సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

6, నవంబర్ 2009, శుక్రవారం

రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం!


వైద్యశాస్త్రం పేరు చెప్పుకుంటూ ఒక డాక్టర్  పిచ్చి వైద్యం చేశాడు. అప్పుడు తప్పు- వైద్యశాస్త్రానిదా? డాక్టర్ దా? 

డాక్టర్ దే కదా తప్పు?

కానీ- ఆ వైద్యం వల్ల తన కుటుంబం పడ్డ యాతనలు చూసిన ఓ యువతి వైద్యశాస్త్రమ్మీదే విముఖురాలైంది.

ఇక్కడ... డాక్టర్ చైనా కమ్యూనిస్టు పార్టీ అయితే,  వైద్యశాస్త్రం కమ్యూనిస్టు సిద్ధాంతం!

ఆ యువతి పేరు యుంగ్ చాంగ్. ఆమె ఇంగ్లిష్ లో  ‘వైల్డ్ స్వాన్స్’ అనే పుస్తకం రాసింది, 1991లో! ఇది కాల్పనిక నవల కాదు.  ఆమె కుటుంబ చరిత్రా  ;  చైనా, కమ్యూనిస్టు పార్టీల చరిత్ర కూడా కలిసిపోయి ఇందులో కనిపిస్తుంది. ఇది మూడు తరాల కథ.

మావో నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, దాని పరిపాలనా మీదా తీవ్ర విమర్శలున్నాయి ఈ పుస్తకంలో.

ఈ పుస్తకాన్ని వెనిగళ్ళ కోమల గారు  ‘అడవి గాచిన వెన్నెల’ గా తెలుగులోకి అనువదించారు.

కమ్యూనిస్టు పార్టీ కోసం చేసిన కృషి అంతా వృథా  అయిపోయిందని చెప్పడానికి అనువాదానికి ఈ పేరు పెట్టినట్టు ఊహించవచ్చు. 

హైదరాబాద్ లోని ‘రేషనలిస్ట్ వాయిస్ పబ్లికేషన్స్’ ప్రచురించిన ఈ  630 పేజీల పుస్తకానికి రంగనాయకమ్మ గారు ‘విమర్శనాత్మక పరిచయం’ అందించారు. ఇది 'ఆంధ్రప్రభ'  ఆదివారం సంచికలో ఏడాది పాటు ధారావాహికగా వచ్చింది. 


ఇప్పుడు అది ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ అనే పుస్తకంగా వచ్చింది. 


టైటిల్ చూసి, ‘ఇదేదో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ గోలలా  ఉంది, మనక్కాదేమో ఈ పుస్తకం’  అని కొందరు  పాఠకులైనా  అపోహ పడే  అవకాశముంది. 

 ప్రధానంగా కమ్యూనిజం గురించి ఆసక్తి ఉన్న పాఠకులను లక్ష్యంగా చేసుకుని ఈ పుస్తకం రాసినా ... ఆ  క్రమంలో ప్రస్తావనకు వచ్చే ఎన్నో అంశాలు  సాధారణ పాఠకులు  కూడా  ఆలోచించాల్సినవిగా కనిపిస్తాయి.  

   
రంగనాయకమ్మ గారు ‘అడవి గాచిన వెన్నెల’పై విమర్శ మాత్రమే రాసివుంటే  సందర్భాలేమిటో అర్థం కాక గందరగోళం అయివుండేది. ఆ సందర్భాలను తెలపటం కోసం అనువాద రచనను చాలాసార్లు కోట్ చేయాల్సివచ్చేది.  దీనికంటే ఇలా ‘విమర్శనాత్మక పరిచయం’ చేయటమే బావుంది. 

 పైగా ఇలా చేయటం వల్ల- ఈ పుస్తకం  చదవకముందే ‘అడవి గాచిన వెన్నెల’ను  చదవాల్సిన అవసరం కనిపించదు. తర్వాత కూడా చదవొచ్చు.  ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్నీ, ఇంకా ఇంగ్లిష్ మూలం  ‘వైల్డ్ స్వాన్స్’ నూ కూడా చదవటం మంచిదే!  
 
