సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మే 2016, మంగళవారం

ఓ చిన్న సన్నివేశం... ఇళయరాజా పరిమళం!



నసును వెంటాడే మధురమైన పాటలతోనే కాదు; ఆ పాటల చరణాల మధ్య వైవిధ్యమైన  ఇంటర్లూడ్ లతోనూ  ఇళయరాజా చేసే ఇంద్రజాలం అందరికీ తెలిసిందే.

సన్నివేశాలకు ఆయన అందించే నేపథ్య సంగీతపు ప్రత్యేకతల గురించి కూడా ఎంతోమందికి  తెలుసు.

దర్శకుడు వంశీ రెండో సినిమా పూర్ణోదయా వారి ‘సితార’(1984). 

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి ‘రషెస్’చూశారు  చిత్ర నిర్మాణ బృందం, నిర్మాత.  ‘ఇంత డ్రాగ్ గా ఉందేమిటి సినిమా?’ అని మహా నీరసపడిపోయారట.

దర్శకుడికీ తాను తీసిన తీరుపై అపనమ్మకం  వచ్చేసింది.

ఇంతలో అక్కడికి  ఇళయరాజా ప్రవేశం.. BGM ఇవ్వటం కోసం.

కళవెళపడిన మొహాలతోనే సినిమాను ఆయనకు చూపించారు.

సినిమాను మొత్తం చూసిన  ఇళయరాజా మొహంలో ఉత్సాహం, సంతోషం...!

‘చాలా బాగుంది సినిమా. చూడండి, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తానో’... అనేసరికి  దర్శకుడికీ, మిగిలినవారికీ ప్రాణం లేచొచ్చినట్టయింది. 

ఇచ్చిన మాటను అమోఘంగా నిలబెట్టుకున్నారు ఇళయరాజా! 


శక్తిమంతమైన- నేపథ్య సంగీతాన్ని ఇచ్చి సినిమాను గొప్పగా నిలబెట్టారు. ఆ సినిమా విజయంలో ఈ  నేపథ్య సంగీతానిదీ ఓ ప్రధాన  పాత్ర అయింది. 

బీజిఎం  ప్రస్తావన వచ్చినపుడు నాకు మరో  సంగతి గుర్తొస్తుంది.

‘శ్రీ రామదాసు’ సినిమా  విరామానికి  ముందు వచ్చే సన్నివేశం... ( శ్రీరాముడు  భూమికి దిగి వచ్చినపుడు ప్రకృతి పులకించిపోవటం.)  నేపథ్య సంగీత రూపకల్పన కోసం తానెంత తపించినదీ కీరవాణి అప్పట్లో  ‘ఇండియా టుడే’ ఇంటర్ వ్యూలో వివరించారు.

సాంకేతిక విభాగాల్లో,  దర్శకత్వపరంగా  నీరసంగా ఉన్న ఆ సినిమాను తన BGM తో నిలబెట్టానని ఆయన  చెప్పుకున్నారు!.   

 * * *  

ళయరాజా నేపథ్య సంగీతం జోడించకముందు- ఆ తర్వాత ఆ సన్నివేశం ఎలా మార్పు చెందిందో చూడాలని నాకెప్పటినుంచో కోరిక.

ఆ మధ్య ‘ధోని’(2012) ఆడియో ఉత్సవం జరిగినప్పుడు ఆ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా  ఓ  సన్నివేశానికి   తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలా జీవంపోశాడో నటుడు ప్రకాశ్ రాజ్  ప్రదర్శించి చూపాడట. వార్తల్లో చదివాను.

ఆ వీడియో క్లిప్ కోసం నెట్ లో వెతికాను కానీ.. దొరకలేదింకా!

ఇళయరాజా సంగీతం అందించిన ఇండో-ఆస్ట్రేలియన్ సినిమా ‘లవ్ అండ్ లవ్ ఓన్లీ’ గురించి కొద్ది  రోజుల క్రితం ఫేస్ బుక్ లో చూశాను.



దీనిలో Am I in Love? అనే పాటను Rachael Leahcar అనే గాయని పాడారు.

ఆ పాట ఇలా మొదలవుతుంది-
Life alone just
Never felt lonely
Rife with beauty  never felt lovely
All along..


మొత్తం పాట  సాహిత్యాన్ని  ఇక్కడ చూడండి...


ప్రేమికురాలి భావోద్వేగాన్ని తెలిపే పాట ఇది.

‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది’  తరహాది అన్నమాట!
 
ఇళయరాజా ట్యూనూ, ఆర్కెస్ట్రయిజేషన్ కొత్తగా, హాయిగా ఈ పాటను వినేలా చేశాయి. 

మీరూ వినండి!



 * * * 
సినిమా.... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM)  విషయంలో  నా ఆసక్తిని తీర్చేలా నాకు సర్ ‘ప్రయిజ్’ ఇవ్వబోతోందని  మొదట తెలియలేదు.

తెలిశాక , చూశాక... చాలా సంతోషం వేసింది.

BGM కు ముందూ, తర్వాతా ఈ సినిమాలోని ఓ చిన్న సన్నివేశం ఎలా మెరుగుపడిందీ వీడియోను యూట్యూబ్ లో  పోస్ట్ చేశారు.

చిత్రీకరించివున్న సన్నివేశాన్ని సంభాషణలతో సహా చూసి,  నోట్స్ రాసుకోవటం...

ఆ ప్రకారం  నేపథ్యసంగీతపు బిట్లు విడిగా  రికార్డు చేయటం... 

వాటిని ఆ సన్నివేశంలో  మిక్సింగ్ చేశాక..

నేపథ్య సంగీతం అందంగా అమరి సన్నివేశానికి  ఎలా  ప్రాణం పోసిందో, 

సాగిపోతున్న దృశ్యానికీ,  సందర్భానికీ,  నటీనటుల సంభాషణలకూ ఎలా పరిమళం అద్దిందో చూడండి- .
   


 * * * 
న నిత్యజీవితంలో జరిగే సంఘటనలకు నేపథ్య సంగీతమేదీ ఉండదు. 

కానీ సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో  నేపథ్య సంగీతం లేని సన్నివేశాలను ఊహించండి...

అవి కళావిహీనంగా, అసంపూర్ణంగా, వెలితిగా అనిపిస్తాయి.

పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులూ సహానుభూతి చెందటానికీ... ఆ గాఢతను గ్రహించటానికీ ...

నేపథ్య సంగీత సాయం తప్పనిసరి అన్నమాట!

ఈ కళలో ఇళయరాజాది ప్రత్యేక ముద్ర! అది నేను ప్రత్యేకంగా ఇష్టపడి ఆస్వాదించే కోణం!

7 కామెంట్‌లు:

Surya Mahavrata చెప్పారు...

అదెన్నేళ్ళకిందటో తొలిముద్దు సినిమా బ్యాగ్రౌండు కంపోజ్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ విలేకరి "అరగంట సీనుకి సంగీతం కట్టీడం, బృందం అర్ధంచేసీసుకోవడం, టేకు కూడా అయిపోవడం - అదీ ఫది నిమిషాల్లోనా? అని ఆశ్చర్యపోయినప్పుడు ఓ కళాకారుడు అన్నాట్ట - "అదేనండీ నేనూ ఆశ్చర్యపోయేదీను - మామూలుగా అయితే అయిదు నిమిషాల్లో పూర్తిచేసేస్తారు సారు" అని.

సినిమాని చూస్తూనే మనసులో ఏదో అనుకుని ఓసారి హమ్మింగైనా చెయ్యకుండా, ఇసుమంత వృధా కాలక్షేపం లేకుండా కాయితాలమీద ఇంగ్లీషు స్వరాలు టపటపా రాసీడం ఏమిటో, అది చదివి అర్ధంచేసుకుని ప్రభాకర్ గారు (వారేనా?) వాయులీన బృందంవారితో సంగీత దర్శకుడు మనసులో అనుకున్నది అనుకున్నట్టుగా పలికించీడం ఏమిటో (మధ్యలో బృందానికి స్వల్పంగా అక్షింతలు కూడా పడినట్లు వీడియోలో తెలుస్తోంది - అదో ముచ్చట) ఏ భేషజం లేని వస్త్రధారణలో అతి సామాన్యంగా కనిపించే ఇతని మేధస్సులో వెయ్యి సినిమాలుదాటినా వెల్లువెత్తుతున్న స్వరపాతాలేమిటో...

మహప్రభో ఇక పొగడటం నావల్లకాదు. అద్భుతమైన వీడియోని షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

ఆ సన్నివేశానికి ఇలయరాజాగారు నేపధ్య సంగీతంతో పరిమళాన్ని అద్దేరు .మీరు మీ వ్యాఖ్యానం తో దానిని మరింత మధురం గా అందించేరు .కృతజ్ఞులం .

వేణు చెప్పారు...

@ Surya: ఇళయరాజా వేగం గురించి మీరు చెప్పిన సంఘటన ఎంతో బాగుంది. అద్భుతమైన నాణ్యతను పెనువేగంతో సాధించటం ఇళయరాజా ప్రత్యేకత.

‘ప్రేమించు-పెళ్ళాడు’ పాటలన్నీ ఎంత మాధుర్యంతో ఉంటాయో, ఇప్పటికీ వినటానికి ఎంత శ్రావ్యంగా ఉంటాయో తెలిసిందే కదా? ఆ పాటలన్నిటికీ ఇళయరాజా 20 నిమిషాల్లో బాణీలు కట్టారని దర్శకుడు వంశీ చాలాకాలం క్రితం ఓ ఇంటర్ వ్యూ సందర్భంగా నాతో స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ పోస్టుపై మీ స్పందనకు థాంక్యూ.


@ Prj Pantulu: బీజిఎం లాంటి సూక్ష్మమైన, పెద్దగా ఎవరూ పట్టించుకోని విషయాల గురించి ఏదైనా రాయాలనే ఉత్సాహం.. మీలాంటివారి స్పందనలవల్ల వస్తుంటుంది. థాంక్యూ సర్.

GKK చెప్పారు...

Good post వేణు గారు. అవసరమైన చోట నేపధ్య సంగీతం సన్నివేశాలను ఎలా elevate చేస్తుందో అవసరంలేని చోట అంత irritating గా ఉంటుంది. నేపధ్య సంగీతకళలో ఇళయరాజా నిష్ణాతుడు. మణి శర్మ, కీరవాణి కూడా బాగా ఇస్తున్నారు. టీవి సీరియళ్ళలో వచ్చే బీభత్స సంగీతం బాగుండదు. అలాగే రాం గోపాల్ వర్మ సినిమాలలో back ground score and noisy voiceover కర్ణ కఠోరంగా ఉంటుంది. ఎక్కడ సంగీతం ఇవ్వాలో ఎక్కడ ఆపాలో ఇళయరాజాకు వెన్నతో పెట్టిన విద్య.గీతాంజలి సినిమాలో back ground score మరచిపోలేము.

అజ్ఞాత చెప్పారు...

Thanks for sharing. Enjoyed the video.

జిజ్ఞాసి చెప్పారు...

పా సినిమా డైరెక్టర్ బాల్కి ఇళయరాజా సినిమా సన్నివేశాలకి ఎలా ప్రాణం పోస్తాడో సోదాహరణం గా వివరిస్తాడు ఇక్కడ ..

https://youtu.be/1rGoqndeSMM

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: మీరన్నది నిజం. సంభాషణలను వినపడనీకుండా చేసే నేపథ్య సంగీతం కొన్ని సినిమాల్లో ఉంటూ చిరాకుపెడుతుంటుంది. గీతాంజలి నేపథ్య సంగీతం చాలా ప్రత్యేకం. Thank you.

@ Iddaru: Thank you!


@ జిజ్ఞాసి: మీరు ఇచ్చిన వీడియో లింకు చాలా ఉపయోగం. Thank you verymuch.