సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, జులై 2025, శనివారం

‘నవలా’ నీరాజనం!

బాలచందర్   ‘ఇది కథ కాదు’  (1979)  గుర్తుందా?    ‘ఆ దీన స్త్రీల రోదనం, వేదన నా చెవుల్లో గింగురుమంటున్నాయి’  అంటూ  చలం   కొటేషన్ తో ఆ సినిమా ముగుస్తుంది. 
 

‘రెక్క చాటు ఆకాశం’ (2025)  నవల  చలం కొటేషన్ తర్వాతే  ఆరంభమవుతుంది.  (‘మాతృత్వం ఉత్త సహజాతం. .. దానికి మహిమల్ని ఆపాదించి , గాలిపోసి ఉబ్బించి , ఏదన్నా భక్తికి తీసుకురావాలంటే దానికి నూతన పదం తగిలించి ఇంత మోసపుచ్చుతున్నారు...’)

ఇద్దరు రచయిత్రులు   కలిసి  ఇలా ఓ నవల రాయటం  తెలుగులో గతంలో ఎప్పుడూ జరగలేదు.   విశేషమేంటంటే..

వీరిద్దరికీ  నవలా రచనలో ఇదే తొలి అడుగు.  పైగా  ఉమ్మడి రచన.  అయినా కృత్యాద్యవస్థను   అధిగమించి  సాధికారికంగా,  ఆద్యంతం ఆసక్తికరంగా  చక్కని నవలను  అందించారు... వేల్పూరి సుజాత,  ఉమా నూతక్కి.
 
‘రెక్క చాటు ఆకాశం’ నవల  ఒకరు ముగించాక, మరొకరు రాసే  ‘గొలుసుకట్టు నవల’ కాదు.   ఇతివృత్త ఎంపిక,  పాత్రల క్రమ వికాసం, సన్నివేశ  పరికల్పన,  కథాంశ  పరిషోషణను  ఇద్దరూ కలిసి  నిర్వహించిన నవల.  అంటే ...  ‘కలిసికట్టు నవల’  అని చెప్పొచ్చు. 


ఇద్దరు  రాసినప్పుడు దేనికదే అన్నట్టు ... సరిగా బ్లెండ్ అవ్వదేమో అనే సందేహంతోనే  ఈ నవల చదవటం మొదలుపెట్టాను.  నాది  లేనిపోని అపనమ్మకం  మాత్రమేనని  అర్థమయింది. 

వర్తమానం నుంచి ఫ్లాష్ బ్యాక్ కి  వెళ్తూ ఇంకా వెనకటి కాలపు సంగతులను చెపుతూ.. తర్వాత ముందుకు సాగిపోయే  కథనంలో  రచయిత్రులు నేర్పు చూపించారు. 


‘‘ ఏ పాత్రని ఎవరు సృష్టించారు, ఏ చాప్టర్ ఎవరు రాశారో పాఠకులు కనిపెట్టలేనంత సిమెట్రీ తో రాశాం, ప్లాన్ చేసి కాదు, అనుకోకుండానే అలా జరిగిపోయింది’  - ఓ ఫేస్ బుక్ పోస్టులో  సుజాత.


నవలా గమనం  ఆసక్తికరంగా, వేగంగా సాగుతూ  పఠనీయంగా  ఉండటం వల్ల  ‘ఎవరు ఏది రాశారు?’ అనే  దృష్టి  నాకు రాలేదు . 


రెండోసారి  స్థిమితంగా ,  మరికాస్త పరిశీలనతో  చదివినప్పుడు   మాత్రం ఎవరు ఏది రాసివుండొచ్చా  అని ఆలోచించాను.   అక్కడక్కడా మాత్రమే కొంత అంచనా వేయగలిగా. 
 

ప్రోటాగనిస్ట్ ఇందిరను  సుజాత,   ఇందిరకు ఆసరాగా వెన్నంటివున్న కాథరిన్ ను ఉమ  సృష్టించివుండవచ్చు.  


 కానీ అన్ని  పాత్రల రూపకల్పనా,  నవలా విస్తరణా  ఇద్దరూ కలిసే ముందుకు తీసుకువెళ్ళారు.    

ఇదెలా సాధ్యమయింది?  


అదే  FB పోస్టులో దీనికి   సమాధానం ఉంది..


 ‘నవల రాయడం మొదలు పెట్టాక, ఒకరు రాసింది ఒకరికి వాట్సప్ లో షేర్ చేసుకున్నాం.  50 పేజీల వరకూ కూడా ఫాస్ట్ గా రాయలేక పోయాం మొదట.  తర్వాత ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి అందులో ఇద్దరం రాసింది చేరుస్తూ పోయాం. వాట్సప్ లో షేర్ చేసుకుంటూనే.


