర్భంలోనే ‘బావగారూ’ అని పిలవమన్నారు. కానీ నాకు ‘సార్‌’ అనే పిలుపులోనే కంఫర్ట్‌ ఉంటుందనిపించింది. అదే విషయం ఆయనకు చెప్పా.

ఇలా చెప్పటం వల్ల నాకు ఇంకా బాగా నచ్చాడు సుధాకర్. అన్నట్టు.. అతడి నటనా, కంఠస్వరం, ఆ మాడ్యులేషన్ కూడా నాకు బాగా నచ్చుతాయి.

ఇంకా  టైటిల్ దగ్గర పెట్టిన కొటేషన్  రాయలేదు కదూ....  

వస్తున్నా, అక్కడికే!

‘రోమియో అండ్ జూలియట్’ నాటకంలో షేక్ స్పియర్ రాసిన ప్రసిద్ధ వాక్యం..

“What's in a name? that which we call a rose

By any other name would smell as sweet.”


కానీ అమెరికన్ రచయిత్రి గెర్ ట్రూడ్ స్టెయిన్.. దీనికి విరుద్ధంగా చెప్పారు...
‘A Rose Is a Rose Is a Rose' అని.

అన్నట్టు...

‘వాట్స్ ఇన్ ఏ నేమ్’ ని  గిరీశం (పోనీ, ఆయన సృష్టికర్త గురజాడ) తర్జుమా చేస్తాడు,  చక్కగా.

అదేమిటో మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాలా?  (చూడుడు : ‘కన్యాశుల్కము’)

గిరీశం పేరును ‘గిర్రడు’ అని  అదే నాటకంలో  మరో పాత్ర   ఎకసెక్కం చేయటం తెలుసుగా.  

మా సీనియర్ అయిన  తెలుగు జర్నలిస్టు  గౌస్ గారు   షేక్ స్పియర్ కొటేషన్ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అనువదించారు.  ఆ వాక్యాన్ని తెలుగింగ్లిష్ ప్రవాళంలా.. ‘ నేములో నేమున్నది ?’  అని. 

ఎంజీ రోడ్డు అంటే?

గాంధీ పేరు మీద రోడ్డు పెట్టాలంటే  గాంధీ రోడ్డు అంటే చాలు.  ఆయన్ని గొప్ప చేద్దామని మహాత్మా గాంధీ  రోడ్డు అని పెడితే... అది  ఎంజీ రోడ్డు అయిపోతుంది.  ముళ్ళపూడి  తన ‘కోతి కొమ్మచ్చి’లో  చెప్పిన సంగతి ఇది.

ఇదండీ  నామ పురాణం!