కృష్ణుడు అంటే - ఎన్టీఆర్!
క్రీస్తు అంటే - విజయచందర్!!
ఎన్టీఆర్ కి సొంత ఊరు (1956) లో కృష్ణుడి పాత్ర సరిగా కుదరని చేదు అనుభవం ఒక్కటే. ఏడాది తిరిగేసరికల్లా ‘మాయాబజార్’తో సినీ శ్రీకృష్ణావతరణం జరిగింది.
కానీ విజయచందర్ క్రీస్తు పాత్ర పోషణ ప్రేక్షకుల ముందుకు రావటానికి ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది.
అడుగడుగునా చిత్రనిర్మాణపు కష్టనష్టాల శిలువను మోయాల్సివచ్చిందాయన.
పట్టిన పట్టు వీడకుండా ‘కరుణామయుడు’(1978) తీసి విడుదల చేస్తే... అఖండ విజయం సాధించింది!
‘మాయాబజార్’ కృష్ణుణ్ణి తీర్చిదిద్దింది కళాదర్శకుడు మా.గోఖలే!
‘కరుణామయుడు’ క్రీస్తును రూపు కట్టించింది రూపశిల్పి ముండూరి సత్యం!!
ఆర్థిక సమస్యలతో ఆగుతూ సాగుతూ, మధ్యలో దర్శకుడు ఎ. భీమ్ సింగ్ మరణంతో కుదుపుకు గురై, తర్వాత ఆయన అసిస్టెంట్ తిరుమలై ఆధ్వర్యంలో కొనసాగింది ‘కరుణామయుడు’ చిత్రనిర్మాణం.
ఇన్ని అడ్డంకులతో ఐదేళ్ళపాటు తీసిన ఏ సినిమా అయినా నాణ్యంగా వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఈ సినిమా ప్రమాణాల పరంగా ఉన్నతస్థాయిలో నిలవటం విశేషం. రెండువేల ఏళ్ళనాటి వాతావరణ సృష్టి, సంగీత సాహిత్యాలు, పాత్రధారుల నటన , సాంకేతిక హంగులు ఇవన్నీ చక్కగా కుదరటం అరుదైన విషయమే!
అవసరమైనంత డబ్బు చిక్కక...
చిక్కుల సుడిగుండంలో చిక్కుకుని ఎలాగో బయటపడుతూ
ఎట్టకేలకు సినిమాను పూర్తిచేసిన విజయచందర్...
ఆ క్లేశాల ప్రభావమేదీ కనపడకుండా ..
తన పాత్రకు అనితర సాధ్యంగా ప్రాణప్రతిష్ఠ చేయటం మరో పెద్ద విశేషం!
‘క్రీస్తు దొరికాడు..’
కౌబాయ్ వేషాలు వేసే విజయచందర్... క్రీస్తు పాత్రకు సరిపోతారని మొట్టమొదట గుర్తించింది ఎవరు?
ఆయన పేరు తంగప్ప. తమిళంలో ప్రసిద్ధ దర్శకుడు.
‘కరుణామయుడు’ సినిమా ఆరంభానికి రెండేళ్ళముందు 1972లో ఆయన ‘మేరీమాత’ సినిమా తీశారు.
ఆ సినిమా కోసం విజయచందర్ కు స్క్రీన్ టెస్ట్ చేసి ఆనందంగా ‘నాకు క్రీస్తు దొరికాడు’ అన్నారట! డేట్లు కుదరక విజయచందర్ కు ఆ సినిమాలో పాత్ర మిస్సయింది.
తర్వాత 1974లో ‘రారాజు క్రీస్తు’ కోసం క్రీస్తు పాత్రకు ఎంపికైనప్పటికీ ఆ సినిమా నిర్మాణం నాలుగురోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది.
దీంతో... నటుడిగా తన ఉనికి నిలబెట్టుకోవటం కోసం అదే కథను ‘కరుణామయుడు’ ప్రాజెక్టుగా నెత్తికి ఎత్తుకోవాల్సివచ్చింది విజయచందర్.
తెర వెనక విశేషాలతో పుస్తక రచన
‘కరుణామయుడు’తీసి 35 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా విజయచందర్ ‘నేను - నా కరుణామయుడు’ అనే పుస్తకం ప్రచురించారు. తన సినిమా ప్రస్థానాన్నీ, కరుణామయుడు నిర్మాణం వెనక జరిగిన ఎన్నో ఘట్టాలనూ సవివరంగా, ఆసక్తికరంగా అక్షరబద్ధం చేశారు. గుంటూరు ఏసుపాదం రచనా సహకారం అందించారు.
పుస్తకం చివర్లో ఈ చలనచిత్రం స్క్రీన్ ప్లే- సంభాషణలను అనుబంధంగా అందించారు.
దాదాపు ఎ 4 సైజులో 640 పేజీలున్న ఈ భారీ పుస్తకం ఖరీదైన కాయితంతో- రంగులపేజీలతో, ఫొటోలతో ముస్తాబైంది.
దీని వెల- రూ.1250.
సినీ సాహిత్యంపై తెలుగులో వచ్చిన పుస్తకాల ధరల్లో (ఇప్పటివరకూ ) ఇదే అత్యధికం!
పేపర్ క్వాలిటీ, పుస్తకం సైజు, రంగుల బొమ్మల సంఖ్యా కొంచెం కొంచెం తగ్గించి... పుస్తకాంశాల్లోని చర్విత చర్వణాలను పరిహరించివుంటే- మ్యాటర్ ను బోల్డ్ లో కాకుండా మామూలు ఫాంట్ లో ఇచ్చివుంటే... ఈ పుస్తకం ధర చాలా తగ్గేది.
ఈ చిత్రనిర్మాణంలో విజయచందర్ కు చేదోడు వాదోడుగా నిలిచిన ‘ప్రొడక్షన్ మేనేజర్’ సజ్జల చిట్టిబాబు గారి ప్రస్తావన ఈ పుస్తకం ఆద్యంతం కనిపిస్తుంది.
ఈ పుస్తకం విడుదలకు ముందే ఆయన చనిపోయారు.
స్వీయానుభవాలను ఆసక్తిని పెంచుతూ వర్ణించి చెప్పుకుంటూ పోవటంతో పాటు అక్కడక్కడా మెరుపుల్లాంటి వ్యాఖ్యానాలతో, ఉపశీర్షికల విభజనతో తీర్చిదిద్దటం వల్ల ఇది ఓ నవల మాదిరిగా తయారై పఠనీయత పెరిగింది.
సినిమా సంభాషణలకు సంబంధించిన ‘భాషా చర్చ’ ఆసక్తికరంగా ఉంటుంది.
సంభాషణలను క్రిస్టియన్ తెలుగులో రాస్తానని రచయిత మోదుకూరి జాన్సన్ పట్టుబట్టటం, వ్యావహారిక తెలుగులోనే రాయాలని విజయచందర్ వాదించటం... దానిమీద వాద ప్రతివాదాలు జరిగి విజయచందర్ ‘టార్గెట్ ఆడియన్స్ ’ఎవరనే ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తి, చివరకు తన అభిప్రాయం నెగ్గించుకోవటం...
ఇవన్నీ బాగున్నాయి.
పలనాటి సీమ (మాచర్ల- భైరన్నపాడు) ను ఆర్ట్ డైరెక్టర్ దిలీప్ సింగ్, కో డైరెక్టర్ ఫాదర్ క్రిష్టఫర్ కొయిలోలు పాలస్తీనాగా మార్చివేయటం; షూటింగ్ జరిగినన్ని రోజులూ భైరన్నపాడు గ్రామస్థులు పాలస్తీనా ప్రజల దుస్తులు వేసుకుని, ఇళ్ళల్లో, వీధుల్లో తమతమ పనిపాటులు చేసుకోవటం...
ఇవన్నీ ముచ్చటగా అనిపిస్తాయి.
నాస్తికులూ Vs దైవభక్తులూ
ఈ పుస్తకం రాసింది దైవంపై నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి తనకెదురైన ‘ఆధ్యాత్మిక అనుభవాల’నూ, ‘మహిమ’లనూ వివరించారు.
నాకు అలాంటివాటిపై నమ్మకం లేదు కాబట్టి వాటిని హేతువాద/ నాస్తిక కోణంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను.
ప్రకృతి సూత్రాల ప్రకారం ‘మహిమలు’ అనేవి అసంభవం. భౌతిక నియమాలకు అతీతమైన ‘శక్తులు’ ఉన్నాయని భావించటం శాస్త్రీయ దృక్పథం కాదు.
నిన్న మొన్నటి సత్యసాయిబాబా ‘మహిమాన్విత శక్తుల’ను నమ్మిన సూరి భగవంతం లాంటి శాస్త్రవేత్తలున్నారు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంటుంది?
అందుకే వందేళ్ళ కిందటి శిరిడీ సాయిబాబాకు ఆపాదించిన మహిమలను విశ్వసించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఇక రెండు వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన క్రీస్తుకు ‘తాకినంతనే స్వస్థతనొసగిన’ మహిమలున్నాయని నమ్మేవారు అసంఖ్యాకంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.
క్రీస్తు జీవితగాథ చిత్రనిర్మాణంలో మహిమలు తన అనుభవానికి వచ్చాయని విజయచందర్ నమ్మకంగా చెపుతున్నారు. -
* ‘ ప్రభు క్రీస్తు సాహచర్యమూ, సాన్నిహిత్యమూ, ప్రభువుతో ముఖాముఖి సంభాషించే మహద్భాగ్యం’ తనకు ఈ చిత్ర నిర్మాణ సందర్భంగా కలిగాయని ఆయన ఈ పుస్తకంలో చెపుతారు.
* ఓ గద్ద షూటింగ్ సమయానికి వచ్చి జనఘోషకు బెదరకుండా కెమెరాకు అందుబాటులో ఉండి, చిత్రీకరణకు సహకరించటం.
* వర్షం కురవబోతుంటే .. చిత్రీకరణకు అవరోధం కాకూడదని ప్రార్థన చేసిన తర్వాత అనూహ్యంగా వాన రాకడ ఆగిపోవటం.
* క్రీస్తుకు శిలువ వేసి మరణించిన సన్నివేశం సందర్భంగా పెనుగాలి వీచటం, శిలువ ముందుకు పడిపోబోతుంటే - దానికి వ్యతిరేక దిశలో గాలి వీచి శిలువను నిలబెట్టటం.
ఇలాంటివి కొన్ని సంఘటనలు పుస్తకంలో రాశారు విజయచందర్.
ఇవి నిజంగా జరిగాయని నిజాయతీగానే విశ్వసించి అలా రాశారని నమ్మవచ్చు.
మొదటిది వైయక్తిక మానసిక అనుభవం. దేవుడిపై గాఢమైన విశ్వాసం ఉన్నవారు ఇలా అనుభూతి చెందటం సాధారణమే.
కానీ మిగిలినవాటి సంగతి?
కెమెరా పరిధిలో గద్ద ఎగరటం,
కురవాల్సిన వర్షం రాకపోవటం,
పెను గాలి పరస్పర వ్యతిరేక దిశల్లో వీచటం...
ఇవన్నీ యాదృచ్ఛికాలని గ్రహించాలి.
ఈ చిత్ర నిర్మాణ బృందంలో ఎవరైనా హేతువాదులో, నాస్తికులో ఉండుంటే వారు ఇదే సంఘటనలకు ఇచ్చే అన్వయం నిశ్చయంగా వేరేగా ఉంటుంది.
కలవరపరిచే ఒక ముప్పు తొలగటం, అనుకోని అనుకూలత కలిసిరావటం.. నమ్మకమున్నవారికి దైవ మహిమలుగా తోచటం సహజమే!
చిక్కి శల్యం... పాత్రకి బలం
‘‘యేసుక్రీస్తు పాత్రను ధరిస్తున్న నాకు తన రూపురేఖలను ప్రసాదించడానికే క్రీస్తు ప్రభువు నన్నిలా కష్టాల కొలిమిలో పుటం వేసి ఉంటారనీ, నా శరీరం చిక్కి శల్యమయ్యేలా చేసివుంటారనీ’’ఆయన చెప్పుకొచ్చారు. Blessing in disguise అంటారే ... అలా!
ఏసు పాత్రకు శరీరం శుష్కించిపోవటం చాలా అవసరం. అది అప్రయత్నంగానే... సహజంగా సమకూరటం ఇక్కడ విశేషం.
ఆకారం సరిపోవటం ఒక్క అంశం మాత్రమే!
ఈ పాత్రకు ఎంపికైన దగ్గర్నుంచీ ఏసు వేష భాషలూ, నడకా, మాట తీరూ, హావభావాలూ, భావోద్వేగాలూ ఎలా ఉండేవో అర్థం చేసుకోవటం కోసం విజయచందర్ చేసిన కృషిని కూడా ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు.
క్రీస్తు పాత్రను అర్థం చేసుకోవటం కోసం ఆయన ఫాదర్ బాలగర్ గారిని అడిగిన మూడు ప్రశ్నలు చాలా కీలకమైనవి.
1. ఏసు ఎప్పుడైనా నవ్వారా?
2. ఏసు ఎప్పుడైనా కన్నీరు కార్చారా?
3. ఏసుకు కోపం వచ్చిందా?
2. ఏసు ఎప్పుడైనా కన్నీరు కార్చారా?
3. ఏసుకు కోపం వచ్చిందా?
సమాధానాలు తెలిస్తే పాత్ర స్థూల స్వరూపం అవగతం కాగల సమగ్రమైన ప్రశ్నలివి! ఇలాంటి పాత్రలు ధరించాలంటే ఏ నటుడైనా పరిశీలించి, జవాబుల కోసం అన్వేషించాల్సిన ప్రశ్నలవి!
అద్దంలో రాక్షసుడు
తొలిసారిగా క్రీస్తు మేకప్ తనకు వేస్తున్నపుడు సిగరెట్ కాలుస్తూ అద్దంలో చూసుకుంటే క్రీస్తులాగా కాకుండా రాక్షసుడి రూపం కనపడటం.. దాంతో సిగరెట్ పారేసి అంతర్మధనంతో విలపించిన, క్రీస్తును ప్రార్థించిన ఘట్టం ఆకట్టుకుంటుంది.
‘‘అద్దంలో నా ఆకారాన్ని చూసుకుని నేనే సిగ్గుపడ్డాను తండ్రీ. ఆ రూపంలో కరుణ లేదు, ఆ రూపంలో త్యాగం కనబడటం లేదు, ఆ రూపంలో ప్రేమ లేదు; నా రూపం నాకే వికృతంగా కనిపిస్తున్నది, నన్ను నిరాశతో కుంగదీస్తున్నది’ అంటూ ప్రార్థించాక అద్దంలో తనకే నమ్మశక్యం కాని మార్పుతో క్రీస్తు రూపం గోచరించిందని ఆయన అంటారు.
పాత్ర పోషణలో నిజమైన కళాకారుడి తపనకు ఇక్కడ అద్దం పట్టారు విజయచందర్.
ముఖకవళికల్లో ఇంత సమూలమైన మార్పు రావటానికి ‘హేతువు’ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను.
సిగరెట్ తాగటం అనేది పొగతాగేవాళ్ళకు అమిత హాయిని చేకూర్చే అలవాటు. ఆ సమయాల్లో వారిమొహాల్లో కొంత నిర్లక్ష్యం, ధీమా ... ఇవన్నీ కనపడుతుంటాయి. పఫ్ తాగటంలో కొంత కసి కూడా ద్యోతకమవుతుంది. అలాంటపుడు ఆ మొహంలో ప్రతినాయక ఛాయలు కనపడటం సహజమే.
పాత్రపై మమకారం ఉన్న విజయచందర్ కు.. అలాంటి పాత్ర ధారణ చేస్తున్నపుడు సిగరెట్ తాగటం తగదనే అపరాధ భావం ఏమూలో ఉండివుంటుంది.
ఇవన్నీ కలిసి అద్దంలో తన మొహం రాక్షసంగా కనపడివుండాలి.
ప్రార్థన ద్వారా చేసిన పొరపాటుకు కన్ఫెస్ అవటం వల్ల- ఆ పశ్చాత్తాపం వల్ల- మనసు తేలికపడివుంటుంది.
తేటపడిన మొహంలో క్రీస్తు పాత్రకు అవసరమైన లాలిత్యం, కారుణ్యం గోచరించటం సహజమే కదా?
పేకాట డబ్బుతో సగం సినిమా నిర్మాణం
సినిమా నిర్మాణానికి పడిన కష్టాలూ, పేకాట ఆడిన డబ్బుతో షూటింగ్ చేయటం.. ఇవన్నీ చాలాకాలం క్రితమే ఓ ఇంటర్వ్యూ లో విజయచందర్ చెప్పటం తెలుసు. అందుకే ఈ పుస్తకం వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూశాను. ( హైదరాబాద్ పుస్తకోత్సవంలో ఈ పుస్తక ధర చూసి, హతాశుణ్ణవటం వేరే సంగతి:)
మద్రాస్ ఆంధ్రాక్లబ్ లో నెలరోజుల పాటు విజయచందర్ జూదంలో గెలుస్తూనే ఉండటం, గెలిచిన ప్రతి రూపాయీ చిత్ర నిర్మాణానికే ఖర్చు పెట్టటం చెప్పుకోదగ్గ విషయాలు. ఏడెనిమిది రీళ్ళ సినిమా అంటే దాదాపు సగం సినిమాను పేకాటలో గెల్చుకున్న సొమ్ముతో తీయటం అరుదైన సంగతి.
ఈ విశేష లబ్ధి కాకతాళీయం కాదు!
ఎందుకంటే... ఆ క్రీడలో విజయచందర్ కు ‘నైపుణ్యం ’ ఉంది.
అయినప్పటికీ ప్రతిసారీ గెలవటం నిశ్చయంగా అసాధారణమే. కానీ అసంభవం మాత్రం కాదు. మా ఊళ్ళో ఒకాయన కేవలం పేకాట వల్లనే బాగా డబ్బు సంపాదించి , రాజకీయాల్లోకి వచ్చి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అయితే ఈ జూదం వల్ల ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళే ఎక్కువమంది!
దర్శకుడి ఫొటో ఏదీ?
ఇంత పెద్ద పుస్తకంలో కొన్ని లోటుపాట్లు కనపడుతున్నాయి. చిత్రానికి పనిచేసిన సాంకేతిక సిబ్బంది ఫొటోలన్నీ ఇచ్చినా...
* డైరెక్టర్ భీమ్ సింగ్ గారి ఫొటో ఎక్కడా ఇవ్వలేదు. ఆయనను ఎలా ఎంపిక చేసుకున్నారన్న వివరాలేమీ లేవు.
* సంగీత దర్శకులు జోసెఫ్ కృష్ణ, బి.గోపాలం; పాటలు రాసిన శ్రీశ్రీ, సినారె తదితరుల ఫొటోలు లేవు.
* ‘రారాజు క్రీస్తు’ నిర్మాణ సంస్థ పేరు, దర్శకుడి పేరూ ప్రస్తావించలేదు.
* ఈశ్వర్ గారి పోస్టర్ డిజైనింగ్ గురించి ఎంతో రాసి కూడా, ఒక్క పోస్టర్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ సినిమా లోగో ఎలా ఉంటుందో చూపలేదు.
పాటల పుస్తకం కవర్ పేజీ ఇక్కడ నేనిస్తున్నాను. ‘లోగో’ చూడండి! దీన్ని డిజైన్ చేసింది ఈశ్వర్ కాదు, బాచి.
ఈ చిత్రాన్ని మత ప్రచారం కోసం తీయలేదని విజయచందర్ స్పష్టం చేస్తారు. ‘యేసుక్రీస్తు జీవితాన్ని యథాతథంగా తెరకెక్కించడమే నా ఉద్దేశం’ అంటారు.
‘క్రీస్తు వేషం వేసేవాడు నామరూపాలు లేకుండా పోతాడు, అవమానాల పాలవుతాడు, మరణించినా మరణించవచ్చు’ అనే మూఢనమ్మకానికి ఎదురీది, దాన్ని అబద్ధం చేశారు విజయచందర్!
ఈ భక్తి సినిమాలో నాస్తిక భావాలతో సాగే శ్రీశ్రీ పాట ఒకటుంది.
మోదుకూరి జాన్సన్ రాసిన ‘కదిలిందీ కరుణ రథం’ పాట- సంగీత సాహిత్యాల అద్భుత సమ్మేళనం- కూడా ఉంది.
టపా విస్తరణ భీతితో ... వీటి గురించి ఏమీ రాయకుండా ఇంతటితో ముగించేస్తున్నా:)
----------------------------------------------------
ఈ టపా గురించి రామ్ ప్రసాద్ గారి స్పందన-
28 కామెంట్లు:
1250 రూపాయలా! :O
నేను ఈ సినిమా చాలా సార్లు చూసాను; నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. రాముడు, క్రిష్ణుడు, ధుర్యొధనుడు అంటే యన్.టి.ఆర్. ఎలా గుర్తుకొస్తారో, జీసస్, షిర్డి సాయిబాబా అంటే బాలచందర్ అలాగే గుర్తుకొస్తారు. ఆయన మెత్తని voice ఆయనకొక గొప్ప asset.
వేణుగారు ... nice review. Thank you.
@ S: ఈ పుస్తకాన్ని కొందరు నాకు తెలిసిన క్రైస్తవమిత్రులు రూ. 900 రూపాయిలకు రాయితీ ధరకు కొన్నారు. ఈ పుస్తకం విశాలాంధ్ర వాళ్ళ దగ్గర దొరుకుతోంది.
@ సుజాత : ఈ సినిమా మీరింతవరకూ చూడనేలేదా? ఆశ్చర్యంగా ఉంది. మా ఊళ్లో ఈ సినిమా ఆడేటప్పుడు థియేటర్ స్త్రీల శోకంతో కన్నీటి వరదైపోవటం నాకు బాగా గుర్తు.మీ అభినందనకు థాంక్యూ!
శ్రీనివాస్ గారూ! మీరు చాలాసార్లు చూశారా? నేను ఒక్కసారే చూశాను.మీరన్నట్టు విజయచందర్ వాయిస్ మార్దవంగా, నెమ్మదిగా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. మీ స్పందనకు థాంక్యూ. మీ వ్యాఖ్యలో విజయ బదులు బాల వచ్చింది:)
వేణుగారూ, మీ రివ్యూ పుస్తకం మీద ఆసక్తి కలిగించేలా ఉంది. ధర మాత్రం కళ్ళు తిరిగేలా ఉంది.
Murali గారూ, థాంక్యూ. ఇప్పుడొస్తున్న పుస్తకాల ధరలు ఇలాగే అందనంత ఎత్తున ఉంటున్నాయ్.
ప్రియమిత్రులు శ్రీ వేణుగారికి,
మీ గ్రంథసమీక్ష బహువిషయపర్యాలోకితంగా చాలా ఆసక్తిదాయకంగా ఉన్నది. సహృదయవిమర్శ కావటం వల్ల ఆకట్టుకొన్నది.
గ్రంథరచయిత అనుభవజ్ఞులు కావటం మూలాన నటుడు శ్రీ విజయచందర్ గారి స్వీయ-దైవీకరణ యత్నాన్ని సమర్థంగా నియంత్రించి, చిత్రనిర్మాణం ప్రధానేతివృత్తంగా నడపగలిగారు. అది వారి కథనవిజయం. మీరూ నిర్మాణకర్త దైవీకరణకు పాల్పడకుండా స్తిమితంగా వ్రాయగలిగారు. ఇది మీ విమర్శవిజయం.
శ్రీ భీమ్ సింగు గారి అసిస్టెంటు గిడుతూరి సూర్యం గారి పరిచయం కారణం గాను, ఆ రోజుల్లో సినిమా రంగం అంటే ఉండిన ఆసక్తి మూలాన నేను కొన్ని రోజుల షూటింగును చూడగలిగాను. మీ సమీక్ష వల్ల నాకు అప్పుడు తెలియని చాలా కొత్త విషయాలు తెలిశాయి.
"హేతువాదం" (ఆధ్యాత్మికతకు, గతితార్కిక భౌతికవాదానికి నడిమి అనువర్తితసిద్ధాంతం) / "నాస్తికత" (సిద్ధాంతీకరింపబడిన ఒకానొక సాధ్యనిర్దేశం) అన్నవి ఒకటి కాకపోయినా, ఈ చలనచిత్రనేపథ్యకథనంతో అన్వయించిన మీ విశ్వాసవివరణను ఎంతో కుతూహలంగా చదివాను.
మీకివే అభినందనలు!
గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ లో ఈ సినిమా చూసినట్లు గుర్తు. నిజమే, ఈ సినిమా చూసి కంటతడి లేకుండా బయటకు వచ్చినవాళ్ళెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా లీలామహల్ ఎదురుసందులో ఉండే మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన మా ఫ్రాంక్లీన్ మాస్టారు గారిని గుర్తుకు తెచ్చారు. నేను అయిదో తరగతిదాకా అక్కడే చదివాను. అప్పటి నుంచి డిగ్రీ అయ్యేదాకా, ప్రతి క్రిస్మస్ పండుగకి ఆయన ఇంటికి వెళ్ళేవాళ్లం. ప్రతి క్రిస్మస్ ముందు రోజు ఆయన మా ఇంటికి కేకు పంపేవారు. మీరు బ్రాహ్మణులు కదా, గుడ్డు లేకుండా ఫస్టు మీ కేకే చేయించాము, నిస్సందేహంగా తినొచ్చు అని చెప్పేవారు! ఉద్యోగ నిమిత్తం గుంటూరు వదిలివెళ్ళినా, దాదాపు ప్రతి సంవత్సరం ఆయన పంపే కేకు మాకు అందేది! ఇప్పటికీ గుర్తే, క్రీస్తు గురించి ఏమైనా కథల పుస్తకాలు ఇవ్వండి అంటే, ఇస్తానని చెప్పి కూడా మరెందుకో ఇవ్వలేదు ఆయన. పరమతసహనం గురించి చెప్పాల్సినప్పుడల్లా, ఈ కరుణామయుడు సినిమాకు పాడిన బాలసుబ్రహ్మణ్యంగారిని, స్వామి అయ్యప్ప సినిమాలో పాటలు పాడిన జేసుదాసుగారిని ప్రస్తావించేవారు. నేను ఎప్పటికీ మర్చిపోలేనీ మా మంచి మాస్టారుగారిని గుర్తుకు తెచ్చింది మీ వ్యాసం - అసలు సందర్భం కాకపోయినా. థ్యాంక్స్. బై ద వే, చాలా మంచి సమీక్ష వ్రాసారండి.
మురళీధరరావు గారూ! గ్రంథకర్త అంటే ఈ పుస్తకానికి రచనా సహకారం అందించిన గుంటూరు ఏసుపాదం గారేనా? ఆయన ఇతర రచనల సంగతి మీకు తెలుసుంటే చెప్పగలరా?
‘కరుణామయుడు’ షూటింగ్ కొంత చూశారన్నమాట. గిడుతూరి సూర్యం గారు భీమ్ సింగ్ గారి అసిస్టెంటని మీరు చెప్పాకే తెలిసింది. అయితే మరో అసిస్టెంట్ తిరుమలై గారు కూడా మీకు తెలిసుండాలి. ఈ టపాపై మీ అభిప్రాయాలకు కృతజ్ఞతలు !
కొండముది సాయికిరణ్ గారూ ! మీ పాత జ్ఞాపకాల స్మరణకు ఈ టపా తోడ్పడిందన్నమాట. మీ అభినందనకు థాంక్యూ.
వేణు గారు బాగా రాశారు .. సమగ్రంగా ఉంది సమీక్ష
ఈ పుస్తకం ధరయినా దిగిరావాలి, లేదా ఈ పుస్తకమయినా పాత పుస్తకాల కొట్టుకో లేక ఫుట్‌పాత్ కో దిగి రావాలి, అప్పుడే కొనగలనేమో!
buddha murali గారూ, ఈ పుస్తక సమీక్షపై మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.
రహ్మాన్ గారూ, ఈ పుస్తకాన్ని పాపులర్ ఎడిషన్ గా మారిస్తే (సైజూ, రంగుల పేజీలూ తగ్గించేసి)- ధర తప్పకుండా ధరకు దిగొస్తుంది. పాత పుస్తకాల కొట్లకు రావటానికైతే చాలా కాలమే పడుతుంది మరి !
ఎం.వి.ఎస్. రామ్ ప్రసాద్ గారు పంపిన వ్యాఖ్య-
‘‘మీ శీర్షికే గమ్మత్తుగా ఉంది!
మనకింతవరకూ ‘మయుడు’ వేసిన సెట్టింగ్ లే famous- కరుణా‘మయుడు’ కూడానా :)(చూ: మయ సభ)..’’
మిగతా.. టపా చివర చూడొచ్చు !
రామ్ గారు పంపింది ‘దస్తూరీ’ తిలకం.jpg. ఇది వ్యాఖ్యల్లో ఒదగదు కనక నేరుగా టపాలోనే కలిపేశాను.
రామ్ గారూ! మయుడికీ, కరుణామయుడికీ పోలిక తెచ్చిన మీ చతుర వ్యాఖ్య అందంగా ఎంతో బాగుంది. నిజానికి ఈ పన్ నేను ఊహించి పెట్టింది కాదు,నిజంగా!
టపాపై మీ అభినందనకు థాంక్యూ.
మీరన్న బ్లాగు ఫ్రీక్వెన్సీ గురించి... ‘నెల తప్పకుండా’ఒక పోస్టు రాయటమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి!
రాముడి మార్కు కామెంట్..స్వదస్తూరీ తో :-))
So nice
what a beautiful review వేణు గారు. విజయచందర్ జన్మ ధన్యం చేసుకున్నాడు. ఎంత హుందాగా నటించాడు! శిరిడీ సాయిలాకూడా అంతే గొప్పగా చేశాడు. ఈ చిత్రాలు చూచి ఎంతోమంది నాస్తికులు believers అయ్యారు మరి :O
రామప్రసాద్ గారి వ్యాఖ్య, దస్తూరి చాలా బాగున్నాయి.
'పలనాటి సీమను పాలస్తీనాగా మార్చిన ‘కరుణామయుడు’- it is too good.
.
@ సుజాత: ఔను, రామ్ గారి టిపికల్ కామెంట్.
@ తెలుగు అభిమాని: థాంక్యూ. >> ఈ చిత్రాలు చూచి ఎంతోమంది నాస్తికులు believers అయ్యారు మరి :O>> అదేమో కానీ, ఇలాంటి సినిమాలు మంచి భక్తులను మరింత మంచి భక్తులుగా మార్చే అవకాశం ‘కొంచెం’ ఉంది! (సి.రాఘవాచారి గారి సరదా వ్యాఖ్యకు అనుసరణలెండి).
రామ్ గారూ! మీ దస్తూరికి బాగా ప్రశంసలు వస్తున్నాయండీ...
చాలా ఆసక్తికరమైన విశేషాలను తెలిపినందుకు ధన్యవాదాలు. ఇంతకు ముందు "బొట్టు కాటుక" లోగో గురించి కూడా చాలా వివరణాత్మకంగా రాసారు.ఆ టపా కూడా ఆలస్యంగా చూశాను.
రామ్ గారి దస్తూరీలా వారి వ్యాఖ్య కూడా బాగుంది :)
తృష్ణ గారూ! నేను రాసిన టపాలపై మీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్యూ.
రామ్ గారి వ్యాఖ్యలను ఆయన చేతిరాతతో చూడటం మరీ బాగుంటుంది.:)
మీ సమీక్ష చాలా బావుంది వేణూ గారు
Narayanaswamy గారూ, మీ ప్రశంస సంతోషాన్నిస్తోందండీ. థాంక్యూ!
ధన్యవాదాలు వేణు గారు నా వ్యాఖ్య కి మీ పోస్ట్ లో అర్ధరాజ్యం ఇచ్చి సత్కరించినందుకు :)
రామ్ గారూ, అర్థరాజ్యమనుకోండీ, అంగరాజ్యమనుకోండీ. అది కేవలం మీ అభిమానం. మీ దస్తూరీ పరిమళం ఈ టపాకు కళ తెచ్చింది!
ఈ సినిమాకు సికిందరాబాద్ లోని అమృతవాణి సంస్థ వారు ఆర్ధిక సహాయం అందించారు. అందుకు ప్రతిఫలంగా విజయచందర్ గారు 16 ఎమ్ ఎమ్ ఫిలిం హక్కులను వారికిచ్చారు. ఈ సంస్థ వారే నాకు శిక్షణ ఇచ్చి రచయితగా కవిగా మారడానికి సహాయపడ్డారు. అందువల్ల నాకీ విషయాలు తెలుసు.
చాలా బాగా వ్రాశారు వేణు గారు.
కరుణామయుడులో 'కదిలింది కరుణ రధం' పాట అప్పట్లో పెద్ద హిట్. దీనిని శ్రీ శ్రీ వ్రాశారని ఇప్పుడే తెలిసింది.
ఈ సినిమా ఎందుకో నాకు బాగా గుర్తుండేది. విజయచందర్ తెలిసింది ఈ సినిమా ద్వారానే గుర్తుండేది మాత్రం దీనితో పాటు ఆంధ్రకేసరి సినిమా కూడా. ఈ రెండూ ఆయన బాగా చేశారు. రెండు సినిమాలలోనూ ఆయన వాయిస్ బాగుంటుంది. బయటకూడా విజయచందర్ కంఠం బాగుంటుంది. అది కూడా ఈ రెండు సినిమాలకు ఎసెట్ అయిందనుకుంటాను.కరుణామయుడు గురించి చెప్పేటప్పుడు విజయచందర్ వాయిస్ ప్రత్యేకత తప్పక చెప్పాలనేది నా అభిప్రాయం. తరువాత కృష్ణ లాంటి వాళ్లూ విఫల ప్రయోగాలు చేశారీ పాత్రపై.
విజయచందర్ చెప్పింది సత్యం : " ఇది మత ప్రచారం కోసం తీసింది కాదు. క్రీస్తు ను తెలుసుకోవడానికి తీసిందే " అప్పట్లో క్రిష్టియన్ మతమంటే చాలా ఘోరంగా కేవలం అది దళితులకు మాత్రమే అని ఎద్దేవా చేయడం నాకు తెలుసు. ఇప్పుడూ అక్కడక్కడా అది వినిపిస్తూనే ఉంటుంది. ఏ మతమూ గొప్పదీ కాదు - చెడ్డదీ కాదు. ఇప్పుడైతే క్రిష్టియన్ అని చెప్పుకోవడానికి పెద్దలు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నవారూ చాలామంది ఉన్నారు. అది వేరు విషయం.
ఆ సమయంలో మీరు చివరిలో ఉదహరించిన మూఢనమ్మకాల నేపథ్యంలో క్రీస్తు పాత్రని ధరించడం అభినందనీయం.
మీ సమీక్ష బాగుంది. ముఖ్యంగా విజయచందర్ అనుభూతులను లేదా ఆయన చెప్పిన అద్భుతాలను పాజిటివ్‌గా హేతుబద్ధతని జోడించి వివరించిన ప్రయత్నం చాలా బాగుంది. అందులో మీ నిజాయితీ నచ్చింది. దర్శకుని, సంగీత దర్శకుని ఇతర సాంకేతిక వివరాలు ఈ బుక్ లో లేని లోటుపై మీ విమర్శ సరయినదే. ఓ విమర్శకునికి తప్పనిసరిగా ఉండాల్సిన సమతూక లక్షణం పాటించి చాలా చక్కగా వ్రాశారు. అభినందనలు.
Kondala Rao గారూ! మీ స్పందనకూ, ప్రశంసకూ కృతజ్ఞతలు.
కరుణామయుడు సినిమా కోసం ‘కదిలింది కరుణ రథం..’ పాట రాసింది శ్రీశ్రీ కాదు. మోదుకూరి జాన్సన్. ఇందులో శ్రీశ్రీ రాసిన పాట- ‘దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు’.
మీ టపా బాగుంది వేణు గారూ.
నాస్తికులు ఆస్తికభావ సమ్మిశ్రితమైన కళారూపాలను అంటనే అంటరని ఒక వాదం ప్రచారంలో ఉంది. దానికి విరుద్ధంగా - అవతలివారి భావస్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ, మీ వ్యక్తిగత నమ్మకాలను కూడా వెల్లడిస్తూ- సమతూకంలో సమీక్షించారు. మీరు రాసే విధానంలో ఒక ప్రశాంతత గోచరించింది.
'కరుణామయుడు' చాలా చిన్నప్పుడు చూసాను, అంత బాగా గుర్తులేదు. మీరు చూసిన సొగసులు, మీ పాఠకులకు కూడా చక్కగా చూపించారు. సినీమా చూసి, వీలయితే పుస్తకం కూడా చదవాలి అనిపించింది.
కరుణామయుడు నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా అయితే ఈ సినిమా వెనక ఇన్ని సంగతులున్నాయని ఇప్పుడే తెలిసింది పల్నాటిని పాలస్తీనాగా మార్చడం అక్కడ ప్రజలంతా ఆ సాంప్రదాయ దుస్తులు ధరించడం ఆసక్తిని కలగచేసింది ఏ విషయమైనా విశ్లేషణలో మీకు మీరే సాటి
కామెంట్‌ను పోస్ట్ చేయండి