నవల్లో పాత్రల గురించి ఏమైనా చర్చించుకోవాలంటే, ఫోన్ చేసుకోకుండా, వాయిస్ మెసేజ్ లు పెట్టుకున్నాం. వాటిని మళ్ళీ రివైజ్ చేసి వినొచ్చు కాబట్టి.   


ఎందుకంటే ప్రతి పాత్రతోనూ ఇద్దరం అలా కనెక్ట్ కావడం వల్ల. ఒక చాప్టర్ లో ఉమ కొన్ని డైలాగ్స్ రాస్తూ మధ్యలో ఆపితే, ఆ డైలాగ్స్ ని నేను కంటిన్యూ చేశాను.  వైస్ వెర్సా. ’


*** 


 పిల్లలు పుట్టే అవకాశం  లేని  ‘ఇన్ ఫాంటైల్ యుటిరస్’  అనే శారీరక సమస్య ఇందిర అనే  అమ్మాయి  జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో,  ఎంత ఆత్మన్యూనతలోకీ,  అపరాధ భావనలోకీ   నెట్టివేసిందో ఈ నవల  లోతుగా చర్చించింది.   


తొలి యౌవన దశలో   రక్తంతో తడిసిన శానిటరీ పాడ్స్ గిఫ్ట్ పాకెట్లుగా  రావడం ,  పెళ్లయ్యాక భర్త  వంచన అర్థమయ్యాక..  అతడు  వేరే స్త్రీని పడవ ఎక్కించుకుని  తనను  పడవలోంచి  నీళ్లలో తోసేయటం...


ఈ  రెండు సందర్భాల్లో  ఇందిరకొచ్చిన  పీడ కలల  వర్ణన ద్వారా  ఆమె మానసిక దుర్బలత్వాన్నీ, నిస్సహాయతనూ  రచయిత్రులు  గాఢంగా చిత్రించారు.  


‘అతనే లోకం అన్నట్టు బతికాను. చదువుకున్న  చదువు, చేసిన ఉద్యోగం,  చదివిన సాహిత్యం మొత్తం మర్చిపోయాను. తన కోసం అన్నీ వదులుకుని నన్ను నేను వదిలేసుకున్నాక,  అతనికి నేనే అవసరం లేకుండా పోయాను’   

‘నన్ను నన్నుగా ఉండనీయని అతని సాంగత్యంలో భార్యగా బతుకుతూ, ఆ సర్ప పరిష్వంగాన్ని ప్రేమ కౌగిలి అనుకున్నాను’


 భర్త స్వభావాన్ని అంచనా  వేయడంలో తప్పటడుగులు వేసినా  ఆలస్యంగా మేలుకున్న స్వాభిమానం   ఇందిరను  నిలబెడుతుంది.  తల్లిదండ్రుల , స్నేహితుల ఆసరాతో  తేరుకుని తన సమస్యను ధైర్యంగా  ఎదుర్కొంటుంది.   ఇందిర  వ్యక్తిత్వంలో  వచ్చిన  ఈ  ముఖ్య  పరిణామాన్ని  పరిణతితో  ఈ నవల చర్చించింది. 


ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు  ఇందిర  తన కొలీగ్  మీనాకు ఎంతో కొంత  ఓదార్పునిచ్చింది. 

***

నేహా, పరిమళల ప్రవేశంతో,  కాథరిన్ (కాథీ) పున: ప్రవేశంతో నవల మేలు  మలుపు తీసుకుంది.  చురుకైన  పతాక స్థాయి  కథనంతో,  సంఘటనలతో,  వికసించిన విద్యుత్తేజం లాంటి  తీక్ష్ణ,  సెన్సిబుల్  సంభాషణలతో ఉత్కంఠభరితమయింది. 

***


ఈ నవల్లో  దాదాపు అన్ని పాత్రలూ  సజీవంగా, సహజంగా ప్రవర్తిస్తాయి.  

ఇందిరతో పాటు ఆమె  తల్లిదండ్రులు గీత, భాస్కర్ ,  కాథరిన్, వసంత,   మీనా, నేహా, పరిమళ, హరి, సుధ..
 

*  స్వభావరీత్యా సంస్కారం, మానవత్వం, స్నేహ పాత్రతలున్న అపురూపమైన  పాత్ర  హరి.  

*  అపార్థం చేసుకోవడానికి  అవకాశమున్నప్పటికీ సంస్కారంతో అతణ్ణి సవ్యంగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తిత్వం  అతడి భార్య సుధది.  

చుట్టూ అంతమంది సాహిత్య ప్రేమికులున్న ఆమెకు రచయిత  చలం గానీ, ఆయన పాత్ర  రాజేశ్వరి గానీ  అస్సలు తెలియకపోవడం  (ఆ సందర్భంలో పేలిన  జోక్  నిజంగా బాగుంది) ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ అది  అసహజం మాత్రం కాదు.     

