సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, ఆగస్టు 2015, సోమవారం

తొలి సినీ వీణా గానం!





ప్పటివరకూ సినిమా  కథ ఎలా సాగినా  కథానాయిక వీణను ఒడిలో పెట్టుకుని ఇంకా  శ్రుతి చేయకముందే -  ఒక మధుర స్వరఝరి కోసం  అప్రయత్నంగానే సిద్ధమయ్యేవారు ప్రేక్షకులు. సంగీతాభిమానులైతే మరింత ఆసక్తిగా, ఉత్సాహంగా!

కథానాయిక వేళ్ళ కదలికలతో వీణ జీవం పోసుకుంటూనే ఆమె గొంతులోంచి  రాగం పాటగా ఉప్పొంగి జత కలిసేది.  

ఆ సందర్భం -

విషాదమో, విరహమో, విన్నపమో కావొచ్చు.  

ఆనందార్ణవ తరంగితమూ,
ఆహ్లాద సంభరితమూ కావొచ్చు. 


అది ఏదైనా సరే...
మైమరిపించే పాట వెలువడేది.
సన్నివేశం పండేది; రసావిష్కరణ జరిగేది! 

***

ప్పుడంటే వీణ పాటలు తెలుగు  సినిమాల్లో దాదాపు కనుమరుగయ్యాయి.

కానీ  గతంలో  కొన్ని దశాబ్దాల పాటు  వీణ పాటల ట్రెండ్ ఎన్నో సినిమాల్లో కొనసాగింది.

శ్రావ్యమైన- మధురమైన - మరపురాని వీణ పాటలు ఆ సినిమాల పరిధినీ, సన్నివేశాల సందర్భాలనూ దాటి  ప్రేక్షకుల మదిలో  నిలిచిపోయాయి.

ఏమని పాడెదనో  ఈ వేళ...
55 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాల్లో  తొలి వీణ పాట  పి. సుశీల గాత్రంలో పుట్టింది.  అభ్యుదయ గీతాలకు పేరుపొందిన  శ్రీశ్రీ  ఈ పాటను రాయడం విశేషం.

లలిత సంగీత శాఖకు ఆద్యుడైన సాలూరి రాజేశ్వరరావే  స్వరాలు సమకూర్చి వీణ పాటకు నాంది పలికారు. 

ఆ సినిమా ‘భార్యాభర్తలు’(1961). 



ఈ సినిమా విడుదలైనపుడు ప్రచురించిన పాటల పుస్తకంలోని  పాట ఇది...


ఇన్నేళ్ళయినా వన్నె తరగని పాట ఇది.  చిత్ర కథాపరంగా... విషాద గంభీరంగా సాగుతుందీ పాట.

ఈ  పాట యూ ట్యూబ్ లో  ఇక్కడ -




‘నిదురించిన వే-ళా’ అనే పదాల దగ్గర స్వర విన్యాసం చూడండి.

చరణాల్లో కూడా ఇలాంటి  చాతుర్యమే కనపడుతుంది. 

మొదటి చరణం వరకూ చూస్తే ..
కలత నిదుర‘లో ’
కాంచిన కల‘లే’
గాలి మేడ‘లై’ ...

ఆ చివరి అక్షరాల విరుపుల మెరుపులు గమనించండి.  అది రాజేశ్వరరావు గారి ముద్ర.

1977లో విడుదలైన ‘కురుక్షేత్రము’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ’ పాటలోనూ,

1978లో వచ్చిన  ‘ప్రేమ-పగ’లోని ‘కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ’ పాటలోనూ...

ఇలాంటి స్వర విన్యాసాన్నే మరింత  విస్తారంగా చేశారు ఎస్ రాజేశ్వరరావు.

సెకండ్ వాయిస్
ఈ పాటను రికార్డు చేసినపుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల  తన అనుభవాన్ని  భూమిక పత్రికలో ఏప్రిల్ 23, 2009న ఇలా  పంచుకున్నారు. 

‘‘1960-61 సంవత్సరాలలో నేను మద్రాసులో వున్న రోజులు. ఆ రోజు భలే ఉషారుగా వుంది. ఎందుకంటే ప్రసాద్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘భార్యాభర్తలు’ సినిమా పాట రికార్డింగ్‌. నేను సుశీల గారితో తయారై పోయాను. మొదట ఆమె భర్త ఆమెతో కూడా వెళ్తారనుకున్నారు. కానీ ఆయనకేదో అర్జంట్‌ పనివల్ల నేనే వెళ్ళాలని తెలిసింది.

