శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు, చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.
పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్).... ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!
దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!
పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.
చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.
1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!
మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.
కురుక్షేత్ర సమర ఘట్టాలు, భీష్ముడి అవక్ర పరాక్రమం, పాండవుల మహాప్రస్థానం; రాముడి అరణ్యవాసం, వాలి సుగ్రీవుల గాధ, వాలి వధ, హనుమంతుడి లంకా నగర సాహసాలు, వారధి నిర్మాణం, రామ రావణ యుద్ధం .. ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.
ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!
‘చందమామ’ ఆరంభమైన 8 సంవత్సరాల తర్వాత, 1955 సెప్టెంబరు సంచికలోకి నడిచొచ్చాడు విక్రమార్కుడు! శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే విక్రమార్కుడి బొమ్మను మొదట ‘చిత్రా’ వేశారు. దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్. ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ, వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.
బేతాళ కథ చివరిపేజీలో శవంలోంచి మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా (దయ్యం ఇలాగే ఉంటుందని.... నాలాంటి ఎందరికో చిన్నపుడు అనిపించేది) చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల స్మృతుల్లో సజీవం!
చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం. ఈ ఇద్దరు చిత్రకారులదీ సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా! చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’ ; శంకర్ పాత్రలు మాత్రం ‘స్లిమ్’! (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)
చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!
శంకర్ లాంటి గొప్ప చిత్రకారుడు గీసిన బొమ్మల్లోంచి ‘కొన్నిటిని’ ఎంచుకుని, టపాలో చూపించటం చాలా కష్టమైన పని. ఆయన ‘వైవిధ్య ప్రతిభను చూపించే బొమ్మల’ వరకే పరిమితమైనా సరే, ... అదీ ఐదారు బొమ్మల్లో సాధ్యం కాదు.
మరేం చేయటం?
‘కొండను అద్దంలో చూపించటం’ కష్టమే. అలా చేసినా ఒక పక్కే కనపడుతుంది. మరి కనిపించని పార్శ్వం సంగతో?
అందుకే... శంకర్ గీసిన కొన్ని బొమ్మలను ‘మచ్చుకు’ ఇస్తూ సంతృప్తి పడాల్సివస్తోంది. (చందమామ పత్రిక సౌజన్యంతో).
మహాభారతం లోని చిన్ననాటి శకుంతల బొమ్మ చూడండి. వృక్షాలూ, లతలూ, పూలూ స్వాగతించే అద్భుతమైన ఆ అరణ్యంలోకి వెళ్ళాలనిపించటం లేదూ? కణ్వముని తో పాటు మనకూ ఆ బాల శకుంతలపై ప్రేమ పుట్టుకొచ్చేలా శంకర్ వేశారు.
శ్వేతుడి గదాఘాతానికి భీష్ముడి రథం నుగ్గునుగ్గయ్యే సన్నివేశం ఎంత గగుర్పాటు కలిగిస్తుందో గమనించండి.
పక్షి ఆకారంలోని ‘క్రౌంచ వ్యూహం’ చూడముచ్చటగా అనిపిస్తుంది. దీనిలో రథ, గజ, తురగ, పదాతి సైన్యం చూడండి! ‘విహంగ వీక్షణం’ చేయించారు కదూ, శంకర్!
పర్వతమ్మీది నుంచి హనుమంతుడు లంకా నగరాన్ని చూడటం...దూరంగా సముద్రం... అద్భుతంగా లేదూ?
ఇక్కడ కనిపించే ... ‘రాతి తల’ను వేసింది శంకరే. ‘ప్రపంచపు వింతలు’ అనే సింగిల్ పేజీ ధారావాహిక చందమామలో 1960లలో వచ్చేది. 1969 మార్చి సంచికలోది ఈ బొమ్మ.
శంకర్ గారి జీవిత విశేషాలు చాలా వివరంగా ఇక్కడ లభిస్తాయి. చదవండి...!
12 కామెంట్‌లు:
చాలా బాగా రాసారు. మంచి వివరలు అందించారు.
నాకు ఈ బొమ్మలు ఎంత ఇష్టమో... చిన్నప్పుడు ఈ బొమ్మలకోసమే చందమామ చదివేవాడిని.
వేణూ గారూ,
అభినందనలు. చందమామ చిత్రకారుడు శంకర్ గారి మీద మంచి వ్యాసం వ్రాసారు. శంకర్ గారి గురించి మరిన్ని వ్యాసాలు వ్రాసేలా మంచి ఆరంభం ఇది.
మీరు ఎన్నుకున్న బొమ్మలు ఆయన చిత్ర కళా నైపుణ్యానికి మచ్చుతునకలు.
దయచేసి ఈ వ్యాసాన్ని, మన తెలుగు చందమామ బ్లాగులో కూడ ప్రచురించండి.
బాగున్నాయండి బొమ్మలూ మీరు రాసిన పరిచయమూ రెండూనూ. అవును నాకు ఇప్పటికి దెయ్యాల కధ ఎక్కడ ఎప్పుడూ విన్నా విక్రమార్కుడి భుజం మీద వేలాడే భేతాళుడే కింద తోక వున్న దెయ్యపు పిల్లే గుర్తు వస్తుంది.
బాగుందండీ మీ నిశిత పరిశీలన.. వాటర్ కలర్స్ తో అద్భుతాలు చేసినవాళ్ళలో వపా తర్వాత చెప్పుకోవాల్సిన పేరు శంకర్ దే..
అద్భత చిత్రకారుడు శంకర్ గురించి ఇటీవలి వరకూ ఎవరూ
పట్టించుకోకపోవటం ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రతిభా సంపత్తికీ, ప్రాచుర్యానికీ సంబంధం ఉండనవసరం లేదని ఇలాంటి ఘటనలే నిరూపిస్తాయి.
@ తృష్ణ : శంకర్ గురించి రాసిన టపాపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
@ శివ : థాంక్యూ. శంకర్ బొమ్మలను కొన్నే ఎంచుకోవటం అంటే అది కష్టమైన పనే.
ఈ టపాను ‘మన తెలుగు చందమామ’లో కూడా ప్రచురించాను. గమనించేవుంటారు మీరు!
@ విశ్వ ప్రేమికుడు : బొమ్మల కోసమే చందమామ చదివేవాళ్ళలో మీరూ, నేనూ .. ఇంకా అసంఖ్యాకమైన పాఠకులున్నారండీ. ధన్యవాదాలు.
@ భావన : థాంక్యూ. చందమామ కథల్లో మంచి దయ్యాలే ఉంటాయి. వాటిని పెంచుకోవాలని కూడా అనిపిస్తుంది.:) దయ్యాల రూపాన్ని స్టాండర్ డైజ్ చేసింది చందమామ చిత్రకారులేనేమో !
@ మురళి : థాంక్యూ ! శంకర్ కూడా చందమామలో కొన్ని ముఖచిత్రాలు వేశారు. కానీ ఇన్నర్ పేజీ వేసిన పౌరాణిక చిత్రాల్లోనే ఆయన అత్యుత్తమ ప్రతిభ కనిపిస్తుంది!
వేణు గారూ,
శంకర్ గారి పై బొమ్మలతో సహా మీరు పొందుపరిచిన వ్యాసం చాలా బాగుండడమే కాదు ఆసక్తి గలవారికి ఉపయోగపడే విధంగా కూడా ఉంది. ఐతే 8వ పేరాలో మీరు రాసిన 'అవిక్రమ పరాక్రమం ' అనే పదమే కొరుకుడు పడలేదు. ' అవక్ర విక్రమ పరాక్రమం ' అన్నది సరైన పద ప్రయోగం. మీకు తెలిసే వుంటుంది కానీ టైపింగ్ మిస్టేక్ అయివుంటుందనుకుంటున్నాను. రాజా
రాజా గారూ, సంగీతేతరమైన పోస్టుకు మీ వ్యాఖ్య ఇదేననుకుంటా కదూ? :)
‘అవక్ర పరాక్రమం’ అనేదే మీరన్నట్టు... సరైన ప్రయోగం. టపాలో సరిచేశాను. థాంక్యూ వెరి మచ్!
‘చందమామ’ రాజు గారి వ్యాఖ్య ఇది. బ్లాగులో పోస్టు చేయటం సాధ్యం కాలేదని మెయిల్లో పంపారు.
‘‘వేణు గారూ,
శంకర్ గారిపై చక్కటి వ్యాసం ప్రచురించారు. నేత్రపర్వంగా, అపురూప చిత్రాలు గీసిన శంకర్ గారి ప్రతిభకు మీ కథనంలో చొప్పించిన ఆ క్రౌంచ వ్యూహ చిత్రం, లంకాద్వీప చిత్రమే నిదర్శనంగా నిలుస్తాయి కదా. ముఖ్యంగా లంకాద్వీపంలో ఆ ఏరియల్ వ్యూ ఎంత అద్బుతంగా కుదిరిందో చూడండి. ఒక ఎత్తైన కొండనుంచి మరొ ఎత్తైన కొండపై ఉన్న లంకాద్వీపాన్ని, ద్వీపం సమీపంలో పారే కాలువలను, సుదూరంలో కనిపించే సముద్రాన్ని చూస్తుంటే రెండు స్థలాల మధ్య దూరాన్ని శంకర్ గారు ఎంత నైపుణ్యంగా అంచనా వేశారో, కొలిచారో అర్థమవుతుంది కదా...
నిజంగా ఏరియల్ వ్యూను ప్రదర్శించే చిత్రం ఇది. క్రౌంచ వ్యూహం అని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అర్థమయ్యేది కాదు. కాని అప్పట్లో చందమామ పత్రికలో దాన్ని చూసిం తర్వాత గాని అదేమిటో తెలిసింది కాదు. మన ప్రాచీన కాలపు యుద్ధవ్యూహాలలో ఒకదాన్ని ఎంత అమోఘంగా శంకర్ గారు చిత్రరూపంలో చూపించారో చూడండి. అప్పట్లో వచ్చిన విదేశీ చారిత్రక సినిమాల్లో ప్రదర్సించిన సైనిక వ్యూహాలకు ఏమాత్రం తీసిపోని చిత్రం ఇది. సైనిక వ్యూహాన్ని ఇంత చక్కగా తీయవచ్చా. శంకర్ గారు కాకుండా మరే చిత్రకారుడైనా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారా? నాకయితే తెలీదు.
(continued...)
'చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.' కానీ శంకర్ గారు కొత్తగా చందమామలో చేరిన రోజుల్లో చిత్రాగారు ఆయనకు బాస్ అట. ఇరువురి మధ్యా అప్పట్లో తీవ్ర వ్యతిరేకత కూడా నెలకొందని తెలుస్తోంది. కానీ, రోజులు గడిచే కొద్దీ, పరిచయం పెరిగే కొద్దీ వీరిద్దరూ ఆప్తమిత్రులయిపోయారట. వడపళనిలోని చందమామ భవంతిలో ఇరువురికీ పక్క పక్క స్థానాలు కేటాయించడంతో ఇద్దరి మధ్యా పనిస్థలంలో ఏర్పడిన సాన్నిహిత్యం వ్యక్తిగత స్నేహబంధంగా కూడా పరిణమించిందట. చందమామలో వీరిద్దరూ రామలక్ష్మణులు లాగా ఉండేవారట. పార్కుల్లో, బీచ్‌లలో, దర్శనీయ స్థలాల్లో ఎక్కడ చూసినా వీరిద్దరిదే హవా.
చిత్రగారు పోయేంతవరకూ వీరిద్దరిదీ కుటుంబ స్నేహం. చిత్రగారి కుటుంబం ట్రప్లికేన్‌లో ఉంటోందని ఆయన చెబితే ఖచ్చితంగా ఓసారి అక్కడికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్సించి వద్దామని ప్రతిపాదిస్తే శంకర్ గారు సంతోషంగా ఒప్పుకున్నారు. కాని ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన అనారోగ్యం పాలయి ఇంటినుంచి పని ప్రారంభించవలసి రావడంతో ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఆయనకు బాగున్నప్పుడే చిత్రాగారి కుటుంబీకులను కలిసి ఉంటే బాగుండేది. కనీసం చిత్రాగారి ఫోటోలు కొన్నయినా దొరికి ఉండేవి.
శంకర్ గారి జీవితవివరాలకోసం నా బ్లాగు లింకులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శంకర్ గారిపై మంచి కథనానికి అభినందనలు.
చందమామ ఆస్థాన చిత్రకారుల -చిత్రా, శంకర్, ఆచార్య, వపా- చిత్రాలపై తొలి పుస్తకం వచ్చే జనవరి నాటికి సిద్దం కావచ్చు. కనీసం వీరిపై నాలుగు పుస్తకాలు వచ్చే సంవత్సరం ప్రచురించవచ్చని అంచనా. ధర మాత్రం తెలీదు. చూద్దాం.
రాజు’’
రాజు గారూ, మీ అభినందనకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యను రెండు భాగాలుగా ఇవ్వాల్సివచ్చింది. (పెద్ద వ్యాఖ్యలను బ్లాగర్ అనుమతిస్తున్నట్టు లేదు.)
మీ వ్యాఖ్య ద్వారా విలువైన విశేషాలు తెలిశాయండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి