కాల్పనిక రచనలు ఇష్టమా? స్వీయ చరిత్రలూ, జీవిత గాథలూ చదవటం ఇష్టమా అని అడిగితే చప్పున జవాబు చెప్పలేను.
అయితే నిజమైన వ్యక్తులూ, వారితో సంబంధమున్న వాస్తవిక సంఘటనలుండే బతుకు పుస్తకాలకో వింత ఆకర్షణ ఉంటుంది. కల్పనకు పరిమితులూ, సత్యంతో ముడిపడివుండటమూ వాటి ప్రధాన బలం. జీవిత చరిత్ర రాయటమంటే ఆ కాలాన్నీ, పరిసరాలనూ పున: సృష్టించి మళ్ళీ కళ్ళముందుకు తీసుకురావటమే కదా!
నా మిత్రుడూ, టీవీ 9 జర్నలిస్టూ మల్లంపల్లి సాంబశివరావు ‘సంత్ గాడ్గే బాబా’ జీవిత చరిత్ర రాసి, ఈ మధ్యే పుస్తకంగా ప్రచురించాడు.
గాడ్గే గురించి నాకు పుస్తకం రావటానికంటే ముందే తెలుసు. దానికి కారణం కూడా సాంబూనే. తన మాటల ద్వారానే కాకుండా అంతకుముందు ‘ఆంధ్రజ్యోతి’లో తనే రాసిన ఓ వ్యాసం ద్వారా కూడా గాడ్గే నాకు పరిచితుడు.
ఈ జీవిత చరిత్ర చదివాక గాడ్గే బాబా బాగా అర్థమయ్యాడు నాకు.
పుస్తకం చదివిన ఉత్సాహం గాడ్గే మాటా, పాటా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది.
ఆయన కీర్తనలూ, ప్రసంగం యూ ట్యూబ్ లో చూశాను; విన్నాను. ( ఆయన ప్రసంగం మరాఠీలో ఉన్నప్పటికీ దాని తెలుగు అనువాదం ఈ పుస్తకంలోనే ఓ అధ్యాయంలో ఉండటం వల్ల సారాంశం అర్థమైంది.) శ్రావ్యమైన కీర్తనలూ, భజనలతో ఆయన ప్రజలను ఎలా ప్రభావితం చేసిందీ గమనించగలిగాను.
గాడ్గేపై తీసిన చిన్న డాక్యుమెంటరీ కూడా యూ ట్యూబ్ లో దొరుకుతోంది, దాన్నీ చూశాను.
* * *
బాబాలంటే ఏమో గానీ... సాధువులూ, సంతుల్లో ఎక్కువమంది నిరాడంబరంగానే ఉంటారు. కీర్తనలూ అవీ పాడుతూ తమ భగవద్భక్తిని చాటుకుంటుంటారు. తాము నమ్మిన విషయాలపై ప్రజలకు ప్రబోధాలు చేస్తుంటారు.
ఇంతవరకూ మాత్రమే అయితే గాడ్గే పెద్దగా పట్టించుకోదగ్గ వ్యక్తి అయ్యేవాడు కాడు.
కానీ ఈయనలో చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి.
మిగతా సాధువుల్లా ఈయన దేవుడి మీద ఆధారపడమని చెప్పలేదు. అన్నీ మానవ ప్రయత్నం వల్లే మారతాయని చెప్పాడు. హేతువాద దృష్టిని ప్రదర్శించాడు.
ఈయన సంస్కర్త, వాగ్గేయకారుడు, పర్యావరణ వాది. మూఢత్వాలను నిరసించి, జీవితాన్ని సమాజానికి అర్పించిన వ్యక్తి.
నూరుశాతం ఆచరణ శీలి. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి స్వయంగా చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేసేవాడు. అది ఏదో మొక్కుబడిగా ఫొటోల కోసం పోజిచ్చే ఇప్పటి శ్రమదానం టైపు కానే కాదు. పరిశుభ్రతే దైవం అని నమ్మి జీవితాంతం దానికోసం పాటుపడ్డాడు.
కుష్ఠు రోగులంటే సమాజం ఎంత అసహ్యించుకునేదో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. దశాబ్దాల క్రితం సినిమా థియేటర్ల గేట్ల మీద ‘కుష్ఠు రోగులకు ప్రవేశము లేదు’ అని రాసివుండేది. అలా సమాజం దూరంగా పెట్టే కుష్ఠురోగులకు గాడ్గే సేవలు చేశాడు.
పాటగా... సూటిగా
‘గోపాలా గోపాలా దేవకి నందన గోపాలా’ అనే మకుటంతో భజన చేస్తూ, చేయిస్తూనే మధ్యమధ్యలో తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పటం, జనంతో చెప్పించటం ఈయన ప్రత్యేకత!
‘‘తుకారాం మహరాజ్ ఏం చెప్పాడు! భగవంతుడిని చూడటానికి ఎంతో ప్రయత్నించి కూడా చూడలేకపోయానని... ఎప్పుడు కలుస్తాను, ఎప్పుడు చూస్తాను అని ఎంతో ఆవేదన పడ్డాడు. ... అసలు ఉంటేగా చూడ్డానికి. ఇప్పటివరకూ ఎవరూ చూడలేకపోయారు... గుడిలో, నదిలో, రామేశ్వరంలో, బదరీనాథ్ లో... ఏ పేరుతోనైనా ఈశ్వరుడూ పరమేశ్వరుడూ అంతా మిథ్య...’’
(మన తెలుగు సినిమా ‘భక్త తుకారాం’ పాట గుర్తొస్తోందా? - ‘ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ’)
గాడ్గే బాబా ‘వాణి ముత్యాలు’ మరికొన్ని చూడండి-
‘‘తీర్థయాత్రల పేరుతో డబ్బు వృథా చేసుకోవటం తప్ప మరేమీ లేదు’’
‘‘దేవుడు గుడిలో లేడు, మసీదులో లేడు, చర్చిలో లేడు’’
‘‘దేవాలయంలో దేవుడు లేడు, మరెక్కడున్నాడు? ఈ భూమండలమంతా ఉన్నాడు. మనుషులకి సేవ చేసే నిమిత్తమున్నాడు.’’
‘‘దేవుడెక్కడున్నాడు... ఇక్కడే ఈ భూమ్మీదే ఉన్నాడు. బహుజనులకి సేవ చేయండి. పేదల విషయంలో కరుణతో ఉండండి!’’
అలా అని ఆయన నాస్తికుడేమీ కాదు.
‘భగవంతుడి పేరుతో భజన చేయండి... కీర్తన పాడండి... పువ్వులను సమర్పించండి’ అని చెప్తాడు.
గాడ్గే నిరక్షరాస్యుడైనా చదువొక్కటే సర్వరోగ నివారిణి అని గాఢంగా నమ్మాడు.
‘‘విద్య అనేది ఒక రక్ష, ధనం కూడా’’
‘‘మీ ఇంటి కప్పు ఊడిపోతున్నా పట్టించుకోకండి... కానీ పిల్లల్ని స్కూలుకి పంపించండి’’
కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. అంటరానివారికి తొలి ధర్మశాల కట్టించాడు.
‘‘కులం గురించి అడిగేవాడు నీచ నికృష్ట జంతువు, వాడు మానవేతరుడు, వాడి దాష్టీకం చూడు, కులం కావాలంట’’ అంటాడాయన.
‘నీ తండ్రి సారా తాగటం నీ కంట పడితే అతడితో నీ బంధాన్ని తెగతెంపులు చేసుకో. అతడు నీకు తండ్రి కాదు, శత్రువు’’ అని చెపుతూ మద్యం వ్యసనాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
29 ఏళ్ళ వయసులో నాటి సిద్ధార్థుడి లాగే... సమాజం కోసం .. ఇద్దరు పిల్లల్నీ, గర్భవతిగా ఉన్న భార్యనూ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాతికాలంలో కుటుంబ సభ్యులు తనను కలిసినప్పటికీ ఆ ఎడం అలాగే పాటించాడు. బంధుప్రీతికి ఏమాత్రం తావివ్వని ఆ వ్యక్తిత్వం ఎంత శ్లాఘనీయమైనప్పటికీ కుటుంబం పట్ల ఆయన నిర్మోహత్వం... వారి పట్ల కొన్ని సందర్భాల్లో కాఠిన్యంగా మారింది.. అది నిర్లక్ష్యం అనదగ్గ స్థాయిలో ఉందని నాకు అనిపించింది.
అసంఖ్యాకమైన పేదల పట్ల చూపించిన అపారమైన కరుణను .. నిరుపేద స్థితిలో ఉన్న సొంత కుటుంబానికి మాత్రం పంచలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
రచయిత పరిశోధన
సాంబశివరావు |
గాడ్గే గురించి మహారాష్ట్రలో తెలుసేమో గానీ, ఇతర ప్రాంతాలవారికి ఏమీ తెలియదు. ఎప్పుడో 1956లో కన్నుమూసి, చరిత్రలో విస్మరణకు గురైన వ్యక్తి జీవిత చరిత్రను పునర్నిర్మించటం అంత సులువు కాదు.
అందుకే ఈ పుస్తకం రాయటానికి ఆసక్తితో పరిశ్రమించాడు. పరిశోధనే చేశాడు.