‘‘దీన్ని తెలుగు పాఠకులకు అందించిన వారిని అభినందించాలి. అనువాదం చాలా సరళంగా, చాలా సృజనాత్మకంగా సాగింది. ఎక్కడ ఏ తెలుగు మాటలు పడాలో అవే పడ్డాయి’’ అంటూ  ‘అడవి గాచిన వెన్నెల’ అనువాదం గురించి రంగనాయకమ్మ గారు ప్రశంసిస్తారు.




‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ కాలక్షేపం పుస్తకం కాదని తెలిసిపోతూనే ఉంది కదా?  రంగనాయకమ్మ గారు రాశారు కాబట్టి తేలిగ్గానే  అర్థమవుతోందనుకోండీ.  కానీ చైనా పేర్లు... యుఫాంగ్, డేహాంగ్, వాంగ్, యుంగ్ చాంగ్... ఇవన్నీ అలవాటయ్యేదాకా  మొదట్లో  కాస్త ఇబ్బంది!

ప్రజలకు సుఖ శాంతులు కావాలంటే కమ్యూనిజం పనికి రాదనీ, అది దుర్మార్గమైనదనీ యుంగ్ చాంగ్ తన పుస్తకంలో తేల్చిచెపుతుంది. అంతే కాదు; పెట్టుబడిదారీ విధానమే సరైనదనీ, అదెంతో గొప్పదనీ కూడా చెప్పేస్తుంది.

ఆమె ఈ అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి  బలమైన కారణాలే కనిపిస్తాయి.

ఆమె తల్లిదండ్రులు నిజాయితీగా, కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారు. కానీ ఆ పార్టీ...  వారిని అవమానాల, కష్టాలపాలు చేస్తుంది. ఇలా నిరపరాధులు  చాలామంది బాధలు పడటం యుంగ్ చాంగ్ చూస్తుంది. దీంతో ఆమె చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, ఆ సిద్ధాంతం మీదా  విముఖత  పెంచుకుంటుంది.

‘‘కమ్యూనిస్టు పార్టీ చేసిన తప్పులకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కారణంగా చేయటమే పొరపాటు’’  అని రంగనాయకమ్మ గారు అభ్యంతరం చెపుతారు. ‘‘మంచి సిద్ధాంతం పేరు చెప్పుకునే వాళ్ళ ఆచరణ చెడ్డగా ఉంటే, అది ఆ సిద్ధాంతం తప్పు అవదు’’ అంటారు.

‘‘పెట్టుబడిదారీ విధానం పట్ల సమర్థనా, కమ్యూనిజం పట్ల వ్యతిరేకతా కూడా ఒక పోరాటమే. పోరాటం అంటే, కత్తులూ, తుపాకులూ పట్టుకోనక్కరలేదు. భావాల్లోనే, ఆలోచనల్లోనే, పోరాటం ఉంటుంది, ఇటు వేపు గానీ, అటు వేపు గానీ’’  అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తారు!



రంగనాయకమ్మ గారి విమర్శలూ, వ్యాఖ్యానాలూ, వివరణలూ ఈ విమర్శనాత్మక పరిచయాన్ని ఆసక్తి కరంగా మార్చాయి.  ఇక, ఆమె మార్కు రిమార్కులూ,  వ్యంగ్య హాస్య చమక్కులూ సీరియస్ సందర్భాల్లోనూ నవ్వులు పూయిస్తాయి! 

ఈ  పుస్తకంలో ఒక సందర్భం చూడండి.

‘‘.... పెళ్ళి ఆగిపోయిన రెండు వారాల తర్వాత, డేహాంగ్ తన ఉమెన్స్ ఫెడరేషన్ మీటింగ్ లో వుండగా, ... పార్టీ ఛీఫ్ నుంచి ఒక నోట్ అందింది- వెంటనే మీటింగ్ నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకోమని! డేహాంగ్ ఆ నోట్ ని మీటింగ్ లో బాస్ కి అందించింది.

బాస్ కూడా ఆ నోట్ చదివి, ‘సరే వెళ్ళు’ అంది. డేహాంగ్, మీటింగ్ యూనిఫారమ్ లోనే పెళ్ళి కోసం వాంగ్ క్వార్టర్ వేపు పరుగు తీసింది. (అవును, తెలివైన పనే. ఆలస్యం చేస్తే  ‘పెళ్ళి ఆపండి’ అని ఇంకో నోట్ వచ్చినా రావచ్చు కదా? చెప్పలేం.) ’’

బ్రాకెట్లోని ఆ విసురు గమనించారు కదా!

ఈ సందర్భంలో దూసుకొచ్చిన  పదునైన వ్యాఖ్య ....

  ‘‘కమ్యూనిస్టు పార్టీని,  ‘ప్రేమించడానికి అనుమతి’ అడగడం ఏమిటి? దానికి అప్లికేషన్ పెట్టడమూ, అనుమతి దొరికితేనే ప్రేమించడమూనా? .... పురాణ కథల్లో అయినా పెద్దల్ని అనుమతి అడిగి ప్రేమించడం ఉంటుందా? ఫ్యూడల్ సమాజంలో అయినా ఇంత అజ్ఞానం ఉంటుందా? .... ప్రేమించడానికి పర్మిషన్లు అయ్యాక, అప్పుడు పెళ్ళికి మళ్ళీ కొత్త పర్మిషన్లు’’

 పార్టీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళ ప్రహసనం పై  రంగనాయకమ్మ గారు తన అనుభవం ఇలా పంచుకున్నారీ పుస్తకంలో!

‘'....పెళ్ళికి ముందు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, పెళ్ళికి పిలవడానికి కాదు; వేరే పని మీద. ‘నీ పెళ్ళి అట కదా? ఎప్పుడు?’ అని అడిగాను. ‘ఏమో, నాకింకా తెలీదండీ. మీటింగ్ ఎప్పుడు పెట్టారో ! రెండ్రోజులో మూడ్రోజులో ఉందనుకుంటా’’.... అంది. ‘పెళ్ళి కొడుకు ఎవరో అయినా తెలుసా?’ అని నేను అడగలేదు. అప్పటికే స్పృహ తప్పివున్నాను నేను.

తన పెళ్ళెప్పుడో తెలుసుకోవాలని ఆ అమ్మాయికి ఉత్సాహం లేదు, ఆతృత లేదు. ... ఇలాంటి పార్టీ కార్యకర్త, ‘నూతన సమాజం’ అనీ, ‘నూతన సంస్కృతి’ అనీ ఉపన్యాసాలిస్తూ ఉంటుంది.... అన్ని దేశాల కమ్యూనిస్టు పార్టీల నూతనత్వాలూ ఒక్కలాగే ఉన్నట్టున్నాయి’’

అదండీ సంగతి!

 ‘‘చైనా కమ్యూనిస్టు పార్టీ మీదా, మావో మీదా,  తీవ్రమైన విమర్శలతో సాగిన ఈ పుస్తకాన్ని మన కమ్యూనిస్టులందరూ చదివి, నిశితమైన చర్చలు చేసుకోవాలి’’ అంటారు రంగనాయకమ్మ గారు.

  ఇక సందర్భానుసారంగా-  యువతీ యువకుల ప్రేమ గురించీ; ఆటల పోటీలూ, వస్త్ర ధారణా, ప్రాచీన  సాహిత్యం, వ్యక్తి పూజల గురించీ ఆమె  వ్యక్తీకరించిన అభిప్రాయాలు  చదవాల్సిందే!    

‘‘మనుషులు కోరుకోవలిసింది  తన స్వంత ఆనందం ఒక్కటే కాదు, స్వంత ఆనందం ఎప్పుడూ ఉండవలిసిందే. అది లేకపోతే జీవితం శూన్యం అయిపోతుంది. కానీ, దానితో పాటు, తను కూడా జీవించే సమాజానికి ఎంతో కొంత మేలు చేసే ‘చిన్న ఆదర్శం’ కూడా ఉండాలి’’ అంటారు  ఈ పుస్తకంలో!

 ఈ  రచన చివర్లో  ఆమె రాసిన  మాటలు ‘కళాత్మక జీవితం’ గురించి  ఆలోచనలు రేపుతాయి.

''హత్యలు అవలీలగా చేసే కిరాతకుడు కూడా చేతిలో కత్తితో పోతూ, దారిలో మొక్కల మీద విప్పారి వున్న పూలు కంటబడ్డ క్షణాల్లో తనకు తెలియకుండానే ఆనందంతో స్పందిస్తాడు. ఆఖరికి జంతువులు కూడా పచ్చికలో సేద దీరి, చల్లగాలినీ, వెన్నెలనీ మోరలెత్తి అనుభవిస్తాయి.

మనుషులైనవాళ్ళు ప్రకృతిని ఆస్వాదించడంలో కొత్త జ్ఞానమూ లేదు, కొత్త సంస్కారమూ లేదు. మనుషులుగా పుట్టి పెరుగుతోన్నవాళ్ళు నేర్చుకోవాలసింది, మనుషుల గురించి. మనుషుల సంబంధాలలోనూ, మనుషుల జీవితాలలోనూ, రహస్యంగా దాగివున్న సత్యాన్ని ఆవిష్కరించిన అద్భుత సిద్ధాంతం ఒకటి ఉంది. దానిముందు ప్రేమతో మోకరిల్లడం మనుషుల విధి!''

యుంగ్ చాంగ్ వేదనను సానుభూతితో  అర్థం చేసుకుంటూనే; ఆమె ఆలోచనల్లో, ఆచరణలో   లోపాలను  వెల్లడించటం  ఈ విమర్శనాత్మక పరిచయం  విశిష్టత.

''... మానవ జీవితానికి నిజమైన ఆనందం, ప్రేమానురాగాలతో నిండిన మానవ సంబంధాల సౌందర్యంలో దొరికేదే గానీ, ప్రకృతి పరిశీలనల్లో దొరికేది కాదు. ఈ రచయిత్రి (యుంగ్ చాంగ్) మేధావితనం, ఆమెకా విషయం బోధించలేదు’’
 
ముఖ్యంగా ఇలాంటి సబ్జెక్టు రాసేటప్పుడు....  ఆ వాక్యాలు  తన  హృదయంలోంచి సూటిగా వచ్చినట్టు  శక్తిమంతంగా రాస్తారు రంగనాయకమ్మ గారు!


 ‘‘ఆమె (రచయిత్రి యుంగ్ చాంగ్) కోరుకున్న బూర్జువా రుచుల ముందు తల్లిదండ్రుల ఆదర్శాలేవీ పనిచెయ్యలేదు... ఆమె, ఆ  అవగాహన ఏర్పరుచుకునివుంటే, దోపిడీ నీచత్వంలో ఆరితేరిన బూర్జువా విధానాన్ని కీర్తించే, మానవుల వల్ల మానవులకే ద్రోహం జరిగే క్రూర విధానాన్ని ఆలింగనం చేసుకునే పతనావస్థ  ఆమెకి తప్పేది.’’



 ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ రాయల్ సైజులో 250 పేజీలున్న పుస్తకం.  ధర 60 రూపాయిలు. విశాలాంధ్ర, నవోదయ లాంటి పెద్ద పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఇవి అందుబాటులో లేనివారు విజయవాడలోని ‘అరుణా పబ్లిషింగ్ హౌస్’ (ఫోన్ : 0866-2431181) ని సంప్రదించవచ్చు. 

కినిగెలో ఈ - బుక్ కావాల్సినవారు చూడాల్సిన లింకు- 
http://kinige.com/kbook.php?id=947&name=Communistu+Party+Ela+Vundakudadu

 ఈ టపాలో నేను రాసినవాటి కంటే రంగనాయకమ్మ గారి పుస్తకంలోని వాక్యాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయా?:) .....  నిజమే!

22 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దుప్పల రవికుమార్ చెప్పారు...

వేణుగారూ, ఎంత చక్కటి పరిచయం రాశారో కదా. నిజంగా వెంటనే పుస్తకం చదవాలనిపించేలా వుంది మీ పరిచయ వ్యాసం. రంగనాయకమ్మగారు ఇంత చక్కగా వివరణాత్మకంగా తన విమర్శను రాస్తుంటే ముచ్చటేస్తోంది. తన అభిప్రాయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చెప్పడం ఆమెకే చెల్లింది. ప్రస్తుతం నేను మార్క్స్ పూర్వపు అర్థిక శాస్త్రవేత్తలు పుస్తకాన్ని, రంగనాయకమ్మగారి ప్రశ్న జవాబులను చదువుతున్నాను. ఈ పుస్తకం నా చేతికి వచ్చేప్పటికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో కదా!

వేణు చెప్పారు...

@ సుజాత: రంగనాయకమ్మ గారి వాక్యాలను ఎక్కువగా కోట్ చేయటం బాగానే ఉందంటారు. థాంక్యూ!


@ దుప్పల రవికుమార్: ధన్యవాదాలండీ. మీ చేతిలో ఉన్న పుస్తకాలు చకచకా చదివేసి, రంగనాయకమ్మ గారి ఈ కొత్త పుస్తకాన్ని కూడా వీలైనంత త్వరగా చదవండి మరి!

అజ్ఞాత చెప్పారు...

పరిచయ పుస్తకాన్ని, అసలు పుస్తకాన్నీ రెండూ పరిచయం చేసేశారు! రెండూ చదువుదామా అనిపించచేలా!బాగా రాశారు.

రవి చెప్పారు...

చదవాలనిపించేలా ఉంది మీ సమీక్ష. రంగనాయకమ్మ విమర్శకులు కూడా ఆమె శైలిని మెచ్చుకునేంత ప్రతిభాశాలి ఆవిడ. వీలు దొరికితే చదవాలి ఈ పుస్తకం.

sunita చెప్పారు...

manchi pustakam. chakkani parichayam.

వేణు చెప్పారు...

@ అజ్ఞాత : ధన్యవాదాలండీ.

@ రవి : రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకంపై నా సమీక్ష మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు.

@ sunita: థాంక్యూ.

మంచు చెప్పారు...

ఈవిడ ఇంతకు ముందు ఏ పుస్తకాలు రాసింది ? మన ప్రవీణ్ అభిమాన రచయత అని తెలుసు గాని ఎమి రాసిందొ పెద్ద ఇడియా లేదు..

వేణు చెప్పారు...

మంచు పల్లకీ గారూ,

రంగనాయకమ్మ గారు ఏ పుస్తకాలు రాశారో ‘పెద్దగా’ ఐడియా లేదా? తెలియాలంటే... http://ranganayakamma.org/ చూడండి.

ఆమె పేరు వినగానే.. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధికెక్కిన నవలలు బలిపీఠం, జానకి విముక్తి, ఇంకా రామాయణ విషవృక్షం గుర్తుకువస్తాయి. కాపిటల్ ను తేలిగ్గా వివరించిన ‘కాపిటల్ పరిచయం’ సంపుటాలు కూడా.

ఆమె అభిమానుల జాబితా చాలా పెద్దదే లెండి! ‘ఏమి రాసింది?’ అంటూ మీరు ఆమెను ఏకవచనంలో సంబోధించటం అస్సలు బాలేదండీ!

మంచు చెప్పారు...

క్షమించండి.. ఇంతకు ముందు చదివిన కొన్ని కామెంట్లను బట్టి నాకు ఒక అభిప్రాయం కలిగింది.. ఆ అభిప్రాయం ప్రకారం అలా సంబోధించవలసి వచ్చింది.. ఈ సారి ఎదయినా ఒక పుస్తకం చదివిన తరువాత ఎలా సంభొదించుకొవాలొ నిర్ణయించుకుంటాను.. అప్పటివరకూ 'ఎమి రాసారు ' అనే అడుగుతాను

వేణు చెప్పారు...

మంచు పల్లకీ గారూ, గుడ్!

ఎవరో రాసిన కామెంట్లని బట్టి రచయితపై ఏర్పరచుకునే అభిప్రాయం కంటే; రచయిత పుస్తకాలను చదివి ఏర్పరుచుకునే అభిప్రాయంలోనే న్యాయం ఉంటుంది.

భావన చెప్పారు...

మీ పరిచయం బాగుంది. నాకు రంగనాయకమ్మ గారి రచనా శైలి బాగుంటుంది ఆమె అభిప్రాయాలతో విభేదించినా కూడా. కామెంట్ లలో మంచు పల్లకి గారితో ఆమె పుస్తకాల గురించి ప్రస్తావిస్తూ స్వీట్ హోం మర్చిపోయారేమిటి అండి. రంగనాయకమ్మ గారంటే నాకైతే ఠాక్కున అది గుర్తు వస్తుంది. 'అమ్మ కు ఆదివారం శెలవు లేదా' అని ఒక కధల తోటి పుస్తకం వుంటుంది అది కూడా బాగుంటుంది..

వేణు చెప్పారు...

భావవ గారూ,

నిజమే, రంగనాయకమ్మ గారి పుస్తకాల గురించి ప్రస్తావించినపుడు ‘స్వీట్ హోమ్’ గురించి కూడా నేను రాసివుండాల్సింది. ఇక ‘అమ్మకు ఆదివారం లేదా?’ అనే సంపుటంలో 50 కథలు ఉన్నాయి.

ఆమె రాసిన కొత్త పుస్తక పరిచయంపై మీ అభిప్రాయానికి థాంక్యూ!

సుజాత వేల్పూరి చెప్పారు...

భావనా,
అది 'అమ్మకు ఆదివారం లేదా"! అనే నవలిక! కథా సంపుటి ఆ పేరుతో రాకముందు అది విడిగా నవలికగా కూడా వచ్చినిది. చాలా వ్యంగ్యాలతో నడుస్తుంది.దాదాపు అదే టైములో రాసిన "ప్రేమ కన్నా మధురమైనది"నాకంతగా నచ్చలేదు. ఇంకా మరేమో....ప్చ్ ఇక్కడ కాదులెండి, మనం విడిగా మాట్లాడుకుందాం.

ఈ కథా సంకలనం మాత్రం A4 సైజులో ఉండటం వల్ల బాగా తినేసి చదవడానికి కూచోవాలి. ఎందుకంటే బోల్డంత ఓపిక కావాలి దాన్ని "పట్టుకుని" చదవడానికి!

వేణు చెప్పారు...

సుజాతా,

మీరు భావన పేరు ప్రస్తావించి రాశారు కానీ, ఈ విషయంలో నేను చెప్పాల్సింది కూడా ఉంది.

'అమ్మకు ఆదివారం లేదా’! అనేది నవలిక అనిపిస్తుంది కానీ, దీన్ని పెద్ద కథగానే చెప్పాలి. (రచయిత్రి అభిప్రాయంలో కూడా ఇది కథే).

ఈ కథా సంకలనం సైజు గురించి ... 572 పేజీల పుస్తకం కాబట్టి ఎక్కడికైనా ‘చిన్న బ్యాగ్’లో తీసుకువెళ్ళటం కష్టమే!

ఈ సందర్భంగా- ఇదే పుస్తకం ముందుమాట తర్వాత రంగనాయకమ్మ గారు ఏం రాశారో చూడండి.

‘‘ చిన్న సైజు వల్ల, చదువుకోడానికి సౌఖ్యం అనే ఉపయోగం వుంటే; పెద్ద సైజు వల్ల, కథలన్నీ ఒకేచోట దొరకడమూ, ధర తగ్గడమూ- అనే ఉపయోగాలు వుంటాయి. ఈ రెండో సౌఖ్యం కోసం మొదటి సౌఖ్యాన్ని వదులుకోవలసి వచ్చింది.

కానీ, నాకు ఇప్పటికీ చిన్న సైజే ఇష్టం. ‘నూతన సమాజం’లో పుస్తకాలన్నీ, చిన్న సైజులోనూ, పెద్ద ప్రింటుతోనూ,చదవడానికి చాలా సౌఖ్యంగా వుంటాయనే ఆశతో, ఇప్పటికి ఇలా సంతృప్తి పడుతున్నాను.’’

A4 సైజు (రాయల్ సైజు)కి పుస్తకం పెరగటం వల్ల దానికయ్యే ఖర్చు తగ్గి, ఫలితంగా ధర కూడా తగ్గిపోయి
ఎక్కువమంది పాఠకులకు అందుబాటులోకి వస్తోంది కదా!
దీన్ని తల్చుకుంటే, ‘సైజు’ మూలంగా చదవటానికి కలిగే అసౌకర్యం చాలావరకూ తగ్గిపోతుంది నాకు:)

సుజాత వేల్పూరి చెప్పారు...

వేణూ,
ఈ ముందు మాట నేను రచయిత్రి మాటల్లో చదివేశానండీ, ఎందుకంటే పుస్తకం కొన్నానుగా మరి(నా వద్ద లేని కథల కోసం)! నాకూ రంగనాయకమ్మ గారి లాగే చిన్న సైజే ఇష్టం! ఎక్కడైనా సరే కూచుని పట్టుకుని చదవడానికి వీలుగా ఉంటుంది కాబట్టీ, ఎక్కడికైనా సరే చిన్న హాండ్ బాగ్ లో తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టీనూ!