సాలూరి రాజేశ్వర రావు సంగీతం చేస్తున్న ఆ సినిమాలో ఈ పాట రిహార్సల్స్‌కి నేను వెళ్ళాను. అదీ నా ఆనందం.

ఏ.వి.ఎమ్‌ స్టూడియోలో ఆర్టిస్టు రూ౦ వేరేగా వుంది. అంటే పాడేవాళ్ళ రూ౦ సెపరేట్‌ – హాల్లో మొత్తం ఆర్కెస్ట్రా సెట్‌ చేశారు. ఆమె హెడ్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాడతారన్నమాట -

‘ఏమని పాడెదనో ఈ వేళ’ పాటకి వీణ వాయించిన వారు ప్రఖ్యాత వైణికులు చిట్టిబాబు. ఆయన్ని కూడా ఆర్టిస్టు రూ౦లో వుండి వాయించేట్టు ఏర్పాటు చేశారు, ఆ పాటకి మొత్తం పాటంతా చిట్టిబాబు గారు వీణ మీద ఫాలో అవుతారు. అది ఎంత అందంగా, ఎంత సున్నితంగా, ఎంత లలితంగా వుంటుందో ఆస్వాదించి తెలుసుకోవాల్సిందే-

నేను అదే రూ౦లో సోఫాలో కూర్చున్నాను. దూరంగా నాకు ఆర్కెస్ట్రా ధ్వని వినిపిస్తూనే వుంది. ఆమె పాడటం,  వీణ ఆమె పాటను అనుసరించటం వింటుంటే నాకెంతో సంతోషం.

రెండు మూడు రిహార్సల్స్‌ అయ్యాయి.

 అప్పుడప్పుడు అసిస్టెంట్‌ వచ్చి ఏవో సూచనలిచ్చి, చిన్న చిన్న సర్దుబాట్లు చేసి వెళ్తున్నారు- రెడీ, టేక్‌ అన్నారు.
ఫస్టు టేక్‌ అయ్యింది. బాగుంది బాగుంది అన్నారంతా. కానీ రెండో టేక్‌ కోసం తయరవుతుంటే నేను నాలో నేను అనుకున్నాను ‘చాలా బాగుంది కదా’- అని.

ఇంతలో అసిస్టెంట్‌ గారొచ్చి నెమ్మదిగా సుశీల గారితో ఏదో చెప్పి వెళ్ళారు.

ఆమె నా దగ్గర కొచ్చి నెమ్మదిగా ‘‘నువ్వు పాడుతున్నావా – పాడకూడదు. నిశ్శబ్దంగా వుండు – సెకండ్‌ వాయిస్‌ వినిపిస్తోందన్నారంట’ అంటూ చెప్పారు.

నా గుండెలు జారిపోయాయి.

రికార్డింగ్‌ అంటే పిన్ను పడిన శబ్దమైనా లాగేస్తుందని, నా కప్పుడప్పుడే అర్థమవుతోంది. సినిమా రికార్డింగులు చూస్తున్నప్పుడే నాకు కొన్ని సున్నితమైన విషయాలు తెలియవస్తూ వున్నాయి. నేనెలా పాడాను? నా గొంతులోంచి శబ్దం ఎలా వచ్చింది? నాకు తెలుసుకదా అది రికార్డింగని’ అనుకుంటూ బాధపడిపోయాను.

మొత్తానికి కుదురుగా, నిశ్శబ్దంగా, నోరెత్తకుండా కూర్చున్నాను.

పాట రికార్డింగ్‌ పూర్తయింది. అందరూ  ఆనందంగా సుశీల గార్ని అభినందిస్తుంటే అదేదో నన్నేఅన్నంత ఆనందపడి పోయాను.

”హీరోయిన్‌ ఈ పాట వీణ వాయిస్తూ పాడతారు. వీణ మెట్లమీద చక్కగా వేళ్ళు కదలాలి” అన్నారెవరో. ‘‘పోనీ చిట్టిబాబు గారి చేతిని క్లోజప్‌లో పెడితే సరి”.

”అబ్బే అది కుదరదు. ఆయనది అచ్చమైన మగవానిచెయ్యి” అన్నారు మ్యూజిక్‌ డైరక్టర్‌ గారు.

ఈ ‘ఏమని పాడెదనో’ పాట తర్వాత ఎంత పాపులర్‌ అయిందో, అది ఈనాడు ఒక క్లాసిక్‌గా ఏవిధంగా నిలిచిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.

మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఈ పాట సంగీతపరంగా కూడా చాలా గొప్ప పాట. పాడటంలో సుశీల చూపిన ప్రతిభ, వీణలో చిట్టిబాబు పలికించిన లాలిత్యం ఈ పాటను ఉన్నతంగా పెట్టాయి.

రాజేశ్వరరావు గారు కంపోజ్‌ చేసి, సుశీల పాడిన వీణ పాటల్లో ఇదొక గొప్ప పాట.

వీటికి తోడుగా, ఆ పాటను చిత్రీకరించిన సన్నివేశం హీరోయిన్‌ నటన (కృష్ణకుమారి), సినిమా అత్యంత ప్రజాదరణ పొందడం, కళాత్మకంగా వుంటూనే కమర్షియల్‌గా విజయం సాధించటం ఆ పాటని అందరి మనస్సులోన శాశ్వతంగా వుండేట్టు చేశాయి.

సినిమా పాటకి సంగీతం, సాహిత్యం, సన్నివేశం, కుదరటం ఒక ముఖ్యమైన అవసరం. దానికి తోడు సాంకేతికంగా బాగా రికార్డు చేయడం కూడా మరీ అవసరం. అప్పుడే అది కలకాలం నిలబడుతుంది.’’

బాగుంది కదూ జానకీబాల గారి జ్ఞాపకం! 

ఇంతకీ  ఆ పాటలో చిత్రీకరించిన-  వీణ మీటిన  వేళ్ళు  ఎవరివి?

ఈ సంగతిని  ఆ పాటకు అభినయించిన కథానాయిక మాటల్లోనే  తెలుసుకుందామా? .  

‘‘ ఏమని పాడెదనో... పాటలో వీణ మీద నా చేతి వేళ్ళు కదలాడిన విధానం చాలా బాగుందని ఎంతోమంది మెచ్చుకున్నారు. చిన్నప్పుడు నేను కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను. అది ఆ పాట చిత్రీకరణ సందర్భంగా బాగా ఉపయోగపడింది. ’’  

 -  కృష్ణకుమారి (నవ్య వారపత్రిక  మార్చి 28, 2007 సంచిక నుంచి).

ఈ తొలి వీణ పాటను ఇన్ని సంవత్సరాలుగా వేలమంది గాయకులు ఇష్టంగా పాడుతూ... వినేవారిని ఆనందపరుస్తూ వచ్చారు.

***

వీణ పాటల ప్రభావం సాంఘికాల నుంచి  పౌరాణిక చిత్రాలకు వ్యాపించింది. 

1963లో వచ్చిన ‘నర్తనశాల’లో కూడా వీణ పాట ఉంది.  ‘ సఖియా వివరించవే  వగలెరిగిన చెలునికి నా కథా ’(సముద్రాల, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం) . కథలో కీచక పాత్రధారి సైరంధ్రిని చూసే కీలక ఘట్టంలో ఈ పాటను ఉపయోగించుకున్నారు దర్శకుడు.

వీణ పాటంటే  సుశీల గారే అనేంతంగా ఆమె ఎక్కువ  వీణపాటలను ఆలపించారు. అలాగే ఎస్. రాజేశ్వరరావు మధురమైన  వీణ పాటలెన్నిటికో స్వరాలు సమకూర్చారు.

మరి వీణపాటలు రాయటంలో స్పెషలిస్టు ఎవరు? 

ఆత్రేయ ఎక్కువగానే  రాశారు గానీ,
ప్రధానంగా వీణ పాటలంటే గుర్తుకు వచ్చే కవి మాత్రం  దాశరథి.

దాశరథి  రాసిన మధురమైన వీణ పాటలు ఓసారి గుర్తు చేసుకుంటే...

* నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఈ రేయి  (‘పూల రంగడు’ 1967  సంగీతం- ఎస్ రాజేశ్వరరావు)

* మదిలో వీణలు మ్రోగే  ఆశలెన్నో చెలరేగే  ( ‘ఆత్మీయులు’ 1969  సంగీతం- ఎస్. రాజేశ్వరరావు) ,

* వేణుగాన లోలుని గన వేయి కనులు చాలవులే  (‘రెండు కుటుంబాల కథ’ 1970  సంగీతం- ఎస్. రాజేశ్వరరావు)

* పాడెద నీ నామమే గోపాలా ( ‘అమాయకురాలు’ 1971  సంగీతం-  ఎస్. రాజేశ్వరరావు)

* మ్రోగింది వీణా పదేపదే హృదయాలలోన (‘జమీందారు గారి అమ్మాయి’ 1975  సంగీతం- జీకే వెంకటేశ్  ) 

*  కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణ  (‘ప్రేమ-పగ’ 1978 సంగీతం- ఎస్. రాజేశ్వరరావు) 


తరతరాల శ్రోతల హృదయ వీణలను మీటిన పాటలే కదా ఇవన్నీ !


6 కామెంట్‌లు:

GKK చెప్పారు...

వేణు గారు. వీణ వేణువైన సరిగమ కదలాడింది. జానకీబాల గారి 'ఏమని పాడెదనో ఈ వేళ ' పాట వెనుక కథ ఆసక్తికరంగా ఉంది. మహా వైణికుడు చిట్టిబాబు వాయించారంటె పాటను పల్లకీలో ఊరేగించినట్లే. ఈ పాట హనుమతోడి (తోడి) రాగంలో ఉన్నది. కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి పొందిన గంభీరమైన రాగం. మీరు వ్రాసిన అన్ని వీణ పాటలూ ఆణిముత్యాలే. అది ఒక స్వర్ణ యుగం.

నీహారిక చెప్పారు...

" కలనైనా నీ వలపే .... కలవరమందయినా నీ తలపే " పాట కూడా చాలా బాగుంటుంది.వ్రాసింది సముద్రాల గారనుకుంటా !మీరు ఏ విషయాన్నయినా భలే ఆసక్తికరంగా వ్రాస్తారు.



వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని : థాంక్యూ అండీ. ఈ పాట తోడి రాగంలో స్వరపరిచారని మీ ద్వారానే తెలుసుకున్నాను.

@ నీహారిక : మీరు చెప్పిన పాట ‘శాంతినివాసం ’(1960)లోది. ఈ వీణపాట కూడా కృష్ణకుమారే అభినయించారు. భార్యాభర్తలు పినిమాకంటే ఈ చిత్రమే ఏడాది ముందు విడుదలైంది. లెక్కప్రకారం ఈ పాటే తొలి వీణ పాట అవ్వాలి. మరి ‘ఏమని పాడెదనో..’ తొలి వీణ పాటగా ఎలా ప్రచారంలోకి వచ్చిందో... భార్యాభర్తలు సినిమా విడుదలలో జాప్యం జరిగిందా... పరిశీలించాలి.

ఈ చర్చకు కారణమైన- విలువైన మీ వ్యాఖ్యకూ, అభినందనకూ కృతజ్ఞతలు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ పోస్ట్ కాస్త ఆలస్యంగా చూసాను. నీహారిక గారు గుర్తుచేసిన "కలనైనా నీ వలపే ....." నిస్సందేహంగా మధురమయిన పాట. కాని అది వీణపాట కాదు, సితార్ పాట అని గుర్తు. ఏమంటారు?

నీహారిక చెప్పారు...

కృష్ణకుమారి వీణ పట్టుకుని వాయించేస్తుంటే వీణ పాటనుకున్నానండీ :)
నాకు సంగీత, సంస్కృత పరిజ్ఞానం లేదు :((

ameerjan చెప్పారు...


" ఏమని పాడెదనో " పాట భార్యాభర్తలు సినీమాలోనిది. వీణ పాటలలో మొదటిదనే అర్ధం వచ్చేలా చెప్పారు. అంతకుముందే వచ్చిన తెనాలి రామకృష్ణ, సారంగధర, వినాయకచవితి, దీపావళి యిత్యాది అనేక సినీమాలలో వీణను చూపిస్తూ వీణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గల పాటలు వచ్చేయి. కాకపోతే, సుశీలగారు పాడిన యీ పాటంత హిట్ కాకపోయివుండచ్చు. అంతమాత్రన అదే ప్రధమ వీణ పాట అనతగునా ?

2. ఈ పాట రాగం " హనుమతోడి" అన్నారు. కానీ, " సింధుభైరవిగా" చెలామణీ అవుతోంది. అనేక సందర్భాలలో సినీ సంగీత ప్రముఖులంతా సిందభైరవిగా చెపుతూ వస్తున్నారు. హనుమతోడి,సింధుభైరవి ఒకటేనా?
వీటికి తగు సందేహ నివృత్తి చేయగలందులకు కోరుతున్నాను.