మహారాష్ట్ర చాలాసార్లు వెళ్ళాడు. గాడ్గే జీవితంతో సంబంధమున్న ఊళ్ళను తిరిగాడు. ముంబైలో గాడ్గే కట్టించిన ధర్మశాలలను చూశాడు. గాడ్గే గురించి ఇప్పటికే ఉన్న మరాఠీ, హిందీ పుస్తకాలను ఆ భాషలు తెలిసిన మిత్రుల సాయంతో చదివాడు.
ఇంత చేసి కూడా ‘‘ ఇప్పటివరకూ అరకొరగా ఉన్న సమాచారానికి , మరికొంత జోడించటమే నేను చేసింది’’ అంటూ వినమ్రత ప్రదర్శించాడు.
* * *
వార్తలకు శీర్షికలు ఎంతో బాగా పెడతాడని సాంబు/సాంబకు ఇప్పటికే చాలా పేరుంది, జర్నలిస్టు సర్కిల్స్ లో!
చమక్కుల ‘పన్’లను అలవోకగా పన్నటంలో పెన్ నిధి!
* బహుజన పక్షపాతి బీఎస్ రాములుకు ‘బీఎస్పీ రాములు’ అని పేరు పెట్టాడు.
* ఆయిల్ పుల్లింగ్ లో పుక్కిలించటం ఉంటుంది కాబట్టి... దాన్ని ‘ఆయిల్ పుక్కిలింగ్’ అంటాడు.
* కేశినేని వాళ్ళు అంతరిక్షానికి (స్పేస్) కూడా రవాణా సర్వీసులు నడపగలరని ‘స్పేసినేని ట్రావెల్స్’ అనే పదబంధాన్ని సృష్టించాడు.
* కొందరి క్రియేటివిటీపై అతడి వ్యంగ్య వ్యాఖ్యానం.. క్రిమేషన్ స్ఫురించే ‘క్రిమేటివిటీ’.
ఇలాంటి విరుపుల మెరుపులను మోహన్ కార్టూన్లతో మిళాయించి గతంలో ఆంధ్రజ్యోతిలో వారం వారం ఓ శీర్షిక కూడా నడిపాడు.
ఇంతటి సహజ చమత్కారి కూడా ఈ పుస్తకంలోని గంభీరమైన విషయాలకు అనుగుణమైన రచనా శైలిని పాటించాడు. సమాంతర చరిత్ర గురించి రాసిన తొలి అధ్యాయం- ‘ప్రత్యామ్నాయ పరంపర’ ఈ పుస్తకానికి చక్కటి భూమికను ఏర్పరిచింది.
చిన్న చిన్న అధ్యాయాలుగా విభజించటం, రచన ఆసాంతం ఆసక్తికరంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవటం గమనించవచ్చు.
ఈ పుస్తకంలోని కొన్ని అధ్యాయాలకు పెట్టిన శీర్షికలు చూడండి-
పాల బుగ్గల జీతగాడు- జనం మెచ్చిన పాటగాడు
మరో సిద్ధార్థుడు ఇల్లు వదిలాడు
మూఢ నమ్మకాలపై చీపురు తిరగేసిన బాబా
కుటుంబానికి మిగిలింది కష్టం... కాయకష్టం
రుచిని జయించిన రుషి
వైరాగ్యమే మహాభాగ్యం
బాగున్నాయి కదూ?
పుస్తకంలో అవసరమైన చోట స్పష్టత కోసం ఫుట్ నోట్సూ, సందర్భోచితమైన ఫొటోలూ, చిత్రాలూ ఇవ్వటం బాగుంది.
వందేళ్ళ క్రితమే పారిశుద్ధ్యం ఆవశ్యకతను గుర్తించిన గాడ్గేను ‘స్వచ్ఛభారత్’ సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా గుర్తింపులకు అతీతమైన అసమాన వ్యక్తిత్వం ఆయనది. విలక్షణమైన ఆయన జీవితగాథను తెలుగులోనే తెలుసుకోవటం మంచి అనుభవం!
‘విశాఖ బుక్స్’ ప్రచురించిన ఈ పుస్తకం... ప్రముఖ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.
040-27090197, 9948299940 నంబర్లకు ఫోన్ చేసి పుస్తకం వివరాలు తెలుసుకోవచ్చు. 150 రూపాయిల వెల ఉన్న ఈ పుస్తకాన్ని 10 కాపీలు , అంతకంటే మించి తీసుకునేవారికి తగ్గింపు ధరకు ఇస్తారు.
కొత్త చేర్పు (22.1.2017): ఈ పుస్తకం గురించి రాసిన చిన్న రివ్యూ ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది. అది-