*  సి.ఎ. టాపర్ గా తన ఆశలనూ, ఆశయాలనూ సమాధి చేసుకుని  నోములూ , వ్రతాలతో తనను బిజీ చేసుకున్న పరిమళ  ఈ నవల్లో చాలా ప్రత్యేకం.  ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటించినట్టు.. భంగపాటుతో పొగిలి వచ్చిన  ఆమె దు:ఖోద్వేగపు తీవ్రతను కళ్లు చెమర్చేలా రాసిన  తీరు  ప్రశంసనీయం.    


  ..   వీళ్లంతా నవల పూర్తయినా మన ఆలోచనల్లోకి చొచ్చుకునివచ్చి  వెంటాడుతూనే ఉంటారు.
 

**** 

మెరుపు సంభాషణలు
ఆలోచింపజేసే  పదునైన సంభాషణలు ఈ నవల పొడవునా ఉన్నాయి.  కొన్ని ఘట్టాల్లో  నిస్సంకోచంగా, నిర్భీతిగా పాత్రల సంభాషణలు మెరుపుల్లా దూసుకొస్తాయి.  పాఠకులకు షాకునిస్తాయి.  సహానుభూతితో ఆలోచనలూ రేపుతాయి.

* ఏ మగవాడికైనా ఒక స్ర్తీ అవైలబుల్ గా లేనంత కాలం దేవత.  అందుబాటులోకి వచ్చాక,  చదివేసిన ఒక ఉత్తరం.  ఏ సస్పెన్సూ లేని ఉత్తరం.  తాగేసిన గ్లాసు.  వాడేసిన టిష్యూ’                   - మీనా

 
‘అబ్యూసివ్ రిలేషన్ షిప్ మొదలైనపుడు అబ్యూసివ్ గా ఉండదు. ప్రేమలు కురిపిస్తూ , తేనెలు ఒలికిస్తూనే ఉంటుంది. మన దురదృష్టం కొద్దీ,  మన మనసులో అదే స్థిరపడిపోయి , తిరిగి ఆ ప్రేమ ఎప్పటికైనా తిరిగి వచ్చి మనల్ని కౌగిలించుకుంటుందని నమ్ముతాం మనం.   ఆ మనిషి మాయమైపోలేదని, జస్ట్ ఒక మేఘమో, మంచో అడ్డం వచ్చిందని నమ్మించుకుంటాం.’                - ఇందిర
   
 ఆనంద్ వల్ల  మోసపోయి పరస్పరం  ప్రత్యర్థులుగా భావించుకున్న   ఇందిర, మేఘన చివర్లో  ‘మనిద్దరం సఫర్ అయ్యాం’  అనే ఎరుకతో  ఒకరినొకరు  అర్థం చేసుకునే ఘట్టం  మనసుకు హత్తుకుంటుంది.  ‘పితృస్వామ్యంలో మంచి చెడు అనేవి ఉండవు. అందులో ఉన్నది మహిళల పట్ల వివక్ష మాత్రమే’  అంటుంది మేఘన..  ఇందిరతో. 


సాహిత్య ప్రస్తావనల పరిమళం
చలం, రంగనాయకమ్మ,  డా. శ్రీదేవి, గుల్జార్, మాయా  ఏంజెలో, కమలాదాస్,  సిమోన్ డి  బావియర్,  టాల్ స్టాయ్, ప్రాయిడ్...     ఏదో ఓ సందర్భంలో వీళ్ల  రచనల ప్రసక్తో,   కొటేషన్లో వస్తాయి.   

ఈ నవలా రచయిత్రులు  పుస్తకాలను అమితంగా ప్రేమించే సాహిత్యాభిమానులు  కావటం వల్ల కూడా చాలా ఘట్టాల్లో  సాహిత్య ప్రస్తావనలు పరిమళించాయి.  

ఒక్కో అధ్యాయపు సారాంశాన్ని స్ఫురించేలా శీర్షికలు  పెట్టడం బాగుంది.  అయితే ఆ  పేర్లను ఇంగ్లిష్ లో పెట్టడం మాత్రం  నాకో అసంతృప్తి. 
 

స్త్రీ  పురుష సంబంధాల్లోని  చిక్కులూ,  స్త్రీల ఆత్మగౌరవం, సాధికారత,  స్వేచ్ఛల  గురించీ వాస్తవికంగా,  సాహసోపేతంగా  చర్చించిందీ  రచన.   

ఈ మధ్య కాలంలో నాకు బాగా  నచ్చిన నవల  ఇది!  అందుకే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత  ఓ బ్లాగ్ పోస్టు రాసే ఉత్సాహాన్నిచ్చింది. :)    


**** 

 

1 కామెంట్‌:

ప్రణీత స్వాతి చెప్పారు...

మీ సమీక్ష చదివాక నా చిన్ని లైబ్రరీ లోకి ఇంకో ఆణిముత్యం చేర్చుకోబోతున్నాను...మీ సమీక్ష తో సహాయం చేసినందుకు..ధన్యవాదములు 🙏వేణుగారు.