అందులోనూ నేను "హస్త భూషణం " తరహాలో ఏ పుస్తకాలూ మోసుకెళ్ళను. వెంట ఉన్న పుస్తకం చదివి తీరాల్సిందే!

అలాగే ఈ పుస్తకంలో కథలు పేజీలో రెండు కాలమ్ లలో ఉండటం కూడా నచ్చలేదు నాకు. ఏదో మాసపత్రిక చదివినట్లు అనిపించింది. రంగనాయకమ్మ గారి పుస్తకం అంటే కలిగే అల్టిమేట్ ఫీలింగ్ రాలేదు. అందుకే తరచూ పాత నవలలే చదూతున్నాను..:-))!


ఎక్కువమందికి అందుబాటులోకి రావడమనే పాయింట్ రచయితలకు అనుకూలంగా ఉండొచ్చు, పాఠకులకు కాదు కదా!

వేణు చెప్పారు...

సుజాతా,

'ఎక్కువమందికి అందుబాటులోకి రావటం’ అంటే ‘ఎక్కువమంది పాఠకులకు’ అందుబాటులోకి రావటమే కదా?

అయినా మీరన్నట్టు- రచయితలక్కూడా అనుకూలంగా ఉండే పాయింటే ఇది!

డబ్బు కోసం చూసే కమర్షియల్ రచయితలకే కాదు; తమ భావాలు ఎక్కువమందికి చేరితే చాలని ఆశించే నాన్ కమర్షియల్ రచయితలకూ!

కాకపోతే,‘ముద్రించే కాపీలు’ పెరిగినకొద్దీ- కమర్షియల్ రచయితలకు లాభాలు వస్తాయి; రంగనాయకమ్మ గారి లాంటి వాళ్ళకేమో నష్టాలు వస్తాయి... ముద్రణ వ్యయం కంటే పుస్తకం ధర తక్కువ పెడతారు కాబట్టి !

పుస్తకాలు రెండు కాలమ్స్ లో ఉండటం మీలాగే నాకూ నచ్చలేదు!:)

hareelu చెప్పారు...

చాలా బాగుంది మీరు వ్రాసిన పరిచయానికి పరిచయం.

వేణు చెప్పారు...

hareelu గారూ, పుస్తక పరిచయం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!

Unknown చెప్పారు...

ranganayakamma gari gurinchi enta rasina, cheppina takkuve.anta nibaddata unna rachayita evvarU undaremo!rasina prati aksharam avida acharistaru.rachayitala,itarula ahalu avida prayatnalu prajalaki cherakunda chestunnayi..chedu pracharalu jarugutunnayi.nijayite,nibaddata,sari ayina alochana,deeksha unna adbhutamaina vyakti avida.ila rase badulu edo nerchukuni acharinchavachu kada ani anenta goppa vyakti.dayachesi avida pustakalani parichayam cheuyyandi.acharinche dhairyam,acharanalo kashtalani,ibbandulani edurkune uddesam,nenu tappu ani angeekarinchalekapovadam..avida rachanalani,avidani rate cheyyadaniki upayoginchakunda, manaki matrame telisina nijayitee to chadavali ranganayakamma garini.

Unknown చెప్పారు...

Orkut lo Ranganayakamma community lo meeru start chesina thread choosi ... mee blog chadivanu. Mee parichayam baagundi. Kotta pustakam lo konni quotes ivvatam bagundi. Pustakam koni chadive varaku ee dose saripotundi. Mee blog ki, RN ki chala fans unnare ikkada ... nice to meet you all.

వేణు చెప్పారు...

@ Sasanka : రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం పరిచయం నచ్చినందుకు థాంక్యూ. ఆమె గురించి మీ అభిప్రాయాలు బావున్నాయి. RN రాసిన మరో రెండు పుస్తకాల గురించి ఈ బ్లాగులో చూడొచ్చు మీరు!

@ bha : ‘పుస్తకం కొని చదివే వరకూ ఈ డోస్ (రంగనాయకమ్మ పుస్తకంలోని కోట్స్) సరిపోతుంది’ :) ‘కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు?’ పుస్తక పరిచయంపై మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలండీ.